Showing posts with label చుండూరు తీర్పు. Show all posts
Showing posts with label చుండూరు తీర్పు. Show all posts

Thursday, May 15, 2014

చుండూరు హంతకులెవరు? By రచయిత న్యాయవాది


దేశవ్యాప్త సంచలనం చుండూరు నరమేథం
2007లో శిక్షలు విధించిన ప్రత్యేక కోర్టు 
2014లో హైకోర్టు ద్విసభ్య బెంచ్‌చే రద్దు 
జడ్జీల విచక్షణాధికారానికి ఉదాహరణ 
స్పందించని రాజకీయ పార్టీలు 
15 ఏళ్ళక్రితం కేసులో సాక్ష్యాలు కీలకం
బలమైన ప్రాసిక్యూషనూ అవసరమే 

రాజ్యాంగపరంగా శాసన, కార్య నిర్వా హక, న్యాయశాఖలు ఏర్పాటయ్యా యి. వీటిలో శాసన, కార్యనిర్వాహకశాఖలు పరస్పరపూరకమైన అవినాభావ సంబంధం కలిగి తమ బాధ్యతలు తాము నిర్వహిస్తున్నాయి. కార్యనిర్వాహకశాఖపై శాసనశాఖ పూర్తి ఆధిప త్యాన్ని చలాయిస్తుం దనేది అందరికీ తెలిసినదే. శాసనవ్యవస్థ చేసిన చట్టాలను అమలు చేయడానికి తాను క్షేత్ర స్థాయిలో పనిచేస్తుంది. అందుకే పరోక్షంగా కార్యనిర్వాహక వ్యవస్థ శాసనవ్యవస్థకు అనుబంధంగా పనిచేస్తుంది. ప్రభుత్వమే కార్యనిర్వాహక బాధ్యతలను పర్యవేక్షిస్తుంది కనుక శాసనవ్యవస్థ ఇష్టాయి ష్టాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. కానీ న్యాయవ్యవస్థ వీటికి భిన్నంగా పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కలిగి పనిచేస్తుంది. దీనిపై శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల ప్రభావం కానీ, పర్యవేక్షణకానీ ఉండదు. 

న్యాయవవస్థకుగల భిన్నమైన లక్షణాల్లో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడమే కాకుండా రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలను శాసనవ్యవస్థ తయారు చేసినప్పుడు, లేదా రాజ్యాంగ హక్కులను పౌరులకు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైనప్పుడు న్యాయస్థానాలు ప్రభుత్వాలను మందలించే అధికారాలను కలిగిఉంటాయి. రాజ్యాంగానికి రక్షణకర్తగా న్యాయవ్యవస్థ అప్రమత్తంగా ఉంటుంది. సాధారణంగా రాజకీయపార్టీలు తమ ప్రణాళికలను అమలుచేయడానికి ప్రభుత్వాలుగా ఏర్పడి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తాయి. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి ధర్మకర్తగా వ్యవహరిస్తుంది. న్యాయవ్యవస్థకు ఉన్న ప్రమాదకరమైన లక్షణాల్లో ఒకటి- న్యాయమూర్తులు తమ తీర్పులను ఇవ్వడంలో విచక్షణాధికారం కలిగి ఉంటారు. ఈ అధికారాన్ని తన పై న్యాయమూర్తి కూడా ఆక్షేపించడానికి లేదా త„ప్పుపట్టడానికి వీలులేదు. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడంలోకానీ, కేసులను విచారించి తీర్పులను ప్రకటించడంలో కానీ ఒక్కో న్యాయమూర్తి ఒకో విధమైన అభిప్రాయంతో ఉంటారు. ఈ అభిప్రాయాన్ని త„ప్పుపట్టడానికి ఇంకెవరికి ఏ అధికారం లేదు. క్షేత్ర స్థాయిలో ఉండే మెజిస్ట్రేట్‌ నుండి సుప్రీం కోర్టు ఛీప్‌ జస్టిస్‌ వరకు కూడా ఇదే విధమైన విచక్షణాధికారాన్ని కలిగి ఉంటారు. కాకపోతే మెజిస్ట్రేట్‌ ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ జిల్లా కోర్టుకు అప్పీలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ అప్పీల్లో కూడా క్రిందికోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదని పైకోర్టు తీర్పు ఇస్తే పైకోర్టు తీర్పు చెల్లుబాటు అవుతుంది. 

ఆ విధంగా జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేయవచ్చు. అక్కడ జిల్లాకోర్టు తీర్పును సమర్థించవచ్చు, లేదా రద్దుచేయవచ్చు. ఈ విధంగా క్రిందికోర్టులో ఇచ్చిన తీర్పుపై నిందితులు లేదా బాధితులు పైకోర్టులకు అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గానీ, ఆ జడ్జీలను వ్యక్తిగతంగా వ్యాఖ్యానించడానికిగానీ, వివరణ కోరడానికి గానీ, లేదా ఆ పదవినుండి తొలగించమని కోరడానికి గానీ అవకాశం లేదు. ఈ విచక్షణాధికారం ఒక్క న్యాయవ్యవస్థలోనే ఉంది. ఇంతటి మహత్తరమైన ఈ అధికారాన్ని- న్యాయమూర్తులు తమ మానసిక, కుల, మత, లింగ, ప్రాంత వివక్షలకు తావులేకుండా, రాజ్యాంగ సూత్రాలకు, న్యాయ ప్రక్రియకు లోబడి ఉపయో గించాల్సి ఉంటుంది. శాసనవ్యవస్థ ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనది అయినప్పటికి ఈ విధమైన వెసులుబాటు కేవలం న్యాయమూర్తులకే ఇవ్వడం జరిగింది. విచక్షణాధికారం ఖచ్చితంగా సహేతుకంగా ఉండితీరాలి. వారి మానసికవైఖరులకు, వారి సైద్ధాంతిక భావజాలానికి అతీతంగా ఉండితీరాలి. న్యాయమూర్తుల తీర్పులపై అప్పుడ„ప్పుడు రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైన ప్రకంపనలు ఏర్పడుతున్నాయి. గత నెల 22న హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇందుకు మరోసారి దారితీసింది. 

1991 ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరులో కమ్మ కులస్థులు ఎస్‌.సి. మాల కాలనీపై మూకుమ్మడిగా దాడులు చేసి, వారిని వేట కొడవళ్లతో, గొడ్డళ్ళతో నరికివేసి, శవాలను ముక్కలుగాకోసి తుంగభద్ర కాలువల్లో పడేసి, 8 మందిని హతమార్చి మారణకాండ సృష్టించారు. ఈ మారణహోమం అప్పట్లో జాతీయ స్థాయిలో సంచలనం రేపింది. దళిత ఉద్యమాలు తీవ్రం కావడంవల్ల కేంద్రప్రభుత్వం ఈ ఊచకోత ఘటనపై విచారించడానికి చుండూరులోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసింది. ఈ కోర్టు సుదీర్ఘకాలం పాటు విచారణ జరిపి, 2007లో 21 మంది నిందితులకు జీవితఖైదు, 35 మంది నిందితులకు సంవత్సరం కారాగారశిక్ష విధిస్తూ 123 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో 8 మంది విగతజీవులు కాగా, ఉద్యమం నడిచే క్రమంలో ప్రత్యక్ష సాక్షుల్లో ఒకరు పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. సుమారు 15 సంవత్సరాలపాటు ప్రత్యేక కోర్టు స్థానికంగా విచారణ జరపడాన్నిబట్టి, న్యాయస్థానాలు కేసుల విచారణలో ఏ విధంగా సమయాన్ని తీసుకుంటున్నాయో అర్థంచేసుకోవాలి. సాధారణంగా హత్యకేసులను సంవత్సరకాలం లోపే విచారణ జరుపుతారు. 

ఘటన జరిగిన చుండూరులోనే ప్రత్యేకకోర్టు ఏర్పాటు చేసినప్పటికి 15 సంవత్సరాల కాలం పట్టిందంటే సాక్షులను, బాధితులను ఏస్థాయిలో బెదిరింపులకు గురిచేశారో ఊహించు కోవచ్చు. 2007లో ప్రత్యేక కోర్టు తీర్పు ప్రకటించడంతో బాధితులు కొంత న్యాయం జరిగిందని భావించారు కానీ, నిందితులే ప్రత్యేక కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేశారు. హైకోర్టు గతనెల 22వ తేదీన ప్రత్యేక కోర్టు ఇచ్చిన 21 మందిపై జీవితఖైదు శిక్షను రద్దుచేస్తూ తీర్పును ప్రకటించింది. ఎల్‌. నర్సింహారెడ్డి, జి.ఎస్‌. జైస్వాల్‌ల ద్విసభ్య బెంచి వెలువరించిన ఈ తీర్పు యావత్‌ భారత… దళిత, ప్రగతిశీల ఉద్యమకారులను తీవ్ర కలవరానికి గురిచేసింది. సభ్యసమాజం చూస్తుండగా మూకుమ్మడిగా దాడులుచేసి 8 మందిని ఊచకోతకోసిన ఘటన మాత్రం చరిత్రలో కలిసిపోయింది. 

ఈ ఘటన జరిగిన 23 సంవత్సరాలకు నిందితులందరూ నిర్దోషులేనని తీర్పు ఇవ్వడం వెనుక కారణాలేమిటో పరిశీలించాలి. న్యాయమూర్తులకు ఉన్న విచక్షణాధికారం ఏ స్థాయిలో తమ తీర్పుల్లో ప్రదర్శితమవుతుందో చెప్పడానికి ఈ తీర్పును ఉదాహరణగా తీసుకోవచ్చు. 
ఈ తీర్పుపై ఏ రాజకీయ పార్టీ స్పందించక పోవడంపట్ల విచారించాల్సిన పనిలేదు. ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు దళిత వ్యతిరేక పార్టీలే. ఈ తీర్పును నిరసిస్తూ రెండు మూడు నిరసన సభలు జరిగాయి. వాటిలో ఈ నెల 4న హైదరాబాద్‌ లోని సుందరయ్య విజ్ఞానభవన్‌లో ఏర్పాటుచేసిన రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్‌‌స ఒకటి. దీనికి మీడియా ప్రతినిధులతో కలిపి కేవలం100 మంది వరకు హాజరయ్యారు. రాజకీయ పార్టీలే కాదు, దళిత ఉద్యమాలని లేదా కుల సంఘాలని చెప్పుకునే వేలాదిమంది నాయకులూ హాజరు కాలేకపోయారు. ఈ సమావేశంలో రెండు తీర్మానాలు చేశారు. 1. న్యాయమూర్తుల్లో ఒకరైన ఎల్‌. నర్సింహారెడ్డిని ఆ పదవినుండి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం. 2. కుల నిర్మూలన కోసం దళిత విశాల ఐక్య వేదికలను ఏర్పాటుచేసి ఉద్యమించడం. ఇందులో మొదటి తీర్మానం ఆచరణయోగ్యమేనా?

హైకోర్టు జడ్జీలు రాష్టప్రతి ఆమోదముద్రతో నియమితులవుతారు. వారిని తొలగించడం రాష్టప్రతి ద్వారానే సాధ్యమవుతుంది. ప్రభుత్వాలకు ఆ అధికారంలేదు. కాకపోతే, వీరిని తొలగించడానికి పార్లమెంటులో అభిశంసన తీర్మానం చేయాల్సిఉంటుంది. ఉభయసభలు ఈ తీర్మానంచేసి రాష్టప్రతికి పంపిస్తే, ఆయన ఆ తీర్మానాన్ని ఆమోదిస్తూ జడ్జిని పదవీచ్యుతుణ్ణి చేస్తారు. ఈ తతంగం జరగాలంటే ఎంత సమయం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. జడ్జీలు అవినీతికి పాల్పడినట్లు లేదా అసాంఘిక, అనైతిక చర్చలకు పాల్పడినట్లు ఖచ్చితమైన ఆధారాలుంటేనే అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతారు. జడ్జీల తీర్పుల ఆధారంగా వారిపై అభిశంసన తీర్మానం చేసే అవకాశం లేదు. 

జడ్జీల వ్యక్తిగత అభిరుచులు, వైఖరులు వారి తీర్పులను అంతర్గతంగా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ఆ మేరకు కోర్టు బయట ఎవరు వ్యాఖ్యానం చేసినా దాని ప్రభావం ఆ జడ్జీలపై గానీ ఆ కోర్టులపైగానీ పడదు. కేసు విచారణలో ఉన్నప్పుడు కోర్టులోగానీ బయటగానీ ఆ కేసు గురించి లేదా జడ్జీల వ్యక్తిగత విషయాల గురించిగానీ ఆరోపణలు చేస్తే అది కోర్టు ధిక్కారనేరం అవుతుంది. తీర్పు వెలువడింది కాబట్టి జడ్జిపై వ్యక్తిగత ఆరోపణలు, నిరసనలు చేస్తున్నారు కానీ- అవి తీర్పులను ఏ రకంగానూ మార్చలేవు. కేసుల విచారణలలో, తీర్పులలో వచ్చే బేధాలపట్ల సామాన్య ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతుంటారు. ప్రజల మధ్యనే ఒక సంఘటన లేదా నేరం జరిగినప్పటికీ, ఆ కేసులో నిందితులు నిర్దోషులుగా ఎలా శిక్షనుండి తప్పించుకుంటారో వారికి అర్థంకాదు. అదే రకంగా కేసుతో సంబంధంలేని అమాయకులు కేసుల్లో శిక్షలకు ఎందుకు గురవుతారో కూడా వారికి అర్థంకాదు. 

ఇందుకు ప్రధానమయినవి రెండు కారణాలు: 1. సాధారణంగా హత్య కేసులో- ముందుగా పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని, ఆయుధాలను సేకరించి, సాక్షులను విచారించి, కేసు దర్యాప్తుచేసి హతుల వివరాలు, నిందితుల వివరాలు, ఘటన జరిగిన నేపథ్యం, ప్రత్యక్ష సాక్షులు- వగైరాలను గుర్తిస్తారు. తర్వాత అభియోగ పత్రాలను కోర్టులో నివేదిస్తారు. పోలీసులు చేసే కీలకమైన బాధ్యత ఇది. ఈ చార్జిషీటులోనే కేసుకు సంబంధించిన కీలకమైన అంశాలన్నీ ఉంటాయి. సి.ఆర్‌.పి.సి. 161 - స్టేట్‌మెంట్‌లకు, కోర్టులోచెప్పే సాక్షాలకు పూర్తి సారూప్యతఉండేలా పోలీసులు జాగ్రత్త వహించాలి. సాక్ష్యం చెప్పేటపుడు ఘటన జరిగిన నేపథ్యాన్ని- ముందుది వెనుకాల, వెనుకది ముందు చెప్పడంవల్ల కేసు బలహీనమయ్యే అవకాశం ఉంటుంది. అందుకు సాక్షులకు పోలీసులు, ప్రభుత్వ న్యాయవాది అవగాహన కల్పించాలి. ఘటన జరిగిన ప్రదేశం, సమయం, ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాలు- కేసులో కీలకంగా తీర్పుకు కారణమవుతాయి. ఈ కోణంలో చూచినప్పుడు, 15 సంవత్సరాలలో పోలీసులు ఈ కేసులో దర్యాప్తు క్షుణ్ణంగా చేసితీరాలి. ఒకవేళ ఏదైనా లోపం జరిగిఉంటే దానిని ప్రత్యేక కోర్టులోనే సవరించాల్సి ఉంటుంది. 2. కోర్టులో ప్రాసిక్యూషన్‌ నైపుణ్యంగా నిర్వహించడం చాలా అవసరం. అభియోగాలను, ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాలకు సారూప్యత ఉండే విధంగా సాక్ష్యాన్ని ఇప్పించాలి. చాలా కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటికి రావడానికి ప్రాసిక్యూషన్‌ విఫలం కావడం ప్రధాన కారకం. 

ఇది క్రింది కోర్టుల్లో జరిగే లోపం. అప్పీలు కోర్టులో దీనిని సవరించే అవకాశం లేదు. ఈ కేసు పరంగా చూసిన„ప్పుడు ప్రత్యేక కోర్టులో ప్రాసిక్యూషన్‌ వైపున ఏదైనా లోపం జరిగిందా, ఏ విషయంలోనైనా నిర్లిప్తంగా వ్యవహరించడం జరిగిందా- పరిశీలించాలి. ఈ రెండు కారణాల్లో ఏదీ లోపం లేదనుకున్నపుడు హైకోర్టు జడ్జీలు దళిత వ్యతిరేకమైన, ప్రజా వ్యతిరేకమైన, సహజ న్యాయవ్యతిరేకమైన తీర్పును ఇచ్చినట్లుగా భావించవచ్చు. ఒకవేళ ఈ జడ్జీలు తమ తీర్పులో న్యాయప్రక్రియకు వ్యతిరేకమైన లేదా విచక్షణాధికారంలో తమ మానసిక, కుల, మత, లింగ, ప్రాంతీయ వివక్షలకు ప్రాముఖ్యత ఇచ్చారని రూఢిగా భావిస్తే, అప్పుడు సుప్రీం కోర్టులో ప్రభుత్వమే హైకోర్టు తీర్పుపై అప్పీలుకు పోవాల్సి ఉంటుంది. ఈ కేసులో తీర్పు అంశాలను ఉద్యమకారులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. దళిత వ్యతిరేకమైన ఈ తీర్పు రావడానికి ప్రధాన కారణమేమిటో గుర్తించినప్పుడు, ఉద్యమలక్ష్యం బోధపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయవలసిన ఆవశ్యకతఉంది.తీర్పు ప్రతులను అధ్యయనం చేసి, సుప్రీం కోర్టులో అప్పీలు చేసేలా ప్రభుత్వాన్ని వేగిరపరిచేందుకు ఉద్యమం తోడ్పడాలి.

Surya Telugu News Paper Dated: 16/05/2014 

Thursday, May 1, 2014

అగ్రకుల దురహంకారానికే హైకోర్టు ఓటు By డాక్టర్‌ శ్రీనివాసరావు చొప్పర


Posted on: Thu 01 May 02:39:55.269521 2014

            మరోవైపు ప్రభుత్వం సైతం ఈ కేసు విచారణ పట్ల దుర్మార్గమైన నిరాసక్తతనూ, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి దోషుల ప్రయత్నాలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహకరించింది. ప్రత్యేక కోర్టుకు జడ్జిగా నియమించబడ్డ జస్టిస్‌ డాక్టర్‌ ప్రభాకరరావును ముద్దాయిల ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఒంగోలుకు బదిలీ చేసింది. ఇంతకూ ముద్దాయిల ఫిర్యాదు ఏమిటంటే 'హతుల సామాజిక వర్గానికి చెందిన జడ్జి ఆ సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తాడు', కాబట్టి ఆయనను బదిలీ చేయాలనేది వారి ఫిర్యాదు. హంతకులు ఊహించి మాత్రమే చేసిన ఆరోపణ ఆధారంగా అటు ప్రభుత్వం, ఇటు హైకోర్టు వారికి వంతపాడాయి. ఏ సామాజిక వర్గానికి చెందిన జడ్జి ఆ సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తాడు అన్న ఫిర్యాదు న్యాయబద్ధమైందిగా తోచిన ప్రభుత్వానికి హైకోర్టులో ఆ న్యాయసూత్రం ఎందుకు వర్తింపజేయలేదు?
          అందరూ శాఖాహారులైతే బుట్టలో రొయ్యలెలా మాయమయ్యాయి అన్నది ఒకనాటి ప్రశ్న. అందరూ నిర్దోషులైతే చుండూరు మారణకాండకు దోషులెవరు అనేది నేటి మిలీనియం ప్రశ్న. పట్టపగలు పోలీసు సమక్షంలో నరమేధం సృష్టించి ఎనిమిది మంది దళితులను నరికిచంపి, అనేకమందిని తీవ్రగాయల పాల్జేసి, కాళ్లూచేతులూ తెగ్గొట్టి చుండూరు దళితవాడను వల్లకాడు చేసిన నరహంతకులు అంతా నిర్దోషులైతే మరి దోషులెవరు? ఈ నెల 22వ తేదీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ చుండూరు నరమేధంపై ఇచ్చిన తీర్పు అగ్రకుల దురహంకారాన్ని పచ్చిగా సమర్థించడమే కాకుండా, ఈ వ్యవస్థ పైన, వ్యవస్థలో భాగస్వాములైన పోలీసు, న్యాయ, కార్యనిర్వాహక వర్గాలపై గతంలో వేసిన అనేక ప్రశ్నలే మళ్లీ తలెత్తుతున్నాయి. అనుమానాలు బలపడుతున్నాయి. నాడు కారంచేడు విషయంలో హైకోర్టు ఏ సాంకేతిక లోపాలనైతే ఎత్తిచూపి కేసు కొట్టివేసిందో, నేడు అవే అంశాలను చూపి ప్రత్యేక కోర్టు 21 మందిపై విధించిన యావజ్జీవ శిక్షను, 35 మందిపై విధించిన ఒక సంవత్సరం శిక్షను హైకోర్టు రద్దు చేస్తూ వారెవ్వరూ దోషులు కారని ప్రకటించింది. క్రింది స్థాయిలో ప్రాసిక్యూషన్‌ (విచారణ తీరు, సాక్షులను ప్రవేశపెట్టడంలో సంబంధిత సిబ్బంది) సరిగా జరగలేదని ప్రత్యేక కోర్టు నైతికతపై ఆధారపడింది తప్ప సాక్ష్యాలపై కాదని చెప్పింది. అందుకు రెండు సాక్ష్యాలను (మొత్తం 70 సాక్ష్యాలు) చూపింది. అలా అది మరోసారి అగ్రకుల దురహంకారానికే ఓటు వేసింది. 
           రాష్ట్రంలో ఒకవైపు రాష్ట్రపతి పాలన, మరోవైపు ఎన్నికలు జరుగుతున్న వేళ కోర్టు తీర్పుకు ముహూర్తం పెట్టడంలో గల ఆంతర్యం ఏమిటి? రాష్ట్ర ప్రజలంతా ఎన్నికల గోదాలో ముమ్మరంగా మునిగితేలుతుండగా, ప్రశ్నించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఏదీ లేకపోవడం వల్ల దళితులను ప్రక్కదారి పట్టించవచ్చు, నిరసన అంటూ ఏదీ లేకుండా చేయవచ్చు అనే పథకమే ఇందులో కన్పిస్తుంది. ఎందుకంటే ఏ సామాజిక వర్గమైతే అక్కడ నరమేధం జరిపిందో అదే సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల వెంటనే వ్యతిరేకత వస్తుందనే దానితో ఈ కాలాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ప్రాసిక్యూషన్‌లో ఎన్నో లోపాలు ఉన్నాయని హైకోర్టు తప్పుబట్టింది. అంటే బాధితుల తరపున బలమైన సాక్షులను ప్రవేశపెట్టడంలో, దోషులను నిర్థారించడంలో విఫలమైందని తెలిపింది. నిజానికి ప్రాసిక్యూషన్‌ విఫలం చెందడం కాదు ఒక పథకం ప్రకారమే కేసు నీరుగార్చిందని చెప్పవచ్చు. ఘటన జరిగిన క్షణం నుంచి విచారణ పూర్తి అయ్యేంత వరకు పోలీసు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగానే ఉంది. నాడు ఆగస్టు 6న చుండూరులో పెద్దఎత్తున మోహరించి ఉన్న పోలీసులు దాడిని నిరోధించడానికి గాని, దళితులను కాపాడడానికి గాని ఏ ప్రయత్నం చేయలేదు. దాడి తమ కళ్ల ముందు జరుగుతూ ఉంటే కనీసం ఆ సమాచారం జిల్లా కేంద్రానికి చేరవేయలేదు. మరుసటిరోజు ఉదయం 11 గంటల వరకు పైఅధికారులకు తెలియజేయకపోవడం, అడిగిన వారికి అంతా ప్రశాంతంగానే ఉందని బుకాయించడం దగ్గర నుంచి, ఈ కేసులో ప్రధాన సాక్షి, దళితుల తల్లో నాలుకలా ఉన్న అనిల్‌కుమార్‌ను పోలీసు కాల్పుల్లో చంపివేసేదాకా అంతా ఒక కుట్రపూరితంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. ఇందులో కేవలం ప్రాసిక్యూషన్‌ వైఫల్యం కాదు, లాలూచీ కూడా ఉందని దళితులు ఆనాడే ఆరోపించారు.
               దళిత సంఘాల, ప్రజా సంఘాల, విప్లవ సంఘాల ఆందోళన మేరకు దేశంలోనే మొదటిసారిగా ఘటన జరిగిన చోటే ప్రత్యేక కోర్టు సాధించుకోవడం జరిగింది. ఇది గొప్ప విజయం కాగా విచారణ ఎంతో ఉద్రిక్త వాతావరణంలో జరిగింది. సాక్షులు తమ సాక్ష్యాలు చెప్పడం కత్తి మీద సాము లాంటిదే. వారిపైన అనేక ఒత్తిళ్లు, బెదిరింపులు, మరోవైపు జీవనోపాధి సమస్య, అనీల్‌కుమార్‌ని లాగా కాల్చివేస్తారనే బ్రతుకు సమస్య నడుమ ప్రత్యక్ష, పరోక్ష సాక్షులు 70 మంది ఎంతో సాహసం చేసి తమ సాక్ష్యాలను రికార్డు చేయడం జరిగింది. అయితే ఆ సాక్షులను, వారి సాక్ష్యాలను సక్రమంగా ఉపయోగించుకోవడంలో ప్రాసిక్యూషన్‌ నిర్లిప్తత కనిపిస్తుంది. కేసును నీరుగార్చిన పద్ధతి స్పష్టంగా తెలుస్తుంది.
            మరోవైపు ప్రభుత్వం సైతం ఈ కేసు విచారణ పట్ల దుర్మార్గమైన నిరాసక్తతనూ, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి దోషుల ప్రయత్నాలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహకరించింది. ప్రత్యేక కోర్టుకు జడ్జిగా నియమించబడ్డ జస్టిస్‌ డాక్టర్‌ ప్రభాకరరావును ముద్దాయిల ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఒంగోలుకు బదిలీ చేసింది. ఇంతకూ ముద్దాయిల ఫిర్యాదు ఏమిటంటే 'హతుల సామాజిక వర్గానికి చెందిన జడ్జి ఆ సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తాడు', కాబట్టి ఆయనను బదిలీ చేయాలనేది వారి ఫిర్యాదు. హంతకులు ఊహించి మాత్రమే చేసిన ఆరోపణ ఆధారంగా అటు ప్రభుత్వం, ఇటు హైకోర్టు వారికి వంతపాడాయి. ఏ సామాజిక వర్గానికి చెందిన జడ్జి ఆ సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తాడు అన్న ఫిర్యాదు న్యాయబద్ధమైందిగా తోచిన ప్రభుత్వానికి హైకోర్టులో ఆ న్యాయసూత్రం ఎందుకు వర్తింపజేయలేదు? ఏ సామాజిక వర్గానికి చెందిన వారైతే హంతకులుగా, ప్రత్యేకకోర్టు దోషులుగా శిక్ష విధించిందో అదే సామాజిక వర్గానికి చెందిన జడ్జితో కూడిన ఇద్దరి ధర్మాసనంకు పై న్యాయ సూత్రం వర్తించదా? అగ్రకుల పెత్తందారీ దురహంకారాన్ని విచారించడానికి అగ్రకుల న్యాయ మూర్తుల నియామకం ఎంతవరకు న్యాయబద్దమో హైకోర్టు చెప్పాలి. ఒకవైపు కోర్టులూ, న్యాయమూర్తులూ అవినీతి, ఆశ్రిత పక్షపాతంతో నిండా మునిగి, కులం కంపు కొడుతున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ప్రకటిస్తుంటే, మారణకాండకు తెగబడ్డ సామాజిక వర్గానికి చెందిన వారే హైకోర్టు ధర్మాసనం అధిష్టించినప్పుడు ఇంతకు మించిన తీర్పును ఆశించడం దుర్లభమే అవుతుంది. ప్రత్యేకకోర్టు మొత్తం 70కి పైగా సాక్ష్యాలను విచారించి 219 మందికి గాను 56 మందిని మాత్రమే దోషులుగా తేల్చింది. అయితే హైకోర్టు అందులో ఒకటి, రెండు సాక్ష్యాలను సాకుగా చూపడంలో శిక్షను అనుభవిస్తున్న వారిని రక్షించాలనే యావతప్ప బాధితులకు, వారి సామాజిక వర్గానికి న్యాయం చేయాలనేది ధర్మాసనానికి లేకపోవడం న్యాయ వ్యవస్థకే సిగ్గుచేటు.
1991 ఆగస్టు 6న చుండూరు పల్లెకు అయిన గాయం కంటే నేడు హైకోర్టు తీర్పుతో ఏర్పడిన గాయం మరింత వేదనాభరితం. ఎందుకంటే ఈ వ్యవస్థ పట్ల, న్యాయస్థానాల పట్ల ఇప్పటి వరకు దళితులకున్న దింపుడు కల్లం ఆశను కూడా వమ్ముచేసింది ఈ తీర్పు. విశ్వాస ఘాతుకానికి పాల్పడింది. ఈ తీర్పు వెలువడి నాలుగు రోజులు కావస్తున్నా ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించకపోవడం అత్యంత విచారకరం. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వమే వెంటనే అప్పీలు చేయాలనే కనీస ప్రకటన చేయకపోవడం దళితుల పట్ల వారికున్న నిబద్ధతను తెలియజేస్తుంది. దళితుల ఓట్లపై ఉన్న శ్రద్ధ వారికి న్యాయాన్ని, రక్షణను కల్పించడంలో లేశమాత్రంగా కూడా లేకపోవడాన్ని ఇది తెలియజేస్తుంది. అందుకే రేపు జరగబోయే ఎన్నికలలో 'నోటా' బటన్‌కి పని చెప్పాలి, విశ్వాసఘాతుకానికి తగిన బుద్ధి చెప్పాలి.
(వ్యాసకర్త కావలి జెబి కళాశాల లెక్చరర్‌)
- డాక్టర్‌ శ్రీనివాసరావు చొప్పర

Prajashakti Telugu News Paper Dated : 01/05/2014 

హంతకులను నిర్దోషులంటే ఎలా? By జాన్‌వెస్లి


Posted on: Thu 01 May 05:36:54.618275 2014

          న్యాయమూర్తులు చివరకు బాధితులు అనుమానించినట్లుగానే చుండూరు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షలను రద్దుచేస్తూ తీర్పునిచ్చింది. వెంటనే వారిని విడుదల చేయాలని ఆదేశించింది. గతంలో కొందరు న్యాయమూర్తులు డబ్బులు తీసుకుని అక్రమంగా బెయిల్‌ ఇచ్చిన కేసులను పరిశీలిస్తే ఈ తీర్పులో కూడా అలాంటివి జరిగాయేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు, కులం, మతం ప్రభావాలకు న్యాయమూర్తులు అతీతం కాదని పలు తీర్పులు వ్యక్తం చేస్తున్నాయి. సామాజిక దృక్పథం కల్గిన వారినే న్యాయమూర్తులుగా నియమించాలన్న నిబంధనలు లేకపోవడం ఇలాంటి పరిస్థితులకు ప్రధాన కారణం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో స్టే తీసుకుని అప్పీలుకు వెళ్లాలి. అన్ని రాజకీయపార్టీలు సైతం చుండూరు దళితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. 
            అగ్రకుల ఉన్మాదంతో వందల మంది వేటకొడవళ్లు, గొడ్డళ్లు, కత్తులు, బరిసెలతో చుండూరు దళితులను వేటాడి పోలీసుల సమక్షంలోనే ఎనిమిది మందిని దారుణంగా నరికి చంపి గోనెసంచుల్లో కుక్కి కాలువలో పడేసిన ఘోరమైన హత్యాకాండకు లోకమంతా సాక్ష్యమే. అయినా నేరస్తులంతా నిర్దోషులేనని హైకోర్టు తీర్పునివ్వడం హంతకులను సైతం విస్మయానికి గురిచేసింది. హత్యలు జరిగిన వెంటనే బంధువులు ఫిర్యాదు చేయలేదని, ఏ వ్యక్తిని ఏ క్షణాన చంపారో నిక్కచ్చిగా సాక్షులు సమయం చెప్పలేదని, వికలాంగుడు కూడా వెంటాడి ఎలా హత్య చేస్తాడని, ఈత రానివాడు కాలువ ఎలా దూకుతాడని 'కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు' వితండ వాదనలు చేసి కేసును కొట్టివేసింది. క్రింది కోర్టు ఈ కారణాలను పరిగణనలోకి తీసుకోకుండానే శిక్షలు విధించడం తప్పని భావించింది. నిందితులందరినీ వెంటనే విడుదల చేయాలని, జరిమాన వసూలుచేసి ఉంటే తిరిగి చెల్లించాలని జస్టిస్‌ యల్‌ నర్సింహారెడ్డి, జస్టిస్‌ యంకె జైశ్వాల్‌ ధర్మాసనం తీర్పు నిచ్చింది. మరి హంతకులెవరో నిర్థారించాల్సిన బాధ్యత కోర్టుకు లేదా? కనీసం నేరస్తులను శిక్షించడానికి తగిన ఆధారాలు చూపలేని పోలీసులు, అధికారులు, పాలకులపై అయినా శిక్షలెందుకు వేయలేదు? ఈ తీర్పు అన్యాయం అని చెప్పడానికి న్యాయశాస్త్ర కోవిదులేమీ అక్కరలేదు. రచ్చబండ పంచాయితీలు చేసే వారైనా చెప్పేస్తారు. గంటల తరబడి మారణకాండ జరిగిన ఘటనపై సంవత్సరాల తరబడి జాప్యం చేసి హత్య చేసిన సమయం నిక్కచ్చిగా చెప్పడం అమాయకులైన దళితులకు సాధ్యమేనా? పోలీసుల ముందే హత్యలు జరుగుతుంటే వెంటనే పిటిషన్‌ ఇవ్వలేదని న్యాయమూర్తి ప్రశ్నించడం భావ్యమేనా? ఈ తీర్పు అగ్రకులోన్మాదులకు, హంతకులకు మరింత ఊతమివ్వగా దళితులు, పేదలకు న్యాయస్థానాలపై ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా కోల్పోయేదిగా ఉంది. ప్రభుత్వం, పోలీసులు, పాలకులు చివరకు న్యాయస్థానాలు సైతం ధనికులు, పేదల మధ్య సమస్యలు వస్తే అవి ధనికుల వైపే ఉంటాయని, అగ్రకులాలకు, దళితులకు మధ్య వైరుధ్యం వస్తే అవి అగ్రకులాల వైపే ఉంటాయని మరోసారి నగంగా రుజువైంది. దళితుల మాన, ప్రాణాల రక్షణకై కలిసొచ్చే శక్తులను కలుపుకొని ప్రతిఘటించి పోరాడేందుకు సన్నద్ధం కావలసిన పరిస్థితులకు నెట్టబడుతున్నాయి.
   తరతరాలుగా అణచివేతకు గురవుతున్న దళితుల్లో ఫూలే, అంబేద్కర్‌ ఆలోచనలు, అభ్యుదయవాదుల కృషి వల్ల సామాజిక చైతన్యం పెరుగుతోంది. గుంటూరు జిల్లా చుండూరు దళితులు సైతం అగ్రకులాల దౌర్జన్యాలను ప్రశ్నించడం, ఎదిరించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య చిన్న చిన్న ఘటనలు జరిగాయి. పోలీసులకు ముందే తెలియజేసినా తగిన చర్యలు తీసుకోలేదు. కాలు కింద చెప్పులా ఉండాల్సిన దళితులు తమనే ఎదిరించే స్థాయికి వస్తారా అంటూ చుండూరు, మున్నంగివారి పాలెం, మోదుకూరు, వలమనేరు గ్రామలకు చెందిన రెడ్లు, కాపులు ఏకమై దళితులపై దాడికి పథకం వేశారు. 1991 ఆగస్టు 6 ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో మారణాయుధాలతో పోగయ్యారు. ఇది గమనించిన దళితులు వెంటనే పోలీసులకు తెలియజేసినా తగిన బలగాలను సమీకరించుకోలేదు. పైగా దళితులు ఐక్యంగా ఉండి దాడులను ప్రతిఘటించకుండా దళితవాడ నుంచి పురుషులనంతా పోలీసులే తరిమేశారు. చెదిరిపోయిన వారిని వెంటాడి దారుణంగా హత్యచేశారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మారణహోమం జరగడంతో దళితవాడ శ్మశానంగా మారింది. ఇందుకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులు. మూడురోజుల తరువాత గాని శవాలు నదిలో ఎక్కడ ఉన్నాయో వెతుక్కోలేని పరిస్థితులు ఉన్నాయంటే ఎంతటి భయానక పరిస్థితి నెలకొన్నదో స్పష్టమవుతుంది. హంతకులు పోలీసుల ముందే మారణాయుధాలతో తిరుగుతున్నా వాటిని స్వాధీనం చేసుకోలేదు. కనీసం అరెస్టులు కూడా చేయలేదు. హత్యలు చేస్తున్నా అడ్డుకోలేదు. ఈ మారణకాండ వారి సమక్షంలోనే జరిగినా సాక్షులుగా ఎఫ్‌ఐఆర్‌లో కూడా నమోదు చేయలేదు. పోలీసు స్టేషన్‌లోకి వచ్చి పోలీసులను హత్యచేస్తే ఫిర్యాదు వేరేవాళ్లు ఇవ్వాలని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా ఉంటారా! మరి ఇక్కడ ఎందుకు చేయలేదు? బాధితులు, సాక్షులు చెప్పిన వివరాలను సైతం సరిగా నమోదు చేసుకోలేదు. కానీ న్యాయం కోసం దళితవాడలో నిరహారదీక్షలు చేస్తున్న దళితులపై కాల్పులు జరిపి దళిత నాయకుడు, ఘటనకు ప్రత్యక్ష సాక్షి అనిల్‌కుమార్‌ను పోలీసులే కాల్చిచంపారు. హంతకులపై మాత్రం పోలీసుల తుఫాకులు పని చేయలేదు. రాష్ట్రవ్యాప్త ఆందోళన ఫలితంగా చివరకు డిసెంబర్‌ 1 నుంచి చుండూరు ప్రత్యేక కోర్టులో విచారణ ప్రారంభమైంది. 179 మంది నిందితులపై విచారణ జరిపి 70 మంది సాక్ష్యాలను తీసుకుంది. చివరికి 2007 జులై 31న చుండూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనీల్‌ తీర్పును వెల్లడించారు. నిందితుల్లో 21 మందికి జీవిత ఖైదు, రూ.5 వేలు జరిమాన, 35 మందికి ఒక సంవత్సరం జైలు, రూ.2 వేలు జరిమాన విధిస్తూ మిగతా వారందరినీ సరైన ఆధారాలు లేవనే పేరుతో విడిచిపెడుతూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఇరు వర్గాలూ హైకోర్టుకు వెళ్లగా 2007లో న్యాయమూర్తులు యల్‌ నర్సింహారెడ్డి, యంకె జైశ్వాల్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున న్యాయవాదులుగా సీనియర్‌ న్యాయవాది బొజ్జా తారకం, రఘునాథ్‌లను నియమించింది. విచారణ ప్రారంభం నుంచీ న్యాయమూర్తులు బాధితులకు, న్యాయవాదులకు సహకరించలేదని విమర్శలు వచ్చాయి. విచారణకు ఒక వారం సమయం ఇవ్వాలని బాధితుల తరపు న్యాయవాది కోరినా ఇవ్వలేదని, సాక్ష్యాలు వినేందుకు కూడా అయిష్టత వ్యక్తం చేశారని బాధితులు ఆరోపించారు. ఈ న్యాయమూర్తుల వల్ల తమకు న్యాయం జరగదని అవిశ్వాసం వ్యక్తం చేస్తూ బాధితులు, బాధితుల తరపు న్యాయవాదులు పిటిషన్‌ వేయగా వారిపై కోర్టుధిక్కారం కేసు వేసేందుకు న్యాయమూర్తులు పూనుకుని తరువాత విరమించుకోవడం గమనార్హం. న్యాయమూర్తులు చివరకు బాధితులు అనుమానించినట్లుగానే చుండూరు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షలను రద్దుచేస్తూ తీర్పునిచ్చింది. వెంటనే వారిని విడుదల చేయాలని ఆదేశించింది. గతంలో కొందరు న్యాయమూర్తులు డబ్బులు తీసుకుని అక్రమంగా బెయిల్‌ ఇచ్చిన కేసులను పరిశీలిస్తే ఈ తీర్పులో కూడా అలాంటివి జరిగాయేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు, కులం, మతం ప్రభావాలకు న్యాయమూర్తులు అతీతం కాదని పలు తీర్పులు వ్యక్తం చేస్తున్నాయి. సామాజిక దృక్పథం కల్గిన వారినే న్యాయమూర్తులుగా నియమించాలన్న నిబంధనలు లేకపోవడం ఇలాంటి పరిస్థితులకు ప్రధాన కారణం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో స్టే తీసుకుని అప్పీలుకు వెళ్లాలి. అన్ని రాజకీయపార్టీలు సైతం చుండూరు దళితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. దళిత, ప్రజాసంఘాలు ఐక్యంగా తీర్పులో ఉన్న లోపాలను, ప్రభుత్వ వైపల్యాలను ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. ఇందుకు కలిసొచ్చే వారందరి సహకారం తీసుకుని ఐక్యంగా పోరాడాలి. బాధితులకు అండగా సుప్రీంకోర్టులో ప్రైవేటు అప్పీలుకు వెళ్లాలి.
-  జాన్‌వెస్లి
(వ్యాసకర్త కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి) 

Prajashakti Telugu News Paper Dated: 1/05/2014 

Friday, April 25, 2014

చుండూరు తీర్పు Vaartha Sampadakiyam


భారతీయ శిక్షాస్మృతిలో సాక్ష్యం ఎంతో కీలకమైంది. న్యాయమూర్తులు సాక్ష్యాలు,వాంగ్మూలాలు,రికార్డు లపై ఆధారపడాల్సిందేతప్ప తమ సొంత విచక్షణతో వ్యవ హరించే అవకాశం తక్కువని చెప్పొచ్చు. ఈ సాక్ష్యాలు, రికార్డుల మాయాజాలంలో ఎన్నోకేసులు తారుమారైపోతు న్నాయి.ఎంతోమంది దోషులు చట్టాన్నుంచి తప్పించుకుం టున్నారు. ఇందుకు ప్రధానంగా నిందించాల్సింది, తప్పుప ట్టాల్సింది దర్యాప్తు చేస్తున్న అధికారులనే. చట్టాల్లో ఉన్న లొసుగులతోపాటు దర్యాప్తు అధికారులకు ఉన్న ఇబ్బందులు వారికి ఉన్నమాట నిజమేకావచ్చు.ఏదిఏమైతేనేం నేరాలను రుజువ్ఞ చేసేందుకు అవసరమైన,తిరుగులేని సాక్ష్యాలను సేకరించి న్యాయస్థానాల ముందుపెట్టి, నేరస్థులకు శిక్షలు వేయించడంలో పోలీసులు విఫలమవ్ఞతున్నారు. అందుకే పోలీసులుపెడ్తున్న కేసుల్లో అధికశాతం కేసులు కోర్టుల్లో వీగి పోతున్నాయి. దీంతో అనేకమంది నేరస్థులు నిర్భయంగా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు. కేసులన్నా, పోలీసులన్నా భయభక్తులు లేకుండాపోతున్నాయి.మళ్లీమళ్లీ నేరాలకుపాల్ప డుతున్నారు. దీనికితోడు పెరిగిన కేసులకు అనుగుణంగా కోర్టులు, సిబ్బందిని పెంచకపోవడంతో విచారణలు దశాబ్దాల తరబడి జరుగుతున్నాయి. సంవత్సరాల తరబడి జాప్యం జరగడంవల్ల కొందరు సాక్షులు,నిందితులు మరికొందరు బాధితులు,ఫిర్యాదుదారులు మరణిస్తున్నారు. దర్యాప్తుచేస్తు న్న అధికారులు కూడా బదిలీలైపోవడం, మరికొందరు పదవీ విరమణతో కేసులపట్ల పెద్దగాశ్రద్ధ చూపడం లేదు.
నిన్న మంగళవారం వెలువడిన చుండూరు మారణకాండ తీర్పు ఉదహరించవచ్చు. గుంటూరుజిల్లా తెనాలి మండలం, చుండూరులో 1991 ఆగస్టు ఆరోతేదీన ఎనిమిది మంది దళితులు దారుణహత్యకు గురయ్యారు. ఈ సంఘటన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొత్తంమీద 219మందిపై పోలీసులు ఆనాడు కేసు నమోదు చేసారు. దళితసంఘాల ఉద్యమాలు,ఆందోళనలు, విజ్ఞప్తుల మేరకు భారతదేశంలోనే తొలిసారిగా సంఘటన స్థలంలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణకు ఆదేశాలు ఇచ్చారు. 1991లో జరిగిన ఉదంతంపై 2004 నవంబరులో ప్రారంభమైన విచారణ 2007 మార్చి నాటికి ప్రత్యేక కోర్టు పూర్తి చేసింది.123మందిని నిర్దోషులుగా తేల్చి,56 మందిని దోషులుగా పేర్కొంటూ అందులో 21 మందికి జీవితకారా గారశిక్ష, మిగిలిన 35 మందికి ఏడాది పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనీస్‌ 2007 జూలై 31న తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ 2007లో నిందితులు హైకోర్టులో పిటిషన్‌ వేసారు. విచారణచేపట్టిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ ఘట నకు బాధ్యులుగా పేర్కొంటూ 21 మందికి జీవితకారాగార శిక్ష, మరో 35మందికి ఏడాదిపాటు జైలుశిక్ష వేస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసి అందరూ నిర్దోషులుగా ప్రక టించింది. దళితులపై దాడికి బాధ్యులను గుర్తించడంలోనూ, సంఘటన జరిగిన ప్రాంతాన్ని రుజువ్ఞ చేయడంలోనూ, చని పోయినవారు ఫలానాసమయంలో చనిపోయారని నిరూ పించడంలోనూ విచారణ కోర్టులో ప్రాసిక్యూషన్‌ విఫలమై నట్లు ధర్మాసనం అభిప్రాయపడింది.అంతేకాదు కిందికోర్టు జరిపిన విచారణలో విధానపరమైన లోపాలున్నాయని హైకోర్టు ప్రస్తావించింది. ఈ విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం కాబట్టి విచారణ కోర్టులు నైతికశిక్ష  విధించిందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. సాక్ష్యాలు చెప్పిన దాని ప్రకారం దాడిచేసిన వారి వివరాలు వేర్వేరుగా ఉన్నాయన్నది. తనకు తీవ్రగాయాలైనా సమీపంలోని పంట కాల్వలోకి దూకి సుమారు మూడు కిలోమీటర్లు ఎదురీదు కుంటూ వెళ్ళానని సాక్ష్యం చెప్పినవ్యక్తి (పిడబ్ల్యు15)క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో తనకు ఈతరాదని ఒప్పుకున్నారు. ఈత రాని వ్యక్తి తీవ్రగాయలైనా ఏటికిఎదురీదుతూ వెళ్లానని చెప్పిన సాక్ష్యం ప్రత్యేకకోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇక ఈతరాకపోయినా పది అడు గుల లోతులోఉన్న కాల్వలో ఈదుకుంటూ తెనాలిలోని తన బంధువ్ఞల ఇంటికి చేరుకున్నానని 1991 ఆగస్టు పదోతేదీ వరకు అక్కడే తలదాచుకున్నానని వివరించిన వ్యక్తి ఆచూకీ తెలియకుండాపోయిన తన సమీపబంధువ్ఞల గూర్చి పోలీ సులకు ఫిర్యాదుచేయలేదంటూ ప్రాసిక్యూషన్‌లోని లోపా లను ధర్మాసనం ఎత్తిచూపింది. ప్రధాన సాక్ష్యులు (1నుంచి 7)ఉన్న అందరూ ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్నవ్యక్తి వికలాంగుడని ఒప్పుకున్నారు. ఒకచేతిని కాలుపైవేయకుండా ముందుకు వెళ్లలేడని స్పష్టంచేసారు. అయినా ఆరోనింది తుడు ముగ్గురిని వెంటాడి చంపాడని చెప్పినసాక్ష్యాన్ని ప్రత్యే కకోర్టు పరిగణనలోకి తీసుకుందని ధర్మాసనం ఆక్షేపించింది.
మొత్తంమీద ఈ కేసులో ప్రాసిక్యూషన్‌లో ఎన్నో లోపా లున్నాయని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన దళిత కుటుంబాలకు కలిగిన వేదన తీర్చలేనిదని ప్రభుత్వం ఎంత సహాయం చేసినా ఆ బాధతీర నిదని అయితే అభియోగాలపై 15ఏళ్లకుపైగా 200మందిపై కొనసాగుతున్న విచారణ,ప్రతిదాడులు,ఆయా కుటుంబాలు సైతం ఎంతో ప్రభావం చూపింది. ఇప్పటికైనా ఈ కక్షలకు స్వస్తిపలికి పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ మాన వతావిలువలతో కలిసిమెలిసి జీవించాలని ధర్మాసనం హిత వ్ఞపలికింది. మొత్తంమీద ఈ తీర్పుతో దళితసంఘాలు తీవ్ర అసంతృప్తికి గురయ్యాయి.సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సంసి ద్ధమవ్ఞతున్నట్లు ఆ సంఘాలు ప్రకటించాయి. ఏదిఏమైనా అక్కడ మళ్లీ ఉద్రిక్తత ఏర్పడకుండా ప్రశాంతతను కాపా డాల్సిన గురుతరబాధ్యత ప్రభుత్వంపై ఉంది.కేసుల దర్యా ప్తు విషయంలో అధికారులు మరింత పటిష్టంగా పక డ్బందీగా వ్యహరించాల్సిన అవసరం ఉంది.

Vaartha Telugu News Paper Dated : 24/4/2014 

చుండూరు తీర్పు కనువిప్పు కాగలదా? By చలసాని నరేంద్ర


మారణకాండ నిందితుల శిక్ష రద్దు! 
సామాజికాంశాలపై ప్రశ్నలు 
శిక్షల రద్దు ఉద్యమ వైఫల్యమే 
ప్రభుత్వ యంత్రాంగానిదీ అలసత్వమే 
నిందితులను గుర్తించడం జరగలేదు
గ్రామస్థులందర్నీ కేసులో చేర్చారు 
కేసులు నిర్వహించే పటిష్ఠ వ్యవస్థ అవసరం 

ప్రపంచ దృష్టి ఆకర్షించిన గుంటూరు జిల్లా చుండూరు దళితుల మారణకాండలో నిందితులకు సంఘటన జరిగిన సుమారు 23 సంవత్సరాల తరువాత ఇప్పుడు రాష్ట్ర హై కోర్టు కింది కోర్టు విధించిన శిక్షను రద్దు చేయడంతో మరో పర్యాయం ఈ సంఘటన చర్చనీయాంశమవుతున్నది. ఈ సంఘటనను కేవలం ఒక గ్రామానికి చెందిన అంశంగా కాకుండా మొత్తం భారత దేశంలో స్వాతంత్య్రం సిద్ధించిన ఆరు దశాబ్దాల తరువాత ఇంకా కు వివక్ష ప్రదర్శించే పరిస్థితులు కొనసాగనడం సిగ్గు చేటైన అంశం. చుండూరుకన్నా ముందు ప్రకాశంజిల్లా కారంచేడు, ఆ తరువాత గుంటూరు జిల్లా నీరుకొండలో ఇదే విధంగా దళితులపై జరిగిన దాడులు అనేక మౌలిక సామాజిక అంశాలను, ప్రశ్నలను లేవనెత్తాయి. ఇటువంటి సంఘటనలో నిందితులకు హై కోర్టు శిక్షలను రద్దుచేసే పరిస్థితులు నెలకొనడం తీవ్ర విస్మయం కలిగించే అంశం. అందుకు దారితీసిన పరిస్థితులను గుర్తించితే గాని ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిరోధించలేము. 
ప్రజా ఉద్యమాల కారణంగా, ఈ సంఘటనలు ముఖ్యంగా దళితులల్లో ఆత్మ గౌరవం అనే ప్రశ్నను లేవనెత్తి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడంతో అసలు నిందితులను గుర్తించి వారికి శిక్షలు పడేవిధంగా చేయడంపట్ల ఒక వైపు ప్రభుత్వయంత్రాంగం, మరో వైపు ఉద్యమ కారులు విఫలం చెందారని భావించవచ్చు. సంఘటన జరిగిన సమయంలో వారు అనుసరించిన ధోరణులు ఇటువంటి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి. 

జిల్లా కేంద్రం గుంటూరుకు 20 కి. మి. దూరంలోగల చుండూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో, 40 మందికి పైగా పోలీసులు పహారా కాస్తున్న సమయంలో ఘర్షణ జరగడం, 8 మందిని హత్య చేయడమే విస్మయం కలిగించే అంశం కాగా, ఆ గ్రామంలో పోలీసులు ఉండగానే జరిగిన సంఘటనగురించి- అది జరిగిన మూడు రోజుల వరకు జిల్లా కేంద్రంలో గల పోలీస్‌ అధికారులకు గాని, 12 కి మీ దూరంలో గల రెవిన్యూ డివిజన్‌ కేంద్రం తెనాలిలో గల డియస్‌పి, ఆర్‌డిఓ వంటి అధికారులకు గాని సమాచారం అందలేదంటే అసలు ప్రభుత్వ యంత్రాంగం ఉన్నదా అనే అనుమానం కలుగుతున్నది. 
ప్రతి స్థాయిలో అధికారుల బాధ్యతారాహిత్యం ఈ సందర్భంగా వెల్లడి అయినా, బాధ్యులుగా ఎవరినీ గుర్తించడానికి ప్రయత్నం చేయకపోవడం, అక్కడ బాధ్యతారాహిత్యానికి కారకులైన అధికారులకు తరువాత పలు కీలకమైన పోస్టింగ్‌లు ఇవ్వడం, రాష్ట్ర స్థాయిలో ఆధిపత్యం వహించే పదవి ఇవ్వడం గమనార్హం. అయినా ఈ అంశంసంఘటన జరిగిన నాలుగైదు రోజుల వరకు దళిత వాడలోకి, మృతదేహాల వద్దకు ప్రభుత్వ అధికారులు ఎవరినీ, చివరకు పోలీసులను సహితం రానీయలేదు. మొత్తం ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహించడం మినహా ఏమీ చేయలేదు. అప్పటికే జిల్లా ఎస్‌పి బదిలీ అయినా, ఇంకా విధుల్లో చేరకుండా నిజామాబాదులో విధి నిర్వహణలో ఉన్న ఆర్‌పి మీనా ను రాష్ట్ర డిజిపి వెంటనే వచ్చి పరిస్థితులను అదుపులోకి తేవాలని ఆదేశిస్తే, ఆయన ఆఘమేఘాల మీద గుంటూరుకు పరిగెత్తుకు వచ్చారు. చుండూరులోనే విధి బాధ్యతలు స్వీకరించి నేరుగా దళిత వాడకు వెళ్ళారు. అప్పటి వరకు అధికారులు ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేక పోయారు. 

ఆయన దళితులకు న్యాయం చేస్తామని మనోధైర్యం కలిగించే ప్రయత్నం చేసి, మృత దేహాలను శవపరీక్ష కోసం తెనాలి పంపించారు. తెనాలి నుండి తిరిగి వచ్చే సరికి కనీసం అక్కడ ఉన్న మీనాతో మాటమాత్రం అయినా చెప్పకుండా- గ్రామంమధ్య వాటిని ఖననం చేసే ఏర్పాట్లను దళిత వాడ, ఇతర ఉన్నతాధికారులు చేశారు. అక్కడ ఉన్న కోనేరు రంగారావు వంటి నాయకులు శాశ్వతంగా గ్రామస్థులమధ్య వైరం కొనసాగే విధంగా- ఇలా చేస్తున్నరా అని ఉన్నతాధికారులను నిలదీస్తే వారి నోట మాట రాలేదు. 
ఆత్మా గౌరవ పోరాటంగా న్యాయంకోసం చుండూరు దళితులు జరిపిన పోరాటం అనేక విధాలుగా చారిత్రాత్మక మైనది. దేశం మొత్తంమీద ఉన్న దళితులల్లో ఒక ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగించే విధంగా జరిగింది. ఆ కృషి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి, మార్గదర్శనం చేసిన కత్తి పద్మారావు, ఆయన సహచరులకే చెందుతుంది. దళితుల్లోని ఆవేశాలను ఉపయోగించుకొని రాష్ట్రంలో తొలిసారిగా మైదాన ప్రాంతంలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలని నక్సలైట్‌వర్గాలు ఎంతో ప్రయత్నం చేశాయి. 

తెలంగాణ ప్రాంతంనుండి సీనియర్‌ నాయకులు అంతావచ్చి మకాంవేసే ప్రయత్నం చేశారు. ఇక పలు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతి సరే! అయితే భయంతో, ఆవేదనతో ఉన్న దళితుల ఆవేశాలను రాజకీయ ఉద్యమాలుగా మలచుకొనే అవకాశం ఎవరికీ ఇవ్వకుండా కేవలం వారి భవిష్యత్తు కోసం పటిష్ఠమైన పునాదులు వేసే ప్రయత్నం పద్మారావు చేశారని చెప్పవచ్చు. ఈ సందర్భంగా కొన్ని పొరపాట్లు జరిగినా ఈ విషయంలో ఆయన ప్రదర్శించిన నాయకత్వ పటిమ, చిత్తశుద్ధి లను మాత్రం ఎవ్వరూ శంకించలేరు. అయితే నిందితులపై కేసు నమోదు విషయంలో మొత్తం గ్రామస్థులను ఇరికించే ప్రయత్నం చేశారు. వాస్తవాలను దృష్టిలోఉంచుకొని- అసలు నిందితులను గుర్తించే ప్రయత్నం చేయ లేదు. ఒక వేళ గుర్తించినా ఆ మేరకు కేసుల నమోదుకు ప్రయత్నం చేయలేదు. నాటి యస్‌పి మీనా ఒకొక్క మృతిలో 10 నుండి 12 మంది నిందితులను గుర్తించి పటిష్ఠంగా కేసు నమోదు చేస్తే, తొందరగా విచారణ పూర్తి అయి శిక్షలు పడటానికి అవకాశం ఉంటుందని సూచించారు. అయితే అందుకు నిరాకరించి, ఒకొక్కరి మృతికి 50 మందికి పైగా గుర్తుకు వచ్చిన పేర్లు అన్నీ చేర్చి కేసులు నమోదు చేయడం విచారణ సుదీర్ఘంగా జరగడానికి, హై కోర్టులో శిక్షలను రద్దు చేయడానికి ఒక ప్రధాన కారణం అని భావించవచ్చు. 

ఈ కేసుపట్ల హై కోర్టు న్యాయమూర్తుల దృష్టి కోణం సహితం మరో కారణం కావచ్చు. కేవలం పోలీసులు, న్యాయవాదులు భావించినంత మాత్రంచేత హై కోర్టు శిక్షలను ఖరారు చేయాలని చెప్పలేముగదా! భారత దేశ చరిత్రలోనే నేరం జరిగిన చోట, ఆ గ్రామంలోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటుచేసి విచారణ జరపడం ఎంత ప్రత్యేకత సాధించుకున్నా- శిక్షల విషయంలో మాత్రం నిశితమైన దృష్టి కేంద్రికరించ లేదని చెప్పవలసి వస్తుంది. క్రింది కోర్టులో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన బి. చంద్రశేఖర్‌ వంటి న్యాయవాదులు అంకితభావంతో పనిచేయడంతో శిక్షలు పడడం సాధ్యమయింది. ఆయన మృతి చెందడంతో హై కోర్టులో ఏమయినా లోపం జరిగిందా అనే అనుమానం కలుగుతున్నా వాస్తవంగా ఏం జరిగిందో తెలియదు. తొలుత నిందితులుగా పేర్కొన్నవారిలో కొందరు అప్పటికే మృతి చెందారు. కొందరు అసలు గ్రామంలోనే నివాసం ఉండడం లేదు. 280 మందికి పైగా నిందితులుగా పేర్కొంటే వారిలో 39 మంది విచారణ సమయంలోనే మృతి చెందారు. 136 మందిని సాక్షులుగా విచారించారు. 219 మందిని మాత్రమే నిందితులుగా కోర్టు పరిగణలోకి తీసుకొని, వారిలో 21 మందికి జీవిత ఖైదు, మరో 35 మందికి ఒక సంవత్సరం శిక్ష విధించి మిగిలిన వారిని నిరపరాధులుగా వదిలి వేసింది. 

సంఘటన జరిగిన 23 సంవత్సరాల అనంతరం ఇప్పుడు శిక్షలను రద్దు చేసినా వారిప్పటికే సుదీర్ఘకాలం మానసిక వేదనకు గురయ్యారని చెప్పవచ్చు. అసలు ఇంత సుదీర్ఘకాలం విచారణ జరుగవలసిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయో ఒకవైపు పోలీస్‌ ఉన్నతాధికారులు, ప్రభుత్వం- మరో వైపు ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ పక్షాలు సహితం సమీక్ష చేసుకోవలసి ఉన్నది. కారంచేడు కేసు విషయంలో సహితం కింది కోర్టు వేసిన శిక్షను హై కోర్టు కొట్టి వేసినా, తిరిగి సుప్రీం కోర్టు మళ్ళీ విధించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ పద్మారావు ఆశాభావ వైఖరిని వ్యక్తంచేశారు. రెండు, రెండున్నర దశాబ్దాల పాటు విచారణ జరగడం, కోర్టుల చుట్టూ తిరగడం- కేవలం నిందితులకుమాత్రమే కాకుండా బాధితులకు, వారి పక్షాన పోరాటం చేస్తున్న వారికి సహితం ఒక విధంగా శిక్ష విధించిన్నట్లే కాగలదు. 
ప్రపంచంలోనే అత్యంత కఠినమైనదిగా భావిస్తున్న యస్‌ సి, యస్‌ టి అత్యాచారాల నిరోధ చట్టాన్ని దళితులకు రక్షణ కల్పించడంకోసం మన దేశంలో తీసుకు వచ్చి సుమారు నాలుగు దశాబ్దాలు అవుతున్నా, దళితులు అత్యంత ధైర్యంతో పోరాటాలు జరిపినా న్యాయస్థానాల్లో న్యాయం లభించడంలో మాత్రం తీవ్ర జాప్యం జరగడం గమనిస్తే, మనకున్న న్యాయ విధానమే ప్రశ్నార్ధకం అవుతున్నది. చట్టంపట్ల సామాన్య ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం వ్యక్తమవుతున్నది. 

ఈ చట్టం క్రింద నమోదు అవుతున్న కేసులలో శిక్షలు పడుతున్న కేసుల సంఖ్య నామమాత్రంగా ఉండƒడాన్ని గమనించాలి. పైగా ఈచట్టం ఉపయోగించుకొని అమాయకులను వేధించే ప్రయత్నం జరుగుతున్నదనే ఆరోపణలు సైతం వింటున్నాము. ఈ చట్టం అమలుపై ఒక సమీక్ష జరుపవలసిన సమయం నేడు ఆసన్నమయింది. చుండూరు కేసు ను సుప్రీ కోర్టులో అప్పీల్‌ చేసే సమయంలో, ఈ చట్టాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేసి, దళితులలో మనో ధైర్యం, విశ్వాసం, అభయం కలిగించేందుకు అవసరమైన మార్పులు, చేర్పుల గురించి అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని కోరే ప్రయత్నం కుడా చేయాలి. రాష్ట్ర హై కోర్టు ఈ కేసును కొట్టి వేసే సందర్భంగా- సాక్షుల కథనాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, లేదా ఒకే విధంగా లేవని, సంఘటన జరిగిన స్థలం, నిందితుల గుర్తింపు వంటి వివరాలను సమకూర్చడంలో ప్రభుత్వం విఫలం అయిందని న్యాయమూర్తులు పేర్కొనడం గమనార్హం. అంటే కేసును పటిష్టంగా రూపొందించడంలో ఒక వైపు బాధితుల తరపున పోరాటం చేసున్న ఉద్యమకారులు, మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం విఫలం అయినట్టు భావించవలసి ఉంటుంది. దళితులు, గిరిజనులు, ఇతర అణగారిన వర్గాలు దాడులకు, అన్యాయానికి గురయిన సమయంలో వారిపక్షాన కోర్టులలో కేసులను పటిష్ఠంగా నిర్వహించే వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం, ఉద్యమాకారులు కలసి ప్రయత్నం చేయవలసిన అవసరాన్ని ఈ సంఘటన వెల్లడి చేస్తున్నది.

Surya Telugu News Paper Dated: 26/4/2014