ఉప ముఖ్యమంత్రి రాజయ్యను తొలగించడాన్ని, తొలగించిన తీరును సమర్థిస్తున్న వారందరూ గుండె మీద చేయి వేసుకుని తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి లేదని చెప్పగలరా? రాజయ్య మినహా మిగతా మంత్రులు, శాసనసభ్యులు అవినీతికి పాల్పడటం లేదని హామీ ఇవ్వగలరా?... డాక్టర్ రాజయ్య విషయంలో వ్యవహరించిన తీరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన అంతరాత్మకు అయినా సంజాయిషీ ఇచ్చుకోవాలి. దళితులైనంత మాత్రాన అవినీతికి పాల్పడటానికి లైసెన్స్ ఇవ్వమని చెప్పడం నా ఉద్దేశం కాదు. జరుగుతున్న దాంట్లో వారి పాపం అతి స్వల్పం మాత్రమే కనుక దొరతనంతో కాకుండా దొడ్డ మనసుతో వ్యవహరించి ఉండాల్సింది అని చెప్పడమే నా అభిమతం. అవినీతి నిర్మూలన జరగాలంటే పై స్థాయి నుంచి ప్రారంభం కావాలి గానీ, అట్టడుగు స్థాయి నుంచి మొదలుపెడితే అది అంతిమంగా సామాజికపరమైన అశాంతికి దారితీసే ప్రమాదం ఉంది!
పిచ్చి ముదిరింది- తలకు రోకలి చుట్టమన్నాడట వెనకటికెవడో! ఆ స్థాయిలో కాకపోయినా ఇప్పుడు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులకు వాస్తు పిచ్చి పట్టుకుంది. వాస్తు నమ్మకాల పేరిట కట్టినవాటిని కూలగొట్టడం, మరమ్మతులు చేయడం చేస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఎంతో ముచ్చటపడి మూడు నాలుగు భవనాలను కూలగొట్టి కట్టించుకున్న సీఎం నివాస భవనం, క్యాంపు కార్యాలయానికి వాస్తు దోషం అన్న ముద్రవేసి పాడుబడుతున్న భవనాల జాబితాలో చేర్చారు. ఈ భవనంలోనే ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్ రెడ్డి మూడేళ్లు ఉన్నారు. ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వాస్తురీత్యా దోహదపడిన ఆ భవనాలు కానీ, సచివాలయాల భవన సముదాయం కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు పనికిరాకుండా పోయాయి. సచివాలయానికి భయంకరమైన వాస్తుదోషం ఉందని ఇప్పుడు ఆయన తేల్చిపారేశారు. ఉభయ రాష్ర్టాలకు చెందిన, ఇప్పుడు జీవిస్తున్న తెలుగు ప్రజలందరికీ ప్రస్తుత సచివాలయం మాత్రమే తెలుసు. ఎందరో ముఖ్యమంత్రులు అక్కడి నుంచే పరిపాలన చేసి తెలుగు నేల దశ, దిశను మార్చే నిర్ణయాలు తీసుకున్నారు. దశ బాగుంటే దిశ బాగుంటుందంటారు. అలాంటిది తమ దశలను మార్చుకోవడానికై, దిశలను మార్చడానికి ప్రస్తుత పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ప్రస్తుత విభజిత రాష్ర్టాలకు ముఖ్యమంత్రులైనవారు గానీ దివ్యమైన ముహూర్తాలు చూసుకునే ప్రమాణ స్వీకారంచేశారు. అయినా ఏ ఒక్కరూ శాశ్వతంగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగలేదు.. కొనసాగబోరు. వెయ్యేళ్లపాటు జీవించడానికి మనం ఈ భూమి మీదకు రాలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అప్పుడప్పుడు అంటూ ఉంటారు. ఈ వాస్తవం తెలిసిన కేసీఆర్‌కు వాస్తు ప్రకారమైనా, ముహూర్త బలం ప్రకారమైనా ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరన్న సంగతి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. హైదరాబాద్ వారసత్వాన్ని, చారిత్రక కట్టడాలను కాపాడాలనీ, అందుకోసం మెట్రో రైలు అలైన్‌మెంట్‌ను మార్చాలనీ పట్టుబట్టిన కేసీఆర్‌కు ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల దవాఖానా చారిత్రక కట్టడంగా కనిపించకపోవడం విస్మయం కలిగిస్తోంది. అదేమని ప్రశ్నించిన వారిపై వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. ఎర్రగడ్డలో 150 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సచివాలయాన్ని, శాఖాధిపతుల కార్యాలయాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు గానీ, కొత్త సచివాలయ నిర్మాణానికి 500 కోట్ల రూపాయలకు పైగా వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఎర్రమంజిల్‌లో నిర్మిస్తున్న రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికే 70 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుత సచివాలయంలోని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల కార్యాలయాలలో వాస్తు హంగుల కోసం పదుల కోట్లు ఖర్చు చేశారు. అలాంటిది 150 కోట్ల రూపాయలతో నూతన సచివాలయాన్ని నిర్మిస్తామని చెప్పినంత మాత్రాన నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. వాస్తు నమ్మకం అనేది వ్యక్తుల వ్యక్తిగత విశ్వాసం. అందుకోసం ప్రజాధనాన్ని ఖర్చు చేసే అధికారం ముఖ్యమంత్రులకు, మంత్రులకు ఎవరు ఇచ్చారో తెలియదు! తెలంగాణ రాష్ట్రం ఏర్పడినది ప్రజల జీవితాలు బాగుపరిచేందుకేగానీ సచివాలయం నిర్మించుకోవడానికి కాదు. తాను అధికారంలోకి వస్తే ఇప్పుడున్న సచివాలయాన్ని పడగొట్టి ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిని తరలించి అక్కడ కొత్త సచివాలయాన్ని నిర్మిస్తానని ఎన్నికల సందర్భంలో కేసీఆర్ చెప్పి ఉండాల్సింది. రాజుల సొమ్ము రాళ్లపాలు అని గతంలో రాజ్యాలు ఉన్నప్పుడు అనేవారు. ఇప్పుడు తెలంగాణలో ప్రజల సొమ్ము కాంక్రీట్ భవనాల పాలు కాబోతున్నది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు టవర్ల పిచ్చి పట్టుకుంది. ఎక్కడబడితే అక్కడ టవర్లు నిర్మించాలని ఆయన తలపోస్తున్నారు. అవి ఎందుకో, ఎవరి కోసమో మాత్రం చెప్పడం లేదు. పింఛన్ల కోసం అలమటిస్తున్న అభాగ్యులను ఆదుకోవడానికి గానీ, అప్పుల బాధతో ఉసురు తీసుకుంటున్న రైతులకు ఆపన్నహస్తం అందించడానికి గానీ కేసీఆర్‌కు మనసు రావడం లేదు. కొత్త సచివాలయాన్ని నిర్మించిన తర్వాత ఇప్పుడున్న భవనాలను వివిధ ప్రాంతాలలో ఉన్న శాఖాధిపతులు, ఇతర అధికారుల కార్యాలయ భవనాలను ఏమి చేస్తారో మాత్రం ఆయన చెప్పరు. అంతేకాదు అర్థరహితమైన, అహేతుకమైన, ఆచరణసాధ్యం కాని ఆయన నిర్ణయాలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిని తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేస్తారు. అయితే తెలంగాణ సమాజం ఇప్పుడిప్పుడే మేల్కొంటోంది. కేసీఆర్ చర్యలను నిశితంగా గమనించడం మొదలెట్టింది. త్వరలోనే నోరు విప్పడానికి సిద్ధమవుతోంది. నాలుక మడత వేయడంలో మన రాజకీయ నాయకులు సిద్ధహస్తులు. ఈ విషయంలో కేసీఆర్ నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. ‘‘మా పిల్లలకు మాత్రమే మేం ఫీజులు చెల్లిస్తాం గానీ, పొరుగు రాష్ర్టాలవారి పిల్లలకు ఎందుకు చెల్లించాలి? ఆంధ్రావారి పిల్లలకు మేం ఫీజు చెల్లించబోం. అందుకోసం ఫాస్ట్ పథకాన్ని తీసుకు వస్తాం’’ అని అధికారం చేపట్టిన కొత్తలో కేసీఆర్ అనేక ప్రకటనలు చేశారు. ‘‘ఆహా మా ముఖ్యమంత్రి ఎంత బాగా చెప్పారు’’ అని ఆయన చుట్టూ ఉండే తెలంగాణవాదులు చప్పట్లు కొట్టారు. అయితే అలా చేయడం జరిగేపని కాదనీ, ఆర్టికల్ 371-డి అమలులో ఉన్నా లేకపోయినా, 1956కి పూర్వం నుంచి తెలంగాణలో ఉన్నవారి పిల్లలనే స్థానికులుగా నిర్ణయించడం చట్టసమ్మతం కాదని నేను అప్పుడే చెప్పాను. దీనిపై అప్పట్లో నాపై అవాకులు చెవాకులు పేలారు. ఇప్పుడు ఏమి జరిగింది? హైకోర్టులో మొట్టికాయలు తప్పవని గ్రహించిన కేసీఆర్ తన ఆలోచనను విరమించుకున్నారు. ఏ నోటితో అప్పుడు ఆ మాట అన్నారో, ఇప్పుడు అదే నోటితో ‘‘ఫాస్ట్ లేదు.. గీస్టు లేదు’’ అని తేల్చిపారేశారు. నిజానికి ఫాస్ట్ పథకం చెల్లదని కేసీఆర్‌కు కూడా తెలుసు. అయితే తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలిస్తూనే ఉండాలన్న ఉద్దేశంతో చట్టవిరుద్ధమైన వాదనను తెరపైకి తెచ్చారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆయన ఎన్ని పర్యాయాలు నాలుక మడత వేశారో పాత పత్రికలు తిరగేస్తే తెలుస్తుంది. కేసీఆర్ మాటలు, చర్యలు కొన్నిసార్లు వినసొంపుగా, అబ్బురపరిచేవిగా ఉంటాయి. ఆయన గురించి చాలావరకు తెలిసిన నాకే కొన్ని సందర్భాలలో ఆయన ప్రకటనలు నిజమే కాబోలని నమ్మే పరిస్థితి ఏర్పడింది. అలాంటిది ఒక ఉద్యమ నాయకుడిగా తప్ప ఇతరత్రా కేసీఆర్ గురించి ఏమీ తెలియని తెలంగాణ సమాజం సహజంగానే కేసీఆర్ ప్రకటనల పట్ల ఆకర్షితమైంది. అయితే ఇప్పుడిప్పుడే అందరికీ తత్వం బోధపడుతోంది. ప్రస్తుత సచివాలయాన్ని ఖాళీచేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలనుకుంటున్న కేసీఆర్, తాను అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలోని ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రినని గ్రహించాలి. ప్రస్తుత సచివాలయంలో వాస్తు బాగోనందున నష్టం తెలంగాణకా? కేసీఆర్‌కా? కొత్త సచివాలయం నిర్మించడం వల్ల తెలంగాణ సమాజం బాగుపడుతుందా? కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడుతుందా? నూతన సచివాలయంలోకి మార్చినంత మాత్రాన తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండిపోగలరా? తన నిర్ణయాన్ని అమలుచేసే ముందు కేసీఆర్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. నిజం చెప్పాలంటే తెలంగాణ సమాజంలో వాస్తుకు అంత గుర్తింపు గానీ, ప్రాధాన్యం గానీ లేదు. ప్రస్తుత వాస్తు విశ్వాసం ప్రధానంగా ఆంధ్ర ప్రాంతం నుంచి దిగుమతి అయినది మాత్రమే! అడుగడుగునా ఆంధ్రా వ్యతిరేకతను నూరిపోసే కేసీఆర్‌కు ఆంధ్రావాళ్లు మాత్రమే ఎక్కువగా నమ్మే వాస్తు మీద నమ్మకం ఎందుకు కలిగిందో, ఎప్పుడు కలిగిందో తెలియదు. పనిలో పనిగా శుక్రవారంనాడు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తాను మొక్కిన మొక్కులను ఆయా దేవుళ్లు, దేవతలకు తీర్చబోతున్నట్టు చెప్పారు. వ్యక్తిగతంగా ఆయన మొక్కుకున్న మొక్కులు తీర్చడానికి ప్రజాధనం ఖర్చు చేయడంలోని ఔచిత్యం ఏమిటో ఆయనకే తెలియాలి! బహుశా ఆయన ‘‘నేను ముఖ్యమంత్రి అయితే..’’ అని మొక్కుకుని ఉంటారు. అందుకే ప్రజాధనంతో మొక్కులు తీర్చడానికి తెగబడుతున్నారు. మరి వారు కనిపించడం లేదా? రోజుకో అడ్డం పొడుగు ప్రకటనలు చేయడం కేసీఆర్‌కు అలవాటే కనుక ఆ విషయం కాసేపు పక్కన పెట్టి ఉప ముఖ్యమంత్రి రాజయ్యను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన వ్యవహారానికి వద్దాం. ప్రస్తుత ప్రభుత్వంలో రాజయ్య ఒక్కరే అవినీతిపరుడన్న ముద్రవేసి ఆయనను పదవి నుంచి తొలగించిన కేసీఆర్‌ను అభినందించాల్సిందే! దళితులకు అధికారం అప్పగిస్తే అవినీతికి పాల్పడతారని తన ఈ చర్య ద్వారా తెలంగాణ సమాజానికి చక్కటి సందేశం పంపిన కేసీఆర్‌కు తెలంగాణలోని దళితులందరూ రుణపడి ఉండాలేమో! అణువణువునా అహంకారాన్ని నింపుకొన్నవారు మాత్రమే ఇలా వ్యవహరించగలరు. ప్రభుత్వాలలో జరిగే అవినీతిలో దళితుల వాటా అతి స్వల్పంగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద డీల్స్ చేసుకునేవారు ఎవ్వరూ వారిని సంప్రదించరు. ముఖ్యమంత్రులుగా, వారికి నమ్మకస్తులుగా అగ్ర కులాలకు చెందిన వారే ఉంటారు కనుక వందల కోట్ల అవినీతి వారి సొంతమే అవుతుంది. దళితులకు మిగిలేది తాలు, తప్ప మాత్రమే! అందుకే ఎవరైనా దళిత నాయకుడు అవినీతికి పాల్పడినట్టు బయటకు పొక్కినా మన సమాజం అంత సీరియ్‌సగా తీసుకోదు. ఎందుకంటే వారు చేసిన అవినీతి వల్ల కొంపలు మునిగిపోవు. ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఉద్వాసనకు దారితీసిన వ్యవహారంలో ఎంత మేరకు అవినీతి జరిగిందో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పలేదు. తెలంగాణ రాష్ట్రంలో పెచ్చుమీరిపోతున్న ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాలలో దళితులు లేరే! సీమాంధ్రతో పోల్చితే తెలంగాణలో దళితులు, ముఖ్యంగా మాదిగల జీవితాలు దుర్భరంగా ఉంటాయి. ఆర్థికంగా, సామాజికంగా వెలివేతకు గురైన జీవితాలు వారివి! అలాంటి మాదిగ వర్గానికి చెందిన రాజయ్యను అత్యంత అమానుషంగా, అవమానకరంగా పదవి నుంచి తొలగించడం కేసీఆర్‌కు మాత్రమే చెల్లింది. అదేమని ప్రశ్నించినవారిపై ‘‘అవినీతిని ఉపేక్షించమంటావా?’’ అంటూ ఆయన వందిమాగధులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఉప ముఖ్యమంత్రి రాజయ్యను తొలగించడాన్ని, తొలగించిన తీరును సమర్థిస్తున్నవారందరూ గుండె మీద చేయి వేసుకుని తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి లేదని చెప్పగలరా? రాజయ్య మినహా మిగతా మంత్రులు, శాసనసభ్యులు అవినీతికి పాల్పడటం లేదని హామీ ఇవ్వగలరా? అంతా నేతిబీరకాయలో నేతి చందంగా ఉంది. ప్రస్తుత రాజకీయంలో అవినీతికి పాల్పడకుండా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగించలేని దుస్థితి. వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్న కేసులలో విచారణ ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా సమకూర్చిన సమాజం మనది! తాను నిజాయితీపరుడినని నిరూపించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నో మార్గాలున్నాయి. అందుకు రాజయ్య లాంటి బలహీనులు అవసరమా? జిల్లాలలో యథేచ్ఛగా వనరుల దోపిడీకి పాల్పడుతున్న ఇతర మంత్రులు, పార్టీ నాయకులపై కేసీఆర్ ఎందుకు చర్య తీసుకోవడం లేదు? నిజామాబాద్ జిల్లాలోని మంజీరా నదిలో వందల కోట్ల రూపాయల ఇసుకను అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నవారి సంగతి ఏమిటి? ఈ దందాలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడు, నిజామాబాద్ ఎంపీ కవిత హస్తం ఉందని జిల్లా ప్రజలందరూ బహిరంగంగానే చర్చించుకుంటున్నారే! ఈ మాటలు కేసీఆర్ చెవికి సోకడం లేదా? కవిత లేదా పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడి హస్తం ఉందనడానికి ప్రత్యక్ష ఆధారాలు లేకపోవచ్చును గానీ జరుగుతున్నదేమిటో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే కదా! అనధికారికంగా జరిపే అక్రమాలకు ఆధారాలు ఉండవు కదా? అవినీతికి పాల్పడితే సొంత కొడుకైనా, కూతురైనా జైలుకు పంపిస్తానని ముఖ్యమంత్రి అయిన కొత్తలో కేసీఆర్ చేసిన ప్రకటనలు నమ్మి చప్పట్లు కొట్టినవారిలో నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా ఉన్నారు. ఇప్పుడు వారే ముక్కున వేలేసుకుంటున్నారు. దోషులపై చర్య తీసుకోవలసింది పోయి ఇసుక బాగోతాన్ని బయటపెట్టిన ‘ఆంధ్రజ్యోతి’ పత్రికపై శుక్రవారంనాడు జరిగిన కేబినెట్ సమావేశంలో కేసీఆర్ విరుచుకుపడ్డారట! ఇలాంటి వార్తలు ప్రచురిస్తే కేసులు వేయాలని మంత్రులకు ఉద్బోధించారు కూడా! రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే ‘ఆంధ్రజ్యోతి’పై కేసులు వేయించారు. ఇప్పుడు ఏమైంది? ఆనాడు మేం ప్రచురించిన వార్తలకు సంబంధించిన కేసులలోనే ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి దోషిగా కోర్టు ముందు నిలబడ్డారు. పది శాతం ఇస్తేనే.. అవినీతిని అరికట్టే విషయంలో ఎవరు చిత్తశుద్ధి ప్రదర్శించినా అభినందించవలసిందే! అయితే ‘‘అవినీతికి పాల్పడే హక్కు మాకు మాత్రమే ఉంది. దళితులకు లేదు’’ అన్న సందేశం ఇవ్వడంతోనే ఈ తంటా అంతా! ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి విషయంలో తనను తాను నిప్పుతో పోల్చుకుంటూ ఉంటారు. నిజంగా ఆయన నిప్పు కాబోలునని కొంతమంది నమ్ముతున్నారు. సందర్భం వచ్చింది కనుక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న తంతు గురించి చెప్పవలసి వస్తోంది. రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని పాలకులకు నీటిపారుదల ప్రాజెక్టులు కామధేనువుగా మారాయి. బతికున్నంత వరకు ఆయన ఎంత దండుకోవాలో అంతా దండుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా తమ వాటా తాము దక్కించుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వంతు వచ్చింది. ఈ సదుపాయం ఏపీలో తక్కువ. ఎందుకంటే అక్కడ నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు పోలవరం మినహా పెద్దగా లేవు. వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా చేతికి మట్టి అంటుకోకుండా కీలక స్థానాలలో ఉన్నవారు తమ వాటా తాము పొందుతున్నారు. మట్టి అంటడం లేదని ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే అవన్నీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు మాత్రమే! ప్రస్తుత ప్రభుత్వం మంజూరు చేసినవి కావు! సరిగ్గా ఇక్కడే మళ్లీ పాత నమూనాను అనుసరిస్తూ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలి అవినీతికి తెర లేపారు. అదెలాగంటే ఆయా ప్రాజెక్టుల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి కదా! ఏ ప్రతిఫలం ఆశించకుండా అంతంత మొత్తాలు చెల్లించడం ఆనవాయితీ కాదు కనుక పది శాతం ఇస్తేగానీ బిల్లులు చెల్లిందేది లేదని షరతు పెట్టారు. అందుకు కాంట్రాక్టర్లు తలాడించక చస్తారా? దీంతో మనవాడు మిస్టర్ క్లీన్ కాదు, మిస్టర్ టెన్ పర్సంట్ అని కాంట్రాక్టర్లు ముద్దుగా పిల్చుకోవడం మొదలెట్టారు. అయితే ఈ పది శాతాన్ని ఆ తర్వాత ఆరు శాతానికి తగ్గించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 2,500 కోట్ల రూపాయల వరకు బిల్లులు చెల్లించారు. ముఖ్య నేతలు విధించిన షరతు ప్రకారం ఆయా కాంట్రాక్టర్లు ‘రుసుము’ కింద 200 కోట్ల రూపాయల వరకు సమర్పించుకున్నారు. ఈ మొత్తం ఎవరికి చేరుతున్నదో కూడా తెలుసు. ఏలిన వారికి నమ్మకస్తులు ఉండాలి కదా! రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వసూళ్లను కె.వి.పి.రామచంద్రరావు పర్యవేక్షించేవారు. ఇప్పుడు కేసీఆర్ జమానాలో అలాంటి నమ్మకస్తుడే ఒకరు దొరికారు. ఆయన ఎవరు? ఏమిటి? అన్నది తర్వాత వెల్లడిస్తాం. అయితే కమిషన్లు చెల్లించేవారు రశీదులు అడగరు. తీసుకున్నవాళ్లు కూడా రశీదులు ఇవ్వరు. అందుకే ‘‘దమ్ముంటే రుజువు చేయండి’’ అని పాలకులు సవాళ్లు విసరగలుగుతున్నారు. వ్యతిరేక వార్తలు ప్రచురించే పత్రికలపై కేసులు వేయవలసిందిగా మంత్రులను కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెట్టిన నాపై కూడా కేసు వేయవచ్చు. ఒక రకంగా అలా కేసు వేయడమే మంచిది. న్యాయస్థానం వారు విచారణకు ఆదేశిస్తే ఈ వ్యవహారాన్ని రుజువు చేసే అవకాశం మాకు దక్కుతుంది. బిల్లులు పొందడానికి తాము ఎంత చెల్లించిందీ చెప్పడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి. తెలంగాణలో అవినీతికి పాల్పడింది డాక్టర్ రాజయ్య ఒక్కరేనా? బిల్లులు చెల్లించినందుకు కమీషన్లు తీసుకోవడం అవినీతి కిందకు రాదా? పురిటి నొప్పులతో బాధపడుతున్న భార్యను ప్రసవం కోసం ఆసుపత్రిలో చేర్పించిన ఒక అభాగ్యుడిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అడుగడుగునా లంచాల కోసం వేధించడాన్ని తట్టుకోలేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటే ఎవరిపైనా చర్యలు తీసుకోలేదే? ‘ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూసినా అందందే కలడు’ అని సర్వాంతర్యామి గురించి భాగవతంలో ప్రహ్లాదుడంటాడు. అలాగే అవినీతి అనేది మన జీవితాలతో పెనవేసుకుపోయింది. అవినీతి లేనిదే బతకలేని పరిస్థితులు కొని తెచ్చుకున్నాం. గొంగళిలో అన్నం తింటూ వెంట్రుకలు ఏరిన చందంగా పరిస్థితి తయారయ్యింది. ఈ నేపథ్యంలో డాక్టర్ రాజయ్య విషయంలో వ్యవహరించిన తీరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన అంతరాత్మకు అయినా సంజాయిషీ ఇచ్చుకోవాలి. దళితులైనంత మాత్రాన అవినీతికి పాల్పడటానికి లైసెన్స్ ఇవ్వమని చెప్పడం నా ఉద్దేశం కాదు. జరుగుతున్న దాంట్లో వారి పాపం అతి స్వల్పం మాత్రమే కనుక దొరతనంతో కాకుండా దొడ్డ మనసుతో వ్యవహరించి ఉండాల్సింది అని చెప్పడమే నా అభిమతం. అవినీతి నిర్మూలన జరగాలంటే పై స్థాయి నుంచి ప్రారంభం కావాలి గానీ, అట్టడుగు స్థాయి నుంచి మొదలుపెడితే అది అంతిమంగా సామాజికపరమైన అశాంతికి దారితీసే ప్రమాదం ఉంది!
Andhra Jyothi Telugu News Paper Dated: 01/02/2015
|
Tuesday, February 10, 2015
మీరు పులు కడిగిన ముత్యాలా? By Andhra Jyothi MD Radha Krishna Editorial
Subscribe to:
Posts (Atom)