Saturday, June 28, 2014

కొత్త తరుణంలో మాదిగ దండోరా By పిడమర్తి రవి


Published at: 20-06-2014 14:30 PM


మాదిగ దండోరా పోరాటం స్వతంత్ర భారత దేశంలోనే ఒక విలక్షణమైన, అత్యంత మానవీయమైన ప్రజాస్వామిక ఉద్యమం. సమాజంలో అట్టడుగు దొంతరలో ఉన్న మాదిగలకు రాష్ట్ర జనాభాలో దామాషా ప్రకారం రిజర్వేషన్ల ఫలాలు అందాలనే నినాదంతో ప్రారంభమైన ఈ దండోరా ఉద్యమానికి ఎన్నో సామాజిక విప్లవోద్యమాలను సైతం కదిలించిన చరిత్ర ఉంది. లక్షలాది మాదిగలకు ఆత్మగౌరవ స్ఫూర్తిని అందించింది. దేశంలో ఒక విలక్షణమైన పోరాట ఒరవడిని దండోరా ఉద్యమం కలిగి ఉంది. అటు సాంప్రదాయ, ఇటు విప్లవ పార్టీలలో కుల సమస్య ఒక ప్రధాన ఎజెండాగా మార్చిన చరిత్ర కేవలం మాదిగ దండోరా ఉద్యమానికి ఉంది.
దండోరా ఉద్యమం ద్వారా లక్షలాది మాదిగలు తమ అంటరాని ఆక్రందన వినిపించారు. తరాలుగా మనువాద నిచ్చెన మెట్లలో అట్టడుగు భాగాన ఉండి అంటరానివారుగా కునారిల్లిన ఈ జాతి 'మాదిగ' అనే ఒక అస్తిత్వంతో తలెత్తుకొని నిలబడి గర్జించారు. వర్గీకరణ తమ తల రాతను మార్చుతుందని గడచిన రెండు దశాబ్దాల నుంచి లక్షలాదిగా కదిలారు. రెండు దశాబ్దాల క్రితం ప్రకాశం జిల్లాలో పురుడుపోసుకున్న వర్గీకరణ లక్ష్యం ఇంకా చేరుకోలేక పోవ డం మన దురదృష్టం. కృష్ణ మాదిగ పిలుపునిచ్చిన ప్రతిసారీ కాలే కడుపులతో మండే గుండెలతో అంతులేని ఆత్మస్థైర్యంతో నగరానికి వచ్చారు. తిండీ తిప్పలు లేకుండా కుళాయి నీళ్ళతో కడుపునింపుకొని కాలినడకన లాటీలు తూటాలకు వెరవకుండా, బాష్పవాయుగోళాలను ధిక్కరించి నగరాన్ని ఎన్నోసార్లు తమ ఆకలికేకలతో ముట్టడించారు. ధర్నాలు, దిష్టిబొమ్మలు, కురుక్షేత్రాలు, ర్యాలీలు, పాదయాత్రలు, ఆమరణ నిరాహారదీక్షలు, ఆత్మాహుతి దాడులు చేశారు. ఈ క్రమంలో కొందరు మాదిగ వీరులు అమరులయ్యారు. ఇలా పిలుపిచ్చిన ప్రతిసారీ జాతి విముక్తి కోసం కష్టాలకు వెరవకుండా త్యాగాలు చేసిన మాదిగ సమాజం అలిసి పోయింది. ఇంతకాలం వాళ్ళు చేసిన పోరాటం కేవలం ఒక ప్రజాస్వామికమైన వర్గీకరణకు మాత్రమే.
మాదిగ జాతి ఉద్యమం పాలకవర్గ రాజకీయాల ఎత్తులు జిత్తులతో ఢీకొని గెలిచిందా? ఓడిందా? ఒక సుదూరమైన లక్ష్యం కోసం బయలుదేరిన దండోరా ఉద్యమం సరైన లక్ష్య దృష్టితో నడుస్తోందా? అని అనుమానం రావడం సహజం. ఒక దశాబ్దం క్రితం ఏర్పాటు చేసుకున్న మహాజన సంఘర్షణ సమితి విశాల ప్రజారాసుల కలయికతో ఒక ప్రత్యామ్నాయ ఉద్యమ వేదికగా ప్రారంభమైన నాటికి రాజకీయంగా ఒక స్థిరమైన లక్ష్యాన్ని కలిగి ఉన్నది. మన జాతి పితలు మహాత్మా జ్యోతిరావు ఫూలే, పెరియార్ తాత్విక భూమికగా తక్షణ లక్ష్యమైన వర్గీకరణతో బాటు రాజ్యాధికార సాధన కూడా లక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాము. ఇటీవల ఏర్పడిన మహాజన సోషలిస్టు పార్టీ రాజ్యాధికార సాధన కోసమే అయినప్పటికీ పాలకవర్గ మతతత్వపార్టీలతో రాజకీయ పొత్తులు పెట్టుకోవడంతో మాదిగల స్వీయ రాజకీయ అస్తిత్వం తాకట్టుపెట్టబడినది. వర్ధన్న పేట నియోజక వర్గంలో దాదాపు డెబ్భైవేల మందికి పైగా మాదిగ వోటర్లు ఉన్నప్పటికీ కృష్ణ మాదిగకు డిపాజిట్ కూడా దక్కలేదు. అంటే విశాలమైన మాదిగ జాతి కేవలం వర్గీకరణకు మాత్రమే మద్దతు ఇచ్చింది. మాదిగ జాతి ఒక రాజకీయ శక్తిగా ఎదగడం అనివార్యమైనప్పటికీ, అంత రాజకీయ చైత న్యం తమ వోట్ల ద్వారా చూపలేక పోయింది. కృష్ణ మాదిగ రాజకీయ ఎత్తుగడల్ని అగ్రవర్ణ పాలకవర్గ పార్టీలు సొమ్ము చేసుకున్నాయనేది ఒక చారిత్రక వాస్తవం. దీనికి ప్రధాన కారణం రాజకీయంగా చైతన్యం పొందిన మాదిగలు పోటీలో ఉన్న దగ్గర వారికి సొంత జాతి నుంచి మద్దతు లభించకపోవడం. మాదిగలకు వ్యతిరేకంగా అంబర్‌పేటలో ఒక మాదిగ విద్యార్థి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే మాదిగ అభ్యర్థికి కాకుండా, అగ్రవర్ణ కిషన్ రెడ్డికి ఓట్లు వేయమని సంస్థ పిలుపునివ్వడమంటే మన వేలుతో మన కన్ను పొడుచుకున్నట్లు అయింది. అంతే కాకుండా రాష్ట్రంలో చుండూరు, కారంచేడు వంటి మారణహోమాలకు బాధ్యులైన సామాజిక వర్గాలకు మాదిగలు మద్దతు ఇవ్వడంతో మాదిగజాతి కుంగిపోయింది. ఇలాంటి ఎత్తుగడల ఫలితంగా తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు పాలకవర్గ పార్టీలతో పోటీ పడలేని ఒక దౌర్భాగ్య స్థితికి నెట్టబడినారు. రాజకీయంగా పొత్తుల పేరుతో జరిగిన నష్టం మూలంగా ఎంతోమంది మాదిగ ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు, మాదిగ మేధావి వర్గంతో పాటు పౌరసమాజం కూడా మాదిగ ఉద్యమానికి దూరం అయింది. లేదా సంస్థ నుంచి కొందరు క్రియాశీల, ప్రతిభావంతులైన కార్యకర్తలు బలవంతంగా బయటికి పంపబడింది. దీనికి కారణం నాయకత్వంలో చిత్తశుద్ధి లోపించడమే. వాళ్ళు ఇప్పుడు మోసం చేయని, జాతి ఆత్మగౌరవం కాపాడే, నిజాయితీగల ఆసరా కోసం, నాయకత్వం కోసం చూస్తున్నారు.
ఇన్నేళ ్లపాటు మాదిగలు ఏ ఆకాంక్షకోసం ఉద్యమించారో ఆ ఆకాంక్షకు తూట్లు పొడిచే ఎంత గొప్ప నాయకుణ్ణి అయినా చెత్తబుట్టలో వేసి, ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి మాదిగలు నేడు సిద్ధంగా ఉన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అత్యధిక జనాభా మాదిగలు. విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాలలో 12 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణలోని మాదిగ సంఘాలు అన్నీ మరో పోరాటానికి సిద్ధం కావాలి. అధికార మార్పిడి జరిగిన ఈ తరుణంలో తెలంగాణ పునర్నిర్మాణంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలి. అందుకోసం తగిన కార్యాచరణ రూపొందించుకోవాలి. మాదిగ విద్యార్థి, ఉద్యోగ మేధావి వర్గాలు ముందుండి పోరాడాలి. మాదిగల చిరకాల లక్ష్యమైన వర్గీకరణతో బాటు రాజ్యాధికార సాధన దిశగా మాదిగ జాతి హక్కుల కోసం బోధించు, సమీకరించు, పోరాడు అనే మహనీయుల నినాదాల స్ఫూర్తితో అందరూ ఏక మై విస్తృత పోరాటాలకు సంసిద్ధం కావాల్సిన తరుణం ఆసన్నమైంది.
పిడమర్తి రవి
తెలంగాణ మాదిగ జేఏసీ

Andhra Jyothi Telugu News Paper Dated: 20th June 2014 

No comments:

Post a Comment