Sunday, October 26, 2014

హైందవ పునాదులపై ఇండియా - డాక్టర్‌ భంగ్యా భూక్యా



పెరి ఆండర్‌సన్‌ రచించిన ది ఇండియన్‌ ఐడియాలజీ గత రెండు సంవత్సరాలుగా ఇండియన్‌ మేధావి వర్గంలో పెద్ద దుమారాన్నే లేపింది. ఈ వర్గం తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ అనువదించి ప్రజలకు పరిచయం చేయటం చాలా సంతోషం. ఇండియాను బ్రిటిష్‌ పాలకులే డిస్కవరీ చేశారన్న ఆండర్‌సన్‌ వాదనతో నేను వ్యక్తిగతంగా ఏకీభవించను. కానీ అతను లేవనెత్తిన అనేక వాదనలు, ప్రశ్నలు భారత దేశంలోని వాస్తవాలను ఎత్తి చూపుతున్నాయి. ఎందుకు అత నితో ఏకీభవించనంటే ఇండియాను డిస్కవరి చేసింది హిందూ మేధావి వర్గం. రాజారామ మోహన్‌ రాయ్‌ దగ్గర నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ వరకు ఆంగ్ల విద్యను వంటబట్టించుకున్న తరం ఇండియాను డిస్కవరీ చేయటమే పనిగా పెట్టుకొని వేదకాలం నుంచి నేటి వరకు ఇండియాలో దాగి వున్న హిందూత్వాన్ని వెలికి తీశారు. ఇది ఇండియాను ఒక అప్రకటిత హిందూ దేశంగా తీర్చిదిద్దింది.
ఈ పుస్తకం ప్రధానంగా చెప్పేదేమంటే ప్రతి రాజకీయ పార్టీ సిద్ధాంత రాద్ధాంతాలకు అతీతంగా హైందవ సాంస్కృతిక పునాదుల మీద నిర్మించబడి ఆ సంస్కృతిని బలోపేతం చేసింది. అదే విధంగా సనాతన వాదులు, ప్రగతిశీలవాదులన్న తేడాలేకుండా ప్రతి హిందువూ ఇండియన్‌ హైందవ ధర్మరక్షణకే పాటు పడ్డాడు, పడతాడూ కూడా. ఆందుకే ఆ రోజు వల్లబ్‌ భాయ్‌ పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ను కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కావాలని కోరాడు. ఇప్పుడు ఆరు వందల అడుగుల ఎత్తు పటేల్‌ విగ్రహాన్ని (స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ) నిర్మించటానికి నరేంద్ర మోదీ తాపత్రయపడుతున్నారు. అంటే దేశంలోని ఐక్యత విషయం ప్రక్కన పెడితే, కాంగ్రెసుకి, బీజేపీకి హిందూత్వ విషయానికి వచ్చినప్పుడు ఎటువంటి తేడా లేదు. కాంగ్రెస్‌ లౌకికవాదానికి ఈ దేశం మోసపోయిందని ఈ పుస్తకం బలంగా చెబుతుంది. అంతేకాదు, కాంగ్రెస్‌ దాని నాయకులు గాంధీ, నెహ్రూలు చేసిన మోసాలు ఇన్నీ అన్నీ కావని ఈ పుస్తకం రూఢి చేస్తుంది.
సాధారణంగా వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన అధ్య యనాన్ని మనం జాతీయ ఉద్యమంలాగా భావిస్తాము. మన అగ్రకుల చరిత్రకారులు దీన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా ఉద్యమంగా అభివర్ణించారు. అయితే ఈ ఉద్య మం హైందవ ధర్మరక్షణకే జరిగిందన్న విషయం మనకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది. గాంధీకి స్వరాజ్‌ మతపరంగా ఒక తప్పనిసరి ఆవశ్యకత. రాజకీయ రూపం అనేది దీనిని ముందుకు తీసుకెళ్ళే సాధనం తప్ప మరొకటికాదు. మతాన్ని రాజకీయాలతో జోడించి ఉద్యమాన్ని నిర్మించటం గాంధీ ప్రత్యేకత. ఈ క్రమంలో హైందవ మత ఉద్ధరణం ప్రధానాంశం కావటం చూస్తాము. రాజకీయ స్వేచ్ఛ రెండవ అంశం కావటం చూస్తాము. వాస్తవంగా గాంధీ చేసిన రాజకీయ ఉద్యమాలు ఏవీ కచ్చితమైన ఫలితాలను సాధించకుండానే ముగుస్తాయి. అట్టహాసంగా మొదలుపెట్టిన సహాయనిరాకరణ ఉద్యమం చౌరిచౌరాలో జరిగిన హింసాత్మక సంఘటనతో అర్థాంతరంగానే ముగుస్తూంది. కానీ అసలు కారణం హింసకాదు. ఈ ఉద్యమం కొద్ది రోజు ల్లోనే ప్రజా ఉద్యమంగా మారింది. బ్రిటిష్‌ పాలన కంటే ప్రజా విప్లవమే ప్రమాదకరమని భావించి సహాయ నిరాకరణోద్యమాన్ని ముగిస్తారు. అప్పటికి ఇండియా హిందువైజేషన్‌ కాకపోవటం కూడా ఒక ప్రధాన కారణం. దండి సత్యాగ్రహం ఒక ఢిఫెన్సివ్‌ ఆట. క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రజల నుంచి వచ్చింది. ఇందులో గాంధీ ప్రమేయం అంతంత మాత్రమే. గాంధీ రాజకీయ ఉద్యమాల్లో విజయం సాధించలేదు. కానీ హైందవ మత విషయంలో విజయాన్ని సాధించారు.
గాంధీ తన ప్రజా జీవితం మొత్తాన్ని హిందూ ధర్మరక్షణ కోసమే వెచ్చించ్చారని ఈ పుస్తకం రూఢీ చేస్తుంది. వ్యక్తిగత, ప్రజా జీవితం రెండూ మత మౌఢ్యంలోనే నడిచాయి. గాంధీ బ్రహ్మచర్యం కూడా హిందువులం మైలపడతామన్న భయం నుంచి రూపు దిద్దుకుంది. వ్యక్తిగత స్థాయిలో అన్ని మతాలు సమానమని నమ్మిన, రాజకీయ స్థాయిలో మాత్రం హిందూ మతం, ఇస్లాం మతం కంటే కాస్త ఎక్కువ అని నమ్మేవారు. ఒక ముస్లిం యువతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న తన కుమారునికి అది ‘ధర్మ విరుద్ధం’ అని హెచ్చరించారు. రాజకీయాల్ని పక్కనబెట్టి ఈ పెళ్లి కాకుండాచూశారు.
గాంధీ లౌకిక వాదంలో హిందూత్వం దాగి ఉందని ముస్లింలు చాలా కొద్దికాలంలోనే కనిపెట్టారు. నాటకీయంగా జరిగిన ఖిలాఫత్‌ ఉద్యమం తరువాత గాంధీ ముస్లింలను వదిలివేశారు. ఆనాటి నుంచి అత్యధిక శాతం ముస్లింలు ఆయనను ఎప్పుడూ నమ్మలేదు. లౌకిక వాదానికి ప్రతీకగా ఉన్న మహమ్మదలీ జిన్నా కూడా గాంధీ హిందూత్వ రాజకీయాలకు విసిగిపోయి కాంగ్రెస్‌ నుంచి బైటికి వచ్చేశారు. నిష్పక్షపాతి అయిన మోతీలాల్‌ నెహ్రూ కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా హిందూ పార్టీయే అనడం గమనించదగ్గ విషయం. ఈ హైందవ రాజకీయాలే దేశ విభజనకు దారితీశాయి. కానీ చరిత్రలో దేశ విభజనకు జిన్నాను దోషిగా నిలబెట్టారు.
కాంగ్రెస్‌ పార్టీయే పాకిస్థాన్‌ స్థాపనకు నాంది పలికింది. జిన్నా భారత దేశంలో ఒకటి కాదు, రెండు దేశాలున్నాయని 1940లో ప్రకటించారు. ఆ రెండు దేశాలు సహజీవనం చేసేందుకు భారత స్వాతంత్య్రం వీలుకల్పించాలి, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో వారికి స్వయంప్రతిపత్తినీ, సార్వభౌమాధికారాన్ని ఇవ్వాలన్నారు. అంటే జిన్నా ప్రత్యేక దేశం కావాలని కోరలేదు. ముస్లింలకు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకున్నారు. ఈ విషయాన్ని గందరగోళం చేసి కాంగ్రెస్‌ పార్టీ పాకిస్థాన్‌ ప్రతిపాదనను జిన్నాకు అంటగట్టింది. దే శ విభజన బ్రిటిష్‌ ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదు. క్యాబెనెట్‌ మిషన్‌ ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న ప్రాం తాలన్నీ స్వయం పాలనాధికారంతో ఉండే విధంగా ప్లాన్‌ రూపొందించింది. కానీ అది నెహ్రూకు రుచించలేదు. ముస్లింలకు ప్రత్యేక స్వయంప్రతిపత్తి, ఇవ్వడం కంటే దేశ విభజనే మేలని నెహ్రూ భావించారు.
విచిత్రమేమంటే, కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌ దేశ విభజన గురించి మాట్లాడుతున్నప్పుడు జిన్నా మాత్రం అఖండ భారత దేశంలో సంకీర్ణ ప్రభుత ్వం గురించి కలలు కనేవారు. భారత దేశంలో ఆంక్ష లు లేని సంపూర్ణ అధికారంతో కూడిన బలమైన కేంద్ర ప్రభుత్వం కావాలని నెహ్రూ కోరుకున్నారు. అది విభజనతోనే సాధ్యపడుతుందని భావించారు. చివరకు ఈస్ట్‌ బెంగాల్‌ని కూడా జిన్నా కోరుకోలేదు కానీ, ఈ ప్రాంతం ఇండియాతో ఉంటే కోల్‌కతాలో ముస్లింల ప్రాబల్యం పెరుగుతుందని పాకిస్థాన్‌కు అంటకట్టారు. రేపటి భారత్‌లో హిందువుల ఆధిపత్యమే పునాదిగా దేశవిభజన జరిగిందన్న విషయాన్ని ఇక్కడ గుర్తించాలి.
గాంధీ, నెహ్రూల కుల రాజకీయాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరంలేదు. కుల రాజకీయాలు కాంగ్రెస్‌ పుట్టకలోనే ఉన్నాయి. గాంధీ ప్రకారం అంటరానితనానికి కులానికి మధ్య ఎలాంటి సంబంధమూ లేదు. కానీ అంబేద్కర్‌ కులసమస్యను లేవనెత్తినప్పుడు అగ్రకుల హిందువులంతా ఏకమై అతని ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. గాంధీ దృష్టిలో అంటరానితనం పాపమే కావచ్చు కానీ, అది ఆమరణ దీక్ష చేయాల్సినంత నైతిక సమస్య కాదు. కానీ అంటరాని వాళ్లకి ప్రత్యేక నియోజకవర్గాలు మంజూరు చేయటం మాత్రం ఆయనదృష్టిలో చాలా తీవ్రమైన సమస్య వాటికి వ్యతిరేకంగా ఆయన తన జీవితాన్నే పణంగా పెట్టడానికి సిద్ధం. అగ్రకుల హిందువుల ఒత్తిడికి, గాంధీ బ్లాక్‌మెయిలింగ్‌కు పూనా ఒప్పందం సమయంలో లొంగి పోయినందుకు అంబేద్కర్‌ తను చనిపోయేవరకు బాధపడ్డారు.
వలసవాద వ్యతిరేక ఉద్యమ రూపంలో హిందూయిజం, అగ్రకుల తత్వం బలంగా తన ఆధిపత్యాన్ని సాధించుకుంది. అందుకే స్వతంత్ర భారతంలో మత మైనార్టీలు, అణగారిన కులాలు, ఆదిమ జాతులు భయంకరమైన అణచివేతకు, దోపిడీకి గురవుతున్నాయి. రాజ్యాంగంలో లౌకిక వాదాన్ని లిఖించుకున్నారు, కానీ రాజ్యాంగంలో హిందువులకు తప్ప మరే మతస్థులకు రక్షణ లేదు. హిందూ అణగారిన కులాలకు రిజర్వేషన్‌ కల్పిస్తే మతం అడ్డురాదు. కానీ ముస్లిం, క్రిష్టియన్‌ మతాల్లోని పేదలకు రిజర్వేషన్‌ కల్పిస్తే మతం అడ్డువస్తుంది. అంటే హిందూ మత రక్షణ మన రాజ్యాంగంలో బహిరంగంగానే దాగి ఉంది. ఎందుకు ఒక్క ముస్లిం కూడా ఇండియన్‌ రక్షణ పరిశోధన సంస్థల్లో లేరు? కానీ నేపాల్‌కు చెందిన గూర్ఖాలు ఆర్మీలో ఉండవచ్చు. ఎందుకు కాశ్మీరులోని ముస్లింల మీద, ఈశాన్య రాషా్ట్రల్లోని క్రిష్టియన్‌ ఆదివాసుల మీద నిరంతరం నరమేధం నడుస్తుంది? ఎందుకు ఈ దేశ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి? ఈ దేశ అగ్రకుల మేధావి వర్గం ఎందుకు ఈ హింస గురించి మాట్లాడదని ఈ పుస్తకం ప్రశ్నిస్తుంది.
- డాక్టర్‌ భంగ్యా భూక్యా
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌
Andhra Jyothi Telugu News Paper Dated: 26/10/2014 

No comments:

Post a Comment