Friday, May 22, 2015

సామాజిక ధర్మంతోనే సామరస్యం (22-May-2015) By కృపాకర్‌ మాదిగ పొనుగోటి


ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 61 షెడ్యూల్డు కులాల వారి మధ్య సమానత్వం, సామాజిక న్యాయం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2015 మే ఒకటవ తేదీన జీవో నెంబర్‌ 25ను జారీ చేసింది. నిజానికి సామాజిక న్యాయ ఉద్యమాలు ఇటీవల సాధించుకున్న ఒక మంచి ఉత్తర్వు ఇది. ఈ జీవో రావడానికి ఉద్యమించిన మాల కాని ఎస్సీ కులాల సంఘాలు, కార్యకర్తలందరూ ఇందుకు అభినందనీయులు. మాదిగ మహాశక్తి ఉద్యమాలతో ఈ జీవో జారీకి చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సాంఘిక సంక్షేమ శాఖమంత్రి రావెల కిషోర్‌బాబు గారికి ప్రత్యేకించి మాదిగ మహాశక్తి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నది. ఇప్పటి వరకూ ప్రభుత్వ సంక్షేమ, ఆర్థిక విధానాలన్నీ ప్రభావవర్గంగా లేదా శిష్టవర్గంగా లేదా షెడ్యూల్డు కులాల మధ్య అత్యంత ప్రాబల్య కులంగా తయారైన ఒకే ఒక ఎస్సీ అగ్ర (మాల) కులానికి అనుకూలంగా ఉంటూ వచ్చాయి. ఇదే సమయంలో ఎస్సీ కులాల మధ్య సాపేక్షికంగా ఎక్కువ అణిచివేతలకు, వెనకబాటుతనాలకు గురైన మాదిగలు ఇతర ఎస్సీ కులాల అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలు మారాయి. తెలివైన సమూహాలు - అమాయకపు సమూహాల మధ్య, బలమైన సమూహాలు - బలహీనమైన సమూహాల మధ్య బతుకుదెరువు అవకాశాలు ఉంచి, పోటీ పెడితే ఏం జరుగుతుందో, ఇక్కడ షెడ్యూల్డు కులాల మధ్యన కూడా అదే జరిగింది. జరుగుతున్నది.
పంపిణీ న్యాయం - సామాజిక న్యాయం - ఏకరూప అభివృద్ధికి ఆయా కులాల జనాభా నిష్పత్తుల కనుగుణంగా ప్రతి ఎస్సీ కులానికీ అవకాశాలు కల్పించే విధంగా ఈ 25 నంబర్‌ జీవో ఉన్నది. పేదరిక నిర్మూలన పథకాలు, స్వయం ఉపాధి పథకాలు, ఇళ్ళ స్థలాల పంపిణీ, గృహ నిర్మాణం, భూమి కొనుగోలు పథకం ద్వారా సాగుభూములు పంపిణీ, ఎస్సీ ఉప ప్రణాళిక కింద ప్రత్యేకంగా అందే నిధులు, సంక్షేమ, ఆర్థిక పథకాలను సామాజిక న్యాయ పంపిణీ సూత్రాలకు అనుగుణంగా ప్రతి షెడ్యూల్డు కులానికీ అందించడానికి ఉద్దేశించి ఈ జీవో నెంబర్‌ 25ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ కోసం ఈ నెల తొమ్మిది, పది తేదీల్లో బెంగుళూరులో జరిగిన జాతీయ స్థాయి సదస్సు 25వ నంబర్‌ జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది. ఇంతేకాకుండా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను మాదిరిగా తీసుకొని ఆయా రాష్ర్టాల్లోని అన్ని రాష్ర్టాల ప్రభుత్వాల ద్వారా ఇటువంటి జీవోలను జారీ చేయించుకోవాలని వివిధ రాష్ర్టాల నుంచి పాల్గొన్న ఆయా సంఘాల ప్రతినిధులు, నాయకులు, మేధావులు ఈ సదస్సులో తీర్మానించారు.
సరే, ఇది ఎంత మంచి జీవో అయినప్పటికీ, చూసుకొని మురిసిపోవడానికే తప్ప ఇలాంటి జీవోలని ప్రభుత్వ అధికారులు పటిష్ఠవంతంగా, సక్రమంగా అమలు చెయ్యరనే సంగతి మనకు తెలియనిది కాదు. ఇందుకు ప్రబలమైన ఉదాహరణ ప్రస్తుత 25వ నంబర్‌ జీవోకి మూల రూపమైన జీవో నెంబర్‌ 183 అమలు జరపని తీరే. 1997 డిసెంబర్‌ 16న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ 183వ నంబర్‌ జీవోని విడుదల చేసింది. సాంఘిక సంక్షేమ శాఖలో ఇతరత్రా శాఖల్లో ఉన్న కొందరు మాల అధికారులతోపాటు ఆయా ఆధిపత్య కులాల ప్రభుత్వాలన్నీ ఈ 183వ నంబర్‌ జీవో అమలు కానీయకుండా తొక్కిపెట్టిన సంగతి మాదిగలతో పాటు మిగిలిన ఎస్సీ కులాల వారందరికీ బాగా తెలిసిందే. ఈ 183 జీవోని ప్రస్తుత 25వ నంబర్‌ జీవోగా మార్చి, 2011 జనాభా గణాంకాలకనుగుణంగా ఎస్సీ సబ్‌ప్లాన్‌కు కూడా వర్తింపజేస్తూ రాబోయే పదేళ్ళ కాలం పాటు అమలులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యీ తాజా సవరణ ఉత్తర్వునిచ్చింది.
 
ఈ 25వ నంబర్‌ జీవో అమలు జరగటం వలన గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులు, చదువు మధ్యలో ఆగిపోయినవారు, వ్యవసాయ కూలీలు, నిరుపేదలు, యువకులు, మహిళలు అయిన అన్ని షెడ్యూల్డు కులాలలోని మెజారిటీ ప్రజలకు సంక్షేమ పథకాలు పొందటానికి వీలుకలుగుతుంది. ప్రతి జిల్లాలోని ఎస్సీ జనాభాను యూనిట్‌గా తీసుకుని ఆయా ఎస్సీ కులాల వారి నిర్దిష్ట జనాభా నిష్పత్తులకనుగుణంగా అన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రతి ఎస్సీ కులానికీ అందించాలని ఈ జీవో నిర్దేశించడం హర్షణీయం. ఈ జీవో సక్రమంగా నిరంతరాయంగా అమలయితే, షెడ్యూల్డు కులాల మధ్య ప్రస్తుతం పెద్దగా కొనసాగుతున్న అభివృద్ధి వ్యత్యాసాలు తగ్గిపోయి, ఏకరూప అభివృద్ధికి పునాదులు ఏర్పడతాయి. ఈ 25వ నంబర్‌ జీవో అమలు వల్ల ఎవరికీ ఎటువంటి నష్టమూ, అన్యాయమూ జరగదని తెలిసినప్పటికీ, ఇప్పటి వరకూ అదనంగా పొందుతూ వున్న ఆర్థిక, సంక్షేమ లబ్ధిని కోల్పోతామన్న దురుద్దేశంతో కొన్ని మాల సంఘాలు, కొందరు మాల నాయకులు ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్దీకరణ (వర్గీకరణ) మాట ఎత్తితే నాలుకలు తెగ్గోస్తామని గోదావరి మాల నాయకుడొకరు ఇటీవల బహిరంగ హెచ్చరిక చేసేశారు! ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్దీకరణ అనేది కాలం చెల్లిన సమస్య అని తెలంగాణ మాల నాయకుడొకరు ప్రకటించేసారు! సామాజిక న్యాయానికి - పంపిణీ న్యాయానికి - వ్యతిరేకంగా మాల కులంలో చెలరేగుతున్న ఇటువంటి అసాంఘిక శక్తులు, వ్యక్తుల వలన షెడ్యూల్డు కులాల మధ్య దూరం, అపోహలు పెరుగుతున్నాయి. ఎస్సీ కులాల మధ్య సామరస్యం, ఐక్యత దెబ్బతింటున్నది. ఇదే సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకులు, ఉద్యమకారుల పేరిట చెలామణి అవుతున్న నాయకులు, కుల పెద్దలుగా ఉన్న కొందరు ఉన్నతాధికారులు కొనసాగిస్తున్న మౌనాన్ని గనక గమనిస్తే వీరే కొన్ని అసాంఘిక శక్తులకు ఊతం అందిస్తున్నారేమో అనే అనుమానం ఎవరికైనా కలుగక మానదు.
 
భారత జనాభా 2011 గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మాదిగ జనాభా అత్యధికంగా ఉండగా, మిగిలిన జిల్లాల్లో మాల వారి సంఖ్య కొంచెం అధికంగా ఉన్నదని తెలుస్తున్నది. అలాగే రాష్ట్రంలో ముప్పై ఎనిమిదిన్నర లక్షల మంది మాదిగ అనుబంధ కులాల ప్రజలుండగా, నలభై రెండు లక్షల మంది మాల అనుబంధ కులాల ప్రజలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ గణాంకాలు కూడా మాదిగలు, మిగిలిన సాపేక్షిక అణగారిన ఎస్సీ కులాలకు వాస్తవిక సంఖ్యలకు అద్దం పట్టేవిగా లేవేమోనని ఈ వ్యాసకర్త అనుమానం. ఎన్నో ఏళ్ళుగా ఎస్సీ రిజర్వేషన్లలో పంపిణీ న్యాయం, సామాజిక న్యాయం, సరైన ప్రాతినిధ్యం కోసం అన్ని షెడ్యూల్డు కులాల వారు చేసిన ఎన్నో ఉద్యమాల ఫలితంగా వచ్చిన యీ 25వ నంబర్‌ జీవో అమలు వలన తమకు కొంతమేరకు న్యాయం జరుగుతుందని అణగారిన ఎస్సీ కులాలన్నీ ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈ జీవో పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఈ జీవోను రద్దు చెయ్యాలనే అసాంఘిక, అన్యాయ వాదనలకు, వ్యతిరేక చర్యలకు దిగుతున్న కొందరు మాల వారి దుశ్చర్యలను మాల కుల పెద్దలుగా, ప్రముఖ మాల అంబేద్కరిస్టులుగా, బుద్దిస్టులుగా, మావోయిస్టులుగా, కవులు, రచయితలు, పాత్రికేయులు, విద్యావంతులు, ఉన్నతాధికారులుగా వివిధ రంగాల్లోని మాల పెద్దలు ఖండించడం, మిగిలిన ఎస్సీ కులాల వారి ప్రజాస్వామిక ఆకాంక్షలను, డిమాండ్లను బలపరచడం వారి సామాజిక ధర్మం. ఇలా చెయ్యకుండా వారు కూడా మౌనం వహిస్తున్నారూ అనంటే, ఎవరైతే గాంధీగారి కాలంచెల్లిన దళితవ్యతిరేక వాదనలను మాల కులంలో నెత్తికెత్తుకుంటున్నారో వారితో వీరు ఏకీభవిస్తున్నట్టుగా, బలపరుస్తున్నట్లుగానే ప్రస్తుత సామాజిక సంఘర్షణల సమయంలో భావించవలసి ఉంటుంది.
మాల సామాజిక వర్గంలో ఉన్న నిజమైన అంబేద్కరిస్టులు, బుద్దిస్టులు, విప్లవవాదులు, ప్రజాస్వామికవాదులు - వారు ఇప్పుడు తమ నోళ్ళు విప్పాలి. మాదిగలు ఇతర షెడ్యూల్డు కులాల ప్రజలు చేస్తున్న డిమాండ్లలోని హేతుబద్దత, న్యాయబద్దతకు మద్దతునివ్వాలి. మాదిగలు, మిగిలిన ఎస్సీ కులాలవారు చేస్తున్న పోరాటాలు ప్రభుత్వాల పైననే కాని మాల వారిపై కాదన్న సత్యాన్ని మాల పెద్దలు స్వీయ సామాజిక వర్గీయులకు వివరించాలి. సాపేక్షిక, వ్యవస్థీకృత అన్యాయాలకు, వెనకబాటుతనాలకు గురైన మాదిగలు ఇతర ప్రభుత్వాలపై చేస్తున్న ఉద్యమాలను వ్యతిరేకిస్తున్న కొద్ది మంది అసాంఘిక మాల శక్తులను కట్టడి చెయ్యడానికి మాల పెద్దలు పూనుకోవాలి. ఇందుకోసం మాల పెద్దలు ఇకనైనా తమ నోళ్ళు విప్పాలి. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమంచాలి.
 
కృపాకర్‌ మాదిగ పొనుగోటి
మాదిగ మహాశక్తి జాతీయ అధ్యక్షుడు
 Published in Andhra Jyothi Dated: 23/05/2015

No comments:

Post a Comment