Monday, April 4, 2016

జాతీయ నాయకుడు జగ్జీవన్‌రామ్‌ By డొక్కా మాణిక్యవరప్రసాద్‌ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీమంత్రివర్యులు


05-04-2016 00:42:02

స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఒకరిచ్చేవి కావు. ఆత్మబలంతో ఐక్య ప్రతిఘటనతో సాధించుకోవలసినవి.. అన్నాడు బాబూ జగ్జీవన్‌రామ్‌. ఈ వ్యాఖ్యలో జగ్జీవన్‌రామ్‌ ఆత్మ మనకు దర్శనమిస్తుంది. దళిత అణగారిన వర్గాలను ఉద్దేశిస్తూ తాము ఏ విధంగా సమాజాన్ని, జీవితాన్ని జయించాలో బాబూ జగ్జీవన్‌రామ్‌ చేసిన ఉద్భోద ఇది. 
జగ్జీవన్‌రామ్‌ స్వాతంత్ర్యోద్యమంలో సమరశీలంగా పాల్గొన్నారు. బెంగాల్‌ విభజన ప్రకంపనలు దేశమంతటా పరివ్యాపితమై ఉన్నాయి. వందేమాతర ఉద్యమగాలులు వీస్తున్నాయి. మరోవైపు దళితులు, అణగారిన వర్గాలు చదువుకు దూరంగా ఉండాలనే ఆంక్షలకు వ్యతిరేకంగా 19వ శతాబ్ది చివరి భాగంలో వచ్చిన సంస్కరణ ఉద్యమాల చొరవతో ఈ వర్గాలు చదువుబాట పట్టాయి. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చి స్వాతంత్య్ర సమరానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ సామాజిక నేపథ్యంలో జగ్జీవన్‌రామ్‌ 1908 ఏప్రిల్‌ 5న చాంద్వా గ్రామంలో జన్మించారు. జగ్జీవన్‌ బాల్యం నుంచి వ్యక్తిగతంగా శుభ్రతకి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. బాల్యం నుంచే తులసీదాసు, స్వామిశివనారాయణ, కబీరు మొదలగు పండితుల కీర్తనల ప్రభావం ఆయనపై ఉంది. పాఠశాల విద్య అభ్యసించే రోజుల్లో అస్పృశ్యులకు ప్రత్యేకంగా తాగు నీరు ఏర్పాటు చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విధంగా ఇంటా బయటా ఉన్న సామాజిక నేపథ్యం జగ్జీవనను బాల్యంలోనే సంఘర్షణకు గురి చేసింది. జగ్జీవన్‌రామ్‌ దేశానికి స్వాతంత్య్రంతో పాటుగా దళితుల సాంఘిక, ఆర్థిక అభ్యున్నతిని కాంక్షించారు. అందుకే ఆయన మొదట సాంఘిక సంస్కర్తగా పనిచేయాలని నిశ్చయించుకున్నారు.
          
         1926లో జరిగిన ఒక సమావేశంలో జగ్జీవన్‌రామ్‌ ఉపన్యాసానికి ఆకర్షితుడైన పండిట్‌ మదనమోహనమాలవ్యా ఆయన్ను బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించేందుకు ఆహ్వానించారు. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లో కులాలు వాటి అంతరాలపై జగ్జీవన అధ్యయనం చేశారు. కలకత్తా యూనివర్సిటీలో ఉండగా వేలాది కార్మికులు పాల్గొన్న ఒక సభలో జగ్జీవన్‌రామ్‌ ఉపన్యాసం నేతాజీ సుభాష్‌ చంద్రబో్‌సను ఆకర్షించింది. ఆ రోజుల్లోనే చంద్రశేఖర్‌ ఆజాద్‌, మన్మధ్‌నాథ్‌ గుప్తా వంటి విప్లవ నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. 1934లో బీహార్‌లో సంభవించిన భూకంపం నేపథ్యంలో బాధితులను పరామర్శించేదుకు మహాత్మా గాంధీ వచ్చినపుడు జగ్జీవన్‌రామ్‌కు ఆయనతో మొదటి పరిచయం జరిగింది. ఈ పరిచయం ఆయన రాజకీయ దృక్పథంలో గొప్ప మార్పును తెచ్చింది. జగ్జీవన రామ్‌ 1937లో వ్యవసాయ కూలీల కోసం ‘కౌత్‌మజ్దూర్‌ సభ’ ఏర్పాటు చేశారు. ఆయన అనేక కార్మిక సంఘాలకు నాయకత్వం వహించారు. స్వాతంత్య్ర పోరాటంలో, నవభారత నిర్మాణంలో ఆయన సమకాలీనుల్లో మేటి నాయకుడిగా నిలిచారు. ఆయన ఒక్క హరిజనులకు మాత్రమే నాయకుడు కాదు. కుల మతాలు భాషా ప్రాంతాలకు అతీతమైన జాతీయ నాయకుడినని జగ్జీవన నిరూపించుకున్నారు. దళితులు తామొక ఐక్య సంఘటనగా ఏర్పడాలని, విద్యావంతులు కావాలని, మద్యపానాదులకు దూరంగా ఉండాలని ఉద్భోదించారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ స్వాతంత్య్ర పోరాటంలో పలు మార్లు జైలుశిక్ష అనుభవించారు. క్విట్‌ ఇండియా ఉద్యమకాలంలో జైలు జీవితం గడిపే రోజుల్లో చరిత్ర రాజకీయార్థిక శాస్ర్తాలను అధ్యయనం చేశారు. నాటి యువతలో మార్క్స్‌ సిద్ధాంతాలపై ఉన్న మక్కువను తెలుసుకునేందుకు ఆమూలాగ్రం మార్క్స్‌ సిద్ధాంతాలను అధ్యయనం చేశారు. ఆయన జీవిత సారాంశం నేటి యువతకు ఉత్తేజాన్ని నింపుతుంది.
            కమ్యూనల్‌ అవార్డు, పూనా ఒడంబడికల సందర్భంగా అంబేద్కర్‌ వాదనలను బలపరుస్తూ దళిత, అణగారిన వర్గాల ప్రయోజనాల నిమిత్తం గాంధీకి జగ్జీవన్‌రామ్‌ లేఖ రాశారు. రాజ్యాంగ సభలో సైతం జగ్జీవన్‌రామ్‌ కీలక భూమిక నిర్వహించారు. తన సోదరుడు అసమాన ప్రతిభావంతుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను రాజ్యాంగ రచనాసంఘం బాధ్యతలు తీసుకునేందుకు తన వంతుగా గాంధీ, నెహ్రూ, పటేల్‌ వంటి మహామహులను ఒప్పించారు. తద్వారా ఈ దేశానికి తలమానికం వంటి రాజ్యాంగం రచించేందుకు కృషిసల్పిన రాజకీయ నేర్పరి బాబూ జగ్జీవన్‌రామ్‌. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి దళితుల రిజర్వేషన్ల అమలుకు కాపలాదారునిగా, ఉద్యోగ, విద్యా రంగాల్లో వారి హక్కులకు భంగం వాటిల్లకుండా కాపాడిన వ్యక్తి బాబూజీ. బీహార్‌ శాసనమండలికి ఇరవై ఎనిమిదేళ్ళ ప్రాయంలో ఎంపికయ్యారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖల మంత్రిగా పనిచేసినపుడు హరిత విప్లవానికి నాంది పలికి ఆకలి సమస్యకు పరిష్కారం చూపారు. ప్రజా పంపిణీ వ్యవస్థని (పీడీఎస్‌) ప్రవేశపెట్టి నిరుపేదల ఆకలి తీర్చేందుకు శ్రీకారం చుట్టారు.
 
ఆహార సమస్యను తీర్చేందుకు ఆయన చూపిన చొరవ, ఆనుసరించిన శాసీ్త్రయ పద్ధతులు తనకు గొప్ప స్ఫూర్తినిచ్చాయని స్వామినాథన్‌ వంటి ప్రముఖ శాస్త్రవేత్త చెప్పటం జగ్జీవన్‌రామ్‌ ముందు చూపుకు తార్కాణం. దేశ రక్షణ మంత్రిగా పాకిస్థాన్‌ను ఓడించి బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి బాటలు వేశారు. యుద్ధ సమయంలో సైనికులతో కలసి తిరుగుతూ యుద్ధం పాకిస్థాన్‌ భూభాగంలో మాత్రమే జరగాలని, భారత్‌ భూభాగంలో కాదని ఉద్భోదిస్తూ సైన్యంలో ఒక సైనికుడిగా మెలిగారు. భారత్‌ సైన్యం విజయం సాధించిన మొదటి యుద్ధం దళితుడైన జగ్జీవన్‌రామ్‌ నాయకత్వాన జరిగింది కావటం ఒక చారిత్రక విషయం. కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం పలు శాఖలను సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా, నిబద్ధతతో నిర్వహిస్తూ ఎదుటివారిని నొప్పించకుండా ప్రశంసార్హంగా మెలగడంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ నాటి నేటి పాలకులకు ఆదర్శప్రాయులు.
 
      బాబూ జగ్జీవన్‌రామ్‌ జీవిత పర్యంతం దేశ సేవకే అంకితమై నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన దార్శనికుడు. కేంద్రంలో పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించిన పాలనాదక్షుడు. ఆలోచనల్లోని పరిపక్వత, మాటల్లోని సూటిదనం, నిర్ణయాల్లో లోతైన అవగాహన, కష్టాల్లో కృంగిపోక మొక్కవోని ధైర్యం, చర్చల్లో పదునైన మేధావితనం, ప్రత్యర్ధులతో సైతం ఔరా అనిపించగల రాజనీతిజ్ఞత, తర్కం, లోతైన విషయ పరిజ్ఞానం అన్నీ కలగలసి బాబూ జగ్జీవన్‌రామ్‌ను దేశం ఒక విలక్షణ నాయకుడిగా గుర్తించి నీరాజనాలు పట్టేందుకు దోహదం చేసాయి. స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యానంతరం నవభారత నిర్మాణంలో ఆయన పాత్ర శ్లాఘనీయం.
         పార్లమెంటులో జగ్జీవన్‌రామ్‌ మాట్లాడితే ఒక అక్షరాన్ని తొలగించడం గానీ ఒక అక్షరాన్ని చేర్చడం గానీ ఎవ్వరికీ సాధ్యం కాదని ఒక సందర్భంలో ప్రముఖ సోషలిస్టు నాయకుడు ప్రొఫెసర్‌ మధు దండావతే ప్రశంసించారు. 1986 జూలై 17న బాబూ జగ్జీవన్‌రామ్‌ సంస్మరణార్థం పార్లమెంట్‌లో ఆదిలాబాద్‌ తెలుగుదేశం పార్లమెంట్‌ సభ్యుడు సి.మాధవరెడ్డి ప్రసంగిస్తూ ‘ఆ మహామనిషి బాబూ జగ్జీవన్‌రామ్‌ గారితో పాటు 1952లో మొట్టమొదటి పార్లమెంటులో సభ్యునిగా ఉండే అవకాశం నాకు దక్కింది. ఆనాడు పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో జగ్జీవన్‌రామ్‌ యువ మంత్రిగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటే నేను జోక్యం చేసుకోబోయినపుడు డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీ నన్ను వారిస్తూ నీవు నెహ్రూనైనా అడ్డగించవచ్చు కానీ జగ్జీవనను ఆపడం సాధ్యం కాదు, అంతటి నేర్పరి జగ్జీవన్‌రామ్‌ అన్నారు. ఎప్పటికైనా ఒక హరిజనుడు ప్రధాన మంత్రి కావాలని ఈ దేశం కోరుకుంటే దానికి తగిన వ్యక్తి జగ్జీవన్‌రామ్‌ అని శ్యాంప్రసాద్‌ ముఖర్జీ చెప్పారు’. ఈ మాటలు వాస్తవ రూపం దాల్చకపోవటం దేశ సామాజిక చరిత్రలో ఒక వైఫల్య గాథ. ఈ దేశంలో ప్రజలందరి చేత ‘బాబూజీ ’అనే పిలుపు పొందిన గౌరవం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే దక్కింది. ఒకరు మహాత్మా గాంధీ కాగా మరొకరు మహా దార్శనికుడు బాబూ జగ్జీవన్‌రామ్‌. ఇంతటి అరుదైన గౌరవం పొందిన వ్యక్తికి భారతరత్నగా గౌరవం దక్కకపోవడం బాధాకరం. 
1979 జూలై మాసంలో సంభవించిన జనతా సంక్షోభంలో మెజారిటీ పార్లమెంటరీ పార్టీ నాయకుడైన బాబూ జగ్జీవన్‌రామ్‌కు ప్రధాన మంత్రి అవకాశం ఇవ్వకపోవడం ఆనాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నిర్ణయం ప్రశ్నార్థకం. కాదంటే చారిత్రక సందర్భంలో సమాధానం అన్వేషించవలసిన విషయం. బాబూ జగ్జీవన్‌రామ్‌ కలలు, ఆదర్శాలు నెరవేర్చేందుకు నేడు అందరూ కలసి కృషి చేయవలసిన అవసరం ఉంది. 
డొక్కా మాణిక్యవరప్రసాద్‌ 
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీమంత్రివర్యులు
Published in Andhra Jyothi Telugu News Paper Dated:05/04/2016

No comments:

Post a Comment