September 26, 2014
తెలంగాణ ప్రజల సుదీర్ఘమైన పోరాటం ఫలితంగా రాష్ర్టం ఏర్పడిరది. పోలవరం ప్రాజెక్టువంటి అమానవీయమైన అప్రజాస్వామిక ప్రాజెక్టుతోపాటు అనేక షరతులు విధించడానికి కాంగ్రెస్, బిజెపి సహా అన్ని పార్టీల పాత్ర ఉంది. భౌగోళికంగా అసంపూర్ణమైన షరతులతో కూడిన తెలంగాణ ఏర్పడిరది. తెలంగాణ రాష్ర్టంలో తెలంగాణ రాష్ర్ట సమితి అధికారంలోకి వచ్చింది. 60 సంవత్సరాల కోస్తాంధ్ర దోపిడీ పాలనకు ప్రత్యామ్నాయమైన ప్రజాపాలనను అందిస్తామని వాగ్దానం చేసిన టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండునెలలు అయింది. అధికారంలోకి వచ్చి కేవలం 3 నెలల్లో ప్రభుత్వం పూర్తి ఆచరణను సమీక్షించడం సాధ్యంకాదు. కానీ అది చేపడుతున్న కార్యక్రమాలు, రూపొందిస్తున్న విధానాలు, కోస్తాంధ్ర పాలకులు అనుసరించిన అభివృద్ధి, అణచివేత నమూనాకు భిన్నంగాలేవు. గత 60 ఏండ్లలో తెలంగాణలో జరిగిన దోపిడీ, విధ్వంసం, వివక్ష, అణచివేత, పౌర, ప్రజాస్వామిక హక్కుల హననం, హత్యాకాండ, భూమి సమస్య, విద్య, వైద్యం, పారిశ్రామిక విధానం మొదలైన మౌలిక అంశాలపై ప్రభుత్వ అవగాహన-విధానాలు స్థూలంగా స్పష్టం అయినాయి.రైతుల రుణ మాఫీతోపాటు ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన ప్రతి అంశానికి టిఆర్‌ఎస్ కట్టుబడి ఉందంటూ- మొదటి క్యాబినెట్ సమావేశం అనంతరం 40కి పైగా నిర్ణయాలు కెసిఆర్ ప్రకటించారు. ప్రజలకు చేసిన వాగ్దానాలు అమలుపరచడం అధికార పార్టీ బాధ్యత.
తెలంగాణలో ఆదివాసులు, దళితులు, సబ్బండ కులాలు ఒక్కటై ఉద్యమించింది ఈ ప్రాంత పీడితప్రజల విముక్తి కోసమే. నేటి తెలంగాణ ఉద్యమం కూడా దోపిడీ, పీడన, వివక్ష, అణచివేత లేని ప్రజాస్వామిక తెలంగాణను కోరుకుంటోంది. కోస్తాంధ్ర, రాయలసీమ దోపిడీవర్గం పోయి ఆ స్థానాన్ని తెలంగాణ బూర్జువా వర్గం ఆక్రమించడాన్ని తెలంగాణ ప్రజలు ఏమాత్రం అంగీకరించరు. తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమ, విద్యార్ధి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, మహిళా, మైనార్టీ, కుల సంఘాలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో ప్రభుత్వ నిర్ణయాలు రెండు ప్రజానుకూలం, నాలుగు వ్యవతిరేకం అన్న విధంగా తయారు కావడం తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది.తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం విధించిన షరతులైన ఉమ్మడి రాజధాని, గవర్నర్ పాలన, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలైన అంశాలను- టిపిఎఫ్ మొదటి నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది. బిజెపి నేత మోడీ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రాంతంపై ఉన్న వ్యతిరేకతను బయటపెట్టుకున్నారు. పోలవరం డిజైన్ మార్పు అంటూ ద్వంద్వ విధానాలు కొనసాగిస్తూ ఆదివాసుల అంతానికి పరోక్షంగా సహకరిస్తున్న టిఆర్‌ఎస్ వైఖరి క్షమార్హం కాదు. గరవ్నర్‌కు విశేష అధికారాలు కట్టబెడుతూ కేంద్రం జులై 4న కేంద్రం లేఖ పంపింది. ఇది తెలంగాణ రాష్ట్రానికున్న అధికారాలను, హక్కులను కేంద్రం హరించడమేనని గర్జించిన టిఆర్‌ఎస్ అందుకు చేపట్టిన కార్యాచరణ ఏమీలేదు. పైగా వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్ దౌత్యంతో కొత్త రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.
భారతీయ రాజకీయ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ప్రజాస్వామికంగా ఉండవలసిన ఫెడరల్ సంబంధాలను కేంద్రం ఏకపక్షంగా అణచివేస్తున్నది. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయకుండా టిఆర్‌ఎస్ రాజీ వైఖరి అవలంభిస్తున్నది. ఆంక్షలను అడ్డుకోని టిఆర్‌ఎస్, కనీసం అధికారం దక్కినాక కూడా తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడలేకపోతున్నది. హైద్రాబాద్‌పై సర్వాధికారాలు గవర్నర్‌కు కట్టబెడుతుంటే అడ్డుకోలేకపోయిన టిఆర్‌ఎస్ వైఖరి- దాని దళారీ బూర్జువా స్వభావానికి, అవకాశవాదానికి నిదర్శనం.తెలంగాణ ప్రజలను ఏ అభివృద్ధి నమూనా దశాబ్దాలుగా పీల్చి పిప్పి చేస్తున్నదో- అదే సామ్రాజ్యవాద, కార్పొరేట్ అనుకూల అభివృద్ధి నమూనాను ప్రభుత్వం బహిరంగంగా, సగర్వంగా ప్రకటించింది. కేంద్రీకృతాభివృద్ధి సమాజ వినాశనానికి దారి తీస్తుందనేది అనుభవమే. ఓవైపు గ్రామ ప్రణాళిక అంటూనే మరోవైపు హైద్రాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధి దాటి దక్షిణ తెలంగాణను కలుపుకుంటూ మరో 60 కి.మీ. పరిధి అవతలి నుండి రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రతిపాదన చేశారు. దీనివల్ల దక్షిణ తెలంగాణ ఉనికే ఉండదు. హైద్రాబాద్ ఔటర్ రింగురోడ్డు సృష్టించిన విధ్వంసంనుండి సమీప ప్రాంతాలు కోలుకోలేకుండా అయినాయి. అశాస్త్రీయంగా నగరాల వృద్ధి శాశ్వత సమస్యలకు దారితీస్తుంది. పెద్ద నగరాలు దోపిడీ కేంద్రాలవుతాయి. అనివార్యంగా వలసలకు ప్రోత్సాహం లభిస్తుంది. తాత్కాలిక ప్రాతిపదికనే ఏర్పడే శ్రామిక జీవితాలు దుర్భరంగా మారుతాయి.
పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను దుర్భర దారిద్య్రంలోకినెట్టే పథకానికి మరోపేరే నగరీకరణ-సుందరీకరణ. దీన్ని ప్రోత్సహించడమంటే ప్రపంచ బ్యాంక్ కార్యక్రమాన్ని అమలు చేయడమే. కోటిన్నర జనాభాతో హైద్రాబాద్ నగరాన్ని నిర్మించాలనే కోరికలో శాస్త్రీయత, హేతుబద్ధత లేదు.ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ, ఇన్వెస్‌టమెంట్ రీజియన్‌గా హైద్రాబాద్‌ను ప్రకటించడం, ఎగుమతుల ఆధారిత ఫార్మా ఇండస్ట్రీని నెలకొల్పడమంటే రాజధాని నగరాన్ని ఎమ్‌ఎన్‌సిలకు అప్పగించడమే. పారిశ్రామిక విధానం వ్యవసాయాధారితమైనదిగా ఉండాలి. అందుకు భిన్నంగా ప్రభుత్వవిధానం ఉంది. వ్యవసాయ ఆధారితమైన పారిశ్రామిక విధానం చేపడ తామని టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో హామీ యిచ్చింది. కాని ఆచరణలో ఐటి ఎగుమతులు, మందుల కంపెనీల ఎగుమతుల కోసం ప్రపంచబ్యాంక్ సిఈవో పాత్రను కెసిఆర్ స్పష్టంగా నెత్తికెత్తుకున్నారు. సామ్రాజ్యవాద, బహుళజాతి కంపెనీల ప్రతినిధులకు తెలంగాణ నిత్య దర్శమ కేంద్రంగా మారింది. అజిమ్ ప్రేమ్‌జీ, అనిల్ అంబానీ, కుమార మంగళం బిర్లా, టాటా, జిందాల్, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, మైక్రోస్టాఫ్ యిండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక బడా బడా తిమింగలాలను తెలంగాణకు ఆహ్వానిస్తున్నారు. నాడు రాజశేఖర్ రెడ్డి, అంతకు పూర్వం చంద్రబాబు నాయుడు కంటే వేగంగా బడా పెట్టుబడులను ఆకర్షించే పనిలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమెంది. దీని పర్యవసానం ఎంత దారుణంగా ఉంటుందో గత అనుభవాల నుండి అర్థం చేసుకోవచ్చు.
ప్రతి పేద రైతుకు, ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి అని ప్రభుత్వం ప్రకటిం చింది. తెలంగాణలో ఉన్న మిగులు భూమి ఉన్నదెంత? భూస్వాముల చేతుల్లో ఉన్నదెంత? ప్రభుత్వ భూమి ఎంత? ఇప్పటికీ స్పష్టమైన గణాంకాలు ఏవీ లేవు. జిల్లాకు ఒక్కరిద్దరికి భూమి పట్టాలిచ్చి ఇదే ప్రపంచంలో గొప్ప విప్లవం అంటూ తమకు తామే కితాబులిచ్చుకోవడం, అందుకు కొంతమంది ప్రభుత్వ ఆస్థాన మేధావులు భజన చేయడం తెలంగాణ రాష్ట్రంలోనే చెల్లింది. భూమి సమస్యను తరతరాలుగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని దోపిడీ వర్గ ప్రభుత్వాలు ఎంతమేరకు చూపించగలవో 60 ఏండ్ల భారతదేశ చరిత్రలో జరిగిన భూపంపకాలు, భూసంస్కరణ చట్టాలు నిరూపించాయి. అయినా తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని అమలుచేయించుకోవడం ప్రజల బాధ్యత. దళితులకు భూ పంపిణీతో పాటు సమాజంలో 90 శాతం భూమిలేని రైతుకూలీలకు సంబంధించిన సమస్య పరిష్కరించడమే భూమి సమస్యకు నిజమైన పరిష్కారం.
గోల్కొండ ఖిల్లాపైన జెండా ఎగరేసి నలుగురికి పట్టాలిచ్చారు. 2004 మావోయిస్టు చర్చల ఫలితంగా రాజశేఖర్ రెడ్డి చేపట్టిన కుహనా భూ పంపిణీ కార్యక్రమంవలె ఇది కావద్దంటే భూసేకరణ పంపకం శాస్త్రీయ పద్ధతిలో జరగాలి. దున్నేవాడికే భూమి ప్రాతిపదికన ఈ ప్రభుత్వం భూ పంపకం ఎలాగూ చేయలేదు. కనీసం చట్టబద్ధంగానైనా భూ గరిష్ఠ పరిమితి చట్టాలు అమలు చేయవచ్చుగదా! కాని దళితులకి భూ పంపకం గొప్ప విప్లవమని ప్రజలను మభ్యపెడుతూ- 2000 ఎకరాలు రాజకొండ ప్రాంత భూములను సినిమా పరిశ్రమకు కేటాయించారు. లక్షల ఎకరాలు పరిశ్రమల అధిపతులకు కట్టబెట్టడానికి సర్వే చేయించారు. కాని 80 గజాల యింటి స్థలం కూడా లేని పేదవాని గురించి ఆలోచించే అవసరం ప్రభుత్వానికి లేకుండా పోయింది.భూ అక్రమాలపై సమీక్ష జరపాలనేది తెలంగాణ ఉద్యమంనుంచి వచ్చిన డిమాండ్. ప్రభుత్వ నిర్ణయం విధానపరంగా సరైనదే. కానీ అక్రమార్కుల చిట్టా విప్పడం తిమింగలాల నుండి ప్రారంభం ఎందుకు కాలేదో ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. యన్ కన్వెషన్ గురుకుల్ ట్రస్టు భూముల అక్రమాలపై చూపించిన ప్రతాపం బడా అక్రమార్కులపై ఎందుకు చూపించడంలేదు? తెలంగాణ ఉద్యమకారులపై అక్రమ కేసుల ఎత్తివేతకు 2001 డెడ్‌లైన్ విధించింది ప్రభుత్వం. కానీ, అంతకుముందు 1995 నుండి మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని తెలంగాణ కొరకు పోరాడినవారి కేసులు సంగతి ఏమిటి? కేసుల ఎత్తివేతల గురించి అధికారిక ఉత్తర్వులు నేటికీ రాలేదు.
ప్రక్క రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిపై చంద్రబాబు కేసులు ఎత్తివేశారు. కేసుల ఎత్తివేతపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చాలా ప్రమాదకరమైనది. స్వాతంత్య్రోద్యమంలో నిజాయితిగా పోరాడిన వారు బ్రిటిష్ వలస పాలన అనంతరం కూడా జైళ్లల్లో మగ్గారు. ఆ రకమైన చరిత్రనే పునరావృతంచేస్తూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం నేటికి కేసులు ఎత్తివేయకపోగా తెలంగాణ ప్రజలపై పరోక్ష, ప్రత్యక్ష నిర్బంధ, నిషేధాలను అమలుచేస్తున్నది. సిపిఐ(మావోయిస్టు)తో పాటు దాని అనుబంధ ప్రజాసంఘాలపై నిషేధాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వ విధానం స్పష్టంచేస్తుంది. చట్టాన్ని వ్యతిరేకించేవారిని చట్టవ్యతిరేక పద్ధతుల్లో హత్యలు చేస్తామని హైదరాబాద్ శివార్లో జరిగిన ఎన్‌కౌంటర్ ద్వారా రుజువుచేశారు.
తెలంగాణ ఉద్యమానికి పాటలతో, మాటలతో, కార్యాచరణతో ఊపిరిలూదిన అనేక మందిని టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు పొట్టన బెట్టుకున్నాయి. ప్రజాస్వామిక తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన బెల్లి లలిత, శ్రీకాంత్, అయిలయ్య, రవీందర్ రెడ్డి, కనకాచారి, సుదర్శన్, నల్లావసంత్, వనిపెంట వెంకటేశ్వర్లు మొదలుకొని- టిపిఎఫ్ అధ్యక్షులు ఆకుల భూమయ్య వరకూ, తెలంగాణలో జరిగిన ప్రతి హత్యపైన నిష్పక్షపాత దర్యాప్తుకు ఆదేశించి నిజాన్ని నిగ్గుతేల్చడం ప్రభుత్వ విధి. తెలంగాణలో ఆరు దశాబ్దాలుగా జరిగిన చట్ట ఉల్లంఘ నలు, అక్రమ కేసులు, నిర్బంధాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు, నల్లదండు ముఠాల హత్యలపై ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడటంలేదు. ఈనాటికీ తెలంగాణలో అక్రమ అరెస్టులు, పోలీసుల వేధింపులు, నిర్బంధాలు, రాజకీయ భావాలకు అప్రకటిత నిషేధాలు నిత్యకృత్యంగా కొనసాగు తున్నాయి. విద్యార్థులపై హైద్రాబాద్‌లో జరిగిన లాఠీచార్జి, మెదక్ జిల్లా రైతాంగంపై జరిగిన లాఠీచార్జీలు ప్రభుత్వ పోకడ ఎటో స్పష్టం చేస్తున్నాయి
మహిళల స్వావలంబన కోసం కట్టుబడి ఉన్నామన్న పాలకులు మద్య రహిత తెలంగాణ బదులు మద్యం ఏరులు పారే ఎకై్సజ్‌పాలసీని చేపట్టారు. వరకట్నంగా 51 వేలు `సౌభాగ్యలక్ష్మి' పథకం ద్వారా అందిస్తామంటున్న ప్రభుత్వం, ఈ జనాకర్షణ నినాదం యిచ్చేముందు మహిళల స్థితికి కారణం అయిన వరకట్న దురాచారం కనీసం త…ప్పు అని కూడా అనడం లేదు. వరకట్న నిషేధచట్టం అమలుచేస్తామని అనగకపోగా, వరకట్నం చెల్లిస్తామంటున్నది ప్రభుత్వం. ఆరోగ్యశ్రీకి, విద్యారంగంలో ఫీజు రీయంబర్‌సమెంటుకు వరకట్నానికి కూడా ప్రభుత్వానికి కనబడనంత స్పృహలేని స్థితి తెలంగాణ ప్రభుత్వానిది. హైదరాబాద్ చుట్టూ, తెలంగాణలో పట్టపగలు అర్ధరాత్రిఅనే తేడాలేకుండా మహిళలపై దాడులు, అత్యాచారాలు చాలా సాధారణ మైనాయి. వందలాది ఇన్నోవ కార్లు, హైఫై టెక్నాలజితో నేరాలను నిరోధిస్తామని, మహిళలకు రక్షణకల్పిస్తామని పదే పదే మాట్లాడుతున్న ప్రభుత్వాధినేతలకు కనీసం సంఘటనలు కూడా పట్టినట్టుగా కల్పించడంలేదు.
విద్య, వైద్యం- ప్రైవేటు వ్యాపారం అయిన నేపథ్యంలో కెజీ నుండి పిజి వరకు ఉచిత నిర్బంధ విద్య అని చెప్పిన టిఆర్‌ఎస్ ఈనాటికీ స్పష్టమైన విధానం ప్రకటించలేదు. కార్పొరేటు విద్యావిధానాన్ని రద్దుచేయకుండా ప్రభుత్వరంగంలోనే అందరికీ విద్య ఎలా సాధ్యం? తెలంగాణకు చెందిన పెద్ద విద్యాసంస్థల అధిపతులు గులాబీ కండువాలు కప్పుకున్నారు. కార్పొరేట్ సంస్థలతో టిఆర్‌ఎస్ గతం నుండి ఒప్పందాల్లో భాగంగానే ప్రభుత్వం విద్యారంగాన్ని విధానం లేని నినాదంగానే కాలం వెళ్ళదీస్తున్నది. వారసత్వ కట్టడాలను, చారిత్రక ప్రదేశాలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్న… కేసిఆర్ చారిత్రక ఉస్మానియా ఆస్పత్రి కనీస వసతులులేక శిథిలావస్థలోవుంటే దాన్ని పట్టించుకోకుండా కార్పొరేట్ ఆస్పత్రుల భజనచేస్తున్నారు. ఇది ప్రభుత్వ ఆలోచనా తీరుకు చిన్న ఉదాహరణ మాత్రమేకాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం సరైన మార్గదర్శకాలను రూపొందించక పోగా భవిష్యత్‌పై కోటి ఆశలతో ఉన్న తెలంగాణ విద్యార్ధి- నిరుద్యోగుల మధ్య వైరుధ్యాన్ని పెంచే విధంగా ప్రభుత్వ విధానంఉంది. ఆందోళనకు పరిష్కారమార్గంగా పోలీసులపై ఆధారపడుతున్నది. లక్ష ఉద్యోగాలు వెంటనే ప్రకటించే అవకాశం ఉన్నా, ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్నది.
వక్‌ఫ భూములు, ఓపెన్‌కాస్‌ట మైనింగ్, కరీంనగర్ గుట్టల తరలింపు, ఇసుక అక్రమ రవాణా, ఆదివాసుల స్వయంపాలన, అసంఘటిత కార్మికుల జీవనభద్రత అంశాలపై ప్రభుత్వ అవగాహన, వైఖరి పై విషయాలకు భిన్నంగా లేదు. ఆదిలాబాద్ జిల్లాల్లో కాశీపేట మండలంలో తలపెట్టిన కళ్యాణికుని ఉపరితల బొగ్గుగని ప్రజల పోరాటం వల్ల సింగరేణి యాజమాన్యం వెనక్కి తగ్గింది. తెలంగాణ ప్రభుత్వం బలవంతపు భూసేకరణ కోసం ప్రజలను భయ భ్రాంతులు చేస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అటవీ మంత్రి జోగురామన్న కవ్వాల్ టైగర్‌జోన్ నిర్మాణంలో ప్రజలను తరిమికొట్టే కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. కరీంనగర్‌లోని గుట్టలను టిఆర్‌ఎస్ నాయకత్వం, వారి అనుచరణగణం వాటాలుగా పంచుకొని ఎదురులేని అక్రమాలకు పాల్పపడుతున్నారు.తెలంగాణ ఉద్యమంలో మేధోపరంగా కీలకపాత్ర వహించిన వారిలో కొంత సెక్షన్‌ను, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలలోని కొందరిని తమవైపు తిప్పుకుని వారికి అధికార పదవుల్లో కొంత వాటా ఇచ్చి ప్రశ్నించే గళాలను మూయించే ప్రయత్నం జరుగుతున్నది. ఉద్యమంలో పేరుపొందిన వారిని ఆకర్షించడం, తమలో భాగం చేసుకోవడమే విధానంగా సాగిస్తున్నది. టిఆర్‌ఎస్‌ను విమర్శించే వారికి జవాబు యివ్వడానికి మేధోపరమైన రక్షణ కవచంగా వీరిని ఉపయోగించుకుంటున్నది. పశ్చిమ బెంగాల్‌లో సింగూర్ ప్రజలు టాటా కంపెనీని తన్ని తరిమితే, ఆ ప్రజా ఉద్యమానికి మద్దతిచ్చిన తెలంగాణ ప్రజాస్వామికవాదులు అదే రతన్ టాటాకు తెలంగాణ సర్కార్ ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించి తెలంగాణ భూములను ధారాదత్తం చేస్తామంటే నోరు మెదపడంలేని దుస్థితి దాపురించింది.
టాటాలను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ కావాలని కెసిఆర్ కోరుకుంటున్నారు. 50వేల ఎకరాల భూములు పారిశ్రామిక వేత్తలకు యిస్తామన్నారు. ఇంతకు వారు ఏర్పాటుచేయనున్న పరిశ్రమలేమిటో స్పష్టంగా చెప్పనప్పటికీ సులభంగా గ్రహించవచ్చు. ఈ దేశీ, విదేశీ, బడా, దళారీ పెట్టుబడిదారులు దేశ కార్మికవర్గ మూలుగులను పీల్చి పిప్పిచేస్తూ ప్రజలపై ఘోర అణచివేతకు కారణం అయితున్నారు. ఈదళారీ పెట్టుబడి- కేవలం పెట్టుబడిగానే గాక ప్రజల జీవనాడులను నియంత్రిస్తుంది. రాజకీయ పార్టీలపై అదుపు సాధిస్తుంది. అనేక చారిత్రక ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కారణాలతోపాటు ప్రపంచీకరణ ద్వారా ఉత్పన్నం అయిన అసమానతలు మలిదశ ఉద్యమానికి కారణం అయినాయి. ప్రపంచీకరణ మూలంగా తలెత్తిన సంోభాన్ని ఎత్తిచూపుతూ ఉద్యమ వేడిని రగిలించడానికి శిథిలావస్థలో ఉన్న చేతివృత్తులు, ప్రత్యామ్నాయంలేని వృత్తి కులాలు, విధ్వంసకర అభివృద్ధి నమూనాను - ఉద్యమం విమర్శించింది. తెలంగాణ ఉద్యమాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ఇప్పుడు గుత్త పెట్టుబడి దారులను తెలంగాణపై దండయాత్రకు దింపింది. యిప్పటికే మూలుగులు పీల్చుతున్న దోపిడీ పెట్టుబడిదారులకు ఈ తిమింగలాలు తోడైతే రేపు రానున్న కాలం ఎంత దుర్భరమో ఊహించడమే కష్టంగా వుంది. m
గుత్తపెట్టుబడికి ఒకనొక లక్షణం ఆర్థిక వ్యవస్థను సైనికీకరించడం దానిలో భాగంగానే వరల్‌డ క్లాస్ పాలసింగ్ సిస్టమ్ కొత్త ఇన్నెవా కార్లు, సైకిల్ మోటార్లు తప్ప ప్రజలకోసం అనుకుంటె పొరపాటు. ఒకవేళ హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమైతే ఉస్మానియా దావఖానా నుండి మొదలుకొని వందలాది చారిత్రక నిర్మాణాలు సంస్థలు పునరుద్ధరణకు నోచుకునేవి. సబ్బండ కులాలు, సకలశ్రామికుల ఆకాంక్షలు నెరవేరే తీరుగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు రూపొందే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచవలసి ఉంది. అసాధారణమైన త్యాగాల ఫలమైన తెలంగాణను అవకాశవాద స్వార్ధపరుల చేతిలో దోపిడీ కాకుండా కాపాడుకుందాం! అదే సమయంలో కేంద్రంలోని ఫాసిస్టు బిజెపి ప్రభుత్వం, పక్కలో బల్లెంలాగా తెలంగాణ ప్రజా వ్యతిరేకిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ టిడిపి ప్రభుత్వం- అనుసరిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లాంటి విధానాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయాల్సి ఉంది. మేకవన్నె పులుల్లా ఉంటే దోపిడీ వర్గపాలకుల స్వభావాన్ని విప్పి చెప్పి విశాలమైన ప్రజాస్వామిక ఉద్యమానికి నిర్మాణం చేయడమే ఈనాటి తక్షణ కర్తవ్యం. తెలంగాణ రాష్ర్టం కోసం అమర వీరులు కన్న కలలు సాకారం కావాలంటే, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, తెలంగాణ ఉద్యమం ఇచ్చిన పోరాట స్ఫూర్తితోని ప్రజాస్వామిక తెలంగాణ నిర్మించుకోవడం ముందున్న కర్తవ్యం.
Surya Telugu News Paper Dated: 26/09/2014
రచయిత సెల్ నెం: 98499 96300
No comments:
Post a Comment