- ప్రైవేటుకు దీటుగా ఆశ్రమ పాఠశాలలు
'ఎవరో ఒకరు ఎపుడో అపుడు.... నడవరా ముందుగా అటోఇటో ఎటోవైపు... మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ... మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ... వెనుక వచ్చు వాళ్లకు బాట అయినది.' అంటాడోసినీ కవి. అలాంటి స్ఫూర్తితో పనిచేసే ఉన్నతాధికారులలో ఒకరు డా|| ఆర్.ఎస్ ప్రవీణకుమార్. ప్రభుత్వ ఉదోగాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించి, సామాజిక ఉద్యమ కర్తలు జ్యోతిరావుబాఫూలే, డాక్టర్ భీంరావ్ అంబేద్కర్, డాక్టర్ ఎస్‌ఆర్ శంకరన్ వంటి మహనీయుల అడుగు జాడల్లో నడవాలని, గొంతులేని జనం కోసం పని చేయాలని సంకల్పించుకున్నారు ఆయన. ప్రపంచీకరణ నేపథ్యంలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఆంగ్లమాధ్యమ విద్యాబోధన ప్రవేశపెట్టి వాటిలో చదివే విద్యార్థుల హృదయాలలో ఆయన నిలిచిపోయారు. సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాసంస్థల (ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ఎస్) కార్యదర్శిగా ఆయన ప్రజాశక్తికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ :
ఐపిఎస్ అధికారిగా పోలీస్ ఉద్యోగం వదిలి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థ కార్యదర్శిగా ఎందుకు ఉన్నారు?
ఇదో కొత్తరకం పోలీసింగు. పోలీస్ ఉద్యోగాన్నేమీ వదలలేదు. డిజిపి ఆదేశాల మేరకు తెలంగాణా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో పోలీస్ డ్రస్‌తో వెళ్లాను. విధులు నిర్వహించాను. ప్రత్యేక పరిస్థితుల్లో ఆ బాధ్యతలు ఇప్పుడూ నిర్వహిస్తున్నాను. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్య ముగించుకుని వచ్చాక నా మాతృసంస్థ అయిన సాంఘిక సంక్షేమశాఖ రుణం తీర్చుకోవాలని అనిపించింది. వారి జీవితాల్లో మరింత వెలుగు తీసుకురావాలనే నా ఆలోచన ముఖ్యమంత్రికి చెప్పాను. ఆయన అంగీకరించారు. పోలీస్, సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థ కార్యదర్శి ఉద్యోగాల మధ్య పెద్ద తేడా కనిపించలేదు. పోలీస్ ఉద్యోగంలో ప్రజలందరికీ సేవచేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ అన్నింటిలో వెనుకబడిన బడుగుజనాలకు విజ్ఞానం అందించే అవకాశం వచ్చింది. పోలీసింగ్‌లో దుర్మార్గులను శిక్షించి మంచివారికి మేలు చేయడం సంతృప్తి కలిగించేది. అయితే అక్కడ ఏ వర్గానికి మేలు చేస్తున్నామనే విషయంలో స్పష్టత ఉండేది కాదు. సాంఘిక సంక్షేమ శాఖలో పేదలకు, నోరులేని వర్గాలకు సేవ చేస్తున్నాననే భావన ఇంకా ఎక్కువ సంతృప్తిని ఇస్తోంది. గత 15 సంవత్సరాలలో పోలీస్ శాఖలో రకరకాల హోదాల్లో ప్రాణాలకు తెగించి పనిచేసే అనేక కేసులను ఛేదించాను. భారత ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ గ్యాలెంట్రీతో సహా ఎన్నో మెడల్స్ వచ్చాయి. విదేశాలకు వెళ్లాను.
మీ రాకతో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఎలాంటి మార్పులు, వచ్చాయి?
విద్యార్థులకు ఉన్నత చదువులకు వెళ్లగలమనే నమ్మకం కలిగింది. ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన చేయగలమని ఉపాధ్యాయులు నిర్ధారణకు వచ్చారు. నాలాంటి ఒక అధికారి కాగలమనే విశ్వాసం విద్యార్థులలో పెరిగింది. ఊళ్లలో కరెంటు ఉండదు. తల్లిదండ్రుల నుంచి తగినంత ప్రోత్సాహం, సాయం ఉండవు. ఏం లేక పోయినా గురుకుల పాఠశాలలో మేము చదువుకోగలమనే నమ్మకం విద్యార్థులలో కల్పించగలిగాను. ఉపాధ్యాయులకు పిల్లల పట్ల వైఖరి మారింది. విద్యార్థులకు 100 శాతం మార్కులు తెప్పించడం ఒక్కటే కాదు, వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలనే ఆలోచన వచ్చింది. విద్యార్థులకు నేర్పించాల్సినవి చాలా ఉన్నాయనే అవగాహన వచ్చింది. అలా చేస్తే మంచి ఉపాధ్యాయులుగా గుర్తింపు వస్తుందనే ఆలోచన ఏర్పడింది. పోలీస్ ఆఫీసరు కదా కఠినంగా వ్యవహరిస్తారనీ, డ్రస్ కోడ్‌ను, కఠోర క్రమశిక్షణను అమలు చేస్తారనీ.. ఏవేవో ఊహించుకొని మొదట భయపడ్డారు. తర్వాత ఆ భయం పోయింది. ఇంతకు ముందు ఆంగ్ల మాధ్యమం ఉండేది కాదు. ప్రపంచీకరణ నేపథ్యంలో దాని ప్రాధాన్యత పెరిగింది. ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాక విద్యార్థులంతా ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు. ఇంగ్లీషులో మాట్లాడటం, తప్పులు లేకుండా రాయడం ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో విద్యార్థులకు మనోధైర్యాన్ని ఇస్తుంది. విద్యార్థులతో సంబంధాలు పెరిగిగాయి. అమ్మాయిలకు ఆత్మవిశ్వాసం కల్పించాం. ఎంసెట్, ఐఐటి, తదితర పోటీపరీక్షల్లో ప్రైవేటు విద్యాసంస్థలతో పోటీపడి ర్యాంకులు సాధిస్తున్నారు. పూర్వ విద్యార్థుల సంఘం ఒకటి ఏర్పాటు చేశాం. దానికి 'స్వేరోస్' అనే పేరు పెట్టాం. వారి మధ్య కొత్త నెట్ వర్క్ తయారు చేశాం. కులం , ప్రాంతాల కతీతంగా స్వేరోస్ అనేది ఒక గోత్రంగానో, ఇంటిపేరుగానో మారింది. అన్నింటికి మించి కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగి సమాజంలో మార్పు కోసం పోరాడిన, తపించిన జ్యోతిరావుబాఫూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎస్ ఆర్ శంకరన్ లాంటి గొప్పవారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలనే తపన విద్యార్థుల్లో కల్పిస్తున్నాం. గతంలో సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకునే వారిలో ఆత్మన్యూనతా భావం ఉండేది. ఇప్పుడు అది పోయింది.
పూర్వ విద్యార్థుల నెట్ వర్క్ పెంచాలనే ఆలోచన ఎలా వచ్చింది?
నేను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న కాలంలో ఈ ఆలోచన వచ్చింది. అక్కడ పూర్వ విద్యార్థులు విరాళాలు సేకరించి పేద విద్యార్థులకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం తదితర విషయాలలో సహకరించేవారు. వారు అన్ని రంగాల్లో నిష్ణాతులుగా ఎదిగి ఎన్నో ఉన్నత అవకాశాలు , ర్యాంకులు పొందేలా సాయపడేవారు. అలాంటి మన దగ్గర కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకు సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో మూడు లక్షల మంది విద్యాభ్యాసం చేశారు. వారందరినీ ఒక తాటిపైకి తేవచ్చని అనుకున్నాను. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో ఈ నెట్‌వర్క్ ఏర్పడింది. రాయలసీమకు కూడా దీనిని విస్తరించాలనుకుంటున్నాం.
రాబోయే రోజుల్లో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపడతా? మీకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎలా లభిస్తోంది?
ప్రతి స్కూల్లో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయబోతున్నాం. 20 నుంచి 30 కంఫ్యూటర్లు ఏర్పాటు చేస్తాం. వివిధ భాషలు నేర్చుకునేలా సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులో ఉంచుతాం. అడ్వెంచర్ కోర్సులు ప్రవేశపెడతాం. విద్యార్థులకు సంగీతం నేర్పించే ఆలోచన కూడా ఉంది. లాంగ్‌టర్మ్ కోచింగు సెంటర్లు పెట్టబోతున్నాం. కొత్త ప్రొఫెషనల్ కోర్సులను పరిచయం చేయబోతున్నాం. అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కావల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తాం. అకడమిక్ విద్యతోపాటు రచయితలుగా, జర్నలిస్టులుగా, చలనచిత్రనటులుగా కావడానికి వీలైన శిక్షణ ఇస్తాం. త్వరలో ఒక విద్యార్థి బృందాన్ని ఎవరెస్టు శిఖరానికి తీసుకు వెళ్లడానికి ప్రణాళిక రూపొందించాం. అందుకు కావల్సిన శిక్షణ ఇస్తున్నాం. అమ్మాయిలకు లీడర్‌షిప్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. వాటిని మరింత పటిష్టంగా చక్కటి ఫలితాలు వచ్చేలా తయారు చేస్తాం. దీనికి ప్రభుత్వం నుంచి నూటికి నూరు శాతం సహకారం అందుతోంది.
మీ చదువుకు, సివిల్స్‌లో విజయం సాధించడానికి ఎవరి నుంచి సహకారం, ప్రోత్సాహం అందాయి?
చదువుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం సంపూర్ణంగా అందింది. వారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు కావడంవల్ల వారి మార్గదర్శకత్వంలో ఈ స్థాయికి ఎదిగాను. ఐపిఎస్ కావడానికి కష్టపడి చదివాను. ఉపాధ్యాయులు, సహ విద్యార్థుల సహకారం కూడా ఉంది. అయితే సివిల్స్‌లో అన్ని కోణాలనూ అర్థం చేసుకోవాలి. 10 నుంచి 12 గంటలు కష్టపడి చదవాలి. ఐఎఎస్, ఐపిఎస్ కావాలని కలలు కంటే సరిపోదు. సమాజ అవగాహన, నిరంతర అధ్యయనం అవసరం.
ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీలు, బిసిలు, ఆర్థికంగా వెనుకబడిన వారు అవమానాలకు, అత్యాచారాలకు గురవుతున్నారు. బలహీనులపై బలవంతుల దోపిడి, పీడన ఎప్పటికి పోతాయనుకుంటున్నారు?
ఇదంతా పరిణామ క్రమంలో భాగం, దోపిడీ, పీడన అనేవి కొంత తగ్గినా ఇంకా కొనసాగుతున్నాయి. పీడితుడు దాడికి గురవుతున్నది పీడించే వాడి బలంవల్ల కాదు, తన బలహీనతవల్ల. అది పోవడానికి అందరూ విద్యనభ్యసించాలి. సమాజాన్ని అర్థం చేసుకోవాలి. మార్పుకోసం ప్రయత్నించాలి. ఉన్నతస్థాయికి ఎదగాలి. ఆమేరకు మా గురుకులాల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. వర్గాలు, వర్గాల పొందిక, దోపిడీ , పీడన అంశాలపై డిబేట్స్ నిర్వహిస్తున్నాం. మేము ఎవరికీ తీసిపోమనీ, కష్టపడి ఏదైనా సాధించగలమనే ఆత్మవిశ్వాసం కల్పిస్తున్నాం. నిన్ను తక్కువ అనుకుంటే నీదే తప్పు అని చెబుతున్నాం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వారు ఉన్నతస్థాయికి ఎదిగినా వివక్షకు గురయ్యారని వారి జీవిత చరిత్ర చెబుతుంది. మీరు అధికారి అయ్యాక మీ పట్ల ఎవరయినా వివక్ష చూపారా?
'నో....నేనెవ్వడికీ తక్కువకాదు.' అన్నింటిలో పోటీపడి ముందుంటున్నప్పడు వివక్ష చూపే అవకాశమే లేదు. అంబేద్కర్ కాలంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు.
మీజీవిత లక్ష్యం ఏమిటి?
'ఇప్పటికే చాలా జీవితం అయిపోయింది. ప్రతిక్షణం కూడా నోరులేని వారి కోసం పని చేయాలనేది నాజీవిత లక్ష్యం'.
- పానుగంటి చంద్రయ్య,
Prajashakti Telugu News Paper Dated : 09/2/2014
No comments:
Post a Comment