Monday, October 6, 2014

బహుజన గీతాకారుడు - డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు

ఉన్నతమైన రాజకీయ దృక్పథం, సునిశితమైన కళాత్మక నైపుణ్యాల సమన్వయంలో నుంచే ఉత్తమ రచన ఆవిర్భవిస్తుందంటాడు మావో. వ్యంగ్యం అత్యంత శక్తివంతమైనది. హేళనతో కూడిన హాస్యంతో; పదునైన వ్యంగ్యంతో శత్రువును చీల్చి చెండాడవచ్చునంటాడు అంబేద్కర్‌. మావో, అంబేద్కర్ల అభిప్రాయాలకు అక్షరదర్పణం తెరేష్‌ కవిత్వం. ఈ విధమైన రాజకీయ ఎరుకతో, వ్యంగ్య శైలితో శత్రువు ఆయువుపట్టును పసిగట్టి తదనుగుణంగా యుద్ధం చేయటం తెరేష్‌బాబుకు చద్దికూటితో పెట్టిన విద్య.
పైడి తెరేష్‌బాబు విశాలమైన ప్రాపంచిక దృక్పథం కలిగిన కవి. అందుకే దళితవాదం దగ్గరే ఆగిపోకుండా, ఆత్మబంధువుల అస్తిత్వ ఉద్యమాలకు కొత్త ఊపిరులూదాడు.
మట్టి నవ్వితే పరమాన్నం
నిప్పు నవ్వితే వెలుతురు
నీరు నవ్వితే చైతన్యం
నింగి నవ్వితే తొలకరి
గాలి నవ్వితే ఊపిరి


ఈ పంచ నవ్వుల పరమార్థాలను కలగలిపి ఒకచోట రాశి పోస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ‘పైడి’ సాహిత్యంలా ఉంటుంది. నిద్రను నిట్టనిలువునా నరికే వైతాళిక గానం ఎలా ఉంటుంది? వేటగాడి గుండె జారిపోయే సింహనాదం ఎలా ఉంటుంది? నాలుగు పడగల హైందవ నాగరాజు కోరలు పీకే పౌరుషం ఎలా ఉంటుంది? సామ్రాజ్యవాదం పొగరణిచే సాహసం ఎలా ఉంటుంది? గొడ్లు కాసే పిలగాడి పిల్లంగోవి రాగం ఎలా ఉంటుంది? అన్నింటికీ మించి అంబేద్కర్‌ పల్లవైన పాటకు ఆపకుండా చిందేస్తే ఎలా ఉంటుంది? అమ్మతోడు తెరేష్‌బాబు కవిత్వంలా ఉంటుంది. సమకాలీన తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యామ్నాయ భావవిస్ఫోటనం పైడి తెరేష్‌బాబు. అక్షరాలను చండ్ర నిప్పు కణికల్లా మార్చి, మాటలను మర ఫిరంగుల్లా పేల్చి, కవితా వాక్యాల్ని కరెంటు తీగల్లా తీర్చి, నడుస్తున్న కాలం నరాల్లోకి పిడికెడు కొత్త కాంతిని ప్రసరించిన అసాధారణ ప్రతిభా సంపన్నుడు తెరేష్‌బాబు. దళిత సాహిత్యంలో కసిత్వం తప్ప కవిత్వం లేదని సోకాల్డు విమర్శకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నప్పుడు, దళిత కవులకు వచన కవిత్వమెందుకని ఘనత వహించిన కవిపుంగవులు నోరుపారేసుకుంటున్నప్పుడు, రెప్పపాటులోనే ‘దళితవాదం’పై సవాలక్ష దాడులు జరుగుతున్నప్పుడు ఈ సంక్లిష్ట సందర్భంలో తెరేష్‌ బాబు సరైన జవాబుగా నిలబడ్డాడు. ‘రాత మాకు కొత్తకాదు/ మీరు పలకల బావుల్లో బలపాల కప్పలైనపుడు/ మేం నేలతల్లి గుండెల మీద పైరు పద్యాలమయ్యాం/ మీరు విజ్ఞాన సముద్రాల్లో కాగితప్పడవలైనపుడు/ మేం కర్మాగారపు నెన్నొసట లోహలిపులమయ్యాం/ మా కడుపుల్లో పడ్డాక కదా అక్షరం అగ్నిపునీతమయ్యింది.’’ (నిశాని) అంటూ ‘పైడి’ దళిత పులిలా గాండ్రించి, సాంద్రతరమైన, తాత్విక సమన్వితమైన కవిత్వానికి సంకేతంగా భాసిల్లాడు. సంగీత, సాహిత్య కళా రంగాల్లోను, టి.వి. రేడియో వంటి దృశ్యశ్రవణ మాధ్యమాల్లోను తెరేష్‌బాబు పట్టిందల్లా బంగారమయింది. కవిత, కథ, నాటకం, పాట, గజల్‌ వంటి ప్రక్రియల్లో ఆయన రాసింది రత్నమయింది. ‘నీ చేతికి ఆయుధాన్నివ్వడం కోసం రాలేదు నేను/ నువ్వే ఒక మహా ఆయుధానివన్న స్పృహను నీచేతిలో పెట్టడానికొచ్చాను’ అని తెలుగు పాఠకుడి చేతిలో చేయివేసి బాస చేసిన తెరేష్‌బాబు మహత్తరమైన ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చి మూడు దశాబ్దాల తన సాహితీ ప్రస్థానాన్ని ముగించుకొని సెప్టెంబర్‌ 29 సాయంత్రం నేలతల్లి గుండెల్లో కలిసిపోయాడు. కవన నక్షత్రమై గగనమెక్కాడు. పైడి తెరేష్‌బాబు జీవిత సాహిత్య గ్రంథపుటలను తిరగేస్తే కొండంత స్ఫూర్తి కలుగుతుంది.
గాయకుడైన తండ్రి శాంతయ్య ప్రేరణతో, ఒంగోలు కళావాతావరణ ప్రభావంతో బాల్యంలోనే సంగీత సాధనచేసి 14 సంవత్సరాల వయస్సులోనే తెరేష్‌బాబు తబలిస్టుగా పేరు ప్రఖ్యాతులందుకున్నాడు. సాంఘీక, పౌరాణిక నాటకాలకు, పాటకచేరీలకు వాద్య సహకారమందిస్తూ ఆ చిరుసంపాదనతో తన నిరుపేద కుటుంబానికి అండదండలందించాడు. డా. ధారా రామనాథ శాసి్త్ర, పింగళి పాండురంగారావు లాంటి సాహితీవేత్తల ప్రోత్సాహంలో, వర్ధమాన సమితి, ఎఱ్ఱన పీఠం లాంటి సాహిత్య సంస్థల వెలుగు జాడ ల్లో తెరేష్‌బాబు తన సృజనాత్మక ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నాడు. పైడిశ్రీ కలం పేరుతో ఇబ్బడి ముబ్బడిగా రచనలు చేస్తూ కవిగా, నాటక కర్తగా, ప్రయోక్తగా తెరేష్‌బాబు అతి చిన్నవయస్సులోనే ఎంతో పరిణితి సాధించి ఉద్దండ పండితోత్తములకు గుండెల్లో గుబులు పుట్టించాడు. 
‘చీకటి శక్తుల పతనం కోసం/ చేస్తున్నా ఇదిగో శరసంధానం/ ఈ చైతన్య యాగంలో అయితే కాని ప్రాణం పతనం’ అంటూ తన సృజన లక్ష్యాన్ని ప్రకటిస్తూ తెరేష్‌బాబు శరసంధానం (1985) కవితా సంపుటి వెలువరించి ‘పెన్ను’ తిరిగిన సాహితీవేత్తల ప్రశంసలందుకున్నాడు. ‘సముజ్జ్వల కాంతిమతి’, ‘చిరంతన గీతికాస్మృతి’, ‘ఊహావిరచిత రసానందకృతి’, నిశాంత ధీనిధా, ‘గ్రీష్మ నిక్షిప్తాంగ ఘర్మధార’; చక్రడోలా విహారం, తరళ పరి మళ కిరణం లాంటి సంస్కృత సమాస భూయిష్ఠ పద ప్రయోగ శైలి ‘శరసంధానం’ కవి త్వంలో ఆద్యంతం తొణికిసలాడుతుంది. కారంచేడు, చుండూరు సంఘటనల అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో వెల్లువెత్తిన ఆత్మగౌరవ పోరాటాలతో దళితవాద చైతన్యం దశ దిశలా వ్యాపించింది. దళిత సాహిత్య ఉధృతి వేగవంతమయింది. ఈ నేపథ్యంలో పైడిశ్రీ సాహిత్య ప్రస్థానం ఒక గుణాత్మకమైన మలుపు తిరిగింది. అప్పటి వరకూ శ్రీశ్రీ శాబ్దిక మహేంద్ర జాలంలో, తిలక్‌ అనుభూతివాదంలో మునిగితేలుతున్న పైడిశ్రీ జనరల్‌ సాహిత్య ఒరవడిని విడిచిపెట్టి నిర్దిష్టమైన ఎరుకతో తన సామాజిక అస్తిత్వ మూలాల ను తడుముకోవటం ప్రారంభించాడు. లౌకిక వాస్తవాల్ని అలౌకిక స్వప్నాలుగా వక్రీకరించే సాహిత్య నైజాన్ని తెరేష్‌ బాబు సమూలంగా తిరస్కరించాడు.
ఇలాంటి తిరస్కారంతో, ధిక్కారంతోనే ఆయన నిశాని అనే సంచలనాత్మక కవిత రాశాడు. మద్దూరి నగేష్‌ బాబు, జి. లక్ష్మీనరసయ్య (వరదయ్య) ఖాజా లాంటి తాత్విక బంధువులతో కలిసి తెరేష్‌బాబు వెలువరించిన ‘నిశాని’ కవిత దళితవాద చర్చోపచర్చలకు కేంద్రబిందువై వర్త మాన సాహిత్యాన్ని కదిపి కుదిపివేసింది. 
కేవలం దళిత కవిత్వంలోనే కాకుండా మొత్తం వచన కవిత్వంలోనే తెరేష్‌బాబు అల్పపీడనం (1996) సంకలనం విశిష్టమైనదని విమర్శకులు అంగీకరించారు. ‘అల్పపీడనం’లోని ‘ఏడుకట్ల సవారి’; ‘బండి చక్రం మీద ఈగ’ లాంటి కవితల ద్వారా తెరేష్‌బాబు దళిత ఉద్యమ నిశ్శబ్దాన్ని ఎత్తిచూపాడు. ‘శస్త్ర చికిత్స చేయడం ఉద్యమం/ కాకుల్ని కొట్టి గద్దలకేసే ఫార్మూలాల్ని ధ్వంసం చేయడం ఉద్యమం’ అంటూ ఉద్యమానికి కొత్త భాష్యం చెప్పాడు. అందరిలాగా గాయాన్ని ఫోటో తీయడం ఈ కవికి చేతకాదు. కష్టపడైనా సరే గాయాన్ని ఎక్స్‌రే తీస్తాడు. అందుకే ‘అల్పపీడనం’లో గాయం తాలూకూ చీమూ నెత్తురులు కనిపించవు. గాయానికి కారణమైన వ్యవస్థ స్వరూప స్వభావాలను పాఠకుడి మనసుపై కవి స్పష్టంగా ముద్రిస్తాడు. తద్వారా పాఠకుడు దేన్ని ఎటాక్‌ చేయాలో తెరేష్‌బాబు సూచిస్తాడు. ‘ఐదోతనం’; ‘కుక్క కరిచిన వార్త’, ‘మట్టి బలపం’ వంటి కవితల్లో తెరేష్‌ స్ర్తీవాద చైతన్యాన్ని అద్భుతంగా కవిత్వీకరించాడు. ‘వాడి తొడల తీట సద్దుమణగటానికి/ కావల్సింది కండరాల చీలిక మాత్రమే’ అంటూ సజ్జెలగూడెం మాదేవమ్మపై జరిగిన అత్యాచారాన్ని రెండు మాటల్లో తెరేష్‌ బాబు ప్రతిభావంతంగా ఆవిష్కరించాడు. ‘పొద్దుపొడవటం ఆలస్యం/ వంటిళ్ళ మీద వర్షించి ఆహార పంటలౌతూ/ పొద్దు గూకటం ఆలస్యం కండరపు నాగేళ్ళు దిగమింగి కడుపు పంటలౌతూ’ అని స్ర్తీలెదుర్కొంటున్న రోజువారి హింసను అక్షరాల్లో తర్జుమా చేశారు. ఉత్పత్తిని, పునరుత్పత్తిని ఇంత ఆర్ద్రంగా కవిత్వీకరించిన దాఖలాలు స్ర్తీవాద సాహిత్యంలో లేవు.
పైడి తెరేష్‌బాబు అత్యుత్తమ ప్రయోగవాది. క్యాసెట్‌ రూపంలో ఆయన వెలువరించిన ‘హిందూ మహాసముద్రం’ తెలుగు దీర్ఘకవితల్లో అగ్రభాగాన నిలుస్తుంది. ‘దళిత సాంస్కృతిక రాజకీయ చైతన్యం పురివిప్పిన తరువాత వచ్చిన మొత్తం కవిత్వంలో ఈ శ్రవ్య కవిత అత్యుత్తమన శ్రేణికి చెందిందనవచ్చు. ఒక కవిత్వపరంగానే కాదు, చారిత్రక అవగాహన సాంస్కృతిక స్పహ విషయంలో కూడా ‘హిందూ మహాసముద్రం’ క్లాసిక్‌ లక్షణాలను సంతరించుకుంది’ అని యస్‌. రామకృష్ణ చెప్పిన మాట అక్షరాలా నిజం. ‘కుహనా సమైక్యతను పాడే సముద్రం నోట్లో కాండ్రించి ఉమ్మడానికి ఇంకా సందేహిస్తారే! ఇది పచ్చి దగా కోరు సముద్రం’ అంటూ హిందూ సామ్రాజ్యవాదంపై తెరేష్‌బాబు నిప్పులు కురిపించాడు. ‘యుద్ధం కన్నా యుద్ధ భయం దుర్భరం/ సైనిక దాడి కన్నా సాంస్కృతిక దాడి ప్రమాదకరం’ అంటూ ప్రపంచీకరణ ప్రభంజనంలో కొట్టుకుపోతున్న గొర్రెల మందల్ని హెచ్చరించాడు తెరేష్‌బాబు. ఒక్క కేబుల్‌ కనెక్షన్‌ ద్వారా అణువణువునూ ఆక్రమిస్తున్న పాలవన్నె విషం పట్ల జాగ్రత్త వహించమని హితవు పలుకుతాడు పైడి. అస్తిత్వ ఉద్యమాల ఉమ్మడి చైతన్యానికి అడ్డుకట్టవేస్తున్న హిందూ సామ్రాజ్యవాదం అమెరికన్‌ సామ్రాజ్యవాదాల పెను ప్రమాదాల తీరుతెన్నుల్ని ‘నాలుగో ప్రపంచం’ కవితా సంకలనం ద్వారా తెరేష్‌బాబు శిల్పసుందరంగా చాటిచెప్పాడు.
పైడి తెరేష్‌బాబు విశాలమైన ప్రాపంచిక దృక్పథం కలిగిన కవి. అందుకే దళితవాదం దగ్గరే ఆగిపోకుండా, ఆత్మబంధువుల అస్తిత్వ ఉద్యమాలకు కొత్త ఊపిరులూదాడు. ప్రాణ స్నేహితుడిలా ప్రజాస్వామ్య పోరాటాలతో కరచాలనం చేశాడు. తెలంగాణ, దండో రా ఉద్యమాలకు మనసారా సంఘీభావం ప్రకటించాడు. ‘ఏకపక్ష దోపిడీకి ఏకైక సూత్రం/ కలిసి ఉంటే కలదు సుఖం/ దగాపడ్డ బిడ్డలకు తారక మంత్రం/ వేరుపడితే ప్రగతి సులభం’ (కావడి కుండలు) అంటూ సమైక్యవాద కుట్రల్ని త్రోసిరాజని, తెలంగాణ ప్రజల జీవనపోరాట సారాంశాన్ని నాలుగు పాదాల్లో ఉదాత్తంగా సూత్రీకరించాడు పైడి. అంతేకాకుండా ‘కుండల్లా విడిపోదాం, కావడి బద్దల్లా కలిసుందాం’ అనే చారిత్రాత్మక నినాదంతో తెలంగాణ సంఘీభావ కవిత్వానికి ఆమోదయోగ్యమైన నిర్వచనాన్ని అందించాడు. ఉన్నతమైన రాజకీయ దృక్పథం సునిశితమైన కళాత్మక నైపుణ్యాల సమన్వయంలో నుంచే ఉత్తమ రచన ఆవిర్భవిస్తుందంటాడు మావో. వ్యంగ్యం అత్యంత శక్తివంతమైనది. హేళనతో కూడిన హాస్యంతో; పదునైన వ్యంగ్యంతో శత్రువును చీల్చి చెండాడవచ్చునంటాడు డా. అంబేద్కర్‌. మావో, అంబేద్కర్ల అభిప్రాయాలకు అక్షరదర్పణం తెరేష్‌ కవిత్వం. ఈ విధమైన రాజకీయ ఎరుకతో, వ్యంగ్య శైలితో శత్రువు ఆయువుపట్టును పసిగట్టి/ తదనుగుణంగా యుద్ధం చేయటం తెరేష్‌బాబుకు చద్దికూటితో పెట్టిన విద్య. జానపద గీతాల్లోని మౌఖిక ఛందోరీతులను తన కవితా నిర్మాణ పద్యాలతో మేళవించి సందర్భానుసారంగా తెరేష్‌బాబు వచన కవితా ప్రక్రియకు కొత్త నడకలు నేర్పాడు. ఒక్కొక్కసారి గజల్‌ నడకలను, ముక్తపదగ్రస్త శైలిని గమ్మత్తుగా సమన్వయపరిచి అపూర్వమైన రచనా శైలితో పాఠకుల్ని వశపరుచుకుంటాడు పైడి తెరేష్‌బాబు. అందుకే ఈ కవితా వీరబాహుడి శైలి సిరాల్లోకి ఇంకిపోకుండా, ఆపాదమస్తకం సిరల్లోకి ధమనుల్లోకి చొచ్చుకుపోతుంది. ‘చీకట్ల కత్తెరలో గొంతుక చిత్రంగా తెగిపోయినా/ నాకేమి కానట్టు/ నాదేమి పోనట్టు/ నవ్వుతూనే చేస్తాను నవగీతాలాపన’ అని సగర్వంగా ప్రకటించిన పైడి మృత్యువుతో పోరాడుతూ కూడా నిన్న మొన్న చుండూరు తీర్పుకు వ్యతిరేకంగా నేతిబీరకాయ లాంటి న్యాయస్థానాలపై అక్షరాల పిడుగులు కురిపించాడు. వార్తలకు, భక్తికి, సంగీతానికి, పర్యావరణానికి ఉన్నట్టే సాహిత్యానికి కూడా ఒక ప్రత్యేక చానల్‌ నెలకొల్పిన వాళ్ళే 21వ శతాబ్దపు వైతాళికులని దార్శనిక దృష్టితో పిలుపునిచ్చాడు. అందుకోసం పరితపించాడు. అందుకే పైడి తెరేష్‌బాబు 21వ శతాబ్దపు వైతాళికుడు. సాహిత్యంలో విజేతగా అందరి మన్ననలందుకున్న తెరేష్‌బాబు మద్యానికి బానిసయ్యాడు. ప్రమాదకరమైన ఈ మద్య బానిసత్వం నుండి దళిత బహుజన కవులు బయటపడకపోతే జాతి తీవ్రంగా నష్టపోతుంది. 
- డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు
9440480274

Andhra Jyothi Telugu News Paper Dated : 06/10/2014 

No comments:

Post a Comment