Friday, January 31, 2014

నీతి నిలబడితేనే మనం నిలబడతాం - కాకి మాధవరావు (IAS Rtd)

 

వ్యవస్థలో మార్పు కోసం శ్రమించే వారిని వ్యక్తులుగా విడదీసి అశక్తులుగా నిలబెట్టాలని చూస్తుంది సమాజంలోని ఒక వర్గం. అదే పనిగా కుతంత్రాలు చేస్తూ, కుంగదీయాలని కూడా చూస్తుంది. వాటిని ఎదిరించే దిశగా అడుగులు వేయలేకపోతే ఎవరైనా నిలువునా కూలిపోవాల్సి వస్తుంది. ఎన్నో అవరోధాల్ని అడుగడుగునా ఎదుర్కొంటూ నీతికీ నిబద్ధతకూ మారుపేరుగా నిలిచిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు కాకి మాధవరావు. మూడున్నర దశాబ్దాల ఐఏఎస్ అధికారిగా, ఏడు దశాబ్దాల జీవన యాత్రికుడిగా కాకి మాధవరావుకు ఎదురైన కొన్ని సంఘటనలే ఈ వారం 'అనుభవం'
కృష్ణాజిల్లాలోని పెదమద్దాలి మా ఊరు. నేనేదైనా ఒక స్థితికి వచ్చానూ అంటే, అందుకు దోహదం చేసిన బలమైన సంఘటనలు కొన్ని నా బాల్యంలోనే జరిగాయి. మా నాన్న ఒక పాలేరు. చుట్టుపక్కల చాలా ఊళ్లల్లో ఆయనకు బాగా శ్రమించే, నిజాయితీ గల మంచి పాలేరుగా పేరుంది. ఆ రకంగా తనకు లభించిన గుర్తింపు వల్లో ఏమో గానీ, ఆయన నన్ను కూడా పాలేరునే చేద్దామనుకున్నారు. ఆ మాటే అమ్మతో అంటే, లేదు. వాడ్ని బళ్లో వేద్దామంది. "బళ్లో వేస్తే ఏం చేస్తాడు? గాడిదల్ని కాస్తాడా?'' అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు నాన్న. అయినా, అమ్మ చదివించాల్సిందే అంది. ఎంత మాత్రం వీల్లేదంటూ నాన్న వెళ్లిపోయాడు. నాన్న ఆమోదం లేకుండానే అమ్మ నన్ను స్కూల్లో చేర్పించింది. పగలంతా పనికిపోయే నాన్నకు ఆ విషయం తెలియకుండానే ఉండిపోతుందని కూడా అనుకుంది. కానీ, కొద్ది రోజులకే ఆయనకు తెలిసిపోయింది. నేను చెప్పినా వినకుండా వాడ్ని స్కూల్లో చేరుస్తావా? అంటూ నాన్న ఆ రోజు అమ్మను గొడ్డును బాదినట్టు బాదాడు. అడ్డం వెళితే, మా అన్నయ్యనూ, నన్నూ కూడా తన్నాడు. అంత జరిగినా "ఎన్నాళ్లు కొడతాడో చూద్దాం మీరు మాత్రం చదువు మానేయొద్దు'' అంది. ఆ కారణంగా అమ్మను ఎన్ని సార్లు కొట్టాడో లెక్కలేదు. చివరికి విసుగు పుట్టి వదిలేశాడు. నా చదువు, మా అన్నయ్య చదువు మా నాన్న అయిష్టత మధ్యే కొనసాగింది. మాకు తెలిసి ఆయన తన జీవితంలో ఓటమి అంటూ ఎరగడు. కానీ, ఈ ఒక్క విషయంలో మాత్రం నాన్న ఓడిపోయాడు. చూసే ప్రపంచం చిన్నదైపోయినపుడు ఎంత వారికైనా ఓటమి తప్పదేమోనని నాకనిపిస్తుంది.
చేయని నేరానికి....
సుబ్బయ్యని మా నాన్నకు ఒక సోదరుడు ఉండేవాడు. చెరువులోని తామరాకుల్ని కోసి వాటిని పొట్లాలు కట్టుకునేందుకు మిఠాయి షాప్‌లకూ, మాంసం షాప్‌లకూ అమ్ముతూ బతికేవాడు. ఒక రోజు సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో నేను చెరువు పక్కనుంచి న డుచుకుంటూ ఊళ్లోకి వస్తున్నాను. అప్పుడు నాకు 8 ఏళ్లు ఉంటాయేమో. అప్పటికే చీకటి పడింది. రోజూ లాగే ఆయన తామరాకుల్ని ఎండబె ట్టి ఆ తర్వాత వాటిని ఒకచోటికి చేరుస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో పెద్ద గాలి దుమారం వచ్చింది. ఆ తాకిడికి ఆకులన్నీ ఎగిరిపోతున్నాయి. అది గమనించిన ఆయన "ఓరి దేవుడా నా పొట్టకొట్టావురోయ్, నాకు తిండి లేకుండా చేశావు. ఈ ఆకులన్నీ పోతే నేను ఏమమ్ముకుంటాను? ఏం తింటాను.?'' అంటూ పరుగులు తీస్తూ ఆ ఆకుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో కొంత సాయం చేద్దామని నాకు సాధ్యమైనన్ని ఆకుల్ని ఒక చోట చేర్చి, ఆ తర్వాత వచ్చేశాను. ఇంటికి వచ్చేసరికి బాగా ఆలస్యమయింది. మా నాన్న గుడ్లురుముతూ నా మీదికి వచ్చాడు. ఎక్కడికి వెళ్లావు.? ఎందుకు ఆలస్యమయింది? అనేమీ అడక్కుండా, నన్ను చితక బాదేశాడు. ఎందుకు కొడుతున్నాడో నాకు అర్థం కాలేదు. నే ను మంచి పనే కదా చేశాను, పైగా ఆయన సోదరుడికే కదా సాయం చేశాననే మాట నా మనసులో ఉంది. అయినా, ఆలస్యానికి ఇదీ కారణమని చెప్పాలని కూడా నాకనిపించలేదు. నేను తప్పు చేయకపోయినా కొడుతున్నాడనే బాధ నన్ను వేధిస్తోంది. తీవ్రమైన ఒక అంతర్వేదనతో ఆ రాత్రంతా గడిచిపోయింది. దీని మీద నా నిరసనను, నా కోపాన్ని ఆయనకు ఎలాగైనా తెలియచేయాలనుకున్నాను.

మా నాన్న ఎప్పుడు క్షవ రం చేయించినా మంగలిని జుత్తు మరీ చిన్నదిగా చేయమని చెప్పేవాడు. నేనే వద్దూ వద్దూ అంటూ ఉండేవాణ్ని. అలాంటి నేను మంగలి వద్దకు వెళ్లి గుండు చేయించుకుని వచ్చాను. అంతే కాదు అమ్మతోనూ, నాన్నతోనూ మాట్లాడటం మానేశాను. ఆ మౌనంలో నాకు ఏవేవో ఆలోచనలు వచ్చేవి. త ప్పు చేయకుండానే ఇలా దండించారే..! నిజంగానే తప్పు చేస్తే ఏం కావాలి? ఒక వేళ నిజంగానే నేను త ప్పు చేసి ఉంటే అప్పుడు నా వద్ద సమాధానం ఉండదు. అందుకే జీవితంలో తప్పంటూ చేయకూడదనే ఒక నిర్ణయానికి వచ్చేశాను. స్నేహితులు, సరదా కబుర్లు, ఆట పాటల లాంటివన్నీ ఆ రోజునుంచి నా జీవితంలోంచి పూర్తిగా అదృశ్యమైపోయాయి. ఫలితంగా, నాలో క్రమంగా పెరుగుతూ వచ్చిన సీరియస్‌నెస్ నన్నొక పుస్తకాల పురుగును చేసింది. నాన్న చేతిలో నేను అన్యాయంగానే హింసకు గురైనా అది నాలో వేరే రకమైన కసిని పెంచింది. హింసను ఒక వైపునుంచే చూస్తే మనం కూలిపోవడం ఖాయం. అలా కాకుండా ఆవలి వైపు నుంచి చూస్తే అది మనల్ని నిలబెడుతుంది కూడాను అని నాకనిపిస్తుంది.
నక్సలైటుగా ముద్రవేసి....
నేను వరంగల్‌లో కలెక్టర్‌గా ఉన్న సమయంలో జనాన్ని తీవ్రమైన ఆందోళనకు గురిచేసే పరిణామాలు కొన్ని జరిగాయి. నక్సలైట్లు అన్న పేరుతో పోలీసులు కొంత మంది స్థానిక యువకుల్ని అడవుల్లోకి తీసుకెళ్లి కొద్ది రోజులు ఉంచేసేవారు. ఆ తర్వాత ఒక ఇన్స్‌పెక్టర్ వాళ్ల తలిదండ్రులను కలిసి, పోలీసులు ఇవ్వాళో రేపో మీ పిల్లాడ్ని కాల్చేస్తారు, మీరు ఇంత డబ్బు ఇస్తే పోలీసులకు చెప్పి విడిపిస్తాను అంటూ బేరం పెట్టేవాడు. మోహన్ రావు అనే సిపిఐ నాయకుడొకాయన నాకీ విషయం చెప్పాడు. వెంటనే ఈ విషయాన్ని నేను ఎస్.పి గారికి చెప్పాను. ఆయన అలాంటిదేమీ లేదని దాటవేశాడు. మళ్లీ ఒకరోజు అదే మోహన్ రావు ఫలానా అడవిలోని ఫలానా కొండ మీద 16 మంది యువకుల్ని బంధించి ఉంచారంటూ సమాచారాన్ని చేరవేశాడు. అప్పుడింక తట్టుకోలేకపోయాను. సబ్-కలెక్టర్‌గా ఉన్న జి. పి. రావును, అసిస్టెంట్-కలెక్టర్‌గా ట్రెయినింగ్‌లో ఉన్న హరిని ఆ ప్రదేశానికి వెళ్లమని చెప్పాను. వీళ్లు అక్కడికి వెళ్లి చూస్తే 16 కాదు 22 మంది ఉన్నారు.

వాళ్లను వెంటనే విడిపించాను.
ఆ సంఘటనతో పోలీసులు నా మీద కన్నెర్ర చేశారు. వివిధ కారణాలతో అప్పటికే నా మీద ద్వేషంతో ఉన్న కొంత మంది ఎం.ఎల్.ఏలు, ఒక మంత్రి ఇదే అదనుగా 'కలెక్టరు నక్సలైటు' అంటూ నా మీద ఒక పిటిషన్ తయారు చేసి అప్పటి రాష్ట్రపతి వి.వి. గిరికి అందచేశారు. ఈ విషయం స్థానిక పత్రికల్లోనూ, వివిధ జాతీయ పత్రికల్లోనూ ప్రచురితమమయ్యింది. కాని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో మాత్రం నా గురించి చాలా పాజిటివ్ వ్యాసం వచ్చింది. దాని శీర్షిక 'నక్సలైట్ ఇన్ ఐఏఎస్ క్లోత్స్..!' అని. అందులో "అన్యాయంగా తమ భూమిలోంచి తరిమివేయబడ్డ పేదవారికి ఆయన తిరిగి ఆ భూమిని ఇప్పించాడు. గీతకార్మికులకు కాకుండాపోతున్న తాటి, ఈత చెట్లను వారికి అందేలా చేశాడు. ప్రభుత్వం ఇచ్చే కరువు నివారణా నిధులను పేదవాళ్ల పొలాలు చదును చేయడానికి, బావులు తవ్వడానికి ఖర్చు చేశాడు. ఈ చర్యలన్నీ నక్సలిజంలో భాగమే అయితే ఆ కలెక్టరు నక్సలైటే' అంటూ రాశారు. ఈ వ్యాసం కూడా అప్పటి రాష్ట్రపతి వి. వి. గిరి దృష్టికి వెళ్లింది. ఆయన విచారణకు ఆదేశించారు.

ఐ.బి జాయింట్ డైరెక్టర్ కూడా నా వల్ల పోలీసులకు చాలా ఇబ్బందులు ఉంటాయని భావించి కొన్ని కుయుక్తులకు పాల్పడ్డారు. అందులో భాగంగా డి.ఎస్.పితో ఈ కలెక్టర్ మీద ఏదైనా ఒక నెగెటివ్ వాక్యం రాయండి. నేను అతన్ని తన ఉద్యోగ విధుల్లోంచి తొలగిస్తానన్నాడట. అయితే అలా రాయడానికి ఆ డి.ఎస్.పి మనస్సాక్షి ఒప్పుకోలేదు. అందుకే రాయలేదు. పైగా "అతని వల్ల కొంత మంది ఇబ్బంది పడుతున్న మాట నిజమే కానీ, అతనికి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పడం నిజం కాదు'' అంటూ రాశాడు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నా, నేను అక్కడే కొనసాగడానికి అది దోహదం చేసింది. అయితే, ఐ.బి జాయింట్ డైరెక్టర్ తనతో అన్న మాటల్ని ఆయన తన మనసులోనే దాచుకున్నాడు. వెంటనే నాకు చెబితే, 'నానుంచి ఏమైనా ఆశించి అలా చెబుతున్నాడని నేననుకుంటానేమో అనుకుని ఆ విషయాన్ని నేను రిటైర్ అయ్యేదాకా అంటే 1998 దాకా నాకు చెప్పలేదు. ఆ రహస్యం మరో వ్యక్తికి కూడా తెలిస్తే మంచిదని నేనంటే కేంద్ర ప్రభుత్వంలో సెక్రెటరీగా చేసిన జి. పి. రావు ముందు ఆ నిజాన్ని బయటపెట్టాడు. విధినిర్వహణలో సమస్యలు ఎప్పుడూ తప్పవు. కానీ, అత్యున్నత హోదాలో ఉండే వారు సైతం వక్ర మార్గం పడితే సమాజానికి ఇంక మనుగడేముంటుంది? హోదాల్ని కూడా మనుషుల హృదయాలతోనే కొలవాలన్న సత్యం ఆ సంఘటన నాకు నేర్పింది.
ఔదార్యానికి హద్దులా?
నిజాయితీగా ఉండడమే కాదు. మన నీతిని అనుమానించే పరిస్థితి ఏర్పడకుండా చూసుకోవడం కూడా అవసరమనుకుంటాను. ఎన్. టి. రామారావు ప్రభుత్వం అవినీతిని అంతమొందిస్తాం అంటూ అధికారంలోకి వచ్చింది. అవినీతికి పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తడం మొదలెట్టాయి. సరిగ్గా అదే సమయంలో మా అబ్బాయి పి.జి పూర్తి చేసుకుని సొంతంగా ఏదైనా పరిశ్రమ స్థాపించాలన్న అభిప్రాయానికి వచ్చాడు. అందుకు నేను అనుమతించలేదు. "నువ్విప్పుడు ఏ రుణంతో ప్రారంభించినా అది నేను అవినీతికి పాల్పడి సంపాదించిన డబ్బుతోనే పెట్టావని అనుకుంటారు. అందువల్ల నువ్వు సివిల్ సర్వీసెస్‌కు చదువుకోవడం మేలు'' అని చెప్పాను. వాడు ససేమిరా అన్నాడు. "ఒకవేళ నువ్వు అంతగా అనుకుంటే నేను రిటైర్ అయ్యేదాకా వేచి ఉండు అప్పుడు పెట్టుకో'' అన్నాను. "16 ఏళ్లు వేచి ఉండడం అంటే చాలా కాలం వృధా అవుతుంది కదా !'' అన్నాడు. "అయితే నా ఇంట్లోంచి బయటికి వెళ్లిపో, నాకూ నీకూ ఏ సంబంధం లేదనుకున్నాక ఇంక ఏమైనా చేసుకో'' అన్నాను. "అంత కఠోరంగా ఎందుకులే నాన్నా మీరు రిటైర్ అయ్యాకే ఆ పరిశ్రమేదో పెడతా'' అన్నాడు. అప్పటికి వాడికి 38 ఏళ్లు వచ్చాయి. అన్న మాట ప్రకారం 1998 దాకా ఖాళీగా ఉండి ఆ తర్వాతే మా గ్రామస్తుడైన సుజనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ వై.ఎస్ చౌద రి (ఎం.పి) గారి కంపెనీలోని ఒక యూనిట్ తీసుకుని దాని మేనేజింగ్ డైరెక్టర్‌గా పని ప్రారంభించాడు.

కానీ, ఆ పరిశ్రమ నష్టాలే మిగిల్చింది. పరిస్థితి గమనించిన చౌదరి గారు ఆ పరిశ్రమ తిరిగి తానే తీసుకుని ఆ నష్టాలన్నీ తన మీదే వేసుకున్నాడు. నైరాశ్యానికి గురవుతున్న మావాడిని అంతటితో వదిలేయకుండా, తన కంపెనీల్లోని ఒక యూనిట్‌కు మేనేజింగ్ డైరెక్టర్ ఉద్యోగం ఇచ్చి కొండంత అండగా నిలబడ్డాడు. వాస్తవానికి నేను రిటైర్ అయ్యేనాటికి నాకు సొంత ఇల్లే లేదు. అప్పటిదాకా ఉన్న అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. నా కొడుకుకే కాదు, మా మొత్తం కుటుంబానికి ఆశ్రయంగా తన కంపెనీ హౌజ్‌ను మాకు ఇచ్చాడు. నేనున్న ఈ దశలో వై. ఎస్. చౌదరి లేని జీవితాన్ని ఊహించడం కూడా కష్టమే. జీవితమంతా ఒక కోణాన్నే చూస్తూ అందులో మనం ఎంత నిష్ణాతులమైనా కావచ్చు. కానీ, జీవితానికి మనుగడనిచ్చే మరో కోణం గురించి ఏమీ తెలియకపోతే ఎంత ప్రమాదమో ఈ పరిణామాలు నాకు తెలియచెప్పాయి. జీవితానికి విలువలు ఎంత ముఖ్యమో, ప్రాణానికి ప్రాణంగా, ఒక ఆలంబనగా నిలిచే స్నేహితులు కూడా అంతే ముఖ్యమని నా జీవితం నాకు నేర్పిన ఒక తాజా సత్యమిది.
'కలెక్టరు నక్సలైటు' అంటూ నా మీద ఒక పిటిషన్ తయారు చేసి అప్పటి రాష్ట్రపతి వి.వి. గిరికి అందచేశారు. ఈ విషయం స్థానిక పత్రికల్లోనూ, వివిధ జాతీయ పత్రికల్లోనూ ప్రచురితమమయ్యింది. కాని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో మాత్రం నా గురించి చాలా పాజిటివ్ వ్యాసం వచ్చింది. దాని శీర్షిక 'నక్సలైట్ ఇన్ ఐఏఎస్ క్లోత్స్..!' అని.
- బమ్మెర
ఫోటోలు: జి. రాజు

Navya, Andhra Jyothi Telugu News Paper Dated : 31/1/2014 



Tuesday, January 28, 2014

విప్లవ సాహిత్యంలో వస్తురూప వైవిధ్యం By డాక్టర్ సి.కాశీం


నలభై రెండు
ఏళ్లుగా విరసం విప్లవ
రాజకీయాలను ప్రచారం చేయడానికి
పనిచేస్తూనే ఉన్నది. నిషేధాలకు, నిర్బంధాలకు
గురైనా సాహిత్య సజనను కొనసాగిస్తూనే
ఉన్నది. మూడు తరాల రచయితలతో
విరసం నవ నవోన్మేషంగా నడుస్తున్నదనే
వాస్తవాన్ని 24వ మహాసభలు
నిరూపించాయి.

నూరేళ్ల కాళోజీ యాదిలో జనవరి 11,12 తేదీల్లో విరసం 24వ మహాసభలు ఓరుగల్లులో విజయవంతంగా జరిగాయి. జీవితం, కవిత్వం, రాజకీయాలలో ప్రజాస్వామ్య దక్పథాన్ని ప్రదర్శించిన కాళోజీ ప్రతీ మూలమలుపులో ప్రజలవైపు, పోరాటాలవైపు నిలబడ్డాడు. పౌరహక్కులను అడిగిన గొంతులపై ఆయుధం ఎక్కుపెట్టి న దుర్మార్గాన్ని ఎండగడుతూనే కాళోజీ కన్నుమూశారు. ఆట, పాట, మాట అనధికారికంగా బంద్ అయిన ఓరుగల్లు నగరంలో విరసం 24వ మహాసభలు దిగ్విజయంగా జరుపుకున్నది. ప్రజల ప్రత్యామ్నాయ అభివద్ధి నమూనాను విధ్వంసం చేయడానికి పాలకులు బాసగూడలో ఆదివాసులపై జరిపిన దాడిని ప్రతిబింబిస్తూ విరసం కళాకారులు బాసగూడనాటకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా కవులూ, కళాకారులు నిర్వహించిన ర్యాలీ ఓరుగల్లు నగరాన్ని ఉత్తేజపర్చింది. కిలోమీటర్ల మేర కాగడాలతో ప్రదర్శన జరిగింది. రోడ్లన్నీ పాటలతో పల్లవించాయి.
సాహిత్యం కోణంలో చూసినప్పుడు విప్లవ సాహిత్యం ఎన్ని రూపాలలో వికసించిందో ఈసభలు అద్దం పట్టాయి. కళ్లుండి చూడలేని కొందరు సాహిత్య విమర్శకులకు ఈ సభలలో వచ్చిన విప్లవ సాహిత్యమే సమాధానం చెబుతుంది. చెవులుండి వినలేని పండితులు పుస్తకావిష్కరణల సందర్భంగా విశ్లేషకులు చెప్పిన అభిప్రాయాలైనా వినాల్సింది. విప్లవ సాహిత్యంలో, విరసంలో మూడుతరాల కవులు, రచయితలు ఉన్నారు. ప్రతీ పది సంవత్సరాలకు సంస్థలోకి కొత్త నీరు వచ్చి చేరుతూనే ఉన్నది. బహుశా, ఇట్లాంటి సజీవ లక్షణం ఉన్న సంస్థలు మరోటి లేవంటే అతిశయోక్తి కాదేమో. కథ, కవిత్వం, నవల, నాటకం లాంటి ప్రక్రియలను చేపట్టి సాధికారికంగా నిర్వహిస్తున్నవాళ్లు విరసంలో ఉన్నారు. ఒక రచయితల సంఘం ప్రతీ ఏటా 30 పుస్తకాలను ఆవిష్కరించుకోగలుగుతుందంటే, అవి వాసిలో, రాశిలో తీసిపోని పుస్తకాలుగా మిగులుతున్నాయంటే ఆ ఘనత విరసం కే దక్కింది. ఈసారి మహాసభలలో కూడా విరసం సభ్యులు రాసిన 13 పుస్తకాలు వచ్చాయి. అందులో కవిత్వం 1, కథలు 3, నవలలు 2, సాహిత్య విమర్శ 3, ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యాసాలు 4 ఉన్నాయి. అనువాదాలు, విరసం తన సామాజిక బాధ్యతగా ప్రజలకు అందించాలని భావించిన సాహిత్యాన్ని కూడా ప్రచురించి ప్రచారం చేస్తుంది. అట్లా విరసం ప్రచురణలుగా వచ్చిన పుస్తకాలు 17 ఉన్నాయి. విరసం రచయితలు ఎన్నడూ సాహిత్య విలువల విషయం లో రాజీపడలేదు. సాహిత్య వస్తువుకు ఇచ్చిన ప్రాధాన్యతను, సాహిత్య రూపంలో నిర్లక్ష్యం చేయలేదు. వస్తువును ఆశ్రయించిన రూపం సాహిత్య రచనలో ఉండాలని త్రిపురనేని మధుసూదనరావు చెప్పిన మాటను విరసం రచయితల ఎరుకలో ఉందని ఈ మహాసభల సందర్భంగా వెలువడిన 30 పుస్తకాలను చూస్తే అర్థమవుతుంది.

విరసం వైపు నుంచి మొదట్లో వచ్చినంత బలంగా కవిత్వం రావటం లేదని పరిశీలించకుండానే (విరసం అధికార పత్రిక అరుణతారను కూడా) జడ్జిమెంట్ ఇచ్చే సాహిత్య వాతావరణం నేడు ఉంది. శ్రీశ్రీ, శివసాగర్, చెరబండరాజు, వరవరరావు వంటి లబ్ధప్రతిష్టులైన వారి కవిత్వం దగ్గరే కొందరు విమర్శకులు ఆగిపోయారు. తర్వా త వచ్చిన కొత్త నీళ్లు తాగటానికి తెలుగు సాహిత్య వాతావరణం అలవాటు పడలేదు. సముద్రుడు, ఎమ్మెస్సార్, కౌముది రచనలు విప్లవ కవిత్వంలో తెచ్చి న వస్తు, శిల్పనైపుణ్యాన్ని చూడలేకపోయారు. ఈ తరం లో కూడా కవిత్వానికి విరసంలో లోటులేదు. బలమైన గొంతుకలు ముందుకొచ్చాయి. ముప్పై ఏళ్ల లోపు వయసున్న కవులు విరసంలో బలమైన కవిత్వం రాస్తున్నవాళ్లు అరడజన్‌కు పైగా ఉన్నారు. వీళ్లు కూడా సంస్థ తీసుకున్న గ్రీన్‌హంట్ వ్యతిరేకతను తమ రచనలలో ప్రదర్శిస్తున్నారు. ఈ తరంలోని వాడే ఉదయ్‌భాను.ఈ రెండేళ్లలో గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా రాసిన కవిత్వా న్ని పిల్లనగ్రోవి తుఫాన్ పేరుతో సంకలనం చేసి 24వ మహాసభలలో ఆవిష్కరించాడు. పుస్తకానికి పెట్టిన పేరులోనే గొప్ప సౌందర్యాత్మకత కనిపిస్తుంది. పుటలు తిప్పేస్తే రక్తం స్రవిస్తున్న పిల్లనగ్రోవి పెదవులు మనల్ని కన్నీళ్లు పెట్టిస్తాయి. విషాదగీతిక పిల్లనగ్రోవి తుఫాన్‌గా మారుతున్న కవిసమయం ఇవాల్టి దశ్యం. ఈ విషాద, గం భీర దశ్యాన్ని కలంలో ఒంపుకున్నవాడే కవి అనే బాధ్యతను ఉద య్ గుర్తుచేశాడు.తొలిపొద్దును మింగేసే పాలకులున్నచోట సూర్యాస్తమయం గురించి బాధపడటంలో అర్థం లేదనే కొత్త కవి సమయాలను గ్రీన్‌హంట్ వ్యతిరేక కవిత్వం మనముందు ఉంచింది.

కాంత పున్నం వెన్నెల ఈ మూడు పదాలు ఒకేలా ఉన్నాయి కదా! వెలుగు అని అర్థాన్ని స్ఫూరిస్తున్నాయి. మూడు పదాలను కలిపితే మంచి కవితా పాదం వలె ఉన్నాయి. కాని ఇది ఒక కథ పేరు. ఇట్లాంటి శీర్షిక పెట్టింది చేయి తిరిగిన కథా రచయిత కాదు. చనిపోయిన నిజమైన మనుషుల కోసం-భయవిహ్వాల దిగ్భ్రాంతి లో ఉన్న వారి బంధుమిత్రుల కోసం...చావంటే, శవమంటే అందరిలాగే ఆమడదూరం పరిగెత్తే పద్మకుమారి విచిత్రంగా, అనివార్యం గా అనేక అసహజ మరణాల్లో బంధు మిత్రుల సంఘం సభ్యులతో కలిసి రాష్ట్రమంతా తిరుగుతుంది. కన్నీళ్లు జలజలాకారే చిత్రమైన బాధ్యత. మానసికంగా, శారీరకంగా కల్లోలపరిచే బయటి కల్లోలం. అదిగో అలాంటి స్థితిలో ఇలాంటి కథలు రాయడం వల్ల.. ప్రతీవాక్యం మత్యుశీతల స్పర్శ నుంచి రూపుదిద్దుకున్నదే.. అని అల్లం రాజయ్య ఎన్ని వాక్యాలు పేర్చుకుంటూ పోయినా కాంత పున్నం వెన్నెల కథ గురించి సరిగా చెప్పలేనని మొరాయించాడు. తెలంగాణలో విప్లవ కథా రచనలో లబ్దప్రతిష్టుడిగా పేరున్న అల్లం రాజయ్య విరసం ఈ తరం సభ్యురాలు పద్మకుమారి రాసిన మొట్టమొదటి కథ గురించి ఈ వాక్యాలు రాయటానికి కారణం ఆ కథలో ఉండేబలం.
తెలంగాణ సమాజంలో ముస్లింలకు, ఉత్పత్తి కులాల మధ్య ఉండే సజీవ మానవ సంబంధాల గురించిన అబ్బా, ముస్లిం రైతు రోజు జీవితాన్ని వ్యక్తంచేసేఈద్ నమాజ్, ముస్లిం మహిళల జీవితాలలో వచ్చిన మార్పును చెప్పే సైదాబీ తాయమ్మ సంప్రదాయ కుటుంబాల్లో నుంచి బయటికి వచ్చి జీవించాలంటే స్త్రీకి కలిగే ఇబ్బందులను చిత్రించిన మబ్బులు కమ్మిన ఆకాశం తరగతి గది నాలుగు గోడల మధ్య ఎంత వ్యధ ఉందో చెప్పిన బడిలో చీకటి, ప్రజల కోసం మిగిలేటోళ్లు కథలను కలిపి విరసం సభ్యుడు బాసిత్ కథా సంపుటి వేశాడు. ఈ కథలన్నీ ప్రత్యామ్నాయ ఆలోచనా ధారను ప్రతిబింబించేవి.

సాహిత్యంలో నవలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. నవలా ప్రక్రియను చేపట్టి సాధికారికంగా నడిపినవారు విరసంలో గత నలభై ఏళ్లుగా ఉన్నారు. ఈ వరుసలోనే విరసం సీనియర్ సభ్యురాలు నల్లూరి రుక్మిణి రాసిన ఒండ్రుమట్టి నవలను ఈ సభల్లోనే ఆవిష్కరించారు. నవల అనే రెండో మాట దాని రూపశిల్పాలను, దాని కాల్పనికతను కళాత్మకతను సూచిస్తుంది. ఈ రెండు అంశాలు ఒక రసాయనిక సమ్మేళనంలో మేలు కలయిక సాధించడమే ఒండ్రుమట్టి సాధించిన విజయం అని ఎన్. వేణుగోపాల్ ముందుమాట లో ఈ నవల వస్తు శిల్ప వైశిష్ట్యాన్ని వివరించారు.
ఒండ్రుమట్టి నవలతో పాటు వసంతగీతం నవలను కూడా ఇదే సభలలో ఆవిష్కరించారు. ఈ నవలా రచయిత అల్లం రాజయ్య. కొలిమంటుకున్నది, కొమురంభీం వంటి పూర్తి నిడివి ఉన్న నవలలు, అతడు లాంటి పాక్షిక నవలతో తెలుగు సమాజంపై విశేష ప్రభావాన్ని వేసిన అల్లం రాజయ్య చేతి నుంచి వసంతగీతం జాలు వారింది. అడవి వెన్నెల లాంటి పదునైన, అందమైన, ఉద్విగ్నమైన కథా కథనశైలితో మలచిన నవల వసంతగీతం. ఈ శైలి రాజయ్య సొంతం. వసంతగీతం నవల నిర్దిష్టమైన సమకాలీన చారిత్రక నవల. 1985-86 మధ్యకాలంలో నవలా వస్తువు. అట్లే ఆదిలాబాద్ జిల్లా పార్టీ నాయకత్వంలో ఒక దళం దైనందిన జీవి తం, పోరాట ఆచరణ,త్యాగాలు చిత్రించిన రాజకీయార్థిక చారిత్రక నవల ఇది అని వరవరరావు చెప్పారు. ఇట్లాంటి అద్భుత నవల లు విరసం అల్లం రాజయ్య నుంచి రావటం వర్తమాన చరిత్రకొక నమ్మకం.


ప్రజా ప్రత్యామ్నాయాల్లో నూరేళ్ల కాళోజీ గుర్తులో జరిగాయి కనుక కాళోజీతో సుదీర్ఘకాలం కలిసి నడిచిన వరవరరావు రాసిన నూరేళ్ల కాళోజీ పుస్తకం ఈ సభల్లోనే వచ్చింది. ఒక చేత తర్కం, మరో చేత గతితర్కం పట్టుకొని తెలుగు సాహిత్యాన్ని వ్యాఖ్యానించే విప్లవ సాహిత్య విమర్శకుడు చెంచయ్య ప్రతి విరసం సభలకు ఒక పుస్తకంతో వస్తాడు. ఈ సభల్లో సామాజికంవ్యాస సంపుటిని తెచ్చాడు. వివిధ సందర్భాలతో సాహిత్యం-సమాజం కలపోతగా రాసిన వ్యాసాలివి. ఒక రచనను మనం చదువుతుంటే ఆ రచయితే మన ముందు కూర్చొని మాట్లాడుతున్నట్టు అన్పించడమంటేనే పదాలు మాట్లాడటం. ఈ శక్తి కొందరు రచయితలకే ఉంటుంది. ఇందులో కష్ణాబాయి ఉంది. బహుశా, ఆమె నలభై ఏళ్లలో రాసిన రచనల సర్వస్వం ఈ సాహిత్య సమాలోచన. ఈ మహాసభలలో ఆవిష్కరించడం ఒక సందర్భం.

విరసం తెలంగాణ ఏర్పాటును సైద్ధాంతికంగానే గత నలభై ఏళ్లు గా సమర్థిస్తున్నది. అంతేకాదు రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగే పోరాటాలలో భాగమవుతున్నది. 90వ దశకంలో ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమానికి విరసం కలాన్ని, గళాన్ని తోడు చేసింది. విరసం సభ్యులు కవిత్వం, కథలు, వ్యాసాలు ప్రచురించారు. సంస్థ సభ్యుడు కాశీం రాసిననేను తెలంగాణోన్ని మాట్లాడుతున్న(వ్యాసాలు)పుస్తకాన్ని ఈ సభల్లోనే ఆవిష్కరించారుపజాస్వామ్య తెలంగాణ ఎట్లా ఉండాలో ఈ రచన ద్వారా తెలంగాణ సమాజానికి కావల్సిన సమాచారం అందుతుంది.
ఇక విరసం ప్రచురించి ఈ సభలో ఆవిష్కరించిన సాహిత్యంలో దండకారణ్య కథలు అగ్రస్థానంలో నిలుస్తాయి. ప్రజల ప్రత్యామ్నా యం ఎట్లా పుష్పించి వికసిస్తున్నదో ఈ కథల్లో చూడవచ్చు. ఒక రకంగా విరసం, విప్లవోద్యమం ఆవల ఉన్న రచయితలెవరికి తెలియని ఒక కొత్త జీవితాన్ని, సాహిత్య వస్తువును, ఘర్షణను, యుద్ధా న్ని ఈ కథల్లో దర్శిస్తాం. యుద్ధరంగ కథకులతో ఆత్మీయ కరచాల నం చేసే అవకాశం తెలుగు సమాజానికి ఈ కథలు కల్పించాయి. అమ్మ పొలం దున్నుతున్నది/నాన్న ఊయల ఊపుతాడు/ చందు అన్నం వండుతాడు/ పెదనాన్న బియ్యం చెరుగుతాడు అనే వాక్యాలను మనమెప్పుడైనా మన పుస్తకాలలో చదివామా? లేదే?! కాని ఇవ్వాళ దండకారణ్యంలో జనతన సర్కార్ నడుపుతున్న పాఠశాల లో ఈ వాక్యాలను పిల్లలు చదువుతుంటారు. ఈ శాస్త్రీయమైన విద్య మనకు పరిచయం కావాలంటే ఈ కథలు చదివి తీరాలి.

రక్తం బొట్టు చిందకపోవచ్చు, చిందినా కనిపించకపోవచ్చు, అవయవాలు తెగిపడకపోవచ్చు, తెగిపడినా మాయం కావచ్చు. కత్తి దూసుకుపోతుంది. పిడిపట్టిన చేయి మాత్రం దొరకదు. తూటా పేలకపోవచ్చు. కాని మనుషులు నేల రాలుతారు. శత్రువు పడక గదిలో కూర్చొని ఉంటాడు. కాని పోల్చుకోలేము. దీనినే ఎల్‌ఐసీ అంటాం. మంద్రస్థాయి యుద్ధం అని నైఘంటికార్థం. ప్రపంచ పోలీస్ అమెరికా నుంచి మొదలు ప్రతీ దేశంలో ప్రజా వ్యతిరేక పాలకులందరు పాటిస్తూ అమలు చేస్తున్న ప్రతిఘాతక యుద్ధ నీతి ని తెలుగు పాఠకులకు పరిచయం చేయటానికి విరసం సభ్యుడు రివేరా అనువదించిన మంద్రస్థాయి యుద్ధం పుస్తకాన్ని ఈ సభ ల్లో ఆవిష్కరించారు.
1969లో విద్యార్థి ఉద్యమం నాయకుడిగా, 1998 నుంచి జనసభ కన్వీనర్, ప్రజాఫ్రంట్ అధ్యక్షుడిగా ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడిన ఆకుల భూమయ్య డిసెంబర్ 24, 2013న హత్య కు గురయ్యాడు. ఆయన వివిధ సందర్భాలలో ప్రజాస్వామ్య తెలంగాణ కోసం రాసిన వ్యాసాలను ఆకుల భూమయ్య రచనలు పేరు తో ఈ సభల్లో ఆవిష్కరించారు. ఆయన ఇచ్చిన ఆఖరి ఉపన్యాసా న్ని కూడా బుక్‌లెట్ రూపంలో తెచ్చారు. తెలంగాణ ప్రాంతం వలెనే తన అస్తి త్వం కోసం 1936 నుంచి పెనుగులాడుతున్న ప్రాంతం రాయలసీమ. శ్రీబాగ్ ఒడంబడిక నుంచి కోస్తాంధ్ర పాలకులు ఉల్లంఘనలకే పాల్పడ్డారని చరిత్ర చెబుతున్న సత్యం. దీని నుంచి ప్రజల పెనుగులాట ప్రత్యే క రాష్ట్ర ఆకాంక్షగా ఉద్యమ రూపం తీసుకోవాలని విరసం కోరుకోవటమే కాదు దానికి కావల్సిన సైద్ధాంతిక భావజాలాన్ని ఇవ్వటం కోసం నేటి రాయలసీమ పుస్తకాన్ని ప్రచురించి ఆవిష్కరించింది.

వరంగల్ విప్లవోద్యమంలో ఆర్కేది చెరగని సంతకం.అతని జ్ఞాపకాలతో వరంగల్ మిత్రులు తెచ్చిన పుస్తకం ఆర్కే పోరాట జలపాతాన్నిఇక్కడే ఆవిష్కరించారు. అతని సహచరి భారతి రెండు పోరాట గాథలపేరుతో రాసిన కథల్ని విరసం ప్రచురించిం ది. ప్రజలు తమ చరిత్రను తామే నిర్మించుకుంటారనటానికి ఈ గాథలు నిదర్శనం. మనం తప్పక తెలుసుకోవాల్సిన మనుషులు కొందరుంటారు.వాళ్లు చచ్చిబతికిన ధన్యులు తరం తాలూకు జ్ఞాపకాలను ఈతరానికి అందించాలని విరసం భావించి ఆదర్శజీవులు అమరులుపేరుతో పుస్తకాన్నితెచ్చి ఆవిష్కరించింది.
ప్రజల సంస్కతి, కళలు వర్థిల్లాలనేది విరసం నినాదం. సంస్కతిలో భాగమైన ఉత్పత్తి కులాల ఆహారం కూడా వర్థిల్లాలి. అగ్రకుల సమాజం చేత నిరాకరించబడిన దళితుల, ఆదివాసుల ప్రధాన ఆహారమైన బీఫ్‌ను విప్లవోద్యమం, విరసం తన ఆచరణలో భాగం చేసుకున్నది. దానిని అందరికి అలవాటు చేయాలని రెండో రోజు సభలలో బీఫ్ కూరను వడ్డించింది.ఈ ఆహారం ప్రజలందరి తిండి గా మారాలనే అవగాహనను పెంపొందించటానికి బీఫ్ రాజకీయాలు పుస్తకాన్ని సభల్లో ఆవిష్కరించింది.

ఇక నందిని సిధారెడ్డి తెలంగాణ నెనరున్న కవి మిత్రుడు. విరసానికి మిత్రుడు, విప్లవానికి ప్రేమికుడు. మంజీర మీద రాసిన, మట్టి మీద రాసిన మనిషితనం తప్పిపోని ఆర్థ్రత అతని కవిత్వం నిండా పారుతుంది.ఇక్కడి చెట్లగాలి(కవిత్వం)ని మోసుకొని విరసం సభలకు వచ్చి ఆవిష్కరించాడు.నిత్యజీవితంలో సోషలిజం (భూసారం శివన్న),విప్లవ మేధావి మహిత, అరణ్యపర్వం (ఆలూరి భుజంగరావు కథలు),పువ్వర్తి అమరులు, అరుణతార సాహి త్య విమర్శ, అరుణతార, సజన డీవీడీలు, రేపు (కథ) పుస్తకాలను కూడా ఈ సభల్లో ఆవిష్కరించారు.
నలభై రెండు ఏళ్లుగా విరసం విప్లవ రాజకీయాలను ప్రచారం చేయడానికి పనిచేస్తూనే ఉన్నది. నిషేధాలకు, నిర్బంధాలకు గురైనా సాహిత్య సజనను కొనసాగిస్తూనే ఉన్నది. మూడు తరాల రచయితలతో విరసం నవ నవోన్మేషంగా నడుస్తున్నదనే వాస్తవాన్ని ఈ మహాసభలు నిరూపించాయి.-
9701444450 Namasete Telangana Telugu News Paper Dated : 27/1/2014 

Thursday, January 16, 2014

వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు అవసరం రాజశేఖర్‌