05-04-2016 00:38:58
భారత దేశ నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో సాటి మనిషిని స్మృశించడం పాపమనే అంటరానితనానికి అడుగడుగునా లేత వయస్సులోనే బాబూ జగ్జీవన్‌రామ్ మానసిక క్షోభను అనుక్షణం అనుభవించారు. ఆనాటి ఆ కుళ్లు వ్యవస్థ గర్భాన్ని చీల్చుకొని మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అచంచలమైన పట్టుదల, దీక్షలతో జీవనసమరాన్ని కొనసాగించారు. అట్టడుగు ప్రజల పక్షాన పోరాట యోధునిగా భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో సుదీర్ఘకాలం అత్యున్నతమైన పార్లమెంటేరియన్‌గా, పరిపాలన వ్యవస్థలో పటిష్ఠమైన పరిపాలనాదక్షుడుగా ప్రజాస్వామ్య నిరంకుశత్వాన్ని ఎదుర్కొన్న అసలుసిసలైన ప్రజాస్వామ్యవాదిగా డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ భారతదేశ చరిత్రలో అజేయంగా నిలిచారు.
స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం, సమసమాజం అనే ప్రజాస్వామ్య మానవతా విలువలను తన జీవితకాలం నిబద్ధతతో ఆచరించారు. అత్యున్నతమైన విలువల కోసం జీవితాంతం అలుపెరగని పోరాటం చేశారు. భారతదేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విడుదల, విముక్తి చేయడానికి స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942 ఆగస్టు 19న అరెస్టయి 14 నెలలు జైలు జీవితం అనుభవించారంటే మాతృ దేశం పట్ల ప్రేమ, స్వాతంత్య్రం పట్ల నిబద్ధత ఎంతగా వున్నాయో అర్థమవుతుంది.
జగ్జీవన్‌రామ్ విద్యార్థి దశలో అంటరానితనం రూపంలో వివక్షకు అవమానాలకు గురి అయినా అత్యంత ప్రతిభాపాటవాలు కలిగిన విద్యార్ధిగా రాణించడం ఆయనలో ఉన్న ఆత్మవిశ్వాసం, శక్తి సామర్థ్యాలకు నిదర్శనం. ఆ దశలోనే భావి భారత చరిత్రను ప్రభావితం చేసే నాయకత్వ లక్షణాలను జగ్జీవన పుణికి పుచ్చుకున్నారు. విద్యార్థి దశ తరువాత భవిష్యత్ ఉద్యమాలకు పునాదిగా సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపారు బాబూజీ. 1934లో కలకత్తాలో అఖిల భారతీయ రవిదాస్ మహాసభ స్థాపించారు. కులవ్యవస్థకు, అసమానతలకు, వివక్షకు వ్యతిరేకంగా సంత్ గురు రవిదాస్ ఆదర్శాలను ప్రచారం చేయటానికి సాంస్కృతిక ఉద్యమానికి బాబూజీ నడుంబిగించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాన్ని సాధించి, సామాజిక పరివర్తన తీసుకొని రావాలంటే, సాంస్కృతిక ఉద్యమం అవసరం. ఎందుకనగా మానసిక ఆలోచనలు, వైఖరులు, సనాతన ఆచార సాంప్రదాయాలలో మార్పు వస్తే తప్ప నూతన ప్రజాస్వామిక, సమసమాజం నిర్మాణం సాధ్యం కాదని ఆనాడే బాబూజీ తలచారంటే సామాజిక వ్యవస్థల పట్ల, పరివర్తన పట్ల వారికి ఒక నిర్దిష్టమైన ప్రామాణికమైన అభిప్రాయాలు ఉన్నవని తెలుస్తున్నది.
కార్మిక హక్కుల సంక్షేమం కోసం కార్మికుల మహాసభను స్థాపించడం బాబూజీ వర్గ దృక్పథాన్ని సూచిస్తుంది. పేద, ధనిక వర్గాల మధ్య అసమానతలు, దోపిడీ వ్యవస్థలు రూపుమాపుటకు బాబూజీ ఆనాడే కంకణం కట్టుకున్నారు. ఆ తరువాత వారు కార్మిక శాఖామాత్యులుగా 1946-1952, 1966-67 సంవత్సరాల కాలంలో పనిచేసి తనకున్న అధికారం ద్వారా కార్మికుల జీవన భద్రత కోసం, కార్మిక వ్యవస్థలో అనేక విప్లవాత్మకమైన చట్టాలు చేశారు. 1946లో తాత్కాలిక పార్లమెంట్‌కు ఎన్నిక, 1947లో రాజ్యాంగ నిర్మాణ సభ ఎన్నికతో ఆయన పార్లమెంటరీ ప్రస్థానం మొదలైంది. లోక్‌సభకు ఎనిమిది సార్లు ప్రాతినిధ్యం వహించి 1979 వరకు కొనసాగి, సుదీర్ఘ కాలం సుప్రసిద్ధ పార్లమెంటేరియన్‌గా ప్రజాసేవలో దేదీప్యమానంగా వెలిగారు. కార్మికుల పాలిట బాంధవుడుగా పేరొందారు.
భారతదేశంలో కోట్లాదిమంది అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా వారిని కులవ్యవస్థ కోరల నుంచి విడిపించడానికి 1936 నుంచి 1942 వరకు ఆలిండియా డిప్రెస్‌డ్ క్లాసెస్ లీగ్‌కు అధ్యక్షులుగా ఉండి సామాజిక ఉద్యమ రథానికి నాయకత్వం వహించి నడిపించారు. ఈ ఉద్యమ నాయకుడిగా అణగారిన కులాల ఆశాజ్యోతిగా గుర్తింపు పొందడం వల్ల అతి చిన్న వయస్సులోనే 28 ఏళ్ళకే బీహార్ శాసన మండలిలో ఎమ్మెల్సీగా నియమించబడ్డారు. 1937లో బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డిప్రెస్‌డ్ క్లాసెస్ లీగ్ ద్వారా తనతో పాటు 14 మందిని ఎన్నిక కావడం బాబూజీ రాజకీయ ప్రస్థానంలో తొలి సోపానం. ఇది ఒక చారిత్రాత్మక విజయం. ఈ విజయమే బాబూజీ భారతదేశ రాజకీయ చరిత్రను రాయడానికి తొలి అధ్యాయంగా నిలిచింది. ఆ తరువాత బ్రిటీష్ నిరంకుశ విధానాలకు నిరసనగా రాజీనామా చేసి, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకెళ్ళారు. కేంద్ర కార్మిక శాఖామాత్యులుగా జగ్జీవన్‌రామ్ పనిచేసిన కాలం (1946-52, 1966-67)లో కార్మికుల భద్రత, సంక్షేమం కోసం అనేక చట్టాలు చేసి, అమలు జరిపి సాధించిన విజయాలకు గాను ‘‘భారతదేశ కార్మిక చట్టాలకు జనకుడు’’గా కొనియాడబడినారు. భారత రైల్వే శాఖ మంత్రిగా ఉన్న కాలం (1956-1962)లో దేశంలోని రైల్వేలను ఆధునికీకరించి, నూతన రైల్వే మార్గాలను నిర్మించి, ప్రయాణికుల భద్రత, రైల్వే కార్మికుల, ఉద్యోగుల సంక్షేమానికి కృషి చెయ్యడంతో ‘‘రైల్వేల పితామహుడు’’గా జగ్జీవన్‌రామ్ కీర్తించబడినారు. కేంద్ర రవాణా, కమ్యూనికేషన్ల శాఖల మంత్రిగా ఉన్న కాలంలో (1962-1963) దేశ ప్రజల అవసరాలను తీర్చగలిగే విధంగా నూతన రోడ్డు మార్గాలను నిర్మించారు. దేశంలోని గ్రామీణుల చెంతకు పోస్టాఫీసు సేవలను చేర్చడం జగ్జీవన్‌రామ్ సాధించిన విజయాల్లో ఒకటిగా పేర్కొనవచ్చు. జగ్జీవన్‌రామ్ విమానయాన శాఖలో ఇండియన్ ఎయిర్ లైన్‌ను జాతీయం చేశారు.
ఆహారం, వ్యవసాయం, పౌర సరఫరాల శాఖలకు మంత్రిగా పనిచేసిన కాలం (1967-70)లో వ్యవసాయ రంగంలో యంత్రాలను ప్రవేశపెట్టి, నీటి వనరులను అభివృద్ధి పరిచి, దేశంలో మిగులు ఆహార ధాన్యాలు పండించి ‘‘హరిత విప్లవం’’ సాధించిన ఘనత బాబూజీకే దక్కుతుంది. మరల 1974 నుంచి 77 వరకు కేంద్ర వ్యవసాయం,
నీటిపారుదల శాఖలకు బాబూజీ మంత్రిగా పనిచేశారు. 1970 నుంచి 74 వరకు దేశ రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో బాబూజీ రక్షణ పరిశోధనా రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారతదేశం విజయభేరి మోగించింది. అసాధారణ ప్రజ్ఞాపాటవాలు, అజేయమైన నాయకత్వ లక్షణాలు, సుదీర్ఘమైన రాజకీయ పాలనా అనుభవం, సమదృష్టి ఉన్న డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్‌ని ప్రధానమంత్రి పదవి వరించనీయకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. కాంగ్రెస్ పార్టీ జగ్జీవన్‌రామ్‌కి చేసిన అన్యాయం దేశంలోని దళితుల సంక్షేమం విషయంలో ఆ పార్టీ వివక్షాపూరిత వైఖరికి స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుంది. దేశంలోని దళిత, ఆదివాసీ, బలహీన వర్గాల అభ్యున్నతిని దిగజార్చే కాంగ్రెస్ పార్టీ వివక్షాపూరిత వైఖరిని బట్టబయలు చేస్తుంది.
రావెల కిషోర్ బాబు
సాంఘిక, గిరిజన సంక్షేమ సాధికారత శాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్
Andhra Jyothi Telugu News Paper Dated: 05/04/2016
No comments:
Post a Comment