Showing posts with label దుడ్డు ప్రభాకర్. Show all posts
Showing posts with label దుడ్డు ప్రభాకర్. Show all posts

Tuesday, April 22, 2014

దళితులకు న్యాయం ఎండమావేనా? By దుడ్డు ప్రభాకర్, కులనిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు


Updated : 4/23/2014 2:00:08 AM
Views : 43
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకుంటున్న మన దేశంలో రాజ్యాంగ చట్టం, పాలనావ్యవస్థ, రక్షణ వ్యవస్థ క్రమంగా ప్రజలకు దూరమవు తున్నాయి. ఈ దశలో న్యాయవ్యవస్థను కూడా ఉపయోగించుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయా అనే ఆందోళన కలు గుతున్నది. దేశంలో పీడిత ప్రజల బతు క్కి భద్రత, రక్షణ కల్పించే దిక్కు లేకుండా పోతున్నది.ఎంతోకొంత ఎస్సీ, ఎస్టీలకు అనివార్య పరిస్థితుల్లో చివరి ఆశగా న్యాయవ్యవస్థ వైపు చూస్తున్నా రు. చివరకు ఇవ్వాళ ఆ ఆశ కూడా ఆవిరవుతున్న పరిస్థితు లు వచ్చాయి. దీనికి నిదర్శనంగా చుండూ రు నరమేధం కేసులో ముద్దాయిలు 21 మంది కూడా నిర్దోషులుగా ప్రకటించబడ్డారు! అయితే ఇక్కడ ఆలోచించాల్సింది..చుండూరులో నరమేధం జరిగింది అవాస్తవమా..!? నిర్దోషులుగా ప్రకటించబడ్డ వారికి ఆ ఊచకోతతో సంబంధమే లేదా? అసలు వారు దోషులే కారా? అంతా.. గజం మిథ్య.. ,పలాయనం మిథ్య.. అన్న నీతేనా..? 

నిజానికి ఆనాడు చుండూరులో ఏం జరిగింది? 1991 ఆగస్టు 6న దళిత నెత్తుటి చరిత్రలో మరో నెత్తుటి మరక చోటు చేసుకున్న రోజు. చుండూరు దళితవాడపై చుండూరు, మోదుకూరు వలివేరు మున్నంగివారి పాలెం గ్రామాలకు చెందిన రెడ్లు, కాపులు మారణాయుధాలతో దళితులపై పథకం ప్రకారం విచక్షణారహితంగా దాడిచేశారు. ఉదయం 11గంటల నుంచి వందమందికి పైగా పోలీసులు లాఠీలతో పల్లెలోకి ప్రవేశింంచి ఉన్నా.., కాపులు, రెడ్లు మూకుమ్మడిగా మారణాయుధాలతో పల్లెపైకి వచ్చారు. దీంతో.. మేం తక్కువ మందిమి ఉన్నం. వాళ్లను ఆపలేం. పారిపోయి ప్రాణాలు దక్కించుకోండి అంటూ పోలీసులు ఇల్లిల్లూ తిరిగి చెప్పారు. ప్రాణభయంతో పారిపోయే దళితుల్ని అగ్రకుల ఉన్మాదశక్తులు ట్రాక్టర్లలో కత్తులు, గొడ్డళ్లు, బరిసెల తో వెంటాడి, వేటాడి నరికారు. శవాలను గోతాల్లో కుక్కి తుంగభద్రలో వేశారు. మూడురోజులు కాల్వ లో వెతగ్గా మొత్తం ఎనిమిది శవాలు దొరికాయి. శరీరమంతా ఛిద్రమై గుర్తించలేనంతగా కుల్లిపోయి ఉన్న రమేష్ అనే డిగ్రీ విద్యార్థి శవాన్ని చూసి అత ని అన్న పరిశుద్ధరావు గుండె పగిలి చనిపోయాడు. హంతకుల అరెస్టు కోసం ఉద్యమం నడుపుతున్న కొమ్మెర్ల అనిల్ కుమార్‌ను పట్టపగలు దళితవాడలో జరుగుతున్న నిరాహారదీక్ష శిబిరంలో పోలీసులు కాల్చిచంపారు. చలో ఢిల్లీ కార్యక్రమంలో రోడ్డు దాటుతుండగా గూడూరు కయమ్మ యాక్సిడెంట్‌లో చనిపోయింది. ఇలా మొత్తం11 మంది చుండూరు బాధితులు పోలీసులు, అగ్రకులాల పకడ్బందీ వ్యూహంలో బలయ్యారు. ఈ చుండూరు దళితుల కు తగిన న్యాయం జరగాలని, నేరస్తులు శిక్షించబడాలని చుండూరు దళితులే కాదు, రాష్ట్రవ్యాప్తంగా దళితులు పోరాటం చేశారు. ఇప్పటిదాకా అలుపెరుగకుండా పోరాడుతున్నారు. ఈ సుదీర్ఘ 16 ఏళ్ల పోరాటం తర్వాత, ఇంత న్యాయం కోసం ఇంత కాలయాపన తర్వాత చుండూరులోని ప్రత్యేక కోర్టు 2007 జూన్ 31న 25 మంది ముద్దాయిలకు జీవితఖైదు, 35 మందికి సంవత్సరకాలం శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 

అయితే ఈ కేసులో అనేక మలుపులు, సుదీర్ఘ విచారణలో అనేక చిత్రవిచిత్రాలు జరిగాయి. సహ జ న్యాయ సూత్రాలకు భిన్నంగా అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. 16 ఏళ్ల తర్వాత ముద్దాయిల కు శిక్షపడితే..దాన్నుంచి తప్పించుకునే క్రమంలో నేరస్తులు పైకోర్టుకు వెళ్లి స్టే ఉత్తర్వులు తెచ్చుకున్నా రు. కేసులో మొత్తం 219 మందిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, భారత శిక్షాస్మతి 302, 307 సెక్షన్ల కింద పోలీసులు చార్జ్‌షీట్ వేశారు. వీరిలో ఏడుగురిని కొన్ని టెక్నికల్ కారణా లు చూపి కేసు నుంచి మినహాయించి ,పోలీసులు వారిని అరెస్టు చేయలేదు. మిగతా వారిని కేసు నుంచి మినహాయించి కేసును వేరుచేసి 1993లో కేసు విచారణకు వచ్చే సరికి, బాధితులు క్రిస్టియన్ మతానికి చెందిన వారు కాబట్టి వారిని బీసీ (సీ)గా గుర్తించాలని అంటూ కేసును ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల చట్టం కిందకు రాదని వాదించారు. కాబట్టి ప్రత్యేక కోర్టును రద్దు చేయాలని ప్రత్యేక కోర్టులో వాదనలు లేవనెత్తారు. హై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. ఇలా కొంత కాలయాపన తర్వాత కోర్టు ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టులోనే విచారణకు సిద్ధపడింది. దీనిపై కూడా అగ్రకుల పెద్దలు హై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. మరోవైపు చుండూరులోనే కోర్టు పెట్టి విచారణ జరిపితే తమ ప్రాణాలకు రక్షణ ఉండదని అగ్రకులస్తులు మళ్లీ హైకోర్టు నుంచి విచారణ జరగకుండా స్టే తెచ్చుకున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ హక్కుల సంఘానికి చెందినవాడు కాబట్టి వారికి నక్సలైట్లతో సంబంధం ఉంటుంది కాబట్టి అతన్ని తప్పించాలని వాదించి మరి కొంతకాలం కాలయాపన చేశారు. 

ఎట్టకేలకు 2004 డిసెంబర్1న ప్రత్యేక కోర్టులో విచారణ ప్రారంభమైంది. విచారణ ప్రారంభమయ్యే నాటికి ఏడుగురు అరెస్టే కాలేదు. 23 మంది చనిపోయారు. మిగిలిన 183 మందిపై విచారణ ప్రారంభమయ్యింది. 79 మంది సాక్షుల్ని విచారించారు. చివరకు తీర్పు ప్రకటించారు. ఈ తీర్పుతో కంగు తిన్న అగ్రకుల భూస్వాములు తమ ధన,కుల బలం అండతో హైకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో కూడా అగ్రకుల భూస్వాముల తరఫున అనేక వింత వింత కాలయాపన వాదనలు చేశారు. చాలాకాలం పాటు అంతూ పొం తూ లేని వాదనలతో కోర్టులో కేసు విచారణను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బాధితులు దళితుల తరఫున నిలిచిన న్యాయవాదులు కోర్టు చేస్తున్న జాప్యానికి అనేక రూపాల్లో తమ నిరసనను తెలిపారు. జరుగుతున్న తతంగం పట్ల అభ్యంతరాలను తెలిపారు. అయినా కోర్టు తనదైన శైలిలో విచారణ ను కొనసాగించి చివరకు తీర్పును వెలువరించిం ది. ముద్దాయిలపై సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు భావించింది. అందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది! స్వతంత్ర భారతంలో దళితులకు చట్టపరంగా దక్కాల్సిన న్యాయాన్ని ఈ అగ్రకుల భూస్వామ్య వ్యవస్థ దక్కకుండా చేసింది. రాజ్యాంగబద్ధంగా రక్షణ దొరకాల్సిన చోట రక్షణ కరువవుతున్న తీరు.. మన సామాజిక వ్యవస్థ హింసాముఖాన్ని బహిర్గతం చేస్తున్నది. దళితులకు అందని ద్రాక్షగా ఉన్న రక్షణ చట్టాలు, రాజ్యాంగ చట్టాల మూలంగానే నేటిదాకా జరిగిన దళితుల మారణకాండలన్నింటిలో ఎక్కడా దళితులకు న్యాయం దక్కలేదు. దోషులు శిక్షించబడలేదు. ఒక్క చుండూరే కాదు, కారంచేడు, పదిరికుప్పం మొదలు ఖైర్లాంజి దాకా ఏ మారణకాండలోనూ నేరస్తులు శిక్షించబడలేదు. రాజ్యాంగ రక్షణ లు, హక్కులు కొన్ని సామాజిక సమూహాలకు అందని స్థితి సమాజ శ్రేయస్సుకు గొడ్డలి పెట్టు. ఈ వ్యవస్థీకతమైన దురన్యాయాన్ని సామాజిక ఉద్యమాల ద్వారానే ఓడించాలి. పీడితులు, బలహీనులకు అండగా, రక్షణగా రాజ్యాంగాన్ని నిటారుగా నిలబెట్టాలి. ఆత్మగౌరవ పోరాటాల మార్గంలోనే విముక్తి పోరులో మునుముందుకు సాగాలి. అంతిమంగా సమ న్యాయ వ్యవస్థ స్థాపనకు నడుంకట్టి నడవాలి. అప్పుడే చుండూరులూ ఉండవు. చుండూరు లాంటి బాధితులకు అన్యాయాలకు స్థానం ఉండదు. 

Friday, December 6, 2013

ఇంకెన్నాళ్ళీ గారడీలు - దుడ్డు ప్రభాకర్

వంట పని దగ్గర్నుండి పంట పనుల వరకు యంత్రాలను ఉపయోగిస్తున్న కంప్యూటర్ యుగమిది. అయినప్పటికీ మనిషి మలాన్ని చేతులతో గంపల్లోకి ఎత్తి నెత్తిన పెట్టుకొని ఊరి బయటకు మోసుకెళ్ళి పారబోసే మనుషులు ఈ హైటెక్ యుగంలో కూడా దర్శనమిస్తున్నారు. వారే ఈ నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో అట్టడుగు మెట్టైన దళితులు. వారే పారిశుద్ధ్య కార్మికులు, పాకీ పని వారుగా, సఫాయి కార్మికులుగా, సచ్చడి వారుగా పిలబడుతున్నారు. ఒక చోట రెల్లి, ఇంకోచోట హడ్డి, మరోచోట మాదిగ కావచ్చు కానీ వీరంతా దళితులు. దళితుల్లో దళితులు. దరిద్రులైన దళితులు. తమజానెడు పొట్టకోసం, బిడ్డల గిన్నెల్లో పిడికెడు మెతుకుల కోసం కోడి కూతకు ముందే నిద్రలేచి వీధుల వెంట పరుగులు తీస్తూవుంటారు. రెక్కలతో పాటు రేకుముక్క, చీపురు, గంప వాళ్ళ ఆస్తులు. బిడ్డల ముడ్డి కడగడానికి కూడా ఇష్టపడని కన్నతల్లులున్న ఈ దేశంలో ఈ కంపు జీవితాలు ఇంకా ఇలా కొనసాగుతూనే ఉన్నాయి.
అంబేద్కర్ వర్ధంతి రోజైన డిసెంబర్ 6, 2013న కేంద్ర ప్రభుత్వం సఫాయి కార్మికుల సంక్షేమం కోసం అంటూ ఒక చట్టం చేసింది. తద్వారా యంత్ర పరికరాలు లేకుండా చేతులద్వారా మరుగుదొడ్లను శుభ్రం చేసే సఫాయి పనికి పూర్తి చెక్ పెడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం భుజాలు చరుసుకుంటుంది. కేంద్ర గణాంక శాఖ వివరాల ప్రకారం మన రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 1,73,690 అపరిశుభ్ర మరుగుదొడ్లున్నట్లు, వీటిలో 7,111 మరుగుదొడ్లను మనుషులతో శుభ్రం చేయిస్తున్నారని చెప్పుకోవడానికి పాలకులు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. వందల ఏళ్ళ ఆధునిక భారత చరిత్రలో, స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్న 66 ఏళ్ళ తర్వాత కూడా ఈ మనుషుల్ని చూసి సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. డిసెంబర్ 6న ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దెయిర్ రిహాబిలిటేషన్ యాక్స్ 2013ను దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని పట్టణ ప్రాంతాల్లో అమలులోకి తేనుంది. విశేషమేమంటే అంటరాని వారి బతుకుల్ని సంస్కరించడానికి ఒక అంటరాని వాడి వర్ధంతి రోజున చట్టం తెస్తున్నామహో! అని యూపీఏ ప్రభుత్వం చెప్పకనే చెబుతుంది. ఇప్పుడు కూడా కులం అంబేద్కర్‌ని వదల్లేదు. ఆ భారత రత్న, రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ చనిపోయిన 57 ఏళ్ళ తర్వాత కూడా ఆయన్ని కులం వెంటాడుతూనే వుంది. తన జీవితాంతం అగ్రకుల బ్రాహ్మణీయ పాలకుల కుట్రలకు బలై అంటరాని వాడిగా, దళితులకు మాత్రమే ఆరాద్యుడుగా కుదించబడిన అంబేద్కర్ వర్ధంతి రోజున చట్టాన్ని తెచ్చి విస్తృత ప్రచారం ద్వారా దళితుల ఓట్లు కొల్లగొట్టవచ్చని పాలకులు తమ అగ్రకుల దురహంకార స్వభావాన్ని నిర్లజ్జగా, నిర్భయంగా చాటుకుంటున్నారు. ఈ దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం పోరాడి, ఆ లక్ష్యాన్ని రాజ్యాంగంలో పొందుపరచని సామాజిక విప్లవ కారుడిని సంస్కరణ వాదిగా, అంటరానివాడిగా ప్రచారం చెయ్యడంలో భాగంగానే ఈ బరితెగింపుకు సిద్ధపడ్డారు. ఈ వైఖరి రాజ్యాంగాన్ని అవమాన పరచడమే.
ఈ చట్టం పట్టణ ప్రాంతంలో మాత్రమే అమలవుతుందని చెబుతున్నారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై తొలుత 50 వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష, లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. అతిక్రమణలు ఇంకా కొనసాగితే 5 లక్షల జరిమానా లేదా ఐదేళ్ళ జైలు శిక్ష. లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. అన్ని పట్టణాలలో సర్వే చేపట్టి సఫాయి పనివారిని గుర్తించి వారికి విధిగా ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని అమలు జరిపి ఆరు నెలల్లో డ్రైలెట్రిన్స్ లేకుండా చేస్తామని ఇదొక చారిత్రాత్మక చట్టమని 2014 ఎన్నికల దాకా దళిత రాజకీయ నాయకులతో, ప్రభుత్వేతర సంస్థల(యన్.జీ.ఓ)తో దళితవాడల్ని ప్రచార హోరులో ముంచెత్తనున్నారు.
పట్టణాలలోని సఫాయి కార్మికులను మాత్రమే ఈ చట్టపరిధిలోకి తెచ్చారు. డ్రైనేజీలోకి, మ్యాన్ హోల్స్‌లోకి దిగి శుభ్రం చేసే మున్సిపల్ వర్కర్స్ విషవాయువుల ప్రభావం వల్ల నిత్యం మరణిస్తూ ఉంటారు. ఆ పనిలో కూడా యంత్రాలు ఉపయోగించడం లేదు కాబట్టి వారిని కూడా ఈ చట్ట పరిధిలోకి తేవాలి. దేశవ్యాపితంగా గ్రామాలలో మేజర్ పంచాయతీల్లో వ్యక్తిగత డ్రైలెట్రీన్‌లు శుభ్రం చేసే వారి సంగతేంటి? అనేక గ్రామాల్లో ఊరి చివర ఇంకా కామన్ లెట్రిన్స్ దర్శనమిస్తున్నాయి. వాటిని శుభ్రం చేసే వారిని నిర్లక్ష్యం చేశారు. ఈనాటికి గ్రామీణ ప్రాంతాలలో అధునాతన లెట్రిన్ల సెప్టిక్ ట్యాంకుల్లో దిగి మలాన్ని బక్కెట్లో ఎత్తి డబ్బాలలో నింపి రిక్షాద్వారా ఊరు బయట పారబోస్తున్నారు. వాళ్ళంతా దళితులు, యానాదులే. వాళ్ళను కూడా ఈ చట్ట పరిధిలోకి తేవాలి. చచ్చిన పశు కళేబరాల్ని, అనాధ శవాల్ని, గుర్తుతెలియని శవాల్ని ఆసుపత్రికి తరలించే వాళ్ళు, పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత బయటపెట్టే వాళ్ళు, శ్మశానానికి మోసేవాళ్ళు వీళ్ళందరూ దళితులే. వీరు అపరిశుభ్ర, అవమానకర పనులు చేతులతోనే చేస్తున్నారు. యంత్రాలతో కాదు. వీళ్ళను కూడా ఈ చట్ట పరిధిలో చేర్చాలి. ఈ చట్టం ఎన్నికల గారడీలో భాగంగానే హడావిడిగా చేయబడింది.
సమగ్రమైన పరిశీలనలేని కారణంగానే పట్టణాలకే పరిమితం చేశారు. ఆ మేరకు చట్టాలు చేసినా పాలకులకు వాటిని అమలు చెయ్యడంలో చిత్తశుద్ధి ఉండదు. ప్రస్తుతం నిర్వీర్యమై అంపశ్యమీద పడుకోబెట్టబడివున్న ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 మనకొక ఉదాహరణ మాత్రమే. 1992లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం దేశంలో 14 లక్షల మంది కార్మికులు మలాన్ని చేతులతో ఎత్తే పనిలో వున్నారు. మన రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల మందికి పైగా ఉన్నారు. చేతులతో మలాన్ని ఎత్తే మనుషులను పనిలో పెట్టుకోవడం, డ్రైలెట్రిన్స్‌పై నిషేధం విధిస్తూ 1993లో భారత ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అది అమలుకి నోచుకోలేదు.
ఈనాటికీ ప్రభుత్వరంగ సంస్థల్లో అధికారికంగానే ఆ పని కొనసాగుతుంది. రైల్వే వ్యవస్థలో అది బహిరంగంగానే జరుగుతుంది. నేటికీ రాష్ట్రంలో వందలాది డ్రైలెట్రిన్స్ నడుస్తున్నాయని ప్రస్తుత కేంద్ర గణాంక శాఖ వివరాలు తెలియజేస్తున్నాయి. చట్టం చేయబడినప్పటికీ కొనసాగుతున్న సఫాయి కార్మికుల దీనస్థితిపై 2005లో సుప్రీంకోర్టు స్పందించి వివిధ మంత్రిత్వ శాఖ అధికారులకు హెచ్చరికలతో కూడిన తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని అధికారులకు తమ శాఖల్లో పాకీ పనివారున్నారా? అనే విషయం పరిశీలించి ఆరునెలల లోపు నివేదిక పంపాలని ఆదేశించింది. ఎవ్వరూ నివేదిక పంపిన దాఖలాలు లేవు. మళ్ళీ చట్టం చేయవలసి వచ్చిందంటే ఈ దేశంలోని అధికారులకు, రాజకీయ నాయకులకు కోర్టులు, చట్టాల పట్ల ఏ పాటి గౌరవమున్నదో అర్థమవుతుంది. దళితుల్ని కేవలం ఓటర్లుగా చూస్తున్న ఈ పాలకులు దళితుల ఓట్లు కొల్లగొట్టే లక్ష్యంతోనే ఇలాంటి గారడీలు చేస్తుంటారు. అంతవరకే. ఆ చట్టాల అమలు పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించరు. అందుకే అనేక దళితహక్కుల పరిరక్షణ చట్టాలు నిర్జీవం చేయబడుతున్నాయి. ఈ ఆధునిక మనువాద సమాజంలో దళితులు సాటి మనుషులుగా చూడనిరాకరించబడుతూనే ఉన్నారు. అంబేద్కర్ మహాశయుని లక్ష్యమైన కులనిర్మూలన జరగనంతకాలం ఇలాంటి గారడీలు, పీడన, అణచివేత, అవమానాలు జరుగుతూనే వుంటాయి. అంబేద్కర్ వర్ధంతి సాక్షిగా కులనిర్మూలన లక్ష్యంతో చట్టాల అమలుకై పోరాటాలు చేద్దాం.
- దుడ్డు ప్రభాకర్
రాష్ట్ర అధ్యక్షులు, కులనిర్మూలనా పోరాట సమితి
(నేడు అంబేద్కర్ వర్ధంతి)

Andhra Jyothi Telugu News Paper Dated: 06/12/2013 

- See more at: http://www.andhrajyothy.com/node/38064#sthash.c4qtdhLQ.dpuf

Monday, October 15, 2012

'లక్షింపేట' కులసమస్యే - దుడ్డు ప్రభాకర్



భూమిలేని కారణంగానే దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ, దాడులు ఆగాలంటే భూపోరాటం చెయ్యాలనే అగ్రకుల భావజాలం కలిగిన కులదాటవేత దారులకు ఒక ప్రశ్న. ఈ దేశంలో భూమిలేని మిగిలిన కులాల ప్రజలపై ఇలాంటి సామూహిక దాడులు, అత్యాచారాలు, హత్యలు ఎందుకు జరగడం లేదో చెప్పాలి. భూమి ఉన్నాగాని ఖైర్లాంజిలో భయ్యాలాల్ కుటుంబం మొత్తం అత్యాచార హత్యలకు ఎందుకు బలయ్యిందో చెప్పాలి. 

అవును లక్షింపేటలో దళితులపైన, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మాలలపైనే దాడి జరిగింది. మాలలు భూమి సాగు చేసుకుంటామంటేనే దాడి జరిగింది. సాగుచేసుకుంటున్న వారు మాలలు కాబట్టే దాడి జరిగింది. 60 ఎకరాలు సాగుచేసుకుంటున్న వాళ్ళను, వారికి నాయకత్వం వహించిన వాళ్ళను మాత్రమే లక్ష్యం చేసుకొని మారణకాండ జరగలేదు. 200 మంది తూర్పుకాపులు ఆడ, మగ కారం, బాంబులతో మాలపల్లెపై పడి విధ్వంసం సృష్టించారు. చిన్నా, పెద్దా, ముసలి, ముతకా, ఆడా మగా, తేడాలేకుండా విచక్షణా రహితంగా బరిసెలతో పొడిచారు, గొడ్డళ్ళతో నరికారు.

అందుకే ఈ దాడి ముమ్మాటికీ కులపరమైన దాడే. శ్రీకాకుళంలో బీసీలుగా చెలామణి అవుతున్న తూర్పు కాపులు అగ్రకుల దురహంకారంతో దళితులపై చేసిన దమనకాండ, కంచికచర్ల నుంచి లక్షింపేట దాకా జరిగిన అన్ని నరమేధాలకు అగ్రకుల దురహంకారమే కారణం. అంతేకాదు ఈ దేశంలో దళితులపై జరిగిన దాడులన్నీ కులపరమైన వివక్ష, అణచివేతలో భాగంగా జరిగే దాడులే. కేవలం సమాజంలో ఆత్మగౌరవంగా బతకాలనుకున్నందుకే ఈ దేశంలో దళితుల నెత్తురు ఏరులై పారింది. రెండు గ్లాసుల పద్ధతి వద్దన్నందుకు, రచ్చబండల మీద కూర్చున్నందుకు, అగ్రకుల వీధుల్లో చెప్పులేసుకొని నడిచినందుకు, దేవాలయ ప్రవేశం అడిగినందుకు దళితుల కుత్తుకలు తెగుతున్నాయి. ఒక చోట భూమి అడిగినందుకు కావచ్చు. ఇంకొక చోట నీళ్ళ చెరువు దగ్గర కావచ్చు.

మరొక చోట సినిమాహాలులో కుర్చీ దగ్గర కొట్లాట కావచ్చు. దాడికి సాకులు ఏమైనా కావచ్చు. దాడి చేసిన కులం ఏదైనా కావచ్చు. కానీ దాడులకు బలౌతుంది మాత్రం దళితులే. అంటరాని వారిగా, హీనంగా, దీనంగా వెలివాడల్లో బతకాల్సిన వారు మనువు గీసిన విభజన రేఖల్ని తుడిపే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే దాడులు జరుగుతున్నాయి.

భూమిలేని కారణంగానే దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ, దాడులు ఆగాలంటే భూపోరాటం చెయ్యాలనే అగ్రకుల భావజాలం కలిగిన కులదాటవేత దారులకు ఒక ప్రశ్న. ఈ దేశంలో భూమిలేని మిగిలిన కులాల ప్రజలపై ఇలాంటి సామూహిక దాడులు, అత్యాచారాలు, హత్యలు ఎందుకు జరగడం లేదో చెప్పాలి. భూమి ఉన్నాగాని ఖైర్లాంజిలో భయ్యాలాల్ కుటుంబం మొత్తం అత్యాచార హత్యలకు ఎందుకు బలయ్యిందో చెప్పాలి. ఈ దేశంలో ముస్లింలపై, క్రైస్తవులపై, దళితులపై ముస్లింలైనందుకే, క్రైస్తవులైనందుకే, దళితులైనందుకే దాడులు జరుగుతున్నాయి. అందుకు భూమి లేకపోవడం, ఉండటం ప్రమాణం కాదు.

ముస్లింలపై, క్రైస్తవులపై సామూహిక హత్యాకాండకు హిందూ మతోన్మాదమే కారణం అంటున్నవారు దళితులపై దాడులు జరిగినపుడు అగ్రకుల దురహంకార దాడిగా చెప్పడానికి ఎందుకు వెనుకాడుతున్నారు. ముస్లింలకు, క్రైస్తవులకు భూములుంటే ఇలాంటి దాడులు జరగవు అని అననివారు, భూమిలేని కారణంగానే దళితులపై దాడులు జరుగుతున్నాయని ఎందుకు పడికట్టు పదాలు వల్లిస్తున్నారు. భూమి ఎంతవసరమో దళితులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దేశంలో మెజారిటీ దళితులు వ్యవసాయ రైతు కూలీలే. దుక్కి దున్నిన దగ్గర్నుంచి భూస్వామి గాదెలు నింపేదాకా మట్టితో పెనవేసుకుపోయిన జీవితం వాళ్ళది. అగ్రకుల భూస్వామ్య దోపిడీ, దౌర్జన్యాలు నిత్యం ప్రత్యక్షంగా అనుభవించిన సమూహమది.

కారంచేడు మారణకాండకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు పెద్దఎత్తున ఉద్యమించారు. లక్షింపేట నరమేధం సందర్భంగా ఆ స్పందన కరువయ్యింది. కనీసం దళితులు కూడా అంతగా స్పందించకపోవడం విషాదం. 1985 నాటి దళితుల సామాజిక ఆర్థిక, రాజకీయ స్థితితో పోల్చుకుంటే ఈ 27 ఏళ్ళలో దళితులు కొంతమేరకైనా అభివృద్ధి చెందారని చెప్పవచ్చు. కానీ అట్టడుగుస్థాయి దళితుల ఆక్రందనలు దళిత అధికారులకు, రాజకీయంగా అనేక అవకాశాలు అందిపుచ్చుకున్న దళిత నాయకుల చెవికెక్కడం లేదు. ఆ విషయాన్ని లక్షింపేట మరోసారి రుజువుచేసింది. 

వంగర ఎస్.ఐ, పాలకొండ సి.ఐ, డిఎస్‌పి, స్థానిక ఎమ్మెల్యే (మంత్రి కూడా) అందరూ దళితులే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మాలలు. అయినప్పటికీ చట్టాన్ని అమలుచేసి లక్షింపేట మాలలకు న్యాయం అందించే చిన్న ప్రయత్నం చెయ్యకపోగా అగ్రకుల ఆధిపత్య శక్తులకు, హంతక మూకలకు అండగా నిలబడ్డారు. మరోవైపు అనేకమంది మేధావులు, ప్రజాస్వామికవాదులుగా గుర్తింపు ఉన్నవారు 'లక్షింపేట దళితులపై ఇంతటి అమానుషమైన దాడి జరిగితే కనీసం దళితులు కూడా స్పందించడం లేద'ని ఒక వ్యాఖ్యానం చేసి చేతులు దులుపుకుంటున్నారు. లక్షింపేట కులసమస్య కాబట్టి ఆ కులం వాళ్ళు స్పందించాలనే తప్పుడు అవగాహనతో సమాజం కుంచించుకుపోతుంది. అందుకే లక్షింపేటలో జరిగింది మానవహక్కులపై, జీవించే హక్కుపై, ప్రజాస్వామ్యంపై, సామాజిక న్యాయంపై, మొత్తంగా ఒక మానవ సమూహంపై జరిగిన అమానుషమైన దాడిగా బుద్ధిజీవులకు అనిపించడం లేదు. హంతకమూకలకు ప్రత్యక్ష అండదండలందిస్తున్న అగ్రకుల పాలకవర్గ పార్టీల నుంచి దళిత సమూహం ఆశించేదేమీ లేదు.

పేద ప్రజల పార్టీలు అనిచెప్పుకుంటున్న కమ్యూనిస్టు పార్టీలు కూడా ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని దళితులపై దాడుల విషయంలో గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నాయి. వీరికి తోడు విప్లవపార్టీలుగా చెప్పుకుంటూ దళితుల నెత్తురులో కూడా ఓట్లేరుకునే పార్టీలు. ఆ పార్టీల మేధావులు దళితులపై హత్యలు జరిగిన ప్రతి సందర్భంలో భూమి సమస్యను ముందుకు తెస్తూ దళితులు భూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తూ ఉంటారు. 

ఈ మధ్యకాలంలో విప్లవాన్ని కోరుకునే కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు కూడా 'లక్షింపేట'లో కులసమస్యను గాలికొదిలి, భూమి సమస్యను ముందుకు తెస్తున్నారు. దళితులు దాడికి బలైన ప్రతీసారి భూమిని పోటీగా నిలబెడుతున్నారు. అగ్రకుల దురహంకారాన్ని, దాని తీవ్రతను మరుగుపరిచే ఇలాంటి వైఖరి అగ్రకుల భూస్వామ్య ఆధిపత్య శక్తులకు బలాన్నిచ్చేదిగా ఉంటుంది. ఆ విధంగా ప్రచారం చెయ్యడం ద్వారా ఈ ప్రచారకులకు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీరు పేదలందరి ప్రయోజనం, క్షేమం కోరేవారిగా అందరికీ భూములు పంచేవారిగా నిలబడుతూ దళితులు భూ పోరాటాలను వ్యతిరేకించే వారిగా, భూమి విలువ తెలియనోళ్లుగా, మిగిలిన పేదలందరికీ వ్యతిరేకులుగా తేల్చేస్తున్నారు. ఇది అత్యంత అమానుషమైన, వికృతమైన, నిగూఢమైన వివక్షారూపం.

పేదలకు, అందునా అంటరాని పేదలకు భూమి ప్రధానమైన అవసరం. ఎవ్వరూ కాదనరు. తరతరాలుగా భూమి కోసం జరుగుతున్న యుద్ధమే అందుకు సాక్ష్యం. తాజాగా లక్షింపేట మనముందుంది. భూమి కేంద్రంగా పేదలందర్ని ఐక్యం చేసి భూస్వామిని ఒంటరి చేసి భూములు పేదలకు పంచడం ఒక కార్యక్రమం. ఇది కొంచెం అటుఇటుగా కమ్యూనిస్టు పార్టీల వైఖరి. కానీ ఆ భూస్వామి కులాన్ని కేంద్రంగా చేసుకొని కుట్రలు చేసి పీడిత ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేసి తన అగ్రకుల ఆధిపత్యాన్ని మరింత పటిష్ఠపరుచుకుంటున్నాడు. ఇది ఈ దేశంలో మాత్రమే ఉన్న ప్రత్యేక పరిస్థితి.

భూమి వ్యక్తిగత ఆస్తి కాబట్టి భూస్వామి భూములు ఆక్రమణకు గురైనపుడు అతని కుటుంబ సభ్యులు రాజ్యం మాత్రమే అండగా నిలబడుతుంది. దళితులు రచ్చబండ మీద కూర్చుంటే, అగ్రకుల రీతిలో చెప్పులేసుకొని నడిస్తే, దేవాలయ ప్రవేశం కోరితే, ఎవ్వరికీ ఏ నష్టం జరగడం లేదు. అయినప్పటికీ దళితులకు వ్యతిరేకంగా ధనిక, పేద తేడా లేకుండా దళితేతరులందరూ ఐక్యమవుతున్నారు. అందుకు రాజ్యం, అగ్రకుల భూస్వామ్య పెత్తందారీ వర్గం, సామ్రాజ్యవాదం, హిందూమతోన్మాదం అండగా ఉంటుంది. కాబట్టి దోపిడీ ఆధిపత్య శక్తులు తమకు రక్షణ వలయంగా కులవ్యవస్థను కట్టుదిట్టం చేసుకుంటున్నారు. ఆ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పుకుంటున్నవారు కుల వ్యవస్థను బలహీనపరిచే కార్యక్రమం రూపొందించుకోవాలి. కానీ అందుకు భిన్నంగా కుల అణచివేతకు వ్యతిరేకంగా ఆధిపత్య శక్తుల బహుముఖ దాడికి బలవుతూ, పోరాడుతూ నెత్తురోడుతున్న వాళ్ళను కులతత్వవాదులుగా కుదించి అపహాస్యం చేస్తున్నారు.

వెలివాడల్లో బతుకుతున్న దళితులు కుల వివక్ష రూపాలను వ్యతిరేకిచడం అంటే అగ్రకుల భూస్వామ్యాన్ని, దాని ఆధిపత్యాన్ని సవాల్ చెయ్యడం. దానికి అండగా ఉన్న రాజ్యానికి, పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదానికి, హిందూమతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడ్డం. వారి పోరాటం వర్గ పోరాటంలో అంతర్భాగమే. కాబట్టి కమ్యూనిస్టుల వర్గ దృక్పథం, దళితుల (కులదృక్పథం కాదు) కుల నిర్మూలన దృక్పథం వేరు వేరు కాదు. ఎవరెవరికి ఏమి అడ్డొస్తున్నాయో గానీ కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడేవారిని కులతత్వ వాదులుగా, వారి పోరాటాలను అస్తిత్వ పోరాటాలుగా, అస్తిత్వ పోరాటాలు విప్లవోద్యమానికి అడ్డంకిగా చిత్రీకరిస్తూ ఒకదానికొకటి పోటీగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇన్ని కుటిల ఎత్తుగడల మధ్య దళితుల కోసం బతికే వారిని, దళితులపై బతికేవారిని వేరుచేయడం దళితుల తక్షణ కర్తవ్యం కావాలి. ఆధునిక మనువాదుల అనేక ముసుగుల్ని బరాబదలు చేస్తూ మరో లక్షింపేట జరగకుండా పీడిత కులాల్ని ఐక్యం చెయ్యడం ఉద్యమశక్తుల ముందున్న సవాల్.

- దుడ్డు ప్రభాకర్
రాష్ట్ర అధ్యక్షులు, కులనిర్మూలనా పోరాటసమితి

Andhra Jyothi News Paper Dated : 16/10/2012 

Tuesday, July 17, 2012

దళిత నెత్తురు నేర్పుతున్న పాఠాలు - దుడ్డు ప్రభాకర్

ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో తరతరాలుగా వెలివాడల్లో పశువులకంటే హీనంగా బతుకుతున్న దళితులు మనిషిగా గుర్తింపు కోసం చేసే చిన్న ప్రయత్నాన్ని కూడా అగ్రకుల మనువాద భూస్వామ్య పాలకవర్గాలు సహించలేకపోతున్నాయి. కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పం, తిమ్మసముద్రం, చుండూరు, చీమకుర్తి, వేంపెంట, ప్యాపిలి, కల్వకోలు, పొట్టిలంక, లక్షింపేట లాంటి మారణహోమాలు సృష్టిస్తున్నారు. సామ్రాజ్యవాదులు, హిందూ మతోన్మాదులు, భూస్వామ్య పెత్తందారీ శక్తులు, పాలకులు కలిసి రూపుదిద్దుకున్న అభినవ మనువులు తిరుగాడుతున్న ఈ నేలమీద అంటరాని కులాల ప్రజలు వేసే ప్రతి అడుగూ నెత్తురు మడుగవుతుంది.

ప్రతి కదలికా నిషిద్ధమౌతుంది. అయినప్పటికీ హరించి వేయబడుతున్న హక్కుల సాధన కోసం వెలివాడలు ఉద్యమిస్తూనే ఉన్నాయి. ఆ క్రమంలో అగ్రకుల దురహంకారుల కత్తుల వేటకు తెగిపడిన ప్రతివీరుని తల అంటరాని వారి జీవన్మరణ పోరాటాలకు చిరుదివ్వెలుగా నిలుస్తున్నాయి. అత్యాచారానికి బలవుతున్న ప్రతి తల్లి, చెల్లి చేస్తున్న హాహాకారాలు ఉద్యమ శంఖారావాలుగా మారుతున్నాయి. ఆ ఉప్పెనల్ని చల్లార్చడానికి పాలకులు అనేక ఎత్తుగడలు అవలంభిస్తున్నారు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో సామాజిక సంబంధాలు వ్యక్తిగత సంబంధాలుగా, మానవ సంబంధాలు మార్కెట్ సంబంధాలుగా మారుతున్న వేళ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమీకరణలు, సమ్మేళనాలు అతివేగంగా మారుతున్నాయి.

కారంచేడు నుంచి లక్షింపేట వరకు జరిగిన నరమేధాలు దళితులు ఉమ్మడిగా ఉద్యమించాల్సిన అవసరాన్ని, మిగిలిన పీడిత కులాల్ని కలుపుకొని పోరాడాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. అందుకు భిన్నంగా సామాజిక సమీకరణాలు జరుగుతున్నాయి. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచిన రిజర్వేషన్ల ద్వారా రాజకీయరంగంలో వాటా పొంది పాలకవర్గంలో చేరిన ఎస్‌సి, ఎస్‌టిలు (పిడికెడు మందే అయినప్పటికీ) ఆయా కులాల, జాతుల ప్రజల చితుకుతున్న బతుకుల గురించి ఆలోచించడం మానేశారు. పైగా పాలకుల అంబుల పొదిలో అస్త్రంగా మారి పీడిత ప్రజల బతుకుల్ని, బతుకుదెరువుని చిన్నాభిన్నం చేస్తున్నారు.

పేదల సమాధులపై పెద్దలు భవనాలు నిర్మించుకునే విధంగా చట్టాలు తయారవుతుంటే నోరు మెదపడం లేదు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు విలవిల్లాడుతున్నారు. మైదాన ప్రాంతాలలో పీడిత కులాల పేదలు సాగుచేసుకొని బతుకుతున్న కుంట, సెంటు అసైన్డ్ భూములను ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బహుళజాతి కంపెనీలకు కోట్లాది రూపాయలకు అమ్ముకుంది. ఆర్థిక మండళ్ళ పేరుతో లక్షలాది ఎకరాలలో విస్తరించి వున్న కార్పొరేట్ కంపెనీలు నయాభూస్వామ్య వర్గంగా అవతరించాయి. ఆ కంపెనీలే వ్యవసాయం చేసే విధంగా మన పాలకులు 'కార్పొరేట్ వ్యవసాయ' మంత్రం జపిస్తున్నారు. దళితులు చస్తే బొందబెట్టను ఆరడుగులు నేలలేని పరిస్థితులు నేడు ప్రతి పల్లెలో దర్శనమిస్తున్నాయి.

దళితులు పోరాడి సాధించుకున్న ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టాన్ని అగ్రకుల పెత్తందార్లు, పోలీసులు తూట్లు పొడుస్తుంటే, దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లుంటున్నారు. అత్యాచారానికి గురైన దళితులు పోలీసుస్టేషన్‌కు వెళితే పోలీసులు కేసు నమోదు చెయ్యడం లేదు. కొన్ని ఉద్యమ సంస్థల ఒత్తిడి మేరకు కేసు రిజిష్టర్ చేసినా దళితులపై కౌంటర్ కేసులు నమోదు చేసి స్టేషన్లలోనే రాజీలు చేస్తున్నారు. దళితులపై జరుగుతున్న అత్యాచారాలలో కేవలం 30 శాతం మాత్రమే రిజిష్టర్ అవుతున్నాయి. పోలీసు పక్షపాత వైఖరి వల్ల కోర్టుల్లో కేసులు వీగిపోతున్నాయి.

ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద నమోదైన కేసుల్లో 80 శాతం కేసులు పెండింగ్‌లో వున్నాయని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ పార్లమెంట్ స్థాయీ సంఘం ప్రకటించక తప్పలేదు. దేశవ్యాపితంగా నమోదైన కేసుల్లో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది. (రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఒకటి రెండు స్థానాల్లో నిలిచాయి). ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం రూల్స్ 1995 ప్రకారం ప్రతి ఆరునెలలకొకసారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విజిలెన్స్, పర్యవేక్షణ కమిటీ రాష్ట్రస్థాయి సమావేశం జరగాలి.

ప్రతి మూడు నెలలకొకసారి కలెక్టర్, ఎస్‌పి, జిల్లా జడ్జి పర్యవేక్షణలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరగాలి. అలాంటి సమావేశాలు జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఓట్ల సమయంలో దళితులపై ప్రేమ కురిపిస్తూ ఇలాంటి సమావేశాలు నిర్వహించినప్పటికీ వాటి పట్ల దళితులకు భ్రమల్లేవు. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టాన్ని అత్యాచారం చేసిన వాళ్లే సమీక్షిస్తే ఫలితాలు ఎలా వుంటాయో ఈ 23 ఏళ్ళలో దళితులు బాగానే అర్థం చేసుకున్నారు.

ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ నేపథ్యంలో కుల వృత్తులు ధ్వంసమై బిసిలు పొట్ట చేతపట్టుకొని పట్టణాలకు నగరాలకు వలస వెళుతున్నారు. నగరాలలోని ప్రభుత్వ సంస్థలు మూతబడి కార్మికులు అడ్డా కూలీలుగా మారుతున్నారు. నానాటికీ నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతుంది. నగరాలు మురికివాడలుగా మారి కిక్కిరిసి పోతుంటే నగరశివారుల్లో ఆకాశాన్నంటే భవనాలు అధునాతన వసతులతో హైటెక్ సిటీలు వెలుస్తున్నాయి. కోస్టల్ కారిడార్ పేరుతో సముద్ర తీరాన్ని కూడా కార్పొరేట్ సంస్థలు ఆక్రమించాయి.

తీరం పొడవునా స్టీల్ ప్లాంట్‌లు, షిప్ యార్డులు, ఓడరేవులు, థర్మల్ పవర్ ప్లాంట్‌లు, విషవాయువుల్ని వెదజల్లే రసాయన పరిశ్రమలు వెలుస్తున్నాయి. అరకొర పునరావాసంతో మత్స్యకారుల గ్రామాలు సముద్రానికి దూరంగా విసిరి వేయబడుతున్నాయి. తమ సాంప్రదాయ వృత్తిని కోల్పోయిన మత్స్యకారులు ఆకలితో అలమటిస్తున్నారు. కార్పొరేట్ రంగం విస్తరించే క్రమంలో పీడిత కులాల్లోని పేదలు ఒక చోటు నుంచి మరో చోటుకి తరిమివేయబడుతున్నారు. అతి కొద్ది కాలంలోనే ఎక్కడా నిలవలేని పరిస్థితులు రాబోతున్నాయి.

అడవుల్లో వుండే ఆదివాసులే గాక మైదాన ప్రాంతాల్లో వుండే పేదలు కూడా జీవన్మరణ పోరాటాలకు సిద్ధపడుతున్నారు. బతకాలంటే పోరాడక తప్పని పరిస్థితి అనివార్యంగానే ప్రజల ముందుకొచ్చింది. ఈ పరిస్థితుల్ని ముందుగానే కనిపెట్టిన పాలకులు ప్రజా ఉద్యమాల్ని అణచివేయడానికి 'ఊపా' లాంటి క్రూరమైన చట్టాల్ని చేస్తున్నారు. మరోవైపు ఎస్‌సి, ఎస్‌టి, బిసి కులాలకు చెందిన రాజకీయ నాయకులను, ఉన్నతాధికారులను రంగంలోకి దింపి ఆయా కులాల ప్రజల్ని మభ్యపెడుతూ, కుల సంఘాల నాయకుల్ని ప్రలోభపెడుతూ, కులతత్వాన్ని పెంచిపోషిస్తున్నారు. అందుకు 'లక్షింపేట' మారణహోమం ప్రత్యక్ష సాక్ష్యంగా మనముందుంది.

'ఏ భూమి కోసమైతే ఐదుగురు దళితులు అసువులు బాశారో 20 మంది వికలాంగులయ్యారో ఆ భూమి నుంచి శాశ్వతంగా దళితుల్ని దూరం చేసే కుట్ర జరుగుతుంది'. అధికార పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో పాటు వారి కనుసన్నల్లో, వారి సహాయసహకారాలతో ఉద్యమాలను నడిపిస్తున్న కొందరు దళిత నాయకులు కూడా ఆ కుట్రలో భాగస్వాములౌతున్నారు. హంతకులను కాపాడుతూ, వారికి నజరానాగా 250 ఎకరాల భూమిని ఇవ్వడానికి కాపు కులాధినాయకుడు బొత్స సత్యనారాయణ ప్రయత్నిస్తుంటే చట్టాన్ని అమలు చేయడానికి దళితులైన స్థానిక సిఐగాని డిఎస్‌పిగాని, మంత్రిగానీ, అధికార, ప్రతిపక్షాలలో ఉన్న ఏ దళిత రాజకీయ నాయకుడు గానీ, ప్రయత్నించలేదు.

ఇలాంటి సందర్భాలలో దళిత అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని వెనకేసుకొచ్చే ఆయా కుల సంఘాల నాయకులందరూ నేరస్తులే. మరోవైపు కమ్యూనిస్టులుగా చెప్పుకుంటున్న పార్టీలన్నీ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని నామమాత్రంగా స్పందిస్తున్నారు. ఇంకోవైపు మార్క్సిస్టు ముసుగు తొడుక్కున్న కొందరు అగ్రకుల మేధావులు కులాల్ని మరుగుపరచి, వర్గాన్ని వేదిక మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

దాడి చేసిన వారి కుల ప్రస్థావన తెస్తే అగ్రకులాల్లోని పేదలు దూరమవుతారనే కుటిల వాదన చేస్తున్నారు. అయినప్పటికీ హంతకుల అరెస్టుకై దళితులు గొంతెత్తి అరుస్తున్నారు. ఈ సందర్భంగా 'దళితులపై బతికే' వాళ్ళను, 'దళితుల కోసం బతుకుతున్న' వాళ్ళను వేరు చూస్తూ విభజన రేఖ గీయాల్సివుంది. అట్టడుగు స్థాయి దళిత, పీడిత కులాలకు అండగా నిలిచి, వారి బతుక్కి, బతుకుదెరువుకి భరోసా ఇచ్చే బలమైన ఉద్యమ నిర్మాణం జరగాలి. అది మనందరి తక్షణ కర్తవ్యం కావాలి. అదే దళిత మృతవీరులకు మనమందించే నిజమైన నివాళి.

- దుడ్డు ప్రభాకర్
కులనిర్మూలనా పోరాటసమితి, రాష్ట్ర అధ్యక్షులు 
Andhra Jyothi News Paper Dated : 18/07/2012 

Thursday, January 26, 2012

ప్రపంచ మేధావికి అవమానం - దుడ్డు ప్రభాకర్



తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత అరాచక గుంపు నాలుగు అంబేద్కర్ విగ్రహాలను ఒక పథకం ప్రకారం ధ్వంసం చేసింది. సాటి మనిషిని మనిషిగా గుర్తించి గౌరవించే సమాజం కోసం, మానవీయ విలువల కోసం జీవితాంతం కృషి చేసిన 'భారతరత్న'కు అవమానం జరిగింది. 

దేశ ప్రజలంతా ఉమ్మడిగా ఖండించాల్సిన ఈ దుశ్చర్యకు నిరసనగా కేవలం దళిత సమాజం మాత్రం స్పందించింది. రాష్ట్ర వ్యాపితంగా ర్యాలీలు, రాస్తారోకోలు నిరసన కార్యక్రమాలు జరిపారు, జరుపుతున్నారు. పలువురు మంత్రులు, పిసిసి చీఫ్, చిరంజీవి పలు రాజకీయ నాయకులు విగ్రహాల విధ్వంసాన్ని ఖండించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసి విగ్రహాలు ధ్వంసమైన చోట ప్రభుత్వ ఖర్చుతో కొత్త విగ్రహాలు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. 

ఈ సందర్భంగా 'కొందరు స్వార్థరాజకీయ ప్రయోజనం కోసం ఈ దుశ్చర్యకు పాల్పడ్డార'ని అన్ని రాజకీయ పక్షాలు ప్రకటించాయి. ఆది నుండి అంబేద్కర్ బొమ్మను తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్న అగ్రకుల నాయకులే ఇలాంటి ప్రకటనలు చేయడం 'దొంగే దొంగ దొంగ' అని అరిచినట్లుంది. 48 గంటల్లో నిందితులను అరెస్టు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. గతంలో అనేకసార్లు తూర్పుగోదావరి జిల్లాలోనే అంబేద్కర్ విగ్రహాలకు చెప్పుల దండలు వేసిన సంఘటనలు, ధ్వంసం చేసిన సందర్భాలు జరిగాయి. ఇంతవరకూ ఎవ్వరినీ అరెస్టు చేసిన దాఖలాలు కనిపించలేదు. ఇపుడు కూడా అందుకు భిన్నంగా జరుగుతుందని ఊహించలేం. 

గత నెల లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ సర్వేలో ప్రపంచ వ్యాపితంగా టాప్ 100 మేధావుల్లో డా. బి.ఆర్. అంబేద్కర్‌కు మొట్టమొదటి స్థానం దక్కింది. అది విదేశీ పత్రికల్లో బ్యానర్ వార్తగా ప్రచురితమయింది. ఇండియాకే గర్వకారణమైన ఈ వార్తను మనదేశ మీడియా గాని, పాలకులు గాని పట్టించుకోలేదు. ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యుడిగా గుర్తింపు పొందిన అంబేద్కర్‌కు ఈ మాతృభూమిలో అవమానాల పరంపర కొనసాగుతూనే వుంది. ప్రపంచ దేశాలలో కీర్తించబడుతున్న ఈ విశ్వమానవుడు నవభారత రాజ్యాంగ నిర్మాత కూడా. 

అలాంటి అంబేద్కర్‌ను ఈ దేశం జాతీయ నాయకుడిగా గుర్తించకపోవడానికి నేటికీ నిరాటంకంగా కొనసాగుతున్న అమానుషమైన నిచ్చెనమెట్ల కులవ్యవస్థే కారణం. ప్రపంచ మేధావిని కేవలం ఒక కులానికి చెందిన వ్యక్తిగా చిత్రీకరించడంలో ఈ దేశ అగ్రకుల బ్రాహ్మణీయ మనువాదుల కుట్ర వుంది. పాలకుల కుటిల కౌటిల్య నీతి దాగి వుంది. ఒక్క అంబేద్కరే కాదు, లోకాయతులు మొదలుకొని కులవ్యవస్థను సవాల్‌చేసిన ప్రతి ఉద్యమకారుడ్ని, మేధావిని, కవిని, కళాకారుడ్ని సాధ్యమైతే అంతం చేయడం, కాకుంటే ఆయాకులాల పరిధిలోకి కుదింపుచేసే కుట్రలు ఈ దేశ చరిత్ర నిండా మనకు కనిపిస్తూనే వున్నాయి. 

అంబేద్కర్‌ను దళితులకే పరిమితం చేయడం వెనుక ఆయన్ని తక్కువ చేయడంతో పాటు ఈ దేశ పాలకులకు మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహాల చాటున దళితుల ఓట్లను కొల్లగొట్టడం, దళితుల్ని మభ్యపెట్టి దోపిడీని సజావుగా కొనసాగించడం లాంటివి ఉదాహరణంగా చెప్పుకోవచ్చు. అనివార్య పరిస్థితుల్లోనే ఈ దేశ పాలకులు అంబేద్కర్‌ను ఆ మాత్రమైనా తెరమీదకు తెచ్చారు. దళితుల్లో రాజకీయ చైతన్యం పెరుగుతున్న దశలో, దేశవ్యాపితంగా దళిత ప్రతిఘటనా పోరాటాలు ముందుకొస్తున్న సందర్భంలో అంబేద్కర్‌కు భారతరత్న ప్రకటించారు. అంబేద్కర్ రచనల్ని వెలుగులోకి తేవడం, అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టడం అందులో భాగమే. 

నూతన ఆర్థిక విధానాలు అమలులో భాగంగా దళితుల బతుకులు ఛిద్రమౌతుంటే దళితుల్ని మభ్యపెట్టడానికి, వారి దృష్టి మళ్ళించడానికి పాలకులే పనిగట్టుకొని దళితవాడల్లో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు దళితుల్ని ప్రోత్సహించారు. నేటికీ అంబేద్కర్ వర్ధంతులు, జయంతుల తంతుతోనే కాలం గడుపుతూ అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను తుంగలో తొక్కుతున్నారు. 

దళితులపై, పీడిత కులాలపై ఈ దేశ పాలకుల, సామ్రాజ్యవాదుల దోపిడీ తీవ్రతరమౌతున్న కొద్దీ పీడకుల వ్యూహాలు మారుతున్నాయి. అంబేద్కర్‌ను కేవలం మాలల నాయకుడిగా చూపడం కోసం మాదిగల ప్రతినిధిగా జగ్జీవన్‌రామ్‌ను తెరమీదకు తెచ్చారు. గత రెండు సంవత్సరాల నుంచి బిసిల ప్రతినిధిగా మహాత్మా జ్యోతిరావుఫూలేను ముందుకు తెచ్చి బిసి నాయకులతో పూలే జయంతి ఉత్సవ కమిటీలను వేస్తున్నారు. 

పాలకుల కుట్రల ఫలితంగా అంబేద్కర్ యావత్భారతదేశ ప్రజల ప్రతినిధి కాలేకపోయినా దళితులకు మరింత దగ్గరయ్యాడు. దళిత ఆత్మగౌరవ పోరాట ప్రతీకగా దళితుల గుండెల్లో నిలిచిపోయాడు. అందువల్లనే దళితుల ఆత్మగౌరవ ప్రతిఘటనా పోరాటాలు ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో అంబేద్కర్‌ను పాలకులు కీర్తించారు. ఆ పోరాటాలు బలహీనపడుతున్న క్రమంలో అంబేద్కర్ విగ్రహాలు అవమానించబడుతున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్న దశలో అట్టడుగుస్థాయి నిరుపేద దళితులు దిక్కులేని వారవుతున్నారు. 

అలాంటి దళితులు ఆత్మగౌరవ చైతన్యాన్ని ప్రదర్శిస్తున్న సందర్భాలలో సహించలేని పెత్తందారీ శక్తులు దళితులపై దాడులతో తృప్తిచెందడం లేదు. దళిత చైతన్యస్ఫూర్తి ప్రధాత అయిన అంబేద్కర్ విగ్రహాలపై దాడులకు తెగబడుతున్నారు. అంబేద్కర్‌ని కుల నాయకుడిగా కుదించడం వల్లనే ఇలాంటి విధ్వంసాలు దేశవ్యాపితంగా నిర్భయంగా, నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అందుకు ఈ దేశ పాలకులను ప్రథమ ముద్దాయిలుగా చేర్చాలి. వారి కుట్రలకు పావులుగా ఉపయోగపడుతున్న దళిత రాజకీయ నాయకులతో సహా అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ సభ్యులు కూడా ఈ నేరంలో భాగస్వాములే. 

అంబేద్కర్ తన జీవితాంతం తను ఎంచుకున్న పద్ధతిలో కులనిర్మూలన కోసం నిజాయితీగా పోరాడారు. కుల పునాదులపై నిర్మితమై బలోపేతమౌతున్న హిందూమత వ్యవస్థపై రాజీలేని పోరాటం చేశారు. అంటరానితనం లేని సమాజం కోసం కలలుగన్నారు. కనుకనే ప్రపంచంలో అత్యధిక విగ్రహాలున్న రెండవ వ్యక్తిగా ప్రజల ఆరాధ్యులుగా నిలిచారు. 

ప్రజా ధనాన్ని దోపిడీ చేసిన అవినీతిపరులు, వేటగాళ్ళ విగ్రహాలు వీధివీధినా వెలుస్తుంటే సామాజిక న్యాయస్ఫూర్తి ప్రధాత, రాజ్యాంగ రూపకర్త అయిన అంబేద్కర్ విగ్రహాలు కూల్చబడుతున్నాయి. దళిత ఆత్మగౌరవ ప్రతిఘటనా పోరాట చైతన్యం పెరిగినపుడు మాత్రమే దళిత ఆత్మగౌరవ ప్రతీక అయిన అంబేద్కర్ విగ్రహాలపై దాడులు ఆగుతాయి. అంబేద్కర్ ప్రతిమలను కాపాడుకోవలసిన బాధ్యత దళితులది మాత్రమే కాదు. ఈ దేశ ప్రజాస్వామిక వాదులందరి కర్తవ్యంగా వుండాలి. 

- దుడ్డు ప్రభాకర్
కులనిర్మూలనా పోరాట సమితి, రాష్ట్ర అధ్యక్షులు
Andhra Jyothi News Paper Dated 27/1/2012

Thursday, October 13, 2011

సామాజికవాదం కుట్ర కాదు - దుడ్డు ప్రభాకర్ Andhra Jyothi 15/10/2011

సామాజికవాదం కుట్ర కాదు
- దుడ్డు ప్రభాకర్

ప్రత్యేక తెలంగాణ కోసం సకల జనుల సమ్మె తీవ్రతరమౌతోంది. సామాజిక తెలంగాణ నినాదం కూడా అంతే తీవ్రంగా ముందుకొస్తోంది. తెలంగాణలో సామాజిక న్యాయం కోసం అనేక కుల సంఘాలు వివిధ ఉద్యమ జేఏసీలుగా ఏర్పడి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమవుతున్నాయి. ప్రత్యేక తెలంగాణను ఒక ప్రజాస్వామిక ఉద్యమంగా గుర్తించిన వారు సామాజిక న్యాయం డిమాండ్‌ను ఒక ప్రజాస్వామిక నినాదంగా గుర్తించడానికి నిరాకరిస్తున్నారు. ఈ వివాదం ఎవరి ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది?

వచ్చేది దొరల తెలంగాణ అయినపుడు తెలంగాణలో 90 శాతంగా ఉన్న దళితులు, బిసిలు, ఆదివాసీలు, మత మైనార్టీలకు ఒరిగేదేమీ లేదన్న వాదన చర్చనీయాంశమైంది. తెలంగాణలోని సామాజికోద్యమ నాయకులు, భౌగోళిక తెలంగాణ కోసం ఉద్యమిస్తూనే ఆ తెలంగాణలో సామాజిక న్యాయం అమలు కావాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకు అనేక ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నారు. అందుకు వారిని తెలంగాణ వ్యతిరేకులుగా భౌగోళిక తెలంగాణ వాదులు చిత్రీకరిస్తున్నారు.

సీమాంధ్ర రాజకీయ నాయకులకు, సామాజికోద్యమ నాయకులకు ఎవరి ప్రయోజనాలు వారికున్నాయి. అయితే అందర్ని ఒకగాటన కట్టి సామాజిక తెలంగాణ అనడం వెనుక 'తెలంగాణ రాకుండా అడ్డుపడే కుట్ర దాగుంది' అనడం ఎంతవరకు సబబు? ఇప్పటిదాకా సీమాంధ్ర, తెలంగాణ ప్రజలను ఉమ్మడిగా దోచుకొని, అణచివేసి కారంచేడు, చుండూరు, వేంపెంట లాంటి నరమేధాలకు కార కులైన సీమాంధ్ర అగ్రకుల, భూస్వామ్య, పెట్టుబడిదారీ రాజకీయ నాయకులు, వారి పంచన జేరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం గందరగోళం సృష్టిస్తున్న వాళ్ళను, సామాజిక న్యాయం లక్ష్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ సామాజిక తెలంగాణ కోరుకుంటున్న వాళ్ళను ఉమ్మడిగా నిందించడం తగదు.

తెలంగాణ అగ్రవర్ణాల దొరలు ఒకప్పుడు అణగారిన కులాలను దోపిడీ, అణచివేత, అత్యాచారాలకు గురిచేసిన వారు కాదా? అందుకే రేపు ఏర్పడబోయే తెలంగాణలో సబ్బండ కులాల బతుకులకు భరోసా అడుగుతున్నారు. ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులకు తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయనే విషయం స్పష్టంగా కనపడుతుంది. ఇవేమీ కానివారు వారి కూలి బతుకుల్లో, బతుకు దెరువులో మార్పులు కోరుకుంటున్నారు. సీట్లలో వాటా అడిగిన సామాజికవాదులు తెలంగాణ ద్రోహులు ఎలా అవుతారు? తెలంగాణ ప్రజల చైతన్యం గురించి, సాయుధ రైతాంగ పోరాటాల గురించి ఉపన్యాసాలిస్తూ అందరం తెలంగాణ ముద్దు బిడ్డలమేనని ఉపన్యాసాలిచ్చేవారు ఇటీవల జరిగిన కోటి బతుకమ్మల సంబరాల్లో దళిత మహిళల స్థానం ఎక్కడ అని అడిగితే ఏం సమాధానం చెబుతారు?

1990 దశకంలో తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభలు తెలంగాణ కోసం ఉద్యమించాయి. ఆ ఉద్యమ నాయకత్వం సమన్యాయం పాటిస్తుందనే అచంచల విశ్వాసముండడం మూలాన అప్పుడు సామాజిక తెలంగాణపై చర్చ రాలేదు. అయితే నేటి తెలంగాణ ఉద్యమానికి ప్రతినిధిగా ప్రాచుర్యం పొందిన 'దొర' పీడకవర్గ ప్రతినిధి. తన కుటుంబ సభ్యుల ఇష్టారాజ్యంగా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఉద్యమం చల్లారినపుడు తల నరుక్కుంటాను, మెడ కోసుకుంటాను, తెలంగాణ రాకపోతే ఆత్మాహుతి చేసుకుంటాను అంటూ తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాల్ని రెచ్చగొట్టి ఆత్మహత్యలకు కారణమవుతున్నారు.

కెసిఆర్‌ను గాని, ఆయన కుటుంబ సభ్యుల్నిగాని, వారి అనుయాయుల్ని గాని ఏ చిన్న మాటన్నా మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని అవమానపరచినట్లు చిత్రీకరిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షులు గద్దర్‌పై కూడా ఎగబడి ప్రకటనలు ఇవ్వడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. సామాజిక తెలంగాణవాదులమీద ఎంత తీవ్రమైన పదజాలంతో దాడి జరుగుతుందో, భౌగోళిక తెలంగాణ కోసం నిస్వార్థంగా పనిచేసే వారిపై కూడా అంతే తీవ్రంగా దాడి జరుగుతోంది.

తెలంగాణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడి పోరాడుతున్నవారిని దొరల తొత్తులుగా అభివర్ణించడం పొరపాటు. సామాజిక, భౌగోళిక తెలంగాణవాద రెండు శిబిరాల మధ్య ఇలాంటి పరస్పర నిందాపూర్వక దాడులు దురదృష్టకరం. కుల అస్తిత్వ పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన రూపంలోని అస్తిత్వ పోరాటాలు రెండూ సమకాలీన గొప్ప ప్రజాస్వామిక ఉద్యమాలుగా గుర్తింపు పొందినవే. అయితే ఇవి రెండూ ఒకదానికి మరొకటి పోటీగా నిలబడడానికి అగ్రకుల భావజాలమే ప్రధాన కారణం. దానికితోడు బూర్జువా రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు, వారి ప్రయోజనార్థం కొందర్ని ఇలాంటి ఉద్యమాల్లోకి ప్రవేశపెట్టి పెంచి పోషిస్తూ ఉంటారు.

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ రెండు ఉద్యమాలలోకి వారి చొరబాట్లు ఎక్కువయ్యాయి. వారు ఉద్యమాల్ని గందరగోళపరచి తమ పబ్బం గడుపుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటారు. ఈ సంక్లిష్ట సందర్భంలో ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యంతో ఉన్నవారు విజ్ఞతతో వ్యవహరించాల్సి ఉంటుంది. సమన్యాయం గురించి పలికే గొంతు ఏదైనా, పలికించే వారెవరైనా సామాజిక న్యాయం ఆకాంక్ష అట్టడుగు కులాల ప్రజల్లో ఉందని మాత్రం మరచిపోవద్దు. ఇప్పుడు నడుస్తున్న చర్చలో సామాజిక తెలంగాణ ఆకాక్షించేవారు తెలంగాణ ద్రోహులుగా వక్రీకరించబడుతుంటే, భౌగోళిక తెలంగాణ కోసం ఆరాటపడేవారు నిజమైన తెలంగాణ సాధకులుగా కీర్తించబడుతున్నారు.

తెలంగాణలోని సామాజిక అణచివేతకు, అసమానతలకు అంతిమ పరిష్కారం ప్రజాస్వామిక తెలంగాణలోనే సాధ్యమని నమ్ముతున్నారు కాబట్టి, ఈ సున్నిత వివాదం పట్ల సునిశిత పరిశీలనా దృష్టితో వ్యవహరించవలసి ఉంటుంది. భౌగోళిక తెలంగాణ కోసం పాలకవర్గాలతో అంటకాగేటపుడు లేని 'అంటు' సామాజిక తెలంగాణవాదుల్ని కలుపుకుని పోయేటపుడు ఎందుకుండాలి? ఈ వైఖరే అనేకమంది అవకాశవాదుల పుట్టుకకు కారణమవుతుందని నిజమైన తెలంగాణ ఉద్యమకారులు గ్రహించాలి.

- దుడ్డు ప్రభాకర్
రాష్ట్ర అధ్యక్షులు, కులనిర్మూలనా పోరాట సమితి

Friday, September 16, 2011

ఉరిశిక్ష రద్దుకై ఉద్యమిద్దాం by - దుడ్డు ప్రభాకర్ Andhra Jyothi 17/09/2011


ఉరిశిక్ష రద్దుకై ఉద్యమిద్దాం

ఒక మనిషిని మరో మనిషి చంపడం ఘోర నేరమయినప్పుడు ఆ చంపిన మనిషిని చట్టబద్ధంగా హత్య చేయడాన్ని ఏమనాలి? ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి న్యాయశాస్త్ర కోవిదులు అవసరం లేదు; సామాజిక స్పృహ ఉన్న ఏ మనిషి నడిగినా చెబుతాడు. హత్యలను చట్టబద్ధం చేసే మధ్యయుగాల నాటి అనాగరిక సంప్రదాయం ఇంకా కొనసాగడం ఈ దేశ ప్రజలుగా మనందరి దౌర్భాగ్యం.

చట్టబద్ధత ఉన్నంతకాలం కోర్టులు మరణ శిక్షలు అమలుచేస్తూనే వుంటాయని కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించారు. మరణ శిక్ష విధించడానికి అనుకూలమైన న్యాయసూత్రాలు, చట్టాలను రద్దుచేయాలని ప్రజలు అంటున్నారు. అసాధారణ కేసుల్లో, అత్యంత అరుదైన సందర్భాలలో మాత్రమే మరణ శిక్ష విధించాలని మన సుప్రీం కోర్టు సూచించింది.

ఉరిశిక్ష రద్దు కోసం మన దేశంలో దశాబ్దాలుగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. జార్ఖండ్‌కు చెందిన నలుగురు ఆదివాసీ, దళిత కళాకారులకు గిరిధి జిల్లా సెషన్స్ కోర్టు గత జూన్ 22న ఉరిశిక్ష విధించడం, రాజీవ్ గాంధీ హంతకులకు కొద్ది రోజుల క్రితం తమిళనాడు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడంతో మరణ శిక్ష రద్దు గురించి దేశ వ్యాపితంగా మళ్ళీ చర్చ జరుగుతోంది.

జార్ఖండ్ అభియాన్ అనే సాంస్కృతిక సంస్థకు చెందిన జీతన్ మరాండి, మనోజ్ రాజ్వర్, అనిల్‌రామ్, ఛత్రపతి మండల్‌కు గిరిధి జిల్లా కోర్టు మరణ శిక్ష విధించింది. 2007లో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ కుమారుడు అనుప్ మరాండీతో పాటు అతను తయారు చేసిన జార్ఖండ్ వికాస్ మోర్చా అనే ప్రైవేట్ సైన్యానికి చెందిన 18 మందిని మావోయిస్టులు కాల్చిచంపారు. ఆ సంఘటన జరిగిన ఐదు నెలల తర్వాత 2008 ఏప్రిల్‌లో జీతన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

2007 అక్టోబర్ 1న విస్థాపన్ విరోధ్ జన వికాస్ ఆందోళన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఇంటి ముందు జరిగిన రాస్తారోకోలో ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా పాటలు పాడాడని, ఉపన్యాసాలిచ్చాడనే అభియోగంతో కేసు నమోదు చేశారు. 2009 ఏప్రిల్‌లో జీతన్‌ని, అతని సహచరుల్ని అనుప్ హత్య కేసులో ఇరికించారు. నేరచరిత్ర కలిగిన కొందర్ని సమీకరించి, బెదిరించి సాక్షులుగా చేర్చారు. జీతన్, అతని సహచరులు కోర్టుకు హాజరవుతున్న సమయంలో సాక్షులకు చూపించి హత్యలో వాళ్ళు పాల్గొన్నట్లు చెప్పే విధంగా శిక్షణ ఇచ్చారు.

2011 జూన్ 22న గిరిధి కోర్టు ఆ నలుగురికీ ఉరిశిక్ష విధించింది. మన పాలకులు అడవిని, అడవిలోని ఖనిజ సంపదను బహుళజాతి కంపెనీలకు కట్ట బెడుతున్న నేపథ్యంలో ఆదివాసులు నిరాశ్రయులౌతున్నారు. బొగ్గు, ఇనుము, బాక్సైట్, రాగి, వెండి, యురేనియం లాంటి కోట్లు విలువ జేసే సంపద జార్ఖండ్ అడవుల్లోని భూమి పొరల్లో ఉంది. ఆ ఖనిజ సంపదను వెలికి తీయడానికి భారీ యంత్రాలు అడవిలోకి ప్రవేశించాయి. ఉక్కు కర్మాగారాల నిర్మాణం జరిగింది. ముడిసరుకు రవాణా కోసం విశాలమైన రోడ్లు ఏర్పడ్డాయి. ఆ రోడ్ల కోసం అడవుల్ని నరికారు.

తద్వారా ఆదివాసులు వేలాది ఎకరాల వ్యవసాయ భూముల్ని కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. నిర్వాసితులైన ఆదివాసులు అడవిని వదిలి జీవించలేక అడవిపై హక్కు కోసం జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న అడవుల విధ్వంసాన్ని అడ్డుకుంటున్నారు. వనరుల దోపిడీని వ్యతిరేకిస్తున్నారు. జల్, జంగిల్, జమీన్ హమారా! అంటూ నినదిస్తున్నారు. జార్ఖండ్‌లో ఆదివాసీ హక్కుల గురించి పోరాడే సంస్థల్లో విస్థాపన్ విరోధి జన వికాస్ ఆందోళన్ ఒకటి.

జీతన్ మరాండీ ఆ సంస్థలో సభ్యుడు. ఈ దేశ పాలకులు, సామ్రాజ్యవాదులు కలసి చేస్తున్న దోపిడీ అణచివేతకు వ్యతిరేకంగా ఆదివాసుల్ని చైతన్యపరుస్తూ, జీతన్, అతని బృందం స్థానిక ఆదివాసీ, హిందీ భాషల్లో పాటలు రాసేవారు. గ్రామ గ్రామం తిరిగి ప్రజలకు పాడి వినిపించే వారు. గోచి, గొంగడి, డోలక్‌లతో నిత్యం ప్రజల్లో ఉండే జీతన్ మరాండీ జార్ఖండ్ గద్దర్‌గా ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడు.

అందుకే బహుళజాతి కంపెనీలు, జార్ఖండ్ ప్రభుత్వం జీతన్, అతని సహచరుల్ని హత్యకేసులో ఇరికించారు. మరణ శిక్ష పడే విధంగా సాక్ష్యాలను సృష్టించడంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రశ్నించే గొంతును అంతం చేయడానికి పాలకులు కోర్టులను కూడా ఎలా ఉపయోగించుకుంటారో ఈ కేసు ద్వారా మరోసారి రుజువయింది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో గ్రీన్‌హంట్ పేరుతో ఆదివాసులపై ప్రకటించిన యుద్ధంలో తెగిపడుతున్న కంఠాలెన్ని? తగలబడి బూడిదైన గ్రామాలెన్ని? చెరచబడ్డ తల్లులెందరు? సల్వా జుడుం, జార్ఖండ్ వికాస్ మోర్చా, రణబీర్ సేన, నల్లమల కోబ్రాస్, గ్రీన్ టైగర్స్, బ్లూ టైగర్స్ పేరు మీద ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన హంతకమూకలు సృష్టిస్తున్న రక్తపాతమెంత! శవాలు కూడ దక్కని కుటుంబాలెన్ని? అన్యాయంగా తప్పుడు కేసులు మోపబడి విచారణకు కూడా నోచుకోకుండా ఏళ్ళ తరబడి జైళ్ళలో మగ్గుతున్న అభాగ్యులెందరు? ఈ భయానక వాతావరణానికి తట్టుకోలేక పారిపోయి నేటికీ జాడలేని మూగజీవులెందరు? ఛిన్నాభిన్నమైన కుటుంబాలెన్ని? ఛిద్రమైన బతుకులెన్ని? నిత్యం జరుగుతున్న ఈ హత్యాకాండకు బాధ్యులెవ్వరు? ఆ బాధ్యుల్ని శిక్షించే చట్టాలెక్కడ? ఇవన్నీ ప్రశ్నలే. జవాబు దొరకని ప్రశ్నలు.

ఇంతటి విధ్వంసం మధ్య కూడా సభ్య సమాజం చిన్న ఆశతో కోర్టుల వైపు చూస్తోంది. అందుకే ప్రజాస్వామిక వాదులు కోర్టు తీర్పులపై స్పందిస్తున్నారు. భవిష్యత్‌లో ఆ ఆశను కూడా వదులుకొనే రోజులు రాబోతున్నాయా? అణగారిన ప్రజల బతుకులు గాలిలో దీపమేనా? జీతన్ మరాండీ, అతని సహచరుల ఉరిశిక్ష తీర్పు అవుననే చెబుతుంది.

1991 మే 21 రాత్రి పది గంటల సమయంలో తమిళనాడులోని పెరంబుదూర్‌లో ఎన్నికల ప్రచార సభలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. థాను అనే ఎల్‌టిటిఇ ఆత్మాహుతి దళ సభ్యురాలు తననుతాను కాల్చుకొని రాజీవ్ గాంధీతో పాటు మరో 18 మంది మరణానికి కారణమయింది.

ఆ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించి మొత్తం 25 మందిని నిందితులుగా తేల్చింది. ప్రత్యేక కోర్టు అందరికీ మరణ శిక్ష విధిస్తే, సుప్రీం కోర్టు నలుగురికి- మురుగన్, శాంతన్, పేరారివలన్, నళిని- మాత్రమే మరణ శిక్ష విధిస్తూ అంతిమ తీర్పు ప్రకటించింది. ఆ నలుగురు 11 ఏళ్ళ క్రితం రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. వారిలో ఒకరైన మురుగన్ భార్య నళినికి క్షమాభిక్ష లభించి, ఉరిశిక్ష యావజ్జీవ శిక్షగా మారింది.

రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ మిగిలిన ముగ్గురి పిటిషన్‌లను ఆగస్టు 11న తిరస్కరించారు. సెప్టెంబర్ 9న కోర్టు ఉరి తేదీని నిర్ణయించింది. తమిళనాడు ప్రజలు ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు. వారికి ఉరి శిక్ష రద్దుచేయాలని తమిళనాడు అసెంబ్లీ ఏఉకగ్రీవంగా తీర్మానం చేసింది. ఉరిశిక్షను ఎనిమిది వారాల పాటు నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ప్రస్తుతానికి వారు సజీవంగా ఉన్నారు.

ప్రస్తుతం మన దేశంలోని వివిధ జైళ్ళలో కసబ్, అఫ్జల్‌గురుతో సహా ఉరిశిక్షలు పడ్డ ఖైదీలు 309 మంది ఉన్నారు. వారిలో 31 మంది సుప్రీం కోర్టులో కూడా శిక్ష ఖరారైంది. వాటిలో 28కేసులు రాష్ట్రపతి దగ్గర సుదీర్ఘకాలంలో పెండింగ్‌లో ఉన్నాయి. మరణ శిక్షను రద్దుచేస్తే నేరాలు పెరుగుతాయనే బుద్ధి జీవులూ ఉన్నారు.

ఇప్పుడు మరణశిక్ష రద్దయిన దేశాలలో నేరాల సంఖ్య పెరగలేదు. అమలౌతున్న దేశాలలో నేరాల సంఖ్య తగ్గలేదు. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ విధానాల పట్ల పాలకులు అవలంభిస్తున్న వైఖరిని బట్టి నేరాల సంఖ్య ఆధారపడి వుంటుంది. అనేక కులాంతరాల దొంతరలు ఉన్న ఈ సమాజంలో మనిషిపై మరో మనిషి , ఒక కులంపై మరో కులం, ఒక జాతిపై మరో జాతి విచ్చలవిడిగా దోపిడీ అణచివేతకు పూనుకుంటున్నాయి.

ఈ సందర్భంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కోర్టులు సామాజిక స్పృహ కోల్పోతే పీడకులదే పైచేయి అవుతుంది. మెజార్టీగా పీడనకు గురయ్యే వారు అనివార్య పరిస్థితిలో హంతకులుగా మారుతున్నారు. ప్రశ్నించే గొంతుకు ఉరితాడు బిగుసుకుంటున్నంత కాలం ఉరిశిక్ష రద్దుకు పాలకులు ప్రయత్నించరు. అవి అమలవుతూనే వుంటాయనేది చరిత్ర తేల్చిన సత్యం. అందుకు ఉరిశిక్ష రద్దయ్యే వరకు ఉద్యమించాల్సిన బాధ్యత ప్రజాస్వామిక వాదులందరిపై ఉంది.

- దుడ్డు ప్రభాకర్
రాష్ట్ర అధ్యక్షులు, కులనిర్మూలనా పోరాట సమితి

Wednesday, September 7, 2011

ప్రజా ఫ్రంట్ చారిత్రక అవసరం -దుడ్డు ప్రభాకర్ Andhra Jyothi 12/11/2010


ప్రజా ఫ్రంట్ చారిత్రక అవసరం

-దుడ్డు ప్రభాకర్

నా లుగు దశబ్దాలుగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడుతూనే ఉన్నారు. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఒక రాష్ట్ర సాధన కోసం ఇంతటి సుదీర్ఘ పోరాటం జరిగిన చరిత్ర, ఇంతటి నెత్తురు చిందించిన సందర్భం లేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రతిసారి పాలకులు అనుసరిస్తున్నది రెండే మార్గాలు. ఒకటి ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయ లబ్ధి పొందడం. రెండు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసి తెలంగాణను రక్తసిక్తం చేయడం.

అయితే ఇప్పుడు సరికొత్త మార్గాన్ని ఎన్నుకున్నారు. వారే ఉద్యమకారులుగా అవతారమెత్తి ఉద్యమాలను హైజాక్‌చేసి ఇటు ఉద్యమకారులుగా, అటు రాజకీయ నాయకులుగా ప్రజల ముందు నిలబడడం. హోంమంత్రి చిదంబరం 2009 డిసెంబర్ 9 ప్రకటన, 2010 జనవరి 5న ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీ, శ్రీకృష్ణ కమిటీ నియామకం వెనుక పాలక వర్గాల ఉమ్మడి వ్యూహం అదే. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాలపై గుళ్ల వర్షం కురిపించిన కాంగ్రెస్, లాబీయింగ్ చేసి తెలంగాణ సాధిస్తామన్న టిఆర్ఎస్, ఒక్క ఓటు-రెండు రాష్ట్రాలు అన్న బిజెపితో సహా అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమాల ద్వారానే తెలంగాణ అంటూ ప్రజా ఉద్యమాలను హైజాక్ చేశాయి.

ఆరు నెలల కిందట తెలంగాణలోని అన్ని ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమకు తెలిసిన పద్ధతుల్లో చేసిన నిరసన కార్యక్రమాలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, కవులు, కళాకారులు, మహిళలు, కార్మికులు ఒక్కొక్క జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి తెలంగాణ అంతటా ధూంధాం చేశారు. రాజకీయ నాయకులను గ్రామా ల్లో నిలదీశారు. వాటిలో కొన్ని జాక్‌లను, ఆ పోరాటాలను పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులంతా కలిసి నిర్మించిన రాజకీయ జాక్ తనలో విలీనం చేసుకుంది. విలీనం కాని వారిని బలహీన పరిచే కుట్రలు చేసింది. ఎట్టకేలకు ప్రజల నాయకత్వాన్ని నిర్జీవం చేశారు.

ఈ పరిస్థితిలో తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆవిర్భావం జరిగింది. తెలంగాణలోని వివిధ ప్రజా సంఘాలకు చెందిన వందలాది మంది నాయకులు 'పోరాటాల ద్వారా తెలంగాణ సాధించుకుందాం' అంటూ ఉమ్మడి గొంతుతో నినదించారు. రాజకీయ నాయకులు ఉద్యమకారులుగా, ఉద్యమకారులు రాజకీయ నాయకులు స్వరాలు మారుస్తున్న ప్రస్తుత సందర్భంలో ఉద్యమకారులను, రాజకీయ నాయకులను ఐక్యం చేస్తూ ప్రజాఫ్రంట్ పురుడుపోసుకున్నది. ఫ్రంట్ తన ప్రణాళికను ప్రకటించకముందు, ప్రకటించాక మీడియాలో విస్తృత చర్చ జరిగింది. ఆ సందర్భంగా మీడియా ద్వారా కొందరు చేస్తున్న వక్రీకరణలు, అసత్య ఆరోపణలు ప్రజాస్వామిక ఉద్యమాలకు నష్టదాయకంగా ఉంటున్నాయి.

కొందరు ప్రజాఫ్రంట్‌ను గద్దర్ ఫ్రంట్‌గా ప్రచారం చేస్తున్నారు. అంతటి చారిత్రక బాధ్యత కలిగిన ఫ్రంటుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న గద్దర్ ఛైౖర్మన్‌గా ఉన్నప్పుడు అలాంటి విమర్శలు రావడంలో ఆశ్చర్యంలేదు. కానీ ఆ విమర్శలు చేస్తున్న వారు గౌరవీయ స్థానాల్లో ఉన్న మేధావులు, ఉద్యమకారులుగా గుర్తింపు ఉన్నవారు కావడమే విచారకరం. వారు అంతటితో ఆగలేదు. గద్దర్ ఛైర్మన్‌గా ఉన్నాడు కాబట్టి తెలంగాణ ప్రజాఫ్రంటుకు మావోయిస్టు పార్టీకి సంబంధాలున్నాయి దుష్ప్రచారం చేస్తున్నారు. పోరాట సంస్థలుగా, పార్టీలుగా, ఉద్యమకారులుగా ప్రకటించుకున్నవారు ఇలాంటి ప్రచారంలో రాజ్యం కంటే ఒకడుగు ముందుండడమే వింత.

ఫ్రంట్ ఆవిర్భావ సందర్భంగా జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు విమల మాట్లాడుతూ తెలంగాణ ప్రజాఫ్రంట్ ఎన్నికల్లో పాల్గొనాలని పట్టుబట్టింది. 'ఎన్నికలు లేకుండా పార్లమెంటులో బిల్లు ఎలా సాధ్యం అన్నారు. రాజ్యాంగబద్ధ పోరాటమంటే ఎన్నికలు కాక మరేమిటి? ఒకవేళ సాయుధ పోరాటమే చేయదలిస్తే సర్కారును కూల్చడానికి రహస్య ఎజెండా ఏమైనా ఉంటే బయటపెట్టాలని ఆమె మీడియా సాక్షిగా వ్యాఖ్యానించింది.

పాలక వర్గాల గొంతులో బిగ్గరగా అరిచి రాజ్యాన్ని ఫ్రంట్‌పైకి ఉసిగొల్పడం ఉద్యమకారిణిగా చెప్పుకుంటున్న విమలకు, ఆమె బృందానికి తగదు. అనేక పోరాట పురిటిగడ్డ అయిన తెలంగాణ బిడ్డలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్లమెంటరీ రాజకీయాల వెలుపల ఏళ్ల తరబడి పోరాటాలు చేస్తున్నారు. ఆ పోరాటాలలో వందలాది మంది విద్యార్థులు అమరులయ్యారు. ఎన్నికలను-ఉద్యమాలను ఒకే గాటనకట్టి విమల చేసిన వ్యాఖ్యలు అమరుల త్యాగాలను అవహేళన చేసేవిగా ఉన్నాయి. పోరాటాల ద్వారా తెలంగాణ సాధించుకుందాం అని నినదిస్తున్న నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల్ని అపహాస్యం చేసేవిగా ఉన్నాయి.

ఈ దేశంలో పీడిత ప్రజల పోరాటాల ద్వారానే పార్లమెంటులో చట్టాలు చేయబడ్డాయి. అంతేగాని ఆయా ప్రజలు ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారానో, పాలకుల దయాదాక్షిణ్యాల వల్లనో, ప్రేమతోనో చేసినవి కావు. కాబట్టి ఆ చట్టాల అమలు కోసం మళ్లీ పోరాడాల్సి వస్తుంది. ఈ స్టేజిలో ప్రజలుంటే 'ఈ పోరాటాలు సుద్ద దండగ చట్ట సభల్లో మనం స్థానం సంపాదిద్దాం' అని సుళువుగా అనే వారున్నారు. కానీ ఉద్యమాలు చేద్దామంటే 'రహస్య సాయుధ పోరాట ఎజెండా ఏదైనా ఉంటే బయటపెట్టండి' అనే విచిత్ర వాదన ఇప్పుడే వింటున్నాం. అలాంటి ఎన్నికలు-ఉద్యమాలు ఒకటేనని విమల నిర్ధారణకు వచ్చారు. రాజ్యాంగబద్ధ పోరాటమంటే ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రమే కాదు.

ప్రపంచ చరిత్రలో ఇప్పటిదాకా జరిగిన, జరుగుతున్న ఉద్యమాలు అందుకు ఉదాహరణ. ఎన్నికల్లో పోటీకి నిరాకరించిన వాళ్లందరూ మావోయిస్టులు కాదు. స్వాతంత్ర సమరయోధులు కూడా ప్రస్తుత ఎన్నికల జాతరకు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఒక ప్రాంతీయ అస్తిత్వ ప్రజాస్వామిక ఉద్యమం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంటులో బిల్లు పెట్టాలి. అందుకు అవసరమయ్యేది ప్రజాస్వామిక ఉద్యమమే. సాయుధ పోరాటం అవసరం లేదు. రాజ్యంగ పరిధిలో చట్టబద్ధంగా ఉద్యమించాలనుకున్నవారు తెలంగాణ ప్రజాఫ్రంట్‌గా ఏర్పడ్డారు. తెలంగాణకు-ఎన్నికలకు-సాయుధ పోరాటానికి లింకు ఎందుకు పెడుతున్నారో వారికే అర్థం కావాలి.

తెలంగాణ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన తర్వాత మాత్రమే ఢిల్లీ పీఠం కదిలింది. అందులో భాగంగానే డిసెంబర్ ప్రకటన వెలువడిందన్న విషయం తెలంగాణ ఉద్యమకారులందరూ గుర్తించుకోవాల్సిన అవసరముంది. దొరల పీడనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటాలు చేసి దొరగడీలను ఖాళీ చేయించిన తెలంగాణ ప్రజలకు మళ్లీ వారే దిక్కు అయ్యే పరిస్థితి రాకూడదు. తెలంగాణ సాధనే లక్ష్యంగా ప్రకటించుకున్న ఈ ఫ్రంట్‌ను బలోపేతం చేయాల్సిన బాధ్యత తెలంగాణలోని ప్రతిపౌరునిపై ఉంది.

-దుడ్డు ప్రభాకర్
కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు

అస్తిత్వ పోరాటం విముక్తి కోసమే - దుడ్డు ప్రభాకర్ Andhra Jyothi 09/13/2010


అస్తిత్వ పోరాటం విముక్తి కోసమే

- దుడ్డు ప్రభాకర్

రంగనాయకమ్మ అస్తిత్వాలపై తన అభిప్రాయాన్ని స్పష్టం గా ప్రకటించనందువల్ల చర్చంతా అష్టవంకర్లు తిరుగుతూవుంది. చివరకు వ్యక్తిగత దూషణలు, ఆరోపణల వరకొచ్చింది. ఆమె ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే)ను అభినందిస్తూనే అస్తిత్వ ఉద్యమాలపట్ల తనకున్న తిరస్కార స్వభావాన్ని ప్రకటించారు. అంతటితో ఆగకుండా 'అస్తిత్వాలను తిరస్కరించాలనే అంశాన్ని కూడా మీ లక్ష్యంలో చేర్చలేదంటే, మీ లక్ష్యంలో అది కూడా ఒక భాగంగా లేదంటే ఉన్నదంతా అస్తిత్వాన్ని నిలిపివుంచుకోవాలనే అర్థాన్నే ఇస్తుంది' అని వారి లక్ష్యాలకు పెడార్థం ఆపాదించారు.

ఇంకా 'అస్తిత్వాన్ని తీసివేయడం గురించి, మనుషుల మధ్య తేడాలు లేని సమాన పరిస్థితుల గురించి ఆలోచించాలనే దృష్టి కూడా మీ సభ్యులకు అందించేవిధంగా మీ లక్ష్య ప్రకటన లేద'ని విమర్శించారు. భూస్వామి అస్తిత్వం, పెట్టుబడిదారుడి అస్తి త్వం, పురుషుడి అస్తిత్వం అంటూ అసలు అస్తిత్వానికే అస్తిత్వం లేకుం డా చేసే ప్రయత్నం చేశారు.

వర్గవ్యవస్థకు సంబంధించిన భూస్వామ్య, పెట్టుబడిదారి అస్తిత్వాలను పితృస్వామిక స్వభావాన్ని సంతరించుకున్న స్త్రీ అస్తిత్వాన్ని, వర్ణవ్యవస్థకు సంబంధించిన కుల అస్తిత్వాన్ని ఒకే గాటనకట్టి పాఠకులను గందరగోళపరచారు. చర్చలో పాల్గొంటున్న రెండు శిబిరాల/వ్యక్తుల అసలు ఉద్దేశ్యాలు, లక్ష్యాలు ఏమైవుంటాయి? అనే విషయాలతోపాటు ప్రరవే గురించి కూడా ప్రజలకు అర్థమయ్యే విధం గా చర్చ జరగాల్సివుంది. కానీ అలా జరగడంలేదు.

అస్తిత్వ ఉద్యమాలకు ప్రాధాన్యతనిస్తుందని ప్రకటించుకున్న ప్రరవే, భారతదేశంలో పితృస్వామ్యం, కుల, మత, లింగ, ప్రాంత, అస్తిత్వ స్వరూప స్వభావాలతో పెనవేసుకుందని నమ్ముతున్న ప్రరవే రంగనాయకమ్మ లేవనెత్తిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్తుందని ఆశించాను. కానీ వేదిక అధ్యక్ష, కార్యదర్శులపేరున ప్రచురితమైన సుదీర్ఘ సమాధానంలో ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం లేదు.

సమాధానం చెప్పకుం డా దాటవేయడానికి కారణాలేమైనప్పటికీ ఇంత జరిగిన తర్వాత ఇది రంగనాయకమ్మ, ప్రరవేకు సంబంధించిన విషయం కాదు గాబట్టి, 'ఆ ముగ్గురు నల్గురు'కి సంబంధించిందీ కాదు గాబట్టి నా స్పందన ఇది. రంగనాయకమ్మ వ్యాఖ్యానం మొత్తంగా దళిత అస్తిత్వ ఉద్యమాలను అవమానపరచేదిగా వుంది. ఒక మహిళ అయికూడా, మహిళలమీద అనేక పుస్తకాలు, నవలలు రాసిన రచయిత, దళిత మహిళల అస్తిత్వ పోరాటాలను తిరస్కరిస్తున్నారు.

ఆమే కాదు ఈ దేశంలో పీడిత ప్రజల పక్షాన పనిచేస్తున్నామంటూ కార్మిక, కర్షక పక్షపాతులుగా బాకాలూదుకుంటున్న వామపక్షాలు కులవివక్షను నిర్మూలించాలంటున్నారు. కుల అసమానతలు నిర్మూలించటం ద్వారా కులాన్ని నిర్మూలించే మౌలిక సామాజిక దృక్పథాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అందుకే ఆయా కులా లు, జాతులు, మతాలు, మహిళలు తమకు తాముగా హరించివేయబడుతున్న తమహక్కులకోసం ఉద్యమిస్తున్నారు.

ఈ ఉద్యమాలను కూడా మార్క్సిస్టు పీఠాధిపతులు గుర్తించడంలేదు. 'అమ్మ పెట్టదు అడుక్క తిననియ్యదు' అంటే ఇదే. అస్తిత్వ పోరాటాలను కులనిర్మూలనకై వేసే అడుగుగా గుర్తించకపోవడం రంగనాయకమ్మ దృష్టిలోపానికి నిదర్శనమైతే పిడికెడు మంది పరిధిలను, పరిమితులను, దళారీ లక్షణాలను దృష్టిలో పెట్టుకొని అస్తిత్వ పోరాటాలన్నీ అస్తిత్వ స్థిరీకరణ కోసమే ననడం దారుణం.

ఈ దేశంలో అగ్రకుల, బ్రాహ్మణీయ భూస్వామ్య శక్తులు మార్క్సిజాన్ని 70, 80 ఏళ్లుగా తమ భవనాలలో బంధించి మహా మార్క్సిస్టులుగా చెలామణి అవుతున్నారు. అందుకే మార్క్సిజం ఇంతకాలంగా మెజారిటీ శ్రామికవర్గమైన పీడిత కులాల వాడల పొలిమేరలు కూడా తాకడం లేదు. అయినప్పటికీ మార్క్సిజాన్ని చదవలేని నిరక్షరాస్యులైన, శ్రమజీవులైన దళిత, పీడిత కులాల ప్రజలు తమకు తాముగా ఉద్యమిస్తున్నారు.

వాళ్లు చేస్తుంది అస్తిత్వం కోసం పోరాటమే, కానీ ఆ పోరాటం దోపిడీవర్గంపై పోరాటంకోసం వేసే ఒక ముందడుగు కూడా. ఇన్నేళ్లుగా కాగితాల్లోనే మార్క్సిజాన్ని వల్లిస్తూ, కార్యక్రమంలో అగ్రకుల దోపిడీ వర్గాన్ని రక్షిస్తున్న అగ్రవర్ణ, అగ్రవర్గ అపర మార్క్సిస్ట్ పీఠాధిపతులకు ఏమాత్రం నిజాయితీ వున్నా శ్రామికవర్గమైన పీడిత కులాల ప్రజల ముందు మోకరిల్లి క్షమాపణలు కోరి ఆ అస్తిత్వ ఉద్యమాలను దోపిడీ వర్గంపై పోరాటంగా మలచుకోవాలి.

దళిత అస్తిత్వ ఉద్యమం అగ్రకుల దోపిడీ వర్గ బ్రాహ్మణీయ ఆధిపత్యశక్తుల నుండి విముక్తికై జరిగే పోరాటమే. దీన్ని గుర్తించకపోవడం అంటే అగ్రకుల, బ్రాహ్మణీయ, మనువాద దోపిడీని, అణచివేతను మరుగున పరచడమే. కులాన్ని మరపించి, వర్గాన్ని మెరిపించే ఈ అగ్రకుల మార్మి క మాయావాదం నుండి దళిత, బహుజనులు క్రమంగా బయటపడుతున్నారు. అందుకే అగ్రకుల మార్క్సిస్టులకు తమ పీఠాలు కదులుతాయని ఆందోళనగా వుంది. సామ్రాజ్యవాదులకు వారి ఏజెంట్లకు గుబులుపట్టుకుంది.

దళిత సమస్య పరిష్కారానికి అంబేద్కర్ చాలడు, బుద్ధుడు చాలడు, మార్క్స్ కావాలి అని 366 పేజీల గ్రంథం రాసిన రంగనాయకమ్మకు నిజానికి దళిత సమస్య ఏంటో తెలియదు. అంటరానితనమంటే ఏమి టో తెలియదు. అది ఎంత భయంకరంగా వుంటుందో కనీసం ప్రత్యక్షంగా చూసైనా వుండరని అస్తిత్వాలపై ఆమె సందేశపాఠం విన్నాక అర్థమయ్యింది. పిడుక్కి, బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లు ఈమె సాంప్రదాయక మార్క్సిజాన్ని వల్లెవేస్తుంది.

ఏ మాత్రం ప్రశ్నించామా! ఇక అం తే. మార్క్సిజాన్ని వ్యతిరేకించినట్లే. మార్క్స్‌ను తిరస్కరించినట్లే. ఇదొక రకమైన బ్లాక్‌మెయిలింగ్ ధోరణి. ఆ పుస్తకంతో, ఆమెపై దేశవ్యాపితంగా దళితుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అగ్రకుల మార్క్సిస్టుల నుండి ప్రశంసల జల్లూ కురిసింది. సరిగ్గా ఆమెకు కావలసిందీ అదే. మార్క్సిజానికి దళితుల్ని ఇంకా దూరంగా నెట్టడంలో ఆమె సక్సెస్ అయ్యారు.

అంబేడ్కర్, బుద్ధుడు, మార్క్స్‌కి పోలికపెట్టి రాయడంలోనే ఆ కుట్ర వుంది. అంటరాన్ని వాళ్లని అగ్రకుల పెత్తందార్లు సమాజానికి దూరంగా నెట్టేస్తే, అస్తిత్వ ఉద్యమాలు చేస్తూ అస్తిత్వ స్థిరీకరణను కోరుకునే స్వార్థపరులుగా, మార్క్సిజానికి అడ్డంకిగా రంగనాయకమ్మ లాంటి అగ్రకుల అద్దాలు పెట్టుకున్న మార్క్సిస్టులు దళితుల్ని చులకన చేస్తున్నారు.

పేరు చివర రెడ్డి, చౌదరి, నాయుడు, వర్మ, శర్మ, శాస్త్రి లాంటివి తీసేసుకొని ఆదర్శవంతులుగా, అభ్యుదయ భావాలు కల్గినవారిగా కీర్తించబడుతున్న రంగనాయకమ్మ లాంటి వాళ్లు ఆధునిక మనువాద మాయాజాలంలో పేరు చివరన మాదిగను తగిలించుకోవడం చూసి తమ బతుకులు ఇలాగే వుండాలని మాదిగలు అనుకుంటున్నారని అనుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.

తరతరాలుగా కులం పేరుతో ద్వేషించబడుతూ, కులం చెప్పుకోవడానికే భయపడి బిక్కుబిక్కుమంటూ అగ్రకుల గద్దల మధ్య కోడిపిల్లల్లా నక్కినక్కి బతికిన జనం నేను మాదిగని, నేను మాలను, చాకలిని, మంగలిని అని చెప్పుకోవడం అగ్రకుల బ్రాహ్మణీయ సమాజంపై విసిరిన ఒక ధిక్కారపు సవాల్? మనువాదుల గుండెలపై నిలబడి వేసిన దండోరా! అది అర్థం కావాలంటే ఆయా కులాల ప్రజల గుండెల్లోకి తొంగిచూడాల్సిందే.

అది చేతగానివారికి, ఇష్టంలేనివారికి పేరు చివర కులం తగిలించుకోవడం బ్రాహ్మణత్వ సమాజానికి పట్టిన బూజు వదిలించడానికన్న విషయం అర్థం కాదు. రాజ్యాంగంలో పీడిత కులాలకు పొందుపరచబడిన హక్కుల్ని అడగడం అంటే కులాన్ని అలా గే వుంచుకొనే ప్రయత్నం కాదు. సకల సంపదల సృష్టికర్తలు, శ్రమజీవులు అయిన దళితుల్ని, ఆదివాసీలను సంపదనుండి, విద్య నుండి, అధికారం నుండి దూరం చేసిన పరాన్నభుక్కులు, దోపిడీదారుల నుండి తమకు రావాల్సిన వాటాను రాబట్టుకోవడం.

ఆర్థికంగా, సామాజికం గా, రాజకీయంగా ముందుకు నడిచే ప్రయత్నం. అదే పీడిత కులాల విముక్తికి మార్గమని దళితులు అనుకోవడంలేదు. అవి సక్రమంగా అమ లు చేయాలని పోరాడ్డం అంటే కులాలను వదులుకోలేకపోవడం కాదు. దళితుల జీవితాలలో ఆ మాత్రం మార్పుని కూడా సహించలేక నిందలు వేయడం రంగనాయకమ్మ లాంటివారికి తగదు. తరతరాలుగా కులం ద్వారా సామాజిక హోదా, గౌరవం, సంపద అనుభవిస్తున్న కొందరు స్వయం ప్రకటిత ఆదర్శవాదులు కులం పేరును సర్టిఫికేట్లలో, జనాభా లెక్కల్లో ప్రస్తావించవద్దు అంటున్నారు.

కుల ప్రస్తావనే తేవద్దు అంటున్నారు. 'కులం పేరెత్తితే చెప్పు తీసుకొని కొట్టండి' అని ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా అయితేనే కులనిర్మూలన సాధ్యం అంటున్నారు. ఈ వాదన అగ్రకుల పాలకవర్గ శక్తుల కుటిల ఎత్తుగడలకు పరాకాష్ఠ. దళిత, పీడిత కులాల ప్రజలు అగ్రకుల హిందూత్వ దాడుల నుండి తమను తాము రక్షించుకోవడానికి, తమ హక్కులు సాధించుకోవడానికి కులాల పేరుతో సమీకృతమౌతున్న ప్రస్తుత సందర్భంలో వీళ్ల ఐక్యతను సహించలేకనే ఇలాంటి వాదనలు ముందుకు తెస్తున్నారు.

రంగనాయకమ్మ దళిత మహిళ అస్తిత్వం గురించి అనేక సందేహాలు వ్యక్తంచేశారు. అనేకానేక అస్తిత్వాల కోసం దళిత మహిళ జీవితమే పోరాటంగా బతుకుతుంది. అగ్రకుల, పురుషాధిక్య, మనువాద భావజాలం కలిగిన మహిళా నాయకురాళ్లు అస్తిత్వాల గురించి తెలుసుకోవాలంటే ముందు ఏ.సి. గదుల నుండి బయటపడాలి.

గ్రామాల కెళ్లాలి. అక్కడ వెలి వాడల్లోని అంటరాని తల్లి గుండె చప్పుడు వినాలి. అప్పుడే ఏది మౌలికమో,ఏది ప్రధానమో, ఏది అప్రధానమో, ఆ తల్లి చేస్తున్న అస్తిత్వ పోరాటాలు అస్తిత్వ స్థిరీకరణ కోసమో, విముక్తి కోసమో అర్థమౌతుంది.

మనదేశంలో అగ్రకులాల మహిళలు కమ్యూనిస్టు ఉద్యమాల ద్వారా చైతన్యవంతమయ్యారు. మహిళా సంఘాలుగా ఏర్పడ్డారు.పురుషాధిక్య భావజాలానికి, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పటిదాకా మనదేశంలో జరిగిన మహిళా ఉద్యమాలు మెజారిటీగా పితృస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగినవే. ఆ మహిళల సమస్యలే దేశంలోని మహిళలందరి సమస్యలుగా ప్రచారం జరిగింది.

18వ శతాబ్దంలో కేవలం ఒక శాతం కూడా లేని బ్రాహ్మణ మహిళల సమస్య అయిన సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతు వివాహాలు ఈ దేశంలో మహిళల ప్రధాన సమస్యలుగా వున్నాయి. వాటి గురించి మాట్లాడిన వారు, వాటి నివారణకు కృషి చేసినవారు మహనీయులుగా ప్రపంచవ్యాపితంగా కీర్తి ప్రతిష్టలందుకున్నారు. అయితే నాటి నుండి నేటి వరకు వ్యవస్థీకృతంగా కొనసాగుతున్న జోగినీ దురాచార నిర్మూలనకు కృషిచేసిన వారికి కనీసం గుర్తింపు లేకపోవడం, జోగినీ దురాచారం నేటికీ నిరాటంకంగా కొనసాగడం అత్యంత విషాదకరం.

ఈ దేశంలో పితృస్వామ్యం మనువాద పితృస్వామ్యంగా ప్రత్యేక స్వభావాన్ని సంతరించుకుందనే విషయాన్ని మహిళా ఉద్యమాలు విస్మరించాయి. అందుకే దళిత మహిళలు మహిళా ఉద్యమాలలో మమేకం కాలేకపోయారు. నేటికీ గ్రామాలలో అగ్రకులాధిపత్య శక్తులు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడంకోసం,దళిత యువకుల ఆత్మగౌరవాన్ని దెబ్బ దీయడానికి దళిత మహిళలపై అత్యాచారాలు చేయడం ఒక కార్యక్రమంగా ఎంచుకుంటున్న దుర్మార్గమైన చర్యల్ని చూస్తూనే వున్నాం.

ఖైర్లాంజి, వాకపల్లి, భల్లుగూడ సామూహిక అత్యాచారాలపై ఏ పాటి నిరసన వ్యక్తమయ్యిందో చూశాం. ఇంకోవైపు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌కోసం ఎన్ని గొంతులు గర్జించాయో, మీడియా ఎంతగా స్పందించిందో కూడా చూశాం. కాబట్టి జనాభాలో సగభాగమైన స్త్రీలంతా ఒకటి కాదు. వాళ్ల సమస్యలూ ఒకటి కాదు.

వాటిపట్ల సమాజం స్పందిస్తున్న తీరూ ఒక్కటిగా లేదు. అందుకే ఆ స్త్రీలు వారి వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్నారు. వాటన్నిటినీ ఆహ్వానించాల్సిందే. గుర్తించాల్సిందే. ఆ అస్తిత్వాలన్నిటికీ దామాషా పద్ధతి మీద చోటు కల్పించాల్సిందే. అంతటితో ఆగిపోకుండా ఆయా సమస్యలను ప్రత్యక్షంగా అనుభవిస్తూ వాటి పరిష్కారం కోసం పోరాడుతున్న మహిళా సమూహాల్ని, ప్రధాన మహిళా ఉద్యమ స్రవంతిలో భాగం చేసుకోవాలి.

అలా కాకుంటే ఈ దేశ స్త్రీవాదం అగ్రకుల ఆదర్శ స్త్రీవాదంగా చలామణి అవుతూనే వుంటుంది. రంగనాయకమ్మ లాంటివారు పాఠాలు చెబుతూనే వుంటారు. అన్ని అస్తిత్వ పోరాటాలను సమీకృతం చేస్తూ అగ్రకుల మనువాద పితృస్వామిక భావజాలానికి వ్యతిరేకంగా పోరాడే మహిళా ఉద్యమాలకు మనవంతు సహకారాన్ని అందిద్దాం. నూరు పూలు వికసించనీ.. వేయి ఆలోచనలు సంఘర్షించనీ..

- దుడ్డు ప్రభాకర్
అధ్యక్షులు, కులనిర్మూలనా పోరాట సమితి
99595 67818