పిడమర్తి రవి రాసిన 'కొత్త తరుణంలో మాదిగ దండోరా' వ్యాసం(జూన్ 20)లో నిర్దిష్టత లోపించింది. వాస్తవాలను మరిచి అనేక విషయాలను ఓవర్ సింప్లిఫై చేశారు. అందులో ఒకటి ఎస్సీ వర్గీకరణ సాధనలో కృష్ణ మాదిగ నాయకత్వంలో చిత్తశుద్ధి లోపించిందని రాశారు. అదే నిజమైతే ఇరవై ఏళ్ల క్రితం 'మాదిగ' అని కులం పేరు చెప్పుకోవడానికే సిగ్గుపడిన మాదిగలు నేడు గర్వంగా మాదిగ అని చెప్పుకొనే స్థితికి వచ్చారంటే అందుకు ప్రధాన కారణం కృష్ణ మాదిగ నాయకత్వమే. వందేళ్ల దళిత ఉద్యమ చరిత్రలో ఎస్సీ వర్గీకరణకై ఎమ్మార్పీఎస్ నడిపిన పోరాటం చారిత్రాత్మకమైంది. నిజంగా కృష్ణ మాదిగ నాయకత్వంలో లోపముంటే ఇరవై ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఇంత పటిష్టంగా ఉండేది కాదు. జాతుల అస్తిత్వ ఉద్యమాలలో ఎస్సీ వర్గీకరణ డిమాండ్ న్యాయమైన, ప్రజాస్వామ్య డిమాండ్‌గా ప్రజలు గుర్తించటంతో పాటు అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టింది. వీటన్నింటికి నాయకత్వం వహించింది కృష్ణ మాదిగనే. కనుక నాయకత్వంలో చిత్త శుద్ధి లోపించిందన్నది నిరాధారమైన ఆరోపణ.
రెండోది, ఎమ్మార్పీఎస్ నుంచి క్రియాశీల, ప్రతిభావంతులైన కార్యకర్తలను బలవంతంగా సంఘం నుండి కృష్ణ మాదిగ బయటకు పంపుతున్నారనే ఆరోపణ. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం నుండి పరిశీలిస్తే అకారణంగా ఏ ఒక్కరినీ కృష్ణ మాదిగ బయటకు పంపిన దాఖలాలు లేవు. గతంలో దండోరా ఉద్యమాన్ని ఎమ్మార్పీఎస్‌ను బలహీనపర్చుటకు అగ్రకుల పాలకులు రకరకాల ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు చేశారు. ఈ కుట్రల ఫలితంగానే నాటి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు సంస్థకు దూరమయ్యారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనూ అధికార పార్టీ ఎమ్మార్పీఎస్, కృష్ణమాదిగను బలహీన పరిచేందుకు అనేక కుట్రలు పన్నుతున్నది. ఈ కుట్రలో పావులుగా మారిన ఎమ్మార్పీఎస్ దిగువ శ్రేణి రాష్ట్ర నాయకులు గత కొద్దిరోజులుగా కృష్ణ మాదిగపై అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.
మూడోది, కృష్ణ మాదిగ ఏర్పాటు చేసిన మహాజన సోషలిస్టు పార్టీ మతతత్వ, అగ్రకుల బీజేపీ, తెలుగుదేశంతో పొత్తుపెట్టుకోవడం వల్ల మాదిగల స్వీయ రాజకీయ అస్తిత్వం తాకట్టు పెట్టబడ్డదని ఆరోపించారు. ఎమ్.ఎస్.పి. ఒక రాజకీయ పార్టీ. ఎన్నికల్లో గెలుపుకోసం వర్ధన్నపేటలో బీజేపీ, తెలుగుదేశం పార్టీలతో పొత్తుపెట్టుకుంది. ఇది రాజకీయ ఎత్తుగడలో భాగంగానే చూడాలి. అగ్రకుల పార్టీలు పన్నిన కుట్రలో కృష్ణ మాదిగ వర్ధన్న పేటలో పరాజయం పాలయ్యారు. దీనికి ఆయన నాయకత్వాన్ని నిందిస్తే అర్థం లేదు.
- చెట్టుపల్లి మల్లికార్జున్
పాలమూరు యూనివర్సిటీ
Andhra Jyothi Telugu News Paper Dated: 25/06/2014
Andhra Jyothi Telugu News Paper Dated: 25/06/2014
No comments:
Post a Comment