Friday, December 6, 2013

ఇంకెన్నాళ్ళీ గారడీలు - దుడ్డు ప్రభాకర్

వంట పని దగ్గర్నుండి పంట పనుల వరకు యంత్రాలను ఉపయోగిస్తున్న కంప్యూటర్ యుగమిది. అయినప్పటికీ మనిషి మలాన్ని చేతులతో గంపల్లోకి ఎత్తి నెత్తిన పెట్టుకొని ఊరి బయటకు మోసుకెళ్ళి పారబోసే మనుషులు ఈ హైటెక్ యుగంలో కూడా దర్శనమిస్తున్నారు. వారే ఈ నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో అట్టడుగు మెట్టైన దళితులు. వారే పారిశుద్ధ్య కార్మికులు, పాకీ పని వారుగా, సఫాయి కార్మికులుగా, సచ్చడి వారుగా పిలబడుతున్నారు. ఒక చోట రెల్లి, ఇంకోచోట హడ్డి, మరోచోట మాదిగ కావచ్చు కానీ వీరంతా దళితులు. దళితుల్లో దళితులు. దరిద్రులైన దళితులు. తమజానెడు పొట్టకోసం, బిడ్డల గిన్నెల్లో పిడికెడు మెతుకుల కోసం కోడి కూతకు ముందే నిద్రలేచి వీధుల వెంట పరుగులు తీస్తూవుంటారు. రెక్కలతో పాటు రేకుముక్క, చీపురు, గంప వాళ్ళ ఆస్తులు. బిడ్డల ముడ్డి కడగడానికి కూడా ఇష్టపడని కన్నతల్లులున్న ఈ దేశంలో ఈ కంపు జీవితాలు ఇంకా ఇలా కొనసాగుతూనే ఉన్నాయి.
అంబేద్కర్ వర్ధంతి రోజైన డిసెంబర్ 6, 2013న కేంద్ర ప్రభుత్వం సఫాయి కార్మికుల సంక్షేమం కోసం అంటూ ఒక చట్టం చేసింది. తద్వారా యంత్ర పరికరాలు లేకుండా చేతులద్వారా మరుగుదొడ్లను శుభ్రం చేసే సఫాయి పనికి పూర్తి చెక్ పెడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం భుజాలు చరుసుకుంటుంది. కేంద్ర గణాంక శాఖ వివరాల ప్రకారం మన రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 1,73,690 అపరిశుభ్ర మరుగుదొడ్లున్నట్లు, వీటిలో 7,111 మరుగుదొడ్లను మనుషులతో శుభ్రం చేయిస్తున్నారని చెప్పుకోవడానికి పాలకులు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. వందల ఏళ్ళ ఆధునిక భారత చరిత్రలో, స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్న 66 ఏళ్ళ తర్వాత కూడా ఈ మనుషుల్ని చూసి సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. డిసెంబర్ 6న ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దెయిర్ రిహాబిలిటేషన్ యాక్స్ 2013ను దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని పట్టణ ప్రాంతాల్లో అమలులోకి తేనుంది. విశేషమేమంటే అంటరాని వారి బతుకుల్ని సంస్కరించడానికి ఒక అంటరాని వాడి వర్ధంతి రోజున చట్టం తెస్తున్నామహో! అని యూపీఏ ప్రభుత్వం చెప్పకనే చెబుతుంది. ఇప్పుడు కూడా కులం అంబేద్కర్‌ని వదల్లేదు. ఆ భారత రత్న, రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ చనిపోయిన 57 ఏళ్ళ తర్వాత కూడా ఆయన్ని కులం వెంటాడుతూనే వుంది. తన జీవితాంతం అగ్రకుల బ్రాహ్మణీయ పాలకుల కుట్రలకు బలై అంటరాని వాడిగా, దళితులకు మాత్రమే ఆరాద్యుడుగా కుదించబడిన అంబేద్కర్ వర్ధంతి రోజున చట్టాన్ని తెచ్చి విస్తృత ప్రచారం ద్వారా దళితుల ఓట్లు కొల్లగొట్టవచ్చని పాలకులు తమ అగ్రకుల దురహంకార స్వభావాన్ని నిర్లజ్జగా, నిర్భయంగా చాటుకుంటున్నారు. ఈ దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం పోరాడి, ఆ లక్ష్యాన్ని రాజ్యాంగంలో పొందుపరచని సామాజిక విప్లవ కారుడిని సంస్కరణ వాదిగా, అంటరానివాడిగా ప్రచారం చెయ్యడంలో భాగంగానే ఈ బరితెగింపుకు సిద్ధపడ్డారు. ఈ వైఖరి రాజ్యాంగాన్ని అవమాన పరచడమే.
ఈ చట్టం పట్టణ ప్రాంతంలో మాత్రమే అమలవుతుందని చెబుతున్నారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై తొలుత 50 వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష, లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. అతిక్రమణలు ఇంకా కొనసాగితే 5 లక్షల జరిమానా లేదా ఐదేళ్ళ జైలు శిక్ష. లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. అన్ని పట్టణాలలో సర్వే చేపట్టి సఫాయి పనివారిని గుర్తించి వారికి విధిగా ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని అమలు జరిపి ఆరు నెలల్లో డ్రైలెట్రిన్స్ లేకుండా చేస్తామని ఇదొక చారిత్రాత్మక చట్టమని 2014 ఎన్నికల దాకా దళిత రాజకీయ నాయకులతో, ప్రభుత్వేతర సంస్థల(యన్.జీ.ఓ)తో దళితవాడల్ని ప్రచార హోరులో ముంచెత్తనున్నారు.
పట్టణాలలోని సఫాయి కార్మికులను మాత్రమే ఈ చట్టపరిధిలోకి తెచ్చారు. డ్రైనేజీలోకి, మ్యాన్ హోల్స్‌లోకి దిగి శుభ్రం చేసే మున్సిపల్ వర్కర్స్ విషవాయువుల ప్రభావం వల్ల నిత్యం మరణిస్తూ ఉంటారు. ఆ పనిలో కూడా యంత్రాలు ఉపయోగించడం లేదు కాబట్టి వారిని కూడా ఈ చట్ట పరిధిలోకి తేవాలి. దేశవ్యాపితంగా గ్రామాలలో మేజర్ పంచాయతీల్లో వ్యక్తిగత డ్రైలెట్రీన్‌లు శుభ్రం చేసే వారి సంగతేంటి? అనేక గ్రామాల్లో ఊరి చివర ఇంకా కామన్ లెట్రిన్స్ దర్శనమిస్తున్నాయి. వాటిని శుభ్రం చేసే వారిని నిర్లక్ష్యం చేశారు. ఈనాటికి గ్రామీణ ప్రాంతాలలో అధునాతన లెట్రిన్ల సెప్టిక్ ట్యాంకుల్లో దిగి మలాన్ని బక్కెట్లో ఎత్తి డబ్బాలలో నింపి రిక్షాద్వారా ఊరు బయట పారబోస్తున్నారు. వాళ్ళంతా దళితులు, యానాదులే. వాళ్ళను కూడా ఈ చట్ట పరిధిలోకి తేవాలి. చచ్చిన పశు కళేబరాల్ని, అనాధ శవాల్ని, గుర్తుతెలియని శవాల్ని ఆసుపత్రికి తరలించే వాళ్ళు, పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత బయటపెట్టే వాళ్ళు, శ్మశానానికి మోసేవాళ్ళు వీళ్ళందరూ దళితులే. వీరు అపరిశుభ్ర, అవమానకర పనులు చేతులతోనే చేస్తున్నారు. యంత్రాలతో కాదు. వీళ్ళను కూడా ఈ చట్ట పరిధిలో చేర్చాలి. ఈ చట్టం ఎన్నికల గారడీలో భాగంగానే హడావిడిగా చేయబడింది.
సమగ్రమైన పరిశీలనలేని కారణంగానే పట్టణాలకే పరిమితం చేశారు. ఆ మేరకు చట్టాలు చేసినా పాలకులకు వాటిని అమలు చెయ్యడంలో చిత్తశుద్ధి ఉండదు. ప్రస్తుతం నిర్వీర్యమై అంపశ్యమీద పడుకోబెట్టబడివున్న ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 మనకొక ఉదాహరణ మాత్రమే. 1992లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం దేశంలో 14 లక్షల మంది కార్మికులు మలాన్ని చేతులతో ఎత్తే పనిలో వున్నారు. మన రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల మందికి పైగా ఉన్నారు. చేతులతో మలాన్ని ఎత్తే మనుషులను పనిలో పెట్టుకోవడం, డ్రైలెట్రిన్స్‌పై నిషేధం విధిస్తూ 1993లో భారత ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అది అమలుకి నోచుకోలేదు.
ఈనాటికీ ప్రభుత్వరంగ సంస్థల్లో అధికారికంగానే ఆ పని కొనసాగుతుంది. రైల్వే వ్యవస్థలో అది బహిరంగంగానే జరుగుతుంది. నేటికీ రాష్ట్రంలో వందలాది డ్రైలెట్రిన్స్ నడుస్తున్నాయని ప్రస్తుత కేంద్ర గణాంక శాఖ వివరాలు తెలియజేస్తున్నాయి. చట్టం చేయబడినప్పటికీ కొనసాగుతున్న సఫాయి కార్మికుల దీనస్థితిపై 2005లో సుప్రీంకోర్టు స్పందించి వివిధ మంత్రిత్వ శాఖ అధికారులకు హెచ్చరికలతో కూడిన తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని అధికారులకు తమ శాఖల్లో పాకీ పనివారున్నారా? అనే విషయం పరిశీలించి ఆరునెలల లోపు నివేదిక పంపాలని ఆదేశించింది. ఎవ్వరూ నివేదిక పంపిన దాఖలాలు లేవు. మళ్ళీ చట్టం చేయవలసి వచ్చిందంటే ఈ దేశంలోని అధికారులకు, రాజకీయ నాయకులకు కోర్టులు, చట్టాల పట్ల ఏ పాటి గౌరవమున్నదో అర్థమవుతుంది. దళితుల్ని కేవలం ఓటర్లుగా చూస్తున్న ఈ పాలకులు దళితుల ఓట్లు కొల్లగొట్టే లక్ష్యంతోనే ఇలాంటి గారడీలు చేస్తుంటారు. అంతవరకే. ఆ చట్టాల అమలు పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించరు. అందుకే అనేక దళితహక్కుల పరిరక్షణ చట్టాలు నిర్జీవం చేయబడుతున్నాయి. ఈ ఆధునిక మనువాద సమాజంలో దళితులు సాటి మనుషులుగా చూడనిరాకరించబడుతూనే ఉన్నారు. అంబేద్కర్ మహాశయుని లక్ష్యమైన కులనిర్మూలన జరగనంతకాలం ఇలాంటి గారడీలు, పీడన, అణచివేత, అవమానాలు జరుగుతూనే వుంటాయి. అంబేద్కర్ వర్ధంతి సాక్షిగా కులనిర్మూలన లక్ష్యంతో చట్టాల అమలుకై పోరాటాలు చేద్దాం.
- దుడ్డు ప్రభాకర్
రాష్ట్ర అధ్యక్షులు, కులనిర్మూలనా పోరాట సమితి
(నేడు అంబేద్కర్ వర్ధంతి)

Andhra Jyothi Telugu News Paper Dated: 06/12/2013 

- See more at: http://www.andhrajyothy.com/node/38064#sthash.c4qtdhLQ.dpuf

No comments:

Post a Comment