Wednesday, October 15, 2014

ఈ తరం దళిత సాహిత్యానికి ఆద్యుడు కుసుమ ధర్మన్న By డాక్టర్‌ కత్తి పద్మారావు


Posted on: Wed 15 Oct 00:58:14.626015 2014

                 సాహిత్యం బలహీనతను పెంచకూడదు. సాహిత్యం మార్పుకు దోహదం కావాల్సిఉంది. ఒక్కొక్కపాట ఒక జాతికి మేల్కొలుపుగా నిలిచింది. పాట కొన్నిసార్లు ఉద్యమాల నుంచి పుడుతుంది. కొన్ని సార్లు జీవితం నుంచి పుడుతుంది. పాట కొన్ని సార్లు ప్రేమ నుంచి పుడుతుంది. పాట తిరుగుబాటు బావుటా అవుతుంది. పాటలు మాటల మూటలేకాదు, అవి జీవితాన్ని సంచలన భరితం చేస్తాయి కూడా.
                 స్వాతంత్య్రోద్యమ కాలంలో తెలుగు నేలను ఒక ఊపు ఊపిన దళిత కవి కుసుమ ధర్మన్న. మాకొద్దీ తెల్లదొరతనం అని ఒక పక్క మోగుతుంటే కుసుమ ధర్మన్న మా కొద్దీ నల్లదొరతనమని ఈ నల్లదొరలను నిలవేశాడు. సామాజిక ఆధిపత్యం ఉన్న కులాలకు రాజ్యాధికారం వస్తే దోచుకోవడం తప్ప మరొకటి ఉండదని నిగ్గు తేల్చాడు. జాతీయోద్యమం కాలంలో ఉన్న భూస్వామ్య, కులాధిపత్య, అస్పృస్యతలతో నలిగిపోతున్న దళితుల దుర్భర జీవితానికి తన పాటలతో అద్దం పట్టిన మహాకవి. కుసుమ ధర్మన్న లయాత్మకమైన తన పాటల్లో తెలుగు సామాజిక జీవనాన్ని దృశ్యీకరించాడు. ఇప్పటికీ గ్రామాల్లోని పెత్తందారీతనం గుట్టును బట్టబయలు చేశాడు. గుర్రం జాషువా కవికి, బోయి భీమ్మన్నకు స్ఫూర్తినిచ్చాడు. మహాకవి కుసుమ ధర్మన్న తన పాటల్లో తెలుగు పదాలు జాలెలు పోశాడు. పదాల్లో వాస్తవాలను, పదాల్లో ఆగ్రహాన్ని, పదాల్లో బతుకుని, పదాల్లో పెత్తందార్ల స్వభావాన్ని ఎండగట్టాడు.
పన్నెండు మాసాలు పాలేరుతనమున్న /పస్తులుబడుచు బతు కాలండి/ఆలి కూలీజేసి తీరాలండి/పిల్లగాడూ పశువుల గాయాలండి ి/పగలు రేయీ పాటుపడ్డానండి/కట్ట గుడ్డా-గూడూ గిట్టదండి/రోగమొస్తే ఆనగ దప్పదండి/అప్పు తీరదీ చిత్రమేమండి/ఈ నిప్పుపైనిక మేము నిలువలేమో తండ్రి/మాకొద్దీ నల్లదొరతనము /దేవ-కనికారము లేక కడుపుమాడ్చే రండి/మాకొద్దీ నల్లదొరతనము-బాబు /మాకొద్దీ నల్లదొరతనము-దేవ/పదిమంది తోపాటు పరువు గలుగకయున్న/మాకొద్దీ నల్ల దొరతనము/పాడిపంటలు మేము కూడబెడితె వారు/కూర్చోని తింటామంటారు/నాములిచ్చి నట్టేట ముంచేరు/యెంచి అప్పునప్పు బెంచుతారు /చెంపగొట్టి కంపలాగు తారు/కోర్టుకెక్కించి కుంగదీసేరు/చీలదీసి కులము చెరుపుతారు/దేవ కూడు గుడ్డ కొంప లేకుండ జేసేరు/మాకొద్దీ నల్లదొర తనము/మాలా మాదిగలంటే మండిపడిపోతారు/ఊరి వెలుపనున్న పూరిగుడిసెలె గాని/బారి కొంపలు మాకు లేవు/గాలి వెలుగు సుంత తొంగిరాదు/ సారమైన కూర కూడు లేదు/కోరికట్ట కోక పంచలేదు/నల్లపూస పుస్తె నగదు లేదు/ దున్ని తినగ పొలము దొడ్డిలేదు/దేశమందారికి మేము చేదు/మా దారిద్రియము జూడ దయపుట్టగారాదు.
                 ఈ పాటలో ధిక్కార స్వరముంది. సమాజ నిజ స్వభావం ఉంది. ఇందులో వాడిన పదజాలం పన్నెండు మాసాలు, పాలేరుతనం, పస్తులు, ఆలికూలి, పిల్లగాడు, గిట్టదు, ఆనగ, నిప్పుపై, పాడిపంటలు, నాము, నట్టేట, చెంపగొట్టి, చీలదీసి కులము, గాలి, వెలుగు, సుంత తొంగిరాదు, సారమైన కూడు కూడలేదు. నల్లపూస పుస్తే నగదు లేదు. దారిద్య్రము, దయాపుట్టగరాదు. ఇందులోని పదాలు, వాక్యాలు మనల్ని కదిలిస్తాయి. సామాజిక జీవన వాస్తవాలను చారిత్రక గతిలో నుంచి చూపిస్తాయి. తెలుగు సామాజిక చరిత్రను ఆనాటి నుంచి ఈనాటి వరకు అర్థం చేసుకొనాలన్నపుడు ఈ పాట నేర్చుకోవడం తప్పనిసరి. దీన్ని బుర్ర కథల్లోను, జెముకుల కథలోనూ కూడా పాడతారు. శృతిబద్ధమైన లయనిబద్ధతే కాక ప్రశ్న, నిలవేయడం, నిజాన్ని చెప్పడం, జీవనగాథను హృదయార్ద్రంగా పాడటం ఇందులోని గొప్పతనం. కరుణరస ప్రధానమైన ఈ పాటలో ద్వితీయార్ధంలో ఎంతో తిరుగుబాటు కూడా ఉంది. సామాజిక విప్లవ నినాదంగా ముందుకు నడిచిన ఈ పాట గుండె నిప్పును మండిస్తుంది. ఒక జాతిని అంటరానివాడుగా చేసి తమకు జీతగాళ్ళుగా, పాలేరులుగా మార్చుకొని వారి శ్రమకు అంటులేకుండా దోచుకొని వారిని అంటరానివారుగావించిన వైనం ఆ పాటలోనే చూడండి.
ఒంటినిండ గుడ్డెందు కంటారు/గోచిగుడ్డ కర్రే గోటంటారు/చుట్టు గుడిసె చాలా సుఖమంటారు/గంజికూడే గుంజు బలమం టారు/దేవ-నోరులేదని మమ్ము దూరాన గెంటేరు/ఆకలిచిచ్చూచేత అడలి చచ్చినగాని /యన్న సత్రము మాకులేదు/నోరుయెండి దోరిన నీరు లేదు/కుడువ పూటకూళ్ళు గానరావు/యెక్క బండి వక్కటైనరాదు/మొక్క దేవుడొక్కడైన లేడు/శ్రమను దీర్చ సత్రమొకటి లేదు/భ్రమలు దీర తాగ బావి లేదు/మేము మనుషులనూ మాట మరచిపోయారండి/మాలమాలని చాలా తూలనాడి మమ్ము/ అంటరాదని గెంటుతారు /ఆసుపత్రి మందుల డుగుతారు /మాల మందూలు చాలా తాగేరు/మాల చనుబాలు మందుకడిగేరు /మాలపొత్తులేక మసలలేరు/మామేలు మెప్పుపొంది మేకై తిరుగుతారు /కుక్క నక్కలకంటె తక్కువగా జూచి/నిక్క తక్కి నిగుడుతారు /సాని ప్రక్కజేర సాగుతారు /కుష్టురోగి సరస కూర్చుంటారు/కుక్క కోతిని కోరి పెంచేరు/పిల్లి పిట్టాల ప్రేమించుతారు /పందిగున్నాల బాధింపరారు/కాకి నీటిని తాకనిస్తారు/మమ్ము దరికి చేరునీరు దడదడ తిట్టేరు.
            ఈ రెండో భాగంలో పాట పాటగానే గాక పశ్న్రలు వెల్లువలా పొంగాయి. పాటలో నాటకీయత, సమాజాన్ని నిలవేసిన తిరుగుబాటు తత్వం, నిజమైన స్వాతంత్య్ర నినాదం మనకు కనిపిస్తుంది. ఈనాడు ఈ పరిస్థితి కోస్తా ఆంధ్రాలో ఎన్నో ఉద్యమాల వల్ల మారినా, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో, రాయలసీమలో కొనసాగుతూనే ఉంది. ఒక కవి వెయ్యి పేజీల్లోని సామాజిక చరిత్రను ఒక పాట ద్వారా మనకు చెప్పాడు. పాట పాడుతున్నప్పుడు కనుకొలకునుల్లో నీరు తిరిగి పీడిస్తున్నవాడు కూడా ఇది తప్పే అనే మార్పుకు గురికావాల్సి ఉంది. ఎందరో భూస్వాముల, కులస్వాముల పిల్లలు ఇలాంటి సాహిత్యం వల్లే మారారు. సాహిత్యం బలహీనతను పెంచకూడదు. సాహిత్యం మార్పుకు దోహదం కావాల్సిఉంది. ఒక్కొక్కపాట ఒక జాతికి మేల్కొలుపుగా నిలిచింది. పాట కొన్నిసార్లు ఉద్యమాల నుంచి పుడుతుంది. కొన్ని సార్లు జీవితం నుంచి పుడుతుంది. పాట కొన్ని సార్లు ప్రేమ నుంచి పుడుతుంది. పాట తిరుగుబాటు బావుటా అవుతుంది. పాటలు మాటల మూటలేకాదు, అవి జీవితాన్ని సంచలన భరితం చేస్తాయి కూడా. పాటలో లాలిత్వం ఎంత ఉందో ధిక్కారం అంతే ఉంది. పాట తేనెల ఊట,దానికి కొంచెం రాగశుద్ధి, భావశుద్ధి కలిగిస్తే అది మెదడును, హృదయాన్ని ఒకేసారి కదిలిస్తుందనటంలో సందేహంలేదు. దళిత పాట తెలుగు సాహిత్యానికి ధికార స్వరాన్నిచ్చింది. కుసుమ ధర్మన్న ఈ తరం దళిత కవిత్వానికి ఆద్యుడు. ఆయన పాట ఒక ఉద్యమం. ఉద్యమాల్లో నుంచి వచ్చిన పాటలు, కవితలు సమాజాన్ని ఉత్తేజపరచటమే కాక చారిత్రక మలుపుకు మైలురాళ్ళుగా నిలుస్తాయి. జాతీయోద్యమ కాలంలో వర్గాధిపత్యాన్ని ఎదిరించే వాళ్ళు, కులాధిపత్యాన్ని ఎదిరించే వాళ్ళు తమ గొంతుల్ని, తమ అస్దిత్వాల్ని ఆనాడే ప్రకటించారు. కులాధిపత్యం, మతోన్మాదం, వర్గాధిపత్యం పునాదులన్నీ ఒక పాదులోనే ఉండడం వల్ల ఎదిరించే శక్తులు కూడా మిత్రత్వానే కలిగి ఉన్నాయి. కుసుమ ధర్మన్న దళిత అస్తిత్వ సాహిత్యాన్ని జాతీయోద్యమ కాలంలో ఉక్కు కంఠంతో వినిపించినవాడు. ఈనాటి దళిత కవులకు స్ఫూరి కుసుమ ధర్మన్న.

(వ్యాసకర్త సామాజిక ఉద్యమ నేత)

Prajashakti Telugu News Paper Dated : 15/10/2014 

No comments:

Post a Comment