Tuesday, May 27, 2014

మళ్ళీ పాత చరిత్రే! - కొంగర మహేష్, రుద్రవరం లింగస్వామి, మనిగిల్ల పురుషోత్తం


Published at: 27-05-2014 00:39 AM
మనమిప్పుడు ఆధునిక ప్రపంచంలో అవసరానికో అబద్ధం... పూటకో మాట నడుస్తోన్న ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. అవసరానికి హామీలెన్నైనా ఇవ్వొచ్చు. అదే అవసరానికి నాలుకను ఎటైనా తిప్పే రాజకీయాల్లో కాలం గడుపుతున్నాం. ఈ రాజకీయ చదరంగంలో విజేతలు పాలకులు. పావులు బలహీనులు. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బడితె ఎవరి చేతిలో ఉంటుందో బర్రె కూడా వాడిదే అనే సామెతను అక్షరాలా మరోసారి నిరూపిస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి పార్లమెంటు తెలంగాణ బిల్లు ఆమోదించబోతుందనేంత వరకు తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి దళితుడే అని ఖరాఖండిగా చెప్పారు. ఈమాట చెబుతూనే కేసీఆర్ మాటంటే మాటే తలతెగినా మాట తప్పేది లేదన్నారు. ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించినా... పార్టీ అంతరంగిక మీటింగుల్లోనూ ఊదరగొట్టారు. దీనికితోడు ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పదవిని కూడా బోనస్‌గా ప్రకటించారు. దీనికి టీఆర్ఎస్ నాయకగణం వంతపాడారు. పదమూడేళ్లుగా పార్టీ పైస్థాయి నుంచి కార్యకర్త అన్న తేడా లేకుండా 'దళిత సీఎం' హామీని పాటైపాడారు. తాను (కేసీఆర్) తెలంగాణ రాష్ట్రంలో కాపలా కుక్క (వాచ్ డాగ్)గా కొనసాగుతూ స్టేట్ అడ్వయిజరీ కౌన్సిల్ చైర్మన్‌గా ఉంటానని చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇవన్నీ జాతీయ, ప్రాంతీయ మీడియాలో పతాకస్థాయిలో ప్రచారం కూడా జరిగాయి.
కేసీఆర్ పలికిన దళిత సీఎం పలుకులు ఇప్పటికీ 'యూట్యూబ్', ఫేస్‌బుక్కుల్లో దర్శనమిస్తూనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటుకు 'సీడబ్ల్యూసీ' జై అన్న తర్వాత ఆగస్టు 4, 2013న జరిగిన 'మీట్ ది ప్రెస్'లో కూడా దళిత సీఎం పదవికి కట్టుబడి ఉన్నానని కేసీఆర్ పునరుద్ఘాటించారు. కానీ ఉభయసభల్లో తెలంగాణ బిల్లుకు మోక్షం లభించిందో లేదో 'దళిత సీఎం' హామీని అమాంతంగా మింగేశారు. దశాబ్దకాలం నుంచి ఉపన్యాసాలు దంచిన అధినాయకత్వం, పార్టీ అనుచరగణం అంతా కేసీఆర్ వంతపాడినట్లుగానే ఒక్కసారిగా గప్‌చుప్ అయిపోయింది. 'ఇచ్చిన మాటకోసం తల నరుక్కుంటా'నన్న కేసీఆర్ ఈ అంశంపై మాట్లాడేందుకు ముఖం చాటేశారు. తనకు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని చెప్పుకునే కేసీఆర్... పార్టీకి ఆయనే హైకమాండ్. దీంతో 'సీఎం హామీ'పై ప్రశ్నించడం కాదు కదా... కేసీఆర్ ఉన్నత పదవిలో కూర్చుంటేనే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి జరుగుతుందంటూ, పోలింగు ముగిసి కేసీఆర్‌ను శాసనసభా నేతగా ఎన్నుకునేంత వరకు టీఆర్ఎస్‌లోని దళిత, బీసీ నాయకులతో ప్రకటనలు గుప్పించే పనిలో బిజీ అయిపోయిన పరిస్థితి.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీల;పై అనేక రకాలుగా వివక్ష చూపారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు మంత్రి పదవులు దక్కించుకున్న టీఆర్ఎస్... బీసీ ఎమ్మెల్యేలుగా పార్టీ నుంచి గెలిచినప్పటికీ బీసీ సంక్షేమ శాఖను బ్రాహ్మణుడైన కెప్టెన్ లక్ష్మీకాంతారావుకు ఇవ్వడం... అప్పటికీ అసెంబ్లీలో సభ్యుడు కూడా కానీ తన అల్లుడు హరీష్‌రావును ఏకంగా మంత్రిని కూడా చేయడం పార్టీలోని అగ్రకుల ధోరణికి అద్దం పడుతోంది. తెలంగాణ జనాభాపరంగా సింహభాగంగా ఉన్న ముస్లింలనూ రాజకీయంగా ఎదగనీయలేదు. పార్టీ పదవుల పంపకాల్లోనూ ఈ వర్గాన్ని పూర్తిగా పక్కనబెట్టేశారు.
పద్నాలుగేళ్లపాటు తన ప్రాబల్యాన్ని అతిజాగ్రత్తగా నిర్మించుకున్నారు కదా! అంతా వీజీగా తెలంగాణపై పెత్తనాన్ని వదులుకుంటారా? సెంటిమెంటు ఫలితాలను తనకనుగుణంగా మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకపోవడం... పలు సర్వేల ద్వారా టీఆర్ఎస్‌కు 'ఫీల్ఢ్' అనుకూలంగా ఉండటం... ఇంతలో ఎన్నికలు, ఫలితాలు రావడం... టీఆర్ఎస్సే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితుల్లో ఉండటంతో కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పీఠం మీద మరింత మోజు పెరిగింది. ఏ వర్గానికి సీఎం పదవి ఇస్తానని హామీ ఇచ్చారో ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల చేతే ప్రతిపాదింపజేసుకొని తన 'ఆకాంక్ష'ను తీర్చుకున్నారు. ఇప్పుడున్న స్థితిలో కేసీఆర్ మాట తప్పారని కనీసం నొసలు కూడా చిట్లించలేని పరిస్థితి ఆ పార్టీ దళిత ప్రజాప్రతినిధులది.
గత పాలకుల కంటే భిన్నంగా తెలంగాణలో పేదలు, అణగారిన వర్గాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతారని, ఆత్మగౌరవం కోసమే ఈ ఉద్యమం అన్న కేసీఆర్... దళితులను అగౌరవపరిచి ఆ వర్గానికి (ఎస్సీ, ఎస్టీ, బీసీలు) తొలి తెలంగాణలోనే రాంగ్ సిగ్నల్స్ పంపారు. ఇంత జరుగుతున్నా 'అవసరాల' కోసం టీఆర్ఎస్‌లో పనిచేసే బహుజనులు సైలెంటైపోయారు... అటు టీఆర్ఎస్ యేతర సమాజం కూడా మిన్నకుండటం ఆశ్చర్యకరం. 2009లో కేసీఆర్ దీక్ష విరమించినప్పుడు గర్జించిన విద్యార్థిలోకం, మేధోప్రపంచం మాట తప్పిన కేసీఆర్‌ను ఇప్పుడు ఎందుకు నిలదీయడం లేదు? పరిపాలన సౌలభ్యం, పీడిత జాతుల రాజ్యాధికారం చిన్న రాష్ట్రాలతోనే సాధ్యమని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం ముందు వరుసలో ఉన్న వారెవ్వరూ మాట్లాడకపోవడంలో ఆంతర్యమేమిటి?
మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో దళితుల్లో అత్యంత వెనుకబడిన కులానికి చెందిన జీతన్ రాం మంఝీని ఆ పదవిలో కూర్చొబెట్టారు. రాజకీయ ఎత్తుగడలో భాగమా? కాదా? అన్న విషయాన్ని పక్కనబెడితే దళితుణ్ణి ఉన్నత పదవిలో కూర్చొబెట్టి గౌరవించారు. ఫలితాల ప్రకటన వరకు దళితులకు సీఎం పదవి ఇస్తామని జేడీ(యూ) ఏనాడూ చెప్పలేదు. తెలంగాణలో మాత్రం కేసీఆర్ తన తల నూరుముక్కలైనా దళితుడే సీఎం అన్నారు. అధికార వాంఛ కోసం తన పార్టీలోని దళితులను కూడా తలదించుకునేలా చేశారు. పైగా వారితోనే కాబోయే సీఎం కేసీఆర్ అంటూ ప్రతిపాదన చేయించుకోవడం కేసీఆర్ మార్కు పాలనకు నిదర్శనం. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేని కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను ఉన్నది ఉన్నట్లుగా అమలు చేస్తానంటూ చెబితే ఎలా నమ్మాలి?
అయితే కొన్ని 'బద్నామ్'ల నుంచి బయటపడేందుకు మాత్రం పార్టీలోని దళితులు, బలహీన వర్గాలు, ముస్లిం, గిరిజనులను బుజ్జగించేందుకు తగిన ఏర్పాట్లు చేయవచ్చు. మరికొన్ని హామీలు నెరవేర్చవచ్చు. కానీ వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ఏమాత్రం పాటుపడరు. అందుకే అగ్రకులానికి అధికార అహంకారాన్ని అలంకారంగా చేసుకొని రాజ్యమేలబోతున్న కేసీఆర్ అండ్ కో పట్ల అణగారిన సమాజమంతా అప్రమత్తంగా ఉండాలి. కలిసికట్టుగా వారి పాలనకు చరమగీతం పాడి సామాజిక తెలంగాణ సాధనకు నడుం బిగించాలి. అప్పుడే నవ తెలంగాణ సాధ్యం. లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి భౌగోళికంగా, ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తెలంగాణలో సామాజిక న్యాయం, రాజ్యాధికారం అణగారిన వర్గాల చేతికి రాదు. పెద్దగా మార్పేమీ ఉండదు.
- కొంగర మహేష్, రుద్రవరం లింగస్వామి, మనిగిల్ల పురుషోత్తం
ఓయూ రీసెర్చ్ స్కాలర్లు

Andhra Jyothi Telugu News Paper Dated: 27/05/2014 

Sunday, May 18, 2014

ఉన్నత విద్యాలయాల్లో కుల అణచివేత By సుజాత సూరేపల్లి


Updated : 5/18/2014 12:37:31 AM
Views : 11

కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో పేద, దళిత, ఆదివాసీ, మైనారిటీ విద్యార్థుల పట్ల అమానవీయ ఘటనలు చూస్తుంటే ఆందోళనగా ఉన్నది. విద్యార్థుల పై జరుగుతున్న హింస, దానికి ప్రతిగా వారిలో పెరుగుతున్న అసంతప్తిని వ్యక్తపరిచే వేదికలు లేకపోవడంపై కూడా దష్టి సారించాల్సిన అవసరం పెరిగింది . అనూహ్యంగా పెరుగు తు న్న విద్యార్థి ఆత్మ హత్యలు, ప్రొఫెసర్ల ఆగడాలు, కుల వివక్ష, మరొకవైపు చాప క్రింద నీరులా ప్రైవేటీకరణ, అవినీతి, అవాంఛనీయ సంఘటనలు ప్రజాస్వామిక వాదులను మేధావులను కలవర పెడుతున్నవి. ఇపుడు యుద్ధ ప్రాతిపదికన కొంత ప్రక్షాళన అత్యవసరం. మరొక కోణంలో నుంచి చూస్తే విద్యార్థుల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను, హక్కుల గొంతులను, ఉద్యమాలను అణచి వేస్తున్న యాజమాన్యం, అధికారుల వైఖరిని కూడా ప్రస్తుత పరిస్థితికి అన్వయించుకోవాలి. అందులో భాగంగానే హైదరాబాద్ ఇఫ్లూ కేంద్ర విశ్వ విద్యాలయంలో మోహన్ దారావత్ , సతీష్ నైనాల పరిశోధన విద్యార్థులు, సుభాష్ అనే పీజీ విద్యార్థి బహిష్కరణ ఎత్తివేయాలని వారం రోజులుగా జరుగుతున్న ఉద్యమాన్ని చూడాల్సిన అవసరం ఉన్నది . 

విశ్వ విద్యాలయాల్లో ముఖ్యంగా కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో రోజు రోజుకీ విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడిని అర్థం చేసుకోవాలంటే ముందుగా అక్కడ జరుగుతున్న విధానాలను పరిశీలించాలి. 2010 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు దేశంలో 254 ఉన్నాయి. అందులో జూన్ 2011 నాటికి దేశ వ్యాప్తంగా 42 కేంద్రీయ విశ్వ విద్యాలయాలు, ఆంధ్ర ప్రదేశ్‌లో మూడున్నాయి. వాటిలో లక్షకు పైగా విద్యార్థులు ఉన్నట్టు లెక్కలు చెపుతున్నాయి. ఉన్నత విద్య అన్ని ప్రాంతాలకు చేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వాలు విద్యకు కావాల్సిన ముఖ్యమైన అంశాలను మరుస్తున్నాయి. దీనికి ఉదాహరణ స్టేట్ యునివర్సిటీలలో ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం, ఎటువంటి ప్రమాణాలు పాటించక పోవడం, కొన్ని ప్రాంతాలలో కనీసం స్కూల్స్ కంటే కూడా అధ్వాన్నంగా ఉండడం చూస్తున్నాము. 

కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో లెక్కకు మించి బడ్జెట్ కేటాయించి, అధిక వేతనాలు, అన్నిరకాల సౌకర్యాలు, భవనాలు కల్పించడంపై ఎవరూ మాట్లాడరు! ఎక్కడైనా విద్య నేర్పడమే ముఖ్య సూత్రం అయినప్పుడు, గ్రామాల నుంచి వచ్చే పిల్లలకు ఉన్న అవసరాల రీత్యా స్టేట్ యునివర్సిటీలకు ఎక్కువ డబ్బులు ఇవ్వ వలసింది పోయి, కేవలం సెంట్రల్ అన్న పదంతో అత్యధికంగా బడ్జెట్‌ని కేటాయించడంపై కూడా ఆలోచించాలి. 11వ ప్రణాళిక ప్రకారం ఉన్నత విద్య అందరికి చేరువ కావాలని, ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కులాల విద్యార్థులకు చోటు కల్పించాలని, అట్లనే వివిధ గ్రామీణ ప్రాంతాలలో కూడా విస్తరించాలని నిర్ణయించారు. అటువైపు కొద్దిగా ప్రయత్నాలు కూడా మొదలైనాయంటున్నారు. 
కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో ఒక విచిత్ర మైన పరిస్థితి కనపడుతుంది. మెరిట్, స్కిల్, స్పోకెన్ లేదా బ్రోకెన్ ఇంగ్లీష్ వంటి పదాలు ఎక్కువగా వినపడతాయి. కన పడతాయి. అంతవరకు ఫరవాలేదు. కానీ అవి కేవలం అగ్రకులాల వారికి మాత్రమే ఉంటాయని వారి భావన.

ఇంకా ఇదే విషయాన్ని మెజారిటీ ప్రజలు కూడా నమ్ముతుంటారు! మరో వైపు చూస్తే.. దళితులు, అదివాసీలు, బీసీలు, మైనారిటీలు అంటే చాలా చిన్న చూపు. వారు రిజర్వేషన్ ద్వారా వచ్చారని, ప్రభుత్వ సౌకర్యాలు అనుభవించేస్తున్నారని అగ్ర కుల విద్యార్థులు, అధ్యాపకులు చాల బాధ పడుతుంటారు. నిజానికి కొన్ని వేల సంవత్సరాలుగా, కొన్ని కులాలు తెగల చెమట, రక్తం పీల్చి, విజ్ఞానానికి దూరం చేసి, హింసించి, వారికి చెందాల్సిన భూమి, వనరులు అన్ని అనుభవిస్తూ ఉన్న ఈ వర్గాలు చదువుకున్న వారు అనడం దురదష్టం. సమాజంలో సమానత్వం సాధించడానికి వీటికి ప్రతిఫలంగానే ప్రభుత్వం కల్పించే ఒక చిన్న వెసులుబాటు రిజర్వేషన్ విధానం అని ఎ ఒక్కరూ అనుకోరు. ఇక అక్కడినుంచి కథ మొదలైతది. చదువుకుంటున్న బిడ్డలు బతుకు మీద కోటి ఆశలతో, ఏదో చేయాలనే తపనతో ముఖ్యంగా పేద విద్యార్థులు అందునా వెలివేయ బడ్డ కులాల , తరగతుల విద్యార్థులు విశ్వ విద్యాలయాల్లో అడుగు పెడతారు. అడుగు పెట్టిన రోజునుంచి ప్రతి చోట సంఘర్షణ పడుతూనే ఉంటారు. వేసుకునే బట్టల దగ్గర నుంచి, మాట్లాడే మాటలు, తినే తిండి తనతో వచ్చిన అలవాట్లను మార్చుకోవడాలు, కొత్త ప్రపంచానికి అలవాటు పడడాలు మొదలైతాయి. ఇదో రకమైన ఎలియనేషన్ (పరాయీకరణ). విద్యార్థి మంచి అధ్యాపకుల చేతిలో పడితే సంతోషం. 

లేదా తన కోర్స్ పూర్తి అయిపోయేదాకా అనిశ్చితి, అశాంతితో బతకాలి. మధ్య తరగతి విలువలతో నరకం అనుభవించాల్సి వస్తుంది. అంతో ఇంతో విద్యా ప్రమాణాలు కలిగి ఉండి, విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకొని వారిని వెన్నంటి ఉండే ఉపాధ్యాయులను వేళ్ళపై లెక్క పెట్టవచ్చు. సాధారణంగా విద్యార్థులు తమ సౌకర్యాలకు, పుస్తకాలకు, అధ్యాపకులకు సంబంధించిన విషయాలలో గొంతు ఎత్తక తప్పదు. కొన్ని సార్లు హక్కుల పోరాటం చేయనిదే వారికి బతుకు గడవదు. అయినా పోరాటం ఒక ప్రజాస్వామిక హక్కు. ఆ వైఖరే అతని విద్యార్థి జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈ క్రమంలోనే విద్యార్థులలో చీలిక ఏర్పడు తుంది. కొందరు అగ్రకుల ప్రొఫెసర్లకు, అధికారులకు చెంచాలుగా మారితే, మరి కొంతమంది చాటు మాటుగా మద్దతు తెలుపుతుంటారు. వీరిని కూడా తప్పు పట్టనవసరం లేదు. ఆ అవసరం అటువంటిది. విద్యార్థి అప్పటి వరకూ చదివిన చదువు ఒక ఎత్తు అయితే, కేంద్రీయ విశ్వ విద్యాలయాల సంస్కతి ఒక ఎత్తు. వీటన్నింటిని అధిగమించుకుంటూ ముందుకు పోతూ ఉంటాడు విద్యార్థి. ఈ క్రమంలో విపరీతమైన మానసిక ఒత్తిడి పెరిగినపుడు ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటి. చాలా మంది విద్యార్థులు ఆత్మ నూన్య తా భావానికి గురవుతుంటారు. అదొక కల్చరల్ షాక్. కలగూర గంప లాగా రకరకాల మనుషులు మనస్తత్వాలు, మినీ ఇండియా లాగా అనిపిస్తుంది. 2009లో నేను ఢిల్లీ యూనివర్సిటీలో కొన్నిరోజులు ఉన్నప్పుడు, అక్కడ ఉక్కిరి బిక్కిరి అయి కేంద్రీయ విశ్వ విద్యాలయాలు అగ్రహారాలు అని చెప్పడం ఇంకా గుర్తు ఉంది. 

ఇక ఇఫ్లూలో ఘటన. ఏదో ఒక అద్దం పగిలిందని, అక్కడ ఉన్న వివాదాల వీసీ ఇచ్చిన శిక్ష రస్టికేషన్. దీన్ని చిన్నగా తీసి వేయడానికి లేదు. ఈ విద్యార్థులు ఉద్యమాలలో కీలకం గా పని చేస్తున్న వారు. మోహన్ దారావత్ దళిత ఆదివాసీ బహుజన్ మైనారిటీ ప్రెసిడెంట్. సతీష్ నైనాల తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ కార్యదర్శి. సుభాష్ కూడా చురుకైన విద్యార్థి. వీరి కోరిక లైబ్రరీని 24 గంటలు తీసి ఉంచాలని. ఇది న్యాయ మైనదే. ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు కొద్దిగా నష్టం జరగడం కూడా అనివార్యమే. కాని ముగ్గురి మీదనే కక్ష సాధింపు చర్య. అందులో వారు ముగ్గురు సంఘటన జరిగినపుడు అక్కడ లేరు. ఎటువంటి కమిటీ లేక పోవడం, ఉన్నా అందులో ఎస్సీ, ఎస్టీ మెంబర్లు కూడా లేకపోవడం వంటి ఎన్నో తప్పులు, లొసుగులు కనపడుతున్నాయి. కేంద్రీయ విశ్వ విద్యాలయాలలో అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు, అన్ని వర్గాలకు చెందిన వారుంటారు కాబట్టి అందరిని కూడ కట్టడం ఒక సమస్య. అట్లా అని వారు సమస్యలకి స్పందించక పోవడం అనేది ఉండదు. కాకపోతే సమస్య కింది కులా ల అంశం అయినపుడు మాత్రం ఒక రకమైన నిశ్శబ్దం అలుముకుంటుంది. ఆ కులాల నుంచి వచ్చిన అధ్యాపకుల నోళ్లు కూడా మూత పడతాయి. బయట పెద్ద పెద్ద రాడికల్ ప్రొఫెసర్లుగా పేరు తెచ్చుకున్న వారెవరూ కూడా అక్కడ కన పడరు ఎందుకో! కుల సంఘాల వారుకూడా ఆచి తూచి స్పందిస్తారు. 
ఇఫ్లూలో జరిగిన ఆత్మ హత్యలు, వర్కర్ల పట్ల అమానుష ప్రవర్తన , తీసివేయడాలు, ప్రతి నలుగురిని విడగొట్టడం, అతి పొగరుగా వ్యవరించడంతో ప్రస్తుత వీసీ వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి. అద్దం పగలడమే విద్యార్థులను తీసి వేయడానికి కారణం అయితే ఏ యూనివర్సిటీలో విద్యార్థులు మిగలరు.

పరిస్థితులను అంచ నా వేయకుండా, వాటికి దారి తీసిన మన నిర్ణయాలు ఎంతవరకు కారణమో చూడకుండా, బాధ్యత గల పదవులలో ఉన్న వ్యక్తులు చేసే చర్యలు కావు ఇవి. ఇవి ఉద్యమాల గొంతులను అణచి వేసే చర్యలే. హక్కుల గొంతులు విశ్వ విద్యాలయాల్లో కనపడకుండా చేయాలనే కుట్రలో వీటిని భాగంగానే చూడాలి. అణచి వేయబడిన కులాలపై కూడా ఇది ఒక వేటు. ఆ ఫలానా వీసీ గారు రాజకీయ అండదండలతో కొనసాగుతున్నారు కాబట్టి, ఆ రాజకీయ పార్టీలతోనైనా ఒత్తిడి తెప్పిస్తే బాగుంటుదేమో ఆలోచించాలి. లేదా విద్యార్థుల విలువైన కాలం పనికిమాలిన విషయాలకు ఆందోళన రూపంలో ముగుస్తుంది. ఇంకా పరిస్థితులు మారకపొతే చేయి దాటి పోయే ప్రమాదం కూడా ఉంటుంది. మనం కొండతో ఢీ కొంటున్నాం అన్న సంగతి మరిచి పోవద్దు. అదేవిధంగా విద్యా వ్యవస్థపై మచ్చ తెచ్చే వారు ఎవరైనా, ఎటువంటి చర్యలనైనా అందరూ ముక్త కంఠంతో ఖండించాలి . 
-సుజాత సూరేపల్లి
తెరవే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Namasete Telangana Telugu News Paper Dated: 18/05/2014 

Thursday, May 15, 2014

చుండూరు హంతకులెవరు? By రచయిత న్యాయవాది


దేశవ్యాప్త సంచలనం చుండూరు నరమేథం
2007లో శిక్షలు విధించిన ప్రత్యేక కోర్టు 
2014లో హైకోర్టు ద్విసభ్య బెంచ్‌చే రద్దు 
జడ్జీల విచక్షణాధికారానికి ఉదాహరణ 
స్పందించని రాజకీయ పార్టీలు 
15 ఏళ్ళక్రితం కేసులో సాక్ష్యాలు కీలకం
బలమైన ప్రాసిక్యూషనూ అవసరమే 

రాజ్యాంగపరంగా శాసన, కార్య నిర్వా హక, న్యాయశాఖలు ఏర్పాటయ్యా యి. వీటిలో శాసన, కార్యనిర్వాహకశాఖలు పరస్పరపూరకమైన అవినాభావ సంబంధం కలిగి తమ బాధ్యతలు తాము నిర్వహిస్తున్నాయి. కార్యనిర్వాహకశాఖపై శాసనశాఖ పూర్తి ఆధిప త్యాన్ని చలాయిస్తుం దనేది అందరికీ తెలిసినదే. శాసనవ్యవస్థ చేసిన చట్టాలను అమలు చేయడానికి తాను క్షేత్ర స్థాయిలో పనిచేస్తుంది. అందుకే పరోక్షంగా కార్యనిర్వాహక వ్యవస్థ శాసనవ్యవస్థకు అనుబంధంగా పనిచేస్తుంది. ప్రభుత్వమే కార్యనిర్వాహక బాధ్యతలను పర్యవేక్షిస్తుంది కనుక శాసనవ్యవస్థ ఇష్టాయి ష్టాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. కానీ న్యాయవ్యవస్థ వీటికి భిన్నంగా పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కలిగి పనిచేస్తుంది. దీనిపై శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల ప్రభావం కానీ, పర్యవేక్షణకానీ ఉండదు. 

న్యాయవవస్థకుగల భిన్నమైన లక్షణాల్లో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడమే కాకుండా రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలను శాసనవ్యవస్థ తయారు చేసినప్పుడు, లేదా రాజ్యాంగ హక్కులను పౌరులకు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైనప్పుడు న్యాయస్థానాలు ప్రభుత్వాలను మందలించే అధికారాలను కలిగిఉంటాయి. రాజ్యాంగానికి రక్షణకర్తగా న్యాయవ్యవస్థ అప్రమత్తంగా ఉంటుంది. సాధారణంగా రాజకీయపార్టీలు తమ ప్రణాళికలను అమలుచేయడానికి ప్రభుత్వాలుగా ఏర్పడి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తాయి. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి ధర్మకర్తగా వ్యవహరిస్తుంది. న్యాయవ్యవస్థకు ఉన్న ప్రమాదకరమైన లక్షణాల్లో ఒకటి- న్యాయమూర్తులు తమ తీర్పులను ఇవ్వడంలో విచక్షణాధికారం కలిగి ఉంటారు. ఈ అధికారాన్ని తన పై న్యాయమూర్తి కూడా ఆక్షేపించడానికి లేదా త„ప్పుపట్టడానికి వీలులేదు. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడంలోకానీ, కేసులను విచారించి తీర్పులను ప్రకటించడంలో కానీ ఒక్కో న్యాయమూర్తి ఒకో విధమైన అభిప్రాయంతో ఉంటారు. ఈ అభిప్రాయాన్ని త„ప్పుపట్టడానికి ఇంకెవరికి ఏ అధికారం లేదు. క్షేత్ర స్థాయిలో ఉండే మెజిస్ట్రేట్‌ నుండి సుప్రీం కోర్టు ఛీప్‌ జస్టిస్‌ వరకు కూడా ఇదే విధమైన విచక్షణాధికారాన్ని కలిగి ఉంటారు. కాకపోతే మెజిస్ట్రేట్‌ ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ జిల్లా కోర్టుకు అప్పీలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ అప్పీల్లో కూడా క్రిందికోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదని పైకోర్టు తీర్పు ఇస్తే పైకోర్టు తీర్పు చెల్లుబాటు అవుతుంది. 

ఆ విధంగా జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేయవచ్చు. అక్కడ జిల్లాకోర్టు తీర్పును సమర్థించవచ్చు, లేదా రద్దుచేయవచ్చు. ఈ విధంగా క్రిందికోర్టులో ఇచ్చిన తీర్పుపై నిందితులు లేదా బాధితులు పైకోర్టులకు అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గానీ, ఆ జడ్జీలను వ్యక్తిగతంగా వ్యాఖ్యానించడానికిగానీ, వివరణ కోరడానికి గానీ, లేదా ఆ పదవినుండి తొలగించమని కోరడానికి గానీ అవకాశం లేదు. ఈ విచక్షణాధికారం ఒక్క న్యాయవ్యవస్థలోనే ఉంది. ఇంతటి మహత్తరమైన ఈ అధికారాన్ని- న్యాయమూర్తులు తమ మానసిక, కుల, మత, లింగ, ప్రాంత వివక్షలకు తావులేకుండా, రాజ్యాంగ సూత్రాలకు, న్యాయ ప్రక్రియకు లోబడి ఉపయో గించాల్సి ఉంటుంది. శాసనవ్యవస్థ ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనది అయినప్పటికి ఈ విధమైన వెసులుబాటు కేవలం న్యాయమూర్తులకే ఇవ్వడం జరిగింది. విచక్షణాధికారం ఖచ్చితంగా సహేతుకంగా ఉండితీరాలి. వారి మానసికవైఖరులకు, వారి సైద్ధాంతిక భావజాలానికి అతీతంగా ఉండితీరాలి. న్యాయమూర్తుల తీర్పులపై అప్పుడ„ప్పుడు రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైన ప్రకంపనలు ఏర్పడుతున్నాయి. గత నెల 22న హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇందుకు మరోసారి దారితీసింది. 

1991 ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరులో కమ్మ కులస్థులు ఎస్‌.సి. మాల కాలనీపై మూకుమ్మడిగా దాడులు చేసి, వారిని వేట కొడవళ్లతో, గొడ్డళ్ళతో నరికివేసి, శవాలను ముక్కలుగాకోసి తుంగభద్ర కాలువల్లో పడేసి, 8 మందిని హతమార్చి మారణకాండ సృష్టించారు. ఈ మారణహోమం అప్పట్లో జాతీయ స్థాయిలో సంచలనం రేపింది. దళిత ఉద్యమాలు తీవ్రం కావడంవల్ల కేంద్రప్రభుత్వం ఈ ఊచకోత ఘటనపై విచారించడానికి చుండూరులోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసింది. ఈ కోర్టు సుదీర్ఘకాలం పాటు విచారణ జరిపి, 2007లో 21 మంది నిందితులకు జీవితఖైదు, 35 మంది నిందితులకు సంవత్సరం కారాగారశిక్ష విధిస్తూ 123 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో 8 మంది విగతజీవులు కాగా, ఉద్యమం నడిచే క్రమంలో ప్రత్యక్ష సాక్షుల్లో ఒకరు పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. సుమారు 15 సంవత్సరాలపాటు ప్రత్యేక కోర్టు స్థానికంగా విచారణ జరపడాన్నిబట్టి, న్యాయస్థానాలు కేసుల విచారణలో ఏ విధంగా సమయాన్ని తీసుకుంటున్నాయో అర్థంచేసుకోవాలి. సాధారణంగా హత్యకేసులను సంవత్సరకాలం లోపే విచారణ జరుపుతారు. 

ఘటన జరిగిన చుండూరులోనే ప్రత్యేకకోర్టు ఏర్పాటు చేసినప్పటికి 15 సంవత్సరాల కాలం పట్టిందంటే సాక్షులను, బాధితులను ఏస్థాయిలో బెదిరింపులకు గురిచేశారో ఊహించు కోవచ్చు. 2007లో ప్రత్యేక కోర్టు తీర్పు ప్రకటించడంతో బాధితులు కొంత న్యాయం జరిగిందని భావించారు కానీ, నిందితులే ప్రత్యేక కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేశారు. హైకోర్టు గతనెల 22వ తేదీన ప్రత్యేక కోర్టు ఇచ్చిన 21 మందిపై జీవితఖైదు శిక్షను రద్దుచేస్తూ తీర్పును ప్రకటించింది. ఎల్‌. నర్సింహారెడ్డి, జి.ఎస్‌. జైస్వాల్‌ల ద్విసభ్య బెంచి వెలువరించిన ఈ తీర్పు యావత్‌ భారత… దళిత, ప్రగతిశీల ఉద్యమకారులను తీవ్ర కలవరానికి గురిచేసింది. సభ్యసమాజం చూస్తుండగా మూకుమ్మడిగా దాడులుచేసి 8 మందిని ఊచకోతకోసిన ఘటన మాత్రం చరిత్రలో కలిసిపోయింది. 

ఈ ఘటన జరిగిన 23 సంవత్సరాలకు నిందితులందరూ నిర్దోషులేనని తీర్పు ఇవ్వడం వెనుక కారణాలేమిటో పరిశీలించాలి. న్యాయమూర్తులకు ఉన్న విచక్షణాధికారం ఏ స్థాయిలో తమ తీర్పుల్లో ప్రదర్శితమవుతుందో చెప్పడానికి ఈ తీర్పును ఉదాహరణగా తీసుకోవచ్చు. 
ఈ తీర్పుపై ఏ రాజకీయ పార్టీ స్పందించక పోవడంపట్ల విచారించాల్సిన పనిలేదు. ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు దళిత వ్యతిరేక పార్టీలే. ఈ తీర్పును నిరసిస్తూ రెండు మూడు నిరసన సభలు జరిగాయి. వాటిలో ఈ నెల 4న హైదరాబాద్‌ లోని సుందరయ్య విజ్ఞానభవన్‌లో ఏర్పాటుచేసిన రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్‌‌స ఒకటి. దీనికి మీడియా ప్రతినిధులతో కలిపి కేవలం100 మంది వరకు హాజరయ్యారు. రాజకీయ పార్టీలే కాదు, దళిత ఉద్యమాలని లేదా కుల సంఘాలని చెప్పుకునే వేలాదిమంది నాయకులూ హాజరు కాలేకపోయారు. ఈ సమావేశంలో రెండు తీర్మానాలు చేశారు. 1. న్యాయమూర్తుల్లో ఒకరైన ఎల్‌. నర్సింహారెడ్డిని ఆ పదవినుండి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం. 2. కుల నిర్మూలన కోసం దళిత విశాల ఐక్య వేదికలను ఏర్పాటుచేసి ఉద్యమించడం. ఇందులో మొదటి తీర్మానం ఆచరణయోగ్యమేనా?

హైకోర్టు జడ్జీలు రాష్టప్రతి ఆమోదముద్రతో నియమితులవుతారు. వారిని తొలగించడం రాష్టప్రతి ద్వారానే సాధ్యమవుతుంది. ప్రభుత్వాలకు ఆ అధికారంలేదు. కాకపోతే, వీరిని తొలగించడానికి పార్లమెంటులో అభిశంసన తీర్మానం చేయాల్సిఉంటుంది. ఉభయసభలు ఈ తీర్మానంచేసి రాష్టప్రతికి పంపిస్తే, ఆయన ఆ తీర్మానాన్ని ఆమోదిస్తూ జడ్జిని పదవీచ్యుతుణ్ణి చేస్తారు. ఈ తతంగం జరగాలంటే ఎంత సమయం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. జడ్జీలు అవినీతికి పాల్పడినట్లు లేదా అసాంఘిక, అనైతిక చర్చలకు పాల్పడినట్లు ఖచ్చితమైన ఆధారాలుంటేనే అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతారు. జడ్జీల తీర్పుల ఆధారంగా వారిపై అభిశంసన తీర్మానం చేసే అవకాశం లేదు. 

జడ్జీల వ్యక్తిగత అభిరుచులు, వైఖరులు వారి తీర్పులను అంతర్గతంగా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ఆ మేరకు కోర్టు బయట ఎవరు వ్యాఖ్యానం చేసినా దాని ప్రభావం ఆ జడ్జీలపై గానీ ఆ కోర్టులపైగానీ పడదు. కేసు విచారణలో ఉన్నప్పుడు కోర్టులోగానీ బయటగానీ ఆ కేసు గురించి లేదా జడ్జీల వ్యక్తిగత విషయాల గురించిగానీ ఆరోపణలు చేస్తే అది కోర్టు ధిక్కారనేరం అవుతుంది. తీర్పు వెలువడింది కాబట్టి జడ్జిపై వ్యక్తిగత ఆరోపణలు, నిరసనలు చేస్తున్నారు కానీ- అవి తీర్పులను ఏ రకంగానూ మార్చలేవు. కేసుల విచారణలలో, తీర్పులలో వచ్చే బేధాలపట్ల సామాన్య ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతుంటారు. ప్రజల మధ్యనే ఒక సంఘటన లేదా నేరం జరిగినప్పటికీ, ఆ కేసులో నిందితులు నిర్దోషులుగా ఎలా శిక్షనుండి తప్పించుకుంటారో వారికి అర్థంకాదు. అదే రకంగా కేసుతో సంబంధంలేని అమాయకులు కేసుల్లో శిక్షలకు ఎందుకు గురవుతారో కూడా వారికి అర్థంకాదు. 

ఇందుకు ప్రధానమయినవి రెండు కారణాలు: 1. సాధారణంగా హత్య కేసులో- ముందుగా పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని, ఆయుధాలను సేకరించి, సాక్షులను విచారించి, కేసు దర్యాప్తుచేసి హతుల వివరాలు, నిందితుల వివరాలు, ఘటన జరిగిన నేపథ్యం, ప్రత్యక్ష సాక్షులు- వగైరాలను గుర్తిస్తారు. తర్వాత అభియోగ పత్రాలను కోర్టులో నివేదిస్తారు. పోలీసులు చేసే కీలకమైన బాధ్యత ఇది. ఈ చార్జిషీటులోనే కేసుకు సంబంధించిన కీలకమైన అంశాలన్నీ ఉంటాయి. సి.ఆర్‌.పి.సి. 161 - స్టేట్‌మెంట్‌లకు, కోర్టులోచెప్పే సాక్షాలకు పూర్తి సారూప్యతఉండేలా పోలీసులు జాగ్రత్త వహించాలి. సాక్ష్యం చెప్పేటపుడు ఘటన జరిగిన నేపథ్యాన్ని- ముందుది వెనుకాల, వెనుకది ముందు చెప్పడంవల్ల కేసు బలహీనమయ్యే అవకాశం ఉంటుంది. అందుకు సాక్షులకు పోలీసులు, ప్రభుత్వ న్యాయవాది అవగాహన కల్పించాలి. ఘటన జరిగిన ప్రదేశం, సమయం, ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాలు- కేసులో కీలకంగా తీర్పుకు కారణమవుతాయి. ఈ కోణంలో చూచినప్పుడు, 15 సంవత్సరాలలో పోలీసులు ఈ కేసులో దర్యాప్తు క్షుణ్ణంగా చేసితీరాలి. ఒకవేళ ఏదైనా లోపం జరిగిఉంటే దానిని ప్రత్యేక కోర్టులోనే సవరించాల్సి ఉంటుంది. 2. కోర్టులో ప్రాసిక్యూషన్‌ నైపుణ్యంగా నిర్వహించడం చాలా అవసరం. అభియోగాలను, ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాలకు సారూప్యత ఉండే విధంగా సాక్ష్యాన్ని ఇప్పించాలి. చాలా కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటికి రావడానికి ప్రాసిక్యూషన్‌ విఫలం కావడం ప్రధాన కారకం. 

ఇది క్రింది కోర్టుల్లో జరిగే లోపం. అప్పీలు కోర్టులో దీనిని సవరించే అవకాశం లేదు. ఈ కేసు పరంగా చూసిన„ప్పుడు ప్రత్యేక కోర్టులో ప్రాసిక్యూషన్‌ వైపున ఏదైనా లోపం జరిగిందా, ఏ విషయంలోనైనా నిర్లిప్తంగా వ్యవహరించడం జరిగిందా- పరిశీలించాలి. ఈ రెండు కారణాల్లో ఏదీ లోపం లేదనుకున్నపుడు హైకోర్టు జడ్జీలు దళిత వ్యతిరేకమైన, ప్రజా వ్యతిరేకమైన, సహజ న్యాయవ్యతిరేకమైన తీర్పును ఇచ్చినట్లుగా భావించవచ్చు. ఒకవేళ ఈ జడ్జీలు తమ తీర్పులో న్యాయప్రక్రియకు వ్యతిరేకమైన లేదా విచక్షణాధికారంలో తమ మానసిక, కుల, మత, లింగ, ప్రాంతీయ వివక్షలకు ప్రాముఖ్యత ఇచ్చారని రూఢిగా భావిస్తే, అప్పుడు సుప్రీం కోర్టులో ప్రభుత్వమే హైకోర్టు తీర్పుపై అప్పీలుకు పోవాల్సి ఉంటుంది. ఈ కేసులో తీర్పు అంశాలను ఉద్యమకారులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. దళిత వ్యతిరేకమైన ఈ తీర్పు రావడానికి ప్రధాన కారణమేమిటో గుర్తించినప్పుడు, ఉద్యమలక్ష్యం బోధపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయవలసిన ఆవశ్యకతఉంది.తీర్పు ప్రతులను అధ్యయనం చేసి, సుప్రీం కోర్టులో అప్పీలు చేసేలా ప్రభుత్వాన్ని వేగిరపరిచేందుకు ఉద్యమం తోడ్పడాలి.

Surya Telugu News Paper Dated: 16/05/2014 

Monday, May 12, 2014

ఇప్లూలో ఏం జరిగింది? By శంకర్, ఉపేందర్, కె. మహేష్, కె. రాజేష్, స్టాలిన్, ఆర్. లింగస్వామి ఇఫ్లూ, ఓయూ రీసెర్చ్ స్కాలర్లు


Published at: 11-05-2014 00:37 AM
సమాజ స్థితిగతులను బేరీజు వేసుకుంటూ భవిష్యత్ తరాలకు దశ, దిశ నిర్దేశించడంలో ఎనలేని పాత్ర పోషించి నూతన ప్రపంచ ఆవిర్భావానికి నాంది పలకాల్సిన విశ్వవిద్యాలయాల్లో కులాధిపత్యం, అణచివేత, అన్యాయాలు రాజ్యమేలుతున్నాయి. మనుషులంతా సమానమే అన్న రాజ్యాంగ ప్రాథమిక స్ఫూర్తిని అక్షరాల పాటించాల్సిన ప్రథమ 'పాఠశాలలే'... అగ్రహారాలుగా మారిపోయాయి. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఉన్న ఇఫ్లూ (ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ) అడ్మినిస్ట్రేషన్ ముగ్గురు విద్యార్థులను అక్రమంగా, అన్యాయంగా రెం డేళ్ళపాటు రెస్టికేట్ (బహిష్కరణ) చేసింది. వర్సిటీ వీసీ సునయన సింగ్ ఇతర అధికారులు చెబుతున్న దానిని బట్టి లైబ్రరీలో అద్దం పగలగొట్టినందుకు వేసిన 'శిక్ష' మాత్రమే. కేవలం చదువుకునేందకు లైబ్రరీని తెరచి ఉం చండని అడిగితే జరిగిన 'బహిష్కరణ' ఇది. రీడింగ్ రూం కోసం జరిగిన తోపులాటకు బాధ్యులను చేస్తూ, ఆ రోజు అక్కడ లేని విద్యార్థులపై రెస్టికేషన్ శిక్ష వేయడం దుర్మార్గం. పగిలిన రూం గ్లాస్‌కు రెస్టికేట్ అయిన విద్యార్థులకు ఏ సంబంధంలేదని ఇఫ్లూ అధికారిక స్టూడెంట్స్ కౌన్సిల్ రాతపూర్వకంగా వీసీకి విన్నవించినా వీసీ పట్టించుకోలేదు. విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు యూజీసీ రూపొందించిన నిబంధనలకు విరుద్ధంగా రెస్టికేషన్ చేయడం అన్యాయం. గ్రామ పునాదుల్లో నిర్మితమైన బ్రాహ్మణీయ భావజాలం నేటి విశ్వవిద్యాలయాలకు పాకింది.
ఇఫ్లూ తదితర కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నిరుపేద విద్యార్థులు కనీస సౌకర్యాలపై నోరు విప్పితే నిర్బంధాలు, కేసులు, సెక్షన్లు ఎదుర్కొనవలసి వస్తోంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నాడనే నెపంతో మరో స్కాలర్ కోటేష్‌ను గత ఏడాది ఐదురోజులపాటు బహిష్కరించారు. చదువుకునేందుకు సౌకర్యాలు కల్పించాలని కోరిన పీహెచ్‌డీ స్కాలర్లు మోహన్ దరావత్, సతీష్ నయనాల, పీజీ విద్యార్థి సుభాష్‌లపై రెస్టికేషన్ దండన ప్రయోగించారు. వీసీ సునయన సింగ్‌ది ఆది నుంచి నియంతృత్వ పోకడే. ఇఫ్లూలో కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందని కేంద్ర ఆడిట్ (కాగ్) అధికారులు సైతం గుర్తించారు. అధికారం అండతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాల విద్యార్థులను వీసీ వీలు చిక్కినప్పుడల్లా వేధింపులకు గురిచేస్తున్నారు. కనీసం తమ సమస్యలు వినిపించేందుకు అపాయింట్‌మెంట్ కోరినా బడుగు విద్యార్థులకు అపాయింట్‌మెంట్ ఇవ్వని వీసీ అగ్రవర్ణ విద్యార్థులతో మాత్రం కోరకుండానే సమావేశమవుతుంటారు. రెస్టికేషన్ సమస్యపై చర్చించేందుకు వచ్చిన ఎమ్మెల్సీ చుక్కారామయ్య, రాజ్యసభ మాజీ ఎంపీ అజీజ్ పాషా, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, మాజీ అడిషనల్ డీటీ నాయక్, రిటైర్డ్ ఐజీ జగన్నాథరావు, టీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ తదితర ప్రజాసంఘాల నాయకులు కూడా వీసీని కలిసేందుకు గేటు దగ్గరే గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. నాలుగు రోజులుగా మేధావులు, ప్రజాసంఘాలు, విద్యార్థిలోకం రెస్టికేషన్‌కు వ్యతిరేకంగా ఇఫ్లూ వైపు దారికడుతున్నారు. వీసీ ఇవేమీ పట్టించుకోకుండా పది రోజులు సెలవుపై వెళ్ళారు.
సాంస్కృతిక, సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడమే ఇప్లూ విద్యార్థులకు శాపంగా పరిణమించింది. తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక ఉద్యమాలు బీఫ్ ఫెస్టివల్, నరకాసుర వధ, రావణాసుర జయంతులతో పాటు ఇతర సామాజిక ఉద్యమాల్లో ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల ఇఫ్లూలోని దళిత బహుజన విద్యార్థులు కలసి కొనసాగించారు. ఇదే వర్సిటీ అధికారులకే కంటగింపుగా మారింది. ఓయూ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడితే దానికి భిన్నంగా ఇఫ్లూ అధికారులే ఇక్కడి విద్యార్థులపై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు బనాయించిన సందర్భాలున్నాయి. అలాంటి విద్యార్థులపై అగ్రకుల అధ్యాపకులు పలు పరీక్షల్లో తమ 'కసి' తీర్చుకున్న ఉదంతాలు ఉన్నాయి. మోహన్ దరావత్, సతీష్ నయనాల వంటి విద్యార్థులు అటు ఉద్యమంలో పాల్గొంటూనే ఇటు ఇఫ్లూ లోపల జరుగుతున్న అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించడంలో ముందున్నారు. ఈ కారణంగా వీసీ, ఇతర అధికారులు కలసి వారిని ఒక పథకం ప్రకారం రెస్టికేట్ చేశారు. లేనిపోని విషయాలకు, నాణ్యమైన విద్యనందించేందుకు అవసరమైన సదుపాయాలను అడిగిన పాపానికి అధికారం ఉంది కదా అని ఇలాంటి శిక్షలు వేయడం అన్యాయం.
ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ విద్యార్థులను వేధింపులకు గురిచేసే యూనివర్సిటీల్లో ఇఫ్లూ ఒకటి. నగర శివారులో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో పాటు ఇక్కడ అగ్రకుల ప్రొఫెసర్లు స్కాలర్లపై కుల పెత్తనాన్ని నిత్యం ప్రదర్శిస్తూనే ఉంటారు. అణగారిన వర్గాల పిల్లలను ఏదో ఒక సాకుతో వివక్షకు గురిచేస్తూనే ఉం టారు. ఫలితంగా ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వర్సిటీలో ఒక్కోడిపార్డ్‌మెంట్‌లో ఒక్కోరకమైన వివక్ష కొనసాగుతోంది. ఫిల్మ్ స్టడీస్‌లో పీహెచ్‌డీ దళిత స్కాలర్ సతీష్‌కు గ్రూప్ వన్ కేడర్ ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వోద్యోగులు తమ పీహెచ్‌డీని పార్ట్ టైంకి మార్చుకునే అవకాశమున్నా, ఆయన పీహెచ్‌డీని రద్దు చేశారు. ఇదే డిపార్ట్‌మెంటులో మరో స్కాలర్ నర్సింగ్ రావు ప్రొఫెసర్ల వేధింపులకు మనోవ్యాధికి గురై చికిత్స తీసుకుంటున్నాడు. అట్లాగే ట్రాన్స్‌లేషన్ స్టడీ స్‌లో ట్వింకిల్ దాసరి, జర్మన్ స్టడీస్‌లో శ్రీరాములు, రం జన్ కుమార్, మాయకుమారి వంటి స్కాలర్లు అధ్యాపకుల ఆగడాలకు బలైనవారే. వీరంతా దళిత విద్యార్థులే. వీరితోపాటు ఇప్పటికీ మరెందరో విద్యార్థులు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. విద్యార్థులపై విధించిన రెస్టికేషన్ ఎత్తివేసి విద్యార్థులు చదువుకునేందుకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని చేస్తున్న ఉద్యమాన్ని వర్సిటీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
ఇది వీసీ అహంభావానికి నిదర్శనం. కాగా తనకు ఓ కేంద్రమంత్రి అండగా ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బందిలేదనే వీసీ అహంకారం. నిబంధనలకు విరుద్ధంగా నిరుపేద దళిత బహుజన విద్యార్థులపై విధించిన రెస్టికేషన్ ఎత్తి వేయాలని, వర్సిటీ నిధులను దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపడంతో పాటు కులం పేరుతో వివక్ష పాటిస్తోన్న వీసీ, ఇతర అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎలాంటి వివక్ష, అసమానతలకు తావు లేకుండా నాణ్యమైన విద్య అందించాలని కోరుతూ ఈ నెల 12న 'ఛలో ఇఫ్లూ' కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కుల, మత కబ ంధ హస్తాల్లో నలిగిపోతున్న విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు విద్యార్థులు మేధావులు ప్రజాసంఘాలు, బుద్ధిజీవులు ఈ ఆందోళనలో పాల్గొని విద్యా హక్కు కోసం మద్దతుగా నిలవాలని కోరుతున్నాం...


Andhra Jyothi Telugu News Paper Dated: 11/05/2014 

Thursday, May 8, 2014

దళిత ఉద్యమాల వర్తమాన వాస్తవాలు - సూరేపల్లి సుజాత


Published at: 09-05-2014 08:47 AM


కారంచేడు, చుండూరు సంఘటనలప్పుడు నడిచిన దళిత ఉద్యమాలు ఇపుడు నడిచే పరిస్థితి లేదు. విస్తృతకోణంలో పరిశీలించకుండా, ప్రపంచ పోకడల్ని పట్టించుకోకుండా, కేవలం దళితుల సమస్యలపై మాత్రమే ఆలోచించినా, పథకాలు వేసినా పెద్దగా మార్పు ఉండబోదు. మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా ఉద్యమ దశ, దిశలను మార్చకుండా పోతున్నాం కూడా.
అక్షరాస్యత పెరిగి, పేదరికం తరిగి అన్ని వర్గాల, కులాల వారందరూ ముందుకు పోతున్నారు అని అకాడెమిక్ పరిశోధనలు వస్తున్న నేపథ్యంలో మన ముందు కనిపిస్తున్న మరికొన్ని నిజాల గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. రోజూ దళితులపై ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో హింస జరుగుతూనే ఉంది. హత్యలు, అత్యాచారాలు, ఆక్రమణలు, దురాక్రమణలు ఇందు లేదు అన్న విధంగా నేరాలు పెరుగుతున్నాయి. కాని ప్రజలలో, దళిత నేతలు, సంఘాలలో కూడా ఒక నిర్లిప్తత చోటుచేసుకొందో ఏమో ఇప్పుడు అవి ఒక సాధారణ వార్తలుగా మారిపోయాయి. అపుడపుడు అక్కడో ఇక్కడో కాస్త హడావిడి కనిపించినా మొత్తానికి పరిస్థితిలో పెద్దగా మార్పు ఏమీ లేదనే చెప్పుకోవాలి.
ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు దళిత ఉద్యమాలకు ఒక పెద్ద సవాల్ విసిరింది. 1991 చుండూరు దళితుల ఊచకోతపై వెలువడిన తీర్పు అసలు ఈ దేశంలో దళితులకు ప్రభుత్వాలు, మీడియా, న్యాయప్రక్రియల వల్ల ఏమన్నా న్యాయం జరుగుతుందా అన్న ప్రశ్నని కూడా ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఏడేళ్ల క్రితం చుండూరు కేసులో ప్రత్యేక న్యాయస్థానం 21 మందికి జీవిత ఖైదు, 35 మందికి ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించి సంచలనాత్మక, చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని సంతోషించిన వారందరూ ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. సాక్ష్యాలు లేవు- లాంటి కారణాలే దేశంలోని ఇతర ప్రాంతాలలో జరిగిన హత్యాకాండలకి కూడా ఆపాదిస్తున్నారు. నేరం జరిగిన ఎన్నో ఏళ్లకి గాని తీర్పు వచ్చే పరిస్థితి వుంటే ఇక ప్రజలు న్యాయస్థానాలకి పోవడం పట్ల ఆసక్తి చూపుతారా?

ఇక లక్ష్మిపేట భూమి పోరాటంలో దళితులపై జరిగిన అమానవీయ దాడిలో ఇంకా న్యాయం పూర్తిగా జరగలేదు. అదే విధంగా హర్యానాలో భగన గ్రామంలో ఒక 100 గజాల ప్రభుత్వ భూమిని దళితుల ఇండ్ల జాగాకి అడిగినందుకు అక్కడి జాట్, ఆధిపత్య కులస్తులు దళితులని గ్రామ బహిష్కరణ చేశారు. అప్పటి నుంచి అక్కడ దళితులూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆ తరువాత పోయిన సంవత్సరం నుంచి హర్యానాలో వరుసగా దళిత మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎందుకో కాని నిర్భయకి వచ్చినంత గుర్తింపుకు ఈ దళిత మహిళలు నోచుకోలేదు. సమాజం భగ్గున మండలేదు. ఈ చర్చ ముగియకముందే హర్యానాలో అదే ఊర్లో (భగన గ్రామం, హిసార్ జిల్లాలో) నలుగురు దళిత మైనర్ అమ్మాయిలపై జాట్‌ల అత్యాచారం జరిగింది. ఈ సంఘటనకి మద్దతుగా హర్యానా గ్రామ దళితులూ, ప్రజాసంఘాలు, ఎన్జీవోలు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఇపుడు కూడా ఆందోళన చేస్తూనే ఉన్నారు. వివరాల్లోకి వెళితే, ఈ ఏడాది మార్చి 23 రాత్రి 8 గంటలకు నలుగురు మైనర్ అమ్మాయిలు నీళ్లకోసం తమ పొలాల వద్దకి పోయినప్పుడు ఐదుగురు మగవాళ్లు కారులో వచ్చి వాళ్లని కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి, రేప్ చేశారు. 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న భటిండా రైల్వేస్టేషన్‌లో పడేసి పోయారు. ఈ విషయం తెలియని ఆ నలుగురు అమ్మాయిల తండ్రులు మార్చ్ 24న ఆ వూరి పెద్ద రాకేశ్‌కి ఫిర్యాదు చేసి, మిస్సింగ్ కేసు నమోదు చేయమంటే ఆయన నిరాకరించారు.
ఆ తరువాత వారు ఒత్తిడి చేయడంతో ఆ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో తనకి తెలుసని చెప్పి భటిండా రైల్వే స్టేషన్‌కి తీసుకుపోయాడు. అతనితో పాటు వీరేంద్ర అనే ఆయన బంధువు కూడా ఉన్నాడు. స్టేషన్‌లో అచేతనంగా పడి ఉన్న అమ్మాయిలను తీసుకుని వస్తుండగా రాకేశ్, ఆ అమ్మాయిలని ఈ విషయం బయట ఎక్కడా చెప్పొద్దని, పోలీసులకు కూడా చెప్పొద్దని బెదిరించాడు. ఎంత బెదిరించినా అమ్మాయిల తల్లిదండ్రులు వినకుండా మార్చి 25న హిసార్ ప్రభుత్వ హాస్పిటల్‌లో అమ్మాయిలకు వైద్య పరీక్షలు నిమిత్తం తీసుకుపోతూ ముందు హిసార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హాస్పిటల్‌లో రాత్రి 11 గంటల వరకు వారిని పట్టించుకోకుండా అక్కడి వైద్య సిబ్బంది ఆలస్యం చేసి రాత్రి కేవలం ఒక్క అమ్మాయికి పరీక్ష చేసి, మిగిలిన వారికి మరుసటి రోజు అంటే 26న మధ్యాహ్నం 1.30 వరకు చేసినారు. బాధితుల కథనం ప్రకారం పోలీసు వారు సహాయం చేయకపోవడం సరి కదా ఇంకా ఆలస్యం చేసారని ఆరోపించారు. వైద్య పరీక్షల అనంతరం, పోలీస్ ఆఫీసర్ అమ్మాయిలను తీసుకుని మెజిస్ట్రేట్ ఇంటి వద్ద వారి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసి అక్కడనే కుండపోత వర్షంలో వదిలేసిపోయారు. ఆ తరువాత పోలీసులు లలిత్ పంగల్, సుమీ పంగల్, ధర్మవీర్ పంగల్, సందీప్ పంగల్‌లను అరెస్ట్ చేశారు. దీని వెనుక వూరి పెద్ద రాకేశ్, వీరేంద్ర ఉన్నారని అమ్మాయిలూ, తల్లిదండ్రులు చెప్పినా కూడా వారిని నేరస్థులుగా నమోదు చేయలేదు. జాట్ కులానికి చెందిన వారు కాబట్టి వారిని అరెస్ట్ చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక ఇక్కడి నుంచి కథ మామూలే. న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం మొదలైంది.
కారంచేడు, చుండూరు సంఘటనలప్పుడు నడిచిన దళిత ఉద్యమాలు ఇపుడు నడిచే పరిస్థితి లేదు. పూర్తిగా మధ్యతరగతి భావనలు విస్తరించి ఉన్న సమాజం బయట, లోపట ఒకవైపు అయితే, ప్రపంచీకరణ పలు విధాలుగా దళిత సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అన్నది కూడా వాస్తవమే. దళిత ఉద్యమాలు అని అనడం కంటే ప్రోగ్రాములు, పథకాలు అనడం సరిపోతుంది. ఇపుడు దళితుల పరిస్థితి చాలావరకు ఎన్జీవోల చేతిలో ఉంది. వారు అత్యద్భుతంగా బాధితులని వివిధ వేదికల మీద ఏడిపించి, లీటర్లకొద్దీ కన్నీరు కార్పించి, మార్కెట్ వస్తువులని చేసి, అందమైన ప్రాజెక్టులని తయారు చేసి దేశ విదేశాలలో బాగానే సరుకును అమ్మగలుగుతున్నారు. కాని దానివల్ల దళిత, బడుగు బలహీన వర్గాలలో మార్పు ఏమో కాని సంస్థల అధిపతులు, పరిశోధనకారులకి, రచయితలకి విపరీతమైన పేరు, అంతో ఇంతో ఆర్థికంగా వెసులుబాటు మాత్రం జరుగుతుంది అని ఒక పెద్ద మనిషి అనడం సత్యదూరం కాదేమో. ఇక దళితోద్ధారణకి బయటి దేశాల నుంచి అత్యధికంగా నిధులు వస్తున్నట్టు లెక్కలు చెపుతున్నాయి. మరి వాటి వల్ల ఏమి మార్పు జరిగింది అని ఒక యువ ఎన్జీవోని అడిగితె, 'ఏమి లేదు మేడం! ఇవి జీవనోపాధికి మాత్రమే, ఇంకా వంద సంవత్సరాలు ఈ విధంగా జరిగినా మార్పు మాత్రం సాధ్యపడదు' అన్నాడు. అంటే ఎన్జీవోల వల్ల డాక్యుమెంటేషన్ మాత్రం జరుగుతుంది.
కొన్నిచోట్ల కొద్ది మార్పులు లేకపోలేదు కాని అవి దళితుల మౌలిక సమస్యలని మార్చడం కాని, బయటి సమాజాన్ని ప్రభావితం చేయడంలోగాని పూర్తిగా విఫలమైనాయని అధికశాతం ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అంబేద్కర్, యువజన సంఘాలు విగ్రహ ప్రతిష్టాపనలు, పార్టీకొక సంఘంగా విడిపోయినాయని ఒక జర్నలిస్ట్ అభిప్రాయం. ఇంకా జిల్లా ఎస్టీ ఎస్సీ కమిటీలు అన్నీ కూడా అగ్రకుల పైరవీల ద్వారా వచ్చినవే, సెటిల్మెంట్ సంఘం అని కూడా అంటారంట. ఇంకా మేధావులు నరకాసుర జయంతి, గొడ్డుమాంసం, పుస్తక చర్చలలో తలమునకలై ఉన్నారు. అది ఒక సాంస్కృతిక రూపమే అనుకున్నా 90 శాతం దళిత జీవితాలకు సంబంధించిన రోజువారీ బతుకు సమస్య మాత్రం కాదని చెప్పగలం. రాజకీయ వ్యవస్థ పూర్తిగా దళితులని లబ్ధిదారులుగా మాత్రమే చూసి వారికి రెండు గొర్రెలు, బర్రెలు, ఇందిరమ్మ ఇల్లు, బోర్లు, అంబేద్కర్ జయంతి, బాబు జగ్జీవన్‌రామ్ జయంతి జరిపితే చాలా ఎక్కువని భావిస్తున్నాయి. అంతో ఇంతో కొంతమంది పెద్దమనుషులు కలిసి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్‌ని తీసుకువచ్చారు. దాని సంగతి ఏందో, ఎన్ని డబ్బులు వచ్చాయో ఎవరికీ తెలిసే అవకాశం లేదు.
విస్తృతకోణంలో పరిశీలించకుండా, ప్రపంచ పోకడల్ని పట్టించుకోకుండా, కేవలం దళితుల సమస్యలపై మాత్రమే ఆలోచించినా, పథకాలు వేసినా పెద్దగా మార్పు ఉండబోదు. ఇంకొకవైపు కంటికి కనపడకుండా, విద్య, వైద్యం ఉపాధి పూర్తిగా ప్రైవేట్ పరం అవుతున్న సంగతి ఉద్యమాలు పెద్దగా పట్టించుకోవట్లేదు కాని దీని వల్ల నష్టపోయేది 90 శాతం దళితులూ, ఆదివాసీలే. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు పూర్తిగా మూతపడే పరిస్థితి కనపడుతున్నా ప్రైవేట్ విద్యకు పాకులాడుతున్నాం కాని నాణ్యత గల ఉచిత, ప్రభుత్వ విద్య మన హక్కు అని మరిచిపోతున్నాం. ఇదే బలహీనతని ఆధారంగా తీసుకుని రీఎంబర్స్‌మెంట్ వచ్చి విద్యా విధానాన్ని మరింత అధ్వాన్నం చేసింది. స్టేట్ యూనివర్సిటీలలో 90 శాతం ఎస్సీ బీసీలు ఉన్న దగ్గర ఎటువంటి సదుపాయాలూ లేవు, మేధోపరంగా ఎదిగే అవకాశాలు అసలు కనపడట్లేదు.
దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తులు, శక్తులు అక్కడో, ఇక్కడో ఉన్నా కూడా ఇపుడున్న పరిస్థితుల్లో ఐక్య సంఘటనల పట్ల అనుమానాలు వ్యక్తపరుస్తూ, ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించడంలో విఫలమౌతున్నారు. ఒకవేళ ఉద్యమాలు చేద్దామన్నా కూడా దళిత దళారులను అగ్రకులాలు తమ గుప్పిట్లో పెట్టుకుని, పదవులు, డబ్బు ఆశ చూపించి అణచివేస్తున్న వైనం నిజంగా కలవరపెడుతున్న వాస్తవం. మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా ఉద్యమ దశ, దిశలను మార్చకుండా పోతున్నాం కూడా.
పోలీసు రికార్డ్‌లలో దళితులపై నేరాలకు అనేక కారణాలు చూపించినా ఫీల్డ్ అనుభవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అత్యాచారాలు, హింసలు, బహిష్కరణ, చేతబడి హత్యల పేరుతో జరుగుతున్న నేరాల వెనుక భూమి అనే అంశం బలంగా ఉంది అన్న విషయం కూడా మనం విస్మరిస్తున్నాం లేదా చూడడానికి నిరాకరిస్తున్నాం. అక్కడో ఇక్కడో వనరులు, భూమి మీద హక్కు గురించి మాట్లాడితే అది లెఫ్ట్, మావోయిస్ట్‌కి సబంధించిన అంశంగా సమస్యను పక్క దారి పట్టిస్తూ, మూలన పెడుతున్నారు. నిజానికి భూమి ఈ రోజుకి కూడా గ్రామాలలో గౌరవ చిహ్నమే. అధికారం, హక్కులు కూడా భూములు ఉన్న దగ్గరే భరోసాగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం కూడా ఎక్కువే. అసలే 80 శాతం ప్రజలకి భూమి లేదు అంటే ఆ ఉన్న భూమిని కూడా ప్రాజెక్టుల పేరుతోని, అభివృద్ధి పథకాలతోని, సెజ్జులు, ఇండస్ట్రియల్ పార్కుల పేరుమీద ఉన్న ఆ కాస్త భూములని అధికారికంగానే ప్రభుత్వాలు గుంజుకుని వీధిన పడేస్తున్నాయి. హిందూ రాజ్యాలు, ప్రభుత్వాలు భూమి విషయం పక్కన పెట్టడంలో కూడా ఉన్న కుట్రలను మనం అంచనా వేయగలగాలి. ఎక్కడో అత్యాచారం, హత్యలు జరిగితే తప్ప దళిత ఉద్యమ నాయకులు మాట్లాడే పరిస్థితి లేదు.
డా.అంబేద్కర్ స్పష్టంగా దళితులూ బానిసత్వం నుండి బయటకి రావాలంటే ముఖ్యంగా హిందూ మతంలోంచి బయటపడాలి అని, ఒక్క హిందూ మతమే మనుషులని వర్గాలుగా విభజిస్తుంది అని, హిందూ మతంలో ఉన్నంత కాలం అంటరానితనం సమసిపోదని పిలుపునిచ్చిన విషయం ఎప్పుడో మరిచినట్టున్నాం. అంతే కాకుండా ఆ విషయం పక్కకు పెట్టి మోడీ కాళ్ల దగ్గర అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. మోడీ దగ్గరకి పోవడం అంటే మన సమాధులు మనం తవ్వుకోవడం అన్న విషయాన్ని కప్పిపెడుతున్నారు. అంతేకాకుండా అంబేద్కర్ చెప్పిన మూడు బలాలు 1. మాన్ పవర్ 2. మనీ 3. మేధో సంపత్తి. వీటన్నింటికి ఇపుడు ఉన్న రాజకీయ వ్యవస్థకి సంబంధం ఉన్నదని గ్రహించాలి. ఇవన్నీ మనం కూడగట్టుకోవాలంటే మన శక్తి సరిపోదు కాబట్టి మనం తప్పకుండా బయట నుండి సపోర్ట్ తీసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. కాని ఇపుడు కొంతమంది మేధావులు బహుజన భజరంగ్‌దళ్ లాగా కులాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్న పేరుతోని మరింత కులవాదులుగా మారుతున్నారు.
మతం మార్పిడి, వర్గ నిర్మూలన, భూమి, వనరులపై అధికారం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్న ముఖ్య అంశాలని పక్కన పెట్టి, ప్రభుత్వ పథకాల కోసం అర్రులు చాస్తే ఇంకా కనుచూపు మేరలో ఈ పరిస్థితి మారదు. రిఫార్మ్ కాదు రివల్యూషన్ అన్న అంబేద్కర్ మాటలను మళ్లీ ఒక్కసారి చూసుకొని బోధించు, సమీకరించు, పోరాడు అన్న సిద్ధాంతాన్ని మళ్లొకసారి ఉద్యమ శక్తులతో కలిసి నిర్వచించి, నైపుణ్యంతో, కుల, వర్గ దృక్పథాలతో కలిసి వచ్చే వారందరితో విశాల ప్రాతిపదికన ఉద్యమాలు నిర్మించగలిగితే కొంత మార్పు సాధ్యమేమో చూడాలి.
సూరేపల్లి సుజాత
అధ్యాపకులు, శాతవాహన యూనివర్సిటీ

Andhra Jyothi Telugu News Paper Dated: 09/05/2014 

హక్కులడిగితే కక్షసాధింపు చర్యలా? By డాక్టర్ పసునూరి రవీందర్, వెంకటేష్ చౌహాన్, సిహెచ్. మల్లికార్జున్ బహుజన్ అకాడమిక్ రీసెర్చ్ సెంటర్


Updated : 5/8/2014 12:12:01 AM
Views : 15
హక్కులు ఒకరిని అడుక్కునే భిక్షకాదు, పోరాడి సాధించుకోవాలన్నాడు మార్టిన్ లూథర్‌కింగ్. జాతీయస్థాయి విశ్వవిద్యాలయాల్లో మాత్రం హక్కులకోసం నినదిస్తే, విద్యార్థులను యూనివర్సిటీల నుంచి బహిష్కరించి చదువుకు దూరం చేస్తున్నారు. దీం తో తెలంగాణ ప్రాంత అణగారిన కులాలకు చదువు మరోసారి అందకుండా చేసే కుట్ర జరుగుతోంది. హక్కులడిగితే కక్షసాధిం పు చర్యలకు పాల్పడుతున్నాయి పాలనాయంత్రాంగాలు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న ఒక జాతీయ స్థాయి విద్యాసంస్థలో ముగ్గురు విద్యార్థులను రస్ట్‌గేట్ (విద్యాసంస్థ నుంచి తొలగించడం) చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ రస్ట్‌గేషన్ వెనుక అగ్రవర్ణాలకు చెందిన వీసీతోపాటు కొంతమంది ప్రొఫెసర్ల స్వార్థపూరిత కుట్రదాగి ఉంది. ఇలాంటి ఘటనే ఇఫ్లూగా పిలువబడే ఇంగ్లీష్ అండ్ ఫారన్ లాంగ్వేజేస్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. విద్యార్థులను వేసవి సెలవులకు పంపించి, అక్కడి అధికార యంత్రాంగం ముగ్గురు విద్యార్థులను రస్ట్‌గేట్ చేసింది. 

ఈ రస్ట్‌గేట్‌కు పాల్పడ్డ కారణాలు అత్యంత అల్పమైనవి. ఈయేడాది రెండవ సెమిస్టర్ పరీక్షలు ముగిసే సందర్భంలో మార్చి నెలలో ఇఫ్లూలో ఉన్న లైబ్రరీని వీసీ సునయనసింగ్ మూసి వేయించారు. ఇలా మూసివేయడం వల్ల పోస్టుగ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థులకు నష్టం లేకపోవచ్చు.అయితే పరిశోధనలో ఉన్న విద్యార్థులకు మాత్రం లైబ్రరీ అత్యంత అవసరం. ఇందుకోసం సెంట్రల్ యూనివర్సిటీ వంటి విశ్వవిద్యాలయాల్లో లైబ్రరీ తెరిచి ఉంచే సమయాలను కుదించి రీసెర్చ్ స్కాలర్‌లకు పుస్తకాలను అందుబాటులో ఉంచుతా రు. కానీ, ఇఫ్లూలో మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ లైబ్రరీని మూసివేశారు. దీంతో స్థానికంగా ఉన్న విద్యార్థులు మా పరిశోధనలు ఏం కావాలని పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఇది వీసీకి మింగుడు పడ లేదు. సెలవులు ఇచ్చే వరకు గుట్టు చప్పుడు కాకుండా ఉండి, విద్యార్థులు ఎక్కువ మంది ఇళ్లకు వెళ్లిన తర్వాత పథకం ప్రకారం ముగ్గురు విద్యార్థులను రస్ట్‌గేట్ చేశారు.దీంతో ఇఫ్లూలోని విద్యార్థులతో పాటు ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి.అయినా పాలక మండలి నుంచిగానీ, వీసీనుంచిగానీ ఎలాంటి స్పందనలేదు. కారణం రస్ట్‌గేట్ చేసిన విధానం కక్షపూరితంగా ఉండడమే! 

ఇఫ్లూలో రస్ట్‌గేట్‌కు గురైన ముగ్గురిలో ఇద్దరూ తెలంగాణ విద్యార్థులే. ఒకరు ధారవత్ మోహన్. వరంగల్ జిల్లా మహబూబాబాద్ సమీపంలోని ఒక తండా నుంచి వచ్చి చదువుకుంటున్న గిరిజనుడు. ఇతని కుటుంబంలో ఇతడే మొదటి తరానికి చెందిన అక్షరాస్యుడు. మోహన్ వీసీకి వ్యతిరేకంగా గళమెత్తడమే పాపమైంది. చదువుకునేందుకు లైబ్రరీ తలుపులు తెరువమని నినదించడమే తప్పయింది. చదువులో ముందంజలో ఉండే మోహ న్, ఇప్పటికే కేంబ్రిడ్జ్, స్పెయిన్, జర్మనీ దేశాల్లో అనేక అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం తన పీహెచ్‌డీ సమర్పించే దశలో ఉన్నాడు. చదువుకొని ప్రయోజకుడై కన్న తల్లిదండ్రులకు బుక్కెడు మెతుకులు పెడుదామనుకున్న తన కలలను ఇక్కడి అగ్రవర్ణ పాలకమండలి కల్లలు చేయడానికి కుట్రలు చేస్తోంది. వెనుకబడిన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ స్కాలర్‌ను చదువుకు దూరం చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక మరోవిద్యార్థి సతీష్ నయినాల. అడవి బిడ్డల తల్లిఒడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సతీష్ వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినవాడు. విద్యార్థుల హక్కుల కోసం నినదించే ప్రతీపోరాటంలో ముందు నిలబడే సతీష్ అంటే వీసీతో పాటు మరికొంతమంది ప్రొఫెసర్లకు సైతం పడదు. అందుకే ముందుగానే చేసుకున్న వ్యూహం ప్రకారం సతీష్‌ను కక్షపూరితంగా రస్ట్‌గేట్ చేశారు. ఇక మూడవ విద్యార్థి అక్షరాస్యతలో వెనకబడిన బీహార్ రాష్ట్రానికి చెందినవాడు. ఎంఏ పూర్తి చేసుకొని, తిరిగివెళ్దాం అనుకునేలోపే వీసీ ఈరకంగా కక్షపూరితంగా సుభాష్ కుమార్‌ను కూడా రస్ట్‌గేట్ చేశారు. ఈ ముగ్గురు విద్యార్థులపై ఉన్న రస్ట్‌గేషన్ ఎత్తివేయాలని ప్రజా సంఘాలు ఇఫ్లూను సందర్శించాయి. అయినా ఇఫ్లూ అధికార యంత్రాంగం నుంచి స్పందన లేదు. అసలు దుర్మార్గానికి మూలా లు ఎక్కడున్నాయని వెతికితే అనేక ఆశ్చర్యకరసంగతులు తెలుస్తాయి.

ఇటీవల ఎక్కువసార్లు వార్తల్లో వినిపిస్తున్న ఉన్నత విశ్వవిద్యాలయాలు ఇఫ్లూ, సెంట్రల్ యూనివర్సిటీలే. అందుకు కారణం ఇక్కడ తరుచుగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలే. ఈ ఆత్మహత్యలకు యూనివర్సిటీల్లో ఉన్న అగ్రవర్ణ అధ్యాపకుల ఒత్తిడే కారణమని తేలింది. దీనిపై ఇటు ఇఫ్లూ, అటు హెచ్‌సీ యూ విద్యార్థిలోకం మండిపడ్డది. ఉన్నత చదువులు చదివే కిందికులాల విద్యార్థులపై వేధింపులకు కారణమైన సదరు ప్రొఫెసర్లను సస్పెండ్ చేయాలని డిమాం డ్ చేశారు. ఈ ఒత్తిడి ఇఫ్లూ వీసీ సునయనసింగ్‌ను ఇరకాటంలో పెట్టింది. దీం తో ఉద్యమాల్లో పాల్గొంటున్న విద్యార్థులను టార్గెట్ చేసి కక్షసాధింపు చర్యలకు ప్పాడుతోంది. మరోవైపు ఈ యూనివర్సిటీ నిధుల్లో సైతం విచ్చలవిడిగా అక్రమాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను విద్యార్థిసంఘ నాయకులు బట్టబయలు చేశారు. ఈ విషయం ఢిల్లీ స్థాయిలో అనేక కమిటీల దష్టికి వెళ్ళింది.అంతేకాకుండా ఇక్కడ ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ విద్యార్థుల పట్ల వీసీ ప్రవర్తిస్తున్న తీరుపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటు మైనారిటీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆయా కమిటీలు వీసీ సునయనసింగ్‌ను వచ్చి హాజరుకావాల్సిందిగా కోరాయి.అయినా ప్రభుత్వ పెద్దల అండ కలిగిన వీసీ ఆ పిలుపుల ను లెక్క చేయకుండా సమన్లను సైతం అందుకున్నారు. ఇట్లా తన ఇమేజ్‌ను దెబ్బతీసి, తన అవినీతిని బయటపెడుతున్నారని బెదరిపోయిన వీసీ మోహన్ ధారవత్, సతీష్ విద్యార్థి నాయకులను యూనివర్సిటీ నుంచి బయటికి పంపేందుకు రంగం సిద్ధం చేసుకున్నది.

విద్యార్థుల రస్ట్‌గేషన్ అనే మాట వినిపిస్తే ఎవరికైనా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటే గుర్తుకొస్తుంది. దశాబ్దకాలం క్రితం సెంట్రల్ యూనివర్సిటీలో పదిమంది దళిత విద్యార్థులను అప్పటి పాలనా యంత్రాంగం రస్ట్‌గేట్ చేసింది. దీనిపై రాష్ర్టవ్యాప్తంగా అప్పట్లో నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో యూనివర్సి టీ పాలనా యంత్రాంగం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూనే కాల పరిమితిని తగ్గించి, ఆ తరువాత రస్ట్‌గేషన్‌ను ఎత్తివేసింది. ఇఫ్లూ ఇలాంటి వివాదాల కు కేంద్రంగా మారింది. ప్రస్తుతం విద్యార్థుల రస్ట్‌గేషన్ కారణాలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. లైబ్రరీలోకి విద్యార్థులు పెద్దసంఖ్యలో చొచ్చుకు వస్తుండ గా ఒక అద్దంపగిలింది. ఆఅద్దం పగిలిన సమయంలో మోహన్‌ధారవత్‌గానీ, సతీష్‌గానీ అక్కడలేరు. ఆవిషయం లైబ్రరీ సిబ్బందే రాసిచ్చారు. అయినా అద్దం వీరే పగలగొట్టారని, నిందలు మోపుతూ తన అవినీతి బండారాన్ని కాపాడుకు నే ప్రయత్నం చేసింది వీసీ. ఏవిద్యాసంస్థలోనైనా ఆస్తి నష్టం జరిగినపుడు కమిటీ వేసి విచారణ జరిపిస్తారు. ఇఫ్లూలో మాత్రం అలాంటి విచారణేది జరగలేదు. ఆస్తినష్టం జరిగినపుడు ఆ విషయాన్ని శాంతిభద్రతల సమస్యగా భావించి చట్టానికి ఆ విషయాన్ని అప్పగించాలి. ఇవేవి చేయకుండానే చీకట్లోకి బాణమేసినట్టుగా నిందలు మోపి, ఎవరు చేతికి దొరికితే వారినే దోషులనడం సిగ్గుచేటు. సంఘటన స్థలంలో లేని విద్యార్థులకు ఇలాంటి విషయాలను ముడివేయడం కచ్చితంగా అగ్రకుల దురహం కారమే. వెనుకబడిన కులాల నుంచి వచ్చిన తెలంగాణ విద్యార్థులను చదువులకు దూరం చేసే కుట్రే. ఈ కుట్రను తెలంగాణ సమాజం ఖండించాలి. రస్ట్‌గేషన్‌ను ఎత్తివేసే వరకు తెలంగాణ విద్యార్థి లోకం, ప్రజా సంఘాలు ఇఫ్లూ విద్యార్థులకు అండగా నిలవాలి.

Namasete Telangana Telugu News Paper Dated: 8/5/2014  

Monday, May 5, 2014

వైకల్యాన్ని జయించిన మనిషి కథలు (అవిటి కథలు) By గిన్నారపు ఆదినారాయణ,


మనిషిని మనిషిగా ప్రేమించిన నాడే దేశం బాగుపడుతుంది. అలా కాకుండా మనిషిని ద్వేషించిన నాడు సమాజం పతనానికి దారి తీస్తుంది. నేడు సమాజంలో మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే- ఎవరి అస్తిత్వాన్ని వారు నిలుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సాహిత్య పరంగా గమనించినట్లయితే- స్త్రీ వాదం, దళిత వాదం, మైనారిటీ వాదం, బి సి వాదం అంటూ ఏర్పడ్డ అస్తిత్వ వాదాలు నేడు ఎవరి అస్తిత్వాని వారు గట్టిగా నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. స్త్రీ వాదం గురించి స్త్రీవాదులు- స్త్రీవాదేతరులు, దళిత వాదం గురించి దళిత వాదులు- దళితవాదేతరులు, మైనారిటి వాదం గురించి మైనారిటీ వాదులు- మైనారిటీవాదేతరులు, బిసి వాదం గురించి బిసి వాదులు- బిసి వాదేతరులు మాట్లాడుతూ, రాస్తూ తమ వాదాలను గట్టిగా చాటిచెబుతున్నారు. మరి ఈ అస్తిత్వ వాదులు- వికలాంగుల అస్తిత్వం గురించి ఎందుకు మాట్లాడడం లేదు? వికలాంగులకు ప్రత్యేక అస్తిత్వం లేదా? ఉంటే వారి అస్తిత్వాని నిలిపే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? ఇలాంటి సందర్భంలో- తెలుగు సాహిత్యంలో అవిటి కథలు-తో వేముల ఎల్లయ్య, సంపంగి శంకర్‌ వికలాంగులపై వచ్చిన సాహిత్యాన్ని వెలికి తీయడం గొప్ప సాహసం. సమాజంలో తమ అస్తిత్వాన్ని, గుర్తింపును నేటికీ వెతుక్కునే వికలాంగులు, సాహిత్యంలో కనిపించే తమ అస్తిత్వాన్ని తాము నిలబడి గుర్తించకపోవడం సామాజికంగా, చారిత్రకంగా సాహిత్యంలో తీరని లోటే.

ఈ సమాజంలో అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాల ప్రజలు నివసిస్తునారు. ఎవరికి వారే తమ తమ వర్గాలు, కులాలు, మతాలకు చెందిన వారికి సహాయ సహకారాలు చేసుకుంటున్నారు. వికలాంగులలో కూడా అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాలకు చెందిన వారు ఉన్నారు. అయినా వారిని మాత్రం ఎవరూ పట్టించుకోరు. అంటే వీరు మనుషులు కారా? ఆయా వర్గాలకి, ఆయా కులాలకి, ఆయా మతాలకి చెందినవారు కాదా? మొదటగా మనిషి ఏదో ఒక వర్గ, కుల, మత సమూహానికి చెందినవాడై ఉంటాడు. ఆ తర్వాత ఏదో అవయవ లోపం వల్ల వికలాంగుడుగా ఉండడం జరుగుతుంది. ఆయా వర్గ, కుల, మాతాలకు చెందిన రాజకీయ నాయకులు ఓట్లకోసం వచ్చేటప్పుడు ఎన్నో మాయ మాటలు చెబుతారు. ఓట్లువేసే సమయంలో వికలాంగులకు వాహనాలు ఏర్పాటు చేసి, మాయమాటలతో మభ్యపె ట్టి ఓట్లు వేయించుకుంటారు. ఆ తర్వాత వారి సమస్యలసై అసెంబ్లీలో కాని పార్లమెంట్‌లో కానీ ఏ ఒక్క పార్టీసభ్యుడూ మాట్లాడరు. వికలాంగులకు న్యాయం జరగాలని, వారిని అన్ని రంగాలలో ప్రోత్సహించాలని, తద్వారా వారు కూడా సకలాంగులతో సమానంగా పోటీ పడగలరని ఎవరూ మాట్లాడరు. ఎందుకు? కనీసం వికలాంగుల అవసరాలకు నెలకు సరిపోయేంత పెన్షన్‌ ఏర్పాటు చేయించరు. అధికారంలోఉన్న నాయకులంటే పదవుల సంబరంలో అన్నీ మరచిపోతున్నారనుకుంటే, మరి ప్రతిపక్షాలలో ఉన్న నాయకులు ఏం చేస్తునట్లు?

ఇటీవలి కాలంలో గత కొన్ని సంవత్సరాల నుండి మంద కృష్ణ మాదిగ వికలాంగుల కోసం ప్రత్యేకంగా పోరాడుతున్నారు. వికలాంగుల హక్కుల కోసం ఒక వ్యక్తి పోరాడుతున్నారంటే కనీసం మద్దతు ఇవ్వాలన్న ఆలోచన కూడా ప్రతిపక్ష నాయకులకు లేకుండా పోయింది. మద్దతు ఇవ్వడంవల్ల, ఆ గొప్పతనం సమస్యను మొదలు పెట్టిన వ్యక్తికి పోతుందని ఆలోచించారో, లేక వికలాంగుల కోసం పోరాడడం వల్ల ఏం వస్తుంది అని అనుకుంటున్నారో అర్ధం కావడం లేదు. నేటి పోటీ ప్రపంచంలో వికలాంగులు సైతం తమ కున్న పరిమిత రిజర్వేషన్లను ఉపయోగించుకొని అన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే కన్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన క్రిష్ణగోపాల్‌ సింగ్‌ అంధులలో మొట్ట మొదటగా ఐఏయస్‌ సాధించిన వ్యక్తి. తర్వాత హర్యానా రాషా్టన్రికి చెందిన అజిత్‌ కుమార్‌ ఐఏయస్‌ సాధించి, తాము కూడా అందరితో సమానంగా పోటీ పడగలమని నిరూపించారు. అలాగే నర్తకి సుధారామ చంద్రన్‌, నాట్య మయూరి అన్నపూర్ణ, విలియం క్రోయిజన్‌, ఇరవై ఒక్క మైళ్ళ పొడవున ఉన్న ఇంగ్లీష్‌ చానల్‌ ఈదిన వ్యక్తిగా హరిరామ కోహ్లి, అలాగే యమునా నదిని ఈదిన వ్యక్తిగా దీపా మాలిక మొదలైన ఎందరో వికలాంగులు పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ముఖ్యంగా అంధుల కోసం ప్రత్యేక లిపి తయారు చేసి, అంధులు చదువుకోవాలని ఆశించిన మహానుభావుడు లూయి బ్రెయిల్‌. ఇలా ఇంకా ఎంతోమంది వికలాంగులు చదువుకొని విద్య, ఉద్యోగ, ఆర్ధిక, రాజకీయ, సాహిత్య రంగాలలో పైకెదుగుతున్నారు.

ఇటీవలి కాలంలో సాహిత్య రంగంలో వీరిగురించి- అవిటి కథలు- అనే కథా సంకలనం వెలువడింది. ఇది గర్వించదగిన విషయం. సాహిత్యంలో వికలాంగుల బతుకు చిత్రణ చేసినవారు చాలా అరుదు. అవిటి కథలు కథాసంపుటిలో 25 కథలతో 204 పేజీల నిడివితో మన ముందుంచారు వేముల ఎల్లయ్య ,శంకర్‌ సంపంగి.
ఈ సంపుటిలో కుష్టాది కిష్టయ్య- కథను వేముల ఎల్లయ్య చాల గొప్పగా రాశాడు. ఇందులో కిష్టయ్య కుష్టాది కిష్టయ్యగా మారుతాడు. కిష్టయ్య- నర్సవ్వ భార్యా భర్తలు. కిష్టయ్య మాదిగ కులస్థుడు. వారి తాత ముత్తాతలు నిజాం పాలనలో నిజాంకు చెప్పులు కుట్టి, కచ్చురాలకు మూగలు, పట్టిలు కుట్టి, తుపాకులకు పౌచులు వార్లు కుట్టినందుకు భూమి ఇనాంగా ఇస్తారు. కిష్టయ్య ముత్తాతలు అప్పుడు భూమిని సాగు చేసేవారు. తర్వాత తర్వాత కాపులు, కరణాలు భూమికి శిస్తు కట్టాలని మాదిగలను హింసిస్తారు. తర్వాత కొన్ని రోజులకు కరువు రావడం వల్ల భూమి చేసుకోడానికి ఇబ్బంది పడి అందరూ కూలీలుగా మారుతారు. ఆ భూమిని కాపులు స్వాధీనం చేసుకుంటారు. తర్వాత కొన్ని రోజులకు రోజువారీ పని చేసి చాలీ చాలని తిండి తింటూ కుష్ఠు రోగం వచ్చి అనేక ఇబ్బందులు పడతాడు కిష్టయ్య. కిష్టయ్యకు ఇంటి పేరు మరొకటి ఉన్నా కుష్టి పేరుతో, కుష్టాది కిష్టయ్యగా పిలుస్తారు. తర్వాత కిష్టయ్య పట్నం వచ్చి వికలాంగుల కోసం, కుష్టాదివాళ్ళ కోసం పోరాడి భిక్షగాడిగా మారతాడు. సమాజంలో బీదవారికే అన్ని రోగాలు వస్తాయి. నిమ్న జాతుల వారిని ఇంకా నిమ్నంగా చూడడాన్ని ఈ కథ తెలుపుతుంది.

చూపున్న పాట కథను పతంజలి రాశారు. ఇందులో విశ్వనాథం పోలీస్‌ ఆఫీసరు. రోజూ డ్యూటీకి వెళ్లి వచ్చే దారిలో రోడ్డు పక్క ఒక గుడ్డివాడు మురళి వాయిస్తూ అడుక్కునేవాడు. ఒక రోజు విశ్వనాథం ఆ గుడ్డి వాని దగ్గర ఆగి నిల్చుంటాడు. ఆ గుడ్డివాడు తన మురళి ద్వారా గద్దర్‌ పాటలు పాడుతుంటాడు. విశ్వనాథం అతని దగ్గరికి వచ్చి- నువ్వు ఈ పాటలు ఎందుకు పాడుతున్నావు, అసలు నువ్వు ఎవ్వరు, ఎక్కడుంటావు, నువ్వు ఈ పాటలే ఎందుకు పాడుతున్నావు, నువ్వు నక్సలైటువా, కమ్యునిస్టువా- అని ప్రశ్నిస్తాడు. నువ్వు ఈ పాటలు పాడద్దు, దేవుడి పాటలు పాడితే ఎక్కువ డబ్బులు వస్తాయి- అని ఉచిత సలహాలు ఇస్తాడు. అసలు మురళి శ్రీ కృష్ణునిది (దేవుడి) కదా! నువ్వు దానితో గద్దర్‌ పాటలు ఎందుకు పాడుతున్నావు అంటాడు. చివరకు- నువ్వు నక్సలైటు- అని ఆ మురళిని కాలు కింద వేసి తొక్కేస్తాడు. నక్సలైట్ల పై ఉన్న కసిని ఆ గుడ్డి వానిపై చూపిస్తాడు. ఒక వ్యక్తికి ప్రజల సమస్యల పై రాసిన పాటలు పాడే హక్కు లేదా? ఇలా బతుకు దెరువు కోసం వచ్చిన గుడ్డివాడి బాధను అద్భుతంగా ఈ కథలో చిత్రించడం జరిగింది.

పెద్దరోగం- కథ కెమరా విజయ్‌ కుమార్‌ రాస్తూ వికలాంగుల్లో సైతం కుల వ్యవస్థ ఉందని తెలియ జేశారు. రవి ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాష్టారు. రవి ప్రతిభను గుర్తించిన రాష్ట ప్రభుత్వం- ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు ప్రకటిస్తుంది. జనాభా లెక్కల సేకరణలో అందరి కంటే ముందుగా తన బాధ్యత పూర్తి చేసినందుకు ఈ అవార్డు ఇస్తుంది. కాని ఆ అవార్డు రవికి ఇష్టం లేదు. జనాభా లెక్కలలో భాగంగా గ్రామంలోని అన్ని ఇండ్లు తిరుగుతాడు. చివరకు ఒక ఆస్పత్రికి వెళ్లి అక్కడి వారందరినీ చూసేసరికి రవికి జాలి వేస్తుంది. చాలా మంది కూడు, గూడు, గుడ్డ లేనివాళ్ళు ఇక్కడే జీవనం గడుపుతున్నారు. దేవుడికి ప్రార్ధన చేస్తూ అక్కడే ఉంటారు. రవి వారి దగ్గరకు వెళ్లి ఒక్కొక్క రోగి పేరు, ఊరు, కులం అన్ని వివరాలు రాస్తూ ఉండగా- మీ కులం ఏమిటి- అని అడిగితే వారు రెండవ కులం, మూడవ కులం అని సంఖ్యా రూపంలో చెపితే రవికి ఆశ్చర్యం కలుగుతుంది. వివరంగా అడిగితే వారు- రెండవ కులమంటే మాల అని, మూడవ కులం అంటే మాదిగ అని చెప్తారు. రవికి అలా ఎందుకు చెబుతున్నారో అర్థం కాలేదు. తర్వాత తర్వాత అందర్నీఅడిగే సరికి అర్ధం అయింది. వికలంగుల్లో కూడా కుల ప్రస్తావన ఉందని, తక్కువ కులం వాళ్ళను అగ్ర కులస్థులు కించపరుస్తూ, హేళన చేస్తారని. అందుకే రాష్ట ప్రభుత్వం ప్రకటించిన అవార్డును తిరిగి వెనక్కి పంపిస్తాడు. ఆసుపత్రిలో జరిగిన సంఘటనను చూసి- కీర్తి కోసమో, అపకీర్తి కోసమో ఈ అవార్డును తిరస్కరించడం లేదు. కేవలం ఆత్మసంతృప్తి కోసమే- అని, కుష్టు కంటే ముందు కులాన్ని నయం చేసే ఆస్పత్రులు ఈ దేశంలో రావాలని, కుల నిర్ములన జరగనిదే ఈ దేశం బాగుపడదని గొప్ప సందేశం తెలియజేశాడు రచయిత.

లచ్చిమి కథను పిట్టల శ్రీనివాస్‌ రాశారు. ఇందులో- ఒక వ్యక్తి అవిటి అయినంత మాత్రాన అన్యాయం న్యాయం అయిపోతుందా- అని ఈకథ ద్వారా చక్కగా ప్రశ్నించారు. లక్ష్మి నల్గొండ జిల్లాకు 20 మైళ్ళ దూరంలో మాడగుల పల్లిలో ఉంటుంది. ఆమె నల్లగున్నా అందమైనది. తల్లి దండ్రులకు ఒక్కతే బిడ్డ. చదువు చిన్నప్పుడే మానేస్తుంది. తర్వాత తాను పెద్దదయ్యేకొద్దీ తమ ఇంట్లో తానే అన్నీ చూసుకుంటోంది, వ్యవసాయానికి సంబంధించిన పనులతో సహా. ఆ ఊరి దొర కొడుకు కన్ను- లచ్చిమి మీద పడింది. ఒక రోజు లచ్చిమి ఒంటరిగా ఉండడం చూసి ఆమెపై అత్యాచారం చేసి, ఎవరికైనా చెబుతుందేమో అని ఆమె నాలుక కోసి వెళ్ళిపోతాడు. లచ్చిమి కొన్నిగంటల తర్వాత స్పృహలోకి వచ్చి, ఆ బాధతో ఇంటికి వెళ్ళలేక అక్కడనుండి రైలు పట్టాల వెంబడి నల్గొండకు వెళ్లి అక్కడ కొంత మంది వికలాంగులతో కలిసి బతుకుతుంటుంది. తర్వాత రాజు అనే అతనితో తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి- కోర్టులో దొర కొడుకు పై కేసు వేస్తుంది. దొర కొడుకు- లచ్చిమి మూగది కదా, అది తననేం చేస్తుందిలే అనుకొని దర్జాగా తిరుగుతుంటాడు. తర్వాత కోర్టులో లచ్చిమి మిషన్‌కు నాలుక పెట్టి జరిగిన విషయం అంతా చెబుతుంది. దొర కొడుకు అది చూసి బిత్తర పోతాడు. చివరకు అతనికి శిక్ష వేస్తుంది కోర్టు. తర్వాత, తన మిత్రులైన వికలాంగులతో తన ఇంటికి వెళ్లి, తన మిత్రులందరికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి, తన భూమిలో వారికి పనులు చూపి ఉపాధి కల్పిస్తుంది. తల్లి దండ్రులు ముందు బాధపడ్డా, తర్వాత ఆమె చేసే పనులు చూసి సంతోషిస్తారు. ఆమెను అవిటిని చేసినంత మాత్రాన అన్యాయం- న్యాయం అయిపోదు అని వికలాంగుల బాధల గాథƒను చక్కగా చిత్రించడం జరిగింది.

జేజి అనే కథలో భూతం ముత్యాలు తన అనుభవంలో చూసిన సంఘటనను చక్కగా రాశారు. జేజి ఓఅందమైన చురుకైన అమ్మాయి. ఆమెది నల్గొండ జిల్లాకు సమీపంలో ఉన్న బాషగూడ. నల్గొండ ప్రాంతం ఉప్పు నీళ్ళకు ప్రతీక. అక్కడ మొత్తం ఉప్పు నీళ్ళు కావడం వల్ల పిల్లలకు పసితనంలోనే పోలియో వచ్చి, కాళ్ళు- రెక్కలు పనిచెయ్యక పోయేవి. అలాంటి భాదితురాలే జేజి. జేజి బాల్యంలో కొంత బాగానే ఉన్నా, తర్వాత కొన్ని రోజులకు కాళ్ళు పూర్తిగా సన్నబడతాయి. బడికి వెళ్ళడం ఇబ్బంది అయ్యింది. అయినా బడికి ఇబ్బంది పడుతూనే వెళ్ళేది. అక్కడున్న బడి ఒక కుటుంబం లాంటిది. జేజి అంటే ఉపాధ్యాయులకు ఎంతో ఇష్టం. ఎందుకంటే జేజి తెలివికల్ల అమ్మాయి. జేజికి బడిలో ఏదన్నా తిందామన్నా, తాగుదామన్నా భయమేసేది. తింటే మలం వస్తుందని, తాగుతే మూత్రం వస్తుందని, అందుకోసం నడుస్తే ఇబ్బంది అని, తినలేక తాగలేక ఒంటరిగా కుమిలిపోతూ ఉండేది. సమాజంలో ప్లోరిన్‌ వల్ల పోలియోతో బాధ పడుతున్న ఇలాంటి సంఘటన ద్వారా రచయిత హృదయాన్ని కదిలింప జేశారు.
తనే కథ- అనే కథను పుస్తక సంపాదకుడు సంపంగి శంకర్‌ తన ఆత్మకథగా అద్భుతంగా తెలియజేశారు. తాను పుట్టినప్పటి నుండి, అనగా తనకు జ్వరం వచ్చి కాళ్ళు పడిపోయినప్పటి నుండి యస్‌యస్‌సి, ఇంటర్‌, డిగ్రీ, పీజిలో మిత్రులతో, చుట్టుపక్కల వారితో తాను పడ్డ అవమానాలు, పి హెచ్‌డి చదువుతూ నేడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వరకు తాను ఎదుర్కొన్న సమస్యలను, ఆటుపోట్లను చక్కగా వివరించారు. ఈ కథ తన ఆత్మకథగా చెప్పవచ్చు.

ఈ కథా సంపుటిలో ఉంగరం కథను యుసేఫ్‌ ఇంద్రిస్‌, అమ్మత్యాగం కథను కొమ్ము సతీష్‌, గుడ్డివాడు కథను రావులపాటి సీతారామారావు, ఎద్దు చస్తే ఎట్టమ్మా కథను డాశ్రీలత, ఒక తల్లి కథను పటేల్‌ సుధాకర్‌ రెడ్డి, అన్నీ మేమే చెయ్యాలా కథను అక్కినేని కుటుంబరావు, ఎంపు కథను చాగంటి సోమయాజులు, ఖరిదుల్లా పూల దుకాణం కథను సిద్ది, చెంచి అను కథను గూడూరు రాజేంద్ర రావు, ఇంతేనా ఈ బతుకులు కథను ఎ మోహన… మురళి, ప్రత్యామ్నాయం కథను కె. వరలక్ష్మి, ఊహలకే రెక్కలు వస్తే కథను ప్రవహ్లిక, అందని పిలుపు కథను పి జయశ్రీ, కను పాపాలు జిల్లెడుపాలు- కథను రాజేందర్‌ శంకవరవు, ఎదురీత కథను నాగరాజు అసిలేటి, ఉప్పనీరు కథను బోయ జంగయ్య, ఒంటికాలి శివుడు కథను బెజ్జారపు రవీందర్‌, చంద్రునిలో మచ్చలాంటిదే కథను కమలపాటి వెంకట శాంత లక్ష్మి, జ్ఞాన నేత్రం కథను చక్కిలం విజయలక్ష్మి రాశారు. ఈ అన్ని కథల్లో వికలాంగులు ఎదుర్కుంటున్న బాధల గాథలలు, సమాజం వారిని చూస్తున్న విధానం, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను రచయితలు కళ్ళకు కట్టినట్లు చూపారు.

Surya Telugu News Paper Dated: 5/4/2014 

Saturday, May 3, 2014

అంబేద్కర్ వెలుగులో మోదీ (గతానుగతం) - రామచంద్ర గుహ


Published at: 04-05-2014 02:50 AM
కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి కోట్లాది ప్రజలు అత్యుత్సాహంతో ఉన్న ఈ తరుణంలో నా ఆలోచనలు డాక్టర్ అంబేద్కర్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. దళితుల విమోచకుడుగా కంటే, ప్రజాస్వామిక సైద్ధాంతిక వేత్తగా అంబేద్కర్ దార్శనికత నా ప్రస్తుత ఆలోచనలకు ప్రేరణ. 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో అంబేద్కర్ చేసిన ఒక మహోపన్యాసాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకొంటున్నాను. మన రాజ్యాంగనిర్మాత ఆ ఉపన్యాసంలో మూడు హెచ్చరికలు చేశారు. రాజకీయ వ్యవహారాల్లో రాజ్యాంగబద్ధ పద్ధతులను విడనాడడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు, రాజకీయ ప్రజాస్వామ్య పరిమితులు, సామాజిక ప్రజాస్వామ్య ఆవశ్యకత గురించి ఆయన హెచ్చరికలు నేటికీ ఉపయుక్తమైనవి. అయితే ప్రస్తుతఎన్నికల నేపథ్యంలో, అంబేద్కర్ మూడో హెచ్చరికను తప్పక గుర్తుచేసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏ నిర్దిష్ట నాయకుడినీ, ఎంత మహోన్నతుడైనప్పటికీ, గుడ్డిగా అనుసరించవద్దని అంబేద్కర్ హెచ్చరించారు. ఆ సందర్భంగా ఉదారవాద తాత్త్వికుడు జాన్ స్టువార్ట్ మిల్‌ను మాటలను ఉటంకించారు. 19వ శతాబ్దికి చెందిన ఆ పాశ్చాత్య చింతకుడు ఇలా అన్నారు: 'ఒక ప్రజాస్వామ్య సమాజ పౌరులు తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, ఒక వ్యక్తి-ఎంత మహోన్నతుడయినప్పటికీ- నాయకత్వానికి పణంగా పెట్టకూడదు; తనకున్న అధికారాలతో రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే అవకాశమున్నందున అధికారంలో ఉన్న వ్యక్తిని ఎంత గొప్పవాడయినప్పటికీ విశ్వసించకూడదు'. అంబేద్కర్ ఇలా వ్యాఖ్యానించారు:
'దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తికి కృతజ్ఞతాబద్ధులై ఉండడం తప్పుకాదు. అయితే కృతజ్ఞతకు హద్దులు ఉండాలి ఐరిష్ దేశభక్తుడు డేనియల్ ఓ'కాన్నెల్ అన్నట్టు ఏ పురుషుడూ తన ఆత్మగౌరవాన్ని కించబరచుకునే విధంగా కృతజ్ఞత చూపలేడు; ఏ మహిళా తనకు మానహాని జరిగే విధంగా కృతజ్ఞత చూపలేదు; ఏ జాతీ తన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోల్పోయే విధంగా కృతజ్ఞతాబద్ధమై ఉండదు'. అంబేద్కర్ ఇంకా ఇలా అన్నారు: 'మరే ఇతర దేశంకటే భారతదేశం విషయంలో ఇటువంటి జాగ్రత్త మరింతగా అవసరం. ఈ దేశంలో భక్తి, వీరారాధన ఎక్కువ. ప్రపంచంలోని మరే ఇతర దేశ రాజకీయాలలో కంటే మన దేశ రాజకీయాలలోనే ఇవి ఎనలేని పాత్ర నిర్వహిస్తున్నాయి. మతంలో భక్తి మోక్ష సాధనకు తోడ్పడవచ్చు. అయితే రాజకీయలలో భక్తి లేదా వీరారాధన తప్పకుండా జాతి భ్రష్టతకు, అంతిమంగా నియంతృత్వ పాలనకు దారితీస్తాయి'.
అంబేద్కర్ ఈ మాటల ద్వారా, సాధారణీకరించిన ఒక హెచ్చరికను చేశారు. అయితే ఈ హెచ్చరిక చేయడంలో ఆయన మనసులో ఎవరైనా నిర్దిష్ట వ్యక్తులు ఉన్నారా? గాంధీ పట్ల భారతీయుల మితిమీరిన ఆరాధనను అంబేద్కర్ తొలినుంచి వ్యతిరేకించారు. స్వాతంత్య్రం పొందిన తొలినాళ్లలో జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్ భాయి పటేల్ తదితరులకు దేశ ప్రజల్లో బ్రహ్మాండమైన ప్రతిష్ఠ ఉండడాన్ని ఆయన గమనించారు. దేశ స్వాతంత్య్ర సాధనకు మహాత్మాగాంధీ నాయకత్వంలో ఆ నాయకులూ, వారి కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల సుదీర్ఘ పోరాటం చేశారు. అనుపమేయ త్యాగాలు చేశారు. కఠోర కష్టాలు పడ్డారు. కనుకనే అశేష ప్రజలు వారిని విపరీతంగా అభిమానించసాగారు. అంబేద్కర్ ఈ పరిణామాలన్నిటినీ గమనించారు. పర్యవసానాలు ఎలా ఉంటాయో అన్న విషయం ఆయన్ని కలవరపరిచాయి. గాంధీ, నెహ్రూలు జీవితపర్యంతం దేశసేవలోనే గడిపినందున వారి భావాలు, చర్యలు విమర్శకు అతీతమైనవా? సామాన్య పౌరులు ఎదురు ప్రశ్నించకుండా వారి మాటలను అనుసరించవలసిందేనా?
ప్రజలు నాయకులను గుడ్డిగా అభిమానించి, అనుసరించడంలో ఉన్న ప్రమాదాల గురించి జవహర్‌లాల్ నెహ్రూకు బాగా తెలుసు. 1937 నవంబర్‌లో కలకత్తా నుంచి వెలువడే 'మోడరన్ రివ్యూ'లో నెహ్రూ మీద ఒక వ్యాసం ప్రచురితమయింది. 'ఇతరుల పట్ల అసహనం, బలహీనులు, కార్యదక్షత లేని వారి పట్ల తిరస్కార వైఖరి' గురించి ఆ వ్యాసం పేర్కొంది. ఇటువంటి ధోరణులు నెహ్రూలో ఇప్పటికే బలవత్తరంగా ఉన్నాయని కూడా వ్యాఖ్యానించింది. అంతేకాదు 'జవహర్‌లాల్ త్వరలోనే తనను తాను ఒక సీజర్‌గా భావించుకోవచ్చునని' కూడా ఆ వ్యాసం హెచ్చరించింది. 'చాణక్య' అనే కలంపేరుతో నెహ్రూనే ఆ వ్యాసం రాశారని ఆ తరువాత వెల్లడయింది.
స్వీయ పరిమితులు, లోపాల గురించి నెహ్రూకు బాగా తెలుసు గనుకనే తన సీజరిస్ట్ ధోరణులను ఆయన అదుపులో పెట్టుకున్నారు. దీంతో పాటు తన సహచరులైన నాయకులు మహోన్నత రాజకీయ నేతలు అనే వాస్తవాన్ని నెహ్రూ బాగా గుర్తెరగడం కూడా అందుకు ఎంతైనా తోడ్పడింది. నెహ్రూ వలేకాక ఆయన తనయ ఇందిర ప్రజల చేత మరింతగా ఆరాధింపబడాలని ఆకాంక్షించే వారనడంలో సందేహం లేదు. 1969-74 మధ్య మూర్తీభవించిన జాతి స్ఫూర్తిగా ఆమె దేశ ప్రజల గౌరవ మన్ననలను పొందారు. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ, బంగ్లాదేశ్ విముక్తి సమరంలో పాకిస్థాన్‌పై సైనిక విజయం మొదలైన వాటి కారణంగా దేశప్రజలు తనను మరింతగా అభిమానించాలని ఇందిర కోరుకునే వారు.
సంఖ్యానేక భారతీయులు ఇందిరను ఆరాధించారు. సామాన్య ప్రజలే కాదు, రచయితలూ, కళాకారులూ కూడా. ఎమ్.ఎఫ్. హుస్సేన్ ఆమెను దుర్గగా చిత్రించారు. తన మాతృభాష అస్సామీలో చెప్పుకోదగ్గ కవి అయిన దేవకాంత్ బారువా అయితే 'ఇండియా అంటే ఇందిర, ఇందిరే ఇండియా' అని కూడా నినదించారు. ఇందిరాగాంధీ, ఆమె అభిమానుల ప్రవర్తన, రాజకీయాలలో భక్తి, వీరారాధన ధోరణుల ప్రమాదాలకు ఒక ప్రామాణిక ఉదాహరణ. ఇందిర పట్ల చూపిన ఆ ఆరాధనా భావం -అంబేద్కర్ హెచ్చరించిన విధంగా- జాతి భ్రష్టతకు, అంతిమంగా నియంతృత్వ పాలనకు దారితీసింది. తన అధికారానికి ముప్పు ఏర్పడినప్పుడు ఎమర్జెన్సీని విధించి తన ప్రత్యర్థులందరినీ జైలుకు పంపడానికీ ఆమె వెనుకాడలేదు కదా.
స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదట వ్యక్తి పూజ ప్రభవించింది ఇందిరాగాంధీ విషయంలోనే. విచారకరమైన విషయమేమిటంటే ఆ అప్రజాస్వామిక పరిణామాలు చోటుచేసుకోవడం అదే చివరిసారి కాదు. సరే, ఇప్పుడు నరేంద్ర మోదీ వ్యక్తిపూజ ప్రభవిస్తోందని మరి చెప్పనక్కర లేదు. కాంగ్రెస్ పార్టీ, కొన్ని ప్రాంతీయపార్టీల వలే భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ఒక నాయకుని నేతృత్వంలో లేదు. నిజానికి తమది ఉమ్మడి నాయకత్వంలోఉన్న పార్టీ అని బీజేపీ వారు సగర్వంగా చెప్పుకోవడం కద్దు. ఇప్పుడిదంతా మారిపోయింది. 2014 సార్వత్రక ఎన్నికల సందర్భంగా బీజేపీ అంతకంతకు తనను తాను ఒక వ్యక్తి సంకల్పానికి లొంగిపోతోంది. మోదీ ప్రచార యంత్రాంగం తొలుత ఆయన్ని పార్టీ రక్షకుడుగా, ఆ తరువాత జాతి రక్షకుడుగా కీర్తిస్తోంది. ఇతర బీజేపీ నాయకులూ మోదీకి పూర్తిగా విధేయులైపోయారు. ఆయన విధానాలను విమర్శనాత్మకంగా చూడడానికి నిరాకరిస్తున్నారు. బీజేపీ నాయకులకూ, కార్యకర్తలకూ మోదీ మాటే వేదం అయిపోయింది. ఇప్పుడు మనలనూ అదే రీతిలో మోదీని అనుసరించాలని కోరుతున్నారు!
విదేశాలలో 'అర్థరహిత మోదీ ఆరాధన' ఉన్నదని ఒక ఎడిటర్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఒక గొప్ప నాయకుడుగా మోదీ వ్యక్తి పూజను పెంపొందించడంలో విధేయులైన రచయితలు, పాత్రికేయులు పోటీపడుతున్నారు. ఒకప్పుడు ఇందిరకు దేవకాంత్ బారువాలాగా తామూ మోదీకి అలా మారాలని వారు ఆశిస్తున్నారు! నరేంద్ర మోదీ ప్రభుత్వ వ్యవస్థను ప్రక్షాళన చేస్తారని, ఏటా పది శాతం వృద్ధిరేటుతో ఆర్థిక వ్యవస్థను పెంపొందిస్తారని, పాకిస్థాన్, చైనాలను దీటుగా ఎదుర్కొంటాడని, భారత్‌ను గొప్ప అగ్రరాజ్యంగా రూపొందిస్తాడని తమ పాఠకులకు వారు హమీ ఇస్తున్నారు. సైబర్ రౌడీలు మరింత దురహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారు. తమ 'మహాపురుషుడిని' పొగడడంలో కంటే, ఆయన్ని వ్యతిరేకిస్తున్నవారిని తీవ్ర అసభ్య పదజాలంతో దూషించడం ద్వారా వారు తమ భక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ధోరణులు అంబేద్కర్‌ను ఎంతగానో భయపెట్టేవి. మనమూ, బహుశా వాటి విషయమై కలవరపడుతున్నాము.
n రామచంద్ర గుహ
 
Andhra Jyothi Telugu News Paper Dated: 4/4/2014 

'నోటా' కూడా అణచివేత సాధనమే! - By కొంగర మహేష్ , రీసెర్చ్ స్కాలర్, ఓయూ

Published at: 04-05-2014 02:52 AM
భారత ఎన్నికల చరిత్రలో 'నోటా' (నన్ ఆఫ్ ది ఎబౌ) అవకాశం ప్రజాస్వామ్య పరిపుష్టికి అవసరమయ్యే మరో ఆయుధం. ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ నచ్చకపోయినా మీటనొక్కి దిమ్మతిరిగే తీర్పు నిచ్చే అరుదైన అవకాశం ఓటరుకు దక్కడమే ఈ 'నోటా' (నిలబడ్డవాళ్లెవరూ నాయకుడిగా పనికిరారన్నది) అసలు ఉద్దేశం. ఓటు అనే ఖడ్గానికి మరింత పదునుపెట్టి ఈ 'నోటా' మీట అసలు లక్ష్యం కూడా ప్రజాస్వామ్య పరిరక్షణే. తమకు సుపరిపాలన అందించే సమర్థ నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటుకో బలమైన విలువ చేకూర్చడం దీని కర్తవ్యం. 'నోటా'ను గత ఏడాది సెప్టెంబర్ 17 తదుపరి ఎన్నికల నుంచి అమలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ నోటా సదుపాయాన్ని భారత్‌తో సహా మరో 11 దేశాలు తమ ఎన్నికల్లో వినియోగించుకుంటున్నాయి. అక్రమ సంపాదన, అవినీతి సొమ్ము, నల్లధనం.. ఇలా పేరేదైనా ప్రజాస్వామ్యాన్ని 'ధన'స్వామ్యంగా మార్చి చట్టాలను చుట్టాలుగా వినియోగించుకునే ఖద్దరు నేతలకు నోటా ఓ ఖబడ్దార్ వంటిది.
అంతటి బృహత్తర ఆశయంతో రూపుదిద్దుకున్న నోటా మీట నుంచి ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు ఆదిలోనే గుదిబండగా మారుతోంది. అదీ కూడా కుల 'తంత్రం'తో ముడిపడి ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధుల ఎన్నికకు ప్రతిబంధకంగా మారడం ఆందోళనకరం. గత ఏడాది డిసెంబర్‌లో ఢిల్లీ, మిజోరాం, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా నోటా మీటను వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఓటర్లకు అవకాశం కల్పించింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటర్లు'నోటా' హక్కును ఎలా వినియోగించుకున్నారు? ఏయే సెగ్మెంట్లలో నిలబడిన అభ్యర్థుల పట్ల తమ అసంతృప్తిని వెలబుచ్చారన్న అంశాలపై జాతీయ మీడియా సంస్థ ఒకటి జరిపిన పరిశోధనలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పై రాష్ట్రాల్లో మొత్తం 630 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 400 జనరల్ స్థానాలుండగా మిగిలిన రిజర్వ్‌డ్ స్థానాల్లో దాదాపు 25 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లోనే నోటా ఎక్కువ నమోదయింది. మళ్ళీ ఇందులోనూ 23 స్థానాలు ఎస్టీ (గిరిజన) రిజర్వ్‌డ్ స్థానాలు కావడం కులాధిపత్య సమాజ నూతన పోకడలకు నిలువుటద్దం. వీటిల్లో టాప్ ఐదు స్థానాల్లో నోటా నమోదును పరిశీలిస్తే.. తమకు రిజర్వ్‌డ్ అభ్యర్థులెవరూ నచ్చలేదని చత్తీస్‌ఘడ్ బీజాపూర్ - 7179 ఓట్లు (పది శాతం), చిత్రకోట్ 10848 (తొమ్మిది శాతం), దంతేవాడ -9677 (తొమ్మిది శాతం), మధ్యప్రదేశ్‌లోన జున్నార్ దేవ్ -94,12 (ఆరు శాతం), నారాయణ్‌పూర్ (చత్తీస్‌ఘడ్)-6731 (ఆరు శాతం) మంది ఓటర్లు నోటా వినియోగించారు. ఢిల్లీలోని 4 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల్లోనూ 'నోటా' మీట ప్రబలంగానే వినియోగించుకున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని ఆ సంస్థ తెలిపింది.
కేవలం 5 రాష్ట్రాల్లోని 630 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో నోటా మీట నొక్కడం భయాందోళనకు గురి చేస్తే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న 543 లోక్ సభ స్థానాలు (84-ఎస్సీ, 47-ఎస్టీ రిజర్వుడ్ స్థానాలు), 294 (తెలంగాణ, సీమాంధ్ర) అసెంబ్లీ నియోజకవర్గాల (ఎస్సీ-48, ఎస్టీ-19 రిజర్వుడ్ స్థానాలు) ఎన్నికలు కలవరం కలిగిస్తున్నాయి. ఎన్నికల వేళ కోటానుకోట్ల రూపాయల పంపిణీకి పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎప్పుడో కలుషితమై పోయాయి. కులం, ధనం, ప్రధాన ఇంధనాలుగా సాగుతున్న ఈ ఎన్నికల్లో నోటా మీట భారీగానే నమోదవుతుందని ఓఅంచనా. దేశంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మనువాద నిచ్చెనమెట్ల రాజకీయపార్టీలన్నీ చట్టబద్ధ రిజర్వేషన్ల కారణంగా తప్పనిసరై తమకు నచ్చినవారిని, అనుచరులు, అతికొద్దిమంది విద్యావంతులు, కాస్తో కూస్తో ఆర్థికంగా స్థిరపడ్డ ఎస్సీ, ఎస్టీలనే బరిలోకి దింపాయి. వారే ఎంపీ, ఎమ్మెల్యేలుగా రిజర్వ్‌డ్ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు.
మన ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఒక పార్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో నిలబెట్టిన అభ్యర్థుల ఆర్థిక బలాబలాలు పరిశీలించిన మీదటనే టిక్కెట్లు కేటాయించినట్లు ఆరోపణలు బహిరంగంగానే గుప్పుమన్నాయి. రిజర్వ్‌డ్ స్థానాల్లో అగ్రకులాల జనాభా పరిమితంగా ఉన్నా ప్రాబల్యం బలంగానే ఉంటుంది. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే, ఎస్సీ, ఎస్టీ నియోజవర్గాల్లో ఓటింగ్ శాతం 60 శాతంలోపే. కారణం ఆయా వర్గాలు ఓటు హక్కు వినియోగించుకునే అధికార యంత్రాంగం చేపట్టే కార్యక్రమాలు నామమాత్రంగా ఒకటికాగా అక్కడి 'మరింత చైతన్యవంతులైన అగ్రకులాలకు ఓటు వేసేంత సమయం ఉండకపోవడం మరో కారణం. ఇక చివరికి తప్పక ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళేమో నోటా నొక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పై తెలిపిన 5 రాష్ట్రాల్లో జరిగిన ఓటు వినియోగాన్ని చూస్తే ఆశ్చర్యం, ఆందోళన కలుగకమానదు. మిగతా జనరల్ స్థానాల్లో కంటే ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో నోటా వినియోగం అధికంగా ఉందంటే అక్కడ సమర్థ నాయకుడు లేడని కాదు.
అసలు 'రిజర్వ్‌డ్' స్థానాలు ఉండకూడదని, అంతటా అగ్రకులాలే నిలబడాలని, రాజ్యమేలాలనేదే అసలు రహస్యం. ఒకవేళ అగ్రకులాలు, ఓబీసీల దృష్టిలో ఆ రిజర్వ్‌డ్ స్థానాల్లో నిలబడ్డ అందరూ అసమర్థ అభ్యర్థులే అనుకుంటే మిగతా 400 స్థానాల్లో నిలబడ్డ ఓబీసీ, జనరల్ కేటగిరిలకు చెందినవారంతా సమర్థులా? సమర్థత అనేది కులం ఆధారంగా కంటే వ్యక్తి తన వ్యక్తిత్వం, వనరుల, పార్టీ అధినాయకత్వం ఇచ్చే మద్దతుపై ఆధారపడి ఉంటుంది. కానీ కుల పునాదులపై రూపుదిద్దుకున్న భారత దేశంలో పుట్టుకతోనే ఆ వ్యక్తి బలం, బలహీనతలు నిర్ణయించబడుతున్నాయి. లోకజ్ఞానం, ఉన్నత చదువులు, ఆస్తులు, అంతస్థులు సంపాదించుకున్నా ఇక్కడ కులమే ప్రామాణికం. దాని పర్యవసానమే ఎ స్సీ, ఎస్టీల అభ్యర్థుల 'తిరస్కరణ' కారణం. నేటి ఆధునిక సమాజంలో రాజులు పో యినా, రాజ్యాలు కూలినా రోజురోజుకు కుల నిర్మాణం మరింత దృఢమవుతోంది. ఏ కులానికాకులం మరింత దగ్గరవుతూ హక్కులు, ఆత్మగౌరం అంటుంది. ఇప్పటిదాకా అగ్రకులాల జాబితాలో ఉన్నవి కూడా పేదరికం పేరుతో రిజర్వేషన్లు కావాలంటున్నాయి. కుర్చీని కాపాడుకునేందుకు అమాత్యులు ఆ రకంగానే అడుగులు వేస్తూ కుంపట్లకు ఆజ్యం పోస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లోనూ కులం ప్రాతిపదికగానే నాయకత్వ ఎంపిక జరుగుతుండటం సామాజిక తిరోగమనానికి నిదర్శనం.
ఒకనాడు నోరులేని జనానికి తానై గొంతుగా నిలిచి చట్టసభల్లో గొంతుకనిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్‌నే ముపుప్పతిప్పలు పెట్టిన ఈ సమాజం.. ఆధునికతను అందిపుచ్చుకొని అందివచ్చిన అవకాశాలు, చట్టాలన్నిటినీ తనకనుగుణంగా మలుచుకుంటోంది. అప్పట్లో ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానంలో అంబేద్కర్ పోటీ చేసినప్పటికీ ప్రశ్నించే నాయకుడు చట్టసభల్లో అడుగుపెడితే తమగొంతు మూగబోతుందని గ్రహించిన అగ్రకుల ఓటర్లే ఆయనకు ఓట్లు పడకుండా చేశారు. రిజర్వ్‌డ్ స్థానం నుంచి పోటీచేసే అభ్యర్థులు తమ చెప్పుచేతుల్లో ఉంటేనే తప్ప ఓటు వేస్తానంటుందే తప్ప సమర్థతకు విలువ నివ్వరు. ఈ నేపథ్యంలో కులం ఇప్పటికీ కొనసాగుతున్న 60 ఏళ్ళ గణతంత్ర భారతంలో నోటా మీట అగ్ర వర్ణాలకు ఉపకరిస్తుందా అన్న భయం అణగారిన ప్రజల్లో మొదలైంది. విచక్షణ కోల్పోయి వివక్షకు దారితీసే నోటాపై చర్చ జరగాలి. చట్టసభల్లో వినిపించే గొంతును 'చట్టబద్ధ'మైన పద్ధతిలోనే నొక్కేస్తే, లక్ష్యం పక్కదారిబట్టి, నోట్లో మట్టికొట్టే పథకమైతే దాన్ని ఎత్తివేయడమే మేలు. కేవలం ఎస్సీ, ఎస్టీలు పోటీ చేస్తున్న చోట నోటా దుర్వినియోగమైతే ఆ స్థానాల్లో దాని రద్దే శరణ్యం. ఏదేమైనా నోటాపై జరిగే చర్చలు, సమాలోచనలు చివరికి క్యాండిడేట్ 'రీకాల్'కు దారితీసినా ఆమ్ ఆద్మీకి ఆమోదయోగ్యమే. ఓటుకు నోటుఅంటూ వచ్చే నాయకులకు నోటా ఓటా అని ఎదురు ప్రశ్నించే రోజులు ప్రతి ఓటరుకు రావాలి.

కొంగర మహేష్

Andhra Jyothi Telugu News Paper Dated: 4/4/2014 

Friday, May 2, 2014

సామాజిక తెలంగాణలో వంచన! By దామిశెట్టి రామాకోటేశ్వర్ రావు


లోపించిన సామాజిక కోణం 
వంచనకు గురైన ఉద్యమ బిడ్డలు 
నీరు గారిన ఉద్యమ హామీలు 
నిరాశలో విద్యార్ధి, యువజనులు 
కల్లలుగా మారిన బడుగు వర్గాల కలలు 
ఎవరికి బంగారు తెలంగాణ రాబోతోంది? 
మరో పోరాటం తప్పని పరిస్థితులు ్చ 

ఉద్యమాలే ఊపిరిగా, ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటే ధ్యేయంగా అర్ధశతాబ్దానికిపైగా నిరసనకారుల గుండెల్లో, కళాకారుల ప్రదర్శనల్లో, కవుల కలాల్లో, వాగ్గేయకారుల గొంతుకల్లో రణన్నినాదమై ఉవ్వెత్తున ఎగసిపడిన తెలంగాణ పోరాటం దేశంలోనే ఓ మహోజ్వల ఉద్యమఘట్టం. సుదీర్ఘ ఉద్యమ చరిత్ర కలిగిన తెలంగాణ భారత భౌగోళిక చిత్ర పటంపై 29వ రాష్ర్టంగా, తొలి భాష వియుక్త రాష్ర్టంగా ఆవిర్భవించాక పోలింగ్‌ ముగిసిన మొట్టమొదటి ఎన్నికలు పార్టీల పరంగా అధికారం కోసం సాగుతున్న అంతర్యుద్ధం, అస్తిత్వం కోసం జరుగుతున్న ఆఖరి యుద్ధంలా సాగాయి. సంపూర్ణ తెలంగాణ ప్రజలు కోరుకున్నదొకటి, జరుగుతున్నది మరొకటి. ప్రజలు ఆకాంక్షలు, ఆశయాలకు భిన్నంగా సామాజిక తెలంగాణకు వ్యతిరేకంగా అడుగడుగునా రాజకీయ వంచన పర్వం వేళ్ళూనుకు పోతోంది. 

తెలంగాణ పునర్నిర్మాణం పేరిట అన్నీ పార్టీలు ఉద్యమ బిడ్డల్ని వంచించే ప్రయత్నాలకు ఏమాత్రం చరమగీతం పాడకపోగా వాటిని మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి. 16వ లోక్‌సభ ఎన్నికలలో దేశంలోనే అతి ఖరీదైన రాజకీయాలు నడుస్తున్న నయా రాష్ర్టంగా తెలంగాణ మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే టి.పి.సి.సి. అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించినట్లుగా విస్వసనీయతకు- విస్వాసఘాతుకానికి జరిగిన ఎన్నికలివి. ప్రత్యేక రాష్ర్టం కోసం అసువులు బాసిన అమరవీరుల ఆశయాలను జెండాగా మార్చి దాని నీడలో రాష్ర్ట పునర్నిర్మాణమంటూ పొంతనలేని అజెండాలతో తెలంగాణ ప్రజలను మరింతగా వంచించేందుకు నిస్సిగ్గు రాజకీయాలకు పాల్పడుతున్నాయి కొన్ని బూర్జువా పార్టీలు. త్వరలో ఈ సార్వత్రిక ఎన్నికలను రాజకీయ పార్టీలు తమ తమ అధికార బలప్రదర్శనకు వేదికగా మార్చుకోగా, సామాజిక తెలంగాణ ఆశయసాధకులకు అదొక బలిపీఠంగా మారింది. చీమలు పెట్టిన పుట్టలు పాములకు స్థావరమైనట్లుగా- నవతెలంగాణ రాష్ర్టం నిరుద్యోగ రాజకీయ పార్టీలు, సంస్థలకు కోరకపోయినా లభించిన వరంగా మారింది. 

ఉద్యమ సమయంలో కలుగులో ఉన్న చిన్న చితక పార్టీలు, రాజకీయ సామాజిక ఉద్యమ సంస్థలన్నీ తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకు ఎన్నికల వేళ ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. విద్యార్ధులు, యువతీయుకుల భుజంస్కంథాలమీద సాగిన తెలంగాణ చివరి దశ ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టంలో నేడు రాజకీయ ఆధిపత్యం, అధికార సాధనల కోసం కొన్ని పార్టీలు అర్రులు చాస్తున్నాయి. సామాజికన్యాయం కోసం జరిగిన సాయుధ పోరాట చరిత్ర కలిగిన పురిటి గడ్డను రాజకీయ రణరంగంగా మార్చివేస్తున్నారు కొందరు స్వార్ధపరులు. భూస్వామ్య పెత్తందారి దొరల తెలంగాణలో సామాజిక రుగ్మతలు, వర్గ వైషమ్యాలు లేని పునర్నిర్మాణమే ప్రజల ఆకాంక్ష. అందుకు భిన్నంగా అగ్రవర్ణ పాలక వర్గాల ఆధిపత్యానికి ఈ ఎన్నికలనుండే బీజం పడింది.

ఒకనాటి ఉద్యమ సంస్థగా ఉన్న టిఆర్‌ఎస్‌, తెలంగాణ ఏర్పాటు అనంతరం కనుమరుగై పోతుందని అన్నీ పార్టీలు ఊహించినదానికి భిన్నంగా నేడు అది బలమైన రాజకీయ పార్టీగా ఎదిగి అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో అభ్యర్ధులను నిలపడమే కాకుండా, ఈ ఎన్నికల్లో బరిలో దిగుతూ శతాబ్దాలు, దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుండటం ఆశ్చర్యకరƒ పరిణామం. తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు పరిశీలిస్తామని సూత్ర ప్రాయంగా అప్పట్లో అంగీకరించారు కేసిఆర్‌. అదే విధంగా టిఆర్‌ఎస్‌ గెలిస్తే తెలంగాణలో దళిత వ్యక్తిని సిఎం చేస్తామని ప్రకటించారు. కానీ ఈ రెండు విషయాలు ప్రస్తుతం ఆయన విస్మరించి ఓట్ల కోసం ప్రచారానికి బయలు దేరడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. బడుగు, బలహీన వర్గ ప్రజలు అత్యధికంగా ఉన్న తెలంగాణలో ఆయా వర్గాల ప్రజల తరపున ఈ ఎన్నికలలో సీట్ల కేటాయింపులలో సముచిత ప్రాధాన్యం ఇవ్వని ఆయన- రానున్న ఏడేళ్ళలో బంగారు తెలంగాణను నిర్మిస్తామని చేస్తున్న ప్రకటనల అంతరార్ధం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. 
తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది తామే గనుక ఓటర్ల ఆదరణ తమకే ఉంటుందనే భ్రమలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ- టిఆర్‌ఎస్‌ ఇచ్చిన అనూ„హ్య షాక్‌తో- తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ శల్య సారథ్యం చేయాల్సిన అగత్యం ఏర్పడింది. దీంతో ఈ ఎన్నికలు కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, టిడిపి కూటములకు రెఫరెండమ్‌గా మారగా, వైఎస్సార్‌సిపి, వామపక్ష, ఇతర పార్టీలు అస్తిత్వ పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్నాళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కోసం ఊపిరి సలపని ఉద్యమాలు నడిపిన ప్రజలు అతి తర్వరలోనే తిరిగి- సంపూర్ణ సామాజిక తెలంగాణ కోసం ఉద్యమించాల్సిన పరిస్థితులను కొన్ని పార్టీలు వ్యూహాత్మకంగా తీసుకొస్తున్నాయి. 

119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలున్న తెలంగాణ ప్రాంతంలో అధికారిక లెక్కల ప్రకారం 50.07 శాతం మంది బిసిలు, 15.8 శాతం మంది ఎస్సీలు, 8.9 శాతం మంది ఎస్టీలు, 12.4 శాతం మంది ముస్లిం మైనారిటీలు, 12.87 శాతం మంది మాత్రమే అగ్రవర్ణ కులాలవారున్నారు. ఈ ఎన్నికల్లో బిసిలు నిర్ణాయక శక్తిగా ఉన్నప్పటికీ టిఆర్‌ఎస్‌ పార్టీ 12.87 శాతం ఉన్న ఓసిలకి ఏపార్టీ కేటాయించని విధంగా అత్యధికంగా 47 శాతం సీట్లు (56) కేటాయించింది. బిసిలని 23 శాతం సీట్ల (26)కే పరిమితం చేసింది. 12.4 శాతమున్న ముస్లిం మైనారిటీలకు కేవలం 3.36 శాతం సీట్లు (4) కేటాయించి సమన్యాయాన్ని గాలికి వదిలేసింది. అదే విధంగా 15.8 శాతం జనాభా ఉన్న ఎస్సీలకు 10.9 శాతం సీట్లు మాత్రమే కల్పించి- బడుగు, బలహీన వర్గ ప్రజల పట్ల తమ వివక్షను చాటుకుంది. 

మొదటినుండీ బిసిని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చిన టిడిపి సీట్ల కేటాయింపులో సామాజిక నమన్యాయాన్ని పాటించిందనే చెప్పాలి. జనాభా దామాషా ప్రకారం ఓసిలకు రెట్టింపు టిక్కెట్లు కేటాయించినా, 37.5 శాతం సీట్లు బిసిలకే వెచ్చించి చిత్తశుద్ధిని చాటుకుంది. అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ కూడా 37 శాతం టిక్కెట్లను బిసిలకు కేటాయించడం చెప్పుకోదగ్గ అంశం. లెక్క ప్రకారం ప్రతి పార్టీ ఓసిలకు 12 నుండి 15 అసెంబ్లీ స్థానాలను మాత్రమే కేటాయించాలి. కానీ టిఆర్‌ఎస్‌ పార్టీ 56, కాంగ్రెస్‌ 41 స్థానాలు కేటాయించగా- టిడిపి మాత్రం 25 స్థానాలకు మించి ఇవ్వకపోవటం గమనార్హం. కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీల పట్ల వివక్షను విడనాడలేదు. 12.4 శాతం ఉన్న ముస్లిం మైనారిటీలకు 4.5 శాతం టిక్కెట్లు (5) కేటాయించింది. టిడిపితో పొత్తుపెట్టుకున్న బిజెపి సైతం తమకు దక్కిన 47 అసెంబ్లీ స్థానాల్లో 26 శాతం (12) టిక్కెట్లను బిసిలకు కేటాయించడం విశేషం. తెలంగాణలో ఓసి యేతర శక్తుల వాటా 89.3 శాతం కాగా, వారికి ఈ ఎన్నికలలో సామాజిక న్యాయ వాటా 45.2 శాతం మాత్రమే. 
13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను బరిలో నిలిపిన వైఎస్సార్‌సిపి సైతం 7 స్థానాలకు ఏకంగా రెడ్డి సామాజిక వర్గీయులకే కట్టబెట్టి, మొత్తం 70 శాతం టిక్కెట్‌లను ఓసిలకే కేటాయించింది. సామాజిక తెలంగాణ ధ్యేయమని చెప్పుకునే పార్టీల చిత్తశుద్ధి ఇదేనా? 

తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిల్చిన యువతకి అన్నీ పార్టీలు తీరని ద్రోహం చేశాయి. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను టిడిపి, బిజెపి కూటమి- ఓసి యేతరలకు 52 శాతం సీట్లు, కాంగ్రెస్‌ 53 శాతం సీట్లు, టిఆర్‌ఎస్‌ 44 శాతం సీట్లు కేటాయించాయి. వీటిలో కేవలం 10 శాతం సీట్లు కూడా అమరవీరుల తరఫున కృతజ్ఞతగా యువలోకానికి ఏ పార్టీ కల్పించకపోవడం దారుణమైన అంశం. అధికార కాంగ్రెస్‌ పార్టీని మినహాయిస్తే టిఆర్‌ఎస్‌, బిజెపి- టిడిపి కూటమి ఎస్సీ, ఎస్టీ, బిసిలకు సీట్ల కేటాయింపులో సముచితన్యాయం చేశాయనే చెప్పాలి. ఇక వైఎస్సార్‌సిపి విషయానికొస్తే 70శ ాతం సీట్లు ఓసిలకే కట్టబెట్టింది. సామాజిక తెలంగాణ కోరుకునే ప్రతిఒక్కరూ ఏ పార్టీ ఓసియేతరలకు పెద్దపీఠ వేసిందో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. 

ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా మారిన 89.3శాతం ఓసియేతర శక్తులకు టిడిపి కూటమి అత్యధికంగా 52 శాతం సీట్లు కేటాయించింది. ముఖ్యమంత్రిని కూడా బిసినే చేస్తామని టిడిపి ప్రకటించింది. దళిత వ్యక్తిని సిఎం చేస్తానని తొలుత ప్రకటించి ఆ తర్వాత మాట మరచిన టిఆర్‌ఎస్‌ అధినేత ఏ మేరకు సామాజిక తెలంగాణను తెస్తారో ప్రజలు అర్ధంచేసుకోవాలి. టిడిపి కూటమితో సమానంగా బిసిలకు అసెంబ్లీ సీట్లను కేటాయించిన కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు, సీట్లు కోసం తప్ప, తెలంగాణ ప్రజలపై ప్రేమతో రాష్ట్రాన్ని విభజించలేదనేది కూడా బడుగు, బలహీన వర్గ ఓటర్లు తెలుసుకోవాలి. తెలంగాణ ఆవిర్భావానంతరం జరుగుతున్న తొలి ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో బిసిలకు అన్యాయం చేసిన పార్టీలేవో ప్రజలు గమనించాలి. సంపూర్ణ సామాజిక తెలంగాణ ఏ పార్టీతో సాధ్యమో గుర్తెరగాలి. 29వ రాష్ర్టం భవిష్యత్తు- తెలంగాణలో ఉన్న 89 శాతం బడుగు, బలహీన వర్గ ప్రజలు తీసుకున్న నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. దొరల పాలనకు చరమగీతం పాడాలంటే ఓసియేతర శక్తులు సంఘటితం కావలసిఉంది. అప్పుడే సామాజిక తెలంగాణ, తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమనే వాస్తవాన్ని గ్రహించాలి.

Surya Telugu News Paper Dated: 3/5/2014