Monday, December 30, 2013

తలారి అరుణ.. బి.టెక్ -By వేముల ఎల్లయ్య



 



మొగులు మబ్బుల నడుమ పొద్దు కాలమంతా నడకే
పిడుగులు పిరంగులైనా! గండం వొల్లె దాచుకొనే
భూమినద్దిన తోవ పూలకింది పల్లేర్లూ
ఆడోళ్ళ దుఖ్ఖం కొంత దూరం జర్గిందీ...
బేడ ఊడిన తలుపురెక్కలు నిద్ర ఎరుగని గడియలు
తండ్లాట జీవ్లూ తల్లులూ! తండ్రులు ఏడ్పు పత్రం
గీమ్లాడిన పగ జగడమై చేయితిప్పిన ఓటుముద్దెర
దేశమెంతో సంబురం, అమ్మలే చైర్మన్లు, సభాపతులు
పిన్నులు దిగిన ఫైల్ కట్టలు ఎక్కిరింత పెదవులాయె
కండ్లకోత మసరచీకటి ముసుగు జండాలు
జైకొట్టిన చేతి గాజులు తుంపిరి
సర్కార్ నిఘా అంగడి రాజకీయం
దొంగ దాపిడి దళారి కార్ఖానై వర్ధిల్లే దేశాన
బారసాల పందిరి ముందే బాల నెత్తుటి గీతాలు
దినం లెక్కలు మింగిన మానగండం పానగండం
పాపానికి ఆత్మై పుర్రెలు చిట్లిన కనుపాపలు
ఏమిచెల్లె! సగబల్కిన లోకమెంత గమ్మత్తె
కుంగనీకి పొద్దు ఎలుగై ఎక్కడానికి చంద్రుడు
ఆకాశమంత రక్షణగూడుంటే ఎంతబాగుండు ప్రజలకు
ఆకిలి ముంగలి అవ్వా! నెత్తి దులిపిన నీడ
అగ్గిపొయ్యిల బొగ్గులూదుతుంది
నిప్పు కళ్ళి ఎగిరి ఎదరొమ్ము మీద పడె
కంటిచూపై మండిన పాలరొమ్ము
నెత్తురు చల్లార్చిన మది ఎంత పదిలం అమ్మలకు...
చావు చివరి అంచుకు తొంగిచూస్తూ
గాయం తూడ్చిన పుండ్ల నడుమ పచ్చిపాల వైద్యం
వామ్మో! నీ ధైర్యం గాల నిత్యం పసిపిల్ల తల్లిరూపమేందే
'పుట్టబోతుంది లోకం పెరగబోతోంది'
కనేది నువ్వె! బతుకు నిచ్చేది నువ్వె!
హంతక కొడుకులు కూతుర్ల మరణం
కత్తులు బళ్ళాలని బవిస్తివమ్మా.....
కండ్లు కమ్మిన కామపిచ్చి ఊపిరిఉండై కౌగిట్ల బొండిగ నల్గింది
చేతులెత్తి దుమ్ముసాపెన గీల్లకేమి పాపం
కడుపు తెరిచి కన్నందుకు తల్లులకే లంజిర్కమెత్తితిరి గదర్లా!
లేమితనం కులం తక్కువని మానం దోచి పాణం తీస్తిరి
రెట్టలిరగ గట్టి బట్టలిప్పి కిరోసిన్ మంటలెగిరే
వొగ అంటరాని పిల్ల తలారి అరుణ
అప్పులమడిగె నెత్తురుకు మరిగిన కామాందు
నిప్పుల బొగ్గైంది తను కలిషిన చర్మం చమురు ముద్దయ్యింది
ఎందరి ముచ్చట బలిసి పండిందన్న నింద!
అంగానికున్న జాంగను మార్చిన నకిరెకంటి సైద్గాడు
గీ... తప్పులెంకని లోకమెంత పాపగొండిదీ
శవ్వా! ఎంత లజ్జ.. ఎనకబడి ఉన్నతవర్గ బుద్దా?
పశ్శల మకురం పాయమాలంటుంది కోట్లున్న రెడ్ల అండ
ప్రలోబమై లొంగని చరిత్రకు వందనం
ఆకలి ఎరగని ఆత్మగౌరవం గుండె ఎగపోతై
కాలంమీద కశి తలల నరికివేతకు కబర్ధారంటుంది
-వేముల ఎల్లయ్య
 

Andhra Jyothi Vividha Telugu News Paper Dated : 30/12/2013 

No comments:

Post a Comment