Showing posts with label ఆదివాసీలు. Show all posts
Showing posts with label ఆదివాసీలు. Show all posts

Saturday, August 9, 2014

ప్ర‌మాదంలో ఆదివాసుల మ‌నుగ‌డ‌ By డాక్టర్‌ మిడియం బాబూరావు


Posted on: Fri 08 Aug 23:46:17.976368 2014

                 నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం     
                1/70 చట్టం, జీవో నెంబరు 3 ఉన్నా, గిరిజనులు తమ సాంప్రదాయిక భూములు కోల్పోతున్నారు. స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదు. అందుచేత ఐదో షెడ్యూలును ఆరో షెడ్యూలుగా చేర్చాలి. స్వయం పాలిత గిరిజన జిల్లా కౌన్సిల్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగానైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు తమ గిరిజన విధానం ప్రకటించాలని డిమాండ్‌ చేద్దాం.
           ఆగస్టు 9ని అంతర్జాతీయ గిరిజన దినోత్సవంగా ప్రకటించి రెండు దశాబ్దాలు పూర్తయింది. గత 20 ఏళ్లలో ఐక్య రాజ్యసమితి తీర్మానం మేరకు ఆయా దేశాల్లోని గిరిజన తెగల ఉనికి, హుందాతనం, సంక్షేమం గురించి సభ్య దేశాలు పట్టించుకోవాలని, వారి కోసం ప్రత్యేక చట్టాలు చేయాలని, వారి హక్కుల అమలు విషయంలో ఏ విధమైన వివక్షా పాటించరాదని అంగీకారానికి వచ్చారు. మన దేశంతో సహా పలు దేశాల్లో మొదట స్వచ్ఛంద సంస్థలు గిరిజన దినోత్సవాన్ని పాటిస్తూ, ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేవి. చివరికి ఐక్యరాజ్యసమితి జోక్యంతో గిరిజన సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంవత్సరం ఐరాస జనరల్‌ అసెంబ్లీ సెప్టెంబరు 22, 23 తేదీల్లో ఆదివాసీ సమస్యలపై చర్చించనుంది. ఈ సంవత్సర కాలంలో గిరిజన హక్కుల అమలు, అవకతవకలు అనే అంశం చర్చించాలని కోరింది. ఫైనాన్స్‌ పెట్టుబడి విశ్వవ్యాప్తంగా తన లాభాల కోసం మైనింగ్‌ రంగం ద్వారా గిరిజన తెగల్ని అణచివేస్తున్న, అంతం చేస్తున్న స్థితిలో అవే శక్తులు ఉత్సవాలు జరపడం ఒక పరిహాసం. ప్రభుత్వాలకు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ (సిఎస్‌ఆర్‌) కూడా చెల్లించడానికి తిరస్కరించే కంపెనీలు అంతర్జాతీయ ఉత్సవాల ఖర్చులు భరించడం ఎవరి ఉద్ధరణకు? కాళ్లు నరికి పసిడి ఊతకర్రలు ఇచ్చే న్యాయం ఎంత కాలం?
               భారతదేశంలో గిరిజన దినోత్సవాలు భోపాల్‌ ప్రకటనతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కూడా ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మన దేశంలో గిరిజన హక్కుల అమలు గురించి పరిశీలిద్దాం. గిరిజన తెగల చరిత్ర అంతా పోరాటాలు, తిరుగుబాట్ల చరిత్రే. ఆదివాసీ తెగల నివాసం, అడవులు, కొండలు, లోయలు, కీకారణ్యాలే. బ్రిటీషు ప్రభుత్వం వారిని నేరస్తులుగా పరిగణించింది. నేరస్త గిరిజన తెగల చట్టం (క్రిమినల్‌ ట్రైబ్స్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌-1801) ప్రకారం వారు అడవిలో నివసించడం, అడవిని వాడుకోవడం నేరం. ఏజెన్సీ రంప తిరుగుబాటు 1803, కోవల తిరుగుబాటు 1818, సంతాల్‌ తిరుగుబాటు 1855, ముండాలి తిరుగుబాటు 1889, సీతారామరాజు-కోయల తిరుగుబాటు 1922 వీటి ఫలితంగా గిరిజన ప్రాంతాల ప్రత్యేక పరిపాలనా విభాగాలు, చట్టాలు ఏర్పడ్డాయి. 1974 ఏజెన్సీ జిల్లాల చట్టం అటువంటిదే. దీని ఆధారంగానే ప్రస్తుత షెడ్యూలు ప్రాంతాలు ఏర్పడ్డాయి. సామాజిక వివక్ష, అంటరానితనం, అణచివేతకు విరుగుడుగా వచ్చింది దళితుల రిజర్వేషన్‌. కానీ ఆదివాసీ రిజర్వేషన్‌ మరింత లోతైనది, విస్తృతమైనది. వారు నివసించే భూభాగంపై వారికి హక్కులిచ్చింది మన రాజ్యాంగం (ఐదో షెడ్యూల్‌). షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో సహజ వనరుల వినియోగం, నిర్వహణ, పరిరక్షణపై ఆదివాసీల గ్రామసభలకే హక్కు ఉంది (పీసా చట్టం) కానీ అమలు ఎలా ఉంది? పాలక పార్టీల ప్రభుత్వాలు (కాంగ్రెస్‌, బిజెపి, టిడిపి వగైరా) ఆదివాసీల హక్కులను కాలరాసి షెడ్యూలు ప్రాంత భూములను లాక్కొని కార్పొరేట్లకు కట్టబెడుతున్నాయి. భువనేశ్వర్‌ రాజధాని నిర్మాణానికి వాడిన భూమి ఎవరిది? నయా రారుపూర్‌, రాంచీ అన్ని చోట్లా ఆదివాసుల భూములను ఎలాంటి పరిహారం ఇవ్వకుండా లాక్కున్నారు. మన రాష్ట్రంలో రెండు ఉదాహరణలు చూద్దాం.
                 మొదటిది సమతా తీర్పు. ఈ సుప్రీంకోర్టు తీర్పు నాటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక చెంపదెబ్బ. బాక్సైట్‌ తవ్వకాలు జరపడానికి టాటా కంపెనీతో నాటి ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ కంపెనీ డముకు నుంచి వాలాసి, నిమ్మలపాలెం వరకూ సిసి రోడ్డు వేసుకుంది. విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే సమతా అనే ఒక స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఐదో షెడ్యూలు ప్రాంతంలో ప్రయివేటు కంపెనీలు మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులివ్వవచ్చునా? షెడ్యూల్డ్‌ ప్రాంతంలో గ్రామసభకు తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి అట్టి హక్కు లేదని, ప్రభుత్వం కూడా నాన్‌ట్రైబల్‌ భాగస్వామి అవుతుందని చెప్పిన కేసే సమతా తీర్పు. ఆ తరువాత కాంగ్రెస్‌ ప్రభుత్వం జిందాల్‌ కంపెనీతో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా అవే ఒప్పందాలు కొనసాగించింది. ఆదివాసీల హక్కులను కాలరాసింది. ప్రస్తుత ప్రభుత్వం బాక్సైట్‌ మైనింగ్‌ ఐటిడిఎల ద్వారా చేస్తామని సూచనలు చేస్తోంది. ఎపిఎండిసి అయినా, ఐటిడిఎ అయినా ఒకటే. మధ్యవర్తి పాత్ర వహించి ప్రయివేటు కంపెనీలకు లాభాలు కట్టబెట్టడమే. ఆదివాసీల షెడ్యూలు హక్కులు ఉల్లంఘించరాదు. రాజ్యాంగం గిరిజనులకు ఇచ్చిన హక్కులను అమలు చేయాలని పాలక పార్టీలను కోరదాం.
                    రెండవది పోలవరం. ప్రాజెక్టు ముంపు ప్రాంతం మొత్తంగా రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు ప్రాంతం. ఇక్కడ ఆదివాసీ గ్రామసభలదే అధికారం. గ్రామసభలు, మండల పరిషత్‌లు (పాతవీ, కొత్తవీ) ప్రాజెక్టు కట్టవద్దని తీర్మానాలు చేశాయి. జాతీయ అభివృద్ధి మండలి నిబంధన చెప్పేదేమిటంటే ఏదైనా ప్రాజెక్టులో నిర్వాసితులయ్యే వారిలో దళితులు, గిరిజనులు 50 శాతం ఉంటే అట్టి ప్రాజెక్టు చేపట్టరాదని స్పష్టంగా ఉంది. ఈ ప్రాజెక్టు కింద నిర్వాసితులు 67 శాతం గిరిజనులు. అంటే ఆదివాసీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాగితాలకే పరిమితం, అమలుకు నోచుకోవు. పాలక పార్టీలు, కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాల ముందు ఆదివాసీల హక్కులు నెరవేర్చాలని అడగరాదా? రాజ్యాంగం అందరికీ సమానం కాదా? విభజన విషగుళిక మింగించడంలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు. జాతీయ ప్రాజెక్టులో ముంపు మండలాలన్నీ ఒకే రాష్ట్రంలో ఉండాలా? జలయజ్ఞంలో ఆదివాసీలను బలి ఇచ్చారు. వారి కష్టాలు పెంచారు.
నేతి బీరలో నెయ్యి ప్రభుత్వ గిరిజన విధానం
                ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం గిరిజన విధానం పేరుతో హడావిడి చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో ఎక్కడా ఆదివాసీల షెడ్యూల్డ్‌ ప్రాంతం గురించిన ప్రస్తావన లేదు. షెడ్యూలు కలపవలసిన గిరిజన గ్రామాల ప్రస్తావన లేదు. తెలంగాణ ప్రాంతంలో తండాలను పంచాయతీలు చేయాలని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్ణయంగా కనిపిస్తోంది. స్థూలంగా గిరిజన విధానంలో అమలుకు సాధ్యం కాని కొన్ని వాగ్దానాలు మాత్రం ఉన్నాయి. కొత్త ప్రభుత్వాలు వీటిని అమలు చేస్తాయా? లేదా? అనేది తెలియడం లేదు. 2015 నాటికి ప్రతి గిరిజన కుటుంబం ఆదాయం రెట్టింపు చేస్తాం, ప్రతి గిరిజన ఆవాసంలో పొదుపు గ్రూపులు ఏర్పాటుచేసి వడ్డీలేని రుణం ఇస్తాం, అటవీ హక్కుల చట్టాన్నీ, పీసా చట్టాన్నీ అమలు చేస్తామన్నారు. ఐటిడిఎలకు ఐఎఎస్‌ పిఒలనే నియమిస్తామన్నారు. ఇవేవీ అమలుకు నోచుకోలేదు. గిరిజనులు సేకరించే చింతపండుకు ధర పెంచడానికి సిద్ధపడని ప్రభుత్వాలు వడ్డీలేని రుణాలిచ్చి ఆదాయాలు రెట్టింపు చేస్తామంటే నమ్మేదెలా?
                అరకు డిక్లరేషన్‌లో గిరిజన గ్రామాలన్నింటికీ తాగునీరిస్తామన్నారు. దాన్ని మర్చిపోయారు. సున్నంవారిగూడెం డిక్లరేషన్‌లో ముంపు ప్రాంతాల గిరిజనులందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామన్నారు. నీరు ఇవ్వలేదు గానీ పోలవరం నీట ముంచడానికి మాత్రం పోటీలు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం ఇటీవల అల్లూరి సీతారామరాజు గిరిజన జిల్లా ఏర్పాటుచేస్తామని, గోదావరి జిల్లాల ఏజెన్సీలో అభిప్రాయ సేకరణ చేపట్టింది. గిరిజన జిల్లా పేరు చెప్పి గిరిజనులు లేని మండలాలను అట్టి జిల్లాల్లో చేర్చరాదు. గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాలను మినహాయించాలి. అలాగే తూర్పుగోదావరిలో సబ్‌ ప్లాన్‌ గ్రామాలను అట్టి జిల్లాలో చేర్చాలి. పేరుకు ఐదో షెడ్యూలు ఉన్నా, పీసా చట్టం ఉన్నా అవి సక్రమంగా అమలు కావడం లేదు. 1/70 చట్టం, జీవో నెంబరు 3 ఉన్నా, గిరిజనులు తమ సాంప్రదాయిక భూములు కోల్పోతున్నారు. స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదు. అందుచేత ఐదో షెడ్యూలును ఆరో షెడ్యూలుగా చేర్చాలి. స్వయం పాలిత గిరిజన జిల్లా కౌన్సిల్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగానైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు తమ గిరిజన విధానం ప్రకటించాలని డిమాండ్‌ చేద్దాం.
ఆదివాసుల భాషా సంస్కృతులను కాపాడాలి
              మన రాష్ట్రంలో గిరిజన తెగలకు ప్రత్యేక భాషలు, సమిష్టి సంస్కృతి, ప్రజాస్వామిక సంప్రదాయాలు ఉన్నాయి. వారికి మతం లేదు. హిందూ, ముస్లిం, క్రైస్తవంతో సంబంధం లేదు. ప్రపంచంలో పది వేలమంది మాట్లాడే ప్రతి భాషకూ లిపిని రూపొందించాలని యునెస్కో ఆదేశించింది. కానీ, నాలుగు లక్షల మంది మాట్లాడే కోయ భాషకూ, రెండున్నర లక్షల మంది మాట్లాడే గోండి భాషకూ, మూడు లక్షల మంది మాట్లాడే సవర భాషకూ, రెండు లక్షల మంది మాట్లాడే కువి భాషకూ లిపి రూపొందలేదు. ప్రభుత్వం ఎనిమిది గిరిజన భాషల్లో ఒకటి, రెండు తరగతుల్లో బోధనకు పుస్తకాలు తయారుచేసింది. గిరిజన భాషా బోధకులను నియమించింది. వారికి తగిన శిక్షణ లేదు. ప్రైమర్లు తెలుగులోనే ఉన్నాయి. బోధకులకు జీతాలు లేవు. ఈ సంవత్సరం వారిని తొలగించారు. కొత్త ప్రభుత్వాలు తిరిగి వారిని నియమిస్తాయో, లేదో తెలియదు. ఆదివాసుల్లో క్రైస్తవ మిషనరీలు పనిచేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా వివిధ రూపాల్లో ప్రవేశించింది. తెగల మధ్య మత భావాలను ప్రేరేపించి, అనైక్యతకు దోహదపడుతోంది. కొన్ని గిరిజన తెగలు ఆవు మాంసం ఆహారంగా తీసుకోవు. ఇది గత కాలపు సంప్రదాయం. ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు దీనిని తెగల మధ్య కుమ్ములాటలకు ఉపయోగిస్తున్నాయి. సనాతన హిందూ ధర్మం పాటించేవారిగా వీరిని చిత్రించడం, గోమాంస భక్షణ మహాపాపంగా, నేరంగా ప్రచారం విశాఖ మన్యంలో ఉంది. తెగల సాంప్రదాయిక ఐక్యతను కాపాడుకోవాలి.
అభివృద్ధి అంటే?
              ఒక ప్రాంతం లేదా ఒక తెగ అభివృద్ధి ఆ ప్రాంతంలోని సహజ వనరులు, మానవ వనరులపై ఆధారపడి ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో ప్రకృతి వనరులు, భూమి, అడవి, నీరు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే పాలకవర్గాలు వీరిని చట్టవిరుద్ధంగా దోచుకోవడం వల్ల మన్యం అభివృద్ధి కుంటుబడుతోంది. ఒక సంవత్సర కాలంలో ఎన్ని టన్నుల బియ్యం, గోధుమలు, అపరాలు పండిస్తాం. ఎంత విద్యుత్‌ తయారు చేశాం, ఎన్ని రూట్లు వేశాం, ఎన్ని ఇళ్లు కట్టాం, సైకిళ్లు, కార్లు, రవాణా వాహనాలు ఎన్ని తయారు చేశాం అంటే వెరసి జాతీయ సగటు ఉత్పత్తి జిడిపిగా లెక్కిస్తాం. వస్తు సంపద పెంచడాన్ని అభివృద్ధి అంటున్నాం. ఇది పాత సాంప్రదాయిక పద్ధతి. ప్రస్తుతం అభివృద్ధికి అర్థం, నిర్వచనాలు మారాయి. ఎందరు చదువుకున్నారు? అక్షరాస్యత, సాక్షరత పెరగడం, ఆరోగ్య ప్రమాణాలు, పోషకాహారం, ఇనుము, నీరు, అందుబాటు లేక శిశుమరణాలు, మాతృ మరణాలు ఎన్ని? శాంతిభద్రతలు, సాంస్కృతిక వాతావరణం, కాలుష్య లేమిని బట్టి కూడా ఆ ప్రాంత అభివృద్ధిని లెక్కిస్తారు. అన్ని అభివృద్ధి ప్రమాణాల్లో ఆదివాసీల విషయంలో వెనుకబాటు ఉంది. ఆదివాసుల్లో అన్ని అభివృద్ధి సూచికలను మెరుగుపరచాలంటే దేశ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంది. ఈ రోజు ఆదివాసీలు తినే బియ్యం వారు పండించినవి కావు. జొన్నలు, రాగులు, చోళ్లు పంట తగ్గిపోయింది. వీరు వాడే వస్తువులు బయటి నుంచి వస్తున్నాయి. జీవనం క్రమంగా గిరిజనేతర ప్రాంతాలపై ఆధారపడింది. ఆదివాసులలో రోజుకూలిపై ఆధారపడిన కార్మికులు తయారయ్యారు. వారి శ్రమను చౌకగా కొనే ప్రభుత్వ శాఖలు, యజమానులు తయారయ్యారు. అంటే పెట్టుబడిదారీ సంబంధాలు, ఉత్పత్తి పద్ధతులు ప్రవేశించాయి. ఫైనాన్స్‌ పెట్టుబడి గిరిజనుల వనరులను దోచుకోవడానికి వచ్చింది. ఈ స్థితిలో గిరిజనోద్యమం కార్మికవర్గ ఉద్యమంతో చెయ్యి కలపాలి. ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సమసమాజం కోసం, సామ్యవాదం కోసం ముందుకు సాగాలి. ఇదే అంతర్జాతీయ గిరిజన దినోత్సవ శుభసందేశం.
      (వ్యాసకర్త మాజీ ఎంపి, ఎపి గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి)
- డాక్టర్‌ మిడియం బాబూరావు

Prajashakti Telugu News Paper Dated: 09/08/2014

Monday, July 21, 2014

ప‌నికోసం ఆదివాసీ కార్మి‌కుల అగ‌చాట్లు‌ By అర్చనా ప్రసాద్‌




               ఆదివాసీలు రిజర్వ్‌ లేబర్‌లో పెద్ద సంఖ్యలో మిగిలిపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుత రూపంలో పెట్టుబడి దారీవాదం కొనసాగించాలంటే ఇది-ఈ రిజర్వ్‌ లేబర్‌ -అనేది చాలా కీలకం. ఆ రకంగా, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగితకు, పని కోరుతున్నా లభించని ఆదివాసీ కార్మికుల సంఖ్య పెరగడానికి, సమకాలీన పెట్టుబడిదారీ విధానం హయాంలో ఆదివాసీలకు ఏమీ లభ్యం కాని ధోరణికి మధ్య సంక్లిష్టమైన, వైవిధ్యమైన సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, ఆదివాసీ కార్మికుల మౌలిక హక్కుల కోసం ప్రజాస్వామ్య ఉద్యమాలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆదివాసీల్లో తమ రాజకీయపరమైన నిర్మాణాలను మరింత బలోపేతం చేయడం ద్వారా కూడా వారి హక్కులకై పోరాడాల్సి ఉంది
                  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను రూపొందిస్తున్న సమయంలో కఠినమైన రోజులు ముందున్నాయంటూ ఆర్థిక మంత్రి ప్రజలను సమాయత్తం చేస్తున్న తరుణంలో, జనాభా గణాంకాలు ఆదివాసీ కార్మికుల పనితీరుకు సంబంధించిన వివరాలు వెల్లడించాయి. పని కోసం వారు పడుతున్న అగచాట్లను వివరించాయి. ఉపాధి వెతుక్కుంటూ ఆదివాసీ కార్మికులు లేబర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించారని ఈ డేటా స్పష్టంగా పేర్కొంది. అయితే, వారికి ఉపాధి మాత్రం దొరకడం లేదని, దాంతో వారు బతకడం కోసం తక్కువ కూలీకి కూడా సిద్ధపడిపోతున్నారని పేర్కొంది. ఈ ధోరణి, సంస్కరణలు ప్రారంభమైన నాటి నుంచీ ఉన్నప్పటికీ గత దశాబ్ద కాలంలో అయితే మరీ ఎక్కువైంది. ఈ దశాబ్దంలోనే రెండు జనాభా లెక్కలు వెలువడ్డాయి. అదీ 2001, 2011 సంవత్సరాల్లో. ఈ రెండు జనాభా లెక్కల మధ్య గల దశాబ్దంలో వనరులు సుసంపన్నంగా గల ప్రాంతాల్లోకి కార్పొరేట్‌ శక్తులు ముమ్మరంగా చొరబడడం పెరిగింది. అలాగే బడా ప్రాజెక్టుల కోసం ఆదివాసీ భూములను స్వాధీనం చేసుకోవడం కూడా ఈ దశాబ్దంలోనే కనిపించింది. పైకి పురోగతి, అభివృద్ధి సూచికలుగా కనిపించే ఈ ఉదాహరణలను చాలా తరచుగా నయా ఉదారవాదాన్ని బలపరిచే శక్తులు సమర్థిస్తూ ఉంటాయి. పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ జరిగితేనే ఆదివాసీలకు ఉపాధి లభిస్తుందని, తద్వారా వారి ప్రాంతాల అభివృద్ధికి దారి తీస్తుందని వారు చెబుతూ ఉంటారు. అయితే, దీనికి విరుద్ధంగా, కార్పొరేట్‌ చొరబాటు కేంద్రాలన్నీ కూడా ఉపాధి కల్పించే కేంద్రాలకు బదులుగా హింసాత్మకమైన, ప్రగతిశీల సామాజిక వైరుధ్యాలకు, ఘర్షణలకు కేంద్రాలుగా మారిపోయాయి. నిలకడగా కొనసాగుతూ వచ్చిన ఈ విధానం యొక్క దీర్ఘకాలిక ప్రభావాన్ని 2001, 2011 మధ్య కాలంలో ఆదివాసీ కార్మిక వర్గంలో వచ్చిన మార్పుల్లో చూడవచ్చు.

పని ప్రాతినిధ్యంలో ప్రధాన ధోరణులు

                  కార్మిక వర్గానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన డేటాను బాల కార్మికులు (5-14 ఏళ్ళు), రెగ్యులర్‌ కార్మికులు(15-59), వృద్ధులైన కార్మికులు (60 ఏళ్ళు, ఆ పైబడిన వారు)గా వర్గీకరించి విశ్లేషించవచ్చు. ఈ మూడు కేటగిరీలను పరిశీలిస్తే ఆదివాసీ కార్మికులకు సంబంధించి వివిధ వర్గాల్లో నయా ఉదారవాదం విస్తృత ప్రభావం ఏ మేరకు ఉందో మనకు తెలిసిపోతుంది. 2001, 2011 మధ్య కాలంలో ఎస్‌టి కార్మిక వర్గంలో మార్పులు కూడా ఈ కింది పరిస్థితులను తెలియపరుస్తున్నాయి.
                  మొదటగా, మొత్తం కార్మిక వర్గంతో పోలిస్తే స్వల్పంగా తగ్గుదల నమోదై నప్పటికీ రెగ్యులర్‌ కార్మికులకు (15-59 సంవత్స రాలు) సంబంధించి చూసినట్లైతే ఉపాధిలో బాగా క్షీణత కనిపిస్తోంది. బాల కార్మికులు కూడా తగ్గారు. ఇక రెండవది, ఉపాధిలో క్షీణత అనేది గ్రామీణ ప్రాంతాల్లో పని కొరవడడం వల్లనే జరుగు తోంది. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఈ స్థాయిలో క్షీణత అనేది కనిపించడం లేదు. పైగా, పట్టణ కార్మిక వర్గంలో పెరుగుదల కనిపిస్తోంది. ఇది కూడా పట్టణ మహిళా కార్మికుల ప్రాతినిధ్యం పెరగడం వల్లనే సంభవించింది. గ్రామీణ ప్రాంతాల్లో రెగ్యులర్‌ మహిళా కార్మికుల్లో తగ్గుదల ఉన్నప్పటికీ మహిళా కార్మికుల ప్రాతినిధ్యం పెరిగింది. దాదాపు ఐదు లక్షల మంది మహిళా కార్మికులు నమోదయ్యారు లేదా దామాషా పద్ధతిలో 2.68 శాతం పెరిగారు. దీనికి భిన్నంగా, గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కార్మికుల సంఖ్య 32 లక్షల వరకు పెరిగింది. కానీ ప్రతికూల వృద్ధిరేటు 1.84 శాతం నమోదైంది. గ్రామీణ పురుష కార్మికులు ఒక అర శాతం పెరిగారు. లేదా 42 లక్షల మంది వరకు నమోదయ్యారు. కానీ, ఈ పెరుగుదల అనేది స్వల్ప కార్మిక వర్గంలోనే కనిపించింది. మరోవైపు మహిళా కార్మికులు 2 శాతం కన్నా తక్కువ రేటు చొప్పున తగ్గుతూ వచ్చారు. ప్రధాన పనుల్లో ఈ నష్టం, మహిళా కార్మికుల స్థానే పురుష వ్యవసాయ కార్మికులను చొప్పించడం చూస్తుంటే గ్రామీణ రంగంలో ఉపాధి సరిగా లేదని, పైగా సంక్షోభం, నిరాశా నిస్పృహలు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఇక మూడవది, మొత్తం కార్మిక వర్గంలో 60 ఏళ్ళకు పైబడిన కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ కూడా, బాగా పెద్ద మొత్తంలో పెరిగింది మహిళా కార్మికులే. అది కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే. పెరిగింది కూడా ఐదు లక్షల మంది వరకు మహిళా కార్మికులే. ఈ డేటా అంతా చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. రెగ్యులర్‌ కార్మికులకు సరైన, లాభసాటి అయిన ఉపాధి దొరకడమే కష్టసాధ్యంగా మారుతున్న పరిస్థితుల్లో మరింత మంది మహిళలు పని వెతుక్కుంటూ వస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

పెరుగుతున్న నిరుద్యోగం

               ఎస్‌టిల్లో ఉపాధి అవకాశాలు తగ్గుతున్నప్పటికీ మరింత మంది పురుషులు, మహిళలు, పిల్లలు పని కోసం వెతుక్కుంటూ లేబర్‌ మార్కెట్‌లోకి ప్రవేశిస్తుండడం గణనీయంగా కనిపిస్తోంది. మొత్తం కార్మికుల్లో బాల కార్మికుల సంఖ్య తగ్గినప్పటికీ లేబర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించే బాలల సంఖ్య మాత్రం పెరిగింది. బాల కార్మికులు తగ్గుతున్నారంటే దానర్థం నయా ఉదారవాద ప్రభుత్వ విద్యా విధానాల ప్రభావం కారణమని భావించాల్సిన అవసరం కూడా లేదని, మరింత పనిచేయగలిగిన కార్మికులు లేబర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించడమే కాకుండా తక్కువ వేతనాలకు చేయడానికి కూడా సుముఖంగా ఉండడంతోనే బాల కార్మికుల సంఖ్య తగ్గుతోందని భావించాల్సి వస్తుందని పేర్కొంది. అందువల్ల, రెగ్యులర్‌ కార్మికుల కన్నా కూడా పని కావాలని కోరుతూ వచ్చే బాల కార్మికుల సంఖ్య ఎక్కువ ఉండడం మనం చూడవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రెగ్యులర్‌ పురుష, మహిళా కార్మికులు పెరగగా పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా మహిళా రెగ్యులర్‌ కార్మికులే పెరిగారు. రెగ్యులర్‌ కార్మికుల్లో పట్టణ పురుష కార్మికులు తగ్గుతున్న వాస్తవాన్ని గమనంలోకి తీసుకుంటే పురుష కార్మికులు మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి వెతుక్కుంటూ వెళ్ళిపోతుండడం కనిపిస్తోంది. ప్రధానంగా వ్యవసాయ పనుల వైపు వీరు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇలా పని కోసం వెతుక్కుంటూ వెళుతున్నారంటే వ్యవసాయ రంగ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించబడిందని కూడా అనుకోనక్కరలేదు. దానికన్నా కూడా తక్కువ వేతనాలు, సరిగా లేని పని పరిస్థితుల కారణంగా గ్రామీణ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గడానికి ఇది దారి తీసే అవకాశం ఉంది.
                  పైన పేర్కొన్న విశ్లేషణలో సూచించినట్లుగా, ఆదివాసీ కార్మికులు పెద్ద సంఖ్యలో లేబర్‌ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నారని జనాభా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, వారికి అక్కడ ఎలాంటి ఉపాధీ దొరకడం లేదు. అంటే, దీన్ని బట్టి చూస్తే ఆదివాసీలు రిజర్వ్‌ లేబర్‌లో పెద్ద సంఖ్యలో మిగిలిపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుత రూపంలో పెట్టుబడి దారీవాదం కొనసాగించాలంటే ఇది-ఈ రిజర్వ్‌ లేబర్‌ -అనేది చాలా కీలకం. ఆ రకంగా, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగితకు, పని కోరుతున్నా లభించని ఆదివాసీ కార్మికుల సంఖ్య పెరగడానికి, సమకాలీన పెట్టుబడిదారీ విధానం హయాంలో ఆదివాసీలకు ఏమీ లభ్యం కాని ధోరణికి మధ్య సంక్లిష్టమైన, వైవిధ్యమైన సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, ఆదివాసీ కార్మికుల మౌలిక హక్కుల కోసం ప్రజాస్వామ్య ఉద్యమాలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆదివాసీల్లో తమ రాజకీయపరమైన నిర్మాణాలను మరింత బలోపేతం చేయడం ద్వారా కూడా వారి హక్కులకై పోరాడాల్సి ఉంది. అయితే, ఆదివాసీ కార్మికుని మనుగడపై జరుగుతున్న నయా ఉదారవాద దాడిని తిప్పికొట్టేందుకు విశ్వసనీయమైన, ప్రగతిశీల సవాలును విసిరేలా అన్ని సామాజిక గ్రూపులకు చెందిన కార్మికుల మధ్య ఐక్యత నెలకొన్న నేపథ్యంలో ఈ పోరాటం చేపట్టాల్సిన అవసరం ఉంది.
                

Prajashakti Telugu News Paper Dated: 17/07/2014 

అడవి చెంచుల్ని ఆదుకోవాలి - గంగాపురం లాలయ్య


Published at: 20-07-2014 01:17 AM
గిరిజన తెగలలో చెంచులు, ఎరుకలు, లంబాడీ కులాలవారు ప్రధానంగా ఉన్నారు. లంబాడీలు, ఎరుకల కులస్థులు గ్రామాలలో, మైదాన ప్రాంతాల్లో నివసిస్తుండడంతో చెంచులతో పోలిస్తే సాపేక్షంగా అభివృద్ధి చెందారు. లంబాడీలు, ఎరుకల కులస్థులను గిరిజన జాతుల్లో కలిపిన పిదప తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రల్లో వారు ప్రభుత్వం అందించే ప్రతీ సంక్షేమ పథకం ఫలితాలను అందుకొని చాలా వరకు అభివృద్ధి చెందారన్నది వాస్తవం. అయితే అడవుల మధ్య, కొండల నడుమ చెంచు గూడేల్లో, పెంటల్లో ఉన్న అడవి చెంచులు నాగరికతకు దూరంగా ఉన్నారు. వీరి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా పథకాలను రూపొందించి, సమర్థులైన అధికారులను నియమించి క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం రూపొందించిన పథకాల ఫలితాలు వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని, నల్లమల అడవి తల్లి బిడ్డలు, గిరి పుత్రులు దీనంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. బతుకంత చీకటి. నిలువ నీడలు లేవు తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు చేయడానికి పని కల్పించినపుడే చెంచులు మనలో ఒకరుగా కలసి పోగలరన్న విషయం గుర్తుంచుకొని చర్యలు తీసుకోవాలి. ఆధునిక సమాజంలో అంతరించి పోతున్న చెంచుల జనాభాను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని, వారి జీవన స్థితిగతులపై ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి ఆ అడవి బిడ్డలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నల్లమల అడవి ప్రాంతంలో కొండల నడుమ నివసిస్తున్న చెంచులు కనీస మౌలిక సదుపాయాలు, వైద్య సౌకర్యం అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోతున్నారు. దక్షిణ భారతదేశంలో దట్టమైన అడవులుగా ప్రసిద్ధి పొందిన నల్లమల అడవులు క్షీణించడం వల్ల చెంచుల జీవనోపాధి సంక్షోభంలో పడి ంది. రెండు దశాబ్దాల క్రితం అడుగడుగున ఉన్న వృక్షాల్ని స్మగర్లు తరలించుకుని పోవడంతో అటవీ ఉత్పత్తులు లభించక, తిండి తిప్పలు నోచుకోక అల్లాడుతున్నామని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద గ్రామాలకు రహదారిలో ఉన్న చెంచు గూడేల్లో కొంత అభివృద్ధి జరిగింది. అయితే గ్రామాలకు దూరంగా నల్లమల అడవి మధ్యలో కొండల నడుమ నివసిస్తున్న చెంచుల అభివృద్ధికి జరిగిన కృషి అత్యల్పం. నిరక్షరాస్యత, ఆరోగ్యం పరిశుభ్రత గురించి తెలియని ఈ చెంచులు తరచూ రోగాల బారిన పడుతున్నారు. గిరిజన స్ర్తీలు, పిల్లల్లో ఎదుగుదల లేక రక్తహీనతతో బాధపడుతున్నారు. చెంచు గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం దశాబ్దాలుగా వందలాది కోట్లు నిధులు మంజూరు చేసినా వాటిలో నామమాత్రంగానైనా చెంచుల అభివృద్ధికి చేరుకోవడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిథులు, దళారులు ఆ నిధుల్ని భుక్తం చేస్తున్నారు. గిరిజనుల అభివృద్ధి పేరుతో మంజూరయ్యే కోట్లాది రూపాయలను ఆయా అధికారులు వెనకేసుకుంటున్నారు. అడవి తల్లిని నమ్ముకుని బతుకుతున్న వారిని ఏకంగా అటవీ ప్రాంతాల నుంచి తరలించడంలో ప్రభుత్వం విఫలమైంది. అయితే అటవీ ఉత్పత్తులు తగ్గిపోవడంతో బతుకుదెరువు కోసం వలస బాటనే ఎంచుకుంటున్నారు. 1983లో పులుల అభయారణ్యంగా ప్రకటించారు. అయితే ఆ అభయారణ్యం నుంచి పులులు బయటికి వచ్చి గ్రామాలపై దాడి చేసి పశువులను కబళించడమే కాక, మనుషులపై కూడా దాడికి తెగబడుతున్నాయి. పులివాత పడి చనిపోయినవారికి ప్రభుత్వం నామమాత్రంగా చెల్లించడంతో ఎంతో మంది చికిత్స పొందుతూనే చనిపోయారు. వేల రూపాయలు విలువ చేసే పశువులు పులి దాడిలో చనిపోయిన సందర్భాల్లో ప్రభుత్వం నామమాత్ర నష్టపరిహారం ఇస్తోంది. దాంతో ఎంతో మంది ఆదివాసులు, అడవి అంచు గ్రామాల్లోని రైతులు వ్యవసాయం మానుకొన్న ఘటనలు అనేకం. చెంచులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం హర్షణీయం. గిరిజన జాతుల్లో లంబాడీ, ఎరుకలి కులాలవారు చాలావరకు సాంఘికంగా, ఆర్థికంగా ప్రభుత్వ పథకాల ద్వారా ఎదిగారు. ఈ నేపథ్యంలో చెంచుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందించింది.
ఆర్భాటంగా, అట్టహాసంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన అమాయక చెంచులకు అందేలా ప్రభుత్వం డెలివరీ మెకానిజంను రూపొందించాలి. కొత్త ప్రభుత్వంపై అడవి చెంచులు కోటి ఆశలు పెట్టుకొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రలలో చెంచుల పిల్లలను సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాకు 89 కేంద్రాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నల్లమల అడవుల్లోని పెంటలు, గ్రామాలు, మైదాన ప్రాంతాలలో నివాసం ఉంటున్న చెంచులు ఉపాధి పనులకు వెళ్ళటం, గ్రామాల్లో కూలీలకు వెళ్ళేటపుడు వారి పిల్లల్ని చూసుకునే వారు లేరు. దీంతో వారిని సంరక్షించేందుకు ప్రభుత్వం గత నెల 15న, జీవో 17 విడుదల చేసింది. పుట్టిన ఆరు నెలల పాప నుంచి ఆరేళ్ళ పిల్లల వరకు కేంద్రాలలో సంరక్షించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను అనుసంధానం చేస్తూ, సంరక్షణ కోసం ఒక మహిళని నియమించనున్నారు. మహిళకు నెలకు వేతనాన్ని చెల్లించి నియమించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
నిత్యావసర సరుకులు సరఫరా చేయడానికి కొందరు అప్పుడప్పుడు చెంచు గూడేలకు వెళ్తున్నప్పటికీ గిరిజనులకు మాత్రం ఆశించిన స్థాయిలో నాగరికత అబ్బలేదు. ఈ చెంచులకు శాశ్వతగృహాలను నిర్మించడం జరుగుతున్నా సుదూరంగా ఉండే వారికి ఈ సదుపాయం కల్పించడానికి ఇంతవరకు అధికారులు కృషి చేయలేదు. అందువల్ల వారి జీవితాల్లో ఎలాంటి మార్పుకు అవకాశం లేకుండా పోయింది. ఉపాధి కల్పన పథకాలలో వీరికి తగిన ప్రోత్సాహం కనిపించడంలేదు. వ్యవసాయ బావులు తవ్వించడం, వ్యవసాయానికి ఎడ్లబండ్లను ఇవ్వడంలోను అడవి చెంచులకు అన్యాయం జరుగుతోంది. అధికారుల దృష్టి అంతా గ్రామాల్లోనూ, అందులోను రహదార్లకు దగ్గర ఉండే వారిపైనే ఉందనడంలో సందేహం లేదు. క్రూర మృగాల సంరక్షణ ప్రాంతాల్లో చెంచు గిరిజన గూడేలు అనాదిగా ఉన్నాయి. అంటే క్రూర మృగాల సంఖ్య పెరగడం వల్ల వారందరిని తరలించి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించింది. అటవీ ప్రాంతాల్లోని పెద్ద గ్రామాల పరిధిలో గిరిజనులకు గృహాలని నిర్మించాలని ప్రభుత్వ సంకల్పించినా, వారు మాత్రం పెద్ద గ్రామాలలో నివసించడానికి ఇష్టపడటంలేదు. అడవిలో చెంచులు మంచినీటి కోసం గూడెం నుంచి కనీసం మూడు కిలోమీటర్లు దూరం నడచి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రభుత్వం వారి మంచినీటి అవసరాలను తీర్చేందుకు ఎలాంటి సదుపాయాలు కల్పించక పోవడం దురదృష్టకరం. గిరిజనుల అభివృద్ధికి కోసం కేటాయిస్తున్న నిధులు ఖర్చు చేయకపోవడంతో తరచూ మురిగిపోతున్నాయి. గ్రామాలకు దగ్గరగా ఉన ్న చెంచులలో కొంత నాగరికత కనిపించినా, సుదూరంగా అడవుల్లో నివసించే వారు బాగా వెనకబడి ఉన్నారు. ఆదివాసుల కోసం రూపొందించే ఏ పథకమైనా వారికి అందుబాటులోకి వచ్చే విధంగా రూపొందించాలి. గిరిజనులకు పునారావాసాలను కేవలం అడవులకు పరిమితం చేయకుండా అవసరమైతే సాధారణ జనావాసాలకు చేరువగా నిర్మించి వారి అభ్యున్నతికి రెండు తెలుగు రాషా్ట్రలు కృషిచేయాలి.
గంగాపురం లాలయ్య
విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు

Andhra Jyothi Telugu News Paper Dated: 20/07/2014

Monday, April 28, 2014

తెలంగాణలోనూ అగ్రకుల పాలనేనా!----జనగామ నర్సింగ్ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు


Updated : 4/27/2014 1:35:31 AM
Views : 53
తెలంగాణ రాష్ట్రంలో చాకలి ఐలమ్మ,దొడ్డి కొమురయ్య, కొమురం భీంల స్ఫూర్తితో బహుజన వర్గాలు రాజ్యాధికారం కోసం ప్రయత్నించాలి. తల్లి తెలంగాణ చల్లగా ఉండాలంటే అగ్రకులాలు ఏలే తెలంగాణ కాదు, బహుజనులు ఏలే తెలంగాణ కావాలి.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ఊపిరైంది బహుజనులే. దేశంలో చిన్న రాష్ర్టాల గురించి మొదటిసారి మాట్లాడింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్. చిన్న రాష్ర్టాల ఏర్పాటు వల్ల పాలనా సౌలభ్యం ఏర్పడి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతాయ ని పేర్కొన్నారు. అలాగే చిన్న రాష్ర్టా ల ఏర్పాటు వల్ల చిన్న కులాలు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందన్నారు. 120 కోట్ల పైగా జనాభా ఉన్న భారత దేశంలో 28 రాష్ర్టాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాం తాలు ఉంటే, 30 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో యాభై రాష్ర్టాలున్నాయి. దీనివల్ల అక్కడ పాలనా సౌలభ్యం వల్ల అభివద్ధి జరిగింది. 

రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ చెప్పిన చిన్న రాష్ర్టాలు అభివద్ధికి సోపానాలు అన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, పదవులలో ఉన్న (సీమాంధ్ర) ప్రజా ప్రతినిధులు ఈ మాటలు విస్మరించి అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. అంతేకాదు రాష్ట్ర విభజన ప్రక్రియ గురించి ఇష్టం వచ్చిన మాట్లాడడం చూస్తే వారికి ప్రజల పట్ల, రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నదో అర్థమవుతుంది. 

1969లో జరిగిన తెలంగాణ పోరాటంలో 369 మందిని నాటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం బలిగొన్నది. ఆనాటి ఉద్యమంలో ఉద్యమంలో అమరులైన వారిలో ఎక్కువ మంది బహుజనులే. దేశంలో తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో యావత్ ప్రజానీకం ఎవరికి తోచిన విధంగా రాష్ట్ర ఆకాంక్షను వినిపించారు. వివిధ కులాల వారు వారి కులవత్తుల ద్వారా రాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పారు.అయితే ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలే. ఆంధ్రప్రదేశ్‌లో బహుజనుల జనాభా-ఎస్సీలు 15 శాతం, ఎస్టీలు 7 శాతం, బీసీలు సుమారు 52 శాతం, ముస్లింలు 12 శాతం.

అగ్రకులాల వారు సుమారు 6 శాతం ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా లభించలేదు. అవశేష ఆంధ్రప్రదేశ్‌లో అగ్రకులాలదే పెత్తనం. బహుజనులు పాలితులుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అణిచివేయబడినారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇరు ప్రాంతాల అభివద్ధిలో వైఫల్యం, నీళ్లు, నిధుల పంపిణీలో వ్యత్యాసం, అలాగే విద్యా రంగంలోనూ అభివద్ధి , అసమానతలకు సమాధానం చెప్పాల్సింది ఇంత కాలం ఈ రాష్ర్టాన్ని ఏలిన పాలకులే.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో బహుజన వర్గాలకు చెందిన విద్యార్థులు ముందున్నారు. విద్యకు దూరమై, వందలాది కేసులతో అనేక రోజులు జైలుపాలయ్యారు. తెలంగాణ కోసం అమరులైన వారి లో కూడా దాదాపు 90 శాతం బహుజనవర్గాల వారే. పోరాటంలో ముందున్నది బహుజనులు కాగా రాజకీయంగా లబ్ధి పొందడంలో ముందున్నది అగ్రకులాల వారే అన్నది నిజం.తెలంగాణ ప్రజలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో బహుజన తెలంగాణ కోరుకుంటున్నారు. మాన్యశ్రీ కాన్షీరాం ఓట్లు మావి-సీట్లు మీవా ఇకపై చెల్ల దు అన్నారు. జనాభా ప్రాతిపదికన బహుజనులు తమ హక్కుల కోసం పోరాడాలన్నారు. తెలంగాణ పోరాటంలో ముందున్నది బహుజనులు కాబట్టి ఈ వర్గాల ప్రయోజనాలు నెరవేరేదాకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అగ్రకుల పాలనను వ్యతిరేకిస్తూ బహుజనులు రాజ్యాధికారం కోసం ప్రయత్నించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రకుల పాలన వల్ల ఈ వర్గాలు అనేక అవమానాలకు గురయ్యాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ అగ్రకులాల పాలనేనా?
తెలంగాణ రాష్ట్రంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కొమురం భీంల స్ఫూర్తితో బహుజన వర్గాలు రాజ్యాధికారం కోసం ప్రయత్నించాలి. తల్లి తెలంగాణ చల్లగా ఉండాలంటే అగ్రకులాలు ఏలే తెలంగాణ కాదు, బహుజనులు ఏలే తెలంగాణ కావాలి. అన్ని వర్గాలకు అభివద్ధి ఫలాలు దక్కాలంటే సామాజిక తెలంగాణ కావాలి. బహుజన రాజ్యాన్ని నిర్మించడమే బాబా సాహెబ్ అంబేద్కర్‌కు మనం అందించే నివాళి.

Saturday, April 19, 2014

ఆది నుంచి ఆదివాసీలపై అణచివేతలే...By -మైపతి అరుణ్‌కుమార్ఆదివాసీ రచయితల సంఘం


వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు కాని ఒక నిర్దోషికి శిక్షపడకూడదు. చట్టం దష్టిలో అందరు సమానులే అనేది రాజ్యాంగనీతి. అందరు ఆమోదించాల్సిన విషయం కూడా! ఈ రాజ్యాంగ నీతిని 33 సంవత్సరాలు వెనుకకు వెళ్ళి ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి గోండు గూడెం సంఘటనతో పోల్చి చూసినపుడు అనేక అనుమానాలు మనకు కలుగుతాయి. అసలు ఇంద్రవెల్లితో పాటు చుట్టు పక్కల గోండుగూడాలలో అమరత్వం పొందిన గోండులు ఈ రాజ్యాంగ పరిధిలోకి రారా? ఒకవేళ వస్తే దీనిపై నేటికి ఎందుకు విచారణ జరగలేదు? న్యాయమనేది ఎందుకు గోండుల దరిచేరలేదు? ఆదివాసులకు అటవీ భూములపై హక్కులను ప్రభుత్వం నేటి కి ఎందుకు కల్పించలేదు?నేటికి ఇంద్రవెల్లిలో 144సెక్షన్ అమలులో ఎందుకున్నది? వర్తమానంలో ఏం జరుగుతున్నది? రాజ్యహింస ప్రజాస్వామ్యంలో కొనసాగింపు ఎందుకుందనేది స్పష్టమవుతుంది. 

ఇంద్రవెల్లిలో ఆనాడు ఏం జరిగింది? అడవిపై హక్కు కోసం పోడు భూములు, పట్టాల కోసం ఆదివాసీ రైతుకూలిసంఘం ఇంద్రవెల్లిలో సంత జరుపుకునే రోజున బహిరంగసభకు పిలుపునిచ్చింది. ఈసభకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.సభకు వచ్చే గోండులకు మాత్రం రెండు రకాల ధక్పథాలున్నాయి. ఒకటి సంతలో వారానికి సరిపడు సరుకులు కోనుక్కోవటం (పిల్లాపాపలతో సంతలకు వెళ్ళటం ఆదివాసీ సంప్రదాయం)ఒకటైతే, రెండవది- సభకు హాజరవటం. సాయంత్రం మూడు గంటలు అయేటప్పటికి గూడాల నుంచి గోండులు చీమల దండుల్లా ఇంద్రవెల్లికి చేరుకుంటున్నారు. అప్పటికి ఆర్.డి.ఓ. సభకు అనుమతులు రద్దుచేశామని ప్రకటించటం 144 సెక్షన్ విధించటం జరిగిపోయాయి. సభకు అనుమతి లేదని పోలీసులు తెలుగులో ప్రచారం చేస్తున్నారు. గోండు భాష తప్ప, తెలుగు అర్థం చేసుకోలేని చాలామంది గోండులకు ఆ హడావిడి, పోలీసుల కవాతులు ఏమిటో అర్థం కాలేదు.ఒక్కసారిగా బెదిరింపులు, లాఠీచార్జి, తోపులాట అదికాస్త 420 రౌండ్లు కాల్పుల వరకు వచ్చింది. చెట్లు ఎక్కి మరీ కసితో గోండులపై పోలీసులు కాల్పులు జరిపారు. గాయాలతో పిల్లాపాపలతో చెట్టుకొకరు, పుట్టకొకరుగా గోండులు పరుగులు తీశారు. 

ఎండతీవ్రత, నీరులేక చనిపోయిన సంఘటనలున్నాయని స్థానికులు అంటారు. గోండుల సంప్రదాయా నికి వ్యతిరేకంగా పోలీసులు శవాలను కుప్పలు కుప్పలుగా వేసి కాల్చి ఆదివాసులను మరింత గాయపరిచారు.ఎంతమంది చనిపోయారో కూడా నేటికి ప్రభుత్వం దగ్గర రికార్డు కాని పరిస్థితి. ప్రభుత్వం 13 మంది మాత్రమే మతులు అని కాకి లెక్కలేసిం ది కూర్చుంది.పక్కకున్న పిట్టబొంగరం గోండు గూడెంలో నీటికి బదులు రక్తం పారిం దంటే ఈ మారణహోమాన్ని అంచనా వేయవచ్చు. ఈ సంఘటన అనంతరం ప్రభు త్వం కొన్ని ఆదివాసుల కోసం ప్రత్యేక అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా అవి ప్రచా రానికే పరిమితమయ్యాయి.నేడు.. ఇంద్రవెల్లి గిరిజనేతరుల వలసల కేంద్రమైంది. గోండుల ఆశయం మాత్రం నెరవేరకపోగా.. స్థూపం మాత్రం అమరుల జ్ఞాపకంగా మిగిలింది. 

స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ రాజ్యం 1836లో 1000 మంది గోండులతో సహా, ఆదివాసీ రాజు అయిన రాంజీ గోండును నిర్మల్‌లోని మర్రిచెట్టుకు ఉరితీసి రాజ్య క్రూరత్వాన్ని చాటుకుంది. ఇది రాజ్య ఆక్రమణలో భాగమైంది. 1940లో జోడెఘాట్ కేంద్రంగా జల్, జంగల్, జమీన్ కోసం నడిపిన పోరాటంలో కొమరంభీంతో సహా 11 మంది కాల్చివేయబడ్డారు. అది రాజ్య నిర్బంధంలో భాగమయింది. ప్రజాస్వామ్య పాలనలో జరిగిన ఇంద్రవెల్లి దుర్ఘటనకు కారణమేంటనే ప్రశ్నలు సమాధానాలు దొరకనేలేదు. కాని నేటికి వాకపల్లి, బల్లుగూడ, బాసగూడ, ఆలుబాక,ఎడ్సమెట్ట లాంటివి రాజ్యహింసలో కొనసాగింపుగానే ఉన్న వి. బహుశా ఇటువంటి నిర్బంధం అణిచివేత, దోపిడీకి వ్యతిరేకం గా ఉద్యమించినట్టు, ఉత్తరాంధ్రలోని సవర జాతాపులు నడిపిన శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటం కూడా చరిత్రలో నిలిచిపోయింది. రాజ్యహింసకు రక్తసిక్తమైంది. భూస్వామ్య వలస దోపిడీ నుంచి విముక్తి కోసం, భూమిపై హక్కు కోసం నడిపిన ఈ పోరాటం దేశ చరిత్రలోనే ఒక మైలురాయి. దీని తర్వాత ప్రభు త్వం ఆదివాసుల ఆరాట పోరాటాల వెలుగులో 1/70 చట్టాన్ని తెచ్చింది.

ఈ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో (ఆదివాసీ ప్రాం తం) లో గిరిజనేతరులు, భూములు కలిగి వుండటం, స్థిర చర ఆస్తులు కలిగి వుండటం నిషేధం. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఆదివాసుల భూములు 48శాతం గిరిజనేతరుల చేతుల్లో ఉన్నవి. అయినా ఈ చట్టాన్ని అమలు చేసి ఆదివాసులకు భూములిప్పించే సాహసం నేటికి ఏ ప్రభుత్వం చేయలేదు. కాని ఈ పోరాటం ఆదివాసులకు చైతన్యాన్ని మిగిల్చింది. ఈ చైతన్యం ఇంద్రవెల్లి మీదుగా అడవిపై హక్కు కోరుతూ అమరత్వాన్ని మూటగుట్టుకొని దండ కారణ్యంలో గూడు కట్టుకున్నది. జగిత్యాల జైత్రయాత్ర మైదానం మీదుగా వచ్చి మళ్ళీ సిరొంచ, గడ్చిరోలి మీదుగా అబుజ్‌మాడ్‌లోని గోండుల వారసత్వాన్నందుకొని దండకారణ్యంలో నేడు సామ్రాజ్యవాద విషసంస్కతిని, పెట్టుబడిదారీ, బహుళజాతి సంస్థ ల నుంచి దేశాన్ని విముక్తి చేసే దిశగా జనతన సర్కార్‌ను ఏర్పాటు చేస్తున్నది. మనం ఇవ్వాళ.. చూస్తున్న దేశ పరిణామాలలో ఇది ఒకటి. 

భారత పరిపాలన వ్యవస్థ జనతన సర్కారు పరిపాలన వ్యవస్థ ను ఆదివాసీ ప్రాంతాలలో సరిపోల్చి చూసినప్పుడు అనేక విషయా లు అవగతమవుతాయి. 1950 జనవరి 26 న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగంలోని 244(1) అధికరణం ఆదివాసీ ప్రాంతాలపై స్వయం పాలన, నిర్ణయాధికారం వారికే ఉండాలనంటున్నది. 67 సంవత్సరాలుగా దీనిని ప్రభుత్వాలు ఎందుకు అమలు చేసి ఆదివాసీల అభివద్ధికి దోహదపడలేదు? 1996లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడిన పెసా చట్టం ప్రతి ఆదివాసీ గూడాన్ని గ్రామసభగా పరిగణించి మా వూళ్ళో మా రాజ్యం పాలనా హక్కును ఆదివాసులకిచ్చింది. 2006 ఆడవి హక్కుల చట్టం ఆదివాసులకు అడవిపై సర్వాధికారాలు కల్పించింది. కాని వీటి అమలు మాత్రం కాగితాలకే పరిమిత మైంది. 
ఇదే రాజ్యాంగానికి వ్యతిరేకంగా.. ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో ఆదివాసీలపై మానవ హక్కుల ఉల్లంఘనా చర్యలు జరుగుతున్నాయి. పోలవరం, కంతనపల్లి ప్రాజెక్టుల పేరిట ఆదివాసీ గూడెలను జలసమాధి చేస్తున్నారు. బాక్సైట్, లాటరైట్, గ్రానైట్ పేరిట, ఓపెన్‌కాస్టుల పేరిట జీవన విద్వంసం చేస్తున్నారు. టైగర్ జోన్, ఎలిఫెంట్ జోన్‌ల పేరిట అడవి నుంచి ఆదివాసీల గెంటివేస్తున్నారు. వాకపల్లి, బల్లుగూ డ, సత్యమంగళం లాంటి లైంగిక దాడు లు నిత్యకత్యమయ్యాయి. 

అన్యమత ప్రచారాలతో ఆదివాసీ ఉమ్మడి సాంస్కతిక జీవన వ్యవస్థపై సాంస్కతిక దాడి జరుగుతున్నది. ఈ పరిస్థితులలో ఆదివా సీల మనుగడ ఏమిటనేది ప్రశ్న. ఇప్పుడు ఆదివాసుల మనుగడకే ప్రమాదం వచ్చి పడిందని స్పష్టంగా కనబడుతూనే ఉన్న ది. ఆదివాసీల ఉమ్మడి జీనవ వ్యవస్థను బలోపేతం చేస్తూ సాంస్కతిక, జీవన వ్యవస్థను సంరక్షిస్తూ, నిర్మాణం చేస్తూ ఆదివాసీ గూడాలకు స్వయంపాలనా హక్కుల్ని కల్పిస్తున్న జనతన సర్కార్ వైపు ఆదివాసీలు చూస్తున్నారు. దేశానికి స్వా తంత్య్రం వచ్చినప్పుడు ఆదివాసీలదే ఈ దేశమనీ, దేశంలోని వారంతా బ్రిటిష్ వారిలాగే వలస వచ్చిన వారే అని చరిత్ర చెబుతున్నది. భారత సమాజంలో ఆదివా సీలు తమ అస్తిత్వం కోసం ప్రత్యేక భార తం కావాలని ఆదివాసీలు నినదించేరోజు పునరావతమయ్యే పరిస్థితి వస్తు న్నది. ఇలాంటి పోరాటాలను ప్రభుత్వం అణచివేయ జూసి మరొక చారిత్రక పోరాటాన్ని ఆదివాసీల నుంచి కొనితెచ్చుకుంటున్నది. ఇవ్వాళ.. మధ్య భారతం కేంద్రంగా జనతన సర్కార్‌లు చెబుతున్నది ఇదే..







Namasete Telangana Telugu News Paper Dated: 20/4/2014 

Monday, February 24, 2014

చరి్త్ర పుటల్లో చేరుతున్న రుంజ కళారూపాలు By Buddaram Ramesh


తెలుగు వారికి అపూర్వమైన జానపద కళా వారసత్వం ఉన్నది. సంగీతం, నాట్యం, హస్త కళలు, శిల్ప కళలు మొదలగు కళారూపాలు తరతరాలుగా సమాజానికి వినోదాన్ని పంచిపెడుతున్నాయి. జానపద కళా సాహిత్యం ద్వారా జాతి సం„స్కృతి తెలుస్తుంది. ఒక జాతి నిర్మాణానికి అవసరమైన ఆకారాలను జానపద కళలు అందిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. జానపద కళలకు తెలుగు నేల పండిన పంట పొలం వంటిది. ఎన్నో రకాల జానపద కళలు తెలుగు నేలను సుసంపన్నం చేశాయి. శతాబ్దాలుగా ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించాయి జానపద కళలు. 

ప్రాచీన సమాజంలో ప్రజలకు వినోదం కోసం జానపద కళామాధ్యమం తప్ప మరొక మాధ్యమం లేదు. పరివర్థితులైన శిష్ఠుల కళా రూపాలు ప్రజల దాకా వచ్చేవి కావు. అవి ప్రభువుల కొలువులకు, రాచనగరులకు పరిమితం అయ్యేవి. జన సామాన్యానికి, జానపదులకు అందుబాటులో ఉండి- వారి జీవితాన్నే వస్తువుగా జేసుకొని ఆడిన నాటకాలు జానపద కళలే. మన పురాణాలన్నింటినీ దృశ్య మాధ్యమంలో ప్రజలకు అందించి ప్రజలకు పురాణ పరిజ్ఞానాన్ని కలిగించినవి కూడా ఈ ప్రజా కళలే. ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నో జానపద ప్రదర్శన కళారూపాలు, భాగవత మేళా, కురవంజి (ఎరుకల సాని), తోలు బొమ్మలాట,. తప్పెటగుళ్ళు, పులివేషం, కోలాటం, చెక్క భజన, పండరి భజన, ఒగ్గు కథ, పంబ కథ, ఆసాది కథ, బైండ్ల కథ, కొమ్ముల కథ, పాండవ… కథ, రుంజ కథ, గొల్ల సుద్దులు, జడ కోలాటం (కులుకు భజన ), వగ్గు డోళ్ళు బురక్రథ- వంటి కళారూపాలన్నీ కూడా తర తరాలుగా ఆశ్రీత కులాల వారికి వృత్తిగా ఉన్న కళా రూపాలే. ఈ కళా రూపాలు క్రమేణా కాలగర్భంలో కలిసిపోయాయి. మరి కొన్ని కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాయి. ఈ కళా రూపాలు అన్నింటిలో రుంజులకు విశిష్ట స్థానం ఉంది. రుంజులు అనగా దాతృకులాల వారిని ఆశ్రయించి, గోత్రా లు పొగడి, వారి వంశచరిత్రలు పాడి జీవనోపాధి పొందేవారు. రుంజులలో ముఖ్యంగా భట్టులు, భట్రాజులు, విప్రవినోదులు, పుచ్చుకుం ట్లు, రుంజలు, పొడా పోతలవారు, మాల మాష్టివారు మొదల గు కులాల వారు న్నారు. వీరు ఆయా దాతృకులాల వారిని ఆశ్రయించి జీవనోపాధి పొందేవారు. ఉదా: బ్రాహ్మణులకు విప్రవినోది, వైశ్య (కోమటి) లకు వీరముష్టి, గొల్లలకు పొడపోతలు లేదా మందెచ్చులువారు, మాల కులస్థులకు మాల మాష్టివారు- ఉన్నారు. రంజ వారు ఆది నుంచి వ్యవసాయ దారులు. వ్యవసాయంతో పాటు ఈ రంజు వృత్తిని చేపట్టేవారు. 

తక్కు ధిక్కు... తకధిక్కు ధిక్కు... తకమని... అంబుజా సనుడు తాళంబువేయ- అంటూ మెల్లగా ప్రారంభమైన గానం క్రమంగా ఊపందుకుంటుంది. ఈ గానంలో వేగం, తాళంలో తీవ్రతను పెంచుకుంటూ- రుంజు ధ్వని తీవ్రతను పెంచుతూ కథలు చెపుతారు రుంజవారు. వీరి కథలకు అప్పట్లో మన రాష్ర్టంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీరిదగ్గర ఉన్న రుంజలను వాయిస్తూ కథలు చెప్పి తమ కళను ప్రదర్శించి యాచిస్తారు. అయితే వీరు ఎవరినిబడితే వారిని యాచించరు. కేవలం విశ్వబ్రాహ్మణులను మాత్రమే యాచిస్తారు. కనుకనే ఆశ్రీత కులాలలో ఇది ఒకటిగా గుర్తింపుకు నోచుకుంది. రుంజు వాయిద్యకులు త్రేతా యుగానికి చెందిన వారనీ విశ్వ కర్మ „సృష్టించిన రుద్ర మహేశ్వరుల సంతతివారనీ ఇతి హాసం తెలియచేస్తూ ఉంది. రుంజలు కథ చెబుతూ వాయించే వాయిద్యమే రుంజ. రుంజు వాయిద్యానికి ఒక ప్రత్యేకత ఉంది. చర్మ వాయిద్యాలలో చాలా పెద్దది రుంజ. దీని శబ్దం కూడా రెండు , మూడు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. వృత్తి గాయకుల వాయిద్యాలలో ఇంత పెద్దది మరొకటిలేదు. దాదాపు మూడున్నర అడుగుల ఎత్తుండే ఈ వాయిద్యాన్ని నిలబెట్టి వాయించేవారు. రుంజ కారులు మోయలేని బరువుగానే దీనిని మోస్తుంటరు. నా సంసార బరువును ఇది మోస్తున్నప్పుడు దీని బరువును మేము మోయలేమా అని ఆ కళాకారులంటారు. 

పూర్వం రౌంజుకుడనే రాక్షసుని చర్మాన్ని రుంజు వాయిద్యానికి వినియోగించడం వల్ల, రౌంజ అనే పేరు ఏర్పడి, కాలక్రమేణ అది రుంజగా రూపాంతరం చెందిందని నానుడి. రుంజను ఇత్తడితో తయారు చేస్తారు. ఈ వాయిద్యాన్ని బలమైన కర్ర పుల్లలతో వాయిస్తారు. ఏట వాలుగా ముందుకు వంచి, కదలకుండా మోకాలితో అదిమి పట్టి, చేతులతో తాడును లాగి, శ్రుతిచేసి, తాళం ప్రకారం వరుసలతో ఉధృతంగా వాయిస్తారు. రుంజ వాయిద్యకులను రుంజ వారని పిలవటం కూడ వాడుకలో ఉంది. రుంజ వాయిద్యకులు ఒక వేళ వ్వవసాయాన్ని కలిగి ఉన్నా, ప్రధానంగా రుంజ వాయిద్యాన్నే వృత్తిగా స్వీకరిస్తారు. బాల్యం నుంచీ, విద్యాభ్యాసంతో పాటు ఈ విద్యను కూడా కట్టుదిట్టంగా నేర్చుకుంటారు. ప్రతి వారూ ఈ విద్యలో ఉత్తీర్ణు్లలై, గ్రామాలకు యాత్రలు సాగిస్తారు. సంసారాలతో పాటు ఎడ్లబండ్లలో బయలు దేరుతారు. నిత్య జీవితానికి కావలసిన వంట పాత్రలు మొదలైనవ వాటిని కూడ తమతోనే ఉంచు కుంటారు. ఈ రుంజ కథ త్రేతాయుగానికి చెందినదని చెబుతారు. ఆ కాలంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిందనీ, అప్పుడు వాయిద్య విశేషాలు ఏమీ లేవనీ, అందువల్ల పార్వతీ దేవి తన కళ్యాణానికి వాయిద్యాలు కావాలని విశ్వకర్మను కోరెననీ, అప్పుడు విశ్వ కర్మ రౌంజుకాసురుడనే రాక్షసుని సంహరించి, వాని చర్మాన్ని రుంజగా చేసి, సప్త తాళాలనూ, ముపై్పరెండు వాయిద్యాలను ఈ రుంజపై పలికించాడనీ, ఈ రుంజ వాయిద్యం తోనే పార్వతీ దేవి కళ్యాణం రంగ రంగ వైభోగంగా దేవతలందరూ కలిసి చేశారనీ విశ్వకర్మ పురాణం వివరించింది.

రుంజుల విశిష్ట లక్షణం- ఏ గ్రామానికి చేరుకున్నా వారు విశ్వ బ్రాహ్మణులను మాత్రమే యాచించడం. విశ్వ బ్రాహ్మణులు వీరిని ఎంతగానో ఆదరించి, దన ధన్యాలను దానం చేస్తారు. రుంజ వాద్యకులు తమ వాయిద్యాలతో, గానంతో, కథలతో వారిని రంజింప చేస్తారు. సంగీత శాసా్తన్రికి సంబంధించిన సప్తతాళాల్నీ, ముపై్పరెండు రాగాలనూ తమ ప్రదర్శనల్లో వినిపిస్తారు. మూల స్థంభం, పంచముఖ బ్రహ్మావిర్భా వము, పార్వతీ కళ్యాణము మొదలైన కథలను చెప్పడమే కాక, మధ్య మధ్య శ్రావ్యమైన కీర్తనల్నీ పాడుతూ, వాయిద్య నైపుణ్యాన్ని రుంజుపై పలికిస్తారు. మాములుగా మన భాగవత కాలక్షేపా లలో, కథాంతంలో, మంగళ సూచికంగా, పవనామా సుతుని బట్టి పాదార విదములకూ- అనే పారంపర్యంగా వచ్చే మం„గళ హారతినే వీరూ అనుకరిస్తారు.

గ్రామంలో ప్రవేశించిన రుంజ వారు ఒక రాత్రి విశ్వ బ్రాహ్మణులకు కథను వివరిస్తారు. పంచ బ్రాహ్మలను గురించి, వారి వంశోత్పత్తిని గురించీ చెపుతూ, పాంచ భౌతికమైన ఈ శరీరం అస్తిత్వాన్ని గూర్చి, పంచ భూతముల విధులనూ వివరిస్తారు. పంచ బ్రహ్మలంటే మనువు, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ. వారి విధులను గురించి ఈ విధంగా వివరిస్తారు- మనువుకు ఇనుప పనీ, వద్దు కరప్రనీ, త్వ్రష్టకు ఇత్తడి పనీ, శిల్పికి రాతి పనీ, విశ్వజ్ఞనికి బంగారు పనీ- ఈ విధంగా వేరు వేరు విధులను మాత్రమే చేపట్టాలని వివరిస్తారు. తరువాత ఓంకార స్వరూపాన్ని స్తుతిస్తారు. వారు చెప్పే కథలు- పార్వతీ కళ్యాణము, దక్షయజ్ఞము, విశ్వగుణా దర్శనము, వీర భద్ర విజయం, విశ్వకర్మ, బ్రాహ్మణ వంశాగమనము, దేవ బ్రాహ్మణ మాహోత్యము, మూల స్థంభము, సనారి విశ్వేశ్వర సంవాదము, విశ్వ ప్రకాశ మండలము. వీటిన్నిటికి పద్దెనిమిది అశ్వాసాలు గలిగి సం„స్కృత శ్లోకాల మయమైన, తాళ పత్ర గ్రంథం, మూల స్థంభం అధారమని చెబుతారు. రుంజలు విశ్వకర్మ పుట్టుక, పంచ బ్రహ్మల పుట్టుక, దక్షయజ్ఞం, పార్వతీ కళ్యాణం, రుంజల పుట్టుక, వీరబ్రహ్మం చరిత్ర చెబుతారు. విశ్వబ్రాహ్మణుల లోని సానగ (కమ్మరాచారి), సనాతన (వడ్రపుపని), అభవనస (కంచరపుపని), ప్రత్నన (శిల్పాచారి), సువర్ణస (బంగారపు ఆచారి) గోత్రాల వారి ఇళ్ళకు వెడతారు.

రుంజ కథకులు గ్రామానికి వెళ్ళినపుడు ఊరిలో పెద్ద ఆచారి- అంటే మను బ్రహ్మ సంతతి వారి ఇంటికి, లేక ఆ ఊరిలో మొదటిగా వచ్చి స్థిరపడిన ఆచారి ఇంటికి వెళ్ళి కథ చెబుతారు. కొన్ని సందర్భాలలో గ్రామంలోని విశ్వబ్రాహ్మణులు అందరికీ కలిపి ఒక చోట కథ చెప్పడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో పెద్ద ఆచారి ఇంట్లో కథ చెబితే, మిగతావారు అక్కడకు చేరుకొని కథ విని పారితోషికాలు ఇస్తారు. రుంజ కథకుడు కథ ప్రారంభించే ముందు ఏ ఇంటి ముందు కథ చెబుతాడో ఆ గృహస్థుని గోత్రం చెప్పి, అతని వంశం చెప్పి అతని కుటుంబం ఇంకా వృద్ధి కావాలని దీవించి తర్వాత విశ్వబ్రాహ్మణుల వంశ గమనాన్ని, పంచ బ్రహ్మల జన్మ ప్రకారాలను వివరిస్తాడు. ఆ తర్వాతే ఏ కథ అయినా. వీరికి ఇచ్చే పారితోషికం నికరం ఉండదు. అయితే ఏ దాత కూడా వీరిని తక్కువ చేసి పంపించడు. డబ్బులు, భోజనం,బట్టలు కూడా పెడతారు. ఈ విధంగా ఒక అలిఖితమైన, అవగాహన, ఆచారం, సంబంధం ఆశ్రీతులైన రుంజలకు- దాతలైన విశ్వబ్రా హ్మ ణులకు మధ్య ఎన్నో తరాలుగా కొనసాగుతూ వస్తోం ది. తరతరాలుగా వీరికి జీవనోపాధికి దోకాలేకుండా ఆసరాగ ఉండింది. ఐతే కాలంతో పాటు సామాజిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా, ఈ కళ వీరితోనే అంతరించిపోతున్నది. 

వీరి పిల్లలు ఎవ్వరూ ఈ కళను నేర్వడంలేదు. వీరు ఇంతవరకూ ప్రభుత్వ గుర్తింపునకు కానీ, సహాయానికి కాని నోచుకోలేదు. సినిమాలు, టీవీలు రావడంతో వీరి కళకు ఆదరణ కరవైంది. రాష్ర్టంలో అన్ని జానపద కళా రూపాలతోపాటు రుంజ కళా వాయిద్య రూపం కూడా క్రమంగా మరుగున పడింది. అటు కులవృత్తులు దెబ్బతినడంతో విశ్వబ్రాహ్మణులు కూడా గతంలో వలె వీరిని ఆదరించలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇళ్లవెంట వెళ్లి యాచించే ప్రయత్నాన్ని కూడా వీరు విరమించుకున్నారు. తెలంగా ణప్రాంతం, ఉభయగోదావరి జిల్లాలో వీరు జీవిస్తున్నారు. ఈ కళాకారులను ఏ ఒక్కరూ గుర్తించ పోవడం గమనార్హం. 
అటు వ్యవసాయాన్ని పట్టిం చుకోక, ఇటు నమ్ముకున్న కులవృత్తి దెబ్బతిని రుంజవారు దయనీయ పరిస్థితిలో కాలం గడుపుతున్నారు. ఇతర దేశాలలో ఇలాంటి కళారూపాలను నవీనం చేస్తున్నారు. ఈ కళారూపాలకు టెక్నాలజీని అందించి నవీనం చేయటమేగాక ఆ కళా సంపదలను కాపాడుతున్నారు. శ్రమ సామాజికీకరణ కావాలంటే శ్రామికుణ్ణి ప్రేమించాలి. అతని కళలను ఆదరించాలి. ఆ చెమట చుక్కల జ్ఞానాన్ని ఏ విధంగా నవీనం చేయాలో ఆ విధంగా సున్నిత విషయాలను కళలకు జోడించి కొత్త పార్శా్వనికి మార్గం వేయాలి. ఈ కళాకారులను ప్రోత్సహించి ఈ కళను గ్రంథస్తం కూడా చేయవలసి యున్నది. అప్పుడే ఆ బడుగు జీవుల శ్రమకు విలువ లభిస్తుంది. ఆ కళాజ్ఞానం సమాజంలో సజీవంగా ఉండగలుగుతుంది.

Surya Telugu News Paper Dated: 24/02/2014 

Thursday, November 14, 2013

గిరిజనులకు తెలంగాణ వెల్గులు - దేవసోత్ టీకం రాథోడ్

నాటి ఆదిమ రాజపుత్రులే నేటి లంబాడీలు.
ప్రాచీన భారతదేశ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాపాడడంలో విశేష పాత్ర వహించిన ఈ రాజపుత్రులు తమ వైభవాన్ని, అస్తిత్వాన్ని కోల్పోయారు. తొలుత తురుష్కుల చేతిలో ఊచకోతకు గురయ్యారు; ఆ తరువాత మొగలాయీల ఆధిపత్యంలో నలిగిపోయారు. ప్రాణాలనైనా కాపాడుకోవడానికి అడవులకు పారిపోవాల్సిన అగత్య మేర్పడింది. శత్రు సైన్యాలు గుర్తించకుండా రాజపుత్రులకు సహజమైన వేష ధారణను సైతం త్యజించవలసివచ్చింది. ఆకులు అలములు తింటూ బతికారు. తమ రాజపుత్ర అస్తిత్వాన్ని మరచిపోలేక ఆ గతించిన జీవన శైలి స్ఫూర్తితో ఒక విచిత్ర వేషధారణకు అలవాటు పడ్డారు. తొలుత వీరిని చూసినప్పుడు బ్రిటిష్ వారు విస్మయానికి లోనయ్యారు. వారి దృఢకాయాలకు అబ్బురపడ్డారు. అయితే తమకు వ్యతిరేకంగా పోరాడడంలో మరెవ్వరికంటే ముందుండడంతో ఈ ఆదిమ రాజపుత్రుల పట్ల తీవ్ర వ్యతరేకతను పెంచుకున్నారు. దేశ పాలనాధికారాలు పూర్తిగా తమ చేతుల్లోకి వచ్చిన తరువాత వారిని నేరస్థుల తెగగా ముద్రవేశారు. వారిని అదుపుచేయడానికి, కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయడానికి కఠినమైన చట్టాలు తీసుకొచ్చారు. ఈ విషాద క్రమంలో ఆదిమ రాజపుత్రులు లంబాడీలుగా మారిపోయారు.

నిజాం నవాబుల ఏలుబడిలో కూడా వారి కష్టాలు తీరలేదు. నిరంకుశ రాజరికానికి, పెత్తందారీ భూస్వామ్యానికి భూములు కోల్పోయారు. భుక్తి కరువయింది. ఆత్మాభిమానులైన లంబాడీలు ఎదురు తిరిగారు. వీరోచిత పోరాటాలు చేశారు. చరిత్రలో గుణాత్మక మార్పుకు విశేషంగా దోహదం చేశారు. అయితే వారి త్యాగాలు నిష్ఫలమయ్యాయి. మళ్ళీ నిర్లక్ష్యానికి గురయ్యారు. దోపిడీకి, అణచివేతకు గురయ్యారు. ప్రజాస్వామ్య భారతదేశంలో వారి కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన తరువాత మరింతగా అన్యాయాలకు గురయ్యారు. కొత్త పాలకులు తెలంగాణ పట్ల చూపిన నిర్లక్ష్యంలో భాగంగా లంబాడీలూ నానా ఇక్కట్లకు గురయ్యారు.
వివక్ష పెరిగింది. తెలంగాణ ప్రాంత ఆదిమవాసీ లంబాడీలు ప్రాంతీయ వివక్షకు గురయ్యారు. ఒకే వంశం, ఒకే వర్ణం నుంచి ఉద్భవించి వ్యవసాయం, పశుపోషణ ఆధారంగా జీవిస్తున్న వారే అందరూ. అయితే జన ఆవాసానికి సమీపంలో నివశిస్తున్నారనే అసత్యాన్ని జోడించి మైదాన ప్రాంతం పేర వలస గిరిజనులనే ముద్ర వేశారు. తద్వారా మరిన్ని అన్యాయాలకు గురిచేస్తున్నారు. తెలంగాణ ప్రాంత అదిమవాసీ లంబాడీలు పూర్వం మొగలాయీలు, బ్రిటిష్ పాలకులు, నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడారు. అయితే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆంధ్రప్రదేశ్ పాలకులకు వ్యతిరేకంగా వారు ఏనాడూ వ్యవహరించలేదు. పెట్టుబడిదారులను వ్యతిరేకించే రాజకీయ నైపుణ్యం వారికి లేదు. తమకు ఏమాత్రం వ్యతిరేకం కానప్పటికీ ఆంధ్రప్రదేశ్ పాలకులు తెలంగాణ ఆదివాసీ లంబాడీలకు అన్యాయమే చేశారు. వీరిని ఆదిమవాసీ గిరిజనులుగా గుర్తించలేదు, గిరిజన సమానత్వం కల్పించలేదు. గెజిట్‌లో వారిని చేర్చలేదు. కేవలం తెలంగాణ ప్రాంత ఆదిమవాసీ లంబాడీ బంజారాలను వలస గిరిజనులుగా గుర్తించారు! ఎందుకీ పక్షపాతం? ఇది సవతితల్లి వైఖరి కాదా? సీమాంధ్ర ప్రాంత పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
ప్రత్యేక తెలంగాణతోనే తమ కష్టనష్టాలు తొలగిపోతాయని తెలంగాణ ఆదిమవాసీ గిరిజనులు భావిస్తున్నారు.
తెలంగాణ ప్రజల దశాబ్దాల పోరాటం ఎట్టకేలకు ఫలించనున్నది. వెయ్యిమంది యువతీయువకులు ఇందుకు బలిదానం చేశారన్న విషయాన్ని తప్పక గుర్తుపెట్టుకోవాలి. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఒక కొత్త చరిత్రకు నాంది కాబోతుంది. చిన్న రాష్ట్రాలతో పరిపాలనా సౌలభ్యం కలగనున్నది. ప్రజలందరికీ సుపరిపాలన సాధ్యమవనున్నది. గ్రామ స్వరాజ్యభావన సార్థకమవనున్నది. ఈ కొత్త తరుణంలో రాబోయే పాలకులు ఆదిమవాసీ లంబాడీలకు తప్పకన్యాయం చేయాలి. వారిని పూర్వ మూల ఆదిమవాసీ గిరిజనులుగా గుర్తించాలి. గిరిజన సమానత్వం కల్పించాలి. గెజిట్‌లో చేర్చాలి. ఐటీడీఏ ప్రాజెక్టును వర్తింప చేయాలి. మౌలిక వసతులు కల్పించి వారి అభ్యున్నతికి బాటలు వేయాలి. ప్రస్తుత రిజర్వేషన్‌ను 15 శాతానికి పెంచాలి. ధేబర్ కమిషన్ నివేదికను అమలు పరచాలి. బ్రిటిష్ పాలకులు, నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన భంగీ-జంగీ, విలాటూ భూక్యా, రెడ్డి నాయక్ రాథోడ్, ధానూనాయక్ జాట్రోట్‌ల విగ్రహాలను తెలంగాణ రాజధాని అంటే హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్‌పై నెలకొల్పాలి. ఈ వీరుల జీవితచరిత్రలను పాఠ్యాంశాలుగా చేర్చి రేపటి పౌరులకు స్ఫూర్తి కల్గించాలి. ప్రభుత్వమే వారి జయంతి, వర్ధంతులను నిర్వహించాలి.
ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ పునర్నిర్మాణంలో ఈ గిరిజనులకు సముచిత స్థానం కల్పించాలి. వారి చరిత్రను గౌరవించాలి.
- దేవసోత్ టీకం రాథోడ్
తెలంగాణ గిరిజన మహాసభ రాష్ట్ర అధ్యక్షులు
 

Andhra Jyothi Telugu News Paper Dated : 13/11/2013 

Wednesday, November 13, 2013

అస్తిత్వం కోసం ఆదివాసీల పోరాటం -మైపతి అరుణ్‌కుమార్


ఆంధ్రవూపదేశ్ రాష్ట్రంలో ఆదివాసీల అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారింది. తినటానికి తిండిలేక కట్టుకోవడానికి బట్టలు లేక, పూట తిండి కోసం ఆరాటపడుతూ దుర్భర జీవనాన్ని గడుపుతున్నారు. నేటికి 92శాతం మంది అడవిపై ఆధారపడుతూ జీవిస్తున్నారు.78 శాతం ఆదివాసీ గ్రామాలకు కరెంటు లేదు. 75 శాతం గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. ప్రతి 1000 మందికి 80 మంది స్త్రీలు ప్రసవ సమయంలో బిడ్డతో సహా మరణిస్తున్నారు. ప్రతియేట మలేరియా, పచ్చకామెర్లు, అతిసార, డెంగ్యూ లాంటి విషజ్వరాలు వచ్చి వేలాదిమంది ఆదివాసీలు చనిపోతున్నారు. అభివృద్ధి పేరుతో శ్రీకాకుళంలో కన్నెధారకొండ గ్రానైట్ తవ్వి, కొండ, అటవీ ఫలసాయంతో జీవించే సవరలను నిర్వాసితులను చేస్తున్నారు. ఎలిఫెంట్ జోన్ పేరిట 30వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ప్రాంతంలో సవర, జాతాపులను అడవికి దూరం చేస్తున్నారు. విశాఖ మన్యంలో ఎనిమిది వేల హెక్టార్లలో బాక్సైట్ తవ్వకాలతో 274 కోందు గూడాలను ఛిద్రం చేస్తున్నా రు. జోలాఫుట్ డ్యాం కింద, బలిమెల రిజర్వాయర్ కింద నిర్వాసితులైన కోందులు, పోర్జలు, నూకదొరలు నిర్వాసితులై చెట్టు కొకరు, పుట్టకొకరుగా చెలా చెదురయ్యారు. సీలేరు డ్యాం క్రింద నిర్వాసితులైన ఆదివాసీలకు నష్టపరిహారం లేదు.

కానీ,దాని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును బయటి ప్రాంతాలకు పంపుతున్నారు. కేటీపీఎస్ (పాల్వంచ), బీపీఎల్.(భవూదాచలం), ఎ.పి. రేయాన్స్ (కమలాపురం), భారజల కర్మాగారం (మణుగూరు), దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ (మంచిర్యాల) లాంటి పరివూశమలు పెట్టి, దాని నుంచి వచ్చే బూడిదను ఆదివాసీల బతుకుల్లో నిం పుతున్నారు. దాని నుంచి వచ్చే కోట్లాది రూపాయల లబ్ధి పొందుతున్నారు. ఉద్యోగాలను సైతం ఐదవ షెడ్యూల్‌ను ఉల్లంఘించి బయటి ప్రాంతాల వారితో భర్తీ చేస్తున్నారు. టైగర్‌జోన్ పేరుతో 244 గోండు, కోలామ్, పర్ధాన్ గూడాలను ఖాళీ చేయిస్తున్నారు. కుంటాల జలవిద్యుత్ ప్రాజెక్టు పేరుతో గోండుల సాంసృ్కతిక సాంప్రదాయాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. ఓపెన్ కాస్టుల పేరిట బొగ్గును వెలికితీసి ఆదివాసీలను నిర్వాసితులను చేస్తున్నారు.

ఆదివాసీల సాంసృ్కతిక సాంప్రదాయాలు క్రైస్తవ, హిందు మతాల ప్రభావంవల్ల విచ్ఛిన్నం అవుతున్నవి. ఆదివాసుల అభివృద్ధి కోసం ఏర్పా టు చేసిన సమగ్ర గిరిజన అభివృద్ది సంస్థ (ఐటీడీఏ)లు అవినీతికి నిలయాలుగా మారిపోయాయి. కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. అత్యాచార నిరోధక చట్టం ఉన్నప్పటికి వాకపల్లి, భల్లుగూడ లాంటి అత్యాచారాలు ఆదివాసీలపై హింసకు తార్కాణాలు.

1/70 చట్టం అమలులో ఉన్నా 48 శాతం భూములు గిరిజనేతరుల చేతుల్లో ఉండటంతో, స్వంత భూమిలో ఆదివాసీలు కూలీలుగా మారుతున్నారు. 2006 అటవీ హక్కు చట్టం గిరిజనేతరులకు చుట్టంగా మారింది. దీంతో 30 ఆదివాసీ తెగలు అంతరించే స్థితికి చేరుకున్నాయి. 1950లో 30 ఆదిమ తెగలకు కల్పించిన రిజర్వేషన్ 4 శాతం.1976లో డినోటిఫైడ్‌గా లంబాడా, ఎరుకల, యానాదిలను ఎస్టీల్లో కలిపినపుడు రెండుశాతం రిజర్వేషన్‌ను పెంచి మొత్తం ఆరుశాతం చేశారు. కాని, మొత్తం రిజర్వేషన్లను కలుపబడిన లంబాడా, ఎరుకల, యానాదులే అనుభవిస్తున్నారు. అం దుకే మొదటగా ఉన్న 4 శాతం రిజర్వేషన్‌ను ఆదివాసీలకు కేటాయించి, తర్వాత కలిపిన రెండుశాతం రిజర్వేషన్‌ను మూడు కులాలకు వర్తింపచేయాలి.

ఆంధ్రవూపదేశ్ ఏర్పడి ఐదున్నర దశాబ్దాలు అయినా, నేటికి తెలుగురాని సవర, గోం డు, కోలాం, కోందు గూడాలున్నాయి. ఐదవ షెడ్యూల్, పీసా చట్టం 4(ఓ) క్లాజు ప్రకారం ఆదివాసీ ప్రాంతాలను షెడ్యూల్డ్ ఆదివాసి జిల్లాలుగా ఉట్నూరు, ఆసిఫాబాద్ (ఆదిలాబాద్), మహదేవ్‌పూర్ (కరీంనగర్), ఏటూరునాగారం (వరంగల్), భద్రాచలం (ఖమ్మం),రంపచోడవరం (తూర్పు గోదావరి), పాడేరు (విశాఖపట్నం), కోట రాంచంవూదాపురం (పశ్చిమ గోదావరి),పార్వతిపురం (విజయనగరం), సీతంపేట (శ్రీకాకుళం) లాంటి ప్రాంతాల్లో పరిపాలన వ్యవస్థ ఆదివాసీల మాతృభాషలోనే అమలు చేయాలి. దీంతో పాటు రాజ్యాం గంలోని 5వ షెడ్యూల్ 3వ భాగం క్లాజ్ (3) ప్రకారం కొత్తగా రాష్ట్రాలు ఏర్పడే క్రమంలో నాన్ షెడ్యూల్డ్ గ్రామాలు షెడ్యూల్డ్ గ్రామాల జాబితాలో చేర్చాలి. దీని ప్రకారం 805 నాన్ షెడ్యూల్డ్ గ్రామాలు షెడ్యూల్డ్ గ్రామాలుగా ఏర్పాటుచేసి నూతనంగా విభజించబడే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో అటానమస్ కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలి. లేదంటే నూతన రాష్ట్రాల అభివృద్ధి విధానంలో ఆదివాసీ ప్రాంతాలు విధ్వంసానికి గురయ్యే ప్రమాదం ఉంది. 
-మైపతి అరుణ్‌కుమార్
ఆదివాసీ రచయితల సంఘం
(నేడు ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివాసీ విద్యార్ధి
సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బహిరంగ సభ సందర్భంగా)

Namasete Telangana Telugu News Paper Dated : 14/11/2013 

Sunday, October 20, 2013

అస్తిత్వం కోసమే ఆదివాసీ పోరాటాలు By -ఆత్రం నవీన్ ఆదివాసీల హక్కుల వేదిక


భూమి, అడవి, నీటిపై సంపూర్ణ హక్కులు కావాలని అనాది నుంచీ ఆదివాసు లు పోరాటం చేస్తున్నారు.అణచివేతకు గురవుతున్నారు. విశాల భారత దేశంలో ఆదివాసులు మొదటి నుంచి స్వయం పాలన కోసం పోరాడుతూనే ఉన్నారు. అతి పెద్ద రాజ్యాంగంగా చెలామణి అయిన గోండ్వానా రాజ్యా న్ని ఆదివాసులు పాలించారు. దక్షిణ భారత దేశం సరిహద్దు భూభాగంలో మధ్య భారతంలో అతిపెద్ద రాజ్యంగా గోండ్వానా రాజ్యం విస్తరించి ఆదివాసుల పరిపాలన కొనసాగేది. మొగలు సామ్రాజ్యం ఉత్తర భారతం మొత్తం విస్తరించినా దక్షిణ భారతంలో విస్తరించకుండా పోరాడిన యోధులు ఆదివాసులు. ఆదివాసీయేతర సమాజం ముఖ్యంగా ఆర్యుల నుంచి మొగలాయిలు, బ్రిటిషువారి నుంచి నేటి పాలకుల వరకు వలస, సామ్రాజ్యవాద చొరబాట్లు దోపిడీ, అణచివేతల కారణం గా నిరంతరం ఆదివాసుల పోరాటాలు కొనసాగాయి.

మరాఠాలు, రాజపు త్రులు, కాకతీయులుతో జరిగిన పొరాటంలో కొంత భూభాగాన్ని ఆదివాసులు కోల్పోయారు. కాకతీయుల పరిపాలనలో ప్రసిద్ధుడు రుద్రదేవుడు (మొదటి ప్రతాపరువూదుడు) కీ.శ.1158-1195) కూడా ఇప్పడి వరంగల్‌లో ఉన్న మేడారం పరిస ర ప్రాంతాలన్నీ పరిపాలిస్తున్న మేడరాజును ఓడించి తను ఎదుర్కొన్న ప్రథమ శత్రువు మేడారాజు పేరును హనుమకొండ వేయిస్థంబాలగుడి శాసనంలో రాయించాడు. నేడు ‘మేడారం’గా ప్రసిద్ది చెందిన సమ్మక్క సారలమ్మల పోరాటం కూడా ఆదివాసీలకు రాజ్యాధికారం కోసం అన్నది జగమెరిగిన సత్యం.దాదాపు 500 ఏళ్ల మహారాష్ట్ర, మధ్యవూపదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా,ఆంధ్రవూపదేశ్‌లోలలోని భూభాగాలలో ‘గోండ్వానా’ రాజ్యంగా ఆదివాసులపాలన కొనసాగింది. క్రీ.శ.1240-1750 వరకు వివిధ ఆదివాసీ గోండు రాజులు పాలించారు.‘గోండ్వానా’ను ఆక్రమించదలచిన అక్బర్ 1564లో అసఫ్‌ఖాన్ నాయకత్వంలో సైన్యాన్ని అక్కడకు తరలించాడు.అప్పటికి గోండ్వానాను వీర నారాయణ తరుపున రాణి దుర్గావతి పరిపాలిస్తుంది.
ddr91


దుర్గావతి మొగలుల సైన్యాన్ని వీరోచితంగా ప్రతిఘటించింది. విజయావకాశాలు లేవని తెలుసుకున్న దుర్గావతి ఆత్మాహుతి చేసుకుంది. 
భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమాలకు కొన్ని దశాబ్దాలకు పూర్వమే ఆదివాసులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. బ్రిటిష్ పాలనను ఆదివాసీయేతర సమాజం ఆహ్వానించినా ఆదివాసులు మాత్రం ప్రతిఘటించారు. ఎక్కడ ఎదురుకాని వ్యతిరేకత మనదేశంలోనే ఆదివాసీల పోరాటంతో వారికి అనుభవంలోకి వచ్చింది. క్రీ.శ.1874లోనే బ్రిటీషు ప్రభుత్వం ఆదివాసుల పోరాటాన్ని నిరోధించేందుకు సంస్కరణలు తీసుకువచ్చింది. ఆదివాసులు ఎక్కవగా నివసిస్తున్న ప్రాం తాలను ప్రత్యేక ప్రాంతాలుగా ప్రకటించింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వరరామచంవూదపురం నందు అంబుల్‌రెడ్డి నాయకత్వంలో గొడ్డలిపై పన్ను విధించిన బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఇప్పటి విశాఖ, గంజాం జిల్లాల్లో గల ఆదివాసులు తమ ప్రాంతంలోకి బ్రిటిష్ పాలన ప్రవేశించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ పాలకులు ఆదివాసీ పోడు వ్యవసాయంపై నిషేధం విధిస్తూ మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ 1882 తీసుకువచ్చి ఆదివాసీలపై ఆంక్షలు విధించారు. 1917ఆగస్టు 14న బ్రిటీషు ప్రభుత్వం ఇప్పుడు షెడ్యుల్డ్ ప్రాంతాలుగా పిలువబడుతున్న ఏజన్సీ ఏరియాలో భూ నిబంధన క్రమబద్ధీకరణ చట్టం (ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్) 1917ను తీసుకురావడం జరిగింది. ఆదివాసీయేతరుల నుంచి రక్షణగా ఈ చట్టం ఆదివాసులకు ఉంటుంది అని భావించింది. ఈ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో ప్రత్యేక కోర్టులను స్థాపించి ఆదివాసీ, ఆదివాసీయేతరులకు మధ్య భూ బదలాయింపు జరగాలంటే ఏజెంట్ టు గవర్నమెంట్ అనుమతి తప్పనిసరి చేసింది. నిజాం ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రాంతంలో గల ఆదివాసులపై ఆంక్షలు నిర్భంధాన్ని ఆదివాసులు తీవ్రంగా వ్యతిరేకించారు.

కొమురం భీం నాయకత్వంలో ఆదివాసులు రాజ్యాధికారం కోసం ఉద్యమించారు.ఆదివాసుల స్వాధీనంలో ఉన్న భూములకు వారికే హక్కు కల్పిస్తామన్నా తమకు సంపూర్ణ రాజ్యాధికారం కావాలని నిజాం ప్రభుత్వంపై ‘లడాయి’ చేయటానికే సంసిద్దులయ్యారు. కొమురంభీం పోరాటంతో నిజాం ప్రభువు వారి పోరాటాన్ని గుర్తించి ఇంగ్లాండ్ దేశస్తుడు ప్రముఖ ఆంత్రోపాలజిస్ట్ హైమండార్ఫ్‌ను ఆహ్వానించి నివేదిక సమర్పించమని ఆదేశించాడు. హైమండార్ఫ్ సిఫారసులను అనుసరించి నిజాం ప్రభుత్వం ‘హైదరాబాద్ ట్రైబల్ యాక్ట్ 1949’ని తీసుకువచ్చింది. ఇది బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన ‘భూ నిబంధన చట్టం 1917’ లాంటిది. హైమండార్ఫ్ అప్పటి తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఇప్పటి ఆంధ్ర ప్రాంతంలో గల ఆదివాసులు నివసిస్తున్న షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పర్యటించి ఆదివాసులు ప్రాంతాలుగా వేరైనా, భావాలు ఒక్కటిగానే ఉన్నాయి, వారి పోరాటం ఎక్కడైనా మనుగడ, రాజ్యాధికారం కోసమేనని వ్యాఖ్యానించారు. 


స్వాతంత్య్రానంతరం ఆదివాసుల జీవితాలు ‘పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డట్టు’ తయారైంది. దీనికి పాలకులు, వారు అవలంబిస్తున్న విధానాలే కారణం. ఆదివాసీ ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్న ఖనిజ సంపదను అటవీ సంపదను నీళ్ళను సంపన్నవర్గాలకు వనరులను ధారాదత్తం చేసి ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్నాయి. రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు అలాగే సరిహద్దున గల మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిషాలో ఆదివాసీలున్న ప్రాంతంలో అటవీ, ఖనిజ సంపద పుష్కలంగా ఉంది. భారీనీటి ప్రాజెక్టుల కోసం కావాల్సిన గోదావరి, శబరి, మున్నేరు, ప్రాణహిత, కిన్నెరసాని, లాంటి నదులున్నాయి. వీటిని నమ్ముకొని తరతరాలుగా ఆదివాసులు జీవనం సాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల్లో వందలాది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. లక్షలాది మంది ఆదివాసులు నిర్వాసితులవుతున్నారు.జాతీయ అవసరాల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు బొగ్గు నిక్షేపాలను వెలికితీసే కార్యవూకమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నాయి. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కొత్తగా ఓపెన్‌కాస్ట్‌ల పేరుతో ఆది వాసులను నిర్వాసితులను చేస్తున్నారు.అభయారణ్యం, టైగర్ జోన్, మైనింగ్ పేర్లతో ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ ఖమ్మం జిల్లాలో వరరామచంవూదపురం,చింతూరు, వరంగల్ జిల్లాలో తాడ్వాయి, ఏటూరునాగారం, విశాఖ జిల్లాలో పాడేరు, ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో వేలాది గ్రామాల ఆదివాసులు నిర్వాసితులవుతున్నారు.


రాజ్యాంగంలో 5వ, 6వ షెడ్యూళ్ళు ఆదివాసులకు రక్షణగా రూపొందా యి. ఆదివాసుల స్వయం పరిపాలన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ‘పెసా’ చట్టాన్ని 1996లో రూపొందించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం 1998లో చట్టబద్ధత చేసి గ్రామసభలకే సర్వాధికారం అన్నాయి. రాజ్యాం గ అధికరణ 244 కింద ఉదహరించబడిన ఆదివాసుల రక్షణ నియమాల వంటి చట్టాలను పాలకులు ఉల్లంఘిస్తూ ఆదివాసులను బలి చేస్తున్నారు.
ఆదివాసులు రక్షణ,భద్రత కరువై అల్పసంఖ్యాకులుగా మారుతూ సంస్కృతిని, భాషను కోల్పోయి అస్తిత్వాన్నే కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోంచే ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు సరిహద్దున గల మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిషాలోని ఆదివాసుల ప్రాంతాలను కలుపుకొని ఆదివాసులకు ‘గోండ్వానా రాష్ట్రం’ కావాలని డిమాండ్ చేస్తున్నా రు. వారికి కేటాయించిన షెడ్యూల్డ్ ప్రాంతాలల్లో రాజ్యాధికారం కలిగి ఉండటం ద్వారా మాత్ర మే వారి సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 29 (1) (ఆర్టికల్ 29 (1))ని అనుసరించి భారత భూభాగంలో ఏదో ఒక ప్రదేశంలో నివసిస్తున్న కొందరు ప్రజలు ఒక విలక్షణమైన భాషను గాని,లిపిని గాని లేక సంస్కృతిని గానీ కలిగి ఉన్నట్లయితే వారు ఆ భాష, లిపి, సంసృ్కతిని పరిరక్షించుకునే హక్కును కలిగి ఉంటారు. ఆదివాసులు ప్రత్యేకమైన భాషను కలిగియున్నారు. వీరి సం సృ్కతి సంప్రదాయాలు ఆదివాసీయేతర సమాజంతో పోల్చితే ప్రత్యేకమైనది, వీరి జీవన శైలి విభిన్నమైన ది. వాటిని కాపాడుకోవడం భారత రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన హక్కు.ఆదివాసీ ప్రజల కోసం భూమి కోసం విముక్తి కోసం పోరాటానికి సిద్ధమవు తున్నారు.

-ఆత్రం నవీన్ ఆదివాసీల హక్కుల వేదిక, లీగల్‌సెల్ కన్వీనర్

Namasete Telangana Telugu News Paper Dated: 20/10/2013 

Thursday, October 10, 2013

గిరిజనులు-అడవులు-గ్రామసభ By -బి తులసీదాస్‌


Posted on: Fri 11 Oct 00:11:20.133729 2013

    అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు, సంప్రదాయ అటవీవాసులకు గల ఆచారాలు (కస్టమరీ), మత విశ్వాసాల (రెలిజియస్‌) హక్కులను కాపాడేది గ్రామసభేనని సుప్రీం పునరుద్ఘాటించింది. లాంజగిరి పర్వతశ్రేణిలోని రాయగడ, కలహండి జిల్లాల్లో బాక్సైట్‌ మైనింగ్‌ వల్ల ప్రభావితమయ్యే గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి వారి అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. మూడు నెలల్లోగా గ్రామసభలు పూర్తి చేయాలని, అవి జిల్లా న్యాయమూర్తి స్థాయి తగ్గని న్యాయాధికారి సమక్షంలో జరగాలని ఆదేశించింది.
గిరిజనులకు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించేవారికి అడవే జీవనాధారం. అడవిపై వారికి హక్కులు కల్పిస్తూ అటవీ హక్కుల చట్టం (2006) ఉంది. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా రాజ్యాంగ రక్షణ, రాష్ట్ర చట్టాలున్నాయి. వాటి ఆధారంగానే సమతా కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. పౌర పాలనకు సంబంధించి షెడ్యూల్డు ప్రాంత పంచాయతీరాజ్‌ (పీసా) చట్టం గ్రామసభకు విశేషాధికారాలనిచ్చింది. ఇలాటి చట్టాలు, సుప్రీం తీర్పులూ ఉన్నాగాని గిరిజనులకు తగిన రక్షణ కలగడం లేదన్నది వాస్తవ అనుభవం. ఒడిశాలోని నియమగిరి కొండల్లో బాక్సైట్‌ మైనింగ్‌కు తెగబడ్డ వేదాంత కంపెనీకి ముకుతాడు వేసే మంచి తీర్పును ఏప్రిల్‌ 18న సుప్రీంకోర్టు ఇచ్చింది. గిరిజనుల సామూహిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితంలో గ్రామసభ ప్రాధాన్యతను, విస్తృతిని ఆ తీర్పు స్పష్టంగా పేర్కొంది. అలాగే వన సంరక్షణ సమితుల (విఎస్‌ఎస్‌)కు సామూహిక అటవీహక్కులను దఖలు పరచడం చెల్లదని స్పష్టం చేస్తూ కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మన రాష్ట్ర అటవీశాఖకు ఆగస్టులో ఒక ఉత్తర్వు నిచ్చింది. ప్రత్యక్షంగా తొమ్మిది లక్షల ఎకరాల అడవులకు సంబంధించినదే గాక సామూహిక హక్కును పరోక్షంగా అటవీశాఖ పొంద డానికి వీలులేదన్న విస్తృత అన్వయం కలిగిన ఉత్తర్వు అది. అడవి, అటవీ హక్కులు, గిరిజనుల జీవితం, గ్రామసభలతో ముడిబడిన ఈ ఉత్తర్వు, సుప్రీం తాజా తీర్పు ప్రజోపయోగమైనవి. వాటిలోని కొన్ని వివరాలు, విశిష్టత, పర్యవసానాలూ పరిశీలించదగినవి.
విఎస్‌ఎస్‌లకు సామూహిక అటవీ హక్కు ఇవ్వరాదు
గిరిజనులకు, సాంప్రదాయక అటవీవాసులకు అడవిపై వ్యక్తిగత అనుభవ హక్కులను అటవీ హక్కుల చట్టం కల్పిస్తోంది. అలాగే ఉమ్మడి ప్రయోజనం కోసం ఉపయోగించే భాగంపై సామూహిక అటవీ హక్కును ఆ గ్రామస్తులకు కల్పిస్తుంది. 2009 జులై 21న నాటి ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ హక్కుల కమిటీ విఎస్‌ఎస్‌లకు అటవీ భూమిని కట్టబెడుతూ నిర్ణయించింది. అంటే గిరిజనులు, సంప్రదాయ అటవీవాసులకు ఉమ్మడిగా లభించవలసిన సామూహిక హక్కును అటవీశాఖ చేజిక్కించుకోవడమే. పేరుకు విఎస్‌ఎస్‌లే అయినా పెత్తనమంతా అటవీశాఖ చేస్తోందని, సామూహిక అటవీ హక్కును విఎస్‌ఎస్‌లకు కాకుండా స్థానిక ప్రజలకే కల్పించాలని గిరిజన సంఘం తదితర సంస్థలు చాలా కాలంగా పోరాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. గత ఏడాది విశాఖ జిల్లాలో వెదురు ఉత్పత్తులపై హక్కుల విషయం తెర మీదకు రాగా తప్పనిసరై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖను వివరణ కోరింది. అటవీహక్కుల చట్టం సెక్షన్‌ 3(1)(ఐ) ప్రకారం విఎస్‌ఎస్‌లకు సామూహిక అటవీ హక్కును పొందడానికి అర్హతలేదని 2013 ఆగస్టు ఆరున కేంద్రం ఇచ్చిన వివరణలో స్పష్టంగా పేర్కొంది. ఇప్పటికే విఎస్‌ఎస్‌లకు మంజూరు చేసిన సామూహిక అటవీ హక్కు పత్రాలను ఉపసంహరించాలని కూడా గిరిజన సంక్షేమ శాఖ ఆదేశించింది.
పర్యవసానాలు ఎలా ఉంటాయి?
కేంద్ర ఉత్తర్వుతో రాష్ట్రమంతటా గల సుమారు రెండు వేల విఎస్‌ఎస్‌ల నుంచి అంటే అటవీ శాఖ అజమాయిషీ పోయి స్థానిక ప్రజలకు తొమ్మిది లక్షల ఎకరాల అటవీ భూమిపై సామూహిక హక్కు దఖలు పరచాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 9,50,301 ఎకరాల కోసం 3,23,765 వ్యక్తిగత దరఖాస్తులు రాగా వాటిలో కేవలం 1,65,691 కుటుంబాలకు 4,72,016 ఎకరాలకు మాత్రమే అటవీ హక్కు పత్రాలు ఇచ్చారు. అంటే ఇంకా 4,84,630 ఎకరాలకు ఇవ్వలేదు. ఇచ్చిన దాని కంటే తిరస్కరించినదే ఎక్కువన్నమాట. అదే సామూహిక దరఖాస్తుల విషయానికొస్తే 10,16,307 ఎకరాల కోసం దరఖాస్తులు రాగా 9,79,207 ఎకరాలను దఖలుపరిచారు. సామూహిక హక్కులు పొందినవి విఎస్‌ఎస్‌లే కావడం గమనార్హం. కుటుంబానికి పదెకరాల చొప్పున 25 లక్షల ఎకరాల అటవీ భూమినిస్తాం అంటూ నాటి సిఎం ఆర్భాటంగా ప్రచారం చేశారు. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 1,65,691 కుటుంబాలకు 4,72,016 ఎకరాలిచ్చారు. అంటే సగటున కుటుంబానికి మూడెకరాలు కూడా దక్కలేదు. అదే విఎస్‌ఎస్‌లు చూస్తే సగటున ఒక్కో దానికి నాలుగు వేల ఎకరాల పైబడి దఖలుపడింది. అటవీ హక్కుల చట్టం అమలు చేశామని చెబుతూనే సర్కారు విఎస్‌ఎస్‌ల మాటున విస్తార ప్రాంతాలను అటవీశాఖ అజమాయిషీలోనే ఉంచుకుంది. కేంద్ర గిరిజన శాఖ తాజా ఉత్తర్వు మూలంగా రాష్ట్ర అటవీశాఖ పెత్తనం ఆ మేరకు తగ్గాల్సి ఉంటుంది. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామ సభలను జరిపి సామూహిక అటవీ హక్కులను వాటికే దఖలు పరిచేలా చర్యలు చేపట్టాలి. కానీ ప్రభుత్వం అలా చేస్తుందా అన్నదే అనుమానం. ప్రతిష్టాత్మకమైన పీసా చట్టాన్ని కేంద్రం 1996లో తీసుకురాగా రాష్ట్ర చట్టం 1998లో వచ్చింది. దాని అమలు కోసం నిబంధనలను 2011 మార్చిలో వెలవడ్డాయి. అందుకు కీలకమైన షెడ్యూల్డ్‌ గ్రామాలను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ ప్రకటించవలసి (నోటిఫై) ఉండగా ఇప్పటికీ ఆ పని చేయలేదు. అంటే చట్టం, నిబంధనలు ఉన్నా గ్రామసభకు పూర్తిస్థాయి చట్టబద్ధత చేకూరలేదు. గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అది. ఇక సాక్షాత్తూ అటవీశాఖ పెత్తనంలోని భూమిని గ్రామసభలకు దఖలు పరచడానికి ప్రభుత్వం అంత త్వరగా చర్యలు చేపడుతుందని భావించడం కష్టం. బలమైన ప్రజా ఉద్యమం సాగితేనే కొంతైనా కదులుతుంది.
'వేదాంత'పై సుప్రీం తీర్పు
ఒడిశాలోని రాయగడ, కలహండి జిల్లాల్లో బాక్సైట్‌ మైనింగ్‌ కోసం వేదాంత అల్యూమినా లిమిటెడ్‌ గత పదేళ్లకు పైగా తంటాలు పడుతోంది. ఒకవైపు అడవులు, గుట్టలను ఆక్రమిస్తూనే మరోవైపు అనుమతుల కోసం దరఖాస్తులు చేస్తూనే ఉంది. పదేపదే అటవీ, పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. వాటిపై సుప్రీంకోర్టుతో సహా న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. ఇందులో 660.749 హెక్టార్ల అటవీ భూమి విషయమై సుప్రీం కోర్టు గత ఏప్రిల్‌ 18న ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. గ్రామసభకున్న హక్కులను పునరుద్ఘాటించి వాటికి పెద్దపీట వేయడంలో ఈ తీర్పు ఓ మైలురాయి. బాక్సైట్‌ మైనింగ్‌ చేపట్టనున్న లాంజగిరి ప్రాంతంలో ఇతర తెగలతోపాటు ఆదిమ గిరిజన తెగలైన (పిటిజి) డొంగారియా ఖోంద్‌లు, కుటియా ఖోంద్‌లు నివసిస్తున్నారు. బాక్సైట్‌ మైనింగ్‌ చేపడితే అక్కడి అటవీ సంపదకు, పర్యావరణానికి నష్టం కలగడమే గాక స్థానిక గిరిజనులు కొలిచే నియమరాజ ఆలయ ప్రాంతానికి నష్టం కలుగుతుందని సుప్రీంకోర్టులో వచ్చిన వాదుల వాదన సారాంశం. ఉభయ పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు గిరిజనులకు నియమరాజను కొలిచేందుకు గల హక్కును తప్పక సంరక్షించాలని, దాన్ని పరిరక్షించాలని (పేరా 55) తీర్పులో పేర్కొంది. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు, సంప్రదాయ అటవీవాసులకు గల ఆచారాలు (కస్టమరీ), మత విశ్వాసాల (రెలిజియస్‌) హక్కులను కాపాడేది గ్రామసభేనని సుప్రీం పునరుద్ఘాటించింది. లాంజగిరి పర్వతశ్రేణిలోని రాయగడ, కలహండి జిల్లాల్లో బాక్సైట్‌ మైనింగ్‌ వల్ల ప్రభావితమయ్యే గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి వారి అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. మూడు నెలల్లోగా గ్రామసభలు పూర్తి చేయాలని, అవి జిల్లా న్యాయమూర్తి స్థాయి తగ్గని న్యాయాధికారి సమక్షంలో జరగాలని ఆదేశించింది. నియమరాజను కొలిచే విషయమై పేర్కొన్నప్పటికీ సారాంశంలో గిరిజనుల గ్రామసభకు సర్వాధికారాలను పునరుద్ఘాటించడం ఈ తీర్పు విశిష్టత.
ససేమిరా అన్న గ్రామసభలు
సుప్రీం ఆదేశం మేరకు 12 ఆవాసాల్లో గ్రామసభలను నిర్వహించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మొదటి గ్రామసభ జులై 18న రాయగడ జిల్లా సెర్కపల్లి గ్రామంలో జిల్లా న్యాయమూర్తి శరత్‌చంద్ర మిశ్రా సమక్షంలో జరిగింది. ఆ గ్రామంలోని 46 మందికిగానూ 16 మంది మహిళలతో సహా 36 మంది హాజరై ముక్త కంఠంతో బాక్సైట్‌ మైనింగ్‌ను తిరస్కరించారు. 'మా దేవుడైన నియమరాజ గుండెల్లో బాక్సైట్‌ మైనింగ్‌ను మేమెందుకు అనుమతించాలి' అని వారు ప్రశ్నించారు. ఈ గ్రామసభను పూర్తిగా వీడియోలో చిత్రీకరించారు. రెండవ గ్రామసభ జులై 22న కేసరపడిలో జరగగా, చిట్టచివరి గ్రామసభ జరప గ్రామంలో ఆగస్టు 19న జరిగింది. రాయగడ జిల్లాలో ఏడు, కలహండిలో ఐదు మొత్తం 12 గ్రామసభల్లోనూ ప్రజలు ఏకగ్రీవంగా బాక్సైట్‌ మైనింగ్‌ను తిరస్కరించారు.
సుప్రీం తీర్పుతో జరిగిన గ్రామసభల నిర్ణయం పర్యవసానంగా లాంజగిరిలో వేదాంత బాక్సైట్‌ మైనింగ్‌కు బ్రేక్‌ పడినట్లే. అయితే ఆ తీర్పు ప్రభావంతో మన రాష్ట్రంలో ముఖ్యంగా ఏజన్సీ ప్రాంతాల్లో చేపట్టనున్న అక్రమ మైనింగ్‌ ప్రాజెక్టుల విషయం యోచించాలి. స్థానిక గిరిజనులకు, వారి జీవనోపాధికి, పర్యావరణానికీ కలిగే హాని గురించి లోతుగా పరిశీలించాలి. ఆయా గ్రామసభలకు అన్ని అంశాలనూ వివరించి, వాటి అభిప్రాయం, అభీష్టం మేరకు సర్కారు ముందుకు అడుగేయాలి తప్ప ఏకపక్షంగా వ్యవహరించరాదు. సుప్రీం తాజా తీర్పు నేపథ్యంలో గ్రామసభ ప్రాధాన్యత మరింత పెరిగింది. పీసా చట్టం నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి వీలుగా వెంటనే రాష్ట్రంలో షెడ్యూల్డు ఆవాసాలను గిరిజన సంక్షేమ కమిషనర్‌ ప్రకటించేలా ప్రజా ఉద్యమ ఒత్తిడి పెంచాలి. గ్రామసభను సంపూర్ణంగా చట్టబద్ధం చేయడానికీ, సాధికారత కల్పించడానికీ ఉపక్రమించాలి.

Prajashakti Telugu News Paper Dated: 11/10/2013 

Monday, August 12, 2013

అభివృద్ధిలో ఆగమవుతున్న ఆదివాసీలు By వూకె రామకృష్ణ


దేశానికి స్వాతంత్య్రం వచ్చి 66 ఏళ్లు అవుతున్నప్పటికీ ఆదివాసీలకు ఇప్పటికీ స్వేచ్ఛా స్వాతంవూత్యాలు రాలేదు. పౌరులుగా అందరితో సమానులుగా సమాజంలో అంతర్భాగం కాలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లోనే అనేక ప్రాం తాల్లో ఆదివాసులు తమ మనుగడ కోసం పోరాడుతున్నారు. దేశ జనాభాలో 10 శాతం ఉన్న వీరికి అందుతున్న అభివృద్ధి ఫలాలు మాత్రం సున్నాగానే చెప్పుకోవ చ్చు. కాబట్టి ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్నా వీరు మాత్రం దారివూద్యానికి, ఆకలి చావులకు చిరునామాగానే ఉన్నారు. ఆదివాసుల ఈ దుస్థితి మూలంగానే .. స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలోనే ఆదివాసుల అభివృ ద్ధి కోసం రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారు. ఆదివాసులు నివసిస్తున్న ప్రాంతాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటించి ప్రత్యేక రక్షణలు కల్పించారు. కానీ ఈ హక్కులు, రక్షణలు ఏనాడు అమలుకు నోచుకోలేదు. దీంతో ఆదివాసుల పరిస్థితి నానాటికి దిగజారిపోయింది. 1970 ప్రాంతంలోనే రాష్ట్రంలో పది ఐటీడీఏ ప్రాజెక్టులను నెలకొల్పి ఆదివాసుల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పినప్పటికీ ఆశించి న ఫలితాలు కనిపించడం లేదు 
ఆదివాసీ ప్రాంతాల్లో విస్తారంగా సహజ వనరులు, ఖనిజాలు పుష్కలంగా ఉండ టం వారికి శాపంగా మారింది. ఆ ఖనిజాల తవ్వకాలు, వెలికితీత పేర ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్నారు. అంతేగాకుండా.. ఈ సహజ వనరుల తవ్వకాలను, దేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడంతో ఆ కంపెనీలు ఆదివాసుల నిర్వాసితుల ను చేస్తూ ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నాయి. ఎక్కడైనా సహజవనరులున్న ప్రాంతంలోని స్థానికులకు ఎక్కువ ప్రయోజనాలు చేకూరాలి. కానీ ఆదివాసుల కాళ్లకింద లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఖనిజ వనరులున్నప్పటికీ వారికి ఈ సహజ సంపద ఏమాత్రం ఉపయోగపడటం లేదు. పోగా.. అదే వారికి శాపంగా మారింది. ఈ సహజ వనరులున్న కారణంగానే వారిని వారి నివాస ప్రాంతాల్లోంచి తరిమేసి వనరులను యథేచ్ఛగా తవ్వుకుపోతున్నారు. ఆదివాసులకు రక్షణగా ఉన్న భూ బదలాయింపు చట్టం 1/70 చట్టానికి తూట్లు పొడిచి గిరిజనులను వారి భూములనుంచి తరిమేస్తున్నారు. 

ఆదివాసుల భూములు గిరిజనేతరులకు బదిలీ కావడాన్ని చట్టం వ్యతిరేకిస్తున్నది. కానీ ఇదెన్నడూ అమలుకు నోచుకోలేదు. బినామీ పేర్లతో గిరిజనేతరులు ఆదివాసుల భూములను రకరకాల మోసాలతో కాజేస్తున్నారు. షెడ్యూల్డ్ ప్రాంతంలో స్థానిక ఆదివాసుల అనుమతి లేకుండా వారి భూములను తీసుకోరాదని, ఎలాంటి నిర్మా ణ ్రప్రజెక్టులు నిర్మించరాదని చట్టం చెబుతున్నది. అలాగే వారిని నిర్వాసితులను చేసే ఎలాంటి పనులూ చేపట్టరాదని కూడా రాజ్యాంగం చెబుతున్నది. అయినా మన పాలకులు వీటిని పట్టించుకున్న పాపానపోవడం లేదు. అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో, ఖనిజాల వెలికితీత పేరుతో ఆదివాసులను పెద్ద ఎత్తున నిర్వాసితులను చేస్తున్నారు.ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు ఆదివాసీ లు నివసిస్తున్న భూ భాగాలను ఖనిజ తవ్వకాలకు అప్పజెప్పు తున్నారు. ఇటు ప్రభు త్వ సంస్థలు కూడా ఆదివాసుల జీవితాలను పట్టించుకున్న పాపాన పోవడంలేదు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, సింగరేణి లాంటి ప్రభుత్వ సంస్థలు కూడా చట్టాలను తుంగలో తొక్కి గిరిజనులకు గోరీ కడుతున్నాయి. 

సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే బయ్యారం ఉక్కు, విశాఖ బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టులు ఏరూపంలో ఉన్నా అవన్నీ ఆదివాసులను నిర్వాసితులను చేస్తూ వారిని బలి తీసుకునేవిగానే ఉంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ అభయారణ్య ప్రాజెక్టు, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల్లోని పోలవరం ప్రాజెక్టు, సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లు అన్నీ ఆదివాసులను బలితీసుకుంటున్నవే. ఈ నేపథ్యంలో ఆదివాసులు సంఘటితమై తమ మనుగడ కోసం పోరాటం చేస్తుంటే.. వారిపై ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధకాండకు పూనుకుంటున్నది.మావోయిస్టుల పేరుతో అణచివేతకు పూనుకుంటున్నది. గ్రీన్ హం ట్ ఆపరేషన్ పేరుతో ఆదివాసులపై యుద్ధమే ప్రకటించింది. సీఆర్‌పీఎఫ్, ఐటీబీఎఫ్, ఎస్‌టీఎఫ్, కోబ్రా లాంటి దళాలను ఆదివాసులపై ఎగదోసి పచ్చటి అడవిలో రక్తం పారిస్తున్నారు. ఊళ్లకు ఊళ్లను తగులబెడుతూ.., కనిపించిన ఆదివాసీని హింసిస్తూ, చంపుతూ అడవిలో నరమేధం సృష్టిస్తున్నారు. దీనికి తోడు సల్వాజుడుం, నల్లదండు లాంటి ప్రైవేటు హంతక ముఠాలను సృష్టించి ఆదివాసుల తరఫు న పోరాడుతున్న వారిని హత్యలు చేస్తూ రాజ్యహింసతో భయోత్పాతం కల్పిస్తున్నది ఈ ప్రభుత్వం. 

పారిక్షిశామీకరణ, ప్రపంచీకరణ మొదలైనప్పటి నుంచీ దేశదేశాల్లోని ఆదివాసుల పరిస్థితి మరింత దిగజారుతున్నది. దేశ దేశాల్లో ఆదివాసులను నిర్మూలించే విధానాలను అవలంబిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 70పైగా దేశాల్లో ఐదువేల తెగలకు పైబడి 38 కోట్ల జనాభా కలిగిన ఆదివాసులు కనుమరుగయ్యే పరిస్థితులు దాపురించాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లోని మూలవాసుల భాషా సంస్కృతులు అంతరించిపోయాయి. మరికొన్ని అంతర్ధానమయ్యే పరిస్థితిలో ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఐక్యరాజ్యసమితి 1982లోనే ఆదివాసుల జీవన సంస్కృతులను పరిరక్షించవలసిన అవసరం ఉన్నదని గుర్తించిం ది. పదేళ్లపాటు ఆదివాసుల పై ప్రత్యేక అధ్యయనాలు చేసి వారి జీవన సంస్కృతులు,అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను అన్ని దేశాలు విధిగా తీసుకోవాలని సూచించింది. 

కానీ..దేశ దేశాల్లో బహుళజాతి కనుసన్నల్లో నడుస్తున్న ప్రభుత్వాలు ఆదివాసుల హక్కులను హరిస్తున్నాయి. సహజ వనరుల వెలికితీసే నెపంతో ఆదివాసులను బలి చేస్తున్నాయి. ఆదివాసులను వారి జీవన విధా నాలనుంచి వేరుచేసి సాంస్కృతికంగా విధ్వంసం చేస్తున్నాయి. దేశంలో ఆదివాసులపై దాడులు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. విప్లవోద్యమాలకు అండగా ఉంటున్నారనే నెపంతో ఆదివాసులను వేటాడుతున్నదీ ప్రభుత్వం. వాకపల్లి, బాసగూడ, సర్కెగూడలు సృష్టిస్తూ.. రక్తపు పారిస్తున్నది. కొమురంబీం, బిర్సాముండా, సమ్మక్క, సారక్కల పోరాట వారసత్వంతో ఆదివాసులంతా ఐక్యమై ఉద్యమించాలి. ఆదివాసులపై కత్తిగట్టిన పాలక విధానాలను ఎదిరించాలి. 

-
ఆదివాసీ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి

Wednesday, May 1, 2013

అభివృద్ధి అవస్థల్లో ఆదివాసీలు - కొట్టెం వెంకటేశ్వర్లు



గత 64 సంవత్సరాల్లో షెడ్యూల్డ్ ప్రాంతంలో ఖనిజాలను వెలికితీసిన పారిశ్రామికీకరణ ఆదివాసులకు ఏం అనుభవాల్ని మిగిల్చింది? భూమిని, ఆస్తులను, ఉనికిని, గుర్తింపును కోల్పోయి లక్షలాది మంది ఆదివాసులు బిచ్చగాళ్ళుగా, అనాథలుగా మార్చబడ్డారు. నాగరికులకు అభివృద్ధి, ఆదివాసులకు పీడన మిగిలింది.. తెలంగాణ ప్రాంతంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పడి వారి జీవితాలు బాగుపడాలనీ కోరుకుందాం! 

భారతాంధ్రలో నేడు గనుల రాజకీయం నడుస్తున్నది. బొగ్గు గనుల కుంభకోణంతో కేంద్రంలో యూపీఏ-2 ప్రభుత్వం ప్రతిష్ఠ మసక బారుతోంది. దేశవ్యాప్తంగా 'గాలి' ఘనుల లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దేశ సహజ సంపదను దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించాలనీ భారతదేశ అత్యున్నత న్యాయస్థానాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెంప పెట్టు లాంటి తీర్పులు వెలువరించాయి. అయినా మన పాలకులు తమ బుద్ధిలో ఏమాత్రం మార్పు తెచ్చుకోకుండా ప్రవర్తిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ వైజాగ్ స్టీల్‌కు బయ్యారం గనులు కేటాయించింది ప్రభుత్వం. ఇది రాష్ట్ర గనుల చరిత్రలో కొత్త అధ్యాయం అని ప్రభుత్వం చెబుతోంది. వరంగల్ జిల్లా గూడురులో 2,500 హెక్టార్లు, ఖమ్మం జిల్లా బయ్యారంలో 2,500 హెక్టార్లు, కరీంనగర్ జిల్లా భీమదేవర పల్లిలో 342 హెక్టార్లు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించారు. తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక స్టీల్ ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేస్తామని పాలకులు చెబుతున్నారు. అయినప్పటికీ అక్కడి స్థానిక ఆదివాసీలు అభివృద్ధి రథచక్రాల కింద ఎలా నలిగిపోతున్నారో, ఎలా వారి భూములు అన్యాక్రాంతమవుతున్నాయో, ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఉండాలి. అభివృద్ధి నీడన జరిగే పరిణామాలు వివరించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలకు, పాలకవర్గాలకు తాము చేస్తున్న తప్పిదాలు గుర్తొస్తున్నాయి కాబోలు. అందుకే ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలులోకి తెచ్చిన ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టాన్ని శాసనసభ ఆమోదం పొందిన తర్వాత ప్రప్రథమంగా విశాఖ ఏజెన్సీ గూడెం కొత్తవీధిలో సమగ్ర గిరి ప్రగతి సదస్సును నిర్వహించారు. దానిలో నాతవరం, గూడెం కొత్తవీధి మండలాలకు చెందిన రెండు వన సంరక్షణ సమితి సభ్యులకు అటవీ ఉత్పత్తులపై హక్కు కల్పిస్తూ పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ 'రాజ్యాంగంలోని 244 షెడ్యూల్ ప్రకారం గిరిజన ప్రాంతాలలో ఖనిజ తవ్వకాలకు అనుమతి ఇవ్వమని, రాజ్యాంగ విరుద్ధంగా, అటవీ చట్టాలను ఉల్లంఘించి బాక్సైట్ తవ్వకాల కోసం కుదుర్చుకొన్న ఒప్పందాల్ని రద్దు చేస్తామని, మైనింగ్ కార్యక్రమాల్ని నిలిపివేస్తూ విశాఖ ఏజెన్సీలో మారటోరియం విధిస్తామనీ, తీవ్రవాద నిర్మూలనకు ఇదే మందనీ' ఇద్దరు కేంద్ర మంత్రులు కిశోర్ చంద్రదేవ్, జైరాం రమేష్ సమక్షంలో ప్రకటించారు. పాలకవర్గాల ప్రవర్తన రీత్యా సంభవించే ధోరణుల వల్ల ఆదివాసుల అనుమానాలు పెను భూతాలై మదిలో కలవరపెడుతున్నాయి. 

అందుకు చాలా ఉదాహరణలున్నాయి. భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి రావడంతో బ్రిటీష్ వారు గతంలో ఏజెన్సీ ప్రాంతాలుగా పిలిచిన ప్రాంతాలను రాజ్యాంగ 5వ షెడ్యూల్‌లోని 244వ అధికరణ కిందకు తీసుకువచ్చారు. వాటిని షెడ్యూల్డ్ ప్రాంతాలుగా పిలుస్తున్నారు. భారత రాజ్యాంగం షెడ్యూల్డ్ జాతుల జీవన విధానాన్ని, పరిరక్షణను, అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించటానికి కొన్ని రక్షణ కవచాల్ని ఏర్పాటు చేసింది. 244వ అధికరణ ప్రకారం 5వ షెడ్యూల్‌లో పొందుపరచబడిన నిబంధనలన్నీ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన, నియంత్రణకు సంబంధించినవి. ప్రతి ఏడాది లేదా రాష్ట్రపతి కోరినప్పుడు షెడ్యూల్డ్ ప్రాంత పరిపాలన గురించి గవర్నర్ నివేదిక పంపాల్సి ఉంటుంది. కానీ గవర్నర్ పదవి కీలు బొమ్మగా మారటంతో ఇప్పటివరకు ఏ గవర్నరూ షెడ్యూల్డ్ ప్రాంతాల పాలన, నియంత్రణ గురించి స్పందించిన దాఖలాలు లేవు. ఎలాంటి అభివృద్ధి నివేదికలు, సిఫార్సులు లేకపోవడంతో ఆదివాసుల బతుకులు గాలిలో పెట్టిన దీపంగా అగమ్యగోచరంగా తయారయ్యాయి.

రాష్ట్రంలో గిరిజన సంక్షేమం కోసం, వారి పురోభివృద్ధికి సంబంధించి సలహాలు ఇచ్చేందుకు రాష్ట్ర గిరిజన శాసనసభ్యులతో కూడిన గిరిజన సలహా మండలి (ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ) ఏర్పడాలి. కానీ రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితి, రాజకీయ పరిపక్వత లేమి కారణంగా ఇరవై మందికి పై చిలుకు గిరిజన ఎమ్మెల్యేలున్నా మండలి సమావేశం ఏనాడూ సఫలం కాలేదు.

షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజన భూముల బదలాయింపును నిషేధించటానికి లేదా నిరోధించటానికి, వడ్డీ వ్యాపారానికి సంబంధించిన నియమ నిబంధనల్ని గవర్నర్ ప్రవేశపెట్టవచ్చు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో మంచి పాలన, శాంతి ఒనగూర్చేందుకు తగిన నిబంధనల్ని చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. అలాగే షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తింపజేయడానికి పార్లమెంట్ లేదా శాసనసభ చేసిన చట్టాలను గవర్నర్ సవరించవచ్చును లేదా రద్దు చేయవచ్చును. ఇటువంటి చర్యలకు పూనుకొన్నప్పటికీ గిరిజన సలహా మండలి సలహా పొందాలి. గవర్నర్ రూపొందించిన నిబంధనలు రాష్ట్రపతి అనుమతి పొందిన తర్వాత షెడ్యూల్డ్ ప్రాంత చట్టాలుగా అమలులోకి వస్తాయి. రాష్ట్రంలో ఏ ప్రాంతాన్నైనా షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించే అధికారం 244వ అధికరణ కింద రాష్ట్రపతికి ఉంటుంది. కానీ భారతాంధ్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వలన మన రాష్ట్రంలో 828 గ్రామాలు షెడ్యూల్డ్ హోదాకు నోచుకోలేక అభివృద్ధిలో కుంటుపడిపోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కొత్తగా షెడ్యూల్డ్ గ్రామాల జాబితా వచ్చినప్పటికీ మన రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ అమలుకు నోచుకోకపోవడం దారుణం.

ఒకవైపు రాజ్యాంగ 5వ షెడ్యూల్డ్ సవరణకు ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. గిరిజన భూమి హక్కుల పరిరక్షణకు రూపొందించబడిన నిబంధనల్ని రద్దు చేయాలని, గిరిజనేతర భూస్వాముల ఒత్తిడితో ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తోంది. వాటిని ఆదివాసులు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. అయితే ప్రపంచీకరణ, నూతన సరళీకరణ విధానాలు బలంగా అమలు చేయడంతో విదేశీ కంపెనీలకు, బహుళజాతి కంపెనీలకు ధారాదత్తం చేయాలని పాలకులు చూస్తున్నారు. అందుకే సుప్రీం కోర్టు ఆదివాసులకు అండగా నిలిచి ప్రభుత్వాన్ని కూడా గిరిజనేతరులుగా భావించడంతో ప్రభుత్వాల షెడ్యూల్డ్ ప్రాంత వనరుల అన్యాక్రాంత ప్రయత్నాలకు విఘాతం ఏర్పడింది. నాల్కో, బాల్కో, బిలాయి, రూర్కెలా, ధన్‌బాద్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఆదివాసుల జీవితాలు అణగారిపోయాయి. దీన్నిబట్టి తేలేదేమిటంటే 5వ షెడ్యూల్ సవరణ ప్రతిపాదన బహుళజాతి కంపెనీలకు ఆదివాసీ ప్రాంతాల్ని కట్టబెట్టే ప్రయత్నమే. 5వ షెడ్యూల్డ్ చట్టం సవరించబోమని ఒకముఖ్యమంత్రి ప్రకటిస్తారు. మరొకవైపు దేశ క్యాబినెట్ ముందు అదే ముఖ్యమంత్రి 5వ షెడ్యూల్ సవరణకు కావలసిన సిఫార్సులను కేంద్రానికి అధికారికంగా అందజేస్తారు. దీని పరమార్థం పాలకవర్గాలకు తెలుసు.

గత 64 సంవత్సరాల్లో షెడ్యూల్డ్ ప్రాంతంలో ఖనిజాలను వెలికితీసిన పారిశ్రామికీకరణ ఆదివాసులకు ఏం అనుభవాల్ని మిగిల్చింది? భూమిని, ఆస్తులను, ఉనికిని, గుర్తింపును కోల్పోయి లక్షలాది మంది ఆదివాసులు బిచ్చగాళ్ళుగా, అనాథలుగా మార్చబడ్డారు. నాగరికులకు అభివృద్ధి, ఆదివాసులకు పీడన మిగిలింది. ఉద్యోగాలు మైదాన ప్రాంతం వారికి లభిస్తే ఆదివాసులకు నిరాశే మిగిలింది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ స్థానిక ప్రజలను విస్మరించే చర్యలను చేపట్టడం తక్షణం విరమించుకోవాలి. ఆదివాసులకు ఆధునిక సామాజిక స్థాయి వచ్చేదాకా ప్రభుత్వమే 5వ షెడ్యూల్డ్ విషయంలో క్రియాశీలక పాత్ర పోషించాలి. తెలంగాణ ప్రాంతంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పడి వారి జీవితాలు బాగుపడాలనీ కోరుకుందాం!

- కొట్టెం వెంకటేశ్వర్లు
ఆదివాసీ రచయితల సంఘం


Andhra Jyothi Telugu News Paper Dated : 1/5/2013 

Saturday, April 27, 2013

దిగజారుతున్న గిరిజన విద్య కె విజయగౌరి


   Sat, 27 Apr 2013, IST  

మేము ఇటీవల కేశాయివలస అనే గిరిజన గ్రామానికి వెళ్లాము. 2012, జులైలో 32 గిరిజన గూడలకు వెళ్లినప్పుడు ఆ గూడల్లో గిరిజనుల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయో, ఇప్పుడు మేము వెళ్లే గూడలు కూడా అలాగే ఉన్నాయి. మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనుల పరిస్థితీ అలాగే ఉంది. అక్కడ పిల్లల చదువు మాట ఎలా ఉన్నా ఆరోగ్య పరిస్థితి మాత్రం భయంకరంగానే ఉంది. అయితే విద్యలో పిల్లల స్థితిని వాకబు చేయడానికే వెళ్లాము. దృష్టి మాత్రం వారి స్థితిగతులపైకి వెళ్లింది. ఆహార సమస్య, ఇంటి సమస్య, సామాజిక సమస్య, ఆదాయ సమస్య, సాంస్కృతిక వెనుకబాటుతనంపై ప్రత్యేకంగా దృష్టి సారించకుండా బడిగంట కొట్టగానే బడికి వస్తారనుకోవడం భ్రమే అవుతుందని భావించాము.
గిరిజన విద్య
2011 జనాభా లెక్కల ప్రకారం ఏడాదికేడాది నిరక్షరాస్యత స్థానం మాత్రం బాగా పెరుగుతోంది. 18వ స్థానం నుంచి 22వ స్థానానికి చేరింది. ప్రస్తుత గణాంకాలు చూస్తే అనుకున్న విధంగా అక్షరాస్యత 49 శాతానికి పెరగలేదు. 2001 లెక్కల ప్రకారం చూస్తే 37 శాతంగా ఉంటే 12 ఏళ్ల కాలంలో కేవలం 7 శాతం మాత్రమే పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ బ్లాక్‌బోర్డు స్కీములో భాగంగా 2,090 ఏకోపాధ్యాయ పాఠశాలలను ప్రారంభించింది. ఇంకా అవసరం రీత్యా, అనేక రకాల ఒత్తిడుల రీత్యా 2003 నాటికి 4,317 పాఠశాలలు ఏర్పాటైనాయి. మరలా 2008 నాటికి ఈ సంఖ్య 3,153కు పడిపోయింది. అంటే 1,258 పాఠశాలలు మూతబడ్డాయి. 55 లక్షల మందికిగాను కేవలం 12 లక్షల మంది మాత్రమే చదువుకుంటున్నారంటే విద్యలో వెనుకబాటుతనం స్పష్టంగా కనబడుతుంది. గిరిజన వికాస కేంద్రాలలో నియామకాలు ఈ దశలోనే జరిగాయి. దీనికంటే ముందే ఆయా గ్రామాలలో 'మా బడులు' గిరిజనులే నిర్వహించుకున్నారు. గ్రామాల్లో ఎక్కడో కొద్దిపాటి చైతన్యం ఉన్న వ్యక్తులు చదువు కోసం తపన పడిన దాని నుంచి ఈ మా బడులు వచ్చాయి. ఆ సందర్భంలో అక్షరాల దేవుళ్లను ఏర్పాటు చేసుకున్నారు. అక్షర బ్రహ్మ వంటి ఆలయాలను కట్టుకుని ఐక్యమత్యంతో మెలగాలని ప్రతిజ్ఞలు చేశారు. సవర పెద్దలందరూ ఒకచోటకు చేరి అక్షరబ్రహ్మ అనే రూపాన్ని ప్రతిష్టించుకుని, మూఢ నమ్మకాలను విడనాడాలని ప్రచారం చేశారు. అందులో భాగంగానే ప్రత్యామ్నాయ పాఠశాలలు వెలిశాయి. వారి ప్రాంతీయ భాషల రక్షణ కోసం, ఆ భాషలో బోధించేందుకు స్థానిక గిరిజనులు కృషి చేశారు. 1986 నుంచి 1990 వరకూ విద్య కోసం గిరిజనుల పడ్డ తాపత్రయం పరిశీలించదగ్గవే. చాలా ఆలయాల్లో రాతి విగ్రహాలు కన్పిస్తాయి, కానీ ఆ ప్రాంతాలలో లిపినే పూజిస్తారు. రాష్ట్రమంతా గిరిజన ప్రాంతాలలో ఆయా తెగల లిపి, భాష, సంస్కృతులకు రక్షణ కల్పించాల్సి ఉంది.
గిరిజన విద్యలో పరిణామాలు
పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, సంప్రదాయ పంటలు వంటి వాటిపై స్వతంత్రత గిరిజనులకు ఉండేవి. కానీ గత 15 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న సరళీకరణ, ప్రపంచీకరణ విధానాల ఫలితంగా గిరిజనుల జీవన సరళిపై తీవ్ర ప్రభావం పడింది. వేగవంతమైన సంస్కరణలు వారి వృత్తులను మింగేస్తున్నాయి. ఇప్పటికీ చాలా గూడల్లో అంగన్‌వాడీ సెంటర్లు, బడులు లేవు. చదువుకోవాలనే తపన ఉన్నా పరిస్థితులు అనుకూలించడం లేదు. గిరిజన ప్రాంతాల్లో విద్యా సంస్కరణలు ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడడం లేదు.
స్కూళ్ళ కేంద్రీకరణకు యత్నాలు
గిరిజన ప్రాంతాలన్నీ తిరిగి పర్యవేక్షణ చేయలేమంటూ కొన్ని పాఠశాలలను ఒక ప్రాంతానికి తేవాలని నిర్ణయించారు. అమలుకు ఉత్తర్వులు తయారుచేశారు. అధికారులతో పాలకులు, పాలకులతో అధికారులు కుమ్మక్కై భేష్‌ భేష్‌ అనుకుంటున్నారు. 15 కుటుంబాలున్న గూడలోనైనా పాఠశాల అవసరమని నేషనల్‌ స్కీం విశాల దృక్పథంతో పెడితే, ఇప్పుడవి మూసేస్తామంటున్నారు. ఐదుగురు పిల్లలున్నా ఆ గూడల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పాఠశాల నడపాలనే లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 పై చిలుకు గిరిజన ప్రాథమిక పాఠశాలలు మూతబడనున్నాయి. ఇంతేకాక ఆశ్రమ యుపి పాఠశాలలను ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలనేది గిరిజన విద్యాశాఖ ఆలోచన. ఇదే జరిగితే మరింత డ్రాపౌట్స్‌ పెరుగుతారు. గిరిజన విద్య మరింత విస్తరించాలనే నిజమైన తాపత్రయం ఉంటే విద్యాహక్కు చట్టం ప్రకారం వికేంద్రీకరణ చేయాలే తప్ప ఇటువంటి విధానాలు గిరిజనులకు నష్టదాయకంగా మారాయి.
గిరిజన విద్యకు ఆటంకాలు
పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల నియామకాలు లేకపోవడం, ఉన్న టీచర్లను కుదించే ఏర్పాట్లు చేయడం, నియామకాలలో అనేక నిబంధనలు విధించడం, ఆయా ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత వెంటాడుతోంది. మరో అంశం ఏమంటే 'రూపాంతరం' వచ్చిన పథకంలో గ్రాంట్లు కొన్ని పాఠశాలలకే వినియోగించి గ్రేడ్‌ 'ఎ' పాఠశాలలుగా మారుస్తారట. మిగిలిన పాఠశాలల రూపాలు మాత్రం మార్చరట. పాఠశాలల్లో వైద్య సౌకర్యాలు దీనస్థితిలో ఉన్నాయి. శాశ్వతంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రతిరోజూ తనిఖీ చేసేందుకు కనీసం ఒక ఎఎన్‌ఎంను కూడా నియమించలేదు. గత విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 150 మందికి పైగా విద్యార్థులు జబ్బుల బారినపడి మృతి చెందారు. కేవలం 20 శాతం మాత్రమే పై చదువులకు పోవడం, మిగిలినవారు ఏ పనీ లేకుండా ఉండటం వంటివి గిరిజన విద్యకు ఆటంకంగా ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం ఆశ్రమ పాఠశాలలు 500 ఉంటే ఇప్పటికీ 599 మాత్రమే హాస్టల్స్‌లో కలిపి ఉండటం వెనుకబాటుతనానికి ఒక నిదర్శనం. సీట్ల సంఖ్య కూడా పెరగలేదు. రూ.6 వేల కోట్లలో రూ.1,000 కోట్లు మాత్రమే ఐటిడిఎలకు ఖర్చు చేస్తున్నారు. తీవ్రవాద కార్యక్రమాలలో, అసాంఘిక శక్తులుగా మారే దానిలో దేశవ్యాప్తంగా గిరిజన యువజనులు ఆకర్షించబడుతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయంటే సమాజంలో వారిపట్ల ఎంత నిర్లక్ష్య ధోరణి ఉందో, వారి చైతన్యస్థాయి ఏపాటిదో అర్థమవుతుంది.
ప్రత్యామ్నాయాలు
వీటిని సరిచేసే ప్రత్యామ్నాయాలు లేకపోలేదు. ఉన్న నిధులలో రెండు రెట్లు నిధులు పెంచడం, విద్యా కమిషన్‌ను వేయడం, ఐటిడిఎలకు శాశ్వత ఐఎఎస్‌ అధికారులను నియమించడం, స్థానిక టీచర్లను నియమించడం, జీవో నెం. 3ను అమలు చేయడం, గురుకుల పాఠశాలల గణాత్మకతను అన్నింటా పెంచడం, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధులను అమలు చేయడం, ప్రాంతీయ భాష, లిపి, సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించే విధంగా కోర్సులను ప్రవేశపెట్టడం, అవినీతిని అరికట్టడం, గిరిజనులకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం, 1/70 యాక్టును అమలు చేయడం వంటివి చిత్తశుద్ధితో చేయాలి. అప్పుడు నిజమైన గిరిజన అభివృద్ధి కనిపిస్తుంది. పీసా చట్టాలు, 1/70 వంటివి ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారే తప్ప, కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారే తప్ప అమలుకు నోచుకోవడం లేదని, అడవులపై హక్కులు గిరిజనులకు లేవని అయిదేళ్ల కాలంలో జరిగిన మైనింగ్‌, గనులు, విద్యుత్‌ వంటి పోరాటాలు రుజువు చేస్తున్నాయి. గిరిజనుల చైతన్య స్థాయి పెరగాలంటే విద్య అందుబాటులో ఉండాలి. అదే విద్య ఉపాధిని చూపాలి. ఆ దిశగా చైతన్యపరచాలి. వారి అమాయకత్వం వలన ఒకవైపు పాలకులు, మరోవైపు మతతత్వ శక్తులు గిరిజనుల జీవితాలతో ఆడుకుంటున్నాయి.
ఇప్పటి వరకూ జరిగుతున్న అన్యాయంపై పోరు చేయడం, రాజ్యాంగపరమైన హక్కులను సాధించుకోవడం, పోరాడి తెచ్చుకున్న ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధుల అమలుకై చైతన్యవంతులు కావడం ఒక కర్తవ్యంగా భావించాలి. అనేక రూపాల్లో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులు, వారి కోసం మనం ఐక్యంగా సాధించుకోవడం మన లక్ష్యం.
అందుకే మార్క్స్‌ ఒక సందర్భంలో అంటాడు. సోషలిస్టు దేశాలలో బడి నడవాలంటే ఆరోగ్యమైన శిశువు కావాలి. ప్రజల ఆరోగ్యంపై కేంద్రీకరించింది. తల్లి కడుపులో బిడ్డ ఉండగానే సంరక్షణ బాధ్యత చేపట్టింది. హెల్త్‌కేర్‌ పథకాలను అమలు చేసింది. సామాజిక చైతన్యం, ఆరోగ్య పెట్టుబడి, ఆర్థిక వనరుల అభివృద్ధి వంటివన్నీ విద్యాహక్కుల అమలు సక్రమంగా సాగిపోవడానికి దారి తీశాయి.
(వ్యాసకర్త యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి) 
-కె విజయగౌరి

Prajashakti Telugu News Paper Dated : 27/4/2013