Tuesday, February 16, 2016

‘దళిత’ అక్షరానికి దారులు వేసిన పుస్తకం! By Sangishettey Srinivas

‘దళిత’ అక్షరానికి దారులు వేసిన పుస్తకం! 
15-02-2016 00:38:06

గుడిలోన మీపూజ గుడిబైట మాపూజ/ ఎన్నాళ్ళు! చేతుమో అన్నినాళ్ళు! /వూరిలో మీ బావి - వూరికావలిమాది/ ఎన్నాళ్ళు! వుండునో అన్నినాళ్ళు! / బడిలోన మీవారు -బడియెదుట మావారు / ఎన్నాళ్ళు! వుందురో అన్నినాళ్ళు! / నట్టింట మీతిండి -నడివీధిలో మాకు / ఎన్నాళ్ళు! పెడుదురో అన్నినాళ్ళు! / పోదు యీ అంటు జాఢ్యము పోదుపోదు / రాదు మతవర్గ రహిత సామ్రాజ్యమింక / పంచములతోడ బాంధవ్యముంచకున్న / హృదయ పరివర్తనంబు చేనొదవునన్న? అంటూ హైదరబాద్‌ కేంద్రంగా దళిత సాహిత్యోద్యమానికి దారులు వేసిన దార్శనికుడు శంకర్‌దేవ్‌. మొత్తం భారతదేశంలో ‘దళిత’ పదాన్ని సాహిత్య రంగంలో మొదటిసారిగా వాడింది కూడా ఈయనే! సమాజ పరంగా దళిత పదాన్ని ‘అంటరాని’ వారినుద్దేశించి ఫూలే, అంబేద్కర్‌లు చాలా ముందే వాడినప్పటికీ సాహిత్య రంగంలో ఆ పదాన్ని మొదట వాడింది హైదరాబాద్‌ సాహిత్యకారులే! ఇప్పటి వరకు సాహిత్య చరిత్రలో దళిత అనే పదాన్ని మొదటిసారిగా వాడింది 1958లో అని రికార్డయింది. ఈ పదం చాలా పాపులర్‌ అయింది మాత్రం 1972లో ‘దళిత్‌ పాంథర్స్‌’ రచనల మూలంగా అని చరిత్ర చెబుతుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సాహిత్యాన్ని పరిగణనలోకి తీసుకొని ‘దళిత’ చరిత్రను తిరగరాయాల్సి ఉంది. ఇప్పుడు కొత్తగా అందుబాటులో ఉన్న సాహిత్యాన్ని ఆధారంగా చేసుకొన్నట్లయితే 1954లోనే తొలిసారిగా సాహిత్యంలో ‘దళిత’ అనే పదం వాడింది హైదరాబాద్‌కు చెందిన మాజీ మంత్రి శంకరదేవ్‌ అని రుజువవుతుంది.
 
పాత హైదరాబాద్‌ రాజ్యంలోని బీదర్‌కు చెందిన శంకర్‌దేవ్‌ మొదటి నుంచి ఆర్యసమాజ్‌ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అందుకే పేరు చివర విద్యాలంకార్‌ అని కూడా పెట్టుకున్నాడు. బీదర్‌-హైదరాబాద్‌ కేంద్రంగా అస్పృశ్యతా నివారణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అటు సామాజిక, రాజకీయ రంగాలతో పాటు సాహిత్య రంగంలో కూడా తనదైన ముద్రవేసిండు. బీదర్‌ నుంచి హైదరాబాద్‌ అసెంబ్లీకి శాసనసభ్యుడిగా ఎన్నికై బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖని నిర్వహించాడు. ఆ తర్వాత కర్నాటక-బీదర్‌ నుంచి మూడు సార్లు కాంగ్రెస్‌ పార్టీ తరపున పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికయిండు. శంకరదేవ్‌ ఆర్యసమాజ్‌, ముఖ్యంగా కేశవరావు కోరట్కర్‌ ప్రభావంతో, గాంధీ/ అంబేద్కర్‌ స్ఫూర్తితో ‘దళిత సారస్వత పరిషత్తు’ని హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ కేంద్రంగా ప్రారంభించారు. ఆ తర్వాత దీని కేంద్రకార్యాలయం దోమలగూడకు మారింది. ఈ సారస్వత పరిషత్తు వారు అంటరానితనాన్ని నిర్మూలించేందుకు సాహిత్యాన్ని వాహికగా చేసుకొని తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనేక పుస్తకాలు ప్రచురించారు. ‘సేవక్‌’ పేరిట తెలుగు, ఇంగ్లీషు భాషల్లో సామాజిక పక్షపత్రికను ప్రచురించారు. ఇక్కడ ‘దళిత’ పదం గురించి కొంచెం వివరణ అవసరం. నిజానికి దళిత అనే పదం మొదట్లో అణగారిన వర్గాలందరికీ వర్తించేది. అయితే అది రాను రాను భారత సమాజంలో ‘అంటరాని’ తనాన్ని అనుభవిస్తున్న వారికి మాత్రమే పరిమితమైంది. మరాఠీ భాషలో దళిత అంటే బ్రోకెన్‌ లేదా విధ్వంసమైన. జ్యోతిరావు ఫూలే మొదట ఈ ‘దళిత’ అనే పదాన్ని వాడుకలోకి తెచ్చారు. సమాజంలో అత్యంత వెనుకబడిన, కుల వివక్షతకు గురవుతున్న అతిశూద్రులను ‘దళిత’ అనే పేరుతో ఫూలే గౌరవించాడు. (ఎలీనార్‌ జీలియట్‌, 1992). ఆ తర్వాత 1888లో ఫూలే కాలంలోనే ఆయన అనుయాయి, సత్యశోధక్‌ సమాజ్‌లో చురుకైన నాయకుడు మహర్‌ కులానికి చెందిన గోపాల్‌ బాబా వాలంగ్‌కర్‌ ‘దళిత’ అనే పదాన్ని ఇప్పుడున్న అర్థంలో వాడాడు. ‘అనార్య దోష్‌ పరిహారక్‌ మండల్‌’ తరపున మహర్‌, చమార్‌లను సంఘటితం చేసి వర్ణవివక్షతకు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ఈ పదాన్ని ఉపయోగించాడు. (ఫిలిప్‌ కానిస్టేబుల్‌; 1997) The term dalit in Sanskrit is both a noun and an adjective. As a noun, dalit may be used for all three genders, masculine, feminine, and neuter. It has been derived from the root dal which means to crack, open, and split, and so on. When used as a noun or adjective, it means burst, split, broken or torn asunder, downtrodden, scattered, crushed, destroyed. (Massey; 1995) ‘దళిత’ అంటే ‘చెల్లా చెదురు’, ‘ఛిన్నాభిన్నం’, ‘నాశనమైన’, ‘ధ్వంసమైన’, ‘నలిగిన’, ‘అణగారిన’ ‘పీడిత’ అనే అర్థాలున్నాయని వామన్‌ శివరామ్‌ ఆప్టే తన 'The practical Sanskrit - English Dictionary' నిఘంటువులో చెప్పిండు. సాహిత్య రంగంలో మొట్టమొదటి సారిగా 1958లో బొంబాయి (ముంబయి)లో జరిగిన మహారాష్ట్ర దళిత సాహిత్య సంఘం సమావేశాల్లో ఈ పదాన్ని ఉపయోగించారు. 'To me, Dalit is not a caste. He is a man exploited by the social and economic traditions of this country. He does not believe in God, Rebirth, Soul, Holy Books teaching separatism, Fate and Heaven because they have made him a slave. He does believe in humanism. Dalit is a symbol of change and revolution’ (quoted in N.R. Inamdar. Contem-porary India, Poona, 1982). 1930వ దశకం నుంచి ‘దళిత’ పదాన్ని అంబేద్కర్‌ సామాజికంగా అణచివేతకు, అస్పృశ్యతకు గురైన వారికి ఉపయోగించడమే గాకుండా ప్రచారంలోకి తీసుకొచ్చాడు. ఏది ఎట్లున్నా 1970వ దశకంలో మరాఠీలో ‘దళిత్‌ పాంథర్‌’ వుద్యమంతోనే ఈ పదం విస్తృతమయింది. ఈ వుద్యమ ప్రభావంతో మరాఠీలో చాలా సాహిత్యం వెలువడింది. 1972లో రాజా ధలేతో కలిసి నామ్‌దేవ్‌ దస్సాల్‌ దళిత్‌ పాంథర్స్‌ ని స్థాపించాడు. మిలిటెంట్‌గా నడిచిన ఈ సంస్థకు అమెరికన్‌ ‘బ్లాక్‌ పాంథర్స్‌’ స్ఫూర్తి. బాబూరావ్‌ బగుల్‌, శంకర్‌రావు కారత్‌ రాసిన కథలు తర్వాతి తరానికి స్ఫూర్తిగా నిలిచాయి. దయాపవార్‌, త్రయంబక్‌ సప్కలేలు ఎంతో దళిత కవిత్వాన్ని సృజించారు. వీరి రచనలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తించబడ్డాయి, మెప్పుని పొందాయి. (జీలియట్‌, ఇంట్రొడక్షన్‌ టు దళిత్‌ పొయెట్రీ; 1982). దళిత్‌ పాంథర్స్‌లో మహిళలు కూడా ఉన్నారు. హీరా బానిసోడ్‌, జ్యోతి లంగేవార్‌, కుముద్‌ పావడేలు ఇందులో ప్రముఖులు. (చల్లపల్లి స్వరూపరాణి, ఇపిడబ్ల్యు- ఏప్రిల్‌ 25- మే 31- 1998)
 
దళితులు అనే పదం ఒక కులానికి పరిమితమైన పేరు కాదు. అది ఒక సమూహం యొక్క అస్తిత్వం. వేలయేండ్లుగా అవమానానికి, హేళనకు గురైన పదాల స్థానంలో తమ ఆత్మగౌరవాన్ని సాధించుకునేందుకు, కాపాడుకునేందుకు ‘దళిత’ అనే పదాన్ని సమాజంలో అణచివేత, హింసను అనుభవించిన వారు ముందుకు తీసుకొచ్చిన పదమిది. దళిత్‌పాంథర్స్‌కు మార్గదర్శి, మరఠ్వాడా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ గంగాధర్‌ పంత్వానే దళిత పదాన్ని ఇలా నిర్వచించాడు. ‘‘దళిత అనేది కులం కాదు. సామాజికంగా, ఆర్థికంగా, సంప్రదాయాల పేరిట అణచివేతకు గురైనవాడు. వాడు దేవుడు, పునర్జన్మ, ఆత్మ, విభజన వాదాన్ని ప్రేరేపించే గ్రంథాల్ని నమ్మడు. కర్మ, స్వర్గం అనే వాటిని కూడా నమ్మడు ఎందుకంటే ఈ నమ్మకాలన్నీ అతణ్ణి బానిసగా తయారు చేశాయి. అతడు మానవత్వాన్ని నమ్ముతాడు. దళిత అంటేనే మార్పుకు, విప్లవానికి ప్రతీక’’. ఈ విషయాన్ని జీలియట్‌(2001)కు రాసిన లేఖలో పంత్వానే వివరించాడు.
 
నిజానికి ‘దళితులు’ అనే పదాన్ని వెనుకబడిన తరగతులు, ఆదివాసీలు, గిరిజనులు, షెడ్యూల్డ్‌ కులాల వారు ఇంకా చెప్పాలంటే కుల పరంగా పీడన, అణచివేతను, వివక్షతను, హేళనను ఎదుర్కుంటున్న వారందరికీ కలిపి ఈ పదాన్ని గతంలో వాడిండ్రు. మహారాష్ట్రలోని ‘దళిత్‌ పాంథర్స్‌’ ఉద్యమం, ఆంధ్రప్రదేశ్‌లోని ‘దళిత మహాసభ’, ఇంటర్నేషనల్‌ దళిత్‌ సాలిడారిటీ నెట్‌వర్క్‌, ‘దళిత్‌’ మానవ హక్కులు తదితర సంఘాలు, సంస్థలు ‘దళిత’ పదాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టాయి.
 
సాహిత్యంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ‘దళిత’ పదం వాడుక 1954లో వాడడం జరిగింది. అదీ తెలుగులో! హైదరాబాద్‌కు చెందిన శంకరదేవ్‌ అనే ఆర్యసమాజీయుడు ‘హరిజన శంఖారావం’ పుస్తకాన్ని వెలువరించాడు. ఈ పుస్తకం ‘దళిత సారస్వత పరిషత్తు’ తరపున వెలువడింది. ఈ పరిషత్తు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి పనిచేసింది. ఈ పుస్తకానికి శంకరదేవ్‌ ముందు మాటలో కూడా ‘దళిత’ అనే పదాన్ని వాడిండు. ‘‘ఈ కాలములో దళితులను సంఘటిత పర్చుట, సరియైన మార్గంలో నడుపుట, చాలినంత రాజకీయ విజ్ఞత చేకూర్చట నేటి సంఘనాయకుల ధర్మంగా వున్న కారణంతో ఈ చిన్న పుస్తకం ‘హరిజన శంఖారావం’ పేరుతో ప్రచురించడమైనది. పుస్తకము చిన్నదిగాను, శైలి సులభముగాను గ్రామీణ ప్రజానీకానికి చక్కగా అర్థమయ్యేటట్లు వ్రాయడమైనది. కాలము మారిపోగా, రాజకీయ సాధనాలకు ఈ దళితులను విభిన్న రాజకీయ పార్టీలు తమతమ కొరముట్లుగా వాడుకోదలచిన అదనులో, ఈ పుస్తకము హరిజనులకు, కనువిప్పుముగా ప్రకటించబడినది. (శంకరదేవ్‌;1954). 1950వ దశకం నాటికే దళితులను వివిధ రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని చూస్తున్నదనే అవగాహనతో ఈ పుస్తకం రాయడమైంది. ఈ పుస్తకంలో దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పేర్కొంటూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ రాసిన భారత రాజ్యాంగంలో దళితుల మేలుకోసం చేసిన చట్టాలను పేర్కొన్నారు. ‘‘సకల మానవకోటి సరి సమానత్వాన్ని, శంఖారవంబుతో చాటండి చాటండి!’’ అంటూ పిలుపునిచ్చాడు. ‘జాతి అభిమానానికై, జాతి ఉద్ధారణ కొరకు, ఎవరి రక్త నాళాలు ఉబుకుతున్నాయో, ఎవరి హృదయాల్లో ఆరని అగ్నిజ్వాలలు మండుతున్నాయో, అట్టి హరిజన యువకులకే యీ హితవులు, హెచ్చరికలు, ఉద్భోధలు’’ అంటూ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం నినదించాలన్నారు.
 
తే.గీ// నేను స్వేచ్ఛా విహారిని, లేని పోని/ బంధనములకు లోనగు వాడగాను /గగన మార్గాన నెగయం గలను భూమి / గర్భమును చీల్చుకొనిపోవ గలను నేను - అని తాను నినదిస్తూ తన తోటి వారందరిచేత అనిపించాడు. ఇంకా నిద్రావస్థలో ఉన్నట్లయితే నష్టం జరుగుతుందని హెచ్చరించిండు. మనలో అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌ లాంటి గొప్పవాళ్ళున్నారు. అవకాశం దక్కినట్లయితే అనేక మంది అలాంటి మహనీయులు తయారవుతారు. అది మీరే కావచ్చు అని దళితులను చైతన్యవంతుల్ని చేసేందుకు రాసిన ఈ వ్యాస సంకలనంలో అక్కడక్కడా పద్యాలు కూడా ఉన్నాయి. ‘నిలవండి నిలవండి,నిలచి పోరాడండి/ పారిపోతే పిరికి పందలంటారోయి/గెలవండి యిక ముందు గెలుపు మీదేనండి/పిలవండి నోరెత్తి దళిత జాతులనెల్ల/ కలసి, సంఘీభావబల పరాక్రమముతో (నిల)
 
‘మీకు విద్యాబుద్ధి లభియించునందాక/ మీ బానిసత్వాలు మాయమౌనందాక/ మీయిళ్ళు వాకిళ్ళు స్వవనీయమగుదాక/ మీ వెట్టి చాకిరీ మిము బాయునందాక/నిలవండి బలముతో నిలచి పోరాడండి’ - అని పాటలు రాసి ప్రచారం చేసిండు. దళితుల్లో ఐకమత్యావశ్యకతను విడమర్చి చెప్పిండు. ‘ఇంకోసారి మీకు హెచ్చరిస్తున్నాను. అది ఐకమత్యం. మీయింటిలోని చెత్తాచెదారాన్ని ఊడ్చే చీపురు సంగతి మీరెప్పుడైన విచారించారా? చీపురుకట్టలోని ఒక్క పుడకను విడదీసి, దానితో మీ యిల్లు ఊడిచచూడండి- వ్యర్థము. చెత్త ఎక్కడిదక్కడనే ఉంటుంది. సరే అనేక పుడకలను ఏకముగా చేర్చి ఊడ్చి చూడండి. మీ యిల్లు ఈషణ్మాత్రాన శుభ్రమైపోతుంది’’. దళితులకుపయోగ పడు చట్టాలు, ఆయా చట్టాల్లో వచ్చిన మార్పులు, భూమిపట్టాలు, ఉద్యోగాల్లో దళితులకు అమలవుతున్న రిజర్వేషన్లు, విద్యా రంగంలో ఉపయోగించుకోవాల్సిన వనరులు తదితర విషయాల్ని ఇందులో చెప్పిండు. మద్యపాన నిరోధ ప్రాధాన్యత కూడా విశదీకరించిండు. ప్రభుత్వం తరపున సీ్త్రలకు లభించాల్సిన వసతులు, ఆస్పత్రి సౌకర్యాలు, అధికారాలు, వారి ప్రస్తుత స్థితిగతులు కూడా శంకర్‌దేవ్‌ చర్చకు పెట్టిండు. ‘హైద్రాబాదు రాష్ట్రములోని ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకాలో, ప్రతి గ్రామములో దళితజాతికి సంబంధించిన రచనలు, గేయాలు, హరికథలు, బుఱ్ఱకథలు, నాటకాలు విరివిగా తయారు అవుతున్నాయి. మీలో వ్రాయగలిగిన వారుంటే, వ్రాయండి. దళిత సారస్వతాన్ని పెంపొందించండి. కవులు, గాయకులు, నటకులు, మీలో ఉంటే బయటికి రండి. మీకు చేయూత దొరుకును. ‘‘లెండోయి, లెండోయి, లెండోయి, లెండోయి/ దండు లేచిపోయే లెండోయి లెండోయి/ తేరు తరలిపోయే లెండోయి లెండోయి/ తెల్లవారిందాక, తెలివొంది లేవండి!!’’
 
‘‘మీ యిల్లు మీ వాడ మీ జీవితాలన్ని/ కూలి కుమిలిపోయే, గేళిపాలైపోయే/ కూడు గుడ్డలు లేక పాడైన గతమేమి/ గాఢనిద్రావస్త కప్పుకొన్నదిగాన, లెండోయి’’ ‘‘తూర్పు కొండలపైని సూర్యడుదయించాడు/ మారిపోతుంది భూమండలంబేకమై/ కులములు, గోత్రాలు, కలుములు, లేములు/ తలక్రిందులై విప్లవాలు దొరలెను గాన. లెండోయి’’ అంటూ పాటల ద్వారా చైతన్య పరిచిండు. దండు అనే పదాన్ని సాహిత్యంలోకి తీసుకొచ్చిండు. ఆంగ్లములో ‘దళిత్‌ లిటరేచర్‌ సొసైటీ’గా పిలువబడ్డ ఈ సంస్థ మేనేజర్‌గా శాసనసభ్యులు కళ్యాణరావు నిన్నే వ్యవహరించారు. మొదట పదివేల కాపీలతో ఈ పుస్తకాన్ని బాగ్‌లింగంపల్లి(హైదరాబాద్‌)లోని సుధాన ప్రింటరీ వాళ్ళు ముద్రించారు. ‘అమర సందేశం పేరిట’ గాంధీ ముఖచిత్రంతో రెండో పుస్తకాన్ని శంకర్‌దేవ్‌ హిందీలో రాసిండు. దీన్ని తెలుగులోకి సి.ఐ. అడ్రూస్‌, యం.జె.త్యాగరాజు అనే జంటకవులు అనువదించారు. ఈ వ్యాస సంపుటి 1955లో ప్రచురితమయింది. ఇందులో మొత్తం ఏడు వ్యాసాలుంటే ప్రతి వ్యాసం చివరలో అద్భుతమైన పద్యాలున్నాయి. ఈ పుస్తకానికి అప్పటి హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ముందుమాట రాస్తూ ‘‘.. దళిత సారస్వత పరిషత్తు ప్రచురణలు, సామాజిక చైతన్యతకు ఎంతయు వుపయుక్త పడతాయని, దళిత సారస్వత ప్రియులు మరీ మరీ యిట్టి గ్రంథాలు ప్రజానీకానికి అందించగలరని, తద్వారా సాంఘిక సమత సాధించగలరని నమ్ముచు ఈ గ్రంథాన్ని చదువరులకు సన్నిహిత పరుస్తున్నాను’’. ఈ పుస్తకం గురించి ‘మా రెండో పుష్పం’ పేరిట జంటకవులు ఇలా పేర్కొన్నారు. ‘‘ప్రకృతిలో ఏ ఫలమైనా ఆలస్యంగా లభ్యమౌతుంది. మా దళిత సారస్వత వనం లో పలురకాల భాష ఫల మహీరుహాల నాటు పెట్టితిమి. ఇప్పుడిపుడే తోట కాతకు మరలింది. ప్రపథమంగా మా తోటనుండి ‘హరిజన శంఖారవాన్ని’ అనేక ప్రాంతాలకుఎగుమతి చేసి వున్నాము. ప్రథమఫలం రుచితనానికి చదువందితలు యీ తోట ఫలాలనే యపేక్షిస్తున్న కారణంచేత యీ రెండో పుష్పాన్ని మీ చేతి కందిస్తువున్నాం’’. ‘పొలమున ధాన్యరాసుల బండ్లకెత్తించి/ తమవిగాతని వొందు దళిత ప్రజలు/బానెడు జున్నుపాలను బిండి మీదుచె/ తలదాల్చి కొనితెచ్చు దళిత ప్రజలు/ తనువును దేశ స్వాతంత్య్రతకై యర్పి/ తము సేయ పరుగిడు దళిత ప్రజలు/ రాజకీయా చదరంగ రంగపు పాచి/ కల రీతి వర్తించు దళిత ప్రజలు/ నిలువనీడలేక నీడలు కల్పించు/ తనకు లేని దానధర్మమిడును/ తిండిలేని వాని తినమంద్రుపస్తుండె/ దళితజాతికన్న లలితులెవరు?’ అంటూ ప్రశంసించాడు. 1955 నాటికే ఈ సారస్వత పరిషత్‌ తరపున తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో పుస్తకాలు ప్రచురించారు. అవి. 1. హరిజన శంఖారవం (తెలుగు), 2. హరిజన సంఘాల మాన్యువల్‌ (హిందీ), దళిత జాతీయ సంఘం దాని కర్తవ్యం (తెలుగు), 3. వాట్‌ అండ్‌ వై (ఇంగ్లీషు), అస్పృశ్యతా నివారణపై కరపత్రాలు, పోస్టర్లు (తెలుగు). వీటితో పాటు త్వరలో అచ్చుకానున్నవి పేరిట దళిత ప్రశ్నోత్తర చంద్రిక (తెలుగు), చిరంజీవి మనువుగానికి తాత (తెలుగు), హరిజన్‌ టుడే అండ్‌ టుమారో (ఇంగ్లీషు), నాటికలు, బుర్రకథలు, నాటకాలు తయారీలో ఉన్నాయి అని పేర్కొన్నారు. ఈ పుస్తకాల్లోని పద్యాలు, దళిత పదం గురించి ఇంతవరకు తెలుగు సాహిత్యంలో సరైన స్థానం దక్కలేదు. తగినంత చర్చ కూడా జరగలేదు. మరుగున పడ్డ తెలంగాణ, తెలుగు సాహిత్య చరిత్ర ముఖ్యంగా విస్మరణకు గురైన దళిత సాహిత్య చరిత్రను రికార్డు చేసుకోవడం ఈనాటి అవసరం. హైదరాబాద్‌ కేంద్రంగా 1956కు పూర్వం అనేక దళిత రచనలు వెలువడ్డాయి. కాని వాటికి తెలుగు సాహిత్య చరిత్రలో సరైన స్థానం దక్కలేదు. మల్లెల దావీదు రాసిన ‘అస్పృశ్యత’ కావ్యం మాదిగ మహనీయుడు ముదిగొండ లక్ష్మయ్యకు అంకితమీయబడింది. ‘అస్పృశ్యత’ అంశం మీద వెలువడ్డ ఈ కావ్యం గురించీ, రాజకీయ రంగంలో ఉంటూ, అచలబోధ చేస్తూ సమాజంలో రావాల్సిన మార్పుల్ని పేర్కొంటూ అరిగె రామస్వామి అనేక పద్యాలు రాసిండు. వీటన్నింటితోబాటు భాగ్యరెడ్డి వర్మ సంపాదకీయాలు, వ్యాసాలు, రచనలు కూడా పుస్తకాలుగా/పునర్ముద్రణ కావాల్సిన అవసరముంది. అప్పుడే తెలంగాణ లేదా తెలుగు దళిత సాహిత్యంపై సాధికారికంగా మాట్లాడ్డానికి వీలవుతుంది. ఆ ప్రయత్నంలో భాగమే ఈ వ్యాసం.
 
- సంగిశెట్టి శ్రీనివాస్‌
9849220321
Andhra Jyothi Telugu News Paper Dated: 15/02/2016 

No comments:

Post a Comment