Showing posts with label ఉ.సా.. Show all posts
Showing posts with label ఉ.సా.. Show all posts

Saturday, October 19, 2013

చిన్న రాష్ట్రాలూ పెద్ద కులాలేకనా? By ఉ.సా.,


చిన్న రాష్ట్రాల ఏర్పాటు- వికేంద్రీకృత అభివృద్ధికి, పరిపాలనా సౌలభ్యానికి మాత్రమే గాక బడుగు వర్గ చిన్న కులాల అభ్యున్నతికి కూడా తోడ్పాటునిస్తుందని డా బి. ఆర్‌. అంబేడ్కర్‌ ప్రతిపాదించిన సమగ్ర దృక్ఫధంలో, ప్రాంతీయ కోణంతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఏ కోణం ఆవశ్యకత ఆ కోణానికి ఉన్నా, ప్రాధాన్యతా క్రమం లో ఏ అంశం ప్రధానంగా ముందుకొస్తే ఆ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాల్సివచ్చినా, ఏ అంశా నికి ఆ అంశాన్ని పాక్షిక అంశంగా చూడకుండా వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరిశీ లించే సమగ్ర దృక్ఫధం అవసరం అని ఆనాడే (1950-55) నొక్కి చెప్పినది ఆధునిక అభ్యుదయ నవ భారత రాజ్యాంగ నిర్మాత డా బి. ఆర్‌. అంబేడ్కర్‌ ఒక్కరే అంటే అతిశయోక్తి కాదు. కానీ అంబేడ్కర్‌ ఆలోచనా విధానాన్ని ఓ అక్షయ పాత్రగా భావించి, ఆ పాత్రలో నుండి ఎవరికి కావలసిన అంశాన్ని వారు స్వీకరి స్తున్నారు

తప్ప అందులోని సమగ్ర దృక్ఫధాన్ని ఎవరూ స్వీకరించడం లేదు. అంబేడ్కర్‌ ఆలోచనా విధానాన్ని కులానికి, అందులోను అస్పృశ్య కులాలకి, మళ్లీ వాటిలో తను ఏ ఉప కులానికి చెందనవాడో ఆ ఉపకులానికి పరిమితం చేసే సంకుచిత సాంప్రదాయ అంబేడ్కర్‌ వాదులు ఆయన సమగ్ర దృక్పధాన్ని అసమగ్ర దృక్ఫధంగా కుదించారు. భారత జాతీయ సమైక్యత, సమగ్రతల పేరిట భారత జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చిన కాంగ్రెస్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సోకాల్డు భారత జాతీయవాదులు ఆయన చెప్పిన భారత సంయుక్త‚ రాష్ట్రాల సమాఖ్య వాదాన్ని స్వీకరించకుండా పక్కన పెట్టారు. ఆ దృక్ఫధం భారత జాతీయ సమైక్యతను దెబ్బతీసే, సమైక్య భారతావనిని విచ్ఛిన్నంచేసే దృక్పధంగా వక్రీకరించి అఖండ భారత్‌ వాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. స్వదేశీ స్వధర్మ స్వరాజ్‌ పేరిట మత ధర్మరక్షణ ముసుగులో మనుధర్మ రక్షణ కోసం మత ప్రాదిపదికపై హిందూ హిందుయేతర రెండు జాతుల సిద్ధాంతాన్ని సృష్టించి, జాతీయ తత్వాన్ని అగ్రకుల తత్వంగా, మత తత్వంగా భ్రష్ఠు పట్టించారు. 

విశాలాంధ్రలో ప్రజారాజ్యం, విశాల భారతావనిలో సమాఖ్య రాజ్యం అని ప్రవచించిన (పుచ్చలపల్లి సుందరయ్య వంటి) కమ్యూనిస్టులు హిందూ హిందు యేతర రెండు జాతుల సిద్ధాంతంలో భాగంగా హైదరాబాద్‌ (తెలంగాణ) ఫ్యూడల్‌ సంస్థానాన్ని పాకిస్థాన్‌లో కాకుండా హిందూస్థాన్‌లో, భారత యూనియన్‌లో విలీనం చేయడానికి పరోక్షంగా తోడ్పాడ్డారు. అంతేకాదు ఇండియా సంయుక్తరాష్ట్రాలను భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా పునర్వవస్థీకరించాలనే వాదనతో ఒకే భాష, ఒకే రాష్ర్టం- అనే నినాదంతో వలసాంధ్ర వాదానికి తోడ్పడే సమైక్యాంధ్ర విశాలాంధ్ర ధృక్ఫధానికి ‚ పట్టంకట్టారు. ఒకే భాష, ఒకే రాష్ర్టం అనే ఆ నినాదమే నేటి కుహనా సమైక్యాంధ్ర రణన్నినాదంగా మారింది. సమైక్యాంధ్ర పేరిట తెలంగాణ‚ వ్యతిరేక, సీమాంధ్ర ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు. ఆ ముసుగులో అగ్రకుల తత్వాన్ని చొప్పించి చిన్న రాష్ట్రాల ఏర్పాటును సహితం పెద్ద కులాల ఆధిపత్యం లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

‚అందుకు భిన్నంగా, ఓ పెద్ద రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ- ఆంధ్ర రాష్ట్రాలుగా విభజిస్తే సాపేక్షికంగా అవి రెండూ చిన్న రాష్ట్రాలే అవుతాయి కనుక, అంబేడ్కర్‌ చెప్పిన చిన్న రాష్ట్రాల వాదాన్ని భౌగోళిక తెలంగాణ వాదులు బలపరుస్తున్నారు. అలాగే ఇది కేవలం ఒక పెద్ద రాష్ట్రాన్ని రెండు చిన్న రాష్ట్రాలుగా విభజించడం మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్‌ అవతరణ పేరిట1956 లో బలవంతాన విలీనమైన తెలంగాణ (హైదరాబాద్‌), ఆంధ్ర రాష్ట్రాలు మళ్లీ యథాపూర్వ వేరు వేరు రాష్ట్రాలుగా ఏర్పడడమేనని కూడా వాదిస్తున్నారు. గత 56 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన వలసాంధ్ర పెత్తందారీ శక్తులు తెలంగాణ ప్రాంతంతో పాటు, సీమాంధ్రలోని ఉత్తరాంధ్ర , రాయలసీమ తదితర వెనుకబడిన ప్రాంతాల ప్రాంతీయ అసమానతలను తొలగించాల్సిన బాధ్యతను విస్మరించాయి. ఆ విధంగా సమైక్యాంధ్రలో సమగ్రాభివృద్దిని, సమానాభివృద్ధిని సాధిస్తామని వాగ్దానం చేసిన పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కిన కారణంగానే ప్రత్యేక తెలంగాణ వాదం తలెత్తిందని చెప్తున్నారు.

తెలంగాణలోని హైదరాబాద్‌ నగరంపై,‚ సాగునీటి సదుసాయం ఉన్న వివిధ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలపై వలసాంధ్ర పెత్తందారీ తనానికి పాల్పడిన అగ్రకుల పెట్టు బడి దారీ శక్తులవల్లనే దగాపడ్డ‚ తెలంగాణలో ప్రత్యేక తెలంగాణవాదం తలెత్తిందని వాదిస్తున్నారు. ఆ రకంగా సమైక్యాంధ్ర అనైక్యాంధ్రగా మారటానికి సీమాంధ్ర వలన పెత్తందారీ శక్తులే మూలకారకులైనా, ఆ సత్యాన్ని కప్పిపుచ్చి- ప్రత్యేక తెలంగాణ వేర్పాటు వాదులు, కాంగ్రెస్‌ అవకాశవాదులు ఇరువురు కుమ్మకై తెలుగు జాతి సమైక్యతకు చిచ్చుపెట్టారని కట్టుకథలు చెప్పి సామాన్యాంధ్రుల్లో, సీమాంధ్రలో ప్రాంతీయ విద్వేషతత్వాన్ని రెచ్చగొడుతున్నారు. సీమాంధ్ర ప్రాంతీయ తత్వాన్ని తెంగాణ వ్యతిరేక ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు భూమికగా మార్చుకుంటున్నారు. కానీ, దగాపడ్డ తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడడం- సమైక్యాంధ్రను విచ్ఛిన్నంచేసే విచ్ఛిన్నకర వేర్పాటువాదం కాదని వాదిస్తున్న తెలంగాణ వాదులు అంబేడ్కర్‌ చెప్పిన చిన్న రాష్ట్రాల వాదాన్ని ఆశ్రయిస్తున్నారు. 

ఆనాడు అంబేడ్కర్‌ చెప్పినట్లు భాషా ప్రయుక్త రాష్ర్టమంటే- ఒక భాష మాట్లాడే ప్రజందరినీ ఒక రాష్ర్ట (భౌగోళిక సరిహద్దుల) పరిధిలోకి తీసుకురావాలన్నది ఒక అర్థమైతే, ఒక భాష మాట్లాడే ప్రజలకు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు ఉండవచ్చునన్నది మరొక అర్థం- అని చెప్పిన అంబేడ్కర్‌ వాదానికి రెండు అర్థాలున్నాయి. ఇందు లో ఒక అర్థాన్నే తీసుకొని రెండవ అర్థాన్ని విస్మరించి- ఒకే భాష, ఒకే రాష్ర్ఠం- అనే‚ నినాదం ఇచ్చిన భాషాప్రయుక్త వాదుల వక్రభాష్యం వల్లనే ఈనాడు ఆంధ్రప్రదేశ్‌ విడిపోవాల్సివస్తోందన్న మాట. ఒక భాషా రాష్ఠ్రానికి ఒకే భాష తప్పనిసరి కావచ్చు గాని, ఒక భాషకి ఒకే రాష్ర్టం తప్పని సరి కాదని, చారిత్రక, ప్రాంతీయ ప్రత్యేక కారణాల రీత్యా ఒకే భాష మాట్లాడే ప్రజలు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవచ్చని ఆనాడే (1950- 55) అంబేడ్కర్‌ చెవినిల్లు కట్టుకొని చెప్పినా వినకుండా పెడచెవిన పెట్టిన ఫలితంగానే ఈ చారిత్రక తప్పిదం జరిగింది. 
కొన్ని వందల సంవత్సరాలు ప్యూడల్‌ రాచరిక వ్యవస్థలో మగ్గిన తెలంగాణ ప్రాంతం, సర్కారాంధ్ర కంటే చారిత్రక వెనుకబాటు తనానికి గురై ఉంది.

రాయల సీమ దత్త మండలం కూడా కోస్తా ఆంధ్రా కంటే వెనుకబడి ఉంది. ఆధునిక బ్రిటిష్‌ సర్కార్‌ పాలన క్రింద ప్రయోజనం పొందిన కోస్తా ఆంధ్ర- తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల కంటే ఆధునికంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతీయ అభివృద్ధిని సామాజిక అభివృద్ధిగా మలచుకున్న అగ్రకుల ఆధిపత్య శక్తులు బ్రిటిష్‌ వలన వాదుల ప్రభావంతో కోస్తాంధ్రా వలన వాద శక్తిగా రూపాంతరం చెందాయి. 1956 లో ఆంధ్రప్రదేశ్‌ అవతరించి 56 యేళ్లు దాటినా నేటికీి కొనసాగుతున్న ఈ మూడు ప్రాంతాల ప్రాంతీయ వ్యత్యాసాల వాస్తవికత (మూడు చేతుల బొమ్మ) ‚ సమైక్యాంధ్ర చిత్ర పఠాన్ని చిధ్రం చేస్తోంది. అందుకో భవిష్యత్తు దృష్టితో అరవై ఏళ్ల క్రితం అంబేడ్కర్‌ చెప్పిన మాట నేటి వర్తమాన చరిత్రకి వర్తించే చారిత్రక సత్యంగా కాల పరీక్షలో నెగ్గి మార్గ దర్శకంగా మారింది. కుహనా భారత జాతీయ వాదుల, భాషా రాష్ర్ట వాదుల అవకాశవాదం కాల దోషంపట్టి కాల గర్భంలో కలిసిపోయింది. 

ఈ దృష్టితో ఆనాడు‚ అంబేడ్కర్‌ ఏమన్నారో పరిశీలిద్దాం- ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తెలుగు జాతి (జాతీయ) సమైక్యతకు, భారత సంయుక్త రాష్ట్రాల సమాఖ్య దృక్పధానికి చేటు తెస్తుందని అంటున్న ఈనాటి సమైక్యాంధ్ర వాదుల్లాగానే, ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు భారత జాతీయ సమైక్యతకు చేటు తెస్తుందని బ్రాహ్మణీయ హిందూ భారత జాతీయ వాదులు వాదించారు. ఆనాడే వారి అవకాశ వాదాన్ని పూర్వ పక్షం చేస్తూ- అమెరికా సంయుక్త రాష్ట్రాల సమాఖ్య దృక్పధాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అంబేడ్కర్‌ ప్రతిపాదించారు. అంతేకాదు, భారత సంయుక్త రాష్ట్రాలను భాషాప్రయుక్త రాష్ట్రాలుగా పునర్వ్యవస్థీకరించాలని, ఒకే భాష మాట్లాడే వారంతా ఒకే రాష్ర్టంలో ఉండాలని వాదించిన ఆనాటి భాషారాష్ర్ట వాదుల అవకాశవాదాన్ని కూడా ఖండించారు. ఒకే భాష మాట్లాడే వారందరని ఒకే రాష్ర్ట పరిధిలోకి తెచ్చే సందర్భంలో ప్రాంతీయ వ్యత్యాసాలను పరిగణలోకి తీసుకోవాలని, అలా తీసుకోవడం సమాఖ్య (ఫెడరల్‌) దృక్పధానికి మరింత మేలు చేస్తుందే కాని, కీడు చేయదని స్పష్ఠం చేశాడు.

ఆయన ఏమన్నాడో ఆయన మాటల్లలోనే- భారత సంయుక్త రాష్ట్రాల సమాఖ్య రాజ్యాంగం విజయవంతంగా పనిచేయడానికి భాషాప్రయుక్త రాష్ట్రాలు మరింత ప్రాదేశిక సమతుల్యతతో ఉండడం అవసరం. ప్రాదేశికమైన ప్రాంతీయ అసమానతలు మరీ ఎక్కువగా ఉన్నట్లుయితే అవి వెనుక బడిన ప్రాంతాల వారిలో అనుమానాన్ని, అసంతృప్తిని కలిగించడమే కాక ఫెడరల్‌ స్ఫూర్తి విచ్ఛిన్నమైపోయే దుష్పరిణామాలకు దారి తీస్తుంది. అందుకే ప్రాదేశిక ప్రాంతీయ సమతుల్యత ఆవశ్యకతని సార్వజనీనంగా సర్వత్రా అందరూ గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల ఫెడరల్‌‚ రాజ్యాంగాల్లో పెద్ద రాష్ట్రాల (ప్రాబల్య ప్రాంతాల) ప్రాబల్యాన్ని హద్దులో ఉంచి అదుపుచేయడానికి పలు జాగ్రత్తలు తీసుకున్నారు.... అలాగే పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న రాష్ట్రాల ఏర్పాటును సర్వత్రా స్వాగతించారు. 

ఫెడరల్‌ రాజ్యా ంగ సెనెట్‌లో‚ చిన్న పెద్ద తేడా లేకుండా (చిన్న రాష్ట్రాలను చిన్న చూపు చూడకుండా) ప్రతి రాష్ట్రానికి సమాన (హోదా) ప్రాతినిధ్యాన్ని కల్పించారు (పేజీలు 192, 193, భాషా ప్రయుక్త రాష్ట్రాలు). ఈ ఆలోచనతోనే అంబేడ్కర్‌ 1955లో మహారాష్ర్ట, యుపి, ఎపి, బీహార్‌ తదితర పెద్ద రాష్ట్రాల ఏర్పాటును చిన్న రాష్ట్రాలుగా వ్యవస్థీకరించాలని సూచించారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌కు సారథ్యం వహించన ఫజల్‌ ఆలీ కూడా హైదరాబాద్‌ (తెలంగాణ) రాష్ఠ్రాన్ని ఆంధ్రరాష్ర్ఠంతో వెంటనే విలీనం చేయకుండా కొంతకాలం సొంత కాళ్ల మీద నిలబడి అభివృద్ధి చెందనివ్వాలని సిఫారసు చేశారు. 

ఈ నేపథ్యంలో నుంచి చూసినప్పుడు ఈనాడు ప్రత్యేక తెంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ ఆచరణ రూపం దాల్చడమంటే, ఆంధ్రప్రదేశ్‌ అనే ఒక పెద్ద రాష్ఠ్రాన్ని తెంగాణ- ఆంధ్ర అనే రెండు చిన్న రాష్ట్రాలుగా పునర్వ్యవస్థీకరించడమే. మరో రకంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ పేరిట 1956లో బలవంతాన విలీనమైన తెలంగాణ, ‚ఆంధ్ర రాష్ట్రాలను మళ్లీ యథాపూర్వ వేరు వేరు రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడమే. అందుకే తెంగాణ వాదులు అంబేడ్కర్‌ ప్రతిపాదించిన చిన్న రాష్ట్రాల వాదాన్ని ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు వత్తాసు పలికే వాదంగా ప్రచారం చేస్తున్నారు. కాని అంబేడ్కర్‌ సమగ్ర దృక్పధం అనే అక్షయపాత్రలో నుంచి ఎవరికి వాటంగా ఉన్నదాన్ని వాళ్లు వాడుకున్నట్లే తెలంగాణ వాదులు కేవలం భౌగోళిక తెలంగాణ వాదానికే పరిమితం అవుతున్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వికేంద్రీకృత అభివృద్దికి, పరిపాలన సౌలభ్యానికి మాత్రమే కాక బడుగు వర్గ చిన్న కులాల అభ్యున్నతకు కూడా తోడ్పాటు ఇస్తుందని అంబేడ్కర్‌ చెప్పిన మూడు విషయాల్లో చిన్న కులాలకు తోడ్పాటు అనే మూడవ విషయాన్ని ఉద్దేశ్య పూర్వకంగానే మినహాయిస్తున్నారు. 

అంటే చిన్న రాష్ట్రాల ఏర్పాటు చిన్న కులాలకు తోడ్పాటుగా మారడం తెలంగాణ ప్రాంత వెలమ, రెడ్డి, బ్రాహ్మణీయ అగ్ర కులాధిపత్య శక్తులకు ఏ మాత్రం ఇష్టం లేదన్న మాట. తెలంగాణ రాష్ర్ట సాధన కోసం జరిగిన ఉద్యమంలో చోదక శక్తిగా పనిచేసి, అత్యధికంగా ఆత్మ బలిదానాలకు పాల్పడిన బహుజన శక్తుల్ని వెనక్కి నెట్టి కొత్తగా ఏర్పడే 29వ రాష్ర్టమైన తెలంగాణ రాష్ర్టంపై అగ్రకుల ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవాలని చూస్తున్నారన్న మాట. ప్రాదేశిక సమాన అభివృద్ధి కోసం, భౌగోళిక తెంగాణ సమాన అవకాశాల కోసం సామాజిక తెలంగాణ- అని నినదించిన అంబేడ్కర్‌ వాదులు తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో సామాజిక తెలంగాణ వాదాన్ని ప్రతిష్ఠించడంలో ఎందుకు విఫలం అవుతున్నారో పునరా లోచించుకోవలసిన సమయం ఆసన్నమైంది. 

విచిత్రమేమిటంటే అంబేడ్కర్‌ వాదం అనే అక్షయ పాత్రలో నుంచి భౌగోళిక తెలంగాణ వాదులు సామాజిక సమతుల్యత అంశాన్ని విస్మరించి, తమకు వాటంగా ఉండే ప్రాదేశిక సమతుల్యతాంశాన్ని స్వీకరించారు. అలాగే వలసాంధ్ర అగ్రకుల పెట్టుబడి దారీ, పెత్తందారీ శక్తులు హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేయాలని చెప్పిన అంబేడ్కర్‌ అభిప్రాయాన్ని వాటంగా వాడుకుంటున్నారు. అంబేడ్కర్‌ చెప్పిన వికేంద్రీకృత అభివృద్ధికి విరుద్ధంగా హైదరాబాద్‌ రాజధానీ నగరాన్ని కేంద్రీకృత విధ్వంసక అభివృద్ధికి నమూనాగా మార్చిన వలసాంధ్ర పెట్టుబడి దారీ శక్తులు, హైదరాబాద్‌ని దేశానికి రెండవ రాధానిని చేయాలని చెప్పడం విడ్డూరం.
హైదరాబాద్‌తో సహా 10 జిల్లాల తెలంగాణ ప్రాంతం తెలంగాణవారి స్వపరిపాలనాధికారం క్రిందికి పోవడాన్ని సహించలేని వలసాంధ్ర పెట్టుబడిదారులు, తమకు దక్కని హైదరాబాద్‌ను తెలంగాణ వారికి కూడా దక్కనీయకుండా చేయడానికే ఈ పన్నాగం పన్నారు. హైదరాబాద్‌ ను దేశానికి రెండవ రాజధానిగా చేయాలని అంబేడ్కర్‌ ఏ చారిత్రక సందర్భంలో చెప్పాడో ఆ సందర్భాన్ని కప్పిపచ్చాలని చూస్తున్నారు.

ఆంగ్లేయ పాలకులు ఢిల్లీని ఒక రాజధానిగా, సిమ్లాని మరో రాజధానిగా చేసుకున్నట్లే భారత పాలకులు ఢీల్లీతో పాటు హైదరాబాద్‌ని మరో రాజధానిగా చేసుకుంటే పరిపాలనా సౌలభ్యం రీత్యా ఉత్తరాది రాష్ట్రాలకు ఒక రాజధాని, దక్షిణాది రాష్ట్రాలకు మరో రాజధాని అందుబాటులో ఉంటాయని చెప్పారు. అందుకు తగిన అన్ని అర్హతలు కలిగినదిగా అప్పటికే హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందిందని స్పష్టం చేశాడు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్రప్రభుత్వం ఫజల్‌ ఆలీ కమిషన్‌ను నియమించిన చారిత్రక సందర్భంలో 1955లో అంబేడ్కర్‌ వ్యక్తంచేసిన ఆ అభిప్రాయాన్ని ఆనాడు స్వీకరించ కుండా, హైదరాబాద్‌ నగరాన్ని సీమాంధ్రాకి రాజధానిగా మలచుకున్న వలసాంధ్ర పెట్టుబడి దారులు ఈనాడు దానిని దేశానికి రెండవ రాజధానిగా చేయాలని వాదించడం- వారి అవకాశ వాదానికి వరాకాష్ఠ అని చెప్పక తప్పదు. ఇటు భౌగోళిక తెలంగాణ వాదులు, అటు వలసాంధ్ర సమైక్యాంధ్ర వాదులు అంబేడ్కర్‌ వాదాన్ని తమకి అనుకూలమైన సమయానుకూల వాదంగా మలచుకుంటుంటే, ఫూలే, 

అంబేడ్కర్‌ల వాదులమని చెప్పుకునే బడుగువర్గ బహుజనశక్తులు ప్రత్యేక తెలంగాణ వాదులను, సమైక్యాంధ్రవాదులను ఆశ్రయించే ఆశ్రీత వాదులుగా ఎందుకు మారేరో పునరాలోచించుకోవలసిన సమయం ఆసన్నమైంది. చిన్న రాష్ట్రాల ఏర్పాటు చిన్న కులాలకు తోడ్పాటుగా మారనీయకుండా చిన్న రాష్ట్రాలపై సహితం అగ్రకుల పెద్దకులాల వారే ఆధిపత్యం చెలాయించే దుస్థితి దాపురించడానికి బడుగు వర్గ బహుజన శక్తుల స్వయంకృత ఆపరాధ పాత్ర ఎంతఉందో సమీక్షించుకొని ఇప్పటికైన అప్రమత్తం కావడం అవసరం



Suryaa Telugu News Paper Dated : 16/10/2013 

Sunday, September 1, 2013

ఏది ప్రజాభీష్ఠం, ఏది ప్రజాస్వామ్యం? By ఉ.సా


'నిర్ణయాలు తీసుకునేది పార్టీలు, ప్రభుత్వాలు కాదు ప్రజలే' అని తెలుగు భాషా దినోత్సవ సభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన సంచ లనాత్మక వ్యాఖ్యల ఉద్దేశ్యమేమిటో గ్రహించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ అధిష్ఠానిష్టంకాదు, కేంద్ర ప్రభుత్వ ఇష్టంకాదు, ప్రజాభీష్ఠమే ఫైనల్ అనడం అధిష్ఠానాన్ని ధిక్కరించటమో లేక అనుకరించటమో తేలాల్సి ఉంది. జగన్‌మోహన్ రెడ్డి హవాని అడ్డుకోవడానికి అదే సామాజి క వర్గానికి, అదే ప్రాంతానికి చెందిన అడ్డుపుల్లగా అధిష్ఠానం దయాదాక్షిణ్యా లమీద ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్ఠానాన్ని ధిక్కరించేంత సత్తాఉందా? ముఖ్యమంత్రి స్థానానికి ఉన్న సత్తాని దృష్టిలోపెట్టుకొని సీమాంధ్ర వలస పెత్తందార్ల స్వార్థ ప్రయోజనాలను కాపాడటం కోసం ఇంతకు తెగించారా, లేక సీమాంధ్రలో కూడా రాజకీయ లబ్ధిపొందటం కోసం అధిష్ఠానం ఆదేశాలతోనే ఈ అంతర్నాటకం ఆడుతున్నారా అనేది త్వరలోనే బయటపడక తప్పదు. మన దేశ రాజ్యాంగ నిర్మాత డా॥ బి.ఆర్. అంబేడ్కర్ ఒక మహోన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. ఏసామాజిక వర్గానికైనా, ఏప్రాంతానికైనా ఎలాంటి వివక్షకి, అన్యాయానికి తావులేకుండా సమాన గౌరవం, సమాన అవకాశాల కల్పనద్వారా సమాన సమగ్ర అభివృద్ధి సాధించే సామాజిక న్యాయాన్ని పాటించడం అందులో ముఖ్యాంశం. సేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో కూడిన సమసమాజాన్ని స్థాపించటం మరో ముఖ్యాంశం. ఈ రెండింటి సారాంశమే మన¬దేశ రాజ్యాంగ అంతిమ లక్ష్యమని ప్రియాంబుల్‌లో పొందుపరిచారు.

ఈ కారణంగానే ఓ ప్రాంతం మరో ప్రాబల్య ప్రాంతంవారి ప్రాంతీయ ఆధిప త్యానికి అన్యాయానికి గురైనపుడు ఆ దుస్థితి నుండి బైటపడటానికి ఆప్రాంతం వారికి స్వయంపాలనాధికారాన్ని కల్పించటం ప్రజాస్వామ్య బద్ధమే, రాజ్యాంగ బద్ధమేనని ఆర్టికల్-3లో పొందుపర్చాడు. అలాగే ఒక సామాజిక వర్గం మరో సామాజిక వర్గంపై సామాజిక ఆధిపత్యానికి అన్యాయానికి పాల్పడినపుడు వారికి సామాజిక న్యాయం కల్పించటమే రాజ్యాంబద్ధ సామాజిక ప్రజాస్వామ్యం అని స్పష్టంచేశారు. ఈ రాజ్యాంగ ఆదేశిక సూత్రాల ప్రకారమే సామాజిక న్యాయ సాధికారకల్పన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లాంటి ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను నెరవేర్చటం రాజ్యాంగబద్ద ప్రజాస్వామిక ప్రక్రియ అవుతుంది.

మెజారిటీ ఓట్లు, సీట్లు గెలిచి ప్రజాభీష్టాన్ని చూరగొన్న పార్టీకి అధికారం కట్టబెట్టమేకాదు, న్యాయమైన ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను నెరవేరుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీఇవ్వటం, అధికారంలోకి వచ్చాక మాటతప్పకుండా, ప్రజల్ని మోసగించకుండా ఆ హామీని అమలుజరగటం కూడా ప్రజాస్వామిక ప్రక్రియే. కనుక ప్రజలకిచ్చిన వాగ్దానాల్ని వమ్ముచేసే రాజకీయ పార్టీలకు గుణపా ఠం చెప్పటం కోసం వాటిని ఓడించి, అధికారం నుంచి దించేందుకు సదవకాశం ఉండటమే ప్రజాస్వామ్య గొప్పతనం. ఆరకంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు తప్ప పార్టీలు, ప్రభుత్వాలు కాదు అని ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్ర చాటిచెపుతోంది.

ఈ అర్థంలో 'నిర్ణయాలు తీసుకొనేది పార్టీలు, ప్రభుత్వాలు కాదు ప్రజలేనని' ప్రజాస్వామ్యానికి మన రాష్ట్రముఖ్యమంత్రి చెప్పిన భాష్యం అంతగా సంభ్రమాశ్చర్యాలను కలిపించదు. 'పార్టీలు, ప్రభుత్వాలు ప్రజాభీష్టానికి అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకొనకపోతే ప్రజలు వాటికి అధికారం నుండి శలవు ప్రకటిస్తార'ని చెప్పటం కూడా తప్పేమీకాదు. కాకపోతే ఈ సూత్రబద్ధ ప్రజాస్వామిక విధానాన్ని ఏ సందర్భానికి, ఏ ప్రాంతానికి అన్వయించి మాట్లాడుతున్నారో స్పష్టంచేయకుండా తప్పించుకొనే ప్రయత్నం చేశారు. కనుక ఆయన చెప్పే ప్రజాభీష్ఠం ఏ ప్రాంతపు ప్రజాభీష్ఠమో, ఆయాన వల్లించే ప్రజాస్వా మ్యం ఏ తరహా ప్రజాస్వామ్యమో నిగ్గుతేల్చాల్సిఉంది. ఇటీవల ఆగస్టు 8న హైదరాబాద్‌లో స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి ఆయన బహిర్గత పర్చిన అంశాలే ఆయన ఆలోచనల్ని బట్టబయలు చేస్తాయి. ప్రజాస్వామ్యంలో పార్టీస్వామ్యం కూడా అంతర్భాగం కనుక ప్రజాస్వామ్యం గురించి నీతులు వల్లించే ముఖ్యమంత్రి పార్టీ స్వామ్యాన్ని ఏమేరకు పాటించారో, ప్రభుత్వాధినేతగా ఏ మేరకు తన కర్తవ్యాన్ని నిర్వహించాడో స్పష్టంచేసుకోవటం అవసరం.

నిజానికి తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్య పద్ధతినే పాటించాయని భావించవద్దు. పార్టీ అత్యుతన్న విధాన నిర్ణయ కమిటీ అయిన సి.డబ్ల్యూసి మొదటగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకొని, యు.పి.ఎ. ప్రభుత్వ భాగస్వామ్య పక్షాల సమన్వయ కమిటీ ఆమోదం తీసుకొంది. యు.పి.ఎ సబ్ కమిటీ నియమించి అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నిటి అభిప్రాయాలు తీసుకొంది. ప్రాథమికంగా ఈ సమస్య ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించింది గనుక తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే, పార్టీకి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులతో సంప్ర దించింది. ఈ హోమ్‌వర్క్ అంతా చేసినాకే 2013 జూలై 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఏ ప్రాంతం వారి అభిప్రాయాలు ఎలావున్నా ఫైనల్‌గా పార్టీ అధిష్ఠానం తీసుకొన్న న్ణియానికి కట్టుబడి వుంటాం అని పదే పదే ప్రకటించిన కాంగ్రెస్ పెద్దలంతా ఆ మాటకు కట్టుబడి వుండాలి. కాంగ్రెస్ అధిష్ఠాన సంస్కృతి ఎలావున్నా పై కమిటీకి క్రింది కమిటి ఎ.ఐ.సి.సి, పి.సి.సి కి మెజారిటీకి మైనారిటీ కట్టుబడి ఉండటమే పార్టీస్వామ్యం. ఒకవేళ పార్టీ అధిష్ఠానం తీసుకొన్న నిర్ణయం సరైన నిర్ణయం కాదనుకొంటే, ప్రభు త్వాధినేత స్థానంలో ఉండి ఆ నిర్ణయం అమలు చేయటం ఇష్టంలేకపోతే సమైక్యాం ధ్రప్రదేశ్‌కేకుని కోసేచాకుగా తాను మారటం కస్టమైతే కాంగ్రెస్ పార్టీకి ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేసి ఆపైన ఇలాంటి రాద్ధాంతానికి దిగితే తప్పులేదు.

రాహుల్‌గాంధీకి యువరాజ పట్టాభిషేకం చేయాలనే ఆత్రంతో, 2014 ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక ఎంపి సీట్లు గెలవటంకోసం, సీమాంధ్ర ప్రాంతానికి సమన్యాయం చేయకుండా ఏకపక్షంగా 'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకొంటే ఇప్పటికేవున్న సమస్యలకు తోడు ఇది మరింత పెద్ద సమస్యగా మారుతుంది' అని కిరణ్ కుమార్ రెడ్డి అధిష్ఠానాన్ని హెచ్చరించారు. అధిష్ఠాన ఇష్టాయిష్టాలకంటే సీమాంధ్ర ప్రజల అభీష్ఠమే తనకు శిరోధార్యం అని ధిక్కారాన్ని ప్రకటించారు. కనుక పార్టీస్వామ్యాన్ని ప్రభుత్వ స్వామ్యాన్ని ఉల్లం ఘించేవారికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే అర్హతలేదు. అందుకే ఉపముఖ్యమంత్రి దామోదర నర్సింహ ముఖ్యమంత్రినుద్దేశించి 'తెలంగాణ ర్రాష్టాన్ని ఏర్పాటు చేస్తామని, 2004, 2009 నాటి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా వున్న ఇరువురం ఇప్పుడే కాదు, అప్పుడు కూడా కాంగ్రెస్ నేతలమే. తనకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం సరైన నిర్ణయం కాదనే భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు ఆరోజే తన అభ్యం తరం వ్యక్తం చేసి, పార్టీకి రాజీనామా చేసి బైటకు పోవాల్సింది' అని సూటిగా ప్ర శ్నించారు. ఆనాడు మాత్రం పార్టీకి రాజకీయ లబ్ధికావాలి. తెలంగాణ సెంటిమెం ట్‌ని ఓట్‌బ్యాంక్‌గా మార్చుకొని అందలమెక్కి పదవులు దక్కించుకోవాలి. అప్పటి అవసరం కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రజాస్వామికమైందని, న్యాయమైందని కల్లబొల్లి కబుర్లుచెప్పి తెలంగాణ ప్రజల అభీష్ఠాన్ని నెరవేర్చుతాం అని మభ్య పెట్టాలి. ఇపుడేమో తెలంగాణ ప్రజలు ప్రజలుకాదు, తెలుగుజాతి సమైక్యతను చీల్చిచిచ్చుపెట్టే విచ్చిన్నకర వేర్పాటువాద శక్తులు అని తెలంగాణపై సీమాంధ్రలో వ్యతిరేకత రెచ్చ గొడతారు. తెలంగాణ ప్రజల అభీష్టం ప్రజాస్వామిక అభీష్టం కాదు కేవలం సీమాంధ్ర ప్రాంత ప్రజల అభీష్టమే శిరోధార్యం అంటారు. టిటర్న్ నుండి యుటర్న్ తీసుకొన్న ఈ రెండు నాల్కల ద్వంద్వ వైఖరి తెలంగాణ ప్రజల్ని దగాచేసే వైఖరికాదా? అని నిలదీశారు.

కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు గనుక తెలంగాణ విష యంలో కాంగ్రెస్ తీసుకొన్న నిర్ణయంపట్ల సీమాంధ్ర ప్రాంతంలో తీవ్రమైన వ్యతి రేకత పెల్లుబికి తన రాజకీయ భవిష్యత్తుకి, పార్టీ భవిష్యత్తుకి ముప్పుముంచు కొచ్చినందుకు ఆందోళన చెందటం తప్పుకాదు. అలాగని తెలంగాణ రాష్ట్ర ఏర్పా టుకోసం పార్టీ తీసుకొన్ని నిర్ణయాన్ని అమలుకానీయకుండా అడ్డుకొంటే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌పార్టీ తుడచిపెట్టుకుపోతుందికదా! మరి తెలంగాణలోని కాం గ్రెస్ నాయకుల భవిష్యత్తును, పార్టీ రాజకీయ భవిష్యత్తును కాపాడేదెలా? అని ఇరుప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ఉంటే ఓస్టేట్స్‌మెన్‌గా ఆయన రాణించేవారు. అలా కాకుండా కేవలం సీమాంధ్ర వలసపెత్తందార్ల కొమ్ముగాస్తే స్వయంగా తానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి లేదా అధిష్ఠానం ఆయనను భర్తరఫ్‌చేయాలి. లేకుంటే తెలంగాణ వారు కూడా కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది. 2004లో 2009లో తెలంగాణ రాష్ట్రఏర్పాటుపై కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసినపుడు సీమాంధ్ర ప్రాంతంలో కానరాని వ్యతిరేకత 2009 డిసెంబర్ 9న, 2003 జూలై 30న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకొన్నప్పుడే, ఎందుకు వెల్లువెత్తింది? అన్న ప్రశ్నకు సీమాంధ్ర నాయకులతోపాటు కిరణ్ కుమార్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి. 


ఉద్యమాల ఉపాధ్యాయుడు

Surya News Paper Dated: 01/09/2013 

Saturday, May 11, 2013

బుద్ధుంటే బుద్ధుడ్ని కలుపుకు పోవాలి! ---Usa



‘బుద్ధుడు చాలడు, అంబేడ్కర్‌ చాలడు, మార్క్‌‌స కావాలి’ అని ఓదుర్గంధ రాద్ధాంత ఉద్గ్రంథం రాసినప్పటినుండి విర్రవీగిపోతున్న వీరంగనా యకమ్మ అంబేడ్కర్‌పై,అంబేడ్కర్‌ని కలుపుకుపోవాలని చెప్పే ఇండి యన్‌ మార్క్సిస్టులపై వీరంగం వేస్తూనేఉంది. అప్పటి నుండి అంబేడ్కర్‌పై దుమ్మెత్తి పోయటమే పనిగా పెట్టుకొ న్న రంగనాయకమ్మ తన వక్రభాష్య వెటకార వాగాడంబ రాన్ని ప్రదర్శిస్తూ పదేపదే పత్రికలకెక్కు తూనే ఉంది. అంబేడ్కర్‌పై, బుద్ధునిపై వ్యతిరేకత రెచ్చగొట్టే దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అంబేడ్కర్‌పై అగ్రకుల దురహంకార విద్వేషవిషం ‘కక్కు’తూనేఉంది. 

ఆ పనిలో భాగంగానే ‘మార్క్‌‌సనీ అంబేడ్కర్‌నీ కలపగలమా?’అంటూ మే7న ‘సూర్య’దినపత్రికలో ఓవ్యాసం రాశా రు. అంబేడ్కర్‌ చెప్పిన ప్రతిమాటని వక్రీకరించి, అందులోని సానుకూ లార్ధాన్ని ప్రతికూలంగా తారుమారుచేసి తగువులుపెంచే తగువులమారి తారుమా రమ్మలా మారిన రంగనాయకమ్మ చివరికి బుద్ధుడు పనికిరాడు, అంబేడ్కర్‌ పనికి రాడు, మార్క్‌‌సకావాలి అంటూ తన నిజస్వరూపాన్ని బైటపెట్టుకొంది.
ఏ బ్రాహ్మణీయ అగ్రకుల మార్క్సిస్టు అధినేతా ఎదగలేనంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉన్న సంస్కారవంతుడైన ‘అంబేడ్కర్‌ సూర్యుడు’ మీద ఉమ్మిఊస్తే అది ఊసిన వారి ముఖానే పడుతుందని అమరుడు కె.జి. సత్యమూర్తి ఆమె ముఖాన కొట్టినట్లు చెప్పాడు.

అలా ఎవరెన్ని చెప్పినా తన వితండవాద తొండి వాదాన్ని మార్చుకోని జగమొండి రంగనాయకమ్మ అంబేడ్కర్‌ని అప్రదిష్ఠపాలు చేయాలని ఎంత ప్రయాస పడినా అది వృధాప్రయాస కాక తప్పలేదు. అంబేడ్కర్‌ మరణానం తర స్వాతంత్య్రా నంతర వర్తమాన చరిత్రలో సైతం కోట్లాది పీడిత ప్రజల ఆధారా భిమానాన్ని చూరగొన్న ‘ద గ్రేటెస్ట్‌ ఇండియన్‌’ అంబేడ్కరేనని పబ్లిక్‌ పబ్లిగ్గా జేజేలు పలకటమే అందుకు నిదర్శనం. నిమ్నకులాల్లో పుట్టినవాళ్లు ఎంత మహోన్న తులైనా అగ్రకులా ల్లోని అథములు సైతం వారిని గేలిచేసే కరుడుగట్టిన అగ్రకుల తత్వ సంస్కృతికి వారసురాలిగా మారిన రంగనాయకమ్మ మళ్లీ అంబేడ్కర్‌ని అపహాస్యం చేసే దురహంకార పూరిత వక్రభాష్యం తోనే ఈ వ్యాసాన్ని మొదలెట్టింది.

‘బుద్ధుడా? మార్క్సా? అనే ప్రశ్నలేపి మార్క్‌‌స పనికిరాడు అని తేల్చేశాడు’ అంబేడ్కర్‌ అంటూ ఆయన్ని (Anti Marxist) మార్క్సిస్టు వ్యతిరేకిగా చిత్రించే దురుద్దేశ్యంతో ఆయన మాటల్ని వక్రీకరించి తారుమారుచేసింది. నిజానికి బుద్ధుని పట్ల, అంబేడ్కర్‌ పట్ల తనకున్న తిరస్కార భావాన్ని బయటపెడుతూ బుద్ధుడు పనికిరాడు, అంబేడ్కర్‌ పనికిరాడు అని తేల్చేసింది రంగనాయకమ్మే. ‘బుద్ధుడు - కారల్‌మార్క్‌‌స’ Budha and Karl Marx అని శీర్షిక పెట్టిన అంబేడ్కర్‌ బుద్ధుడి తో కారల్‌ మార్క్‌‌సని పోలి కపెట్టి చూస్తే, బుద్ధుడా? మార్క్సా? Budha Versus Karl Marx అని బుద్ధు డితో కారల్‌మార్క్‌‌సని పోటీపెట్టి చూపినట్లు వక్రీకరించి తన వక్ర బుద్ధిని బైటపెటు ్టకొంది.

ఇలా అంబేడ్కర్‌ వ్యాసానికి తలమానికమైన తల లాంటి శీర్షిక తల(రాత)నే మార్చివేసిన రంగనాయకమ్మ ఆ వ్యాసంలో అంబేడ్కర్‌ చర్చించిన ముఖ్యాంశా లన్నిటినీ ఇలాగే వక్రీకరించి వక్రమార్గం పట్టించింది. అందుకు పరాకాష్ఠగా ఈ దేశ ‘శ్రామికవర్గం అంబేడ్కర్‌ చూపించిన ఆధ్యాత్మిక ఎదుగుదల మార్గం పట్టి అంతా తమ తలరాత అనుకొన్నట్లు ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది అనుకొంటే సరిపోదూ’. అనే అపహాస్య వాక్యంతో తనవ్యాసం ముగించింది.

ఆమె వితండవాద రాద్ధాంతానికి సిద్ధాంత శుద్ధిలేక పోయినా కనీసం చిత్తశుద్ధి అయినా ఉంటే సిద్ధాంతపరంగా ఆమెతో విబేధించినా, వ్యక్తిగత నీతి నిజాయితీల వ్యక్తిత్వాన్నయినా గౌరవించేవాళ్లం. కానీ సిద్ధాంతశుద్ధి, చిత్తశుద్ధీ రెండూలేని రంగ నాయకమ్మ ఇక అంబేడ్కర్‌ని అగౌరవ పరచడం కట్టిపెట్టి ముందు ఈ వక్రబాష్యానికి తక్షణమే సంజాయిషీఇచ్చి తన నిజాయితీని నిరూపించుకోవాలి. అంబేడ్కర్‌ ఒరిజి నల్‌గా ఇంగ్లీషులో రాసిన తన గ్రంథానికి Budha and Karl Marx అని శీర్షిక పెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున అంబేడ్కర్‌ రచనల్ని తెలుగులోకి అను వాదం చేసిన 3వ సంపుటి అట్టమీద ‘బుద్ధుడు- కారల్‌ మార్క్సు’ అనే శీర్షికే పెట్టా రు.

ఇందుకు విరుద్ధంగా Budha Versus Marx అన్నట్లు ‘బుద్ధుడా? మార్క్సా’ అనే శీర్షిక పెట్టిన రంగనాయకమ్మ దీనిని ఏ మూలగ్రంథం నుండి లేదా ఏ అను వాద గ్రంథం నుండి స్వీకరించిందో స్పష్టం చేయాలి. ఇది కేవలం భాషా దోషానికి సంబంధించిన సాంకేతికఅంశం కాదు. సానుకూల అంశాన్ని ప్రతికూల అంశంగా వక్రీకరించి దాని అర్థాన్ని తారుమారుచేసి తగువులుపెట్టే తగువులమారి తారుమా రమ్మ వక్రబుద్ధికి సంబంధించిన అంశం.

‘బుద్ధుడు కావాలా? మార్క్‌‌స కావాలా?’, ‘బుద్ధుడా? మార్క్సా!’ అనే శీర్షిక ఎవరో ఒకర్ని సమర్ధించి మరొకర్ని వ్యతిరేకించేందుకు దారితీస్తుంది. ‘బద్ధుడు మరియు కారల్‌ మార్క్‌‌స’ అనే శీర్షిక ఇరువురి వాదాల్లోవున్న భిన్నాభిప్రాయాల్ని ఎత్తిచూపుతూ నే ఏకాభిప్రాయాన్ని అభిప్రా యంగా గుర్తించి ఉమ్మడి కార్యాచరణలో కలుపుకు పోయే వైఖరికి దారిని సుగమంచేస్తుంది. ఈ దృష్టితోనే అంబేడ్కర్‌ బుద్ధుడి ఆలోచన ల్లో మార్క్‌‌స ఆలోచనల్లో ఉన్న ముఖ్యమైన ఏకాభిప్రా యాలని, భిన్నాభిప్రా యాలని తులనాత్మకంగా నిజాయితీగా సరిపోల్చి చూశారు.

ఒక్క మాటలో కులరహిత- వర్గరహిత సమసమాజ లక్ష్యాన్ని సాధించే సాధనాలు వేరైనా లక్ష్యం ఒకటేనని, ఆ గమ్యాన్నిచేరే మార్గాలువేరైనా గమ్యం ఒకటేనని స్పష్టం‚చేశాడు. సాధనాలు, మార్గా ల విషయంలో; హింస, అహింస, ప్రతిహింస, బూర్జువా నియం తృత్వం, కార్మిక నియంతృత్వం, కులప్రమే యంలేని వర్గపోరాటం, కులవివక్షా వ్యతిరేక వర్గపోరా టం తదితర విషయాల్లో మార్కిస్టుకి- బుద్ధిస్టు అయిన అంబేడ్క ర్‌కి మధ్య ఉన్న భిన్నాభిప్రాయాల భిన్నత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే మౌలిక లక్ష్యాల్లో, ఆశయాల్లో ఉన్న ఏకత్వాన్ని సానుకూల దృష్టితో చూడాలని చెప్పాడు.

ఈ దృష్టితో- ఇండియన్‌ మార్క్సిస్టులు, కమ్యూనిస్టులు బుద్ధుడ్ని కలుపుకోవాలని విజ్ఞప్తి చేశాడే తప్ప రంగనాయకమ్మ వక్రీకరిస్తున్నట్లు బుద్ధిజాన్ని, మార్క్సిజాన్ని కలగలపాలని ఎక్కడా చెప్పలేదు. ఈ అర్థంలో ‘మార్క్సిస్టులు వాళ్ల దురభిమానాల్ని పక్కనబెట్టి, బుద్ధుడ్ని (సరిగా) అధ్యయనం చేసి ఆయన వేటికోసం (ఏ లక్ష్యాలకోసం, ఏ ఆశయాలకోసం) నిలబడ్డాడో అర్థం చేసుకుంటే తప్పకుండా తమ వైఖరి మార్చు కుంటారని భావిస్తాను. బుద్దుడిపట్ల తిరస్కారభావంతో ఉన్న (బ్రాహ్మణీయ అగ్ర వర్ణ) మార్కిస్టులు ఆయనను ఆరాధిస్తారని ఆశించటం అత్యాశే.

అయినా బుద్ధుని బోధనలలో వాళ్లు గుర్తించాల్సింది ఏదో ఉందనే విషయాన్నైనా కనీసం గ్రహిస్తారని మాత్రం చెప్పగలను’ అన్నాడు. కనుక బుద్ధుంటే ఇకనైనా తిరస్కార భావాన్ని విడనా డి బుద్ధుడ్ని కలుపుకపోవటం ఇండియన్‌ మార్క్సిస్టుల, కమ్యూనిస్టుల కనీస కర్తవ్యం అని చెప్పక తప్పదు.కాని రంగనాయకమ్మ తిరస్కార భావాన్ని విడనాడకపోవటమే కాక అల్పబుద్ధితో కూడిన తుస్కార భావంతో బుద్ధుడ్ని కించపరిచే బుద్ధిమాలిన పనికి పాల్పడింది. అంబేడ్కర్‌ చూపుడు వేలు సూర్యున్ని చూపిస్తుంటే సూర్యున్ని కాకుండా వేలును చూసే హ్రస్వ‚దృష్టితో అంబేడ్కర్‌ని కించపరుస్తూ అంబేడ్కర్‌ చూపుడు వేలు ఆద్యాత్మిక మార్గాన్ని చూపిస్తున్నదని అపహాస్యం చేసింది.

నిగ్రహాన్ని చూపమని చూపుడు వేలు చూపుతున్న అంబేడ్కర్‌ విగ్రహం మూర్తే తప్ప విముక్తి మార్గాన్నిచూపే స్ఫూర్తికాదని కొట్టిపారేసింది. కనుక ఆమె చేసిన ఈ వక్రభాష్యానికి, అపహాస్యానికి సంజాయిషీ ఇచ్చే దాకా ఆమె వితండవాద రాద్ధాంతం సిద్ధాంత చర్చకి అర్హమైంది కాదని ప్రకటిస్తున్నాం.



Surya Telugu News Paper Dated : 11/5/2013

Wednesday, May 1, 2013

మేడే ఇన్‌ ఇండియా టుడే! ---ఉ.సా.,



నాడు వేతన బానిసల తిరుగుబాటు
జీతాల కోసం కాదు, జీవితాల కోసం
వర్గ దృక్పథంతో ఉద్యమాలు పక్కదారి
గులాం గిరిపై మహాత్మా ఫూలే పోరాటం
బొంబాయిలో బడుగుల తొలి ఉద్యమాలు
కుల కోణాన్ని స్పష్టం చేసిన అంబేడ్కర్‌
కుల వివక్ష వ్యతిరేక పోరాటానికి పిలుపు 


అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పనిదినాల కోసం మే 1న ఆనాటి కార్మికులు చేసిన వీరోచిత పోరాటం రక్తసిక్తమై చరిత్ర సృష్టించింది. నిప్పురవ్వ దావానలంగా మారినట్లు చికాగో కార్మికుల పోరాట స్ఫూర్తితో ప్రపంచ దేశాలన్నిటా 8 గంటల పనిదినాన్ని పాటించే పరిస్థితి ఏర్పడింది. ఆరకంగా చరిత్ర సృష్టించిన ‘మేడే’ ప్రపంచ వ్యాపిత కార్మిక హక్కుల సాధన దినోత్సవంగా, అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా చరిత్ర ప్రసిద్ధిగాంచింది. అలా చరిత్ర సృష్టించిన ఈచరిత్రాత్మక పోరాటానికి రెండు లక్షణాలు న్నాయి. మనిషి తత్వంతో, మానవీయ గౌరవం కోసం మహోన్నత చైతన్యాన్ని ప్రదర్శించిన మానవజాతి లక్షణం ఒకటైతే మరొకటి కార్మికవర్గ అంతర్జాతీయ లక్షణం.

అవధులులేని ధన దాహంతో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు షిప్టులవారీగా రేయింబవళ్లు కార్మికుల చేత గొడ్డుచాకిరి చేయించిన పెట్టుబడిదారీ వర్గంపై జరిగిన ఆనాటి తిరుగుబాటును ఒక్కమాటలో వేతన బానిసల తిరుగుబాటుగా అభివర్ణించవచ్చు. ఇది జీతాల కోసం జరిగిన ఆర్థిక పోరాటంకాదు, జీవితాలకోసం జరిగిన రక్తసిక్త జీవన్మరణ పోరాటం, మనిషిని మనిషిగా కాక గొడ్డులా చూసి రేయింబవళ్లు గొడ్డుచాకిరి చేయించిన దోపిడీ వర్గాల అమానుషత్వంపై జరిగిన తిరుగుబాటు, ఈ అమానుషత్వాన్ని ప్రదర్శించిన పెట్టుబడిదారీ వర్గానికి, తిరుగుబాటు చేసిన కార్మిక వర్గానికి ఇరువురికి గత బానిస వ్యవస్థ నాటి వారసత్వ ఛాయలున్నాయి. మధ్యయుగాల్లో ఎన్నో శతాబ్దాలపాటు బానిసత్వ ప్రయోజనాలను అనుభవించి అభివృద్ధి చెందిన పాశ్చాత్యదేశాల పాలకవర్గాలు 19వ శతాబ్దంలో బానిసత్వాన్ని నిషేధించక తప్పలేదు.

అయితే ఈ నిషేధానికి దోహదపడిన అంశాల్లో మానవీయ ఉదారవాదం కన్నా, అభ్యుదయ ఆదర్శవాదం కన్నా, ఆర్థిక ప్రయోజన వాదమే ప్రధానాంశంగా పనిచేసింది.ఆనాటి బానిస యుగంలో బానిసలు బతికి బట్టకట్టకుండా వారిచేత దాస్యం చేయించు కోవటం సాధ్యంకాదు గనుక వారికి తిండి, బట్ట, నివాసం సమకూర్చి వారిని పోషించే బాధ్యత బానిస యజమానులు చేపట్టాల్సి వచ్చేది. దుర్భరమైన ఆ బానిసత్వాన్ని భరించలేక బానిసలు తప్పించుకు పారిపోయే పరిస్థితి రీత్యా వారికి కాపలా పెట్టాల్సి వచ్చేది. పశువుల సంతలో గొడ్డును కొన్నట్లు బానిసలల సంతలో ఒకసారి బానిసను కొనుక్కొచ్చాక ఇక అతనికి వేతనం ఇవ్వకుండా జీవితాంతం ఊడగించేయించుకోవచ్చు.

వారికి సంతాన యోగ్యం కల్పించి, వారి సంతానాన్ని కూడా బానిసలుగా వాడుకోవచ్చు. అంత ప్రయాస ఎందుకనుకుంటే సంతాన యోగ్యత లేకుండా చేసి, చచ్చిందాకా వాడుకొని సంతలో మరోకొత్త బానిసను కొనుక్కోవటం చౌకబేరం అని అలాకూడా చేశారు. పారిశ్రామిక విప్లవం తరువాత, ఫ్యాక్టరీలు నెలకొల్పిన తరువాత పెట్టుబడిదారీ పాలకవర్గాల ఆలోచనల్లో మార్పువచ్చింది. వేతనం ఇవ్వకుండా ఎంతకాలమైనా ఊడిగం చేయించుకునే బానిసత్వంలో బానిసల పోషణ బాధ్యత బానిసయజమా నుల మీద ఉండేది. ఈ ప్రయాసకన్నా పోషణ బాధ్యతలేని వేతన బానిసలుగా వారిని మార్చుకోవటం మిన్న అనే చౌకబారు ఆలోచన వచ్చింది. వేతనంలేని బానిస, వేతన బానిస అనే తేడా- వేతనం విషయంలో తప్ప బానిసత్వ ఆలోచనలో మౌలిక మార్పురాలేదు.

అందుకే రేయింబవళ్లు శ్రామికుల్ని గొడ్డుచాకిరి చేయించే పరిస్థితి కొనసాగింది. కాని ఈ అమానుష బానిస సంకెళ్ల ఆనవాళ్లను కూడా తెగదెంచివేసే మానవీయ చైతన్యంతో చికాగో కార్మికులు చేసిన తిరుగుబాటు వేతన బానిసలు చేసిన తిరుగు బాటుగా మరోచరిత్ర సృష్టించింది. మొదటగా పారిశ్రామిక పెట్టుబడిదారీ వ్యవస్థను నెలకొల్పిన ఇంగ్లండ్‌ దేశంలో బానిసత్వాన్ని నిషేధించే ఉద్యమానికి శ్రీకారం చుట్టినా, బానిసత్వానికి ముగింపు పలికినది మాత్రం అమెరికా సంయుక్త రాష్ట్రాలలోనే. ఈ చరిత్రక నేపథ్యంలోనే అమెరికాలోని చికాగో నగర కార్మికులు వేతన బానిసత్వంపై తిరుగుబాటు చేశారు. ఇది యాదృచ్ఛికం కానీ, చికాగో కార్మికుల మేడే పోరాట యదార్థ వ్యదార్థ చరిత్ర. ఇక ఈ పోరాటానికి ఉన్న కార్మికవర్గ అంతర్జాతీయ లక్షణం విషయానికి వస్తే, దీనికి ఉన్న రాజకీయ ప్రాముఖ్యతను గుర్తించిన మార్క్‌‌స, ఏంగిల్స్‌ మహాశయులు ఈ ప్రాముఖ్యతకు మేధోరూపం ఇచ్చారు.

తమ జీతాల కోసం కాక జీవితాల కోసం మనిషితత్వాన్ని, మానవత్వాన్ని చాటిచెప్పిన చికాగో కార్మికుల చైతన్యం సర్వమానవ చైతన్యానికి ప్రతీక అని ప్రపంచానికి చాటిచెప్పారు. అంతేకాదు కార్మికవర్గం తమను తాము విముక్తి చేసుకోవటడం కోసం జరిపే కార్మికవర్గ పోరాటం, ప్రపంచ పెట్టుబడిదారీ వర్గాన్నే రాజ్యాధికారం నుండి కూలదోసి, సోషలిజాన్ని స్థాపించి కమ్యూనిజాన్ని సాధించే విప్లవాత్మక చారిత్రక కర్తవ్యం నెరవేర్చగల అంతర్జాతీయ విప్లవాత్మక శక్తి సామర్థ్యాలున్న పోరాటం అని పతాకస్థాయిలో అభివర్ణించారు. ప్రపంచంలో ప్రతి వ్యక్తీ ఏదో ఒక వర్గానికి చెంది ఉంటాడు గనుక ప్రపంచ దేశాలన్నింటా ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి! పోరాడితే పోయేదేం లేదు బానిససంకెళ్లు తప్ప! వస్తే మరో ప్రపంచమే, వర్గరహిత కమ్యూనిస్టు ప్రపంచమే సాక్షాత్కరిస్తుంది’ అని 1848 నాటి ‘కమ్యూనిస్టు ప్రణాళిక’లో చరిత్రాత్మక పిలుపునిచ్చారు.

సరిగ్గా ఇదే సమయానికి మార్క్‌‌స సమకాలికుడైన మహాత్మజ్యోతి రావు ఫూలే భారతదేశీయ బ్రాహ్మణీయ బానిసత్వం (గులాంగిరి)పై తిరుగుబాటు ప్రకటిస్తూ అందుకు తొలిమెట్టుగా 1948లో శూద్రాతి శూద్ర బహుజన బాల బాలికలకు తొలి పాఠశాలను ప్రారంభించాడు. తరతరాలుగా శుద్రాతి శూద్ర బహుజనులను విద్యకు, విజ్ఞానికి, ఆస్తికి, అధికారానికి శాశ్వతంగా దూరంచేసి బ్రాహ్మణీయ అగ్రవర్ణ పాలకవర్గ ద్విజులకు స్వచ్ఛందంగా ఊడిగం చేయించుకొంటున్న ప్రగతి నిరోధక బ్రాహ్మణీయ గులాం గిరిని సవాల్‌ చేశారు. వ్యక్తి స్వేచ్ఛను, వృత్తి స్వేచ్ఛను హరించి, సమానహక్కుల్ని మానవహక్కుల్ని నిరాకరించే వివక్షా పూరిత కుల కట్టుబాట్లకి, అంతస్తులవారీ అసమానతల కుల కట్టడానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రకటించారు.అదేక్రమంలో అప్పుడప్పుడే బ్రిటిష్‌ వారి తోడ్పాటుతో బొంబాయిలో బ్రాహ్మణ- మార్వాడీ అగ్రవర్ణ పారిశ్రామిక వేత్తలు స్థాపిస్తున్న పరిశ్రమల్లో కార్మికులుగా చేరుతున్న శుద్రాతి శూద్ర బహుజన కార్మికుల కడగండ్లను తీర్చటానికి మహాత్మ ఫూలే సహచరుడు లోఖండే తొట్టతొలి కార్మిక సంఘాల స్థాపనకు నాందిపలి కాడు.

కూలి వివక్షకు, లింగ వివక్షకు తావులేని విధంగా కార్మికులందరికీ సమాన పని కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల పని పరిస్థితుల్లో, జీవన పరిస్థితుల్లో ఉన్న దుర్భరత్వాన్ని మార్చాలని, కార్మికుల ప్రాణభద్రతకు, ఆరోగ్య భత్రకు పారిశ్రామిక యాజమానులు బాధ్యత వహించాలని, 10 గంటల పని దినాన్ని పాటించాలని డిమాండ్‌ చేశారు. అలాగే బాలకార్మికతను, పాకీ పనిని, వెట్టిచాకిరిని రూపు మాపాలని ఎలుగెత్తి చాటారు. వీరి పోరాట ఫలితంగా భారతదేశ కార్మికుల ప్రత్యేక స్థితిగతుల్ని అధ్యయనం చేయటానికి బ్రిటిష్‌ ప్రభుత్వం ఇన్‌స్పెక్టర్‌ ‘ఖాడ్‌కింగ్‌’ కమిటీని నియమించింది. ఆరకంగా 1881 నాటికి బ్రిటిష్‌ ఇండియాలో చట్టబద్ధమైన ‘కార్మిక (హక్కుల) చట్టం’ రాటానికి కారకులు కమ్యూనిస్టులు కాదు, కమ్యూనిస్టులు స్థాపించిన రెడ్‌ ట్రేడ్‌ యూనియన్లు కావు, ఫూలే ఆలోచనా విధానం ఫలితంగా లోఖండే నాయకత్వంలో ఏర్పడిన బ్లూ ట్రేడ్‌ యూనియన్స్‌ కృషి ఫలితమే.

1920-30 మధ్య భారత దేశంలో ఉనికిలోకి వచ్చిన కమ్యూనిస్టుపార్టీ, దానికి నాయకత్వం వహించిన బ్రాహ్మణీయ అగ్రవర్ణ శక్తులు- స్వీయాత్మక అగ్రకుల నేపథ్యంలో, యాంత్రిక మార్కిస్టు కార్మి వర్గ అంతర్జాతీయ దృక్పథంతో వారు ప్రక్కదారి పట్టడమే గాక భారతదేశ కార్మికుల్ని పక్కదారి పట్టించారు. ‘ఏ కులం వారైనా, ఏ జాతి వారైనా, ఏ దేశమందున్నా పేదలంతా ఒకటి, బాధలన్నీ ఒకటి! ప్రపంచ పేదలారా! ప్రపంచ కార్మికులారా ఏకంకండి’ అని పిలుపు నిచ్చారు. మహాత్మఫూలేని తన గురుతుల్యునిగా భావించిన డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ రంగప్రవేశం చేశాక, కులాన్ని విస్మరిస్తున్న బ్రాహ్మణీయ భారత కమ్యూనిస్టు నేతలపై ప్రత్యక్ష విమర్శ నాస్త్రాలను సంధించాడు. ప్రపంచంలో ప్రతి వ్యక్తీ ఏదోఒక వర్గానికి చెంది ఉంటాడని మార్క్‌‌స చెప్పిన విషయం ఇండియాకు మినహాయింపు కాదు.

కానీ కులాధీన వర్గవ్యవస్థ ఓ ప్రత్యేక వ్యవస్థగా ఉన్న ఇండియాలో ప్రతివ్యక్తీ ఏదో ఒక వర్గానికి చెంది ఉన్నట్లే, ప్రతి వర్గం ఏదొక కులానికి చెంది ఉంటుందని స్పష్టం చేశాడు. వర్గ పరమైన సాధారణ శ్రమ విభజనని- కుల పరమైన అసాధారణ శ్రామికుల విభజనగా మార్చిన కుల వ్యవస్థలో వర్గ వ్యత్యాసాలు అంతస్తులవారీ కుల-వర్గ వ్యత్యాసాలుగా మార్చారని స్పష్టంచేశాడు. అందువల్ల ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి’ అని మార్క్‌‌స ఇచ్చిన కార్మికవర్గ అంతర్జాతీయ పిలుపు ఇండియాలో యథాతధంగా అమలు కాదని 1930 నాటి ‘కులనిర్మూలన’ గ్రంథంలో స్పష్టంచేశారు. నిమోన్నత, స్పృశ్యా స్పృశ్య కుల వివక్షను పాటించేందుకు ఆస్కారమున్న భారత కార్మికవర్గం ఉద్యమంలో కులవివక్షా వ్యతిరేక వర్గపోరాట దృక్పథాన్ని పాటించకపోతే కార్మికవర్గ సమాన హక్కులు కార్మికులందరికీ సమానంగా దక్కవని చాటిచెప్పాడు.

ఈ నేపథ్యం నుండే 1936లో ‘స్వతంత్య్ర మజ్దూర్‌ పార్టీ’ (ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ)ని స్థాపించాడు. ఈ పార్టీ తరఫున కార్మిక పక్షాన నిలిచి. బొంబాయి లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో గెలిచి, బొంబాయి కౌన్సిల్‌లో పారిశ్రామిక వివాదాల బిల్లుమీద జరిగిన చర్చల సందర్భంగా కార్మికుల సమ్మెహక్కు రాజ్యాంగబద్ధ చట్టబద్ధ హక్కుగా మారడానికి దోహదపడి భారత కార్మికులకు సమ్మె హక్కును సాధించి పెట్టాడు. ఈ పార్టీ జెండా ఎర్రజెండా! ఎర్రజెండా అలాగే 1928లో బొంబాయిలో జరిగిన జౌళి మిల్లు కార్మికుల సమ్మె పోరాటంలో కమ్యూనిస్టులతో చేతులు కలిపి పోరాడాడు. ఆ సందర్భంలోనే ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల్లోనున్న కులవివక్షకు వ్యతిరేకంగా కూడా పోరాడాలని డిమాండ్‌ చేసి, ఈ డిమాండ్‌ని ట్రేడ్‌ యూనియన్‌ పోరాట డిమాండ్లలో చేర్చాలని ప్రతిపాదించాడు.

అంతేకాదు, ఆయన స్థాపించిన పార్టీకి ఎర్రజెండాను ఎంచుకున్నాడు. ఆ ఎర్రజెండాపై 11 నక్షత్రాల గుర్తులుంచాడు. ఈ 11 నక్షత్రాలు బ్రిటిష్‌ ఇండియాలో ఉన్న 11 ప్రావిన్సెస్‌కి సంకేతమని చెప్పి హిందూ జాతీయ వాదులు ముందుకు తెచ్చే అఖండ భారత హిందూ రాష్ట్ర భావనకి ప్రతిగా ప్రత్యామ్నాయ ఫెడల్‌ జాతీయ భావాన్ని ఎంచుకున్నాడు. ఇండియా సంయుక్త రాష్ట్రాల ఫెడరల్‌ రిపబ్లిక్‌ స్థాపన కోసం స్వతంత్య్ర, ప్రజాతంత్ర రాజ్యస్థాపనకోసం తాను నెలకొల్పిన స్వతంత్ర మజ్దూర్‌ పార్టీతో చేతులు కలపమని కమ్యూనిస్టులకు విజ్ఞప్తి చేశారు. కాని వారు బ్రాహ్మణీయ హిందూ జాతీయవాద మత తత్వాన్ని ముందుకు తెచ్చిన- అగ్రవర్ణ పాలకవర్గాల అఖండ భారత రెండు జాతుల సిద్ధాంతాన్ని బలపరిచి, కుహనా జాతీయ కాంగ్రెస్‌కు చేయూతనిచ్చి స్వతంత్ర భారత దేశంలో రాజ్యాధికారాన్ని కాంగ్రెస్‌ చేతికి అప్పగించారు.

ఇండియాలో వర్గాన్ని అంట్టిపెట్టుకొని ఉండే కులాన్ని, కుల వివక్షని పరిగణలోకి తీసుకో కుండా, కార్మిక వర్గపోరాటానికి కులవివక్షా పోరాటాన్ని జోడించకుండా ఇండియా కమ్యూనిజాన్ని స్థాపించాలని ఆశించే అగ్రవర్ణ కమ్యూనిస్టుల కల నెరవేరదని ‘ఫ్రీ రిక్విజైడ్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ కమ్యూనిజం’ అనే గ్రంథంలో ఆనాడే తీల్చి చెప్పాడు. ఆయన చెప్పిందే నిజమని చరిత్ర చాటిచెప్పింది. అంతేకాదు, పెట్టుబడి పాలకవర్గాల మెడలు వంచి కార్మికవర్గం, ఇండియాలో కులపీడిత శ్రామికవర్గం పోరాడి సాధించుకునే హక్కులకు రాజ్యాధికారం లేకుండా గ్యారంటీ లేదని మార్క్‌‌సకు దీటుగా చారిత్రక దృష్టితో అంబేడ్కర్‌ చెప్పినట్లే ఈనాటి ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ తాలూకు నూతన ఆర్థిక విధానం వలన ఆనాడు కార్మికులు, దళిత కార్మికులు సాధించుకున్న ట్రేడ్‌ యూనియన్‌ హక్కులు, రిజర్వేషన్‌ హక్కుల్ని కూడా కోల్పోవలసి వచ్చింది. అంతేకాదు, మేడే స్ఫూర్తితో ఆనాడు అమల్లోకి వచ్చిన ఎనిమిది గంటల పనిదినం కూడా అమల్లో లేకుండా పోయింది. ఈ మొత్తం పరిస్థితిని ఒక్క మాటలో ‘మేడే ఇన్‌ ఇండియా టుడే’ అని వ్యాఖ్యానించవచ్చు.


Surya Telugu News Paper Dated : 1/5/2013 

Sunday, December 18, 2011

శ్రీరాములను పొడుగు చేయకండి



AP-Map-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులంతా రెండు నిమిషాలు మౌనం పాటించి, ఆయనకు నివాళులర్పించాలని ప్రభుత్వం జారీచేసిన సర్క్యులర్ వివాదాస్పందంగా మారింది. గతంలోలేని ఈ తంతు ఇప్పుడు ఎందుకు తలపెట్టారు? పైకి చెబుతున్నట్టు శ్రీరాములును గౌరవించడానికేనా? లేక ఆయన భుజంపై తుపాకి పెట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాలరాయడానికా? ఇందులో దాగిఉన్న మతలబు ఏమి టి? డిసెంబర్ 15న అసువులు బాసిన ఆయనను సమైక్యాంవూధవూపదేశ్‌కు ప్రతినిధిని చేయడమంటే పొట్టిశ్రీరాములును పొడుగుచేసి, ఆయన చరివూతను అభాసు పాలు చేయడమే. కనుక తెలంగాణ విలీనం తో ఆవిర్భవించిన ఆంధ్రవూపదేశ్ అవతరణకు ఎలాంటి సంబంధంలేని పొట్టి శ్రీరాములుకు తెలంగాణవారు ఎందుకు నివాళులర్పించాలి? దీనికి సమైక్య వలస వాదుల వద్ద సమాధానం లేదు. 

ఆంధ్రవూపదేశ్ అవతరణ దినాన్నే తెలంగాణవాదులు విద్రోహదినం గా పాటించి, నిరసిస్తున్నారని సర్కారుకు తెలుసు. అయినా సమైక్యాంధ్ర సెంటిమెంటుకు ప్రతీకగా మలచబడ్డ పొట్టిశ్రీరాములును అడ్డం పెట్టుకుని, ఆయనకు నివాళులర్పించాలని నిర్దేశించడమంటే తెలంగాణ ఉద్యోగులను ప్రత్యేక తెలంగాణ మాటెత్తకుండా చేసి, సమైక్యాంధ్ర భావానికి తలొగ్గేట్టు చేయడమే. తెలంగాణ కోసం 42 రోజుల పాటు సకల జనులు సమ్మె చేసి, వలసాంధ్ర సర్కారును స్తంభింపచేసిన తెలంగాణ ఉద్యోగుల మీద కక్షసాధించడమే అవుతుంది. డాక్టర్ చెరుకు సుధాకర్‌పై కక్ష సాధింపు ధోరణితో అక్రమ కేసులు బనాయించడం చట్టవిరుద్ధం అని హైకోర్టు మొట్టికాయలు వేయడంతో కిరణ్‌కుమార్‌డ్డి అభాసు పాలయ్యారు.

అయినా తన సమైక్య అహంభావాన్ని చాటుకోవడానికే ఇప్పు డు పొట్టిశ్రీరాములును పావుగా వాడుకున్నాడు. ఆంధ్ర చరిత్రే తెలంగాణ చరివూతగా చిత్రించడమంటే తెలంగాణ చరివూతకు అస్తిత్వం లేకుండా చేసి, తెలంగాణపై వలసాంధ్ర ఆధిపత్యాన్ని అధిష్టించడమే అవుతుంది. ఈ వక్రబుద్ధి ఇప్పు డే కొత్తగా పుట్టిన దుర్బుద్ధి కాదు. ఇది ఆంధ్రవూపదేశ్ అవతరణ నాటి నుంచి నేటి దాకా పలురూపాల్లో కొనసాగుతూనే ఉంది. తెలంగాణను ఆంధ్రతో కలిపేటప్పు డు ఆ ఉమ్మడి రాష్ట్రానికి ‘తెలంగాణాంధ్ర’ తిలింగాంధ్ర) అని పేరు పెట్టాలని ఒప్పందం జరిగింది. అయినా పేరులో సైతం తెలంగాణ అస్తిత్వాన్ని సహించలేని వలసాంధ్ర పెత్తందారులు పార్లమెంటు పరిశీలనకు పంపిన ‘తెలంగాణాం ధ్ర’ బిల్లులో తెలంగాణ పేరు తొలగించి వలసాంధ్ర గుత్తాధిపత్యానికి నాందిపలికారు. అలా ఆంధ్ర వలసీకరణకు గురై సొంత అస్తిత్వం కోల్పోయి దగాపడ్డ తెలంగాణ ప్రజలు ‘మా తెలంగాణ మాకు కావాలి’ అని తెలంగాణ రాష్ట్రం కోసం ఉధృతంగా ఉద్యమించడంతో, బెంబేపూత్తిన వలసాంవూధవాదులు తమ తీరు మార్చుకోకుండా పేరు మార్చే కుటిల ఎత్తుగడలతో కుహనా సమైక్యాంవూధవాదాన్ని యథాతథంగా కొనసాగించే దుష్టత్వాన్ని చాటుకున్నారు. 

‘ఆంవూధవూపదేశ్ అనే దుష్ట సమాస భూయిష్టమైన పేరుకు బదులు మూడు ప్రాంతాల యావత్తు తెలుగుదేశానికి చెందిన తివేణి సంగమం లాంటి) ‘త్రిలింగాణం’ లేదా తెలంగాణ అనే పేరును స్థిరపరుస్తూ, రాజ్యాంగ సవరణకు ఉద్యమించడం తెలుగుజాతి సమైక్యతకు అవసరం’ అని సీమాంధ్ర సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్ చేసిన ప్రతిపాదనే అందుకు నిదర్శనం. ఈ వలసాంధ్ర పెత్తందారులు తెలంగాణ అస్తిత్వానికే కాదు, రాయలసీమ అస్తిత్వానికి కూడా ఇదే గతి పట్టించారు. ‘ఆంధ్ర రాష్ట్ర’ అవతరణ జరిగే ముందు రాయలసీమ వారు ‘రాయల సీమాంధ్ర’ పేరును ప్రతిపాదించారు. దాన్ని బుట్టదాఖలు చేసి రాయలసీమపై వలసాంవూధవాదాన్ని రుద్దారు. ఇప్పుడు తెలంగాణ విడిపోయినా రాయలసీమను తమ వలసాధిపత్యం కింద ఉంచుకునే ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా రాయల ‘సీమాంధ్ర’ అనే పదాన్ని ఇటీవలే తెరమీదికి తెచ్చారు. వీరి ఆంతర్యాన్ని గ్రహించిన రాయలసీమ ప్రాంత ప్రజలు సైతం ఈ వలసాంధ్ర ఆధిపత్య శక్తులను విశ్వసించడానికి సిద్ధంగా లేరు. 

అందుకే ఈ బూటకపు సమైక్యాంవూధవాదాన్ని బుట్టధాఖలు చేస్తూ, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రత్యేకాంధ్ర అవతరణ దినోత్సవం రోజున 2010 అక్టోబర్ 1న‘సామాజిక జైఆంధ్ర మహాసభ’ స్థాపించాం. అంతకుముందే 2009 డిసెంబర్‌లో సీమాంవూధలో చెలరేగిన కృత్రిమ ఉద్యమాన్ని అభిశంసిస్తూ వలస పెత్తందార్లకు వ్యతిరేకంగా డిసెంబర్ 19న గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించాం. పొట్టి శ్రీరాములు ‘సమైక్యాంవూధకు ప్రతీక కాదు-వూపత్యేకాంవూధకు ప్రతీకరా!’ అని ఎలుగెత్తి చాటాం. ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవాన్ని తిరస్కరిం చి, అంబేద్కర్ స్ఫూర్తితో ‘చిన్న రాష్ట్రాల ఆవశ్యకత దినోత్సవం’గా జరిపాం. ప్రత్యేకాంవూధవాదం తరఫున తెలంగాణవాదానికి సంఘీభావం తెలపడానికి 2011 జనవరి 23న ‘తెలంగాణ ప్రజా ఫ్రంట్’అధ్యక్షులు గద్దర్‌ను ముఖ్య అతిథిగా గుంటూరుకు ఆహ్వానించాం.

భారీ బహిరంగసభ జరిపి తెలంగాణకు జైకొట్టే సామాజిక ఆంధ్ర భేరి మోగించాం. బూటకపు సమైక్యాంధ్ర వక్రభాష్య చరిత్ర బండారాన్ని బైటపెట్టే సాహిత్యాన్ని విరివిగా వెలుగులోకి తెచ్చాం.‘అన్నదమ్ముల్లా విడిపోదాం! విడివిడిగా కలివిడిగా వుందాం, ప్రాంతాలు వేరైనా ప్రజలు వేరు కాదు!, మన గౌరమ్మ, మన బతుకమ్మలను పరస్పరం గౌరవించుకుందాం’ అని చాటి చెప్పాం. లగడపాటి లాంటి వలసాంధ్ర దురహంకార శక్తుల దాడులు, దౌర్జన్యాలను; వలసాంధ్ర పాలకుల అక్రమ కేసులు జైలు శిక్షలకు వెరవకుండా, వెనకడుగు వేయకుండా, సామాజిక ప్రత్యేకాంధ్ర సాధన కోసం సామాన్యులకు కూడగడుతున్నాం. 
తెలంగాణను విలీనం చేసుకున్న ఆంధ్రవూపదేశ్‌తో శ్రీరాములుకు ఎలాంటి సంబంధం లేకపోయినా, ఉన్నట్టు ‘అక్షికమ’ సంబంధాన్ని అంటగట్టారు. అయిదున్నర దశాబ్దాలుగా ఈ అబద్ధాన్ని నిజమని నమ్మించిన ఆంధ్ర వలసవాద అపరగోబెల్స్ దుష్ర్పచారం తె లంగాణ వారినే కాదు, ఆంధ్రవారిని కూడా ప్రభావం చేసింది.
పొట్టిశ్రీరాములు మద్రాసు నగరం కోసం మంకుపట్టుపట్టి అసువులు బాసారు. కనుక ఆయనను ప్రత్యేకాంధ్ర అవతరణకు ప్రతినిధిగా గుర్తించవచ్చు. కానీ ఆంధ్రవూపదేశ్ అవతరణకు ప్రతీకగా మాత్రం గుర్తించలేం. తమిళభాషా ప్రాంతానికి చెందిన మద్రాస్ నగరాన్ని తెలుగు భాషా ప్రాంతమైన ప్రత్యేకాంధ్ర రాష్ట్రానికి రాజధానిగా దక్కించుకోవాలనే తాపవూతయం వెనుక మద్రాసు నగరంలో ఉన్న తమ వ్యాపార ప్రయోజనాల్ని పరిరక్షించుకోవాలనే ఆంధ్రా పెట్టుబడిదారు ల, సినిమా పరిక్షిశమాధిపతుల స్వార్థ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. ఇది బొంబాయి నగరం విషయంలో గుజరాతీ మార్వాడీ వ్యాపారవర్గం ప్రదర్శించిన స్వార్థపరత్వం లాంటిదే. ఇప్పుడు హైదరాబాద్ నగరం విషయంలో కూడా వారిది అదే ధోరణి. ఈ స్వార్థ ప్రయోజనాల కోసమే నాడు పొట్టి శ్రీరాములను బలిపశువును చేసి, బలిపీటమెక్కించి పొట్టన పెట్టుకున్నారు.

ఆధునికంగా వెనుకబడి ఉన్న తెలంగాణను ఆంధ్రతో విలీనం చేస్తే అది వలసాంధ్ర పీడిత ప్రాంతంగా పరిణమిస్తుందని నాడే ఫజలాలీ కమిషన్ తేల్చి చెప్పింది. అయినా ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణేతర మరట్వాడ, కర్నాటక ప్రాంతాలకు చెందిన ప్రతినిధులను, విశాలాంవూధవాద తెలంగాణ కమ్యూనిస్టు ప్రతినిధులను మేనేజ్ చేసి తెలంగాణ విలీనానికి అనువుగా హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయించారు. అంటే మొదటి ఎస్సార్సీ తో సంబంధంలేకుండా ముందే ఏర్పడింది. అలాగే ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం కూడా మొదటి ఎస్సార్సీతో సంబంధం లేకుండా ఏర్పడింది. అయినప్పుడు అసలు ఆంధ్రవూపదేశ్ అవతరణకు ప్రాతిపదిక ఏమిటి?సమైక్యాంవూధవాదమా?కాదు! విశాలాంవూధవాదమా? కాదు, భాషా ప్రయుక్తవాదమా? కాదు! మరేమిటి? సీమాంధ్ర వలసాంవూధవాదం. 

-ఉ.సా.
సామాజిక జైఆంధ్ర సిద్ధాంతకర్త
Namasete Telangana News Paper Dated 18/12/2011

Wednesday, September 14, 2011

సామాజిక భౌగోళిక తెలంగాణ - ఉ.సా. Andhra Jyothi 15/09/2011


సామాజిక భౌగోళిక తెలంగాణ

- ఉ.సా.

భౌగోళిక - సామాజిక తెలంగాణ వాదోపవాదాల్లో ఏదిముందు ఏది తర్వాత? ఏది ముద్దు ఏది వద్దు? ఏది ముఖ్యం ఏది అముఖ్యం? ఏది అద్వితీయం ఏది ద్వితీయం? ఏది పోటీ ఏది కాదు? అనే అంశాలపై హేతుబద్ధం గా జరగాల్సిన సిద్ధాంత చర్చ అవగాహనా రాహిత్య వితండవాద రాద్ధాంతంగా రచ్చకెక్కుతున్నది. భౌగోళిక - సామాజిక ఉద్యమాల్లో ఏ ఉద్యమా న్ని ఎలా గుర్తించాలి? ఆయా ఉద్యమాల్ని బేషరుతుగా బలపర్చాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీమాంధ్ర ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా ఉమ్మడిగా ఎదుర్కొంటున్న కుల-వర్గ దోపిడీ పీడనల సమస్యలే గాక తెలంగాణ ప్రాంత ప్రజలు అదనంగా ఎదుర్కొంటున్న వలసీకరణ ప్రత్యేక సమస్య ఏమిటి?

దాని వలన ఉత్పన్నమవుతున్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రత్యేకత ఏమిటి? స్థలకాలస్థితిగతుల వర్తమాన ప్రాసంగికత (రెలివెన్స్) ఏమిటి? అద్వితీయ ప్రాధాన్యత (ప్రామినెన్స్) ఏమిటి? భౌగోళిక - సామాజిక అంశాల మధ్య పొంతన ఏమిటి? వాటి ఎడల అనుసరించాల్సిన విభిన్న వైఖరులేమిటి? అనే ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలు రాబడితేనే ఈ వితండవాద వివాదంలోని నిజానిజా ల్ని వెలికితీసి ఎవరితప్పేమిటో నిగ్గు తేల్చగలం. ఏ ఉద్యమానికైనా మెజారిటీ ప్రజల న్యాయమైన ఆకాంక్ష ప్రాతిపదికగా వుండాలి. ప్రజాస్వామిక స్వభావం కలిగి వుండాలి. అపుడే అది ప్రజాస్వామిక ప్రజా ఉద్యమంగా పరిగణించబడుతుంది.

ఆ ప్రజా ఉద్యమ పరిధికి, ప్రాంతానికి సంబంధించిన వారెవరూ ప్రజాభీష్టాన్ని కాదనలేని, కాదని మనలేని సామాజిక ఆమోదం లభిస్తుంది. భౌగోళిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, బహుజన సామాజిక న్యాయ ఉద్యమాలు దేనికదే న్యాయమైన, సమంజసమైన ప్రాం తీయ సామాజిక ప్రజాస్వామిక ఉద్యమాలుగానే పరిగణించబడతాయి. సాకులతో, షరతులతో, ఆంక్షలతో, పోటీ నినాదాలతో, ఏ రూపంలో ఈ ఉద్యమాలను వ్యతిరేకించినా, ఆ వ్యతిరేకతను ఏ ముసుగులో కప్పిపుచ్చాలని చూసినా వారు ప్రజా వ్యతిరేకులుగా తిరస్కరించబడతారు.

భౌగోళిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అదనపు ప్రత్యేకత ఏమిటో, బహుజన సామాజిక న్యాయ ఉద్యమం విలక్షణత్వం ఏమిటో, ఈ అంశాలను ఏకకాలంలో ఎలా మేళవించాలో సరిగా అర్థంకాక సైద్ధాంతిక అవగాహనా రాహిత్యంతో ఆచరణలో ఈ తప్పుచేసేవారిని హేతుబద్ధ సిద్ధాంత చర్చతో కనువిప్పు కలిగించి ఉద్యమంలో కలుపుకురావచ్చు. ఇక ఉద్దేశపూర్వకంగా తెలిసితప్పుచేసే స్వార్థపర, సంకుచిత, అశ్రితవాద, అవకాశవాద శక్తుల్నిమాత్రం కళ్లు తెరిపించి కనువిప్పు కలిగించలేం. అందుకే అలాంటి వాళ్లను దృష్టిలో పెట్టుకొని డా.బి.ఆర్. అంబేద్కర్ తన అంతిమ సందేశ వ్యాసంలో "స్వార్థం హేతువుకు లొంగదని, హేతుబద్ద సిద్ధాంత చర్చకి తలొగ్గదని'' స్పష్టం చేశాడు.

ఏ నిబద్ధతకి కట్టుబడకుండా, ఏ నిబంధనకి పట్టుబడకుండా, కనీసం తమ మాటమీదైనా తాము నిలబడకుండా సమయానుకూలంగా «ప్లేటు ఫిరాయించే, ధైర్యంగా బుకాయించే వితండవాద, వివాదాస్పద, అవకాశవాద శక్తులను మాత్రం అవగాహనా పరమైన సిద్ధాంత చర్చతో మార్చలేం. సంకుచిత స్వప్రయోజనాలనే బహుజన ప్రజాప్రయోజనాలుగా, బూటకపు సామాజిక న్యాయాన్నే నిజమైన సామాజిక న్యాయంగా బులిపించేవారి నిజస్వరూపాన్ని బహిర్గతపర్చి, మిగతా బడుగువర్గ బహుజనుల్ని వారి బారిన పడకుండా అప్రమత్తం చేయాలి. సీమాంధ్ర వలస పెత్తందార్ల అంతర్గత వలసీకరణ భల్లూకపు పట్టునుండి బైటపడితే తప్ప తెలంగాణకి దాస్యవిముక్తిలేదనే స్పష్టతతో, స్వపరిపాలనాధికార ఆకాంక్షతో సాగుతున్న ప్రజా ఉద్యమమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం.

ప్రత్యేక తెలంగాణ జన్మహక్కు అని ఎలుగెత్తి చాటుతున్న ఈ భౌగోళిక తెలంగాణ ఉద్యమం దానికదే ఓ ప్రాంతీయ ప్రజాస్వామ్య ప్రజా ఉద్యమం. కనుక బేషరతుగా బలపర్చటంతప్ప దాన్ని వ్యతిరేకించే హక్కు ఎవరికీ లేదు. కానీ ప్రాంతీయ వలసీకరణతోపాటు కుల - వర్గ, పితృస్వామ్య దోపిడీ పీడనల లాంటి అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ఒక్క భౌగోళిక తెలంగాణ ఉద్యమమే చాలదు. తెలంగాణ ప్రాంతీయ నిర్వలసీకరణ ఉద్యమం సీమాంధ్ర అగ్రకుల సంపన్నవర్గాల వలసపెత్తందారీతనం నుండి మాత్రమే దాస్య విముక్తి కలిగిస్తుంది.

అదే దాని ప్రత్యేకత అదే దాని పరిమితి కూడా. అంటే తెలంగాణలో సైతం సర్వసాధారణమైన అగ్రకుల ధనికవర్గాల సామాజిక గుత్తాధిపత్యం యధాతధంగా కొనసాగుతూనే వుంటుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ విభాగంలో, న్యాయవిభాగంలో, సెక్రటేరియట్‌లో తెలంగాణ భౌగోళిక జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయంగా లభించాల్సిన 42 శాతం భాగస్వామ్యం లభిస్తే అందులో అధిక భాగం తెలంగాణ అగ్రకుల ధనికవర్గాలవారే అన్యాయంగా హస్తగతంచేసుకొని సామాజిక అన్యాయానికి పాల్పడ్డారు.

హైకోర్టు అడ్వకేట్ జనరల్, సెక్రటేరియట్ సెక్రటరీలలో అగ్రకుల పెత్తందార్లే ఆధిపత్యం చలాయిస్తున్నారు. దళితులపై వివక్ష, బడుగులపై దాడులు, సంక్షేమ నిధుల దారిమళ్లింపు, స్థానిక సంస్థల్లో బిసిల రాజకీయ రిజర్వేషన్ కుదింపు, స్త్రీల వేధింపు, నేతన్నల ఆకలిచావులు, ఆత్మహత్యలు, క్రాప్ హాలిడేలు, సింగరేణి కార్మికుల రిట్రించ్‌మెంట్ల లాంటి కుల వర్గ పితృస్వామ్య సమస్యలపై పాక్షిక పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. కనుక తెలంగాణ వచ్చేదాకా ఈ సమస్యలపై పోరాటాలు వద్దంటే, భౌగోళిక తెలంగాణ వాదం తప్ప సామాజిక తెలంగాణ వాదం ఊసెత్తొద్దంటే కుదరదు.

కులాతీత, వర్ణాతీత, భౌగోళిక తెలంగాణ వాదం అగ్రకుల ధనికవర్గాలకి లాభదాయకంగా, అణగారిన కులాల పేదవర్గాల వారికి నష్టదాయకంగా పరిణమిస్తుంది. ఈ పరస్పర విరుద్ధ కుల-వర్గ వైరుధ్యం వలన ఎవరి ప్రయోజనాల కోసం వారు పాటుపడతారు. పోటీపడతారు. కుల-వర్గ సామాజిక వాస్తవికతను అలా ప్రతిబింబిస్తుంటారు.

భౌగోళిక సామాజిక తెలంగాణ వాదాలు రెండూ తెలంగాణ దళిత బహుజన పేదవర్గాల జన్మహక్కు. ఈ ఉమ్మడి హక్కును కాదనే హక్కు ఎవరికీ లేదు. మరికాస్త విడమర్చి చెప్పాలంటే భౌగోళిక తెలంగాణ వచ్చేదాకా సామాజిక తెలంగాణ వాదాన్ని పక్కనపెట్టమనే హక్కు తెలంగాణ అగ్రకుల దొరలకు లేనట్లే. సామాజిక తెలంగాణ వచ్చేదాకా భౌగోళిక తెలంగాణ వాదాన్ని పక్కన పెట్టమనే హక్కు దళిత బహుజన బడుగువర్గాల వారికి కూడా లేదు. ఎందుకంటే సీమాంధ్ర పెత్తందారీతనానికి తెలంగాణ అగ్రకుల దొరలతోపాటు బడుగువర్గాల వారు ఉమ్మడిగా గురవుతున్నారు.

అందుకే "ప్రాణాలైనా అర్పిస్తాం, తెలంగాణ సాధిస్తాం'' అనే నినాదానికి ఆచరణాత్మకత కల్పించిన బలిదానాల్లో బడుగులే అత్యధికులు. అలాగే భౌగోళిక సామాజిక తెలంగాణ వాదాలను ఒకదానికొకటి ఎదురెదురుగా పోటీపెట్టి, ఏదొకదాన్ని ముందుపెట్టి మరొకదాన్ని వెనక్కినెట్టే హక్కు ఎవరికీ లేదు. ఒక్కమాటలో భౌగోళిక తెలంగాణకి జై కొడదాం! తెలంగాణకి జైకొట్టే సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణకి కూడా జై కొడదాం.

- ఉ.సా.
చైర్మన్ : సామాజిక ఆంధ్ర - తెలంగాణ సమన్వయ కమిటీ

Sunday, September 4, 2011

స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా పంచాయితీ By Oosa 05/06/2011 Surya News Paper


స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా పంచాయితీ

- వివాదాల ఊబిలో ఎన్నికల ప్రక్రియ
- వాయిదాకే పాలకుల ప్రయత్నం
- మహిళా రిజర్వేషన్లకు క్రీమీలేయర్‌ వద్దా?
- బీసీ లెక్కల సేకరణకు ఎందుకు పూనుకోరు?
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివక్ష
- రాజ్యమేలుతున్న అగ్రకులాధిపత్యం

ఈ సారి జరగనున్న పంచాయితీ రాజ్‌, నగర పాలక సంస్థల ఎన్నికల నిర్వహణ వివాదాస్పదంగా, సంక్లిష్టంగా మారింది. నిర్ణీత కాలా నికి ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఒకవైపు, నిర్వ హించక తప్పనిసరి పరిస్థితి మరొక వైపు ఎదురైంది. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ పరంగా జరపాలా, పార్టీ రహితంగా జరపాలా అన్న సమస్యతో పాటు బీసీ కోటా తగ్గింపు, మహిళా కోటా పెంపు, బీసీ ఓటర్ల జాబితా తయారీ, రోటేషన్‌ విధానం ఖరారు, నగరపాలక సంస్థల్లో మార్పులు చేర్పులు, చట్ట సవరణలు వంటి సమస్యలన్నీ వివాదాస్పదంగా మారి సకాలంలో ఎన్నికలు నిర్వహించటం కష్టంగా, సంక్లిష్టంగా మారింది. ఇలాంటి ప్రతికూల స్థితిలో అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదు గనుక ఈ పరిస్థితి మారేదాకా ఏదొక సాకుతో ఎన్నికల్ని వాయిదా పడేట్టు చేయటానికి పాలకులు పావులు కదుపుతున్నారు. అందుకు పంచాయితీ ఎన్నికల్లో బీసీ కోటా పంచాయితీని పావుగా వాడుతున్నారు.

అన్ని రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటరాదని సుప్రీంకోర్టు విధించిన ఆంక్షల ప్రకారం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సూచనల ప్రకారం 34 శాతం బీసీ కోటాని 24 శాతానికి తగ్గించక తప్పదని ప్రకటించిన అధికార పార్టీ మంత్రివర్గ ఉపసంఘం పెద్దలు- అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఆకస్మాత్తుగా బీసీ కోటా యథాతథంగా కొనసాగిస్తామని ప్రకటించడంలోని ఆంతర్యం- ఎన్నికలు వాయిదా పడేట్లు చూడటమే తప్ప బీసీ కోటా అమలయ్యేట్లు చూడడం కాదు.సుప్రీంకోర్టు ఆంక్షల్ని, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అభ్యంతరాల్ని అధిగమించి బీసీ కోటా ను తగ్గించకుండా యథాతథంగా కొనసాగించటానికి అవసరమైన హేతుబద్ధమైన రాజ్యాంగ బద్ధమైన రక్షణ చర్యలేవీ తీసుకోకుండా- కాగల కార్యాన్ని గంధర్వులే నిర్వహిస్తారన్నట్లు- ఈ బంతిని ఎన్నికల కమిషన్‌, న్యాయస్థానాల కోర్టులోకి నెట్టేయడం అంటే చేతులు దులుపుకోవడమే అవుతుంది. తాము బీసీ కోటా యథాతథంగా కొనసాగించాలని చూసినా ఎన్నికల కమిషన్‌ -కోర్టులు అడ్డుకొన్నాయని నెపం వాటి మీదకు నెట్టి బీసీల ఆగ్రహాన్నించి తాము తప్పించుకోవాలని చూస్తే, ఈ మోసపూరిత ఎత్తుగడలతో బీసీలు మోసపోవటానికి సిద్ధంగా లేరు.

గత ఏడాది మే 11న సుప్రీంకోర్టు కర్ణాటక విషయంలో ఇచ్చిన ఆదేశాలు ఆ రాష్ట్రానికి పరిమితమైనవే తప్ప ఆంధ్ర ప్రదేశ్‌కు, అన్ని రాష్ట్రాలకు వర్తించేవి కావని ఇప్పుడు నమ్మబలుకుతున్న కాంగ్రెస్‌ మంత్రులు- ఇప్పటిదాకా వర్తిస్తాయని ఎందుకు వాదించారో సమాధానం చెప్పాలి. వర్తించకపోయినా వర్తింపజేసి బీసీ కోటా తగ్గించి, అగ్రకులాధిపత్యాన్ని పదిలపర్చుకొందామనే పన్నాగంతో అలా వాదించారా? ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అనే స్త్రీవాద నినాదంలాగే- జనాభాలో సగం, అవకాశాల్లో సగం అని బీసీ వాదులు ఎప్పటినుండో ఘోషిస్తురు.

అయినా, మహిళా రిజర్వేషన్‌ కోటాని 33 శాతం నుండి 50 శాతానికి పెంచి, బీసీ కోటాని మాత్రం 34 శాతం నుండి 24 శాతానికి తగ్గించడంలో అగ్రకుల వివక్ష బట్టబయలు కావడం లేదా? నిజానికి మహిళా సామాజిక వర్గం కులాతీత స్వతంత్ర సామాజిక వర్గం కాకపోయినా వారి రిజర్వేషన్‌ కోటాని సుప్రీంకోర్టు సీలింగ్‌ పరిధిలోకి, క్రీమీలేయర్‌ పరిధిలోకి తేకుండా ఉంచడం, బీసీ కోటాకి సీలింగ్‌, క్రిమిలేయర్‌ ఆంక్షలు విధించటం, మహిళా కోటాలో దళిత మహిళలకి చోటుకల్పించి, బీసీ మహిళలకు చోటు లేకుండాచేసి, ఓసి కోటా పేరిట ఎఫ్‌సీ మహిళల అగ్రకులాధిపత్యానికి పెద్దపీట వేయటం బీసీలను అణగదొక్కటంకాదా?

బీసీల్లో నిజంగా అర్హులైన వారికి రిజర్వేషన్‌ అవకాశాల్ని కల్పించడం కోసమే క్రీమీలేయర్‌ ఆంక్షలు విధించామని చెప్పడం సాకు మాత్రమే. ఆ సాకుతో బీసీకోటాని కుదించి బీసీ ముసుగులో అగ్రకులాధిపత్యాన్ని కొనసాగించుకోవడమే అంతర్యం. అందుకే క్రీమీలేయర్‌ని మినహాయించటంలో ఎంతో ఆసక్తి చూపే అగ్రవర్గాల పాలకులు బిసిలలో అత్యంత వెనుకబడిన క్రీమీలేయర్‌ ఎంబీసీల ఎడల ఎలాంటి శ్రద్ధ చూపక పోవటమే అందుకు నిదర్శనం. అంతేకాదు, అన్ని రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు సీలింగ్‌ విధించడం వలన, బీసీ కోటా రాష్ట్రంలో 25 శాతానికి (కేంద్రంలో 27 శాతానికి) కుదిస్తున్నారు.

విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్‌లలో ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయడం వలన ఉన్నంతలో ఆ 25 శాతాన్ని గ్రూపుల వారిగా 7-10-1-7 చొప్పున అన్ని గ్రూపుల వారికి సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. కానీ స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ పాటించకపోవడం వలన అత్యంత వెనుకబడిన ఎంబీసీ కులాల వారికి కనీస అవకాశాలు కూడా దక్కటంలేదు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ స్థానాలు దక్కకపోవడమే కాదు- కనీసం సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులు కూడా దక్కడంలేదు. ఈ దుస్థితి మార్చటానికి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల కోటాలో ఏబీసీడి వర్గీకరణ పాటించాలని హైకోర్టు అదేశించినా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ పేరిట అడ్డుకోవటాన్ని బట్టి ఎంబీసీల పట్ల వారికి ఎలాంటి శ్రద్ధ ఉందో అర్థమవుతోంది.

సుప్రీంకోర్టు విధించిన పరిమితిని అధిగమించడానికి అవసరమైన రాజ్యాంగబద్ధ, చట్టబద్ధ చర్యలేమీ తీసుకోకుండా గాలిలో దీపం పెట్టినట్లు వ్యవహారించడం బాధ్యతా రాహిత్యంకాదా? బీసీ కోటా యథాతథంగా కొనసాగిస్తామని మభ్యపెడితే కోర్టు తప్పుపడుతుందని తెలిసి కూడా ఆ నిజాన్ని కప్పిపుచ్చడం బీసీలను బలిబశువులను చేయడం కాదా? బీసీ కోటాని కొనసాగించటానికి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవడానికి, రాజ్యాంగ సవరణలు చేయటానికి తగిన సమయం లేదని, బీసీ కోటా తగ్గించడం భావ్యంకాదని, ఈ సారికి బీసీ కోటా కొనసాగించటానికి అవకాశం ఇవ్వమని ఎన్నికల కమిషన్‌ను, కోర్టులను అభ్యర్ధిస్తామని చెప్పటం కూడా ఎన్నికల్ని వాయిదా వేయించే రాజకీయ నాటకంలో భాగమేనని భావించక తప్పదు.

గత ఏడాది మే 11న సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఇప్పటికి ఏడాది కాలందాటి పోయింది. ఎన్నికల గడువు ముంచుకొచ్చేదాకా కాలయాపన చేసి ఇప్పుడు సమయంలేదని చెప్పటం సాకు మాత్రమే. 2009 ఎన్నికల్లో తమ రాజకీయ లబ్ధికోసం దివంగత వై.ఎస్‌. ఆధ్వర్యంలో ఓటు బ్యాంకు ఎత్తుగడలతో బీసీ జాబితాలో అనేక కులాల్ని చేర్చినందువలన పెరిగిన బీసీ జాబితాకి అనుగుణంగా 40 శాతం దాకా కోటా పెంచటానికి రాష్ట్ర బీసీ కమిషన్‌ గత ఏడాది చర్యలు చేపట్టిన సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియనిది కాదు.

మే 11న ‘కర్ణాటక బీసీ కోటా’లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆ రాష్ట్రంలో అమల్లో వున్న 68 శాతం రిజర్వేషన్‌ కోటా- 50 శాతం పరిమితిని దాటిపోవటాన్ని తప్పుపట్టినమాట నిజమే. ఆ కోటాకి తగిన విధంగా జనాభా లెక్కలు చూపకపోవటం అభ్యంతరకరం అని చెప్పిన మాట కూడా నిజమే. కానీ అదే ఏడాది 2010 జులైలో తమిళనాడు కోటా విషయంలో జరిపిన 9 మంది న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం 50 శాతం పరిమితి దాటి బీసీ రిజర్వేషన్‌ కోటా పెంచదలిస్తే- బీసీ జనాభా అంత ఎక్కువగా ఉన్నట్టు ఆధారం చూపాలని చెప్పింది.

తమిళనాడు రాష్ర్ట ప్రభుత్వం అలాంటి బీసీ జనాభా లెక్కలు ఆధారంగా చూపింది గనుక 50 శాతం మించి 69 శాతం కోటా కొనసాగించడం సమసంజసమేనని తీర్పు చెప్పింది. అంతేకాదు, 1990 నాటి మండల్‌ కమిషన్‌ సిఫార్సుల సందర్భంగా ఇంద్రషానీ కేసులో 50 శాతం పరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సర్వవేళలా అనుల్లంఘనీయం కాదని కూడా వ్యాఖ్యానించింది. 2010లో ఒకే ఏడాదిలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల రిజర్వేషన్‌ కోటాల విషయంలో వెలువడిన సుప్రీంకోర్టు తీర్పులు రెండూ పరస్పర విరుద్ధమైనవి కావు. క్వాంటఫైబుల్‌ బీసీ జనాభా డేటా ఆధారంగా ఉంటే, ఆ జనాభాకి తగిన అవకాశాలు కల్పించడం రాజ్యాంగబద్ధ సామాజికన్యాయ స్ఫూర్తికి విరుద్ధం కాదనేదే ఆతీర్పు సారాంశం.బీసీ జనాభా లెక్కల్ని ఆధారంగా చూపకపోవడం వలన కర్ణాటకలో అమల్లో వున్న 68 శాతం కోటాను 50 శాతానికి తగ్గించాలని ఆదేశించింది. అది కూడా వెంటనే కాకుండా 68 శాతం కోటాను ఏడాది పాటు 2011 దాకా కొనసాగించుకోవచ్చని, ఆ లోగా బీసీ జనాభా లెక్కల సేకరణ చేపట్టమని సూచించింది. తమిళనాడు రాష్ర్ట ప్రభుత్వం బీసీ జనాభా లెక్క ల్ని ఆధారంగా చూపించింది గనుక అక్కడ 69 శాతం కోటాని కొసాగిం చుకోవటానికి అనుమతించింది.

ఈ స్ఫూర్తిని ఆధారం చేసుకొనే గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌ బీసీ కమిషన్‌ పెరిగిన బిసి జాబితాకి అనుకూలంగా బీసీ కోటా ప్రక్రియ చేపట్టింది. అందకు తగిన బీసీ జనాభా లెక్కల్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సేకరించిన మల్టీ పర్పస్‌ హౌస్‌ హోల్డ్‌ సర్వే నిర్థారించిన 42 శాతం బీసీ జనాభా లెక్కల్ని ఆధారంగా చేసుకొంది. ఇంకా నికరమైన, నిర్థిష్టమైన శాస్త్రీయమైన బీసీ జనాభా లెక్కల సేకరణ జరపటానికి, 2009 తర్వాత బీసీ జాబితాలో చేర్చిన కొత్త కులాలతో సహా బీసీ కులాలన్నిటి జనాభా లెక్కలు సేకరించటానికి రూ. 50 కోట్ల నిధుల్ని మంజూరు చేయమని రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరింది.

పెరిగిన బీసీ జాబితాకి అనుగుణంగా బీసీ కోటా పెంచడానికి బీసీ కమిషన్‌ ఇంత బాధ్యతాయుతంగా కృషి చేసి రాష్ర్ట ప్రభుత్వ సహాయ సహకారాలను అర్థిస్తే, నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యం చేసినది చాలక కర్ణాటక రాష్ర్టంపై తీర్పు మేరకు బీసీకోటా తగ్గించక తప్పదనే వైఖరి తీసుకోవడం కాంగ్రెస్‌ అగ్రకులాధిపత్య కుట్ర తప్పవేరేమికాదు. బీసీ కోటా పెంచకుండా బీసీ కులాల జాబితా పెంచే బాధ్యతా రహిత వైఖరిని రాష్ట్ర ప్రభుత్వమే గాక, ఇటీవల ఒబిసి కులాల జాబితా పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చేపట్టడం చూస్తే వీరి వైఖరి బీసీలను అణచివేయటమేనని స్పష్టమవుతోంది.

అంతే కాదు 72, 73 రాజ్యాంగ సవరణల ప్రకారం 1994 నుండి 2006 దాకా మూడు సార్లు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు జరగడం రాజ్యాంగ బద్ధం, చట్టబద్ధం అయినప్పుడు- సుప్రీంకోర్టు ఆంక్షలు విధించడం న్యాయం కాదు. ఒకవేళ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం అనివార్యమైతే 34 శాతం బీసీ కోటాకి రక్షణ కల్పించే విధంగా రాజ్యాంగ సవరణ చేయడం కేంద్రప్రభుత్వం బాధ్యత.

బీసీ కోటాకి ఆంక్షలు విధిస్తూ గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణకి పూనుకొని బీసీలకు కల్పించిన రాజకీయ రిజర్వేషన్‌ హక్కుల్ని, అవకాశాల్ని రక్షించి ఉండాల్సింది. లేదా కేంద్రప్రభుత్వ మార్గదర్శకత్వంలో రాష్ట్రాలవారీ బీసీకులాల జనాభా లెక్కల సేకరణకి అనుమతి ఇచ్చి అందుకు తగిన చర్యలు తీసుకుని ఉండవలసింది. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఉన్నా బీసీల ఎడల ఆ రెండూ ఒకే రకంగా వివక్ష చూపడం అగ్రకులాధిపత్య వైఖరికి నిదర్శనం. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నియామకాల్లో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం కోసం వెంపర్లాడడమే జరుగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం దొడ్డిదారిలో బీసీ కోటాకి భంగం కలిగిస్తే, ఎన్నికల్ని వాయిదా వేస్తే, బీసీల ఆగ్రహానికి గురై తగిన మూల్యం చెల్లించుకోలేక తప్పదు.