మనం మరిచిన ‘మూల’ యోధుడు - ఎ.ఎన్. నాగేశ్వర రావు
| |
శ్యాం సుందర్ లాంటి అనితర సాధ్యమైన విప్లవ కారులు, మేధావులు చాలా అరుదు. సమాజం ఆయన్ని సరైన రీతిలో అర్థం చేసుకోకపోవడమే కాకుండా, వారి జీవితకాలంలో సరయిన గుర్తింపునూ ఇవ్వకపోవడం దురదృష్టకరం. దేశంలో వర్గం, కులం అని విడదీయబడిన శక్తులు నేడు చావోరేవో తేల్చుకొనే పరిస్థితి ఏర్పడింది. సమైక్యతకు గండిపడి, అగ్ర కులాల చేతుల్లో అధికారం కేంద్రీకరించబడిన స్థితిలో దళితులు, మైనారిటీలు, వెనకబడిన కులాలు తమ స్థైర్యాన్ని కోల్పోతున్నాయి. సనాతన సిద్ధాంతాలూ వివిధ రూపాలలో విజృంభిస్తున్నాయి. ఇలాంటి సంక్షుభిత స్థితిలో శ్యాం సుందర్ లాంటి వారి ఆలోచనలు, రచనల అవసరం ఉంది.
బలవంతులదే చరిత్ర. అగ్రవర్ణాలదే ఈ దేశ చరిత్ర. జ్ఞాతుల చరిత్ర తప్ప అజ్ఞాతుల చరిత్ర మనకు అక్కర్లేదు. చరిత్ర చీకటి గుయ్యారంలో ఎందరో అగుపడకుండా చిదిమేసిన చరిత్ర మనక్కావాలి. అలాంటి కోవలోనే మూల భారతీయ ఉద్యమ పితామహుఢు బత్తుల శ్యామసుందర్ చరిత్ర కూడా నిర్లక్ష్యానికి గురయింది. ఆయన రచనలు మరుగునపడ్డాయి. అలనాటి హైదరాబాదు సంస్థానంలోని ఔరంగాబాదులో 1908 డిసెంబరు 21న బత్తుల శ్యాంసుందర్ ఒక పేద దళిత కుటుంబంలో పుట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయలంలో ఆర్థిక , రాజనీతి, న్యాయశాసా్త్రల్లో ఉన్నత విద్య అభ్యసించారు.
1930-34 సంవత్సరాల మధ్యలో నిమ్న జాతి యువతరాన్ని సమైక్యపరచి ‘యంగ్ మెన్స్ అసోసియషన్ ఆఫ్ హైదరాబాద్’ను స్థాపించారు. తద్వారా హైదరాబాద్ రాష్ట్రంలో దళితుల విద్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యల గురించి పోరాటం సాగించారు. స్వదేశీ లీగ్ సభ్యునిగా, హైదరాబాద్ లైబ్రరీ సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశాలకు బాబాసాహెబ్ అంబేద్కర్‌కు మద్దతుగా యూత్ లీగ్ ఆఫ్ అంబేద్కరైట్స్ స్థాపించారు. పి.ఆర్. వెంకటస్వామి, భాగ్యరెడ్డి వర్మ లాంటి సహచరులతో హైదరాబాద్‌లో దళితులకు ఎన్నో విద్యా వసతి సౌకర్యాల కోసం ఉద్యమించారు. నిజాం నవాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ, అతి సామాన్యమైన జీవితాన్ని గడిపారు. దళిత మైనారిటీ వెనకబడిన వర్గాల విముక్తి కోసం జాతీయ స్థాయిలో ఎన్నెన్నో సంఘాలను స్థాపించారు. సభలు, సమావేశాలు ఏర్పరచి నాటి జాతీయ ప్రాంతీయ నాయకులతో సన్నిహిత రాజకీయ సంబంధాలు కొనసాగించారు. 1946లో నిజాం ప్రభుత్వం నుంచి శాంతి సామాజిక సేవలకుగాను ఖుసురూ-ఎ-డక్కన్ అవార్డు, బంగారు పతకం అందుకున్నారు. గ్రాడ్యుయేట్ నియోజక వర్గం నుంచి హైదరాబాద్ శాసనసభకు, ఉస్మానియా సెనేట్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. నిజాం రాష్ట్రంలో దళిత కులాల ప్రజా ప్రతినిధులను ఆ ప్రజలే ఎన్నుకునేందుకు వీలుగా ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 24 వేల గ్రామాల నుంచి 50 వేల మందితో బ్రహ్మాండమైన ప్రదర్శన నిర్వహించారు. 1948లో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా ఎంపికయ్యారు. దళితుల విద్యా వసతి సౌకర్యాల అభ్యున్నతి కోసం నిజాం నవాబును ఒప్పించి, హైదరాబాద్ శాసనసభచే ఆమోదింప చేసి, ఒక కోటి రూపాయల ఫండ్‌ను ఏర్పాటు చేయడంలో శ్యాంసుందర్ కీలక పాత్ర నిర్వహించారు. ఆనాటి కాలంలోనే ప్రత్యేక తెలంగాణ కోరుతూ... హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని ప్రధాన మంత్రికి బహిరంగ లేఖ రాయడం చరిత్ర.
మరాట్వాడాలోని మిళింద్ కాలేజీ, విద్యా సంస్థల నిర్మాణానికి డాక్టర్ అంబేద్కర్ అభ్యర్థన మేరకు నిజాం నుంచి 12 లక్షల రూపాయలను విరాళంగా ఇప్పించారు. హైదరాబాద్ స్టేట్ ఇండియాలో విలీనం తర్వాత, ఆ 12 లక్షల రూపాయలను తిరిగి చెల్లించాలని అంబేద్కర్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టులో కేసు పెట్టింది. ఆ కేసును న్యాయస్థానంలో సవాల్ చేసి శ్యాంసుందర్ వాదించి గెలిచారు. న్యాయస్థానంలో ఆయన వాదనా పటిమకు, ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి ఈ వ్యాజ్యం ఒక మచ్చు తునక. దేశవ్యాప్తంగా నిమ్న వర్గాల విద్యావసతుల కోసం డాక్టర్ అంబేద్కర్ ఏర్పాటు చేసిన పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యనిగా శ్యాం సుందర్ ఎంపికయ్యారు. తద్వారా దేశ వ్యాప్తంగా దళితులకు విద్యార్జన కోసం విద్యాలయాల ఏర్పాటులో తన వంతు సాయాన్ని కొనసాగించారు. కేవలం క ట్టుబట్టలతో, అద్దె గదిలో అత్తెసరి వసతులతో శ్యాంసుందర్ జీవితాన్ని అతి సామాన్యంగా గడిపారు. నిజాం నవాబు సన్నిహిత మిత్రడై ఉండి కూడా, ఎ ందరో సన్నిహితులు అత్యున్నత పదవుల్లో ఉండినా తన కోసం ఇసుమంతైనా వారిని ఉపయోగించుకోని అభిజాత్యం ఆయనది. ఒక సామాన్య బ్రహ్మచారి, మద్యపాన వ్యతిరేకి, కచ్చితమైన నియమాలతో, సూటిదనం, మచ్చలేని వ్యక్తిగా పేరుబడ్డ శ్యాంసుందర్ నిరాడంబరంగా ఉన్నతమైన జీవితాన్ని గడిపారు. ఉర్దూ, మరాఠీ, ఆంగ్లం, హిందీ, కన్నడ భాషలలో పండితులు. లక్షలాది మందిని సమ్మోహితులని చేసే ప్రసంగ శక్తి ఆయనది.
ఐక్యరాజ్య సమితికి హైదరాబాద్ రాష్ట్రం నుంచి 90 లక్షల మంది దళితుల ప్రతినిధిగా హాజరయి, వారి సమస్యల గురించి ప్రపంచ స్థాయి ప్రతినిధుల ముందు శ్యాంసుందర సవివరంగా ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచ పత్రికలన్నీ పతాక స్థాయిలో ప్రచురించాయి. ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచి డైలీ ‘లీ మాండె’ మొదటి పేజీలో హోచిమెన్, శ్యాంసుందర్ ఫ్రెంచి ప్రధాని కలిసి ఉన్న ఫోటో, సంప్రదింపుల వివరాలు ప్రచురించిందని చెబుతారు. ప్రపంచ నాయకులతో వివిధ దేశాలలో వారి అతిథిగా శ్యాంసుందర్ గడిపారని, వారందరితో స్నేహ సంబంధాలు ఉండేవని తెలుస్తోంది. చౌ ఎన్ లై మన దేశాన్ని తొలిసారి సందర్శించినపుడు, ఆయన ప్రధాని నెహ్రూతో, హైదరాబాద్‌లో శ్యాంసుందర్ అనే మిత్రుణ్ణి కలవాల్సి ఉందని తె లిపారట.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో శ్యాం సుందర్‌ను ఢిల్లీ రప్పించారట. ప్రపంచ స్థాయి మేధావులు హెరాల్డు, జెలాస్కీ, జీన్ పాల్ సారె్త్ర వంటి వారితో శ్యాంసుందర్‌కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. వీటన్నింటి వివరాలు తెలియాంటే ఆనాటి సమకాలీన పత్రికలు, ప్రాంతాలు, ఆధారాలు దొరకబుచ్చుకోవాలి. ఇదంతా సులభ సాధ్యం కాదు. ప్రభుత్వపరంగా ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి చేయాల్సిన బాధ్యత ఇది.
ఈ దేశంలో వాస్తవమైన దళిత ఉద్యమం ఏదయినా ఉందంటే అది శ్యాం సుందర్ 1948లో ప్రారంభించిన భీం సేన. సుశిక్షితులైన మిలిటెంట్ అంకిత భావం కలిగిన దళిత యువతను ఇందులో సమ్మిళితం చేసి, వారి ఆచరణ ద్వారా విప్లవకర భావజాలంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలలో తమ ప్రభావాన్ని కొనసాగిస్తూ అంబేద్కర్‌కు వెన్నుదన్నుగా నిలిచారు. వాస్తవానికి భీంసేన కొనసాగించిన కార్యక్రమాలు మహారాష్ట్రలోని దళిత్ పాంథర్స్ ఉద్యమానికి మాతృకగా పనిచేసింది. తద్వారా యావద్భారతదేశ దళిత ఉద్యమానికి భీం సేన ఉద్యమం వేగుచుక్కగా పనిచేసింది.
వాస్తవాల మీద, న్యాయం పునాదుల మీద నిలబడి పీడిత వర్గాల పక్షాన పోరాడే ఆత్మరక్షణ దళంగా భీం సేనను శ్యాంసుదర్ తయారు చేశారు. భీం సేనకు ప్రణాళిక-నియమ నిబంధనలు తయారు చేసి వాటిని దళిత యువతరంలో విస్తృతంగా ప్రచారం చేసి సైనికులను తయారు చేశాడు. తరతరాలుగా సైనిక జాతిగా ఉండిన దళిత జాతితో మాజీ సైనికులతో భీంసేన సభ్యులకు తర్ఫీదునిప్పించారు. తనే స్వయంగా రాజకీయ సిద్ధాంతాల గురించి ప్రసంగాలు చేసేవారు. అంబేద్కర్ రచనలు విస్తృతంగా భీం సేన ప్రచారంలోకి తెచ్చింది. తమను తాము మూల భారతీయులుగా ఆయన ప్రకటించారు. తన మహత్తర రచన ‘మూల భారతీయులు‘లో దళితుల గురించి చెబుతూ ‘అనాగరికులైన ఆర్యుల రాకకు ముందు ఈ దేశాన్ని పాలించిన పాలకులం మేము. మేం మూల భారతీయులం ఎన్నటికీ హిందువులం కాము. సరికదా భారత దేశంలో హిందూ రాజ్యం ఏర్పడడానికి ఏ రకంగానూ సహకరించం.
అంతేకాదు హిందూ రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి ఏ అవకాశమొచ్చినా విడిచి పెట్టం’ అని అంటారు శ్యాం సుందర్. డాక్టర్ అంబేద్కర్ ప్రసిద్ధ రచన ‘కుల నిర్మూలన’లో ప్రతిపాదించిన సిద్ధాంతాలను శ్యాం సుందర్ మరింత విస్తృతపరచి ఎన్నో చారిత్రాత్మక గ్రంథాలను రచించడం జరిగింది. కర్ణాటకలో భీం సేన హిందూ కులోన్మాదుల ఆగడాలను అడ్డుకుంది. దళిత కులాల యువత తల పై కెత్తుకొని నడిచే ఆత్మస్థైర్యాన్నిచ్చింది. దళితులు చైతన్యవంతులవడంతో భూస్వామ్యవర్గాలయిన లింగాయత్, గౌడ వర్గాలు దళితుల పట్ల అత్యాచారాలు చేసేందుకు జంకారు.
దళిత-ముస్లిం ఐక్య సంఘటన అనేది దేశంలోనే ఒక వినూత్నమైన అత్యవసర విముక్తి సిద్ధాంతంగా, శ్యాంసుందర్ మేధోశక్తికి ప్రతీకగా నిలిచింది. సమాజపు అట్టడుగు చీకటి కోణం నుంచి ఎంతో శ్రద్ధాసక్తులతో పరిశోధించడం మూలంగా, ఈ రెండు జాతులు అణచివేతకు గురయి, నేడు ఒకే రకమైన సామాజిక అసమానతలకు లోనయ్యారని శ్యాంసుందర్ ఆధారాలతో నిరూపించడం జరిగింది. దేశ చరిత్రలో నిరంతరం పీడింపబడ్డ ఈ రెండు జాతులు ఐక్యమై ఒక బలీయమైన శక్తిగా ఎదిగి, సామాజిక ఆర్థిక విప్లవాన్ని వేగవంతం చేసి భారత దేశ నిజమైన విప్లవాన్ని విజయవంతం చేయాలనేది శ్యాం సుందర్ కోరిక. దళిత సమస్యకు పరిష్కారం కనుక్కొనే మార్గంలో భాగంగా ముస్లింలను మిత్ర సహిత బంధంగానూ, హిందూ అగ్రకులాలను శత్రుపూరితంగానూ సిద్ధాంతీకరించాడు. దానితో సనాతన హిందువులు శ్యాంసుందర్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు.హైదరాబాద్ విలీనం అనంతరం ఆయన మీద కేసులు పెట్టి అరెస్టు చేసి శారీరకంగానూ, మానసికంగానూ హింసకు గురిచేశారు. ఏటికి ఎదురీదడం, సమాజ రుగ్మతల మీద పోరాడడం విప్లవకారుల కర్తవ్యం. ఆ బాధ్యతను శ్యాం సుందర్ సమర్ధంగా నిర్వర్తించారు. హిందూ కులవాదులు ఆయన మీద బనాయించిన కుట్ర కేసుకు ఆయన సమాధానంగా ‘సజీవ దహనం’ అనే గ్రంథాన్ని రచించారు. అందులో దళితులు హిందువులు కారనే చారిత్రక వాస్తవాన్ని సజీవ సాక్ష్యాలతో భారత న్యాయస్థానానికి, తద్వారా యావద్భారత ప్రజానీకానికి బహిరంగంగా వెల్లడి ంచారు. శ్యాం సుందర్ అభిప్రాయం ప్రకారం పీడిత జాతులకు, దళిత వర్గాలకు మతం ఎలాంటి పరిష్కారాన్ని చూపలేదు. చూపదు. కనుక మత వ్యవస్థ అనేది తిరోగమన మార్గం. కేవలం మతం మార్చుకున్నంత మాత్రాన దళితులకు సంబంధించిన సామాజిక, ఆర్థిక రాజకీయ సమస్యలు తీరుతాయని ఆయన భావించలేదు. మూల భారతీయులైన దళితులకు మతమనేది లేదు. కేవలం ముస్లింలను, క్రిస్టియన్లను ఎదుర్కోవడం కోసం సంఖ్యాబలం కోసం దళితులను హిందువులుగా సనాతన హిందువులు కోరుతున్నారు. ఇది రాజకీయంగా హిందువులకు అవసరం. హిందూ మహాసభ దేశంలో కుల నిర్మూలనా సంఘాలు స్థాపించడం వెనుక అసలు ఉద్దేశం ఇదే. వీరి తొలి కార్యక్రమం దళితులకు హిందువులమనే స్పృహ కలిగించడం. తర్వాత దేవాలయ ప్రవేశం లాంటి పై పై పూతలు, వీటివల్ల దళితుల ఆర్థిక సామాజిక రాజకీయ వివక్ష, తరతరాల వెనుకబాటుతనం పోతాయా? శ్యాం సుందర్ హేతుబద్ధమైన తీవ్ర వాదనల ద్వారా, రచనల ద్వారా గొప్ప చర్చను లేవదీశారు. కానీ ఆయన రచనలన్నీ నేడు చార్వాకులు రచనల్లా చీకటిలో చిదిమి వేయబడ్డాయి. వాటిని దొరకబుచ్చుకునే ప్రయత్నం మన తరమన్నా చేయగలిగితే, ఒక మేధావి అంతరంగాన్ని, దేశ సమస్యలపై ఆయన వైఖరిని, వివిధ రకాల మార్గాంతరాలను మనం తెలుసుకోగలం. తద్వారా ఆయన ఉద్యమించిన చరిత్ర బహిర్గతపరచగలుగుతాం. కర్ణాటక విధానసభలో సభ్యునిగా శ్యాం సుందర్ కానసాగినంత కాలం పీడితుల పక్షాన చిచ్చర పిడుగులా పోరాడారు. కర్ణాటక శాసనసభలో నిమ్న వర్గాలకు విద్యా భూసంస్కరణలకు సంబంధించి విస్తృతంగా చర్చించినట్లు ఆయన సమకాలికులు ఇప్పటికీ చెబుతుంటారు. కర్నాటక రాషా్ట్రనికి భూ సంస్కరణల మార్గదర్శిగా శ్యాం సుందర్‌ని పేర్కొంటారు. ఆయన శాసనసభలో చేసిన కీలకమైన ఉపన్యాసాలను కన్నడంలో ముదించడం జరిగింది. కర్ణాటకలో ఆయన స్థాపించిన భీం సేన బలవత్తరమైన విముక్తి సేనగా రూపుదిద్దుకుంది. శ్యాం సుందర్ నేతృత్వంలో మెరికల్లాంటి దళిత యువకులు వేలాది మంది సుశిక్షితులుగా మారిన చరిత్ర ఉంది. శ్యాంసుందర్ మహారాష్ట్రలో పర్యటిస్తున్నప్పుడు బొం బాయిలోని ఒక దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, భీంసేనను కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే 10వేల మంది సభ్యులు ఉన్నట్లు, సభ్యులంతా నెలకు పదిపైసలు చెల్లిస్తారనీ, మొత్తం దేశవ్యాప్తంగా రెండు లక్షల మంది సభ్యులుంటారని తెలిపారు. మాజీ సైనికులతో స్వయం రక్షణకు సంబంధించి సైనిక శిక్షణను భీం సేన సభ్యులకు అందజేశారు. భీం సేనకు తన సొంత రాజ్యాంగం, జెండా, అజెండా ఉన్నా యి. నిమ్న వర్గాల మీద, దళితుల మీద ఎక్కడ అకృత్యాలు, అత్యా చారాలు జరిగినా భీం సేనకు సమాచారం తెలిసిన వెంటనే అక్కడి ప్రజలకు సహకారంగా రంగంలోకి దిగేది. ఈ సంస్థ కాన్షీరాం తర్వాత కాలంలో స్థాపించిన బాంసెఫ్‌కు మాతృకగా అనిపిస్తుంది శ్యాం సుందర్‌కు దేశవ్యాప్తంగా రాజకీయ రంగంలో మిత్రులుండేవారు. ఆయన బెంగుళూరులో బస చేసినపుడు వి.వి.గిరి, దేవరాజ్ అర్స్, ఉమా శంకర్ దీక్షిత్ లాంటి వాళ్ళు ఎక్కువగా కలిసేవాళ్లు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరంసింగ్, ఎస్.యం.కృష్ణ లాంటి వాళ్ళు మల్లిఖార్జున్ ఖర్గె, మొయిలీ లాంటి వాళ్ళు ఆయనకు శాసనసభలో యువ సహచరులు. ఎందరో యువ శాసనసభ్యులు శ్యాం సుందర్ ఉపన్యాసాలను, ఆయనతో సాహచర్యాన్ని అభిలషించేవారు. ఆయన గంటల తరబడి దళితుల వెనుకబడిన వర్గాల, మైనారిటీల సమస్యల గురించి చర్చిస్తున్నపుడు వారు ఉత్తేజంతో ఆయన అనుయాయులుగా ఉండేవారని చెబుతారు. హిందీ, ఆంగ్ల, ఉర్దూ, కన్నడ, తెలుగు భాషల్లో ఆయన రచనలు వెలువడ్డాయి. ‘భూ దేవతోంకా మేనిఫెస్టో’, ‘దే బర్న్’, భీం సేన అవర్ పాస్ట్ అండ్ ప్రజెంట్’ ముఖ్యమైన రచనలు అనేకం ఉన్నాయి. శ్యాం సుందర్ లాంటి అనితర సాధ్యమైన విప్లవ కారులు, మేధావులు అరుదు. సమాజం వారిని సరైన రీతిలో అర్థం చేసుకోకపోవడమే కాకుండా, వారి జీవితకాలంలో సరయిన గుర్తింపును కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరం. దేశంలో వర్గం, కులం అని విడదీయబడిన శక్తులు చావోరేవో తేల్చుకొనే పరిస్థితి ఏర్పడింది. సమైక్యతకు గండిపడి, అగ్ర కులాల చేతుల్లో అధికారం కేంద్రీకరించబడిన స్థితిలో దళితులు, మైనారిటీలు, వెనకబడిన కులాలు తమ స్థైర్యాన్ని కోల్పోతున్నాయి. నేడు సనాతన సిద్ధాంతాలు వివిధ రూపాలలో విజృంభిస్తున్నాయి. ఇలాంటి సంక్షుభిత స్థితిలో శ్యాం సుందర్ లాంటి వారి ఆలోచనలు, రచనల అవసరం ఉంది. - ఎ.ఎన్. నాగేశ్వర రావు (నేడు బత్తుల శ్యాంసుందర్ జయంతి)
Andhra Jyothi Telugu News Paper Dated: 21/12/2014
|
Saturday, December 20, 2014
మనం మరిచిన ‘మూల’ యోధుడు (శ్యాం సుందర్) - ఎ.ఎన్. నాగేశ్వర రావు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment