Monday, March 10, 2014

నయా ఉదారవాదం - అవినీతి, అస్తిత్వ ఉద్యమాలు By ప్రభాత్‌ పట్నాయక్‌


నయా ఉదారవాద దృశ్యం గురించిన మరో విషయంపై మనం దృష్టిని సారించాలి. ఇది 'అవినీతి'కి సంబంధించినది. అలాంటి ఆర్థిక వ్యవస్థలో చిన్న ఉత్పత్తిదారులను బడా పెట్టుబడి కబళించే ధోరణి ఉంటుంది. అయితే కేవలం చిన్న ఆస్తులను మాత్రమే అది లక్ష్యంగా చేసుకోదు. చిన్న ఆస్తులనే కాక సమిష్టి ఆస్తులనూ, తెగల ఆస్తులనూ, ప్రభుత్వ ఆస్తులనూ నామమాత్రపు వెలకుగానీ, ఉచితంగా కానీ పోగు చేసుకుంటుంది. వేరే విధంగా చెప్పాలంటే నయా ఉదారవాదం కాలంలో 'పెట్టుబడి యొక్క ఆదిమ సంచయం' ప్రక్రియ కసిగా కొనసాగుతుంది. దీనికి ప్రభుత్వాధికారుల సమ్మతి అవసరం.

పెట్టుబడిదారీ వ్యవస్థ సామాజికంగా మనగలగటానికి కారణం దాని అంతర్గత తర్కం బలంగా ఉండటం వలన కాక అది బలహీనంగా ఉన్నప్పటికీ మనగలగటం దాని ప్రత్యేకత. వివిధ సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన కార్మికులు ఈ ప్రపంచంలో ఒకేచోటకు చేర్చబడి చిన్నచిన్న గ్రూపులుగా విభజితమై ఒకరితో మరొకరు పోటీ పడతారు. పెట్టుబడిదారీ వ్యవస్థ తర్కం కోరేదీ అదే. అలాంటి ప్రపంచం సామాజికంగా విజయవంతంగా మనగలగటం సాధ్యపడదు. (ఎందుకంటే అలాంటి ప్రపంచంలో ఎలాంటి 'సమాజం' ఉండజాలదు). పెట్టుబడిదారీ వ్యవస్థ తర్కానికి వ్యతిరేకంగా మొదట్లో ఒకరితో మరొకరికి పరిచయంలేని కార్మికులు ట్రేడ్‌ యూనియన్ల ద్వారా 'మేళవింపులు' (ఒకటిగా కలిసిపోవడం) జరిగి వర్గ సంస్థలుగా ఏర్పడతాయి. వీటి నుంచి 'నూతన సమాజం' ఆవిర్భవిస్తుంది.

              ప్రపంచీకరణ శకం వర్గ శక్తుల సమతౌల్యంలో బూర్జువా వర్గానికి అనుకూలంగా నిర్ణయాత్మకమైన మార్పును తీసుకువచ్చింది. ఈ మార్పుకు కనీసం రెండు ప్రధాన పర్యవసానాలున్నాయని గమ నించాలి. మొదటిది, వర్గ రాజకీయాలు బలహీ నపడటంతోపాటు 'అస్తిత్వ రాజకీయాలు' బలోపేత మయ్యాయి. అయితే 'అస్తిత్వ రాజకీయాలు' అనే పదబంధం గందరగోళపరిచేదిగా ఉంటుంది. ఇది రెండు పరస్పర విరుద్ధ ఉద్యమాలను తన పదబంధంతో బంధిస్తుంది. ఇక్కడ మూడు విశిష్ట విషయాల మధ్య తేడాను గమనిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. దళిత, మహిళా ఉద్యమాల (వీటి ప్రత్యేకతలు వీటికున్నప్పటికీ) వంటి 'అస్తిత్వ ప్రతిఘటనా ఉద్యమాలు', 'అస్తిత్వ బేరసార రాజకీయాలు' - ఇవి 'రిజర్వేషన్స్‌'ను ఉపయోగించుకుని తమ స్థితిని మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో 'వెనుకబడిన తరగతి' హోదా కోసం జాట్‌ కులస్తులు చేసే డిమాండ్‌ లాంటివి. 'అస్తిత్వ ఫాసిస్టు రాజకీయాలు - దానికి ఉదాహరణగా మతతత్వ - ఫాసిజాన్ని తీసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక 'అస్తిత్వ గ్రూపుల' ఆధారంగా ఈ రాజకీయాలున్నప్పటికీ కార్పొరేట్‌ ఫైనాన్షియల్‌ పెట్టుబడిదారుల సహకారంతో ఇతర 'అస్తిత్వ గ్రూపుల'ను లక్ష్యంగా చేసుకుని విష ప్రచారం చేయటం ఈ రాజకీయాల ప్రత్యేకత. తాము ఏ అస్తిత్వ గ్రూపు ప్రయోజనాల ఉన్నతికి సమీకరింపబడ్డామో వాటి కోసం పాటుపడకుండా వాస్తవంలో కార్పొరేట్‌ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగస్వాములవడం ఈ రాజకీయాల ప్రత్యేకత.
ఈ మూడు రకాల 'అస్తిత్వ రాజకీయాల' నడుమ ఎన్ని విభేదాలున్నప్పటికీ బలహీనపడిన వర్గ రాజకీయాల ప్రభావం వీటిన్నిటిపైనా ఉన్నది. వర్గ సంస్థల కార్యాచరణలో లేని సభ్యులున్న 'అస్తిత్వ బేరసార రాజకీయాల'ను ఈ పరిస్థితి ప్రోత్సహిస్తుంది. కార్పొరేట్‌ ఫైనాన్స్‌ వర్గ ఆధిపత్యానికి అవసరమైనందున 'అస్తిత్వ ఫాసిస్టు రాజకీయాల'కు కూడా ఈ పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 'అస్తిత్వ ప్రతిఘటనా రాజకీయాల' మీద దీని ప్రభావం మరోలా ఉంటుంది. వర్గ రాజకీయాలు బలహీనపడడం వలన ఈ రాజకీయాలలో సమరశీలత నశించి అవి 'అస్తిత్వ బేరసార రాజకీయాల' దిశలో పయనిస్తాయి. మొత్తం మీద బలహీనపడిన వర్గ రాజకీయాలు వ్యవస్థకు ప్రమాదకరం కాని 'అస్తిత్వ రాజకీయ' రూపాలను బలోపేతం చేస్తాయి. దానితో ప్రజలలోని ఒక సెక్షన్‌ను మరో సెక్షన్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టి వ్యవస్థకు వచ్చే ప్రమాదాలను మరింతగా తగ్గించటం జరుగుతుంటుంది. దేశంలోని కుల వ్యవస్థకు మూలమైన భూస్వామ్య వ్యవస్థ అవశేషం అయిన 'పాత సమాజా'న్ని నాశనం చేసి ప్రజాస్వామ్యానికి అవసరమైన 'నూతన సమాజా'న్ని తీర్చిదిద్దే ప్రయత్నానికి దానితో విఘాతం కలుగుతుంది.
ఈ విఘాతం వ్యక్తీకరణ రెండవ పర్యవసానంగా ఉంటుంది. ఈ పరిస్థితి సమాజాన్ని మొద్దుబారుస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ సామాజికంగా మనగలగటానికి కారణం దాని అంతర్గత తర్కం బలంగా ఉండటం వలన కాక అది బలహీనంగా ఉన్నప్పటికీ మనగలగటం దాని ప్రత్యేకత. వివిధ సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన కార్మికులు ఈ ప్రపంచంలో ఒకేచోటకు చేర్చబడి చిన్నచిన్న గ్రూపులుగా విభజితమై ఒకరితో మరొకరు పోటీ పడతారు. పెట్టుబడిదారీ వ్యవస్థ తర్కం కోరేదీ అదే. అలాంటి ప్రపంచం సామాజికంగా విజయవంతంగా మనగలగటం సాధ్యపడదు. (ఎందుకంటే అలాంటి ప్రపంచంలో ఎలాంటి 'సమాజం' ఉండజాలదు). పెట్టుబడిదారీ వ్యవస్థ తర్కానికి వ్యతిరేకంగా మొదట్లో ఒకరితో మరొకరికి పరిచయంలేని కార్మికులు ట్రేడ్‌ యూనియన్ల ద్వారా 'మేళవింపులు' (ఒకటిగా కలిసిపోవడం) జరిగి వర్గ సంస్థలుగా ఏర్పడతాయి. వీటి నుంచి 'నూతన సమాజం' ఆవిర్భవిస్తుంది. ఆ విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి విజయవంతమైన సమాజం ఆవిర్భవిస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో గతంలో ఇది సాధ్యమైంది. దానికి కారణం పెట్టుబడిదారీ అభివృద్ధి బాగా జరిగిన కేంద్ర స్థానాల నుంచి సమశీతోష్ణ ప్రాంతాలకు పెద్దఎత్తున యూరోపియన్‌ ప్రజలు వలసలుగా వెళ్లటంతో దేశీయ నిరుద్యోగ సైన్యం సాపేక్షంగా పరిమిత పరిమాణంలో ఉండటం జరిగింది. ఈ పరిస్థితి ట్రేడ్‌ యూనియన్లు శక్తివంతంగా మారటానికి దారితీసింది. నేటి తృతీయ ప్రపంచ దేశాల కార్మికులకు అలా వలస వెళ్లే అవకాశం లేదు. ఇంతకు ముందు విశ్లేషించినట్లుగా నిరుద్యోగం సాపేక్ష పరిమాణాన్ని నయా ఉదారవాదం పెంచుతోంది. ట్రేడ్‌ యూనియన్లనూ, కార్మికుల ఇతర సమిష్టి సంస్థలనూ బలహీనపరుస్తోంది. దీని పర్యవసానంగా విడివడిపోయే వైపు కొట్టుకు పోతారు. వర్గ భ్రష్ట శ్రామికవర్గం సంఖ్య పెరుగు తుంది. విభిన్న సామాజిక నేప థ్యాల నుంచి వచ్చిన కార్మికుల మధ్య అనుబంధం ఉండ కుండా పోవటమో లేక ఉన్నది బలహీ నప డడమో జరుగుతుంది. ఇద ంతా భ్రష్టత్వాన్ని పెంచే స్పష్ట మైన ధోరణిని సృష్టిస్తుంది. నిజానికి అన్ని పెట్టు బడిదారీ సమా జాలలో అలాంటి భ్రష్టత్వం ఉం టుంది. అభి వృద్ధి చెందిన పెట్టు బడిదారీ దేశా లలోని కార్మికవర్గ సమిష్టి సంస్థలు అలాంటి భ్రష్టత్వాన్ని అదుపు చేస్తాయి. నయా ఉదారవాదం కింద ఇది బలహీ నపడుతుంది. నయా ఉదారవాదానికి దాసోహం అనే తృతీయ ప్రపంచ దేశాలలోని ప్రభు త్వాల పాలనలో ఇది నిరర్థకమవుతుంది. నా దృష్టిలో నేటి భారతదేశంలో మహిళలపై జరిగే నేరాలూ, ఘోరాలూ ఈ ప్రక్రియతో సంబంధం లేకుండా లేదు.
నయా ఉదారవాద దృశ్యం గురించిన మరో విషయంపై మనం దృష్టిని సారించాలి. ఇది 'అవినీతి'కి సంబంధించినది. అలాంటి ఆర్థిక వ్యవస్థలో చిన్న ఉత్పత్తిదారులను బడా పెట్టుబడి కబళించే ధోరణి ఉంటుంది. అయితే కేవలం చిన్న ఆస్తులను మాత్రమే అది లక్ష్యంగా చేసుకోదు. చిన్న ఆస్తులనే కాక సమిష్టి ఆస్తులనూ, తెగల ఆస్తులనూ, ప్రభుత్వ ఆస్తులనూ నామమాత్రపు వెలకుగానీ, ఉచితంగా కానీ పోగు చేసుకుంటుంది. వేరే విధంగా చెప్పాలంటే నయా ఉదారవాదం కాలంలో 'పెట్టుబడి యొక్క ఆదిమ సంచయం' ప్రక్రియ కసిగా కొనసాగుతుంది. దీనికి ప్రభుత్వాధికారుల సమ్మతి అవసరం. ఇంతకు ముందు పేర్కొన్నట్లు ప్రపంచీకరణ యుగంలో జాతి రాజ్యం విధానపర విషయాలలో ఎదుర్కొనే ఒత్తిడులు కాక ధరను చెల్లించి అలాంటి సమ్మతిని బడా పెట్టుబడి పొందుతుంది. దీనినే మనం 'అవినీతి' అని పిలుస్తాం.
బడా పెట్టుబడి ఆదిమ సంచయంతో లాభపడినందు వల్ల మనం అంటున్న 'అవినీతి' ఆచరణలో ప్రభుత్వాధికారులు, ముఖ్యంగా 'రాజకీయ వర్గం' దానిపై వేసే పన్నులాంటిది. ఈ మధ్యకాలంలో భారతదేశంలో బహిర్గతమైన అవినీతి కుంభకోణాలు - ఉదాహరణకు 2జి స్పెక్ట్రమ్‌, బొగ్గు గనుల కేటాయింపుల వంటి వాటిని ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు పెట్టుబడిదారులకు నామమాత్రపు ధరకు బదలాయించటంగా చూడవలసి ఉంటుంది. అలా బదలాయించటానికి నిర్ణయాలు తీసుకున్నవారు లంచాలు తీసుకున్నారు. దానినే మనం 'అవినీతి' అంటున్నాం. ఆ విధంగా 'అవినీతి' అనేది పెట్టుబడి యొక్క ఆదిమ సంచ యంపై వేసే పన్నుగా భావించాలి. ఈ మధ్యకాలంలో అవినీతి తీవ్రంగా పెరగటానికి కారణం నయా ఉదావాదంలో పెట్టుబడి యొక్క ఆదిమ సంచయం తీవ్రస్థాయిలో ఉండటమే. 'అవినీతి' రూపంలో ఉండే అలాంటి పన్నును రెండు ప్రత్యేక కారకాలను దృష్టిలో ఉంచుకుని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిది, రాజకీయాలు సరుకుగా మార్చబడటం. వేరువేరు రాజకీయ సమీకరణలు నయా ఉదారవాదం పరిధిలోనే ఉండటం అనే వాస్తవం వేరువేరు ఆర్థిక ఎజెండాలను రూపొందించుకోనివ్వదు. దానితో ప్రజామోదం పొందటానికి వేరే మార్గాలను వెదకాలి. ఇది తమను తాము 'మార్కెట్‌' చేసుకోవటం అవుతుంది. ప్రచారం చేసే కంపెనీల సేవలను వినియోగించుకోవటం, మీడియాలో 'చెల్లింపు వార్తలు' వచ్చేలా చూడటం, ఎక్కువ ప్రాంతాలను చుట్టిరావటం ద్వారా ఎక్కువమందికి కనిపించటానికి హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవటం లాంటివి రాజకీయ పార్టీలు తమను తాము 'మార్కెట్‌' చేసుకోవటానికి అవసరమౌతాయి. ఇవన్నీ చాలా ఖరీదైన అవసరాలు. అందుకే రాజకీయ పార్టీలు వనరుల కోసం అర్రులు చాస్తుంటాయి. అవి ఎలాగైనా ఈ వనరులను సమీకరించుకోవాలి.
అంతేకాకుండా ఒక వైపు 'రాజకీయ వర్గం' ముందుకు సాగాలంటే ఎక్కువ వనరులు అవసరం ఏర్పడుతుండగా మరో వైపు నిర్ణయాలు తీసుకోవటంలో ఆ వర్గం పాత్రకు ప్రాధాన్యత తగ్గుతుంది. 'ప్రపంచ ద్రవ్య పెట్టుబడిదారీ సమాజం'గా పిలువబడే ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, బహుళజాతి బ్యాంకులు, ఇతర సంస్థలకు చెందిన అధికార గణం ప్రభుత్వ పాలనలో నిర్ణయాలు తీసుకునే ముఖ్య స్థానాలను ఆక్రమిస్తారు. ఆర్థిక విషయాలను నిర్ణయించే అధికారం సంప్రదాయ రాజకీయ పార్టీల చేతుల్లో ఉండటం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ఇష్టం ఉండక పోవడమే దానికి కారణం. సంప్రదాయ 'రాజకీయ వర్గం' దానిని సహజంగా తిరస్కరిస్తుంది. ఈ వర్గాన్ని 'ఎంతో కొంత' పోగు చేసుకునేందుకు అనుమతిస్తేనే అది పరిస్థితులతో రాజీపడుతుంది. 'అవినీతి' రూపంలో ఉండే పెట్టుబడి యొక్క ఆదిమ సంచయంపై వేసే పన్నులోనే ఆ 'ఎంతో కొంత' ఉంటుంది. 'రాజకీయవర్గం'కు రాజకీ యాలను సరుకుగా మార్చడం వల్ల ఆ అవసరం ఎలాగూ ఉంది గనుక దానికి ఆ వర్గం అభ్యంతర పెట్టదు.
నయా ఉదారవాద పాలనలో 'అవినీతి'కి ప్రయోజనకర పాత్ర ఉన్నది. 'రాజకీయ వర్గం' తన 'నైతికత'ను అకస్మాత్తుగా కోల్పోవటం వలన 'అవినీతి' జరగటం లేదు. ఇది నయా ఉదారవాదం విలక్షణత. నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ పెంచి పోషించే 'అవినీతి' కార్పొరేట్‌ ఫైనాన్షియల్‌ వర్గానికి మరో కారణం చేత ఉపయో గకరంగా ఉంటుంది. అవినీతి 'రాజకీయ వర్గం'కు అపకీర్తిని కొనితెస్తుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య సంస్థలైన పార్లమెంటు, ఇతర సంస్థలకు 'అవినీతి'తో చెడ్డ పేరు వస్తుంది. అదే సమయంలో కపటోపాయాలతోనూ, మీడియాను నియంత్రిం చటంతోనూ ప్రజల దృష్టిని రకరకాల విషయాలపై కేంద్రీకరింపజేసి 'అవినీతి' పాపపంకిలం తనకు అంటకుండా కార్పొరేట్‌ ఫైనాన్స్‌ వర్గం చూసుకుంటుంది. కార్పొరేట్‌ పాలన ప్రవేశానికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించటంలో 'అవినీతి'కి సంబంధించిన ప్రవచనాలు తమ పాత్రను తాము నిర్వహిస్తాయి.
- ప్రభాత్‌ పట్నాయక్‌
Prajashakti Telugu News Paper Dated: 10/3/2014 

Wednesday, March 5, 2014

కాంగ్రెస్‌తోనే అణగారిన వర్గాల అభ్యున్నతి By కొప్పుల రాజు IAS


ఉద్యోగ ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల హక్కును నిలబెట్టడానికి రాజ్యాంగం 117వ సవరణ బిల్లును పార్లమెంట్ ముందుకు తెచ్చిన ఘనత యూపీఏ ప్రభుత్వానిదే. 75శాతం గ్రామీణ 50 శాతం పట్టణ ప్రజలకు ఆహారహక్కు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన
ఆహారభద్రత చట్టం ఎంత గొప్పదో చెప్పనవసరం లేదు.

కసరి బుసకొట్టునాతని గాలి సోక అనే దారుణ దుస్థితి నుంచి, ఎంతోకొంత బయటపడి, కొంతమేరకైనా వెన్నెముక వికాసాలతో బతికే స్థితికి ఎస్సీలు నేడు చేరుకున్నారంటే అందు కు దోహదం చేసిన కారణాలు అనేకం వున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసి న బహుముఖమైన కషి. ఉన్నత విద్యావంతులైన ఎస్సీలు ఎంతోమంది ఉన్నారు. విశిష్ట పదవులందుకున్నవారు పెద్ద పెద్ద వ్యాపారాలు విజయవంతంగా నడుపుతున్న వారున్నారు. వీరందరి అభివద్ధి వెనుక కాంగ్రెస్‌పార్టీ, దాని ప్రభుత్వాల కషి గణనీయంగా వున్నది. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. కులవ్యవస్థ చెప్పనలవికాని దూరదష్టితో సమాజంలోని మెజారిటీ ప్రజల ను అంటుకోదగినవారుగా వుంచి, అల్పసంఖ్యాక ఎస్సీలను అంటరానివారుగా ముద్రవేసి, సామాజి క వ్యవస్థ బయటకు నెట్టివేసింది. ఊడిగపు చేసే మనుషులుగా ఉపయోగించుకున్నది. అందుచేత, ఈరెండు సమాజాలను కలపడం, ఊరికి దీటుగా వాడను అభివద్ధిచేసి, ఆ రెండింటి మధ్య అభేదాన్ని సాధించడం ఎంతో చాకచక్యంతో, అందుకు తగిన చట్టాల సహాయంతో, పురోగామి, మానవీయ భావజాల వ్యాప్తితో చేయవలసిన పని. దీన్ని కాంగ్రెస్ మాత్రమే చేయగలుగుతుంది. సమ సమాజాన్ని ఆవిష్కరించుకోవడానికి ముందు విధిగా, సమాజంలోని మిట్టపల్లాలను సరిచేయవలసిన ఆవశ్యకతను కాంగ్రెస్ పార్టీ ఇతరులెవ్వరికంటె ఎక్కువగా గుర్తించింది.

ఇప్పటికీ అత్యాచారాలకు, హత్యలకు, దురంహంకార దాడులకు ఎస్సీలు గురవుతున్న సందర్భాలలో వారికి గట్టి దన్నుగా నిలబడుతున్న చరిత్ర కాంగ్రెస్‌కే ఉన్నది. దేశంలో ప్రతి 18నిమిషాలకు ఒకటి వంతున దళితులపై దాడులు జరుగుతున్నాయన్న సమాచారమే అంధకార భారతావనికి ప్రబల నిదర్శనం. 48.4 శాతం గ్రామాలలో దళితులకు ఇప్పటికీ ఊరుమ్మడి మంచినీటి వనరులవద్ద అనుమతి లేదు. 37.8 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో దళితుల పిల్లలు ఇతరుల పిల్లలకు దూరంగావుండి చదువు నేర్చుకుంటున్నారు. వెలిపంక్తి భోజనం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు కావడమే కనాకష్టంగా ఉన్న పరిస్థితి. నమోదవుతున్న కేసులలో 15.71 శాతం కేసుల మాత్రమే శిక్షలవరకు వెళ్తున్నాయి. మిగతావి ఎడతెగని తాత్సారానికి గురి అవుతున్నాయి. జాతీ య మానవహక్కుల సంఘం దళితుల దయనీయస్థితిపై సేకరించిన కఠోర గణాంకాలలో ఇవి కొన్ని మాత్రమే. ఆధ్యాత్మి క రంగమూ ఎస్సీలను అలుసు గా చూసింది. అంత్యజులుగా పరిగణించి, అవమానించింది. శతాబ్దాలుగా బడికి, గుడికి దూరంగా వుంచబడినవారికి బానిస బతుకులే శరణ్యమయ్యాయి.

2009,జనవరి 14న ఒడిస్సా రాష్ట్ర దళిత మహిళామంత్రి ఒకరు ఒక గ్రామంలోని శివాలయంలో ప్రవేశించబోతే, అక్కడి పూజారులు అడ్డుకున్నారు. చివరకి ఆమె ఆగుడిలో దేవుడిని దర్శించుకుని వెళ్లిన తర్వాత శుద్ధి కార్యక్రమం జరిపారు. గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనైతే దళితుల పెళ్ళి ఊరేగింపుల మీద రాళ్ళువేసే అమానుషం ఇప్పటికీ ఉన్నదని సమాచారం. ఫ్యూడల్ గ్రామీణ భారతానికి, ప్రజాస్వామ్య రాజ్యాంగ మానవీయ నిర్దేశాలకు పూడ్చనలవికాని అఖాతం ఇప్పటికీ ఉన్నది. ఇటువంటి గ్రామీణ భారతాన్ని సోషలిస్ట్ సెక్యులర్ రాజ్యాంగబద్ధం చేయడమనే కషిని కాంగ్రెస్ పట్టుదలతో నిర్వహిస్తున్నది.

మార్పును వ్యతిరేకించే కొన్ని పాలకశక్తుల దన్ను తో దళితులకు వెన్నెముక మొలవకుండా చేసే దుస్సాహసానికి ఫ్యూడల్ ప్రాబల్యవర్గాలు పాల్పడుతున్నా యి. అందుకోసం దేశాధికార పీఠాన్నే చెరబట్టాలని చూస్తున్నాయి. కాంగ్రెస్ చేపట్టి, దీక్షతో పూరి ్తచేస్తున్న సామాజిక న్యాయసాధన కషికి గండికొట్టాలనే పన్నాగం ఈశక్తుల అండతో జాతీయస్థాయిలో జోరు గా సాగుతున్నది. అందుకే కాంగ్రెస్‌పార్టీలో ఎస్సీల వాణిని గట్టిగా వినిపించేలా చేసి, అందుకు తగ్గ రీతి లో పార్టీ స్పందించేలా చేయవలసిన ఆవశ్యకతను ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ గుర్తించింది.

ఎస్సీల అడుగడుగునా వెన్నుదన్నుగా ఉండేలా, వారి చేతి దుడ్డుకర్రలా ఉపయోగపడేలా కాంగ్రెస్ తనను తాను పునర్నవీకరించుకుంటున్నది. పూర్వం మాదిరిగా ఎస్సీలసభలు ఏర్పాటు చేసి ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టి చేతులు దులుపుకోవడానికి బదులు బాధిత ఎస్సీలకు అండ దండ గా ఉండే పటిష్ఠమైన సైన్యంలా కాంగ్రెస్ కార్యకర్తలు తయారయై వారికి చేదోడువాదోడుగా ఉండాలని రాహుల్‌గాంధీ సరికొత్త పిలుపునిచ్చారు. పారదర్శకతకు, జవాబుదారీతనానికి వీలు కల్పించే చట్టాలను తీసుకువచ్చి, వెనుకబడిన ప్రజానీకంతో ప్రభుత్వ యంత్రాంగం జాగ్రత్తగా వ్యవహరించేలా కాంగ్రెస్ ప్రభుత్వాలు కషి చేస్తున్నాయి. సమాచార హక్కు చట్టం ఇందు కు ఒక బలమైన నిదర్శనం. పదేళ్ళల్లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మరెన్నో చట్టాలు నిరుపేదలకు అన్ని రంగాలలోనూ పైవర్గాలతో సమానమైన వాటా లభించేలా చేయడానికి ఉద్దేశించినవే.

ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల హక్కును నిలబెట్టడానికి రాజ్యాంగం 117వ సవరణ బిల్లును పార్లమెంట్ ముందుకు తెచ్చిన ఘనత యూపీఏ ప్రభుత్వానిదే. 75శాతం గ్రామీణ 50 శాతం పట్టణ ప్రజలకు ఆహారహక్కు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆహారభద్రత చట్టం ఎంత గొప్పదో చెప్పనవసరం లేదు. ఇలాంటి చట్టం ఇంతవరకు ప్రపంచం లో మూడుదేశాలలోనే ఉండేది. భారత్ నాలుగవది కావడం గమనార్హం. సోనియాగాంధీ నాయకత్వంలోని జాతీయ సలహా మండలి సిఫార్సు మేరకు ఈ చట్టం అవతరించింది. ఆహార సబ్సిడీని ప్రభుత్వాలు ఉదారంగా భరించడానికి పౌరులకు ఆహారాన్ని ఒక హక్కుగా చేసి, అందించడానికి తేడా వున్నది. గ్రామీ ణ నిరుపేదలలో అధికశాతం ఎస్సీలు, ఎస్టీలే కాబట్టి ఈ చట్టం వారికి జీవన భద్రతను కలిగిస్తుంది.

గ్రామీణ ఉపాధిహామీ పథకం గ్రామసీమల్లో నిరుపేదల ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అణగారిన ప్రజల జీవితాల్లో తీసుకువచ్చిన మార్పు కళ్ళముందున్నదే. దేశంలో ఇంతకుముందెన్నడూ ఈ స్థాయిలో పేదలకు భరోసాను, ఆత్మవిశ్వాసాన్ని కల్పించిన పథకం మరొకటి లేదు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 632 జిల్లాలలో ప్రతి ఐదు మంది కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉపాధి లభిస్తున్నది. 97 వేల పోస్టాఫీసులలో ఇందుకోసం ఐదుకోట్ల కు పైగా ఖాతాలు తెరుచుకుని వారిసేవలో తరిస్తున్నాయి. 2006-07లో ఈ పథకం క్రింద చెల్లించిన కనీస దినవేతనం 65 రూపాయలుండగా, 2012-13లో దాన్ని 128.6 రూపాయలకు పెంచారు. 2006 నుంచి ఈ పథకం క్రింద 1,10,700 కోట్ల రూపాయల మేరకు ఉపాధి వేతన చెల్లింపు జరిగింది. దాదాపు ఐదు కోట్ల కుటుంబాలకు 213 కోట్ల పనిదినాలు కల్పించాము. ఒక్క 2013లోనే 1.06 కోట్ల పనులు ఈ పథకం ద్వారా పూర్తిచేయడం జరిగింది.

చిన్న చిన్న దుకాణాల్లో వీధి వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్న అసంఖ్యాక కుటుంబాలకు వత్తిభద్ర త కల్పించడం కోసం 2012లో తీసుకువచ్చిన వీధి వ్యాపారుల ఉపాధిపరిరక్షణ, క్రమబద్ధీకరణ చట్టంవారిపై ట్రాఫిక్ పోలీసుల, మున్సిపల్ అధికారుల వేధింపులు లేకుండా చేసి, వారి జీవనోపాధిని కాపాడుతున్నది. ఇది ఎంతో విప్లవాత్మకమైన చట్టం. అలా గే, ప్రాజెక్టులకు, పరిశ్రమలకు సేకరించే భూమికి పరిహారం చెల్లింపు విషయంలో బ్రిటీష్ కాలం నాటి కాలదోషం పట్టిన చట్టంవల్ల దేశంలో ఎంతోమంది భూములు కోల్పోయి, తగిన పరిహారంలేక బతుకులు దుర్భరమైపోయి విలపిస్తున్న నేపథ్యంలో పాతచట్టంస్థానే భూసేకరణలో పారదర్శక త, పునరావాస, పునరాశ్రయ చట్టాన్ని 2012లో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చింది. దీనివల్ల ప్రాజెక్టుల, పరిశ్రమలు, సెజ్‌ల క్రింద భూములు, ఉపాధు లు కోల్పోయినవారికి మెరుగైన పరిహారం, పునరావాసం లభించే అవకాశం కలిగింది.

ఇంకా మరుగుదొడ్లను చేత్తో ఊడ్చి శుభ్రం చేసే పారిశుధ్య వత్తి నిషేధ, పునరావాస చట్టం, నిర్భయచట్టం,కార్యాలయాలలో, కార్యక్షేత్రాలో లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించే చట్టం, ఇందిర ఆవాస్ యోజన సహాయం రెట్టింపు, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, సర్వశిక్ష అభియా న్, లోక్‌పాల్ లోకాయుక్త చట్టం వంటి అనేక అభ్యుదయకరమైన శాసనాలను రూపొందించి, దేశంలో నిజమైన ప్రజాస్వామిక పరిపాలన వ్యవస్థ పటిష్ఠం కావడానికి, అణగారిన వర్గాల పరిపూర్ణ అభ్యున్నతి ని సాకారం చేయడానికి యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు పాటుపడ్డాయి.

2013 అక్టోబరు 8న నూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో దళితుల సాధికారతపై జరిగిన ఒకకార్యక్రమంలో రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. అప్పుడు ఆయన గట్టి గా ఒక విషయం చెప్పారు. మూడవదశ దళితుల సాధికారత, హక్కుల సాధన విప్లవాన్ని కాంగ్రెస్ తీసుకురాదలచిందని ఆయన ప్రకటించారు. మొద టి దశ విప్లవం అంబేడ్కర్ తీసుకువచ్చారు. దళితుల కు రాజకీయ సమానత్వం సాధించి పెట్టడానికి రాజ్యాంగపరమైన పునాదిని ఆయన పటిష్టంగా నిర్మించారు. రెండవదశలో కాన్షీరావ్‌ు దానిని కొనసాగించారు. రిజర్వేషన్ల ద్వారా దళితులకు సంక్రమించిన శక్తి సామర్ధ్యాలను ఆయన ఒక పద్ధతిలో సంఘటితపరిచారు. సామాజిక సమానత్వాన్ని సాధించుకోవడం కోసం దళితులను రాజకీయంగా సమీకరించారు. ఇప్పుడు మూడవదశ దళిత సాధికారత, సమానత్వ సాధన విప్లవానికి కాంగ్రెస్ సార ధ్యం వహిస్తున్నదిఅని రాహుల్‌గాంధీ ఆ కార్యక్రమంలో వివరించారు. ఈ విప్లవ సాధనకోసం పంచాయితీల నుంచి ఎమ్మెల్యే, ఎంపీ.

స్థానాల వరకు వివి ధ విధాన నిర్ణయ దశలలోను అన్ని స్థాయిలలోను పటిష్టమైన దళిత నాయకత్వాన్ని నిర్మించాలని ఆయ న అన్నారు. ఈబాధ్యతను ఈ వ్యాసకర్తకు, జాతీ య ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్ పి.ఎల్ పునియాకు అప్పగించినట్టు ఆ సందర్భంలో ఆయన ప్రకటించా రు. తన బాల్యంలో నాయనమ్మ ఇందిరాగాంధీ తన తో చెప్పిన ఒక ఆసక్తికరమైన సన్నివేశాన్ని గురించికూడా రాహుల్‌గాంధీ ఈ వేదికమీద వివరించారు. ఇందిరాగాంధీ చిన్నప్పుడు ఒకసారి జర్మనీ వెళ్ళారు. అప్పుడు అక్కడ హిట్లర్ పాలన సాగుతున్నది. అక్క డ జరిగిన ఒక హాకీ మ్యాచ్ చూడడానికి ఆమె వెళ్ళా రు. అది జర్మనీ జట్టుకు మరో దేశపు జట్టుకు మధ్య జరుగుతున్నది. జర్మనీ ఆటగాళ్లు స్కోర్ సాధించినప్పుడల్లా జర్మన్‌ల విజయధ్వానాలతో ఆటస్థలం హోరెత్తి పోయిందట. చివరికి గెలుపును అవతలి దేశం కైవసం చేసుకోగా జర్మన్‌ల నోళ్ళు మూగబోయాయట అవతలి దేశం గెలుపుకి హర్షసూచకంగా ఇందిరాగాంధీ ఒక్కరే లేచి చప్పట్లు కొట్టారట. దానికి జర్మన్‌లు ఆమెను హేళన చేస్తూ పిచ్చికూతలు కూశారట.

అందుకు ఆమె ఎంతమాత్రం బాధపడలేదు. ధర్మపక్షాన నిలబడేటప్పుడు ఒంటరి అయినా వెనుకాడకూడదు, దళితుల పక్షం నిలబడటానికి అటువంటి సాహసానికి ఎదురీతకు సిద్ధంగా ఉండాలని రాహుల్‌గాంధీ చేసిన ఉద్బోధను ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ శిరోధార్యంగా స్వీకరించింది. కాంగ్రెస్‌కు ఎస్సీలే వెన్నెముక అని రాహుల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ప్రాధాన్యం స్థానాలను ఎస్సీలకు కేటాయించి నాయకత్వంలో వారి భాగస్వామ్యాన్ని ఇతోధికంగా పెంచడానికి అన్యాయాలు, అత్యాచారాలు ఎదురైనప్పుడు వారికి గట్టిదన్నుగా నిలబడటానికి ఏఐసీసీ ఎస్సీ విభాగం ఒక వినూత్న వికేంద్రీకత వ్యూహాన్ని చేపట్టి ఎస్సీలకు రక్షాకవచం కావడం ద్వారా దేశంలో పెను సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. ఈమహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఎస్సీ సోదర లను ఇతర సామాజిక దీక్షాపరులను కోరుతున్నాను.
(రచయిత ఐఏఎస్ (విశ్రాంత),
ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ 
Namasete Telangana Telugu News Paper Dated : 6/3/2014 

Sunday, March 2, 2014

సరోజిని కవిత్వంలో కానరాని దళితులు By నలిగంటి శరత్


 
New 
 
0 
 
0 
 
 

'సరోజినికవిత్వంలో హైదరాబాద్' పేరుతో సామిడి జగన్‌రెడ్డి 'వివిధ'లో రాసిన వ్యాసంలో సంక్షిప్తంగా సరోజినీ నాయుడు సాహిత్య జీవితాన్ని పరిచయం చేశారు. నిర్దిష్టత లోపించిన ఈ వ్యాసం అనేక విషయాలను ఓవర్ సింప్లిఫై చేసింది. ఆమె అనేక రకాల కష్టజీవుల మీద కవిత్వం రాశారని జగన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ బజార్లు కవితలో సబ్బండ వర్ణాల గురించి వర్ణించినట్లు రాశారు. తన వ్యాసానికి దళితుల ఆమోదం సంపాదించడం కోసం మహాత్మా జ్యోతిరావు ఫూలేను, సావిత్రిబాయి ఫూలేను ప్రస్తావించారు. జగన్‌రెడ్డి దృష్టిలో ఆమె పేదల పక్షపాతి. అణగారిన వర్గాల పక్షపాతి. ఇది వొఠ్ఠి అబద్ధమని ఆయనకు కూడా తెలుసు. కానీ ఆమె గురించి ఇంతకాలం ప్రచారంలో పెట్టిన అంశాలను పునరుచ్ఛరించి పాఠకుల మెదళ్లను నిద్ర పుచ్చాలని ఆయన సంకల్పించారు.
నిజమే, ఆమె ఆంగ్లంలో కవిత్వం రాశారు. అయితే, ఏ భాషలో రాశారన్నది ద్వితీయాంశం. కానీ ఏమి రాశారు? ఏ భావజాలంతో రాశారు? తరచి చూస్తే ఆమె కవిత్వం ప్రత్యామ్నాయ మార్గాలనేమీ చూపలేదు. ఆమె దృక్పథమే అందుకు కారణం. అన్ని వర్ణాల గురించీ, వృత్తుల గురించీ హైదరాబాదు బజార్లు కవితలో రాశారని జగన్‌రెడ్డి రశారు. కానీ ఆ కవితలో ఒక్కమాటైనా చెప్పులుకుట్టే వృత్తి గురించి రాయలేదు. ఆమె కవిత్వంలో దళిత జీవితాలకు చోటులేదు. దళితుల గురించీ, దళిత స్త్రీల గురించి ఒక్క ముక్కా ఆమె రాయలేదు. ఆమె ప్రస్తావించింది కేవలం వ్యాపారం గురించే తప్ప వృత్తుల గురించి కాదు. అవి కుల వృత్తులని గుర్తించే నిజాయితీ ఆమెకు లేదు. హైదరాబాదు నగరంలో అమ్మే గాజులు ఆమెకు ఒక దుకాణంలో లభించే సరుకులు మాత్రమే. వాటిని తయారుచేసే కులస్తుల గురించి గానీ, కుల వ్యవస్థ వల్ల బలైపోతున్న బహుజనుల గురించి గాని ఆమెకు ఏ మాత్రం పట్టింపు లేదు. అలా అని ఆమెది వర్గదృష్టి కూడా కాదు. పేద వర్గాల గురించి రాసేంత చైతన్యం కూడా లేదు. ఒక దృశ్యాన్ని అక్షరాలతో బంధించటమే తప్ప ఆ దృశ్యం వెనకున్న సారభూత తత్వాన్ని గ్రహించటం ఆమెకు తెలియదు. ఆమెది అగ్రవర్ణ దృక్పథమని విమర్శిస్తే ఎవరూ నొచ్చుకోవాల్సిన అవసరం లేదు.
జాతీయోద్యమంలో గాంధీ, నెహ్రూలతో సమానంగా పనిచేసిన హైదరాబాద్ ప్రజల మనిషి అని మరో వ్యాఖ్య జగన్‌రెడ్డి చేశారు. ఇది పచ్చి అబద్ధం. ఆమె అగ్రవర్ణ సమాజ మేలు కోసం పనిచేసింది. అంబేద్కర్ ఉద్యమం హైదరాబాద్ రాజ్యంలో బలంగా వుండేది. కానీ సరోజిని మాత్రం అంబేద్కర్ ఉద్యమం పట్ల చాలా అసహనంతో వుండేది. అంబేద్కర్‌ను 'నాజీ' అని సంబోధించిన సరోజిని ప్రజల మనిషి ఎలా అవుతుందో జగన్‌రెడ్డి చెప్పాలి. నిజమే, ఆమె గాంధీతో కలిసి పనిచేసింది. అంతేతప్ప గాంధీతో సమానమైన నాయకురాలు కాదు. ఆమెకు ఒక ఫిలాసఫీ అంటూ లేదు. గాంధీతత్వమే ఆమె హృదయం. అందువల్ల గాంధీలాగే అంబేద్కర్‌ను వ్యతిరేకించింది. రెండో రౌండ్‌టేబుల్ సమావేశంలో గాంధీతోపాటు సరోజిని కూడా పాల్గొన్నది. ఆ సమావేశంలో అంబేద్కర్‌ను వ్యతిరేకిస్తూ మాట్లాడింది. అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు, రెండు ఓట్లు, వయోజన ఓటు హక్కు, జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం అనే నాలుగు డిమాండ్లను డా.అంబేద్కర్ డిమాండ్ చేస్తే సరోజిని వ్యతిరేకించింది. స్త్రీలకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు వుండాలన్న అంబేద్కర్ ప్రతిపాదనను ఆమె వ్యతిరేకించింది. ఎస్సీ, ఎస్టీ, బిసీ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు మతాలకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలనే ఆకాంక్షను తీవ్రంగా ఆమె గాంధీతో కలిసి వ్యతిరేకించింది. కమ్యూనల్ అవార్డును బ్రిటీషు ప్రభుత్వం ప్రకటిస్తే, ఎర్రవాడ జైలులో గాంధీ కుట్రపూరిత ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆమె ఆయన పక్షాన నిలబడింది. అణగారిన వర్గాల విముక్తికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసిన సరోజినీ నాయుడు ప్రజల మనిషి ఎలా అయ్యిందో ఎంతకీ అర్థం కావటం లేదు. 1935లో బ్రిటీషు వాళ్లు రాజ్యాంగం రాసే సమయంలో మహిళలకు ప్రత్యేక నియోజకవర్గాలు పెట్టాలని, మహిళా రిజర్వేషన్లలో కూడా అణగారిన కులాల మహిళలకు ప్రత్యేక ప్రాతినిధ్యం వుండాలని అంబేద్కర్ వాదిస్తే ఆయన్ని వ్యతిరేకించిన మహిళ ఆమె. ఆమెది సామాజిక న్యాయం లేని జాతీయవాదం. అంతెందుకు, హైదరాబాద్ రాజ్యంలో దళితులు చేస్తున్న ఉద్యమానికి ఆమె కనీసం మద్దతు ఇవ్వలేదు. హైదరాబాద్ నగరంలో అధిక సంఖ్యలో వుండే మాదిగ, మాల ఉద్యమాలతో ఆమె కనీస సంబంధాలు పెట్టుకోలేదు. పోనీ, స్త్రీలు ఎదుర్కొంటున్న పీడన గురించి రాసిందా అంటే అదీ లేదు. గాజుల గురించి గొప్పగా రాసిన సరోజిని ఆడవాళ్ల చేతులకు గాజులను తొడిగిన మనువాదానికి వ్యతిరేకంగా ఒక్క కవితా రాయలేదు. తెలంగాణ అభిజాత్యంతో అబద్ధాలను చరిత్రగా ప్రచారం చేయాలని ప్రయత్నిస్తే దళితులు సహించరు. చరిత్రను ఇకనైనా నిష్పాక్షికంగా మాట్లాడుకుందాం. అలా మాట్లాడుకోవటం వల్ల సరోజినీ నాయుడు పట్ల గౌరవం పెరుగుతుంది తప్ప తగ్గదు.
-నలిగంటి శరత్
వ్యవస్థాపక అధ్యక్షులు, దళిత బహుజన కల్చరల్ అసోసియేషన్
Andhra Jyothi Telugu News Paper Dated: 3/3/2014