మేదరి భాగయ్య (భాగ్యరెడ్డివర్మ) 1888 మే 22 న హైదరాబాద్‌లో మేదరి రంగమాంబ, వెంకయ్య దంపతులకు జన్మించారు. సమాజంలో దళితుల బాధలను స్వయాన తానూ అనుభవించాడు. ఈ సమాజంలో తన జాతి వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందాలని దళితులు తమ సమస్యలను పరిష్కరిం చుకోవడానికి, సామాజిక చైతన్యం ఉంటేనే ఆధిపత్యం అణచివేతను ప్రశ్నించవచ్చన్న భాగయ్య ఇందుకు చదువుకోవడమే సరైన మార్గమని దిశానిర్దేశం చేశారు. అందుకోసం హైదరాబాద్‌తో సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో దాదాపు ఇరవై ఆరు పాఠశాలలను నెలకొల్పి దళితజాతి చైతన్యం కోసం వందలాదిమంది దళిత విద్యార్థులకు చదువుకొనే అవకాశం కల్పించారు. నిజాం పాలనలో సాంఘిక దురాచారాలను రూపుమాపే ప్రయత్నం చేశారు. స్త్రీల నిరక్షరాస్యతను, బాల్య వివాహాలను, దేవదాసి వ్యవస్థను నిర్మూలించే పయత్నం చేశారు. ఇందుకు గాను 1906లో హైదరాబాదులోని ఇస్లామియా బజార్ వద్ద జగన్మితమండలిని స్థాపించి బాలబాలికలకు చదువు నేర్పించారు. మద్యపానం, మాంసాలను నిషేధించడం, దేవదాసి వ్యవస్థను నిర్మూలించడం లాంటి సమాజోపయోగకర పనులు ప్రారంభించారు.
1906లో హిందూ సోషల్ లీగ్ అనే సంస్థను ప్రారంభించి అస్పృశ్య వర్గాల బానిసత్వాన్ని, వెట్టిచాకిరి వ్యవస్థను వ్యతిరేకిస్తూ బ్రాహ్మణులు కల్పించిన అసమానతల రహస్యాలను బట్ట బయలు చేశారు. 1910లో ప్రచారిని సభను స్థాపించి దళితు ల కు నీతి నియమాలు బోధిస్తూ హిందూ మతంలోని రహస్యాల గుట్టు విప్పారు. 1914లో హైదరబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో ఆదిహిందు భవన్ స్థాపించారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి దానికి కారణమవుతున్న సవర్ణ వర్గాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఉద్యమం తెలుగు నేలకే పరిమితం కాకూడదని అఖిల భారత ఆది ఆంధ్రుల మహాసభను హైదరాబాదులో నిర్వహించారు. అంటరాని కులాలను ఆది ఆంధ్రులు గా గుర్తించాలని డిమాండ్ చేశారు. అంతిమంగా ఆదిహిందువులుగా పిలవాలని ప్రకటించారు. ఈ ఉద్యమ ఫలితంగా నాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ (తమిళులు) అను పదాలను అస్పృశ్య వర్గాలకు వాడాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కాలంలో భాగ్యరెడ్డివర్మను అనేకమంది అగ్రవర్ణాల వారు వ్యతిరేకించినా ఒక్కడే ధైర్యంగా నిజాం ప్రభువుతో ఉన్న దగ్గరి సంబంధం వల్ల ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. మహారాష్ట్రలో అంబేద్కర్ దళితుల పట్ల పోరాడుతున్న విధానా న్ని అభినందించారు. మహారాష్ట్రలో అంబేద్కర్ ఏర్పాటు చేస్తు న్న కళాశాలకు భాగ్యరెడ్డి వర్మకు నిజాం రాజుతో ఉన్న సాన్నిహిత్యం వల్ల పది లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. దీని ద్వారా ఎంతో మంది విద్యార్థులు గొప్ప విద్యావంతులుగా ఎదిగారు. ఇంకా చాలా మంది విద్యావంతులు కావాలని 1931 లో ఆదిహిందూ భవన్‌కు అనుబంధంగా భాగ్యనగర్ పత్రికను స్థాపించి విలువైన సమాచారాన్ని ప్రజలకు అందించారు. 1937 లో ఈ పత్రికను ఆది హిందూ పత్రికగా పిలిచారు. నిరంతరం దళితుల కోసం పాటుపడిన భాగ్యరెడ్డి వర్మ 1939 ఫిబ్రవరి 18న దివంగతులయ్యారు.
Namasete Telangana Telugu News Paper Dated:22/02/2015
- ఆదినారాయణ గిన్నారపు
దళిత స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్
(నేడు భాగ్యరెడ్డి వర్మ జయంతి)
No comments:
Post a Comment