Friday, August 29, 2014

ఉపకులాలకు రాజ్యాంగ న్యాయం By -గోపని చంద్రయ్య, -కొంగర మహేష్

              

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 68ఏళ్ళవుతున్నా.. అది కేవలం భౌగోళిక స్వతంత్రత పరమితిని దాటలేకపోయింది. దీనికి ప్రధాన కారణం ఈదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్క్రుతిక అసమానతలు ప్రస్ఫుటంగా విస్త్రుతం కావడమే. దీనివల్ల ‘స్వాతంత్ర్యం’ అన్నివర్గాలకు ముఖ్యంగా అంటరానితనం, అణిచివేతలకు గురైన అణగారిన వర్గాలకు ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఫలితంగా భారతరాజ్యాంగంలో రాసుకున్న స్వేచ్చా, సమానత్వం, సోదరభావం కాగితాలపై రాతలుగానే ఉండిపోయాయి తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. పాలకుల సంకుంచిత స్వభావం, కులాధిపత్య పరిపాలన వల్లే అసమానతలు పెరిగి ధనవంతులు ఆకాశాన్నంటే రీతిలో శ్రీమంతులు అవుతుంటే...పేదలు మరింత పేదలుగా మారి పూరిగుడెసెల్లో బతుకులీడుస్తూ దుర్భరజీవితాలను వెళ్లదీస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు, సంక్షేమరంగాల్లో కొంతమేరకు అవకాశాలు దక్కుతున్నప్పటికీ అవి అత్యంత అణిచివేతకు గురైన, అసలైన అర్హులకు అందకుండాపోతున్నాయి. రాజ్యాంగ ఫలాలు కేవలం కొన్ని కులాలకు వారివాటాకు మించి లభిస్తే... అదేజాబితాలో ఉండే మరికొన్ని కులాలకు అవి అందకుండా పోతున్నాయి. రాజ్యాంగం అమలైన ఇన్నేళ్లలో దళిత, ఆదివాసీజాతుల్లో కొన్నికులాలు ఇప్పటికీ ఓటరు లిస్టులకెక్కేందుకు నానాతంటాలు పడుతున్నాయి. కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, ప్రాథమిక ఆరోగ్యం, విద్య వంటివి ఇంకా వారిని వెక్కరిస్తూనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కూడా ఎప్పటిలాగే పాలకప్రభుత్వాలు పార్టీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దళితుల అభివ్రుద్ధి ఎజెండాను ముందుకు తెస్తున్నాయి. ఈరెండు రాష్ట్రాల్లో దళితులు లేదా ఎస్సీలంటే కేవలం మాలలు, మాదిగలు అనే అవగాహనతో చర్చ జరగడం ఆశ్చర్యాన్ని, ఆందోళనను కల్గిస్తోంది.  షెడ్యూల్డుకులాల్లోని అల్పసంఖ్యాక కులాలు ఉనికి, అస్థిత్వంకోసం ఇంకా ఆరాటపడుతూనే ఉన్నాయి. అటు పాలకులు సైతం ఎస్సీలంటే కేవలం మాలలు, మాదిగలు అనే అపోహలో పడి ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ మిగతా ఉపకులాలను కాలగర్భంలో కలిసేలా చేస్తున్నారు.

ఆగస్టు 7, 2014న ఉస్మానియా యూనివర్సిటీ, ఐ.సీ.ఎస్.ఎస్.ఆర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మాదిగ, మాల ఉపకులాలు: అస్థిత్వపోరాటాలు అనే అంశంపై గోపని చంద్రయ్య ఆధ్వర్యంలో ఒకరోజు జాతీయ సదస్సులో అస్థిత్వం కోల్పోతున్న ఎస్సీకులాలవారు పాల్గొని తమగోడును వినిపించారు. ఈ సదస్సుకు హాజరైన అత్యంత వెనుకబడిన డక్కలి, చిందు, గోసంగి, మాస్టిన్, మేహతర్, సమగర, మోచి, నులకచందయ, దొంబర, బుడగజంగాలు వంటి ఎస్సీకులాల ప్రతినిధులు వెలిబుచ్చిన అభిప్రాయాలు, లెక్కలు విస్మయానికి, ఆందోళనకు గురిచేశాయి. అసలు తాము మాల,మాదిగలకు అనుబంధకులాలు, ఆశ్రిత కులాలు, ఉపకులాలుగా లేమని, తమకో అస్థిత్వం, చరిత్ర, సాంస్క్రుతి, వారసత్వాలున్నాయని చాటారు. ఎస్సీలంటే కేవలం మాల,మాదిగలే కాదు మోర్రో తాము కూడా షెడ్యూల్డుకులాలకు చెందినవారమేనని చెబుతున్నా గ్రామపంచాయతీ నుంచి పార్లమెంటుదాకా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరుకావడం సభికులను కూడా కంటతడిపెట్టించింది. కులద్రువీకరణ పత్రం పొందాలంటే తమజాతులకు అదో ‘డిగ్రీ’సాధించనట్లే! అంతలా కష్టపడాల్సిందే. మాల,మాదిగేతర సామాజిక, సాంస్ర్కుతి పరిస్థితుల ద్రుష్ట్యా ఎస్సీకులాలది ఒక్కోదానికి ఒక్కోనేపథ్యం, జీవన విధానాలున్నాయి. మాల,మాదిగ కులాలకు ఆశ్రిత కులాలుగా పిలువబడే ఉపకులాలు సంచారజీవనం చేస్తూ పొట్టపోసుకుంటున్నాయి. ఉపకులాలుగా ఉన్న బైండ్ల, నులకచందయ కులాలవారు పౌరోహిత్యం చేస్తే... చిందు, డక్కలి, మాస్టీన్ సంచార కులాలుగా ఉంటూ తమకళలతో ఊరురూ తిరుగుతూ అణగారిన కులాల తత్వాన్ని ప్రచారం చేస్తాయి. తమ కన్నీళ్లను రంగుల మాటున దాచుకొని కళలకు జీవం పోస్తున్నారు.  కొన్ని కులాలు ఇప్పటికీ యాచకవ్రుత్తిలోనే మమేకమై బతుకులీడుస్తున్నాయి. మరికొన్నికులాల ఆడవారిని మాతంగులు, బసివినిల పేరిట హిందూఅగ్రకుల సమాజం ఇప్పటికీ ‘ఆటవస్తువులు’గానే పరిగణిస్తోంది. దేవుని పేరిట ‘అనాగరిక’ ఆటవిక కార్యక్రమాలు ఇంకా పల్లెల్లో కొనసాగుతూనే ఉన్నాయి.

మాల,మాదిగలుకాక ఈఉపకులాల జనాభా దాదాపు లక్షల్లో ఉంటే ప్రభుత్వ లెక్కలు వందలు, వేలల్లో చూపించి వారి ఉనికి, అస్థిత్వాన్ని మాయం చేస్తున్నాయి.  ఇప్పటివరకు జరిగిన జనాభా లెక్కల్లో వీరిలో కొన్ని కుటుంబాలు మాల,మాదిగలజాబితాల్లో పరిగణించడంతో తమ అస్థిత్వం కోల్పోతున్నామని ఆవేదన చెందుతున్నారు. దీనికితోడు కులద్రువీకరణ పత్రాలు మిగతా కులాలు పొందినట్లు తహాసిల్దార్ నుంచి కాకుండా ఆర్డీవో నుంచి అందుకోవడం వీరిని నానాఇబ్బందులకు గురిచేస్తోంది. అదికూడా పలుదఫాలుగా ‘విచారణ’లు జరిగాకే ‘ద్రువీకరణ’ పత్రాలు అందుకోవడం ఈకులాల ప్రజలను ఆత్మన్యూనతకు, అవమానాలకు గురిచేస్తున్నాయి..  ‘ఫలానా కులం ఉన్నదని మాకు తెలియదు, అయినా మీరు అదే కులానికి చెందినవారని గ్యారంటీ ఏంటనీ’ అధికారులు వేధింపులకు గురిచేస్తుండటంతో  కొంతమంది అసలు కులం సర్టిఫికేట్లు పొందకుండాపోతుంటే...మరికొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో మాలగానో ,మాదిగగానో ‘గుర్తింపు’ తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొనడం నేటి ‘సామాజిక అభద్రత’ను బహిర్గతం చేస్తోంది.

 ఇప్పటికీ తమ కులాల్లో ప్రాథమికవిద్యా స్థాయినిదాటి  డిగ్రీస్థాయికి వచ్చినవారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చని చెప్పడం రిజర్వేషన్ల అమలు తీరును ప్రశ్నించడమేకాదు నేటి  ప్రభుత్వాలు చేపట్టే ‘అందరికి విద్య’ కార్యక్రమాలను సైతం నిలదీస్తోంది. తమ వర్గాలనుంచి ఇప్పటి వరకు కనీసం గ్రామపంచాయతీల్లో వార్డు మెంబరు కూడా కాకపోవడానికి కారకులెవరని ఎస్సీ కోటాలో అందుతున్న ఫలాలు అనుభవిస్తున్న మాల, మాదిగలను సూటిగానే ప్రశ్నించారు. ఎస్సీలంటే కేవలం మాల,మాదిగలు మాత్రమే కాదు ‘మేమూ ఉన్నాం. కాస్తా పట్టించుకోండి’ అంటూ విన్నవించుకోవడం అందరినీ ఆలోచింపజేసింది. జనాభా పరంగా మాదిగలు, మాలలు అధికంగా ఉండటం... వారు స్థిరనివాసం కలిగి గ్రామపరిపాలన వ్యవహారాల్లో భాగస్వాములవడంతో సహజంగానే విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో రాజ్యాంగ పరంగా అందుతున్న వాటాలో వీరిదే సింహభాగమైంది. అదే జాబితాలో ఉండి సంచార జీవనం, యాచకవ్రుత్తితో దినదినగండంగా బతుకులు వెళ్లదీస్తున్న ఉప కులాలు, అధికారుల నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం కారణంగా అన్నిరంగాల్లో తీవ్రఅన్యాయానికి గురవుతున్నాయి. ఇక పక్కా ఇళ్లు, రేషన్ కార్డుల జారీ వంటివైతే వీరికి నామమాత్రంగానే అందుతున్నాయి.  ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో తలదాచుకోడానికి ఇళ్లు లేక ఉపకులాల ప్రజలు నానాఅగచాట్లు పడుతున్నారు. కొన్నిచోట్లా ఊరిచివర ప్లాస్టిక్ కవర్లు, ప్రచారాలకు వినియోగించే ప్లెక్లీలతో గుడిసెలు వేసుకొని తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆడవారికి మరీముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఈ ‘తాత్కాలిక’ఏర్పాట్లు ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లు, ప్లెక్లీల వేడికి అప్పుడే పుట్టిన బిడ్డలు మ్రుత్యువాతపడతున్నారు. దీనికితోడు పౌష్టికాహారలోపంతో అనేక రోగాలకు గురవుతున్నారు.

        ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్డు కులాలకు రాజ్యాంగం ద్వారా విద్యా, ఉద్యోగ రంగాల్లో సంక్రమించిన రిజర్వేషన్లను కేవలం ఒక కులం అనుభవిస్తోందని మాదిగలు ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి)పేరిట బలమైన ఉద్యమం నడిపేంతవరకు వాటి అమలు తీరుతెన్నులను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ‘దండోరా ఉద్యమం’ తర్వాతే ఎస్సీజాబితాలో దాదాపు 60కులాలు ఉన్నాయని బాగాప్రచారంలోకి వచ్చింది. వెలుగులోకి అయితే వచ్చాయి కానీ వారి జీవితాల్లో మాత్రం ఏలాంటి వెలుగు రాకపోవడం కచ్చితంగా  పాలకుల చిన్నచూపు...సంఖ్యపరంగా మెజార్టీగాఉన్న మాల, మాదిగల ఆధిపత్యాలే కారణమని చెప్పాలి. ఇన్నాళ్లు మాదిగలు దళితుల్లోనే దళితులుగా మిగిలిపోయామని చెబుతుంటే..తాము అంటరాని వారికే అంటరానివారిగా మిగిలిపోయామని మిగిలిన ఉపకులాలు ఘోషిస్తుండటం... రాజ్యం అమలుచేసే ప్రతి సంక్షేమ పథకాన్ని పున:సమీక్షించుకోవాల్సిన అవశ్యకత ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  రిజర్వేషన్ల ‘ఏబీసీడీ’వర్గీకరణ అమలైన నాలుగేళ్ల (2000 నుంచి 2004 )కాలంలోఎస్సీ ఉపకులాలకు కొంతమేరకు న్యాయం జరిగినప్పటికీ వాటిలో జనాభాపరంగా చెప్పుకోదగ్గస్థాయిలో ఉన్న కొన్నింటినీ మాల (సీ), మాదిగ (బీ) గ్రూపుల్లో చేర్చారు. దీంతో జనాభాపరంగా, విద్యా,ఉద్యోగపరంగా అప్పటికే ముందున్న మాలలతో పోటీపడలేక వచ్చిన అరకొర అవకాశాలు కూడా తమకు దక్కకుండాపోతున్నాయని మాల ‘సీ’గ్రూపులో ఉన్న గోసంగి వంటి కులాలవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 144జీవోజారీ చేసి బుడగజంగాలను ఎస్సీ జాబితాలో నుంచి తొలగించారని ఆవేదన చెందుతున్నారు. దీనివల్ల తాము ఎస్సీ హోదాలేక ఏఅవకాశం తమ దరికి చేరడం లేదని, తమ బతుకులకు ఇక బిక్షాటనేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

        ఉమ్మడి తెలుగు రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయినా జనాభా దామాషా ప్రకారం,  సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా షెడ్యూల్డుకులాల రిజర్వేషన్ల హేతుబద్దీకరణ (వర్గీకరణ) జరగాలి. ఇది శాస్త్రీయబద్ధంగా ఉండాలి. బైండ్ల, చిందు, మాస్టీన్,డక్కలి వంటి కులాలు తెలంగాణలో ఉంటే ఆదిఆంధ్ర, రెల్లి,పైడి,పాకి వంటివారు ఆంధ్రాలో ఉంటారు. అందువల్ల ఈరెండురాష్ట్రాల్లో షెడ్యూల్డు కులాల జాబితాను పున:నిర్వచించాల్సిన అవసం ఎంతైనా ఉంది. ఇప్పటికీ ఈరెండు రాష్ట్రాల్లో 2001 జనాభా లెక్కలే ప్రామాణికం. మొన్న తెలంగాణలో జరిగిన సమగ్రసర్వే షెడ్యూల్డు కులాల జనాభాలో ఏకులం జనాభా ఎంత ఉందో స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ చేపట్టాలి. ఎస్సీ కులాల సమగ్ర అభివ్రుద్ధికి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతోపాటు ఆర్థిక సహాకార సంస్థ నుంచి అత్యంత వెనకబడిన కులాలకు ప్రత్యేక కోటా ఉండేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టంతోపాటు అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలు వీరికి చేరేలా పకడ్బందీ ప్రణాళిక రూపకల్పన చేసి రాజకీయరంగంలో వీరి జనాభాకు అనుగుణంగా కేటాయింపులు ఉండాలని సదస్సుకు వచ్చిన వక్తలు అభిప్రాయపడ్డారు. ఎస్సీల పేరుతో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్ని తొలుత ఈకులాల పంపిణీతోనే మొదలుకావాలి. ఉపకులాన్నింటికీ అల్పసంఖ్యాక కులాల పేరుతో విద్యా, ఉద్యోగ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం ఉండేలా చూడాలి. ప్రపంచీకరణ, ప్రభుత్వాల చిన్నచూపుతో క్షీణించిపోతున్న చిందు యక్షగాన కళారూపాలు, బహురూపుల కళావారసత్వాలను కొనసాగిస్తున్న  కళాకారులను అన్ని విధాలుగా ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు.  దీనికితోడుగా ఇన్నాళ్లు హక్కులు, అవకాశాల పేరుతో ఉద్యమించిన మాల, మాదిగలు సాటి దళితుల (అత్పల్పకులాల ప్రజల) దరిద్ర్యాన్ని పొగొట్టకపోయినా వాటి నోటికాడి ముద్దను లాక్కునే ప్రయత్నంమాత్రం చేయవద్దు. తమకంటే కూడా అత్యంత వెనుకబడిన, అణగారిపోయిన కులాలు తమ‘జాబితా’లోనే ఉన్నాయనే వాస్తవాన్ని ‘పైరెండు కులాలూ’ గ్రహించాలి. దాంతోపాటు ఉపకులాల ప్రధాన సమస్యలకు ‘వర్గీకరణ’రెండు రాష్ట్రాల్లో జరగాల్సిన అవసరాన్ని ఉపకులాల ప్రతినిధులు తాము ఏర్పాటు చేసుకున్న ‘ఎస్సీ అల్పసంఖ్యాక ఉపకులాల ఐక్యవేదిక’ద్వారా డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగపరమైన అవకాశాలు, నిధులు, హక్కులు, వనరులు సమాజంలో అత్యంత అణిచివేతకు గురైన ఎస్సీ ఉపకులాల నేపథ్యంగా కేటాయింపులు జరగాలి. అందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దళితుల అభివ్రుద్ధి, సంక్షేమం పేరిట రాజకీయంగా ప్రాబాల్యం ఉన్న కులాలే లబ్ధిపొందే ప్రమాదముంది.  రాజ్యాంగం అందించే ఏ అవకాశన్నైనా ఒకటి, రెండు కులాలు మాత్రమే అనుభవిస్తూ ఉంటే అది చివరికి సామాజిక అశాంతికి, అంత్యర్యుద్ధానికి దారితీసిన ఆశ్యర్చపడాల్సిన పనిలేదు.

        చివరగా ఎస్సీ రిజర్వేషన్ల ‘వర్గీకరణ’కు మద్ధతు తెలపడం, బహుజన రాజకీయాలను నిర్మించడం రెండూ వైరుద్యమైన అంశాలు కావని అవి పరస్పర ప్రోత్సాహకర అంశాలుగా అర్థం చేసుకోవడం ద్వారానే ఫూలే, అంబేద్కర్, కాన్షీరామ్ తాత్వికతను పెంచి విశాల రాజకీయాలను అణగారిన కులాలకు అందించగలమని రెండూ రాష్ట్రాల ఉద్యమకారులు, నాయకులు, మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా  ఉంది.
       
                                                        -గోపని చంద్రయ్య
                                                        (09956377352)
అసిస్టెంట్ ప్రొఫెసర్, జి.బి.పంత్ సోషల్ సైన్స్ ఇన్సిట్యూట్, అలహాబాద్
-కొంగర మహేష్
                                                        (9866464567)
రిసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్


Article Published in Andhra Jyothi Telugu News Paper Dated: 28/08/2014 


No comments:

Post a Comment