ఏ ఊరిలో పుడతారో, ఏ ఊరిలో చస్తారో తెలియని ఈ జాతికి తలదాచుకునే ఇల్లు, పాతి పెట్టుకునేందుకు గుంట భూమి లేదు. ఏళ్ళ తరబడి మాల, మాదిగలతో మమేకమై జీవిస్తున్న చిందు, మాస్టీ, డెక్కలి జాతులను వారి అభివృద్ధి క్రమాన్ని మంత్రులెక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ సందర్భంగా వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. అందువల్ల ఎస్సీ వర్గీకరణలో సమతుల్యత దెబ్బతింది. పునర్ వర్గీకరించాలి. తెలంగాణ బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలి.
హిందూ మత పునాదులపై ఏర్పడిన కులవ్యవస్థ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలను సృష్టించి, శ్రామిక ప్రజలను కలిసి మెలిసి జీవించకుండా అడ్డుకుంటుంది. ఈ అడ్డును తొలగించే ప్రయత్నానికి పూనుకున్న బౌద్ధాన్ని ఈ దేశ సరిహద్దులను దాటించామని భ్రమపడింది. డా.బి.ఆర్. అంబేద్కర్ నాగపూర్ కేంద్రంగా లక్షలాది ప్రజలతో బౌద్ధాన్ని స్వీకరించడం వల్ల హిందూమతం భవిష్యత్ తలక్రిందులుగా మారింది. దేశ కమ్యూనిస్టులను, సోషలిస్టులను, నక్సల్స్‌ను అణిచి వేసినట్లుగా, అంబేద్కరిస్టులను అణిచి వేయలేకపోయింది. కులం, మతం, పునాదుల నిర్మూలనకే రంపంలా మారిన డా.బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనా విధానం, నాడు, నేడు సజీవమై నిమ్నజాతుల హృదయాలలో పదిలమై యావత్ భారత జాతి ప్రజలను తట్టి లేపుతుంది. బౌద్ధ దమ్మం పుట్టిన ఈ పుణ్య భూమిపై మనువాద పెత్తనం, అది సృష్టించిన ఆర్థిక, రాజకీయ, సాంఘిక అసమానతలను తొలగించలేకపోతే బహుజనులు ఏరకమైన స్వేచ్ఛను అనుభవించలేరని మహాత్ముడు జ్యోతిరావు ఫూలే గ్రహించారు. దీనికి రాజ్యాధికారం ఒకటే పరిష్కార మార్గమని ప్రబోధించాడు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే శూద్రులకు విద్య తప్పనిసరని ప్రతిపాదించిన ఆ మహాత్ముడు డా.బి.ఆర్. అంబేద్కర్‌కు గురువు కావడం గమనార్హం. ఫూలే పడమర ఆస్తమించిన సూర్యుడైతే, డా.బి.ఆర్. అంబేద్కర్ తూర్పున ఉదయించిన సూర్యుడి వలే గతి క్రమాన్ని ప్రతిబింబింపచేసి భారత్ దిక్సూచికి ధ్రువతారలై నిలిచిపోయారు.
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతి శూద్రులనే ఈ పంచమ వర్ణాలు క్రమంగా 16వేల కులాలుగా రూపాంతరం చెంది, మానవ అభివృద్ధి క్రమాన్నే అడ్డుకుంటున్నాయి. ఇది శ్రమ విభజన కాదు. శ్రామికుల విభజనగా డా. బి.ఆర్. అంబేద్కర్ విశదీకరిస్తారు. ప్రకృతి విరుద్ధమైన కుల అసమానత నియమాన్ని మనిషి సృష్టించాడు. ప్రకృతి నియమం, దైవ సంకల్పం అసలే కాదు. మనువు సృష్టించిన ఈ కుల అధర్మాన్ని, దాని భావజాలాన్ని నాశనం చేయాలని కోరుతారు. దాన్ని నాశనం చేయకపోతే, అది మనల్ని మనం నిర్మించుకునే సమాజాన్ని నాశనం చేసి తీరుతుందని హెచ్చరించారు.
దేశంలో బహుజనులు ఒక కులం, ఒక వర్ణంగా లేకపోవడం వల్ల రాజకీయ అధికారాన్ని స్థాపించలేకపోతున్నారు.అగ్రకులంగా చలామణిలో ఉన్న సంపన్నులు, కోటీశ్వరులు, భూస్వాముల ఆర్థిక పరిపుష్టి బలమైనందువల్ల రాజకీయ అధికారంలో ఎక్కువ కాలం మనగలుగుతున్నారు. సర్వ సంపదల సృష్టికి బహుజనులు పునాదిగా ఉన్నందువల్లే, విద్యనభ్యసించలేక, నిరక్ష్యరాస్యులుగా, నిరుద్యోగులుగా, చైతన్య రహితులుగా, ముఖ్యంగా కడు పేదలుగా, దేశ దిమ్మరులుగా బతుకులీడుస్తున్నారు. వీరిపై అగ్రకులాల ఆధిపత్యాన్ని నిరంతరం కొనసాగిస్తూ, కఠినమైన నిబంధనల ద్వారా అదుపు చేసి, అణిచివేసేవారు. అణిచివేతే అగ్రకులాలకు ప్రధాన ఆయుధం అయింది.
తరతరాలుగా ఊరికి, ఆస్తికి, విద్యకు, ఆయుధానికి, అధికారానికి దూరంగా విసిరి వేయబడిన జాతుల కోసం డా. బి.ఆర్. అంబేద్కర్ నిరంతరం కృషిచేసి గొప్ప రాజ్యాంగ నిర్మాతగా, భారత దేశ దార్శనికుడైనారు. ఆయన రచించిన కుల నిర్మూలన గ్రంథం బహుజనుల జీవిత కరదీపికైంది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని బ్రతకగలిగిన జీవులు మాత్రమే బ్రతికి బట్టకడతాయి. తట్టుకోలేనివి, నిలబడనివి పూర్తిగానే అంతరించిపోతాయనే ప్రాకృతిక సూత్రాన్ని కష్టజీవులైన ఈ దేశ బహుజనులకు అన్వయిస్తూ ఇలా అంటారు. సంపన్నులు, కోటీశ్వరులు, భూస్వాములు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక, రాజకీయ, సాంఘిక అణచివేత, వారి ప్రలోభాలను ప్రశ్నించి, ఎదురు తిరగబడిన జాతులు మాత్రమే బ్రతికి బట్టకట్టుతాయి. ఎదురు తిరగనివి, ప్రశ్నించలేని జాతులు కనుమరుగై పోతాయనే సూత్రీకరణ తెలంగాణలోని ఎస్సీ కమ్యూనిటీలోని మాదిగ ఉపకులాలైన చిందు, మాస్టీన్, డెక్కలి వంటి కులాలు కనుమరుగవుతున్న జాబితాలోనివే. డా.బి.ఆర్. అంబేద్కర్ పోరాటాల ఫలితంగా ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ అవకాశాలను మాల, మాదిగలే ఎక్కువ అనుభవిస్తూ తమ క్రింది జాతుల పట్ల దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక, రాజకీయ పరిపుష్టిని ఆ మేరకు సాధించుకున్న ఎదిగిన పై రెండు కులాలు తమలోని క్రింది కులాలకు సామజికతను ఉల్లంఘిస్తూ, పై కులాలతో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం వంటి పద ప్రయోగాలు చేస్తున్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఈ విధంగా అంటారు. నీవు నీ క్రింది కులపోన్ని గౌరవిస్తేనే, పై కులపోడు నిన్ను గౌరవిస్తాడని అంటారు. మాల మాదిగను గౌరవించడం లేదు. మాదిగ చిందు, మాస్టీ, డెక్కలిని గౌరవించడం లేదు. ఈ విధానం అంబేద్కర్ ఆలోచనా విధానానికి పూర్తిగా విరుద్ధమైంది. అసభ్యకరమైంది. మొత్తం ఎస్సీ కమ్యూనిటీలోని యువకులు, విద్యావంతులు, ఉద్యమ సంస్థలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
స్వాతంత్య్ర కాలం నుంచి నేటి వరకు చట్టసభలకు ఎంపికైన ఎస్సీ కమ్యూనిటీ ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యంగా మంత్రులుగా నియమించబడినవారు దోపిడీ పాలకులకు ఏజెంట్లుగా మారి కమ్యూనిటీ ప్రజలకే నష్టం చేస్తున్నారు. ఎస్సీ/ఎస్టీ సబ్‌ప్లాన్ కమిటీ, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థలు అనుసరిస్తున్న విధానాలు సంతృప్తికరంగా లేవు. నిధుల దారి మళ్ళింపు, బ్యాంక్ సబ్సిడీ రుణ పథకమే కావచ్చు, అభివృద్ధి అనేది కులాల వారీగా కాకుండా ఉమ్మడి నిధుల ఖర్చులుగా చూపడం సరికాదు. అనేక షరతులతో సబ్సిడీ రుణ పథకం ఇవ్వ నిరాకరణకే దారితీస్తుంది. స్వంత ఇల్లు, భూమి, ఆస్తి, గ్రామం లేని చిందు, మాస్టీన్, డెక్కలికి మోరి, రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, వాటర్ ట్యాంకుల నిర్మాణం వీధి దీపాలతో పనేంటి? విద్యకు, పూజకు నోచుకోలేని ఈ జాతులకు బడి, గుడి దేనికోసం? ఏ ఊరిలో పుడతారో, ఏ ఊరిలో చస్తారో తెలియని ఈ జాతికి తలదాచుకునే ఇల్లు, పాతి పెట్టుకునేందుకు గుంట భూమి లేదు. ఏళ్ళ తరబడి మాల, మాదిగలతో మమేకమై జీవిస్తున్న చిందు, మాస్టీ, డెక్కలి జాతులను వారి అభివృద్ధి క్రమాన్ని మంత్రులెక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఈ సందర్భంగా వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. అందువల్ల ఎస్సీ వర్గీకరణలో సమతుల్యత దెబ్బతింది. పునర్ వర్గీకరించాలి. తెలంగాణ బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని కోరుతున్నాం.
కావున చిందు, మాస్టీ, డెక్కలి కులాలను ఏ గ్రూపులో చేర్చి ఉమ్మడి రిజర్వేషన్లు అమలు చేయాలనే సంకల్పంతో ఈ జాతులు పోరాడుతున్నాయి. అందుకు మందకృష్ణ మాదిగ అధికారికంగా స్పష్టం చేయాలి. భూమి పుట్టిన నాటి నుంచి నేటికీ స్వంత భూమిలేని ఈ జాతులకు ప్రతి కుటుంబానికి 2 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలి. జీవన భృతి కోసం, వ్యాపార నిమిత్తం ఎలాంటి షరతులు లేని బ్యాంక్ సబ్సిడీ రుణాలను దరఖాస్తు పెట్టుకున్న ప్రతి వ్యక్తికీ సదుపాయం కల్పించి, గత 66 ఏళ్ళుగా విద్య, ఉద్యోగ, రాజకీయ తదితర రంగాల్లో పూర్తిగానే రిజర్వేషన్లను అనుభవించలేని, ఈ జాతి విద్యావంతుడికి ప్రభుత్వం స్వయంగా పిలిచి ఉద్యోగమివ్వాలని పోరాడాలి. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కమ్యూనిటీ ప్రజ్రాపతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కుల సంఘాలు, సామాజిక దృక్పథం కలిగిన వ్యక్తులు, శక్తులు, ఉద్యోగ సంఘాలు పూర్తి స్థాయి లో మద్దతు ఇవ్వడమా? లేదా చరిత్రలో జాతి హీనులుగా మిగిలిపోవడమా? తేల్చుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని స్పష్టం చేస్తున్నాం.
- గడ్డం దేవదాస్
అంబేద్కరిస్ట్
-
Andhra Jyothi Telugu News Paper Dated : 13/12/2013
No comments:
Post a Comment