Showing posts with label S R Shankran IAS. Show all posts
Showing posts with label S R Shankran IAS. Show all posts

Tuesday, October 22, 2013

అభ్యుదయ పాలనా జ్ఞాని - జానమద్ది హనుమచ్ఛాస్త్రి

తెలుగు సూర్యుడుగా పేరు గడించిన తెల్లదొర సిపి బ్రౌన్ స్మృతి చిహ్నంగా కడపలో నిర్మించిన బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని చూసేందుకు సామాన్య పాఠకులు, పరిశోధకులే కాక సాహిత్యాభిమానులైన ఉన్నతాధికారులు కూడా వస్తుంటారు. వారు బ్రౌన్ పట్ల ఎంతో గౌరవభావం కలిగినవారు. 1993 డిసెంబర్ 21న పుస్తక ప్రేమి అయిన ఒక ఐఎస్ అధికారి, అతనితోపాటు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కెఎస్ఆర్ మూర్తి బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఆ సంస్థ కార్యదర్శిగా వారికి గ్రంథాలయంలోని కొన్ని అరుదైన పుస్తకాలను, ప్రముఖుల రాత ప్రతులను చూపాను. అభినందనలందుకొన్నాను. వారు కొంతకాలం నెల్లూరు జిల్లా కలెక్టరుగా సంచలనాత్మక నిర్ణయాలకు, ప్రజాహిత పనులకు పేరు గాంచిన వారని తెలుసుకొన్నాను. ఆయన చాల నిరాడంబరుడు. ఏది పాలన అంటే, నిరుపేదల ఆలన పాలన అని నిరూపించిన అరుదైన ఐ ఏ ఎస్ అధికారి యస్. ఆర్. శంకరన్.
తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని సరిగళత్తూర్ గ్రామంలో 1934 అకోటబర్ 22న మధ్యతరగతి కుటుంబంలో శంకరన్ జన్మించారు. 1957 ఐఎఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ప్రజల మన్ననలతో పాటు ప్రభుత్వ యంత్రాంగంలోని ప్రధాన అధికారుల, మంత్రుల ఆదరాభిమానాలను అందుకొన్న అరుదైన అధికారి శంకరన్. ప్రజల కలెక్టర్‌గా పేరు గాంచిన ఆయన నెలలో సగం రోజులు ప్రజల్లోకి వెళ్లి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితాలందుతున్నాయో లేదో కనుగొని, వారి తృప్తిని గమనించిన 'సంక్షేమ భాస్కరుడు' శంకరన్. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా, బడుగు వర్గాలవారు గిరిజనులు, దళితులు మున్నగు అడుగు వర్గాల వారు సుఖసంతోషాలతో జీవించాలనీ ఉదాత్త ఆశయం కలవాడు. జోగినీ వ్యవస్థ నిర్మూలన కోసం ప్రత్యేకంగా చట్టం చేయించడం, సూవర్టుపురం మాజీ నేరస్థులకు పునరావాసం కల్పించుటలో శంకరన్ కృషి చిరస్మరణీయం. బ్రాహ్మణుడుగా పుట్టినా, బ్రాహ్మణీకంలోని ఛాందసత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించి మానవులందరూ సమానులేనని, మాటల్లో కాక, చేతల్లో చూపిన కార్యశీలి శంకరన్.
ప్రభుత్వ వాహనాలను, స్వంత పనులకు వినియోగించటం ఏ మాత్రం సహించని నిజాయితీపరుడు. నెల్లూరు కలెక్టర్‌గా వున్నప్పుడు, నెల్లూరు పట్టణంలోని మార్కెట్ వద్ద ప్రభుత్వ వాహనాలుండటం ఆయన గమనించారు. తమ వెంటనున్న బంట్రోతు ద్వారా, ప్రభుత్వ వాహనాల డ్రైవర్లను పిలిపించారు. ఇక్కడ వాహనాలెందుకున్నాయని ప్రశ్నించారు. అధికారుల భార్యలు మార్కెట్‌కు వచ్చారని చెప్పారు. వెంటనే ఆ వాహనాలను కలెక్టర్ ఆఫీసుకు చేర్చమని ఆదేశించారు.కలెక్టర్ బంగళా చాల విశాలంగా వుండేది. మహిళా కళాశాలకు తగిన వసతులు లేవని తెలుసుకొని ఆ బంగళాను ప్రభుత్వ మహిళా కళాశాలకు ఇచ్చివేశారు. తోటి అధికారి ఒకరు 'ఇదేం సార్' అని అడిగినపుడు, 'ఇంత పెద్ద బంగళా ఒక్కరి నివాస స్థానమే కావడం అన్యాయం కదా? అన్న ఉదార చరితుడు శంకరన్.
ఆయన వ్యక్తిగత జీవితం ఆశ్చర్యకరం. అరచేతుల దాకా చొక్కా, మామూలు ప్యాంట్, కాళ్లకు సాదా చెప్పులు. బిళ్ల బంట్రోతు లేకపోతే ఆయనను కలెక్టరుగా తెలుసుకోవటం కష్టం. ప్రజలు ఆయనను, ఐఎఎస్ గాంధి అనేవారు. సిబిఎస్ వెంకటరమణ, ఐఎఎస్ అధికారి. తన వ్యక్తిగత పనుల కారణంగా గుంటూరు వెళ్లి, తెలిసిన వారింట్లో వున్నపుడు, ఒక గ్రామీణ వ్యక్తి శంకరన్ గురించి చెబుతూ ఆయన 'ఒక రుషి' అన్నాడు.అధికారికంగా ఏ హోదాలో ఉన్నా శంకరన్ తనదైన ముద్ర వేసేవారు 1957లో ఐఎఎస్ ఉద్యోగిగా చేరిన నాటి నుంచి 1992లో పదవీ విరమణ చేసేవరకు సామాన్య ప్రజల హక్కులు ఎస్ఎస్‌టి కమీషన్, అటవీ హక్కుల కమీషన్ మొదలగు సంస్థల కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. నిరంతరం బడుగుల సంక్షేమాన్ని గురించి ఆలోచించేవారు.
శంకరన్ త్రిపుర రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వెళ్లారు. విమానం దిగి, ఒక రిక్షా మాట్లాడుకొని సర్క్యూట్ హౌస్ చేరారు. శంకరన్ గారికి స్వాగతం చెప్పడానికి ఎప్పుడో వచ్చిన అధికారులు శంకరన్ గారిని గుర్తించనందుకు తమ పొరపాటును మన్నించమన్నారు.నక్సలైట్లతో ప్రభుత్వం చర్చలు జరుపునట్లు కృషి చేశారు. ఒకమారు నక్సలైట్లచే కిడ్నాప్ కావడం జరిగింది. వారు శంకరన్ సేవలను విని సగౌరవంగా వారి నివాసానికి చేర్చారు.ఆయనకు సొంత ఇల్లు లేదు. అద్దె ఇల్లు కూడా అవసరాలకు తగినంతగా చిన్నది.
నేల మీద చాప పరచుకొని ఆఫీసు ఫైళ్లను చకచకా పరిశీలించేవారు. జీవితాంతం బ్రహ్మచారిగానే వుండేవారు.కవి, రచయిత కోయి కోటేశ్వరరావు శంకరన్ గురించి మాట్లాడుతూ 'జీ.వో.ల్లో నిదురపోతున్న సంక్షేమాన్ని జీవితాల్లోకి బట్వాడా చేసిన అభ్యుదయ పాలనా జ్ఞాని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'పద్మ భూషణ్' ప్రశస్తిని తిరస్కరించిన నిష్కామ జీవి శంకరన్. బడుగు వర్గాల ప్రజల గుండెల లబ్‌డబ్ ధ్వనుల్ని జీవితాంతం పరిశీలించిన వారు శంకరన్' అని కొనియాడారు. శ్రీశైలం దేవస్థానం దర్శనం చేసుకొని వచ్చిన శంకరన్‌ను మిత్రులు దేవుని ఏమని వేడుకొన్నారు అని ప్రశ్నించినపుడు బీద ప్రజలను చల్లగా చూడమని వేడుకొన్నాను అన్నారు.బ్రతికినంత కాలం ప్రజా సంక్షేమానికి అంకితమైన శంకరన్ 2010 అక్టోబర్ 7న కాలగతి చెందారు.
- జానమద్ది హనుమచ్ఛాస్త్రి
(నేడు శంకరన్ జయంతి)

Andhra Jyothi Telugu News Paper Dated: 22/10/2013 

నిరాడంబరతకు నిలువుటద్దం (ఎస్.ఆర్.శంకరన్) By చెట్టుపల్లి మల్లిఖార్జున్


సమాజంలో అట్టడుగు వర్గాలైన పేదలు, దళితులు, అదివాసీల పట్ల అపారమైన ప్రేమతో, ఈ దేశం బాగుపడాలనే తపనతో అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలలను ఎస్సీ, ఎస్టీ ప్రజలకు అందించిన ఘనత ఎస్.ఆర్. శంకరన్‌దే! రాష్ట్రంలో సాంఘిక, సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలు, గురుకుల పాఠశాలలు, స్కాలర్‌షిప్పులు, గిరిజన హక్కులు, నక్సలైట్ ఉద్యమం అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు ఎస్.ఆర్.శంకరన్.
దేశ చరివూతలో ఉన్నతాధికారుల్లో శంకరన్ లాంటి మానవతావాదులు అరుదు. ఆయన నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. పేద ప్రజలకు ఆయన చేసిన మేలు దళితులు, గిరిజనులు ఎప్పటికీ మరువలేరు. సమాజ మార్పు కోసం ఆయన వేసిన అడుగులు అందరికీ ఆదర్శం. శంకరన్ నిజాయితీ గల ఐ.ఎ.ఎస్.అధికారిగా భూ సమస్యల విషయంలో పేదలకు అనుకూల విధానాలు రూపొందించి వాటిని చిత్తశుద్ధితో అమలు చేశారు. మావోయిస్టులతో రాష్ర్ట ప్రభుత్వం చర్చలు జరపడంలో ఆయనే ముఖ్య పాత్ర పోషించారు. రాజ్యాంగంలో పొందు పరచబడిన ‘సంక్షేమ భావన’ను ఆచరణలో చూపిన వ్యక్తి. ‘సంక్షేమం’ అన్న భావానికి దేశవ్యాప్తంగా గుర్తింపును, మన రాష్ట్రానికి ఈ విషయంలో ప్రత్యేకతను సంతరించిపెట్టిన వారు ఎస్.ఆర్. శంకరన్.

శంకరన్ తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు సమీపంలోని సిరిగలత్తూరు గ్రామం లో 1934 అక్టోబర్ 22న జన్మించారు, ఎస్.ఆర్. శంకరన్ పూర్తి పేరు సిరిగలత్తూర్ రామనాధన్ శంకరన్. శంకరన్ తండ్రి రైల్వేగార్డుగా పనిచేసేవారు. తండ్రి ఉద్యోగరీత్యా వివిధ రాష్ట్రాలకు బదిలీ అయి వెలుతుండటంతో ఆయన చదువు వివిధ ప్రాంతాలలో కొనసాగింది. మద్రాసు లయోలా కళాశాలలో బి.కాం(ఆనర్స్) చదివారు. మధురైలోని కళాశాలలో కొంతకాలం కామర్స్ లెక్చరర్‌గా పనిచేశారు. శంకరన్ కేంద్ర పబ్లి క్ సర్వీస్ కమిషన్ రాసి 1957ఐఏఎస్ బ్యాచ్‌కు ఎంపికై నంద్యాల సబ్ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. కొద్దికాలం ఫారెస్ట్ ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్లకు కార్యదర్శిగా పనిచేశారు. ఆర్ధిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగాను, ఈ శాఖలోనే ప్లానింగ్ కార్యదర్శిగాను పనిచేశారు. న్యూఢిల్లీలో గ్రామీణాభివృద్ధి శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. బీహార్ కోల్‌మైన్స్ అధికారిగా కొంతకాలం ఉన్నారు. సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు.

ఎస్.ఆర్.శంకరన్ కంటే ముందు ‘సాంఘిక సంక్షేమశాఖ’ అనేది లేబర్, ఎంప్లాయిమెంట్ శాఖలో మిళితమై ఉండేది. దాన్ని ప్రత్యేక శాఖగా చేసిన ఘనత శంకరన్ గారిదే. అంతేకాదు ఎన్టీఆర్ ముఖ్యమంవూతిగా ఉండగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలంన్నింటినీ కలిపి ఒకే భవనంలో వాటి కార్యాలయాలను ఏర్పాటు చేసింది శంకరన్ గారే. నేటి ‘దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్’ నిర్మాణానికి రూపురేఖలు దిద్దింది కూడా ఆయనే. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల రూపకల్పనకు, దేశంలో సివిల్ సర్వీసెస్ సాధించుటకు ‘ఆంధ్రవూపదేశ్ స్టడీసర్కిల్’ ఏర్పాటుకు కృషి చేసింది శంకరన్‌గారే. వృత్తి విద్యాకోర్సులలో చదివే ఎస్సీ,ఎస్టీ విద్యార్థులందరికీ (ఆదాయ పరిమితిని విధించి) ఉచిత హాస్టల్ వసతి, ఉపకార వేతనాలు అందజేసే ప్రక్రియను ప్రారంభించిందీ ఆయనే. సాంఘీక సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉండగా హాస్టల్స్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థిని చేర్చుకోవాలని ఆదేశాలు జారీచేశారు. విద్యార్థుల సంఖ్య అనుకున్నదానికంటే ఎక్కువ కావడంతో హాస్టల్స్ నిర్వహణకు బడ్జెట్ సరిపోలేదు. దీంతో ప్రభుత్వ అనుమతి లేకున్నా ఖర్చుపెట్టారు. అందుకు ఆర్థికశాఖ కార్యదర్శి బి.పి.ఆర్.విఠల్ అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి పేషీకి వెళ్ళింది. అప్పుడు వి.గోవిందరాజన్ ముఖ్యమంత్రి చెన్నాడ్డికి కార్యదర్శిగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలకు శంకరన్ చేసిన సేవల ఫలితంగానే ఈ వర్గాల ప్రజలు ఇందిరా కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గెలిపించారని ముఖ్యమంత్రి గ్రహించారు. శంకరన్ ప్రతిపాదనలను,ఆదేశాలను,ఆచరణను సమర్ధించారు.

శంకరన్ గారికి కార్మిక,ఉపాధి, సాం ఘిక సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖలంటే బాగా ఇష్టం. ఈ శాఖల ద్వారా ప్రజలకు చేరువకావచ్చునని, ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుందని భావించేవారు. ఈ శాఖల అధికారిగా ఆయన దళిత బడుగు, బలహీన వర్గాలకు సేవచేసి వారి ఆదరాభిమానాలను చూరగొన్నారు. శంకరన్ నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన 18 నెలల కాలంలో పేద వర్గాలకు అధిక సేవలందించారు. ఆ తర్వాత వీరిని ఆదర్శంగా తీసుకొని కె.రాజు, ఐఏఎస్, కలెక్టరుగా ఈ జిల్లా పేదప్రజలకు ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాలకు సేవచేశారు. శంకరన్ ఈ జిల్లాకు కలెక్టరుగా పనిచేసిన కాలాన్ని జిల్లా ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. పేదలకు వందలాది ఎకరాల భూమిని ఆయన పంచిపెట్టారు. ‘కపూక్టర్’ అన్న పదవికి గౌరవం తీసుకువచ్చారు. జిల్లాలోని సగం గ్రామాలను స్వయంగా అధికార బృందంతో సందర్శించారు. ప్రజల వద్దకు పాలన అంటే ఎలా ఉంటుందో ఆచరణలో చూపారు. వీరి సేవలకు గుర్తింపుగా నెల్లూరు జిల్లాలో శంకరపురం, శంకరన్ నగర్‌లు అనేకం వున్నాయి.
ddr3

శంకరన్ సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా ఉన్న సమయంలో లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఉండేవారు. సచివాలయానికి నడిచివచ్చేవారు. ఒకరోజు గేటువద్ద ‘పాస్’ చూపమని సెక్యూరిటీ అధికారి అడిగారు. ‘నేను శంకరన్ నయ్యా’అన్నారు. ఖంగుతిన్న సెక్యూరిటీ అధికారి క్షమించమని చెప్పి సెల్యూట్ చేసి పంపించారు. శంకరన్ అతనిని తన విధిని సక్రమంగా నిర్వహిస్తున్నందుకు అభినందించారు. అప్పటి నుంచీ ఆయన ఎంట్రీ పాసును తీసి పెట్టుకున్నారు. శంకరన్ సచివాలయానికి ఉదయాన్నే తొమ్మిదన్నరలోగా చేరుకునేవారు. రాత్రి ఎనిమిది గంటల వరకు పనిచేసేవారుపజల సమస్యలనుచిత్తశుద్ధితో పరిష్కరించేవారు.
శంకరన్ మెదక్ జిల్లా ‘ఖానాపూర్’లో వెట్టిచాకిరి చేస్తున్న కార్మికులను సమావేశపరిచి వారికి వెట్టిచాకిరి నుంచి ఎట్లా విముక్తి కావాలో శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసి బోధించారు. ఫలితంగా భూస్వాముల వద్ద పనిచేసే జీతగాళ్ళంతా తిరుగుబాటు చేశారు. వాళ్ళలో డాక్టర్ చెన్నాడ్డి బంధువుల వద్ద పనిచేసేవాళ్లూ ఉన్నారు. అప్పుడు ముఖ్యమంవూతిగా ఉన్న చెన్నాడ్డికి వారంతా ఫిర్యాదు చేసి, తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి శంకరన్ గారిని పిలిచి మందలించబోయారు. తాను చట్టవూపకారమే పనిచేస్తున్నానని కరాఖండిగా చెప్పారు.చెన్నాడ్డితో వెట్టిచాకిరి నిర్మూలన అంశంపై విభేదించిన శంకరన్ గారిని త్రిపుర ప్రభుత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని స్వీకరించమని కోరింది. అప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నృపేన్ చక్రవర్తి. ఆయన కూడా శంకరన్ వలె అవివాహితుడు. శంకరన్ గారికి పాలన విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆ రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. త్రిపురలో శంకరన్ ప్రభుత్వ అతిథి గృహంలో ఉండేవారు. ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకునేవారు.

బీహార్ రాష్ర్టంలో కోల్‌మైన్స్ అధికారిగా ఉన్నప్పుడు బొగ్గు గునుల్లోకి వర్షం నీళ్లు ప్రవహించాయి. దీనివల్ల అనేక మంది బొగ్గుగని కార్మికులు ప్రాణాలు పొగొట్టుకున్నారు. తమ వారిని పోగొట్టుకున్న ఒక ముసలి అవ్వ శంకరన్ గారిని పట్టుకొని బోరున విలపించింది. ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ఈ ఘటనలో శంకరన్ గారి స్పందన, ఆయన పనివిధానం బాధితులను ఆకట్టుకుంది.
శంకరన్ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా, కాకి మాధవరావు డైరెక్టర్‌గా ఉన్న కాలంలో ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి కావలసిన చర్యల్ని చేపట్టడానికి రాష్ట్రస్థాయిలో వారం రోజుల పాటు ఎల్‌బీ స్టేడియంలో జరిగిన మహాసభలో చేసిన తీర్మానాలను జీవోల రూపంలో తీసుకు వచ్చారు. ఈ ఘనత ఎస్.ఆర్.శంకరన్ గారిదే. వాటిని ఒక పుస్తక రూపంలో ప్రచురించారు. 1955 పౌర హక్కుల పరిరక్షణ చట్టం కూడా దీనిలో చేర్చారు. 1976-77లో 136 మెమోలు, జీవోలు వెలువడ్డాయి. వీటిలో హౌసింగ్ బోర్డు ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్లు, బోగస్ కుల ధృవీకరణ పత్రాలు సమర్పించిన వారిపై చర్యలు, జిల్లా స్థాయిలో ఎస్సీ, ఎస్టీ సెల్‌ల ఏర్పాటు, కులాంతర వివాహితులకు రక్షణ, అగ్రవర్ణ కాలనీలలో దళితుల ఇళ్ల నిర్మాణం, మురికివాడల్లో నివసించేవారికి ప్రత్యామ్నాయ గృహ వసతి, భూ పంపిణీ మొదలైనవి ఉన్నాయి. జీవితాంతం శంకరన్ గారు బడుగు బలహీన వర్గాలకు చేసిన మేలు, రాజ్యాంగ పరంగా సంక్రమింప చేసిన హక్కులు మరువరానివి. ఐఏఎస్ అధికారిగా అత్యున్నత పదవులు చేపట్టినా నిరాడంబరంగా జీవించిన ప్రజల మనిషి శంకరన్. జీవితాంతం ఉన్నత మానవీయ విలువల కోసం పోరాడిన శంకరన్ ఎందరికో స్ఫూర్తి.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అకడమిక్ కన్సప్టూంట్
పాలమూరు యూనివర్సిటీ
(నేడు ఎస్.ఆర్. శంకరన్ 79వ జయంతి)

Published in Namasete Telangana Telugu News Paper Dated : 22/10/2013