వేలాది సంవత్సరాలుగా ఈ దేశంలోని మనిషికి పట్టిన మైలను శుభ్రం చేస్తూ, సాటి మనిషి అశుద్ధాన్ని సైతం ఎత్తిపోస్తున్న మట్టిమనుషులను ఇంకా అంటరానివారుగానే చూస్తోన్నవారి మెదళ్లను క్లీన్ చేయడానికి ఘనమైన ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దేశంలోని కుల వ్యవస్థను నిర్మూలించడమే అసలైన స్వచ్ఛ భారత్‌గా మారుతుందన్న సత్యాన్ని ఈ పాలకులు ఎప్పటికి గుర్తిస్తారు? కుల నిర్మూలన మాని కులోద్ధరణకు పాటుపడుతున్న ప్రభుత్వాలనే మేం ఇంకా నమ్ముతున్నాం.
‘జయంతులనాడు వచ్చినవాడు వర్ధంతులనాడే కనిపిస్తాడ’ని సామెత!! ఇప్పుడు మీ విషయంలో అదే జరుగుతుంది సాహెబ్! మీ జయంతి, వర్ధంతి వేడుకలు కూడా అదే రీతిగా మారిపోయాయి మహాత్మా అంబేద్కరా!! మీరు పుట్టిన ఏప్రిల్ 14న, చనిపోయిన డిసెంబర్ 6వ తేదీలను ఘనంగా జరుపుకుంటున్నాం. నిన్నా మొన్నటి దాకా ఇందులో ఏప్రిల్ నెలను పండుగ మాసంగాను, రెండో సందర్భాన్ని విషాదంగానే అయినా ఘనంగానే స్మరించుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు, పాలకులు, రాజకీయానాయకులకు ఈ రెండు రోజులూ పండుగ రోజులుగా మారాయి. మాకూ అలాగే తయారయ్యాయి. కొందరైతే వాటిని ఎందుకు జరుపుకుంటున్నారో, సందర్భమేమిటో కూడా తెలియకుండా జరుపుకుంటున్నారు. జయంతిని వర్థంతి అంటారు... వర్థంతిని జయంతి అంటారు. ఏదన్నా మీ కోసమేనంటారు. మా గురించి ఎప్పుడూ మాట్లాడని వాళ్ళూ ఈ రెండు రోజులు తెగ మాట్లేడేస్తారు.
అసలు మీ కోసమే తమ జీవితాలు, పరిపాలన అన్నట్లుగా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తారు. మిమ్మల్ని ఒకనాడు దేశద్రోహి అన్నవాళ్లకు మీరిప్పుడు దేశభక్తుడుగా కనిపిస్తున్నారు... అంటరానివాడు అన్నవాళ్లకూ ఆరాధ్యదైవమయ్యారు. ఏమైనా అందరి నోళ్లలో అంబేద్కర్ ఆలాపనే! ఏం చేస్తాం! కమ్యూనిస్ట్లు నుంచి హిందూ కుల వాదుల దాకా అందరికి ఇప్పుడు మీ అవసరమే మరీ! అందుకే మిమ్మల్ని ఓన్ చేసుకోకుండా ఉండలేకపోతున్నారు. ‘అలాంటి వారంతా నా వేడుకలు ఘనంగా చేస్తున్నారు. మరీ నా వారసులుగా మీరేం చేస్తున్నారు నా కోసం?’ అని మాత్రం అడగకండి. ఎందుకంటే మిమ్మల్ని మేం ఎప్పుడో మరిచిపోయాం.. ఒక్క ఫోటోకు దండేసి దండం పెట్టడం.. ఊరూరా, వీధివీధినా మీ విగ్రహాలు ప్రతిష్ఠించడం తప్ప... అసలు మీరు మా కోసమే పుట్టారని మేం గుర్తుంచుకుంటే గదా! మిమ్మల్ని స్మరించుకోవడానికి. మీరు మా కోసమే జీవితాన్ని ధారపోశారని తెలిస్తే గదా,! మీ ఆశయాలను కొనసాగించడానికి! ఇంతకంటే ఇంకేం కృతఘ్నత కావాలి?
హిందూ కుల వ్యవస్థ మనుధర్మ శాసనాలకు బలై.. మూతికి ఉంత, నడుముకు చీపురు... ఎక్కడో ఊరికి దూరంగా విసిరేసినట్లు.. జంతువులుగా కూడా బతుకలేని మాకు.. బతుకంటే ఎంటో చూపించి సమ సమాజంలో ఆత్మగౌరవంతో జీవించేందుకు రాచబాటలు వేసిన మీకు... మీ ఆశయాలు, ఆదర్శాలకు ముళ్లబాటలు వేశాం.. మనిషిని మనిషిగా కూడా చూడలేని ఏ సమాజానికి వ్యతిరేకంగా తుదికంటా పోరాడారో... ఇప్పుడదే వ్యవస్థలో అంటకాగిపోతున్నాం. రాజ్యాధికారంలో వాటా పొందడం మాట అటుంచి మాకు అన్యాయం జరిగినప్పుడు కూడా ఒక్కటిగా నిలబడలేకపోతున్నాం. పైగా మాలోని ఒక్కో గ్రూపు ఒక్కోసారి ఒక్కో అగ్రకులానికి వత్తాసుపలుకుతూ వారి అడుగుల్లో అడుగులేస్తూ వారినే అందలమెక్కించడానికి ఎంతటి శ్రమనైనా ఓర్చు కుంటోంది. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి. పోతున్నాయి. అయినా మా బతుకులు మాత్రం ఏ విధంగానూ మారడం లేదు. ఏవీ కూడా మీ పేరు చెప్పకుండా పుట్టని పార్టీ. సంఘం లేదంటే అతిశయోక్తి లేదు. ఐక్యతను పక్కనబెట్టి విడివిడిగా మీ పేరుతో ఇలా రోజుకో గ్రూపు మీ లోనుంచి పుట్టుకొస్తుంటే దీన్ని చైతన్యమనాలో... అవివేకమనాలో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం.
దేశ విదేశాల రాజ్యాంగాలను తిరగేసి ప్రపంచంలోని పార్లమెంటరీ ప్రజాస్వామిక దేశాలకే ఆదర్శంగా అందించిన రాజ్యాంగాన్నే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి ఈ ప్రభుత్వాలు. మీరు ప్రసాదించిన హక్కులు, అవకాశాలు రాజ్యాంగం అమలైన 64 ఏళ్ళలో ఏవీ సరిగ్గా, చట్టబద్ధంగా అమలుకు నోచుకోలేదు. ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉన్న వర్గాలతో మేము పోటీపడలేమని అందుకు రిజర్వేషన్లు కల్పించారు. పాలకుల స్వార్ధ బుద్ధి, కుల రాజకీయాల వల్ల ఆరు దశాబ్దాలైనా అవి సక్రమంగా అమలుకాక, అమలైనవి కూడా అందాల్సిన వారికి అందకుండా పోతున్నాయి. మాలో కూడా అందుకున్న వాళ్లే అనుభవిస్తూ.. అత్యంత వెనకబడినవాళ్లకు అందడం లేదు. ఫలితంగా మాలో కూడా అంటరానివాళ్ళలోనే అంటరానివాళ్ళు పుట్టుకొస్తున్నారు. చమర్, మహార్, మాల, మాదిగలంటూ మా మధ్యే గోడలు, ఎన్నటికీ తేలని గొడవలు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే మాకిచ్చే అవకాశాల పరిధిని పెంచాలని పోరాడుతున్నాం కానీ అందరం సమానంగా పంచుకోవడానికి మాత్రం వెనకడుగు వేస్తున్నాం. చివరికి రిజర్వేషన్లు అనేవి లేకపోతే మాకు బతుకులు లేవన్న పరిస్థితి కొచ్చేశాం. మీరిచ్చిన అవకాశంతోనే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి గొప్ప గొప్ప చదువులు చదువుకుంటున్నాం. మేధావుల్లా చలామణి అవుతున్నాం. అయినా సంకుచిత బుద్ధిని వీడటం లేదు.
రాజకీయ రిజర్వేషన్లతో రాజ్యాలేలుతున్నాం. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులనే పదవులు అనుభవిస్తున్నాం. అయినా మా జీవితాల్లో మార్పులు రావడం లేదు. ఎందుకంటే మీరు చెప్పిన సమాజాన్ని మరచిపోయాం కాబట్టి. ఎన్నికల సమయంలో అధికారికంగా అఫిడవిట్లో సమర్పించే లెక్కల్లో కూడా మనవాళ్లే ముందున్నారు. కానీ ఏం లాభం ‘అదిగో మావాడు కోట్లు సంపాదించాడు’ అని తప్ప గర్వంగా చెప్పుకునేంత పనులేం చేయడంలేదు వారు. వారు జాతి పేరు చెప్పుకునే బాగుపడుతున్నారు, బలపడుతున్నారు. వారు సంపాదించిన సంపదలో కనీసం పది శాతం కూడా తమ జాతికోసం ఖర్చు పెట్టకుండా మీరు బోధించిన ‘పే బ్యాక్ టు ద సొసైటీ’కి తూట్లు పొడుస్తున్నారు. సర్వసమస్యలకు పరిష్కారమని మీరు చెప్పిన రాజ్యాధికార ‘మాస్టర్ కీ’ని ఎప్పుడో పోగొట్టుకున్నాం. మేం కూడా అగ్రవర్ణాల్లాగే పూటకో మాట, రోజుకో కండువా కప్పుకొని చపలచిత్త మనస్తత్వంతో కాలం వెళ్లదీస్తున్నాం. ‘కులం పునాదుల మీద జాతిని గానీ, నీతినిగాని నిర్మించలేం’ అని మీరంటే వాటి మీదే అధికార బురుజులు నిర్మిస్తున్న వారితోనే చేతులు కలిపి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాం. ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి అగ్రకులాల పంచన చేరి... వారు విదిల్చే తాయిలాల కోసం కాచుక్కూర్చుంటున్నాం. అగ్రకులాల చేతుల్లో ఆటబొమ్మలుగా మారిపోయాం.
హిందుత్వ-మనువాద పునాదితో బాధ్యతలు చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని స్వచ్ఛంగా మారుద్దామనుకుంటున్నారు. అందుకోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యానికి మంచిదే. కానీ వేలాది సంవత్సరాలుగా ఈ దేశంలోని మనిషికి పట్టిన మైలను శుభ్రం చేస్తూ, సాటి మనిషి అశుద్ధాన్ని సైతం ఎత్తిపోస్తున్న మట్టిమనుషులను ఇంకా అంటరానివారుగానే చూస్తోన్నవారి మెదళ్లను క్లీన్ చేయడానికి ఘనమైన ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దేశంలోని కుల వ్యవస్థను నిర్మూలించడమే అసలైన స్వచ్ఛ భారత్‌గా మారుతుందన్న సత్యాన్ని ఈ పాలకులు ఎప్పటికి గుర్తిస్తారు? కుల నిర్మూలన మాని కులోద్ధరణకు పాటుపడు తున్న ప్రభుత్వాలనే మేం ఇంకా నమ్ముతున్నాం. ఏ జెండా పు(ప)డితే ఆ జెండా పట్టుకు వేలాడుతున్న మాతో.. ‘మీ కంటూ ఒక జెండా అజెండా ఉందన్న’ సంగతి చెప్పేదెవరు తండ్రీ! ఇప్పటికీ మిమ్మల్ని అన్యాయంగా పక్కనబెట్టినా, మీ పేరే చెప్పుకుంటూ.. కూర్చున్న కొమ్మలనే నరుక్కుంటున్న అజ్ఞానపు అవివేకంతో దారితప్పిన గొర్రె పిల్లల్లా తలోదిక్కున వెళ్తున్న మమ్మల్ని మన్నించుమనే అర్హత కూడా లేదేమో! రోజురోజుకీ రూపం మార్చుకుంటూ ఆధునిక భారతాన్ని బలి తీసుకుంటున్న కులకోరల్ని నలిపేయడానికి, దారీ తెన్నూ లేకుండా ఆగమైపోతు న్న నీ జాతిని పెడదోవనుంచి విడిపించి, మీరు సూచించిన మా ర్గంలో నడిపించడానికి, మళ్లీ ఎప్పుడు పుడ్తావ్ బాబా సాహెబ్!?
- కొంగర మహేష్
రీసెర్చ్ స్కాలర్, ఓయూ
(రేపు బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి)
Andhra Jyothi Telugu News Paper Dated: 05/12/2014
|
Friday, December 5, 2014
మన్నించు బాబా సాహెబ్! By కొంగర మహేష్
Labels:
కొంగర మహేష్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment