Thursday, June 19, 2014

కేజీ టు పీజీ ఇంగ్లీష్ విద్య - కంచ ఐలయ్య


Published at: 18-06-2014 05:37 AM
విద్యారంగాన్ని ఒక క్రియాశీల, శాస్త్రీయ రంగంగా రూపొందించాలంటే ప్రభుత్వరంగం పెరిగి ప్రయివేటు రంగం తరగాలి. పిల్లలు ఇంగ్లీషు, తెలుగు భాషలే కాక శ్రమ గౌరవ పాఠాల్ని అన్ని స్థాయిల్లో నేర్చుకోవలసిన అవసరముంది.... నాకు తెలిసి కాశ్మీర్ తరువాత తెలంగాణ రాష్ట్రమే ఇంగ్లీషు విద్యను ప్రోత్సహిస్తున్న రాష్ట్రం అవుతుంది. అందుకే దానికి మద్దతివ్వాలి. అందరం కలిసి మన పిల్లల భవిష్యత్తును మార్చాలి.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో కేజీ టు పీజీ వరకు ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన ఉంటుందని గవర్నర్ ప్రసంగంలో తేల్చి చెప్పడం హర్షించదగ్గ నిర్ణయం. అన్నిరంగాల్లో కంటే తెలంగాణ ప్రాంతం విద్యారంగంలో వెనుకబడి ఉందన్న విషయం తెలిసిందే. అందులో ఈ ప్రాంతంలో ప్రజల భాష తెలుగు, పాలక భాష చాలాకాలం ఉర్దూ ఉండడం, ఇంగ్లీషు విద్యాప్రభావం చాలా తక్కువ ఉండడం వల్ల విద్యారంగంలో బాగా వెనుకబడి పోయింది. అందుకుతోడు ఇక్కడి ఫ్యూడల్ వ్యవస్థ విద్యారంగాన్ని ఎప్పుడూ వ్యతిరేకిస్తూ వచ్చింది.
ఈ ప్రాంతంలో వచ్చిన కమ్యూనిస్టు ఉద్యమాలు కూడా విద్యారంగాన్ని బూర్జువా విద్యారంగంగా పరిగణిస్తూ విద్యార్థులను ఉద్యమాల్లోకి దింపడానికే ప్రాధాన్యం ఇచ్చాయి కానీ, విద్య నేర్పడం కూడా ఒక ఉద్యమమేనని వాళ్ళెన్నడూ భావించలేదు. ఇక 1969 నుంచి వచ్చిన తెలంగాణ ఉద్యమాలు, బైకాట్లు, బళ్ళు ఎగ్గొట్టడం సంగతి తెలిసిందే.
ఇప్పుడు మొదట సాధించాల్సింది, విద్యారంగంలో రెగ్యులారిటీ. టైమ్‌కు టీచర్లను, విద్యార్థులను క్లాసురూముల్లో ఉంచగలగడం. విద్యారంగంలో క్వాలిటీ, క్వాంటిటీ నుంచే వస్తుంది. క్లాసురూముల్లో చెప్పవలసినంత చదువు టీచర్లు చెప్పి నేర్చుకోవలసినంత చదువు పిల్లలందరూ నేర్చుకుంటే వీరి నుంచే క్వాలిటేటివ్ మెదళ్ళు పుట్టుకొస్తాయి. చాలా క్రియేటివ్ మెదళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచే వస్తాయనేది కూడా టైమ్ టెస్టెడ్ సత్యం. ఈ విద్యారంగాన్ని ఎల్‌కేజీ నుంచి ఇంగ్లీషు మీడియంలోకి మార్చి గ్రామానికి రెండు మూడు (జన సంఖ్యను బట్టి) కిండర్ గార్టెన్ పాఠశాలలను తెరవాలి. ప్రతి దళితవాడకు, లంబాడీ తండాకు తప్పక ఒక కిండర్ గార్టెన్ అవసరం. ఈ ప్రీ-స్కూళ్ళలో 3వ ఏడు నుంచి 6వ ఏడు వరకు ఎస్సీ ఎస్టీ స్పెషల్ కంపోనెంట్ ప్లాన్ నుంచి వారికి మంచి బట్టలు, పాలు, పండ్లు, మంచి తిండి పెట్టే ఏర్పాట్లు చెయ్యాలి. ప్రతి స్కూలుకు ఇద్దరు ఆడ టీచర్లు, ఒక ఆయా ఆ పసిపిల్లల మెదళ్ళను, శరీరాన్ని పోషించాలి. ఆడిపించాలి. అప్పుడు వాళ్ళు పట్టణాల్లోని జీ స్కూళ్ళు, లేదా బచ్‌పన్ స్కూళ్ళ పిల్లల కంటే తెలివైన వారుగా ఎదుగుతారు. ఎందుకు? వారికి ఊరు కొన్ని విషయాలను అదనంగా నేర్పుతుంది.
ఒకటవ తరగతి నుంచి ఈ పిల్లలంతా ప్రభుత్వం చెప్పే ఎన్‌సీఆర్‌టీఈ సిలబస్ కలిగిన ఇంగ్లీషు మీడియం స్కూలుకు పోవాలి. రాష్ట్రానికి సంబంధించిన ఒక కోర్సు అదనంగా పెట్టుకోవచ్చు. 1 నుంచి 6 వరకు ఈ పిల్లలంతా తమ ఊళ్ళోనే చదవాలి. స్కూల్ టీచర్ల పిల్లలు కూడా అదే స్కూల్లో చదవడం చాలా అవసరం.

ప్రతి మండల కేంద్రంలో 7 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వం ప్రామిస్ చేసిన ఎన్‌సీఆర్‌టీఈ సిలబస్‌లో చదువుకున్నప్పుడు ఒక నూతన 'విజ్ఞాన పంట' 20 ఏళ్ల తరువాత బయటికొస్తుంది. ఈ కోర్సు మొత్తంగా ఎల్‌కేజీ నుంచి 12వ తరగతి వరకు తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండాలి. మంచి జ్ఞానం ఉండి మౌలిక తెలుగు ఉంటే బ్రహ్మాండమైన రచయితలు, ఆ భాషలో కూడా పుట్టుకొస్తారు. రాష్ట్రం విడిపోవడం వల్ల జరిగిన ఒక మంచేమిటంటే ఆ ప్రాంతపు 'పంచెకట్టు పండిత వర్గం' తలనొప్పి పోయింది. చాంధసపు ఆంధ్ర భాషా పాండిత్యం ఈ రాష్ట్రానికి అసలు అవసరమే లేదు. వారితో పాటు నారాయణ, శ్రీచైతన్య బిచానాలను మొత్తం ఎత్తెయ్యాలి. ఇంటర్ మీడియట్ కాలేజీలన్నిటినీ మూసేసి ప్రతి పిల్ల/పిల్లవాడు 12వ తరగతి వరకు తప్పకుండా చదువుకునే విధానాన్ని రూపొందించాల్సి ఉంది.
అక్కడి నుంచి ఉన్నత విద్యలోకి పోయే పిల్లలు ధనవంతులు సొంత డబ్బులతో, బీదలు ప్రభుత్వ ఖర్చుతో చదువుకునే విధానం రూపొందించుకోవాలి. ఉన్నత విద్య ఇంగ్లీషులోనే ఉండాలనేది అనుమానం లేని విషయం. ఇప్పటికీ చాలావరకు ఈ విద్య ఇంగ్లీషులోనే ఉన్నది. కానీ మన యూనివర్సిటీ వ్యవస్థను బాగా మార్చాల్సి ఉంటుంది. ఈ దశలో కొంత కాలం బయటి నుంచి టాలెంట్‌ను తెచ్చుకోక తప్పకపోవచ్చు. ఇప్పుడున్న ఉన్నత విద్య చదువు విద్యగా కాక, మార్కుల విద్యగా మాత్రమే ఉన్నది. స్కూళ్ళ నుంచి స్టాండర్డ్స్ పెరిగితే తప్ప ఉన్నత విద్యలో స్టాండర్డ్స్ పెరుగవు. కానీ ఇక్కడ కూడా ఉన్నత విద్యా ప్రమాణాలను పాటించకుండా అవి మారవు.
వైస్ చాన్స్‌లర్ల అపాయింట్‌మెంట్, ప్రొఫెసర్ల రిక్రూట్‌మెంట్ విధానాన్ని పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. ఇప్పుడు యూనివర్సిటీల్లో టీచింగ్, లెర్నింగ్ మొత్తంగా పడిపోయి ఉంది. దాన్ని గాడిన పెట్టడమే ఒక పెద్ద సమస్య.. డబ్బులకు వీసీ పోస్టులు అమ్మే విధానం ఉన్నంత వరకూ ఈ వ్యవస్థను మార్చడం అసలు సాధ్యం కాదు.
ఇప్పుడున్న స్థితిలో రిజర్వేషన్, జనరల్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ స్టాండర్డ్స్‌లో ఏమీ తేడా లేదు. అందులో కొంత మంది తెలివైన వాళ్ళు లేరా అంటే ఉన్నారు. కానీ ఓవరాల్‌గా చూసినప్పుడు అన్ని ఆ గంపలోని పండ్లే కనుక ఒక రిఫామ్ డ్రైవ్ అవసరమవుతుంది.

ఉద్యమ కాలానికి, స్వయం పాలనా కాలానికి వెంటనే గీత పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ పై నుంచి వచ్చే అపాయింట్ మెంటులలో మార్పు కనిపించాలి. ఇక్కడ పైసలు పదవి తేవు, చదువు మాత్రమే తెస్తుంది అనే ఒక మెసేజ్ పోవాలి కదా! గత చాలా కాలంగా పదవుల అమ్మకం జరిగిందని తెలిసిందే. విశ్వవిద్యాలయాల వీసీ పదవులను మెరిట్‌పైన, వారికి వ్యవస్థను నడిపే స్వేచ్ఛతో ఇస్తే తప్ప మార్పు సాధ్యం కాదు.
ఈ ఎకడమిక్ సంవత్సరం నుంచి అన్ని మార్పులు రావాలని ఎవరూ అనుకోరు. కానీ ఇప్పుడు అమలులో ఉన్న అంగడివాడి వ్యవస్థను మార్చి గ్రామాల్లో రెండు గదుల కిండర్ గార్టెన్ ప్రీ-స్కూళ్ళను నిర్మించి ఇప్పుడున్న అంగన్‌వాడీ టీచర్స్‌తో పాటు ప్రతి స్కూలుకు మరో టీచర్‌ను కలిపి సరైన పద్ధతుల్లో మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆధునిక పద్ధతుల్లో శిక్షణ ఇవ్వాలి. ఇక్కడ పిల్లలకు నేర్పించే విద్యావిత్తనాలే జీవితాంతం పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ దశలో పిల్లల శరీరం, మెదడు పెరగడానికి మంచి తిండి పెట్టాలి. కూలి నాలి జనం పిల్లల్ని చూసుకునే భారం నుంచి తప్పించాలి. ఈ విధంగా మూడవ ఏడు నుంచి 18వ ఏడు వరకు ఇంగ్లీషు, తెలుగు భాషల్ని ఒక పద్ధతి ప్రకారం నేర్పడం వల్ల పిల్లల అభివృద్ధిలో ముందు గణనీయమైన మార్పు వస్తుంది. ఈ విధంగా స్కూలు విద్యను ఒక గాడిలో పెట్టాక అన్ని రకాల ఎంట్రెన్సులను, ప్రయివేటు కోచింగ్ సెంటర్లను రద్దు చెయ్యాలి. శ్రీచైతన్య, నారాయణ, చుక్కా రామయ్య కోచింగ్ సెంటర్లలో చదివిన పిల్లలు దేశ ప్రయోజనానికి ఉపయోగపడే దాఖలాలు లేవు.
అందుకు భిన్న ఆట పాటలు సంస్థల్లో పిల్లల్ని చేర్చి వారిని బట్టీ మాస్టర్లుగా మార్చాక రెండు నష్టాలు వస్తున్నాయి. ఈ సంస్థల్లో చదివిన పిల్లల ఆరోగ్యాలు తరువాత దారుణంగా ఉంటున్నాయి. వాళ్ళు ఎటువంటి శారీరక వ్యాయామాల్ని నేర్చుకోవడం లేదు. కీలకమైన శరీర, మెదడు పెరిగే దశలో వారిని రాత్రింబవళ్ళు బందీఖానాల్లో పెట్టి కేవలం పాఠ్యపుస్తకాలు బట్టీ పట్టిస్తున్నారు. అటు తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. మొత్తం కోచింగ్ వ్యవస్థను రద్దుచేసి వారి సహజ మెరిట్‌పైనే అన్ని స్థాయిల అడ్మిషన్లు ఉండే విధంగా చూడాలి.
దేశంలో ఏ ఎంట్రెన్స్ లేకుండా అడ్మిషన్లు ఇచ్చే ఢిల్లీ యూనివర్సిటీలో స్టాండర్డ్స్ మిగతా యూనివర్సిటీల కన్నా బెటర్ అని తేలింది. విద్యార్థులు నిరంతరం బట్టీ యుద్ధం నుంచి బయటపడి సెలవుల్లోనైనా ఆట, పాట, పని చెయ్యగలిగే సమయం ఉండడం అవసరం. పూర్తిగా రెసిడెన్షియల్ కాలేజీల్లో చదివిన పిల్లలకు సమాజం, జీవన సంఘర్షణ అసలు అర్థంకాదు. విద్యార్థుల మెదడును రాకడం మంచిది కాదు. దాన్ని క్రియాశీలకంగా ఎదగనివ్వాలి.

కార్పొరేట్ విద్యావిధానాన్ని ఆంధ్ర పెట్టుబడిదారుల్లో ఒక వర్గం ప్రవేశపెట్టింది. ఈ విద్యా విధానం తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా వ్యాపించి ఉన్నది. అందులో తెలంగాణ వ్యాపారవేత్తలు కూడా చేరారు. ఈ వ్యాపార వేత్తలే యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్స్‌ను కంట్రోల్ చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఈ విద్యా వ్యాపారులను చంద్రబాబు నాయుడు కూడా బాగా ప్రమోట్ చేశారు. తరువాత అందరూ ఆ వ్యాపారుల మీద ఆధారపడ్డారు. ఇప్పుడు ఏకంగా విద్యా వ్యాపారి నారాయణను చంద్రబాబు నాయుడు మంత్రినే చేశారు. తెలంగాణలో మల్లారెడ్డిని ఎంపీని చేశారు. ఈ విద్యా వ్యాపారానికి ఎక్కడో ఒక చోట పుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరముంది. ఈ విద్యా వ్యాపారమే స్టాండర్డ్స్‌ని, విద్యా విలువల్ని సర్వనాశనం చేసింది. ఒకప్పుడు విదేశాల నుంచి వచ్చిన మిషనరీలు విద్యా, వైద్య సంస్థల్ని సేవా సంస్థలుగా ఉపయోగిస్తే ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో ఇక్కడి ధనవంతులు ఆ రెండు రంగాల్ని అవినీతిమయమైన వ్యాపారంగా మార్చారు. తెలంగాణ వంటి కొత్త రాష్ట్రం ప్రయివేటు విద్యారంగాన్ని బాగా మార్చాల్సి ఉంది. విద్యారంగాన్ని ఒక క్రియాశీల, శాస్త్రీయ రంగంగా రూపొందించాలంటే ప్రభుత్వరంగం పెరిగి ప్రయివేటు రంగం తరగాలి. పిల్లలు ఇంగ్లీషు, తెలుగు భాషలే కాక శ్రమ గౌరవ పాఠాల్ని అన్ని స్థాయిల్లో నేర్చుకోవలసిన అవసరముంది.
మనదేశంలో చదువు ప్రజల్ని పనికి దూరం చేస్తున్నది. ఇక్కడ కుల వ్యవస్థ శ్రమ అగౌరవాన్ని బాగా పెంచింది. నాగలి దున్నేవాళ్ళు, కుండలు చేసేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, పశువులు కాసేవాళ్ళు, విత్తనాలేసేవాళ్ళు, పంట కోసేవాళ్ళు అగౌరవానికి, అవమానానికి గురై, సోమరిపోతులు, తిండిబోతులు గౌరవించబడుతున్నారు. అందుకే పిల్లలు వరల్డ్ క్లాస్ విద్యతో పాటు ఉత్పత్తి శ్రమలో భాగస్వాములు కావాలి. గ్రామాల్లో తమ తల్లిదండ్రులు చేసే ఉత్పత్తి, పరిశుభ్ర పని పట్ల ఆ ఇంట్లోని పిల్లలు గౌరవంగా పాల్గొనాలి. దాన్ని అవమానపరిచిన వారిని ఎదుర్కోగలగాలి. ఇదొక పోరాట రూపం.
ఇప్పుడున్న ఎన్‌సీఆర్‌టీఈ సిలబస్‌లో కూడా శ్రమ గౌరవ పాఠాలు లేవు. రాష్ట్ర స్థాయిలో వాటిని చేర్చుకోవాలి. గ్రామీణ వ్యవస్థను ప్రతిబింబించే పదకోశాన్ని ఇంగ్లీషులో కూడా రూపొందించుకోవాలి. ఇది అంత కష్టమైన పనేమీ కాదు. నాకు తెలిసి కాశ్మీర్ తరువాత తెలంగాణ రాష్ట్రమే ఇంగ్లీషు విద్యను ప్రోత్సహిస్తున్న రాష్ట్రం అవుతుంది. అందుకే దానికి మద్దతివ్వాలి. అందరం కలిసి మన పిల్లల భవిష్యత్తును మార్చాలి.
- కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

Andhra Jyothi Telugu News Paper Dated: 18/06/2014 

No comments:

Post a Comment