Friday, December 5, 2014

చెదలు పట్టిన చైతన్యం - డా. ఎం.ఎఫ్‌. గోపీనాథ్‌



‘మన రాష్ట్రం-మన పాలన’ అనుకున్న మూడవ రోజు నుంచే రైతుల బతుక్కి భరోసా లేక 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఉద్యమానికి ఊపిరిలూదిన ఉస్మానియా విద్యార్థుల్ని ‘నియామకాలు-నిధులు-నీళ్ళు’ నినాదాలు ఎక్కిరించి నిరాహారదీక్షకు నెట్టబడ్డారు. హైదరాబాద్‌ చుట్టూరా ఉన్న 21 లక్షల ఎకరాల భూమి బడా పెట్టుబడిదారులకు అధికారిక ధారాదత్తం కాబోతున్నది. దళితుల మూడు ఎకరాల భూమి నినాదం అమలు ‘చంద్ర’ మండలంలోనో లేక అంగారక గ్రహంలోనో సాధ్యమయ్యేట్లున్నది.
పాలక వర్గం మేధావుల్ని ఎంత ఎక్కువగా తనలో యిముడ్చుకుంటుందో, అంత స్థిరంగానూ, అంత ప్రమాదకరంగానూ దాని పాలన తయారవుతుంది.
- మార్క్స్‌
ఆంటోనియో గ్రాంసీ 1930ల్లో ఇటలీ సమాజంలో వస్తున్న మార్పుల్ని ఆ సమస్యల పట్ల మేధావుల స్పందనను గురించి వివరించే క్రమంలో మేధావుల్ని రెండు రకాలుగా విభజించాడు. వారినే సాంప్రదాయక మేధావులు, సజీవ మేధావులు అన్నాడు. సాంప్రదాయక మేధావులు యథాతథ వాదులు-పాలక వర్గ పక్షపాతులు. పాలక వర్గాల దోపిడీకి, అరాచకాలకు రంగులద్దుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించేవారు. ఈ కోవలకి చెందినవారే మతాధిపతులు, పూజారులు, సామాజిక శాస్త్రవేత్తలు/ఆర్థిక శాస్త్రవేత్తలు తదితరులూను. ప్రజల సమస్యల పట్ల సానుభూతి, సహా నుభూతి ఉన్న మేధావి వర్గం సాంప్రదాయ మేధావివర్గానికి భిన్నంగా ఉంటుంది. దీన్నే ఆర్గానిక్‌ ఇంటెలెక్చువల్స్‌/ సజీవ మేధావి వర్గం అన్నాడు గ్రాంసీ. ఉదాహరణకు వామపక్ష మేధావులు, తెలంగాణ మేధావులు మొదలగు వారు. సాంప్రదాయక మేధావులతో గానీ, సజీవ మేధావులతో గానీ సమస్య లేదు. సమస్య ఎప్పుడొస్తుంది? సజీవ మేధావులుగా చలామణీలో ఉన్న వామపక్ష, దళిత, తెలంగాణ మేధావులు ఏ ఉద్యమాల గురించి అయితే ప్రజలకు వివరించి, ప్రజల్ని భాగస్వాములుకండని ప్రభోదించారు కదా. మరి ఆ ఉద్యమాల్ని స్వార్థపరులు కొందరు హైజాక్‌చేసి, నిరంకుశ నాయకులుగా తయారయ్యారో, తయారవుతున్నారో ఆ నిరంకుశత్వాన్ని నిరసించవల్సిన ఈ సజీవ మేధావులు సడెన్‌గా బ్రెయిన్‌లెస్‌/ స్పైయిన్‌లెస్‌ మృత జీవులుగా మారిపోతున్నప్పుడు తప్పక సమ స్య వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో గానీ, తెలంగాణ రాష్ట్రం కొరకు జరిగిన పోరాటంలో గానీ పాల్గొన్న ‘వామపక్షం’ బురఖా వేసుకొన్న మేధావులు, తెలంగాణ ఉద్యమ ముసుగు వేసుకొన్న భూస్వామ్య బ్రాహ్మణీయ శక్తులకు అన్ని విధాల తమ సహాయ, సహకారాలందించారు. సామాజిక తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణకు ప్రతిగా కుట్రపూరిత దొరస్వామ్య అనుకూల ‘గెట్టు’ తెలంగాణకే మద్దతుపలికారు. మొదట తెలంగాణ రానియ్యండన్న మోసపూరిత వాదనతో తెలంగాణలోని సోషల్‌ ఆర్గనైజేషన్స్‌ అన్నింటినీ నిర్వీర్యం చేసారు. వామపక్ష విప్లవ పార్టీలకు మద్దతుదారులుగా చలామణి అవుతున్న కొందరు మేధావులు. తెలంగాణ భూస్వామ్య ప్రతినిధి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఏకంగా సివిల్‌ లిబర్టీస్‌ మీటింగ్‌కి గౌరవ అతిథిగా ఆహ్వానించారు.
ఈ మేధావులు ఎందుకు యింతగా దిగజారారు? మావోయిస్ట్‌ ఎజెండానే మా ఎజెండా అన్న కేసీఆర్‌ సాధారణ ప్రజాస్వామ్య హక్కు అయిన సభ జరుపుకునే హక్కుని గూడా (గత సెప్టెంబర్‌ 21న) దక్కనియ్యలేదు. మరి తెలంగాణ మేధావి వర్గం నోరెందుకిప్పట్లేదు? ఇవి క్రోనీ కేపిటలిజం రోజులు. క్రోనీ కాపిటలిజం (ఆశ్రిత పెట్టుబడి), క్రోనీ మేధావుల్ని (ఆశ్రిత మేధావుల్ని) తయారు చేసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల సందర్భంలో గానీ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ‘బి’ కేటగిరీ విద్యార్థుల ఫీజు ఉమ్మడి రాష్ట్రంలోను, పక్క రాష్ట్రంలోను అంతకు ముందున్న రూ.5 లక్షల 25వేల నుంచి అకస్మాత్తుగా రూ.9.5 లక్షల నుంచి 12 లక్షల వరకు పెంచినప్పుడు కానీ నోరెత్తని తెలంగాణ ఉద్యమ మేధావివర్గం మౌనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? తెలంగాణ రైతులు అనుభవిస్తున్న కరెంట్‌ కష్టాల్ని తీర్చడానికి మూడు సంవత్సరాలు అవసరమా? ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో కుదుర్చుకున్న 1000 మెగావాట్ల కరెంట్‌ని తెలంగాణ రైతులకు అందించటానికి, కరెంట్‌ స్తంభాలు, వైర్లు వేయడానికి మూడు సంవత్సరాలు పడ్తాయా? అంతకన్నా సులువైన మార్గం తెలం గాణ విద్యుత్‌ ఉద్యోగ మేధావులు సూచించలేరా? తెలంగాణ ప్రభుత్వం-ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాల మధ్య జరిగిన సామరస్య ఒప్పందాల్ని కేంద్రప్రభుత్వం తనకు నష్టం లేనంతవరకు ఒప్పుకుని తీరుతుంది. ఉన్న కరెంట్‌లైన్ల ద్వారానే రామగుండం నుంచి కేంద్రానికి వెళ్ళే భాగాన్ని తెలంగాణకి మళ్ళించి వెంటనే తెలంగాణ రైతు ఆత్మహత్యల్ని ఆపవచ్చు. మరి ఇంతటి ప్రాముఖ్యం ఉన్న విషయాన్ని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన మేధావివర్గం చర్చకెందుకు పెట్టడం లేదు? ప్రత్యేక రాష్ట్రం వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ‘తెలంగాణ జిందా తిలిస్మాత్‌’ని ప్రజాసమూహాల మెదళ్ళకి నిత్యం పూసిన మేధావివర్గం యిప్పుడు పట్టిన మౌన వ్రతానికి అర్థం ఏమిటి? రైతు ఆత్మహత్యలు పక్క రాష్ట్రంలో లేవా అని ప్రశ్నించే మేధావి వర్గం, కాంగ్రెస్‌, టీడీపీ పాలన వల్లనే ఈ ఆత్మహత్యలు అంటున్న తెలంగాణ మీడియా, కాంగ్రెస్‌ని, టీడీపీని ఓడించి టీఆర్‌ఎస్‌కి అందుకే కదా పట్టం కట్టామని గజ్వేల్‌లోనే ఓ రైతు నిలదీసినప్పుడు ఏమి సమాధానం చెప్పారు? దొరసాని బతుకమ్మకి పది కోట్లు, మెట్రోపాలిస్‌ డ్రింకింగ్‌-డ్యాన్సింగ్‌ పార్టీకి 500 కోట్లు ఖర్చుపెట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాన్ని ఓదార్చే, బతుకు భరోసా ఇచ్చే టైం గానీ లేదా? రైతు కుటుంబాల బాకీలు గరిష్ఠంగా మూడు లక్షల దాకా ఉంటాయేమో. ఆ మాత్రం అయినా అందించి బజారున పడ్డ ఆ కుటుంబాలను ఆదుకోవచ్చు. ఆ మేరకు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన మేధావులు రాష్ట్ర ముఖ్యమంత్రిని ‘బాంచెన్‌ దొరా అప్పుల పాలైన మన రైతుల బాకీ తీర్చి రైతుల బతుక్కి భరోసా యివ్వండని’ అయినా ప్రాధేయపడవచ్చు తప్పులేదు!
దళితులకు మూడెకరాల భూమి, పెట్టుబడి ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో తొలి దళిత ముఖ్యమంత్రి లాంటి నినాదమేనని యిప్పటికే స్పష్టమయింది. మహబూబ్‌నగర్‌లో పంచిన పట్టాలు (భూమికాదు) పట్టుకొని ‘మూడు ఎకరాలు’ భూమెక్కడుందా ఆని వెదుకుతున్నారు దళితులు. దివంగత రాజశేఖర్‌ రెడ్డి అన్నట్లు దళితులకు భూ పంపిణీ ‘ఒక నిరంతర ప్రక్రియ’ అంటే అది ఎప్పటికీ ముగియదు. తెలంగాణ భూమండలం మీద భూమి దొరకట్లేదు కాబట్టి, ‘చంద్ర’ మండలంలోనో, అంగారక గ్రహంలోనో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానంటారేమో కేసీఆర్‌!
అరవై సంవత్సరాల మన తల్లి తెలంగాణ దాస్య శృంఖలాలు తెంపి వలస పాలకుల కబంధ హస్తాల చెరనుంచి ‘గెట్టు’ తెలంగాణని మాత్రమే సాధించుకున్నామన్న విషయం మరచిపోవద్దు. తెలంగాణ వెనుకబాటుతనానికి కారకులైన ఏ భూస్వామ్య వర్గాలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి తరిమివేయబడ్డారో ఆ దొరల చేతిలోకే నూతన తెలంగాణ రాష్ట్ర అధికారం బదలాయించబడ్డది. భారతదేశ స్వాతంత్య్ర పోరాట ఫలితం ఏ విధంగానైతే యూరో ఆర్యన్ల నుంచి ఇండో ఆర్యన్ల చేతిలోకి అధికార మార్పిడి జరిగిందో అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్‌ వలన మూడు లక్షల మంది గిరిజనులను బలిచ్చి హైదరాబాద్‌ని పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా, గవర్నర్‌ పాలన క్రింద ఉండే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్న తరువాత ‘గెట్టు’ తెలంగాణ ఇవ్వబడింది. ఇది ఆంధ్ర పెట్టుబడిదారీ వలసవాదానికి, తెలంగాణ భూస్వామ్య నయా పెట్టుబడిదారీ వర్గానికి మధ్య కుదిరిన ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ పవర్‌ ఎగ్రిమెంట్‌ ఫలితమే. తెలంగాణ శ్రమ సంస్కృతి ‘బంగారు బతుకమ్మ దొరసాని’ అవతారం ఎత్తి కళ్ళముందే కదలాడసాగింది. స్వచ్ఛమైన తెలంగాణ భాషా సంస్కృతి, బూతు భాషా సంస్కృతిగా మీడియాకెక్కింది. పండగరోజే యింట్లో పీనుగులున్నట్లు ‘మన రాష్ట్రం-మన పాలన’ అనుకున్న మూడవ రోజు నుంచే రైతుల బతుక్కి భరోసా లేక 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు.
ఉద్యమానికి ఊపిరిలూదిన ఉస్మానియా విద్యార్థుల్ని ‘నియామకాలు-నిధులు-నీళ్ళు’ నినాదాలు ఎక్కిరించి నిరాహారదీక్షకు నెట్టబడ్డారు. హైదరాబాద్‌ చుట్టూరా ఉన్న 21 లక్షల ఎకరాల భూమి బడా పెట్టుబడిదారులకు అధికారిక ధారాదత్తం కాబోతున్నది. అయితే దళితుల మూడుఎకరాల భూమి నినాదం అమలు ‘చంద్ర’ మండలం లోనో లేక అంగారక గ్రహంలోనే సాధ్యమయ్యేట్లున్నది. ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న లక్షల దళిత కుటుంబాలకు ఈ మూడు ఎకరాల భూమి విషయంలో ప్రభుత్వం అధికారిక నిశ్శబ్దం పాటిస్తుంది. ఆంధ్రా వలస పాలకుల హయాంలో మూతపడ్డ అజాంజాహి మిల్స్‌, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సంగతేందో యిప్పటివరకు నోరు మెదపలేదు. నిజాం, పాలేరు షుగర్‌ ఫ్యాక్టరీలను రైతుల నోళ్ళలో దుమ్ముకొట్టి కారుచౌకగా అమ్మినప్పుడు వేసిన రంకెలు ఏమయ్యాయి? ‘మన ఊరు-మన ప్రణాళిక’ మన దొర-మన దొర దోపిడీగా మరానున్నదా? మావోయిస్ట్‌ ఎజెండానే మన ఎజెండా అన్న నాయకులకు మరి ఆదిలాబాద్‌లో ఎన్‌కౌంటర్లు చెయ్యమని మావోయిస్టులే చెప్పారా? ఇవన్నీ తెలిసిన మేధావి వర్గం మౌనమేలా? తెలంగాణలోని అన్ని కుల/వర్గాల సమస్యలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునే జిందా తిలిస్మాత్‌గా చూపించిన మేధావివర్గం పట్టిన ఈ నూతన మౌనదీక్షను అర్థం వెతుక్కోలేని స్థితిలో చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలున్నారనే భ్రమకు గురౌతున్నారా ఈ మేధావులు? ఈ 13 సంవత్సరాల్లో దళిత చైతన్యం ధ్వంసం చేయబడ్డది. వామపక్ష భావజాలాన్ని భ్రష్టు పట్టించారు. విద్యార్థుల భవిష్యత్తు అంధకారమౌతుంది. రైతులు ఆత్మహత్యలే పరిష్కారమనుకుంటున్నారు. కరెంట్‌ కష్టాలు తీరేట్లు లేదు. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల సమస్యల్ని ప్లేబాయ్‌ క్లబ్‌లో, ఫేజ్‌-3 క్లబ్లుల్లో, కరీంనగర్‌ని న్యూయార్క్‌గాను, నిజామాబాద్‌, ఖమ్మంలను లండన్‌ గాను అనుకొని, హైదరాబాద్‌ని గ్లోబల్‌ సిటీ అనుకుని బతికేయండని అంటున్నారు. అట్లా అనుకుంటూ ఈ పాపం అంతా పక్కరాష్ట్రం వాళ్ళ మీదకు నెట్టేసి బతుకులీడుద్దామా? గెట్టు తెలంగాణని గట్టు మీద పెట్టి జన తెలంగాణని సాధించుకుందామా? ఇక బేరసారాల రాజకీయాలను పక్కన బెడదాం.
డా. ఎం.ఎఫ్‌. గోపీనాథ్‌
అధ్యక్షులు, తెలంగాణ జనసమితి

Andhra Jyothi Telugu News Paper Dated: 05/12/2014 

No comments:

Post a Comment