- వికలాంగుల వాయిస్ మాసపత్రిక ఆవిష్కరణలో బి రాజశేఖర్
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో
వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని గ్రామీణా పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) సివోవో బి రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలు, పరిపాలనలో వారి ప్రాతినిధ్యం పెరిగితేనే వారి హక్కులు పరిరక్షించబడుతామని చెప్పారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దిశగా ఎన్పిఆర్డి, వికలాంగుల వాయిస్ పత్రిక విశేషమైన కృషి కొనసాగించాలని ఆయన సూచించారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిడిఆర్) ఆధ్వర్యంలో వస్తున్న 'వికలాంగుల వాయిస్' మాసపత్రిక ప్రారంభం సంచికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెర్ఫ్ తరుపున వికలాంగుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. వికలాంగులకు శిక్షణ ఇచ్చి కార్పొరేట్, షాపింగ్ మహళ్ళలతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వికలాంగుల స్వయం సహాయక సంఘాల ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా 900 మండలలో, 18 జిల్లాలలో వికలాంగుల సమాఖ్యలను ఏర్పాటు చేసి వాటి ద్వారా సంక్షేమ పథకాల్లో వారిని భాగస్వాములను చేస్తున్నట్లు చెప్పారు. మెట్రో రైలు, అనేక పెద్ద పెద్ద భవన నిర్మాణాల్లో వికలాంగుల కోసం ప్రత్యేక యూనివర్సల్ డిజైన్ విధానం రావాల్సి ఉందన్నారు. మెట్రో రైలు నిర్మాణంలో ఆ దిశగా కృషి జరుగుతోందన్నారు. కొత్త కొత్త రూపాల్లో వికలాంగులకు ఎదురౌతున్న సమస్యలకు పరిష్కారం చూపేలా వికలాంగుల వాయిస్ మాసపత్రిక కృషి చేయాలని కోరారు. అందుకు సెర్ఫ్ ఆర్టికల్స్, ప్రకటనల రూపంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ ఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న వికలాంగుల విద్యార్థుల కోసం యుజి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం లేదన్నారు. ప్రతి ఏడాది బడ్జెట్లో వికలాంగుల వాటా పెంచేలా కృషి చేయాలని సూచించారు. ఓయులో టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేస్తామని, అందులో అర్హత ఉన్న వికలాంగుల కోసం త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. గతేడాది వికలాంగులకు పిహెచ్డి కోర్సులో 3 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని చెప్పారు. ఎన్పిడిఆర్ జాతీయ కార్యదర్శి ఎం జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్పిఆర్డి ఏర్పాటు ఒక సంచలనం, ఒక చరిత్రైతే, వికలాంగుల వాయిస్ మాసపత్రిక రావడం ఉద్యమంలో నూతన అధ్యాయం అని చెప్పారు. వికలాంగుల హక్కుల సాధన, వారి సంక్షేమం పట్ల అవగాహన కల్పించడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసం పాదుకొల్పి చైతన్యం పెంచేలా వికలాంగుల వాయిస్ పత్రిక ఉంటుందని చెప్పారు. వికలాంగుల చేతుల్లో ఈ పత్రిక పోరాట ఆయుధంగా మారనుందని చెప్పారు. తొలుత హెలెన్ కెల్లార్, లూయీస్ బ్రెయిలీ చిత్రపటానికి బి రాజశేఖర్, ఎస్ సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సభకు ఎన్పిఆర్డి నేత, వాయిస్ సహసంపాదకులు ఎస్ఎన్ చారి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్పిఆర్డి రాష్ట్ర కార్యదర్శి, వికలాంగుల వాయిస్ పత్రిక సంపాదకులు టి రాజేందర్, ఎన్జిఆర్ఐ శాస్త్రవేత ఆర్ బాబునాయక్, సంఘసేవకురాలు గురజాడ శోభా పేరిందేవి, క్రీడాకారుడు అంజనేయులు, నేతలు వల్లభనేని ప్రసాద్, గోరెంకల నర్సింహా, పి రాజశేఖర్ తదితరులు ప్రసంగించారు.
Prajashakti Telugu News Paper Dated : 12/1/2014
No comments:
Post a Comment