Dalit Information and Education Trust (DIET)

Showing posts with label కులం వర్గం. Show all posts
Showing posts with label కులం వర్గం. Show all posts

Monday, April 4, 2016

మార్క్సి‌స్టు‌దృక్కోణంలో కులం By -ప్రభాత్‌ పట్నాయక్‌ అనువాదం: నెల్లూరు నరసింహారావు


Tue 05 Apr 03:57:25.161118 2016
కుల అణచివేతతో సహా అన్ని రకాల అణచివేతలకూ వ్యతిరేకంగా జరిగే అన్ని పోరాటాలూ పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయటమనే ప్రధాన లక్ష్యాన్ని విస్మరించకుండా వుండేందుకే మార్క్సిజంలో 'వర్గం' అనే భావనకు అంత ప్రాధాన్యత ఏర్పడింది. అంతేకాకుండా అన్ని పోరాటాలూ ఆ అవసరంలో భాగంగా ఉండితీరాలని మార్క్సిజం చెబుతున్నది.

                దేశంలోని అనేక ఉన్నత విద్యా సంస్థలపైన హిందుత్వ శక్తులు దాడులు చేస్తున్న నేపథ్యంలో కులం గురించి వామపక్ష మేథావులలో ఒక నూతన చర్చ మొదలయింది. కుల అణచివేత సమస్యను మార్క్సిస్టు దృక్పథంతో అర్థం చేసుకుంటున్న తీరును ఈ చర్చ మరోసారి ముందుకు తెచ్చింది. వర్తమానంలో జరిగే పోరాటాలపై ఈ చర్చ ప్రభావం తక్షణమే వుండకపోవచ్చు. అయితే ఇది సైద్ధాంతిక ఎజెండాలో భాగమైన అంశం కాదనలేము.
మార్క్సిజం 'కులం' కంటే 'వర్గం'కు ప్రాధాన్యతనిస్తుందని, కుల విభజనకంటే వర్గ విభజన ఆధారంగానే మార్క్సిజం సమాజాన్ని ప్రాథమికంగా అర్థం చేసుకుంటుందని, తద్వారా కుల సమస్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని చాలామంది ముఖ్యంగా దళిత మేథావులు ఆరోపిస్తున్నారు. పరస్పరం మినహాయింపబడని మూడు మేథో వైఖరులను ఈ చర్చలో మనం గమనించవచ్చు. మొదటి వైఖరి ప్రకారం భారతదేశంలో కుల, వర్గ అణచివేతలు దాదాపు ఆచ్చాదించబడి(ఓవర్‌లాప్‌) వుంటాయి. అణచివేతకు గురవుతున్న కులాలు అణచివేతకు గురవుతున్న వర్గాలకు ఉపసముదాయాలు(సబ్‌సెట్‌)గా వుండటమే కాకుండా అవి ఆ వర్గంలో ప్రధాన భాగంగా వుంటాయి. అందువల్లనే చాలామంది రచయితలు పైన వివరించినట్టుగా వాదిస్తూ దేశంలో జరుగుతున్న దోపిడీ ప్రక్రియను వర్ణించటానికి 'కులం-వర్గం' అనే ఏక పదబంధాన్ని ఉపయోగిస్తుంటారు.
కులం, వర్గం భావనల మధ్య తేడాకుగల ప్రాధాన్యతను రెండవ వైఖరి వివరిస్తుంది. అయితే సమాజంలో మార్పును తీసుకొచ్చేందుకు కావలసిన రాజకీయ ప్రమేయంలో రెండింటిలో ఒకదానికి రెండవ దానికంటే ఎక్కువ ప్రాధాన్యత వున్నట్టు ఈ వైఖరి భావిస్తుంది. కొందరు వర్గ ప్రాతిపదికన నిర్వహించే పోరాటాలకు ప్రాధాన్యతనిస్తే, మరికొందరు కుల అణచివేతకు వ్యతిరేకంగా నిర్వహించే పోరాటాలకు ప్రాధాన్యతనిస్తారు.
మూడవ వైఖరి ఫ్రెంచ్‌ మార్క్సిస్టు తత్వవేత్త లూయి అల్థూజర్‌ ప్రతిపాదించిన 'నిర్మాణవాద మార్క్సిస్టు సిద్ధాంతం'చేత ఉత్తేజిత పద్ధతికి సంబంధించినది. అయితే ఆల్థూజర్‌ తన సిద్ధాంతాన్ని తీసుకెళ్ళాల్సినంత తీసుకెళ్ళలేదని ఈ వైఖరి విమర్శిస్తుంది. ఈ వైఖరి ప్రకారం ఏ కాలంలోనైనా సమాజంలో అనేక రకాల వైరుధ్యాలు వుంటాయి. ఒక వైరుధ్యం మరో వైరుధ్యంకంటే ప్రాధాన్యతగలదని చెప్పేందుకు వీలుపడదు. ఒక విశేష క్షణంలో వీటిలో ఏ వైరుధ్యమైనా ముందుకు వచ్చే అవకాశం వుంటుంది. ప్రగతిశీల శక్తులు తమ శక్తియుక్తులను అలా ముందుకు వచ్చిన వైరుధ్యంపై కేంద్రీకరించాల్సి వుంటుంది. అలాంటి ఆచరణ ప్రక్రియతో ఒక సంధిగ్ద స్థితి ఉత్పన్నమౌతుందనీ, అలా సామాజిక నిర్మాణం మొత్తంగా పరివర్తన చెందేందుకు అవకాశం ఏర్పడుతుందని ఈ రచయితలు భావిస్తారు. కుల, వర్గ, లింగ సమస్యలు వివిధ కాలాలలో పోరాట క్షేత్రాలుగా ఆవిర్భవించే అవకాశం ఉంటుందనేది చివరి వాదన. ఏ క్షేత్రం ముందుకు వస్తే ఆ క్షేత్రంలో ప్రగతిశీలశక్తులు పోరాటాన్ని నిర్వహించాల్సి వుంటుంది. 'వర్గ వైరుధ్యం' ఇతర వైరుధ్యాలకన్నా విశిష్టతగలదని చెప్పే అవకాశం ఇక్కడ ఉత్పన్నం కాదు.
నిశ్చల దృశ్యంగా సమాజం
ఈ మూడు మేథో వైఖరులలో ఒక మౌలిక అంశం ఉమ్మడిగా వుంటుంది. ఏ వైరుధ్యం ప్రధానమైనదనే విషయాన్ని చర్చించే వారంతా సమాజాన్ని నిశ్చలస్థితిలో చూస్తారు. వేరే మాటల్లో చెప్పాలంటే ఘనీభవించిన చట్రంలో బిగించబడిన సమాజంలోని వైరుధ్యాన్ని వీరు చర్చిస్తారు. మొత్తంగా పరివర్తన చెందని సమాజంలో వివిధ కాలాలలో వివిధ వైరుధ్యాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయని చెప్పే ఈ చివరి మేథో వైఖరి కూడా సమాజాన్ని ఘనీభవించిన చట్రం ధృక్కోణంలోనే చూస్తుంది. చూసీచూడగానే ఈ వైఖరి అలా లేదనిపిస్తుంది. ఎందుకంటే వివిధ కాలాలలో వివిధ వైరుధ్యాలు ప్రాధాన్యతలోకి వస్తాయని ఇది చెబుతుంది. ఇది ఘనీభవించిన చట్రంలోని సమాజం గురించి కాకుండా మారుతున్న సమాజం గురించి మాట్లాడుతుంది. అయితే సర్వోత్కృష్ట(ప్రైమసి) వైరుధ్యంలో ఇది ఊహిస్తున్న మార్పు వివిధ ఘనీభవించిన చట్రాలలో అడ్డంగా ఒక వైపు నుంచి మరోవైపు వుంటుంది. సమాజానికి చెందిన ఒక ప్రత్యేకమైన ఘనీభవించిన చట్రంలో ఒక వైరుధ్యానికి సర్వోత్క ృష్టత వుంటుందని, అదేవిధంగా మరో ప్రత్యేకమైన ఘనీభవించిన చట్రంలో మరో వైరుధ్యం సర్వోత్కృష్టత పొందే అవకాశం వుంటుందని ఈ మేథో వైఖరి భావిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే భారతదేశంలో 'కుల', 'వర్గ' సమస్యలపై చర్చ ఘనీభవించిన సామాజిక చట్రంలో జరుగుతుంటుంది. ఇటువంటి చట్రంలో 'కుల' సమస్య కంటే 'వర్గ' సమస్యకు మార్క్సిజం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని పొరపాటుగా భావించటం జరుగుతున్నది. ఇది పొరపాటు అనటానికిగల కారణమేమంటే ఒక ఘనీభవించిన చట్రంలో ఒక భావాభివర్గం(క్యాటగిరి) మరొక భావాభివర్గం కంటే ప్రాధాన్యత కలిగివుంటుందని చెప్పటంతో మార్క్సిజానికి సంబంధం లేదు గనుక. ఒక చట్రం నుంచి మరో చట్రంలోకి మన ప్రస్థానం ఎలా జరుగుతుందనే విషయాన్ని మార్క్సిజం వివరిస్తుంది. వేరే విధంగా చెప్పాలంటే ఏ చట్రంలోనైనా కుల, వర్గ, లింగ సంబంధిత సంబంధాల, ఇతర సంబంధాల సముదాయం వుంటుంది. ఈ సకల సముదాయాల సమస్తం పూర్ణత (మార్క్సిస్టు తత్వవేత్త జార్జి లుకాస్‌చే ప్రతిపాదింపబడిన 'టోటాలిటీ' భావన ఇక్కడ ఉపయోగించటం జరిగింది) అవుతుంది. ఈ పూర్ణత లేక మనం చర్చిస్తున్న కుల-వర్గ సంబంధాల సముదాయం కాలక్రమంలో మారుతుంటుంది. ఇది ఎలా, ఎందుకు మారుతుంది? అనే ప్రశ్నను మార్క్సిజం లేవనెత్తుతుంది. వేరే మాటల్లో చెప్పాలంటే ఈ సముదాయంలో ఏ అంశం స్వతహాగా లేక ఆంతర్యంలో (ఇన్‌ట్రిన్‌సికల్లీ) ఎంత ముఖ్యమైనది అనే విషయానికి ప్రాముఖ్యత లేదు(దీనికిదిగానే పరిగణనలోకి తీసుకోవాలనటం అర్థంలేనిది). అయితే ఈ సముదాయాన్ని ముందుకు నడిపించేది ఏమిటనేదే అసలు విషయం. ఈ ప్రశ్నకు మార్క్సిజం ఇచ్చే సమాధానం చారిత్రక భౌతికవాదానికి సంబంధించినదై వుంటుంది. ప్రముఖ రష్యన్‌ మార్క్సిస్టు జివి ప్లెఖానోవ్‌ తన ప్రశంసనీయ గ్రంథం 'ద డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ మోనిస్టు వ్యూ ఆఫ్‌ హిస్టరీ'లో చెప్పినట్టు చారిత్రక భౌతికవాదం మార్క్సిజం ప్రత్యేకత. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థచే ప్రభావితమౌతున్న వర్తమానకాలాన్ని గురించి ఈ దృష్టికోణం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తే వుపయోగకరంగా వుంటుంది.
పెట్టుబడిదారీ వ్యవస్థను విశ్లేషించటంపైనే మార్క్స్‌ తన జీవిత కాలాన్నంతా వెచ్చించాడు. ఈ వ్యవస్థకుగల సద్యోజనిత (స్పాన్‌టెనైటి) స్వభావాన్ని ఆయన ఎత్తిచూపాడు. వాస్తవంలో ఈ వ్యవస్థకు స్వయం చాలకత వుంటుంది. ఈ స్వయంచాలకత నిశ్చితమైన అంతర్వర్తిత ధోరణులకు లోనవుతుంది. ఈ ధోరణులు మానవ కోరికకూ, చైతన్యానికీ అనుగుణంగా ఉండకుండా స్వతంత్రంగా వుంటాయి (ఉదాహరణకు 1930వ దశకంలోని మహామాంద్యాన్ని ఎవరూ కోరుకోలేదు. అలాగే వర్తమానంలోని ప్రపంచ పెట్టుబడిదారీ సంక్షోభం నుంచి బయటపడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కొనసాగుతూనే వున్నది). అంతేకాకుండా ఈ అంతర్వర్తిత ధోరణులు జనింపజేసే ప్రతిస్పందనలు మానవులు స్వబుద్దితో చేస్తున్నవి కావు. పరిస్థితుల ప్రభావంవల్ల వారు అలా ప్రవర్తిస్తారు.. అలాచేయకపోతే ఆర్థిక వ్యవస్థలో వారు తమ స్థానాన్ని కోల్పోతారు. ఉదాహరణకు పెట్టుబడిని కూడబెట్టటం పెట్టుబడిదారులకు ఇష్టముండాలనేమీలేదు. కానీ అలా చేయకపోతే వారు వ్యవస్థలో తమ స్థానాన్ని కోల్పోతారు. పోటీ తట్టుకోలేక వారు నాశనమై పోతారు. ఇంకా చెప్పాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులు కూడా పరాయీకరణకు గురవుతారు.
దీనినిబట్టి అర్థమయ్యేదేమంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న క్రమంలో కుల-వర్గ సమిష్టి సంబంధాల స్వభావం నిరంతరం మారుతూవుంటుంది. అయితే వ్యవస్థకుగల సద్యోజనిత లేక యాదృచ్ఛిక స్వభావాన్ని అధిగమించకుండా మానవులు స్వేచ్చను సాధించటం దుస్సాధ్యం. అంటే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థనే అధిగమించాలి. అలా వ్యవస్థ రద్దు కావటం వర్గ దోపిడీకే కాకుండా కుల అణచివేతకు కూడా అవసరమౌతుంది. వ్యవస్థ రద్దుకాకుండా కొనసాగుతున్న స్థితిలో అణగారిన కులాలకు చెందిన కొందరు కార్మికవర్గ స్థాయినుంచి బూర్జువా లేక వృత్తి నిపుణులవంటి ఉన్నతవర్గ స్థాయికి 'ఎగబాక' గలుగుతారు(దక్షిణ ఆఫ్రికాలోని నల్లజాతివారికి సంబంధించి ప్రపంచబ్యాంకు, ఇతరుల దార్శనికతగా ఈ భావన వుండేది). అయితే దాదాపుగా అణగారిన కులాలకు చెందినవారంతా వర్గ దోపిడీలోనే కాకుండా కుల అణచివేతలో కూడా కూరుకుపోయి వున్నారన్న వాస్తవం మారదు.
పెట్టుబడిదారీ వ్యవస్థను
అధిగమించాల్సిన ఆవశ్యకత
ఈ వ్యవస్థలో వర్గ దోపిడీని అలానే కొనసాగనిచ్చి, కుల అణచివేత అనే ఒక సజీవ వాస్తవికతకు బదులుగా కుల అణచివేతలేని మరో ప్రత్యామ్నాయ వాస్తవికతను సృష్టించటం సాధ్యపడదు. కాబట్టి పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించకుండా కుల అణచివేతను అంతం చేయటానికి పోరాటం చేస్తున్నవారు విజయం సాధించలేరు. క్లుప్తంగా చెప్పాలంటే కులం రూపుమాపాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అంతం కావాల్సి వుంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించటంతోనే కుల అణచివేత అంతం కాదు అనేది నిజం. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించిన తరువాత స్థితి కుల అణచివేతను అంతం చేయటానికి చాలకపోయినప్పటికీ అది ఆవశ్యక స్థితిగా వుంటుంది. ఇదీ మార్క్సిజం ప్రాథమిక నిర్ధారణ.
'కులం', 'వర్గం'లలో ఏ భావాభివర్గానికి ప్రాధాన్యత నివ్వాలనే విషయంపై చర్చ ఈ ధృక్కోణం నుంచి జరగాలి. అంతేగానీ సమాజాన్ని ఒక నిశ్చల దృశ్యంగా భావించి ఈ సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయటంవల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు. ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించటం కుల డిమాండ్‌గా ఉండజాలదు. అధిగమించాల్సిన అవసరమున్న ఒక వ్యవస్థగా పెట్టుబడిదారీ విధానాన్ని గుర్తించటం, దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పడే వ్యవస్థకు సంబంధించిన భావనలు కుల సమస్య విశ్లేషణకు ఆవల వుంటాయి. ఎవరైనా నిజాయితీగా, నిలకడగా కుల నిర్మూలన లక్ష్యాన్ని పట్టించుకుంటే వారు తప్పకుండా ఇటువంటి నిర్ధారణలకే వస్తారు. అలా చేస్తున్నప్పుడు కుల దృష్టికోణం పరిధి దాటి వెళ్లాల్సి వుంటుంది. వేరేవిధంగా చెప్పాలంటే ఎవరైనా కేవలం కుల దృష్టికోణం చట్రంలోనే ఇరుక్కుపోతే ఆ వ్యక్తి కుల అణచివేతను అధిగమించటంలో కూడా విజయవంతం కాలేడు.
వర్గ దృష్టికోణానికే ప్రాధాన్యతను ఇస్తుందనే ఆరోపణ మార్క్సిజం ఎదుర్కొంటున్నది. దీనికి కారణం వర్గ దోపిడీని అంతం చేయటానికే కాకుండా కుల, ఇతర రూపాలలోని అణచివేతలను కూడా అంతం చేయటానికి పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించాల్సి వుంటుందనే అవగాహన మార్క్సిజానికి వుండటమే. పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించిన తరువాత కూడా కుల అణచివేత కనుమరుగవదు. అంటే కుల అణచివేత ప్రత్యేక స్వభావాన్ని కలిగివున్నదనీ, దానిని కేవలం వర్గ దోపిడీకి కుదించటం కుదరదనీ అర్థం. మన సమాజంలో కుల అణచివేత చాలా లోతుగా పాతుకుపోయింది. దానిని నిర్మూలించటం అటుంచి కనీసం పరిస్థితిని మెరుగుపర్చటం కూడా పెట్టుబడిదారీ వ్యవస్థలోగానీ, పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయటానికి ముందుగానీ సాధ్యపడదు. అంతేకాకుండా పెట్టుబడిదారీ వ్యవస్థ కూలిపోయిన తరువాత కూడా సుధీర్ఘ పోరాటాలు చేయకుండా కుల అణచివేతను నిర్మూలించటం సాధ్యపడదు. క్లుప్తంగా చెప్పాలంటే కుల అణచివేత అనేది మన సమాజంలో బాగా వేళ్లూనుకుని వుంది. అంత తేలిగ్గా అధిగమించటం సాధ్యం కాదు. అయితే కుల అణచివేతకు ప్రాధాన్యతనివ్వటం, దాని ప్రాముఖ్యతను, స్థిరత్వాన్నీ గుర్తించటం వేరువేరు విషయాలు. కుల అణచివేతతోపాటు అన్ని రకాల అణచివేతలనూ రూపుమాపటానికి పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించాల్సి వుంటుందని భావించటంవల్లనే వర్గ పోరాటానికీ, వర్గ వైరుధ్యానికీ మార్క్సిజం ప్రాధాన్యతనిస్తున్నది.
అయితే పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా చేసే పోరాటానికి ప్రాధాన్యతనివ్వటమంటే కుల అణచివేతను విస్మరించమనిగానీ, దానిని అధీన అంశంగా భావించమనిగానీ చెప్పినట్టు కాదు. అంతేకాకుండా కుల అణచివేత అంశాన్ని విస్మరించటంవల్ల పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం బలహీనపడుతుంటే ఆ పరిస్థితిని వర్గ పోరాటాన్ని ఎక్కువగా పట్టించుకోవటంవల్ల ఏర్పడిన స్థితిగా అర్థం చేసుకోకూడదు. వాస్తవంలో అది వర్గ పోరాటాన్ని బలహీనపరుస్తుంది. కుల అణచివేతతో సహా అన్ని రకాల అణచివేతలకూ వ్యతిరేకంగా జరిగే అన్ని పోరాటాలూ పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయటమనే ప్రధాన లక్ష్యాన్ని విస్మరించకుండా వుండేందుకే మార్క్సిజంలో 'వర్గం' అనే భావనకు అంత ప్రాధాన్యత ఏర్పడింది. అంతేకాకుండా అన్ని పోరాటాలూ ఆ అవసరంలో భాగంగా ఉండితీరాలని మార్క్సిజం చెబుతున్నది.
-ప్రభాత్‌ పట్నాయక్‌ 
అనువాదం: నెల్లూరు నరసింహారావు 
సెల్‌: 8886396999
Published in Nava Telangana Dated: 05/04/2016
Posted by Dalit Blog at 10:48 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: కులం వర్గం

Monday, July 21, 2014

రిజర్వేషన్లు ఉండాల్సిందే - బి. విజయభారతి


Published at: 18-07-2014 01:05 AM
రిజర్వేషన్ల గురించీ కులనిర్మూలన గురించీ సాగుతున్న చర్చలు సమస్యలను మరింత జటిలం చేస్తూ సమసమాజ ఆవిర్భావాన్ని మరింత వెనక్కు నెడుతున్నాయి. భారతదేశంలో రిజ ర్వేషన్ల వ్యవస్థ అతి ప్రాచీన కాలం నుంచీ అంటే భా రతీయ/హిందూ ధర్మశాస్ర్తాల కాలం నుంచీ ఉన్నది. గౌరవప్రదమైన వృత్తులు కొన్ని కులాలకూ హీన వృత్తులు కొన్ని కులాలకూ రిజర్వు చేయబడ్డాయి. చాతుర్వర్ణ వ్యవస్థ భారతదేశ సంస్కృతిలో ప్రధానమైనది. బ్రిటిష్‌ వారి పాలనలోకి వచ్చే నాటికి ఈ దేశంలోని అన్ని రాజ్యాల్లోనూ/ సంస్థానాల్లోనూ చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. చాతుర్వర్ణాల్లో బ్రాహ్మణ వర్గం వారికి విద్యాసంబంధమైన వృత్తులు - దేవాలయాలకు సంబంధించిన వృత్తులు - ఉద్యోగాలు రిజర్వు అయ్యాయి. క్షత్రియులకు పాలనాపర వ్యాపకాలు - వైశ్యులకు వర్తక సంబంధ పనులు రిజర్వు అయ్యాయి. వీళ్ళందరకీ భూములుండేవి. సంపద ఉండేది. శూద్ర కులాలకు సేవక ధర్మం రిజర్వు చేశారు. వారిలో కొన్ని వర్గాలు వస్తూత్పత్తితో వ్యవసాయ పనులతో పై వర్ణాలకు దగ్గర అయ్యారు - కొందరు సేవక ధర్మానికే పరిమితం చేయబడి తమకు విధించిన పనుల్లో ఉండిపోవలసి వచ్చింది. ఇదంతా రిజర్వేషన్‌ వ్యవహారమే. కాలక్రమంలో ఈ వర్ణాలు శాఖోపశాఖలుగా కులాలుగా విస్తరించాయి. కులం అంటే ఒక సముదాయం. భారతదేశంలో వేద మతాన్ని కర్మకాండను నిరసిస్తూ జైన, బౌద్ధ ధర్మాలు తలెత్తిన కాలంలో జైన ధర్మాన్ని పాటించే జన సముదాయాల్లో అతి చిన్న విభాగాన్ని ‘కులం’ అనేవారట. తర్వాతికాలంలో బౌద్ధ, శైవ, వైష్ణవ, జైన ధర్మాలు పరస్పరం కలహించుకున్న చరిత్ర భారతదేశానికి ఉన్నది. అలా సంకుచిత పరిధిలో కులాల ఉనికి వ్యాప్తిలోకి వచ్చి ఉండొచ్చు. మతంఏదైనా ఇవి చాతుర్వర్ణాల రిజర్వేషన్లను అతిక్రమించలేదు. భారతదేశంలోని అధిక సంస్థానాలు బ్రిటిష్‌ ప్రభుత్వ ఏలుబడిలోకి వచ్చాకే సమాజంలో మానవ హక్కులు- అవకాశాల గురించి చర్చలు మొదలయ్యాయి. శూద్ర వర్ణాలకూ అప్పటికే ఏర్పడి ఉన్న పంచమ కులాల వారికీ మెరుగైన జీవనావకాశాల గురించి ఆలోచన మొదలైంది. వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం బ్రిటిష్‌ పాలకులకు కనబడింది. అందుకే మొదట వారు లేబర్‌ స్కూళ్ళు - కార్మికుల కోసం, కూలీల కోసం, మాలమాదిగల కోసం తెరిచారు. వారి సంక్షేమం కోసం లేబర్‌ డిపార్టుమెంట్‌ ఏర్పడింది. దానినే సాంఘిక సంక్షేమశాఖగా ఇప్పుడు చెప్పుకుంటున్నారు. రాజ్యాంగం పౌరులందరికీ సమాన అవకాశాలు/హక్కులు వాగ్దానం చేసింది గనుక నిమ్న వర్గాలుగా చెప్పబడే కొన్ని కులాల వారికి వారి సామాజిక స్థాయి పెరిగే వరకూ రిజర్వేషన్లు అవసరమయ్యాయి. శతాబ్దాలుగా అగ్రవర్ణాలు రిజర్వేషన్‌ సౌకర్యాలు అనుభవించి కొన్ని కులాలను కిందికి తొక్కివేశారు. ఇప్పుడు అణగారిన కులాలకు రిజర్వేషన్‌ మొదలై కొన్ని సంవత్సరాలు గడవలేదు. అవి సరిగ్గా అమలుకావటమూ లేదు. అయినా వీరి రిజర్వేషన్లపై అలజడి జరుగుతున్నది.
ఇంజనీరింగ్‌, మెడిసిన్‌లో మొదట్లో రిజర్వేషన్‌ నియమాలు కొంతలో కొంత పాటించటం వల్ల నేడు ఆ రంగాల్లో కింది కులాల వారు కొందరు కనిపిస్తున్నారు. దానితో ‘ప్రతిభ’ పదం ముందుకు వచ్చింది. ఇప్పుడు మెడికల్‌ విద్య సీట్ల కౌన్సిలింగ్‌లో, ఇతర ఉద్యోగాల ఎంపికలో కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మెరిట్‌లో వచ్చినా సీట్ల కేటాయింపు రిజర్వేషన్‌ లెక్కల్లోనే చేస్తున్నారు. దానివల్ల అర్హత మార్కులు పొందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సీట్లు తగ్గుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు మూసివేసే విధంగా కార్పొరేట్‌ పాఠశాలలు/ కాలేజీలు వర్ధిల్లేలా నిర్ణయాలు తీసుకుంటూ సామాన్యుల విద్యకు గండి కొడుతున్నారు. వర్ణవ్యవస్థ చట్ర ంలో రిజర్వేషన్లనూ, ప్రజాస్వామ్య వ్యవస్థ చట్రంలో రిజర్వేషన్లనూ సునిశితంగా అధ్యయనం చేయాలి. సమసమాజం - మానవహక్కులు అనే భావన ప్రజలలో పాదుకొల్పవలసిన బాధ్యత రాజ్యానిదే. ప్రత్యేకంగా కుల నిర్మూలనకు కోట్లు ఖర్చు పెట్టక్కరలేదు. సమధర్మం, సమన్యాయం అన్నివర్గాల ప్రజలకూ సమంగా అందిస్తే కులాల అంతరాలు అవే పోతాయి.
- బి. విజయభారతి

Andhra Jyothi Telugu News Paper Dated: 18/7/2014 
Posted by Dalit Blog at 1:23 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: కులం వర్గం

సమస్య వెంటే పరిష్కారం! - రంగనాయకమ్మ


Published at: 13-07-2014 00:58 AM
సమాజంలో ఉన్న ప్రతీ మనిషీ శ్రమ చెయ్యాలని గ్రహించడమూ; ప్రతి మనిషీ శారీరక - మేధా శ్రమలు రెండూ చెయ్యాలని గ్రహించడమూ, మొదటి సంగతి. ఆ మార్పుల కోసం, శ్రామిక వర్గ పోరాటం అత్యవసరమని గ్రహించడం, మరో సంగతి. ఏ గ్రహింపూ లేకుండా, ‘కుల విధానాన్ని  తక్షణం నిర్మూలించాలి’ అంటూ అరిచే నినాదాలు ఆ నిర్మూలనకు ఏ మాత్రమూ పనికి రావు. పైగా ఆ శబ్దాలు, సిద్ధాంత శబ్ద కాలుష్యాన్ని మాత్రమే దట్టంగా సృష్టిస్తాయి.
‘కులాల విధానం’ అనే సమస్యకి పరిష్కారం, కులాంతర వివాహాలే. కుల విధానాన్ని అంగీకరించని వారందరూ గ్రహించవలసింది ఇదే. సమస్య ఉంటే, దాని వెంటే పరిష్కారం ఉంటుంది. సమస్య వల్ల బాధపడే వాళ్ళకి పరిష్కారం తెలియలేదంటే సమస్యే తెలియలేదని అర్థం.
కుల విధానం పుట్టుక గురించి మాట్లాడే వారు కొందరు, ‘చాతుర్వర్ణాలు’ అనే పేరుతో ‘బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర’ అంటూ మొదలు పెడతారు. అలా మొదలు పెట్టి, ఆ నాలుగు వర్ణాలూ, ఏ శ్రమల తోటీ, ఏ వృత్తుల తోటీ సంబంధాలు లేకుండా పుట్టుకొచ్చినట్టు చెప్పుకొస్తారు. ప్రతీ వర్ణమూ అనేక విభాగాలుగా వేరు వేరు వృత్తుల్లో నిమగ్నమై ఉండడమూ; ‘శూద్రులు’ అనే వర్ణం, అనేకానేక శారీరక శ్రమలు చేసే వృత్తులు గానూ, ప్రతీ వృత్తీ ఒక కులం గానూ ఏర్పరడమూ; ఇవన్నీ సమాజంలో స్పష్టంగా కనపడుతూ ఉన్నవే.
బట్టలు ఉతికే వృత్తి ఒక కులం. క్షవరాలు చేసే వృత్తి ఇంకో కులం. చేపలు పట్టే వృత్తి మరో కులం. నేతా, కుట్టూ, వేరు వేరు కులాలే. వృత్తులు మారినా, కలిసినా, కులాలు నిలబడే ఉండడం సంప్రదాయంగా సాగుతోంది. ఒక వృత్తినీ, దాని కులం పేరునీ చూస్తే, వృత్తి మొదటిదో, కులం మొదటిదో, తేలికగానే గ్రహించవచ్చు. శ్రమలే లేని కాలంలో వృత్తులు ఉండవు. వృత్తులే లేని కాలంలో, దానికి కులం పేరు ఏర్పడదు. ఒక కులం గల కుటుంబంలో ఒక పెళ్ళి జరగాలంటే, అదే కులం గల, అంటే అదే వృత్తి గల వ్యక్తే, ఆ కుటుంబంలోకి రావడం జరుగుతోంది. వివాహ సంబంధాలు ఏ కులానికి ఆ కులంలోనే ఏర్పడాలి - అనే సంప్రదాయానికి మూల కారణం, ‘ఒకే రకం వృత్తి’ అనేదే. అంటే, వృత్తిని బట్టే కులం. కులాన్ని బట్టే వివాహ సంప్రదాయం. అంటే, కులాలు పోవాలంటే, వృత్తుల విధానంలో పెద్ద మార్పు జరగాలని అర్థం.

‘కులాలు’ అన్నప్పుడు, అవి కేవలం వేరు వేరు భిన్న వృత్తులు మాత్రమే కాదు; ఆ వృత్తులకూ, వాటిని బట్టి ఆ కులాలకూ, చిన్నా - పెద్దా గుర్తింపులు కూడా ఏర్పడ్డాయి. అయితే, ‘వృత్తులు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. ఈ కుల విధానం ఈ దేశంలోనే ఎందుకు ఉంది?’ అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రశ్నలు ఎప్పుడూ మంచివి. కారణాల్ని గ్రహించాలనే ప్రయత్నాలు అవి. ఇతర దేశాల్లో ఉన్న వేరు వేరు చెత్త సంప్రదాయాలు ఈ దేశంలో లేవు. ఒక దేశంలో ఉన ్న మంచిగానీ చెడ్డగానీ, అదే రకంగా ప్రతీ చోటా ఉండడం లేదు. ఇక్కడి చెడ్డని మించిన చెడ్డ, అక్కడ ఉండవచ్చు. అక్కడి మంచిని మించిన మంచి, ఇక్కడ ఉండవచ్చు. ‘ఇక్కడ ఉన్నది అక్కడ లే దేం?’ ప్రశ్నకి జవాబు, ‘‘అక్కడ ఉన్నది ఇక్కడ లేదేం?’’ అనేదే.    మన దగ్గిర ఉన్నది చెడ్డే అని తెలిస్తే, దాన్ని మనం మార్చుకోవాలి ‘కుల విధానం’ పోవలిసిందే. కానీ ఎలాగ? పరిష్కారం కావాలంటే, సమస్యని సరిగా అర్థం చేసుకోవాలి.
ఇద్దరు వేరు వేరు కులాల వాళ్ళు స్నేహంగా ఉన్నా, ఆ కులాలు పోయినట్టు కాదు. ఆ ఇద్దరూ రోజూ కలిసి భోజనాలు చేస్తూ ఉన్నా, ఆ కులాలు పోయినట్టు కాదు. కాలేజీల్లో, స్నేహాలూ, హోటళ్ళలో పక్కపక్కనే కూర్చుని భోజనాలూ, ఇవన్నీ సాగుతూనే ఉన్నాయి. అయినా కులాలు కులాల్లాగే ఉంటున్నాయి.

ఇద్దరు చిన్నా పెద్దా కులాల స్ర్తీ పురుషులు, రహస్య సంబంధాలతో ఉంటే, కులాలు పోయినట్లు కాదు. ఆ సీ్త్ర పురుషులు బహిరంగంగా, పెళ్ళి తంతు ఉన్నా లేకపోయినా, భార్యాభర్తలుగా, కుటుంబ సంబంధాలతోనే, పిల్లలకు తల్లిదండ్రులు గానే, కలిసి జీవిస్తూ ఉంటే, అటువంటి సంబంధంలో బైల్దేరే పిల్లలకు ఏ కులాలూ లెక్కలోకి రావు. కానీ, రిజర్వేషన్‌ పద్ధతి సాగుతూనే ఉంటే, తండ్రి కులమో, తల్లి కులమో, ఏది చిన్న కులమైతే అది, ఆ పిల్లలకు కూడా చుట్టుకుంటుంది. తల్లి దండ్రులు కులాంతర వివాహం చేసుకున్నా, రిజర్వేషన్ల ద్వారా, పిల్లల తరానికి కూడా చిన్న కులాలు నిలిచిపోతాయి!
కులాంతర వివాహాలు, నూటికొకటో కోటి కొకటో జరగడం గాక, నిరభ్యంతరంగా జరిగే మార్గం ఏది? ఆ మార్గం ఏమిటో తెలుసుకోవాలంటే, కనీసం 100 కులాంతర వివాహాల్ని పరిశీలించి చూడాలి. ఈ పరిశీలనలో, రెడ్డి యువతికి మాల యువకుడితో పెళ్ళీ; బ్రాహ్మణ యువతికి, మాదిగ యువకుడితో పెళ్ళీ; వైశ్య యువకుడికి, మంగలి యువతితో పెళ్ళీ; ఇలా ఆ 100 పెళ్ళిళ్ళూ చిన్నా పెద్దా కులాల మధ్య జరగడం కనపడతాయి. అందులో కారణాల కోసం వెతికితే, చిన్న కులాల వ్యక్తులకు, వారి కుల వృత్తులు మారిపోవడమే కనపడుతుంది. ఒక బ్రాహ్మణ యువతికీ, ఒక టీచరుగా ఉన ్న మంగలి యువకుడికీ పెళ్ళి జరిగిందంటే, ఆ చిన్న కులం యువకుడికి విద్యా స్థాయి పెరిగి, తన కుల వృత్తి వదిలి, పై స్థాయి ఉద్యోగిగా మారడమే, పెద్ద కులం యువతితో పరిచయం, చివరికి పెళ్ళికి అంగీకారం!
చిన్న కులాల వ్యక్తులు, తమ కుల వృత్తుల్ని వదిలి వేస్తే, అప్పుడు సమాజానికి ఆ వృత్తులతో అవసరం ఎలా తీరుతుంది? ఈ నాడైతే, చిన్న కులాల్లో ఇంకా కుల వృత్తుల్ని వదలని వాళ్ళ ద్వారానే, సమాజ అవసరాలు తీరుతున్నాయి. కానీ, ఒక క్షవరాల కులంలో అందరూ కుల వృత్తిని వదిలేస్తే, అప్పుడేమవుతుంది? - సమాజానికి అవసరమైన ప్రతీ శ్రమనీ నిలబెట్టుకునే కొత్త విధానాన్ని మార్క్సిజం చెపుతుంది. చిన్నా - పెద్దా వృత్తులుగా సాగుతూ ఉన్న శ్రమ విభజనని, ‘సమానత్వ శ్రమ విభజన’గా మార్చాలనేదే ఆ కొత్త విధానం. కొత్త విధానమే లేకపోతే, అట్టడుగు శ్రమలు చేసే కులాలకు విముక్తి ఎలాగ?
ఈనాడు, చిన్న కులాల కుటుంబాల్లో మార్పులు, రిజర్వేషన్ల ద్వారా జరగడం నిజమే. కానీ ఆ మార్పు, ఆ కులాల జనాభాలో అత్యల్ప సంఖ్యకి మాత్రమే దొరుకుతుంది. రిజర్వేషన్లలోనే క్రీమీ లేయర్‌ పద్ధతిని ప్రవేశపెడితే, ఆ రకమైన మేలు కూడా ఎక్కువ జనాభాకి అందదు. భారత దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పేర్లతో ఉన్న మొత్తం జనాభాని చూస్తే, ఆ సంఖ్యలో మెజారిటీకి రిజర్వేషన్ల ద్వారా జరిగే మేలేమీ ఉండదు. పెద్ద కులాల పేదల్లో జరిగినట్టే చిన్న కులాల్లో కూడా, పరిశ్రమల్లో ఉద్యోగాలూ జీతాలూ సంపాదిస్తూ ఎదగడం అంటే, భూస్వాముల కిందా పెట్టుబడిదారుల కిందా వేతన బానిసలుగా బతకడమే. అదే ఆ ఎదుగుదలకి అర్థం! ఈనాడు కూడా, అనేక పరిశ్రమల్లో పని పనిచేసే ఇంజనీర్ల వంటి ఉద్యోగులకు కూడా, రోజుకి 16 గంటల పని, తప్పనిసరి నియమం!
ఒక చిన్న కులస్తుడు, పెట్టుబడిదారుడిగా ఎదిగి, లేదా రిజర్వేషన్ల మార్గం ద్వారా ప్రభుత్వంలో మంత్రిగా మారి, స్వంత భవనాలతో, స్వంత పెట్టుబడులతో ఎదిగిపోయినప్పుడు, తన పిల్లల వివాహాల కోసం, తన కులంలోనే పేదల వేపు చూడడు. పెద్ద కులాల్లో పేదల వేపు కూడా చూడడు. తనతో సమాన ఆర్థిక స్థాయి గల సంబంధాల కోసమే చూస్తాడు. పెద్ద కులాల వాళ్ళయినా చేసేది అక్షరాలా అదే. అంటే, యజమాని వర్గంగా ఎదిగిన ఆ చిన్నా - పెద్దా కులాల వాళ్ళకి, కులాల దృష్టి పోయి, యజమానుల వర్గ దృష్టే ప్రధాన దృష్టి అవుతుంది.

రాబోయే కాలం అంతా ప్రైవేటు పరిశ్రమల కాలమే. శ్రామికులు ఏ కులాల వారైనా, వారి డిగ్రీల గురించీ, జీతాల గురించీ, నిర్ణయాలన్నీ పారిశ్రామికవేత్తల ఇష్టాయిష్టాలే. అప్పుడు చిన్న కులాల్లో అల్పసంఖ్యని కూడా రిజర్వేషన్లు రక్షించలేవు. నిత్యం బానిస బతుకులూ, నిరుద్యోగాలూ, అడుగు స్థాయి వృత్తులూ, కులాల స్తిరత్వాలూ, అన్నీ వెనకడుగులే.
పెద్ద కులాల్లో అయినా, చిన్న కులాల్లో అయినా, అత్యధిక జనం శ్రామికులే. అందరూ తమ కులాల్ని గురించే తలపోస్తూ, కుల సంఘాలు పెట్టుకుంటూ, ‘కుల విధానాన్నే’ మరింత స్థిరంగా నిలబెట్టుకుంటున్నారు. చిన్న కులాల వారు రిజర్వేషన్ల భ్రమలతో, తమ కులాలే తమకు శాశ్విత రక్షణ అనుకుంటున్నారు. తాము ఏ వర్గ సంబంధాల్లో, ఏ స్తితిలో ఉన్నారో, గ్ర హించడం లేదు. రిజర్వేషన్లని ఉపయోగించుకుంటూ కూడా వర్గ స్పృహతో ఉండాలని గ్రహించడం లేదు. .
చిన్న కులాల జనాభాకి తాము ఘోరమైన ‘శ్రమ దోపిడీ’కి గురి అవుతున్నామని తెలీదు. దాని వల్ల దోపిడీ శ్రమ - విభజనలో చిక్కి ఉన్నామనీ తెలీదు. పిల్లి నోటిలో చిక్కిన ఎలక కూడా ఆత్మరక్షణ కోసం పెనుగులాడుతుంది. ఆ మాత్రపు రక్షణ స్పృహ కూడా శ్రామిక జనాభాకి లేదు.

కుల విధానమే కాదు. ఇంకా ఉన్న ఏ చెడ్డ విధానం అయినా గతించేది ఎవరి ద్వారా? సమస్య ఎవరిదో వారి ద్వారా.
మేధావులు బైల్దేరి, ‘కుల విధానం తక్షణం నశించాలి. దాన్ని వెంటనే తీసివెయ్యాలి’ అని ఘోషిస్తారు. దారి మధ్యలో ఉన్న ముళ్ళపొదని తక్షణం తవ్వి పైకి లాగి దాన్ని దారికి దూరంగా విసిరెయ్యడం ఎంత సాధ్యమో, కుల విధానాన్ని తీసివెయ్యడం అంత సాధ్యం అనుకుంటారు.
‘‘ఏ పెద్ద కులం వ్యక్తి అయినా, చిన్న కులం వ్యక్తినే పెళ్ళి చేసుకోవాలి’ అని చట్టం చెయ్యడం సాధ్యం కాదు. అలాంటి చట్టమే ఉంటే, పెద్ద కులాల వాళ్ళు పెళ్ళిళ్ళే మానుకుంటారు. పెళ్ళిళ్ళు లేని విధానాన్ని పెద్ద కులాల మధ్యనే పాటిస్తారు.
కులాంతరాల భార్యాభర్తలు, తమ పిల్లలకి తామే ఏదో ఒక కులాన్ని అంటగట్టడం తప్పకపోతే, కుల నిర్మూలన మాట ఎత్తడం దండగ.
సమాజంలో ఉన్న ప్రతీ మనిషీ శ్రమ చెయ్యాలని గ్రహించడమూ; ప్రతీ మనిషీ శారీరక - మేధా శ్రమలు రెండూ చెయ్యాలని గ్రహించడమూ, మొదటి సంగతి. ఆ మార్పుల కోసం, శ్రామిక వర్గ పోరాటం అత్యవసరమని గ్రహించడం, మరో సంగతి.
ఏ గ్రహింపూ లేకుండా, ‘కుల విధానాన్ని తక్షణం నిర్మూలించాలి’ అంటూ అరిచే నినాదాలు ఆ నిర్మూలనకు ఏ మాత్రమూ పనికి రావు. పైగా ఆ శబ్దాలు, సిద్ధాంత శబ్ద కాలుష్యాన్ని మాత్రమే దట్టంగా సృష్టిస్తాయి.

- రంగనాయకమ్మ

Andhra Jyothi Telugu News Paper Dated: 13/7/2014 
Posted by Dalit Blog at 1:21 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: కులం వర్గం

రాజ్యంతోనే కుల నిర్మూలన! - డాక్టర్‌ కదిరె కృష్ణ


Published at: 04-07-2014 01:02 AM
‘కుల నిర్మూలన ఎలా సాధ్యం?’ శీర్షికన (ఆంధ్రజ్యోతి, జూన్‌ 24) ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ రాసిన వ్యాసం చాలా గందరగోళంగా ఉంది. వినోద్‌ రాసిన ఈ వ్యాసం ‘కులనిర్మూలనతోనే న్యాయం’ శీర్షికన (ఆంధ్రజ్యోతి, జూన్‌ 13) కల్పనా కన్నభిరాన్‌ రాసిన వ్యాసానికి స్పందన. ఈ వ్యాసం ద్వారా వినోద్‌కుమార్‌ సైద్ధాంతిక గందరగోళాన్ని సృష్టించడంతో పాటు, సామాజిక అవగాహనాలోపాన్ని మరింత పెంచిపోషించే ప్రయత్నం చేశారు. తెలంగాణ సమాజంలో సాంఘిక, ఆర్థిక అసమానతలు తొలగాలంటే కులనిర్మూలన జరిగి తీరాలన్న కల్పనా కన్నభిరాన్‌ ప్రతిపాదనను స్వాగతించాలంటాడు వినోద్‌. ఆ వెంటనే తిరిగి కుల నిర్మూలన జరుగనే జరుగదు అని ధ్రువీకరణ పత్రాన్ని జారవిడుస్తాడు. కులనిర్మూలనే జరుగదు అనుకున్నప్పుడు ప్రొ. కల్పనా కన్నభిరాన్‌ కుల నిర్మూలనా ప్రతిపాదనను తిరస్కరించాలి గానీ, స్వాగతించడమేమిటి? ‘కల్పనా కన్నభిరాన్‌ మంచి ఉద్దేశంతోనే కులనిర్మూలన జరగాలని కోరుకోవచ్చు కానీ, అది సాధ్యం కాదు... ప్రొఫెసర్‌ కల్పనా కన్నభిరాన్‌ అమాయకంగా, నిజాయితీతోనే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక న్యాయం జరగాలంటే కుల నిర్మూలనతోనే అది సాధ్యం అని రాశారు, కానీ తెలంగాణలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కులాన్ని నిర్మూలించడం ఎవరి వల్లా కాదు’ అంటారు. ఆమె అమాయకత్వం ఏమో గానీ వినోద్‌ ఆ వెనువెంటనే కులం ముల్లును కులంతోనే తొలగించాలి అని ప్రతిపాదించి తన అమాయకత్వాన్ని, అవగాహనా రాహిత్యాన్ని చాటుకున్నారు. కుల నిర్మూలన పట్ల పాలకులకు చిత్తశుద్ధి లేదని తెగ వాపోతారు సదరు వ్యాసకర్త. కుల నిర్మూలన ఎవరి వల్లా కాదని సూత్రీకరించి, వల్లకాని విషయానికి పాలకులకు చిత్తశుద్ధి లేదని చెప్పడం దేనికి నిదర్శనం? ‘పాలకులకు కులాన్ని నిర్మూలించడం అసలే ఇష్టం లేదని మరింత ఆవేదనను వెల్లగక్కారు’. సాధ్యం కాని దానికి ఇష్టంతో చేస్తే మాత్రం సాధ్యం అవుతుందా? కులనిర్మూలన జరగదు లేదా సాధ్యం కాదు. వినోద్‌ మాటల్లో చెప్పాలంటే ‘ఎవరి వల్లా కాదు’. ఇదే నిజమైతే డా. అంబేద్కర్‌ ‘కుల నిర్మూలన’ను ఎందుకు ప్రతిపాదించినట్టు? తన జీవితాంతం కుల నిర్మూలన కోసమే ఎందుకు పరితపించినట్టు? ఇక గాలి వినోద్‌ కుమార్‌ వాక్రుచ్చినట్టు ‘కులాధారిత రిజర్వేషన్లు ఉన్నంతకాలం కుల నిర్మూలన జరగదు’ ఇది పాక్షిక సత్యమే కానీ పూర్తిగా వాస్తవం కాదు. రిజర్వేషన్లు కూడా కులనిర్మూలనలో భాగమే! వేల సంవత్సరాలుగా కుల వ్యవస్థ చేత విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలకు ఎడంగా ఉంచబడడం చేతనే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు అన్ని రంగాల్లో వెనుకబడ్డాయి. అందుచేత భూమి, పరిశ్రమలు, ఇతర అన్ని రంగాలలో వేల ఏళ్ల ముందున్న ఆధిపత్య కులాలతో పోటీ పడలేరు కనుకనే ఈ వర్గాలకు రిజర్వేషన్ల కల్పన అనివార్యమయింది. అంటే Equa lity among the inequalsజూటను సాధించడమన్నమాట. ఇది రాజ్యాంగస్ఫూర్తి కూడా. ఈ రిజర్వేషన్లు లేకపోతే ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండేది. రిజర్వేషన్లు ఉన్నందుకే విద్య, తద్వారా ఉద్యోగం, ఉపాధి ఫలితంగా ఆర్థిక వెసులుబాటు సాధ్యమైంది. ఆ వెసులుబాటు మరింత వెసులుబాటును కల్పించి అన్ని రంగాలలో సాధ్యమైనంత మేరకు ప్రాతినిధ్యం కల్పించింది. ఆ ప్రాతినిధ్యమే తన జాతి ప్రజలకు తిరిగి వెసులుబాటును కల్పించాలి. ఇదే రిజర్వేషన్ల పరమావధి. వెసులుబాటు పొందినవారు ఆ సౌకర్యం లేని వారికి ప్రతినిధి. అతని కర్తవ్యం ఏ కులానికి ప్రతినిధిగా వచ్చాడో, ఆ కులాల ప్రజల అభివృద్ధికి కృషి చేయడంగా భావించవచ్చు. మహాపురుషుల పరిభాషలో చెప్పాలంటేPay back to the Society. ఈ సూత్రం మొత్తం అణగారిన వర్గాలకు వెలుగుగా నిలవాలి. అప్పుడు ప్రస్తుతం ఉన్నదానికి రెట్టింపు శాతం విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థికవెసులుబాటు కలుగుతుంది. ఈ వెసులుబాటే సాధికారతకు దారితీస్తుంది. ఈ సాధికారతే ఆత్మగౌరవాన్ని తద్వారా రాజకీయ అధికారాన్ని సమకూరుస్తుంది. తద్వారా సామాజిక సమానత్వం అనగా కుల నిర్మూలన సాధించబడుతుంది. కానీPay back to the Society దగ్గరే ఈ సమాజం ఆగిపోయింది. ఇది ఎవరి బాధ్యత? ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే రిజర్వేషన్లు ఖచ్చితంగా కుల నిర్మూలనలో భాగంగా కల్పించబడినవే. రిజర్వేషన్లు సమాజగతమే కానీ వైయక్తికం కాదు.
డాక్టర్‌ కదిరె కృష్ణ

Andhra Jyothi Telugu News Paper Dated : 4/07/2014 
Posted by Dalit Blog at 1:19 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: కులం వర్గం

కుల నిర్మూలన ఎలా సాధ్యం? By డా. గాలి వినోద్ కుమార్


Published at: 24-06-2014 13:41 PM
కుల నిర్మూలనతోనే న్యాయం' శీర్షికన జూన్ 13న 'ఆంధ్రజ్యోతి'లో ప్రొఫెసర్ కల్పనా కన్నాభిరాన్ రాసిన వ్యాసం యావత్ తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా ఉంది. తెలంగాణ సమాజంలో సాంఘిక, ఆర్థిక, అసమానతలు తొలగాలంటే కుల నిర్మూలన జరిగి తీరాల్సిందేనని ఆమె సూచించారు. దాన్ని స్వాగతించాల్సిందే. అయితే కులాన్ని ఎలా నిర్మూలించవచ్చో కల్పనా ఈ వ్యాసంలో రాసి ఉంటే బాగుండేది. ఈ దేశంలో చార్వాకులు, బుద్ధుడు, కబీర్, మహాత్మా జ్యోతిబా ఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, డా. అంబేద్కర్‌ల వరకు కులనిర్మూలన జరగాలని ఉద్యమించిన వారే. కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడున్న హిందూ అగ్రవర్ణ ఆధిపత్య రాజ్యంలో పాలకులకు కుల నిర్మూలన పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కుల నిర్మూలన ఎలా సాధ్యం? ఒకవైపు కుల నిర్మూలన జరగాలని కోరుకునే అంబేద్కరైట్‌లు సయితం మరోవైపు ఆ కులం ఆధారంగా ఏర్పడిన రిజర్వేషన్లు ఉండాలని కోరుకుంటారు. కుల ఆధారిత రిజర్వేషన్లు కోరుకున్నంత కాలం కుల నిర్మూలన సాధ్యం కాదు.
ఈ దేశంలో ఒక్క బహుజన సమాజ్ పార్టీకి తప్ప మిగతా ఏ రాజకీయ పార్టీకి కుల వివక్ష, కుల నిర్మూలన పట్ల స్పష్టమైన అవగాహన లేదు. కల్పనా కన్నాభిరాన్ మంచి ఉద్దేశ్యంతోనే కుల నిర్మూలన జరగాలని కోరుకోవచ్చు కానీ అది సాధ్యం కాదు. కులాన్ని చెప్పొద్దు, కులాన్ని వాడొద్దు, కులాన్ని ధ్వంసం చేయాలని కోరుకున్న మహనీయుల సూక్తుల్ని భారత ప్రజలెవరూ పాటించడం లేదు. ముఖ్యంగా పరిపాలకులకు కులాన్మి నిర్మూలించడం అసలే ఇష్టం లేదు. కులం ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు కుల నిర్మూలనకు ఇష్టపడరు. కులం ద్వారా బాధలు పడుతున్న వాళ్ళు కుల నిర్మూలన జరగాలని కోరుకుంటారు. కానీ కుల ఆధారిత రిజర్వేషన్లు వదులుకోరు. కాబట్టి కులం ద్వారా బాగుపడుతున్న వాళ్ళు బాధితులు సయితం కులాన్ని వదులుకునే పరిస్థితి లేదు. అలాంటప్పుడు కుల నిర్మూలన ఎలా సాధ్యం? కాబట్టి కుల నిర్మూలన అనే అంశాన్ని పక్కన పెట్టి ఏ కులం అనే ఆయుధంతో, బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు లబ్ధిపొందుతున్నారో అదే ఆయుధంతోనే కులం బాధితులు కూడా లబ్ధి పొందే సూత్రాన్ని బహుజన ఉద్యమ పిత కాన్షీరాం మనకు అందించి ఫలితాలను సాధించిపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన చేసిన ఈ ప్రయోగం సఫలం అయి దేశ వ్యాప్తంగా స్ఫూర్తిని రగిలించింది. తెలంగాణ రాష్ట్రంలో అది ఎందుకు సాధ్యం కాలేదు? అందుకే తెలంగాణ, సీమాంధ్రకు ఒక కాన్షీరాం కావాలి. శ్రీకృష్ణ కమిటీ లెక్కల ప్రకారం 93.8 శాతం జనాభా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత మైనార్టీలదే. తెలంగాణ రాష్ట్ర సాధనలో వీరే కీలక భూమిక పోషించారు.
ఉద్యమాలు చేసింది వీళ్ళే, ఆత్మబలిదానాలు చేసిందీ వీరే, కేసుల పాలు అయింది ఈ వర్గాలే అయినా ఒక్క శాతం జనాభా కూడా లేని వెలమ సామజిక వర్గం అధికారాన్ని సాధించింది. ఇదెలా సాధ్యం అయింది? ప్రొఫెసర్ కల్పనా అమాయకంగానిజాయితీతోనే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక న్యాయం జరగాలంటే కుల నిర్మూలనతోనే సాధ్యం అని రాశారు. కానీ తెలంగాణలోనే కాదు యావత్ భారతదేశంలో నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కులాన్ని నిర్మూలించడం ఎవరి వల్ల కాదు. అందుకే కులం అనే ముల్లును కులంతోనే తొలగించాలి. కులం ఉన్నంత వరకు కులం ద్వారా ప్రయోజనం పొందుతున్న వారిని చూసి కులం ద్వారా బాధితులైన వారు కూడా ఎలా కులాన్ని ఉపయోగించి ప్రయోజనం పొందుతారో ఆలోచించాలి. కృష్ణ మాదిగకు కులాన్ని ఎలా వాడుకోవాలో అర్థం కాకపోవడం వల్లనే ఆయన మాదిగలకు రిజర్వేషన్లు సాధించలేకపోయారు. బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య, బీసీ స్వతంత్ర రాజకీయ వేదికను తయారు చేయడం కంటే రిజర్వేషన్లకే బీసీ ఉద్యమాన్ని పరిమితం చేయడం వలన తమిళనాడులో డీఎంకే సాధించిన విజయాలను ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణయ్య సాధించలేకపోయారు. డా.బి.ఆర్. అంబేద్కర్ కూడా చిన్న రాష్ట్రాల్లో చిన్న కులాలు అధికారాన్ని చేపట్టాలని ఆశించారు. దళిత, బీసీ నాయకుల వైఫల్యం కారణంగా ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ అధికారాన్ని చేపట్టారు. వీరికి ప్రత్యామ్నాయంగా దళిత, బీసీ మైనార్టీలు రాజకీయ పోరాటాన్ని చేసి ఉంటే ఈ వర్గాలు ఇటు తెలంగాణలో అటు సీమాంధ్రలో అధికారాన్ని సాధించేవి.

న్యాయశాస్త్ర అధ్యాపకులు, ఓయూ

Andhra Jyothi Telugu News Paper Dated: 24/06/2014 
Posted by Dalit Blog at 1:18 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: కులం వర్గం

కుల నిర్మూలనతోనే న్యాయం - ప్రొఫెసర్ కల్పన కన్నబిరాన్


Published at: 13-06-2014 01:26 AM
పందొమ్మిది వందల అరవయ్యో దశాబ్దం రెండవ భాగంలో హైదరాబాదులోని రాజకీయ కల్లోలం ప్రాంతీయ అసమానతల గురించి, అసమాన అభివృద్ధి గురించి మొదలైంది. ఆ సమయంలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అభివృద్ధి అంటే ఆర్థికప్రగతి కాదనే ఆలోచనను తొలిసారిగా హైదరాబాదులోనే ఆరంభించారు. అభివృద్ధిలోని ఈ అసమానత్వాలు, అగాధాల గురించీ, తెలంగాణ ప్రాంతపు మార్జినలైజేషన్ గురించి, దానిని అభివృద్ధి అజెండాకు బైట ఉంచటం గురించి కేంద్రీకరించి పరిశోధన జరిపించాలనేది ఆమె కృషిలో ప్రత్యేకమైన, ప్రధానమైన అంశంగా ఉండేది. ఆమె కృషి, ప్రయత్నాలూ అన్నీ కలసి ఈ సమస్యలను పట్టించుకునే ఒక సంస్థ 'కౌన్సిల్ ఫర్ సోషల్ డెవల ప్‌మెంట్' రూపంలో ఆవిష్కరించబడ్డాయి. ఇవాళ తెలంగాణ ఆవిర్భవించిన తొలి దినాలలో సామాజిక అభివృద్ధి గురించిన ఎజెండాకు ఉండాల్సిన ప్రాధాన్యం గురించి నొక్కి చెప్పదల్చుకున్నాను. ఆ ఎజెండా తెలంగాణ రాష్ట్ర స్వరూప స్వభావాలను నిర్వచించి కీలక అంశంగా ఉండాలి.
తెలంగాణ ప్రభుత్వం మొదటి వారంలోనే పట్టించుకోవాల్సిన అతి ముఖ్యమైన, క్లిష్టమైన, కీలకమైన విషయంగా వ్యవసాయ రుణ మాఫీ ప్రశ్న ముందుకొచ్చింది- దీని గురించి పత్రికలలో వివిధ వాదనలు వినిపించాయి. ఒక వాదన రుణమాఫీ వల్ల ప్రభుత్వానికి అయ్యే ఖర్చు అదనపు భారం అంటే, రెండవ వాదన మరి పేద రైతుల మీద పెరిగే రుణభారం సంగతేమిటన్నది. తెలంగాణకు సంబంధించి ఈ రెండవ వాదనే నిలబడాలనే దానిలో రెండో మాటకు ఆస్కారం లేదు. రైతులను పీల్చి పిప్పి చేస్త్తున్న రుణభారం నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సమయాన్ని నిర్ణయించి, దాని ప్రకారం విముక్తులను చేయటమనేదే ప్రభుత్వ ఖజానా మీద ఉన్న అన్ని సమస్యలలోకి ప్రధానమైనది. అది ఎంత కష్టమైనా, నష్టమైనా ఫరవాలేదు. బీదరికపు హింస మానవ మూల్యాన్ని తగ్గించడం, నిర్మూలించటం కంటే ప్రభుత్వానికి ముఖ్యమైన పనేదీ లేదు.
బీద రైతులు రుణాలలో చిక్కుకుపోయిన తీరు గురించిన చర్చ వచ్చినపుడు ఒక విషయం ప్రధానంగా బైటికి వచ్చింది. రుణ మాఫీ గత ఏడాది తీసుకున్న రుణాలకే పరిమితమనే వార్త విన్న షాక్‌తో ఇద్దరు సన్నకారు రైతులు చనిపోయారు. ఒక రైతు చనిపోవడానికి కారణం కూతురికి వరకట్నం చెల్లించాల్సిన ఒప్పందపు ఒత్తిడి- ఇపుడు దానితోపాటు కుటుంబపు పెద్ద చనిపోతే వరకట్నం ఎలా చెల్లిస్తారనే సమస్య తోడయింది. ఈ సమస్య సామాజిక అంశాన్ని ఆర్థిక విషయంతో కలిపి కేంద్రీకరించి చూసేందుకు వీలు కలిగిస్తుంది. వరకట్నం ఎందుకు? రైతుల చావులు పితృస్వామిక విలువల గుప్పిటిలో, ఆ దుర్మార్గంతో గట్టిగా ముడిపడి ఉన్నాయి. స్త్రీలు బానిసత్వంలోనే మిగిలి ఉంటే అభివృద్ధి ఉంటుందా? ఇలాంటి ఆటంకాలనే వాటి సంబంధిత ప్రకంపనాలనే మనం పాఠశాలల్లో ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో తక్కువమంది బాలికలు ఉండటం, బాలికలకు చిన్న వయసులో వివాహాలు జరగటం, స్త్రీ మరణాలు ముఖ్యంగా ప్రసూతి మరణాలు పెరగటం మొదలైన వాటిలో చూడవచ్చు. బీదరిక భారంతో కుంగిపోయే, వ్యతిరేక సామాజిక ఒత్తిడిలకు లొంగిపోయే స్త్రీల మానసిక, సామాజిక వ్యాధుల గురించిన కనీసపు అవగాహన కూడా మనం సామాజిక అభివృద్ధిని గురించి అర్థం చేసుకునే తీరులో ప్రవేశించలేదు. రాజ్యాంగబద్ధ పాలన అంటున్న రోజుల్లో కూడా స్త్రీల వివేకం జ్ఞానం, ఉత్పాదకత, సమాన పెరుగుదలకు వారు పంచగలిగిన శక్తి సామర్థ్యాలు ఇవేవీ కనీస గుర్తింపునకు కూడా నోచుకోలేదు. స్త్రీల సంక్షేమానికి, ఉత్పాదకతకు జండర్‌పరమైన వివక్ష చెల్లించే మూల్యం ఎంత? కుటుంబ సంక్షేమపు మూల్యం ఎంత?
తెలంగాణలో ఆదివాసీలు జనాభా రీత్యా ప్రముఖంగానే ఉన్నారు. వారిలో భిన్నత్వం ఉంది. ప్రతి తెగకూ వారిపైన నైపుణ్యాలు, బలాలు ఉన్నాయి. అడవుల గురించి, సహజ సంపదల గురించి, ఉమ్మడి వనరుల గురించి, పర్యావరణం గురించీ సంప్రదాయ జ్ఞానం ఉంది. నిరంతరం కొనసాగే అభివృద్ధి గురించిన చర్చలు ప్రధాన భూమికను వ హిస్తున్న సందర్భంలో సామాజిక అభివృద్ధికి, సుస్థిర (సస్టైనబుల్) అభివృద్ధికి మధ్య ఉన్న సంబంధం తక్షణం గుర్తించాలి. అభివృద్ధిని ఆదివాసీల జీవితానుభవానికి సంబంధం లేకుండా నిర్మించటం, ఆదివాసీలను వారి సొంత నివాసాల నుంచి తరలించటం, ఇది తప్ప విద్య, వైద్యం, ప్రజా సంక్షేమం అందుబాటులోకి తెచ్చే విధానాలను గురించి ఆలోచించి వాటిని బలోపేతం చేసి ఆదివాసీలను అందించలేమా? పోలవరం గ్రామాలను బదిలీ చేయటం, ఆదివాసీల సొంత ఆవాస ప్రాంతాలను ముక్కలు చేయటం వంటి విషయాన్ని పునరాలోచించటం సామాజిక అభివృద్ధి దృష్ట్యా అతి ముఖ్యమైనది. అభివృద్ధిని ఒక దాడిలాగా, నిరంతరాయమైన పద్ధతిలో కాకుండా వేరే విధంగా ఆలోచించటం అవసరం. మానవ సామూహిక జీవితం, పర్యావరణం వాటి కొనసాగింపు గురించి ఆలోచించాలి. ఇవి గనుక మనం ధ్వంసం చేసుకుంటే చెల్లించాల్సిన మానవ, సామాజిక మూల్యం, ఆర్థిక పెరుగుదల కంటే అనే రెట్లు అధికమై, ఆర్థిక అభివృద్ధిని అర్థర హితంగా చేస్తుంది.
ఆదివాసీ కమ్యూనిటీలను ఒక ఊహాజనిత 'పవిత్ర' పరిస్థితిలో ఉంచాలనే ఆలోచన కాదు నేను చెప్పేది. వారి చారిత్రక అనుభవాలలో నుంచి సుస్థిరతని అర్థం చేసుకోవాలి. విద్య అనేది సమాజంతో రాజకీయాలతో జోక్యం కలిగి ఉండేందుకు, తె లుసుకునేందుకు ఒక మార్గం అనుకుంటే, ఆ విద్యా సంపదను సంపూర్ణంగా అందుకోకు ండా ఆదివాసీలను ఆటంకపరుస్తున్నవేవో అర్థం చేసుకోవాలి. చాలాకాలం నుంచీ మనం ఆదివాసీలకు విద్య విలువ తెలియదనే వాదన వింటూ వస్తున్నాం. కానీ నల్లమల అడవులలోని చెంచు పిల్లలందరూ బడికి, విద్యకు దగ్గర కావాలంటే తెలంగాణ ప్రభుత్వం ఇంతకు ముందు కంటే భిన్నంగా ఏం చెయ్యాలి? ఏం చెయ్యబోతుంది?

జబ్బులతో, అకాల మరణాలతో అభివృద్ధి సహజీవనం చేస్తుందా? ఒక పద్ధతి, నియమాలు లేకుండా, ప్లానింగ్ లేకుండా హైదరాబాదు నగరాన్ని పెంచుకుంటూ పోయారు. పారిశ్రామికీకరణకు నియమ నిబంధనలేవీ లేకుండా పోయాయి. దానివల్ల భూమి విలువ అనూహ్యంగా పెరిగింది. పబ్లిక్ వర్కులు పతనమయ్యాయి. మురుగు నీరు, పారిశ్రామిక కాలుష్యం ఇవి ప్రజల అనారోగ్యానికి, మరణాలకు ప్రధాన కారణం, నగర ప్రాంతాలలో దీనికి ఎక్కువగా బలయ్యేది పేద ప్రజలు. అసంఘటిత రంగంలో కార్మిక చట్టాలు లేకపోవటం-ముఖ్యంగా ఇళ్ళల్లో పనిచేసేవారికి, వలస కార్మికులకు-అనే సమస్యను అత్యవసరంగా పట్టించుకోవాలి. బానిసత్వంలో వెట్టితో నిర్మించబడే అభివృద్ధి అభివృద్ధి కానేకాదు. అంతర్జాతీయ కార్మిక చట్టాల స్థాయితో తప్పనిసరిగా సరిపోయే, సమానమైన చట్టాలు అమలైనపుడే, కార్మికుల గౌరవం, హోదా పెరిగినపుడే ఆర్థిక సామాజిక ప్రగతి సాధ్యం.
ఐక్యరాజ్య సమితి వికలాంగ వ్యక్తుల హక్కుల ఒప్పందం వికలాంగ హక్కులకు ఒక మంచి నమూనాను మనముందుంచుతుంది. మన కేంద్ర ప్రభుత్వం దాని ప్రాముఖ్యతను పూర్తిగా అవగతం చేసుకునే ప్రారంభ దశలోనే ఉంది. కానీ తెలంగాణ అభివృద్ధిలో వికలాంగులు సంపూర్ణ, సమాన భాగస్వాములుగా గుర్తించేందుకు మనం ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోబోతున్నాం? శ్రమ, ఉపాధి, విద్య - ముఖ్యంగా సంస్కృతి ఈ విషయాలలో ఏం చెయ్యబోతున్నాం? ఏ కొత్త రాష్ట్రమైనా సృజనాత్మక, ఆలోచనాత్మక రీతులలో ముందుకు వెళ్లాలంటే యువతరం మీద ఆధారపడాలి. యువతీ యువకులిద్దరిమీదా! వాళ్ళు 'మోరల్ పోలీసింగ్' భయం నుంచి బైటపడాలి, హింసకు గురికాకూడదు, కారణం లేకుండా అరెస్టులు, జైలుపాలు కాకూడదు. ఇలాంటి వాతావరణంలోనే వారిలో మానవీయ భావనలు, సమాన న్యాయ భావనలు వికసించగలుగుతాయి.
చివరిగా, కొద్ది సమస్యలను మాత్రమే ప్రస్తావించగలిగిన ఈ వ్యాస పరిధిలో, కుల సమస్య గురించి ప్రస్తావించక తప్పదు. ఎందుకంటే అది చాలా ఎక్కువగా, పై సమస్యలన్నిటితో ముడిపడి ఉన్నది. తెలంగాణలో న్యాయం జరగాలంటే కుల నిర్మూలన జరిగి తీరాల్సిందే. సాంఘిక వెలి, ఘోరమైన దాడులు, అత్యాచారాలు, అందరినీ కలుపుకుపోవాల్సిన రాజకీయాలతో సహజీవనం చేయవు. బాధ్యత న్యాయస్థానాల మీద, ప్రభుత్వ అధికారుల మీద, విద్యా సంస్థల మీద, పరిశోధనా సంస్థల మీద ఉంది. ఇవి సరిగా పనిచే సి కుల వివక్షను తుడిచిపెట్టేందుకు స్పష్టమైన ఆలోచనలనూ, వ్యూహాలనూ అందించాలి. తెలంగాణలో సామాజిక అభివృద్ధి అంటే అర్థం ఏమిటో ఆలోచించి దానిని అమలులో పెట్టాల్సిన సమయం ఇది!
- ప్రొఫెసర్ కల్పన కన్నబిరాన్
డైరెక్టర్, కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్

Andhra Jyothi Telugu News Paper Dated: 13/06/2014 
Posted by Dalit Blog at 1:16 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: కులం వర్గం
Older Posts Home
Subscribe to: Posts (Atom)

Labels

  • ‘ఆకలి కేకల పోరుయాత్ర’ (2)
  • AISF (1)
  • Anand Teltumbde (1)
  • Asaiah (3)
  • Avitikathalu (12)
  • Chandraiah Gopani (1)
  • DIET (2)
  • Discrimination in Universities (1)
  • Dr K. Satyanarayana (4)
  • Dr. Chinnaiah Jangam (1)
  • Dr. P Kanakaiah (2)
  • Education (3)
  • EFLU (1)
  • EGS (3)
  • HBT (1)
  • ICDS (1)
  • Kalpana Kannabiran (2)
  • KCR TRS (1)
  • KG .సత్యమూర్తి (17)
  • Kuldeep Nayar (1)
  • Laxmipeta atrocity on Dalits (19)
  • manual scavengers (1)
  • Nelson Mandela (1)
  • Nikhila Henry (1)
  • Novel (1)
  • P.S. KRISHNAN (1)
  • Palla Trinadha Rao (1)
  • Poverty (1)
  • Praveen Kumar IPS Issue (3)
  • R S Praveen Kumar (3)
  • Renowned Scholars (1)
  • S R Shankran IAS (2)
  • Sub Plan (6)
  • Suicieds (2)
  • Sukhadeo Thorat (1)
  • SWAEROES (1)
  • UDIT RAJ HANY BABU (1)
  • Universities (2)
  • YK (1)
  • అత్యాచార ఘటన (7)
  • అనుబంధకులాలు (1)
  • అరూరి సుధాకర్ (1)
  • అల్లం నారాయణ (9)
  • అవినీతి (3)
  • ఆచార్య అడపా సత్యనారాయణ (1)
  • ఆదినారాయణ (2)
  • ఆదివాసీలు (56)
  • ఆహార భద్రతా చట్టం (2)
  • ఇనప ఉపేందర్ & కోట రాజేశ్ (1)
  • ఇఫ్లూ రస్ట్‌గేషన్ (3)
  • ఈశ్వరీబాయి వర్ధంతి (2)
  • ఉ.సా (8)
  • ఉ.సా. (7)
  • ఉప ప్రణాళిక (సబ్ ప్లాన్) (7)
  • ఎన్. వేణుగోపాల్ (7)
  • ఎస్వీ సత్యనారాయణ (1)
  • ఎస్సీ వర్గీకరణ (5)
  • ఓల్గా (2)
  • కంచ ఐలయ్య (36)
  • కత్తి పద్మారావు (11)
  • కదిరె కృష్ణ (14)
  • కనీజ్ ఫాతిమా (4)
  • కాకి మాధవరావు (1)
  • కాన్షీరాం (1)
  • కార్తీక్ నవయాన్ (3)
  • కులం (9)
  • కులం వర్గం (6)
  • కృపాకర్ మాదిగ (16)
  • కొంగర మహేష్ (2)
  • కొప్పుల రాజు IAS (3)
  • కొలకలూరి ఇనాక్ (2)
  • కోనేరు కమిటీ (1)
  • గజ్జల కాంతం (1)
  • గాదె వెంకటేష్ (1)
  • గాలి వినోద్ కుమార్ (2)
  • గిన్నారపు ఆదినారాయణ (2)
  • గుడపల్లి రవి (1)
  • గుర్రం సీతారాములు (11)
  • గెడ్డం ఝాన్సీ (1)
  • గోగు శ్యామల (7)
  • ఘంటా చక్రపాణి (15)
  • చరిత్ర (1)
  • చర్మాలు శుభ్రం (1)
  • చిక్కుడు ప్రభాకర్ (5)
  • చిందు ఎల్లమ్మ (1)
  • చినువా అచెబే (1)
  • చుక్కా రామయ్య (2)
  • చుండూరు తీర్పు (5)
  • చెట్టుపల్లి మల్లికార్జున్ (1)
  • జయధీర్ తిరుమలరావు (1)
  • జాన్‌వెస్లి (1)
  • జి. రాములు (1)
  • జి. వివేక్‌ (1)
  • జిలుకర శ్రీనివాస్ (12)
  • జూపాక సుభద్ర (20)
  • జోగిని వ్యవస్థ (1)
  • డా. ఎ. సునీత (1)
  • డా. పి. కేశవకుమార్ (1)
  • డా. వెంకటేష్ నాయక్ (1)
  • డా.కాలువ మల్లయ్య (1)
  • డాక్టర్‌ నాగరాజు అసిలేటి (1)
  • డేవిడ్ (13)
  • డొక్కా మాణిక్యవరప్రసాద్‌ (1)
  • తెలంగాణ (24)
  • దళిత ప్రతిఘటనా నినాదం (2)
  • దళితులు (38)
  • దుడ్డు ప్రభాకర్ (9)
  • నయనాల సతీష్ కుమార్ (1)
  • నలమాస కృష్ణ (1)
  • నలిగంటి శరత్ (1)
  • నిజాం బ్రిటిష్ (1)
  • పసునూరి రవీందర్ (7)
  • పి. ఎస్. కృష్ణన్ (1)
  • పిడమర్తి రవి (1)
  • పైడి తెరేష్‌బాబు (1)
  • పౌరహక్కులు (8)
  • ప్రభాత్‌ పట్నాయక్‌ (3)
  • ప్రొఫెసర్‌ జి. కృష్ణారెడ్డి (1)
  • ప్రొఫెసర్ జి. లక్ష్మణ్ (1)
  • ప్రొఫెసర్ భంగ్యా భూక్యా (10)
  • బండమీది శ్రీనివాస్ (1)
  • బతుకమ్మ (2)
  • బామ (1)
  • బి సి (6)
  • బి.ఎస్.రాములు (1)
  • బిసి (1)
  • బీఫ్ ఫెస్టివల్ Articles (22)
  • బృందాకరత్‌ (4)
  • బొజ్జా తారకం (2)
  • భగత్ సింగ్ (1)
  • భూ సంస్కరణల చట్టం (1)
  • భూతం ముత్యాలు (1)
  • మందకృష్ణ మాదిగ (18)
  • మల్లెపల్లి లక్ష్మయ్య (3)
  • మహిళలు (20)
  • మహెజబీన్ (1)
  • మానవ హక్కులు (1)
  • మాన్యువల్‌ స్కావెంజర్స్‌ (2)
  • ముస్లిం (6)
  • మూడో జెండర్ (1)
  • యం.ఎఫ్.గోపీనాథ్ (14)
  • యింద్రవెల్లి రమేష్ (1)
  • రంగనాయకమ్మ (4)
  • రమేశ్ హజారి (2)
  • రావెల కిషోర్‌ బాబు (1)
  • వరవరరావు (12)
  • వికలాంగులు (22)
  • విప్లవ సాంస్కృతిక (1)
  • విభజన (4)
  • విమల. కె (1)
  • విశారధన్ (1)
  • వేముల ఎల్లయ్య (4)
  • వేలుపిళ్లై ప్రభాకరన్ (1)
  • సంగిశెట్టి శ్రీనివాస్ (5)
  • సా మాజికన్యాయం (13)
  • సామజిక తెలంగాణా (10)
  • సామాజిక శాస్త్రాల (1)
  • సామాజికన్యాయం (13)
  • సి. కాశిం (10)
  • సిలువేరు హరినాథ్ (2)
  • సీపీఐ (మావోయిస్టు) (2)
  • సుజాత సూరేపల్లి (25)
  • హరగోపాల్ (33)
  • హైదరాబాద్‌ రాష్ట్రం దళితుల పోరాటం (1)
  • హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ 2014 (2)

Followers

Blog Archive

  • ▼  2016 (5)
    • ▼  April (4)
      • మార్క్సి‌స్టు‌దృక్కోణంలో కులం By -ప్రభాత్‌ పట్నాయక...
      • పాలనలో చెరగని సంతకం Byరావెల కిషోర్‌ బాబు సాంఘిక, ...
      • భారత ‘అమూల్య రత్న’ బాబూజీ! By Krupakar Madiga
      • జాతీయ నాయకుడు జగ్జీవన్‌రామ్‌ By డొక్కా మాణిక్యవరప్...
    • ►  February (1)
  • ►  2015 (8)
    • ►  December (2)
    • ►  October (1)
    • ►  May (3)
    • ►  February (1)
    • ►  January (1)
  • ►  2014 (94)
    • ►  December (4)
    • ►  November (2)
    • ►  October (3)
    • ►  September (1)
    • ►  August (10)
    • ►  July (24)
    • ►  June (7)
    • ►  May (13)
    • ►  April (13)
    • ►  March (3)
    • ►  February (11)
    • ►  January (3)
  • ►  2013 (263)
    • ►  December (14)
    • ►  November (27)
    • ►  October (25)
    • ►  September (29)
    • ►  August (14)
    • ►  July (16)
    • ►  June (10)
    • ►  May (21)
    • ►  April (30)
    • ►  March (23)
    • ►  February (30)
    • ►  January (24)
  • ►  2012 (443)
    • ►  December (36)
    • ►  November (20)
    • ►  October (18)
    • ►  September (14)
    • ►  August (24)
    • ►  July (33)
    • ►  June (32)
    • ►  May (29)
    • ►  April (60)
    • ►  March (61)
    • ►  February (74)
    • ►  January (42)
  • ►  2011 (269)
    • ►  December (31)
    • ►  November (40)
    • ►  October (30)
    • ►  September (167)
    • ►  April (1)

About Me

My photo
Dalit Blog
The education and political power are the two main weapons... And it is democratic right.
View my complete profile
Travel theme. Powered by Blogger.