Sunday, February 2, 2014

ఆకలి, ఆవేదనే దళిత సాహిత్యం, తమిళ రచయిత్రి బామతో ఇంటర్వ్యూ....


గతంలో సమాజంలో కొన్ని వర్గాలకే సాహిత్యం పరిమితమై ఉండేది. కాల, మాన పరిస్ధితులలో ప్రజల భాషను, ప్రజల సంస్కతిని స్వంతం చేసుకుని వచ్చిన దళిత సాహిత్యం సమాజంలోని అణగారిన వర్గాలలోకి సాహిత్యాన్ని తీసుకెళ్లింది. మొదట్లో దళిత కవుల రచనలు, కవితలు ప్రచురించడానికి ప్రచురణకర్తలు ముందుకు వచ్చేవారు కాదు. ప్రధాన స్రవంతి రచయితలు, కవుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యేది. దళిత సాహిత్యంలో ఉపయోగించిన భాష, సంస్కతిని ప్రజలు ఆదరించారు. ప్రజల నుంచి లభించిన ఆదరణతో దళిత సాహిత్యానికి క్రమంగా ఆదరణ పెరుగుతూ వస్తున్నది. దళిత రచయితల పుస్తకాలను ప్రచురించడానికి ప్రచురణకర్తలు ముందుకు వస్తున్నారని అంటున్నారు తమిళనాడుకు చెందిన దళిత రచయిత్రి బామ. అవార్డులు, పురస్కారాల కన్నా ప్రజల నుంచి గుర్తింపు పొందడం ప్రధానం అంటున్నారు బామ. నగరంలో ఇటీవల జరిగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి నగరానికి వచ్చిన తమిళ రచయిత్రి బామతో ఇంటర్వ్యూ....
BAMA-SIVAKAMIదళిత సాహిత్యానికి ఆదరణ ఎలా ఉంది..?
బామ: దేశవ్యాప్తంగా దళిత సాహిత్యానికి ఆదరణ పెరుగుతోంది. ఇదివరకు సామాన్యులకు అర్ధమయ్యే విధంగా సాహిత్యం ఉండేది కాదు. సాహిత్యం కొన్ని వర్గాలకే పరిమితమై ఉండేది. దళిత సాహిత్యం ఆ పరిధి చేరిపేసి ప్రజలకు సాహిత్యాన్ని చేరువచేసింది. ప్రజలకు అర్ధమయ్యే భాషలో, ప్రజల సంస్కతిని ప్రతిభింబించేలా వచ్చిన దళిత సాహిత్యాన్ని ప్రజలు ఆదరిస్తున్నా రు. దాన్నుంచి ప్రేరణ పొందుతున్నారు.

చదువురాని వారు రచనలు చేయగలరా..?
చదువుకు, సాహిత్యానికి సంబంధం లేదు. సాహి త్యం, కవిత్వం హదయంలోంచి పుడుతోంది. దళిత కవులలో చాలా మంది చదువుకోని వారు ఉన్నారు. డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చేస్తేనే గొప్ప రచయితలు అవుతారనేది అపోహ మాత్రమే. చదువుకోని వాళ్లు, పాఠశాల విద్యకే పరిమితమైన వాళ్లలో కూడా గొప్ప రచయితలు, కవులున్నారు. సామాజిక, ఆర్ధిక కారణాల వల్ల దళితులలో చాలామంది కొన్ని శతాబ్దాల పాటు అక్షరాలకు దూరంగా ఉన్నారు. దళితులు ఎదుర్కొన్న కష్టాలు, సంఘర్షణలోంచి దళిత సాహిత్యం పుట్టింది. ప్రాంతీయ భాషలలో వచ్చిన దళిత సాహిత్యాన్ని ఇతర భాషల వాళ్లు అనువాదం చేయించుకుంటున్నారు. ఇంగ్లిష్ అనువాదాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నది.

రచయితలకు ప్రభుత్వ ప్రోత్సాహం, గుర్తింపు ఎలా ఉంది..?
దళిత రచయితలకు, కవులకు, సాహిత్యానికి, గుర్తిం పు ఉన్నది. ప్రజల నుంచి ప్రోత్సాహం ఉంది. దళిత సాహిత్యం ప్రజలకు అర్ధమయ్యే భాషలో ప్రజల సంస్కతిని, ప్రజల కష్టాలను ప్రతిబింబిస్తున్నది.

సమాజంపై దళిత సాహిత్య ప్రభావం ఎలా ఉంటున్న ది..?
సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలలో సాహిత్యం కూడా ఒకటి. దళిత సాహిత్యం ప్రభావం కచ్చితంగా సమాజాన్ని ప్రభావితం చేస్తున్నది. సాహిత్యం సమాజంలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంటుంది. గొప్ప గొప్ప రచయితలు ప్రజలకు అర్థమయ్యే భాషలో సమకాలీన అంశాలు, ప్రజల కష్టాలు ప్రతిబింబించేలా రచనలు చేశారు. చేస్తున్నారు.

ఎన్ని భాషలలో మీరు రచనలు చేశారు..?
నేను తమిళ భాషలోనే రచనలు చేసినా ఆ పుస్తకాలు తెలుగు, హిందీ,కన్నడం, మళయాలం, ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషలలోకి అనువాదమయ్యాయి. నేను రాసిన కరుక్కు నవల, సంగతి, వన్మం, కుసుమ్‌ముక్కరం పుస్తకాలు భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషలలోకి అనువదించారు. అన్ని భాషలకు చెందిన సాహి తీ ప్రియుల నుంచి నా రచనలకు మంచి ఆదరణ లభిస్తున్నది.

మీరిచ్చే సందేశం...
సమాజంలో ప్రతి ఒక్కరు చదువుకోవాలి. విద్య ద్వారా సమాజాన్ని అర్ధం చేసుకుని సమాజాన్ని మార్చే అవకాశం ఉంటుంది. అణగారిన వర్గాలకు విద్యనే ఆయుధం. అంబేద్కర్ చెప్పినట్లు చదువుకుని ఐకమత్యంతో పోరాటం చేసినప్పుడే సమాజంలోని అసమానతలను రూపుమాపగలుగుతాం.

Namasete Telangana Telugu News Paper Dated : 3/2/2014 

No comments:

Post a Comment