Sunday, February 23, 2014

'మగ చెట్టు'తో పనిలేని మహిళా నేత! - సతీష్ చందర్


P
 
2 
 
2 
 
0 
 
 

ఇప్పటి 'చెంచాల' యుగంలో, అగ్రవర్ణ పార్టీల అగ్రవర్ణ నేతలు చెప్పిన దానికెల్లా తలాడించే నేతలే షెడ్యూల్డు కులాల, తెగల నుంచీ ఎన్నికవుతున్నారు. మహిళా ప్రతినిధుల సంగతి సరేసరి. పదవీ స్వీకారం చేసిన తొలిరోజే వీరి చేత ఈశ్వరీ బాయి జీవితాన్ని కంఠస్తం చేయించాలి. అగ్రవర్ణ నేతల ముందు తలవంచటం మానకపోయినా, తలవంచినప ప్రతీసారీ, కనీసం తప్పు చేస్తున్నామన్నామన్న భావన వెంటాడుతుంది.
పైకి రావాలీ, పైకి రావాలీ అని పెద్దవాళ్ళు అంటూంటే, ముందు పైపై దీవెన అనుకుంటాం. నిజంగా పైకి రావటానికి ప్రయత్నించినప్పుడు తెలుస్తుంది, అది దీవెన కాదు, కేవలం హెచ్చరిక అని. 'బిడ్డా! పైకి రానివ్వర్రా, జాగ్రత్త' అన్న అంతరార్థం అందులో ఉంది.
పైకి వెళ్ళాలంటే, మెట్టు మెట్టుకీ చెట్టు పేరు చెప్పాలి. కులమో, గోత్రమో, శాఖో, ఉపశాఖో తెలిసేట్టు చేయాలి. అట్టడుగు వర్గాలకు చెప్పుకోవటానికి చెట్లుండవు. ఉన్నా, అవి జడలు విచ్చి, ఊడలు వేసి ఉండవు. ఏ రంగంలో అయినా అంతే, అన్ని రంగాలనూ తనలో లయం చేసుకోగల రాజకీయ రంగం అయితే మరీను.

ఆడవాళ్ళకయితే చెట్టు పేరు తప్పని సరి అయిపోతుంది. ఆ చెట్టెప్పుడూ మగ చెట్టయ్యే ఉండాలి. భర్త చాటు భార్యలకో, తండ్రి నీడన ఉన్న కూతుళ్ళకో దారులు దొరుకుతుంటాయి. అదీ కూడా చెట్టు కూలాక, మాత్రమే 'సానుభూతి'కి ప్రతీకలుగా వారు చట్టసభలకు వస్తుంటారు. అందుకే రాజకీయాల్లో మహిళలు పేర్లు చెప్పమనగానే తొలుత 'వితంతువు' పేర్లే స్ఫురణకు వచ్చాయి. వస్తున్నాయి కూడా.
అలాంటిది, అయిదు దశాబ్దాల క్రితమే, ఏ 'మగ చెట్టు' పేరూ చెప్పుకోకుండా, తెలంగాణ గడ్డ మీద చట్ట సభకు ఒక అట్టడుగు (అప్పటి 'అస్పృశ్య') వర్గాల నుంచి ఒక మహిళ సర్వస్వతంత్రంగా అడుగు పెట్టటం చిన్న విషయం కాదు. మానవుడు చంద్రమండలం మీద తొలిసారిగా పాదం మోపినంత గొప్ప విషయం. ఈ మాత్రం వివరణ చాలు, తెలుగువారు పోల్చుకోవటానికి. ఆమె ఎవరో కాదు. జె. ఈశ్వరీ బాయి. (1967లో నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుంచి అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ టికెట్టు మీద ఎన్నికయ్యారు. రెండవ దఫా 1972లో కూడా మళ్ళీ అక్కడి ప్రజలు ఆమెనే అసెంబ్లీకి పంపించారు)
ఆమెకు పెళ్లంటే ఏమిటో తెలిసేటప్పటికే పెళ్ళి (13వ ఏట) అయిపోయింది. తెలిశాక, తనకు తగనివాడని అనుకున్నారో ఏమో, తెగతెంపులు చేసుకుని, సొంత కాళ్ళ మీద నిలవాలనుకున్నారు. అప్పటికే ఆమెకో ఆడబిడ్డ పుట్టేసింది. అప్పుడు తెలిసింది పైకి రావటమంటే ఏమిటో...! పైకి రానివ్వమనే వారిపై యుద్ధమే, ఎదగటమంటే. తాను చదివారు. తన బిడ్డను చదివించారు. ఈ రెండూ నడవటానికి నలుగురికీ చదువు చెప్పారు. (ట్యూషన్లు చెప్పారు). తన ఆశించినట్లుగానే తన బిడ్డను డాక్టరుని (ఇప్పటి మంత్రి గీతారెడ్డి) చేశారు. ఇంతవరకూ అయితే, మహిళా పత్రికల్లోనో, అనుబంధాల్లోనో రాసుకునే ఓ 'సాధారణ విజయగాథ' ఆమె జీవితం ముగిసి పోయేది. కానీ ఆమె చదువు విస్తృతి పెరిగింది. అంబేద్కర్ రచనల్ని, ఉపన్యాసాల్నీ స్పృశించి ంది. కదలిపోయింది. అంబేద్కర్ ఎదుగుదలలో కూడా 'పైకి రానివ్వకుండా అడ్డుకునే శక్తులు' అడుగడుగునా ఎదురువచ్చా యనీ, కానీ ఆయన్ని 'అంగుళం కూడా వెనక్కి కదలించి లేక పో యాయ'ని ఆమె తెలుసుకున్నాక, ఎక్కడలేని ధైర్యం వచ్చింది. 'బిడ్డను' లాలించటమే కాదు, రాజ్యాన్ని పాలించటమూ తనకు తెలుసునని నిరూపించాలనుకున్నారు. నిరూపించారు.
కానీ 'మాంచాలను కొలిచి, మంగమ్మను తలచి, సరోజినీ దేవి పటం కట్టి పూజించే' ఈ 'పుణ్య' భారతంలో 'ఆయుధం పట్టిన' పంచాది నిర్మలలనే కాదు, అసెంబ్లీకి వచ్చిన ఈశ్వరీ బాయిలను కూడా సౌకర్యవంతంగా మరుస్తారు.
ఎదిగిపోవటే కాదు, ఎదిగినంత యెత్తులో కడదాకా ఉండి పోవటం కష్టమే. అంటే అవే పదవుల్ని పట్టుకుని వేళ్ళాడటం కాదు, అవే విలువల్ని పట్టుకుని ఉండిపోవటం. అంబేద్కర్‌వాదిగానే అంతిమ శ్వాస వరకూ జీవించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రం పేరుమీద అభివృద్ధిలో రెండు వందల యేళ్ళు అగాధమున్న తెలంగాణ, ఆంధ్రలను కలపటానికి ఆదినుండీ ఆమె వ్యతిరేకే. తాను ఊహించినదే జరిగినదని 1969 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనూ అసెంబ్లీలో చెప్పారు. విద్యార్థుల మీద కాల్పులు జరపటం మీద అప్పటి ముఖ్యమంత్రిని అదే శాసన సభలో కడిగిపారేశారు. చెన్నారెడ్డి ఈ ఉద్యమాన్ని 'తెలంగాణ ప్రజా సమితి' పేరు మీద కొనసాగిస్తే, దానిని కాం గ్రెస్‌లో కలిపేసుకోవటంపట్ల అప్పటి ఇందిరా గాంధీపైనే సభలో ధ్వజమెత్తారు. 'పార్టీ సమస్యను పరిష్కరించుకుని, ప్రాంత సమస్యను పరిష్కరించినట్టుగా నమ్మ బలకటాన్ని' తప్పు పట్టారు.

ఇక షెడ్యూల్డు కులాల సమస్యలు వచ్చినప్పుడు కానీ, వారి మీద జరిగిన అత్యాచారాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ, ఆమె ఆవేశానికి కట్టలు ఉండేవి కావు. 'అభ్యంతరకర వ్యాఖ్యలు' పేరు మీద ఆమె మాటల్ని తొలగించేవారు. నిజమే. అట్టడుగు వారి 'ధర్మాగ్రహం' ఇప్పటికీ పైనున్న వారికి అభ్యంతరకరమే.
ఇప్పటి 'చెంచాల' యుగంలో, అగ్రవర్ణ పార్టీల అగ్రవర్ణ నేతలు చెప్పిన దానికెల్లా తలాడించే నేతలే షెడ్యూల్డు కులాల, తెగల నుంచీ ఎన్నికవుతున్నారు. మహిళా ప్రతినిధుల సంగతి సరేసరి. పదవీ స్వీకారం చేసిన తొలిరోజే వీరి చేత ఈశ్వరీ బాయి జీవితాన్ని కంఠస్తం చేయించాలి. అగ్రవర్ణ నేతల ముందు తలవంచటం మానకపోయినా, తలవంచినప ప్రతీసారీ, కనీసం తప్పు చేస్తున్నామన్నామన్న భావన వెంటాడుతుంది.
- సతీష్ చందర్
(ఫిబ్రవరి 24న జే.ఈశ్వరీ బాయి వర్ధంతి)
- Andhra Jyothi Telugu News Paper Dated: 23/2/2014

No comments:

Post a Comment