Monday, December 7, 2015

తీరని వికలాంగుల వెతలు


Updated : 12/3/2015 1:59:08 AM
Views : 190
సమాజంలో వికలాంగులు అసమానతలకు, వివక్షకు బలవుతున్నారు. తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. సంక్షే మ రాజ్యంలో బడ్జెట్ కేటాయింపులు, విద్య, ఉపాధి రంగాలు, పునరావాసం, ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపు ఇలా ప్రతి అంశంలోనూ వికలాంగులకు అన్యాయమే జరుగుతున్నది. రాజకీ య పార్టీలను నమ్మి ఓట్లేసినా అధికారంలోకి అడుగుపెట్టాక వికలాంగుల సంక్షేమాన్ని మరుస్తున్నాయి. దేశం లో 2011లెక్కల ప్రకారం 2,68,10,557 వికలాంగులున్నారు. వీరిలో పురుషులు 55.8 శాతం ఉంటే స్త్రీలు 44.2 శాతం ఉన్నారు. గ్రామీణ ్రప్రాంతాల్లో నివసించే వికలాంగుల జనాభా 69.4 శాతం ఉండగా పట్టణ ప్రాంతంలో 30.6 శాతం ఉన్నారు. వివిధ రకాలుగా శారీరక లోపాలతో.. పాక్షికంగా చూపు కోల్పోవడం, కుష్ఠు వ్యాధి, పూర్తిగా చూపు కోల్పోవడం, మూగ, వినికిడి లోపం, శారీరక లోపం, మానసిక రుగ్మతలు, బుద్ధి మాంధ్యం తదితర అంశాల ను పరిగణనలోకి తీసుకొని ఆయా లోపాలున్న వారిని వికలాంగులుగా పరిగణిస్తారు.


vasu


వికలాంగుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం 1995లో వికలాంగుల చట్టం చేసింది. చట్టం పరిధిలో వీరి కి సామాజిక న్యాయం, అనేక పథకాలు అమలుచేయాల్సి ఉన్నది. సమాజ పౌరులుగా వికలాంగులను అభివృద్ధి పరిచేందుకు ముఖ్యంగా విద్యా, ఉపాధి అవకాశాల్లో మూడు శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. అయితే పలు పథకాలు కాగితాలకే పరిమితమై ఉంటున్నాయి. దీన్‌దయాల్ వికలాంగుల పునరావాస పథకం కింద వికలాంగులకు సంక్షేమ పాఠశాలలు, వృత్తి విద్యా కేంద్రాలు, కమ్యూనిటీ పునరావాస కేంద్రాలు తదితర సౌకర్యాలు కల్పించాలి.


కానీ అవి క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడంవల్ల వికలాంగులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో వికలాంగులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం ద్వారా ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. గ్రామీణ ప్రాంత వికలాంగులకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కూడా వారు నోచుకోవడం లేదు. ప్రైవేటు విద్యా సంస్థలలో వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్ల ఊసే లేదు. దామాషా ప్రకా రం ఉద్యోగ అవకాశాలు లేకపోవడం ద్వారా నైరాశ్యానికి లోనవుతున్నారు.


ఇక వికలాంగుల ఆరోగ్య పరిస్థితులు దారుణపరిస్థితిలో ఉన్నాయి. వికలాంగుల కుటుంబాలు ఆర్థికంగా లేకపోవడంతో తగిన పోషక ఆహార విలువలతో కూడిన భోజనం దొరకడంలేదు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాల్లో పరిస్థితి దయనీయంగా ఉన్నది. వికలాంగులకు ఉచిత వైద్య అవకాశాలు ఉన్నప్పటికీ అది పట్టణ ప్రాంతంలోని వారికే అరకొర అందుతున్నాయి. పల్లెల్లో ఉన్న వికలాంగులకు వైద్యసాయం అసలే అందడంలేదు. వికలాంగుల సర్టిఫికెట్ల కోసం ఏర్పాటు చేస్తున్న సదరన్ క్యాంప్‌లు డివిజన్ స్థాయిలోనే ఏర్పాటు చేయడంతో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. అంగవైకల్యానికి సంబంధించి అన్ని పరీక్షలు అయిపోయాక కూడా నిర్ణీత సమయంలో వికలాంగుల సర్టిఫికెట్స్ అందటం లేదు. ఈ సర్టిఫికెట్ల విషయంలో దళారుల బెడద ఎక్కువై పోయింది. వికలాంగులకు సదరన్ సర్టిఫికెట్ ముఖ్యం కావడంతో దళారుల చేతి లో మోసపోకతప్పడం లేదు. ప్రస్తుతం వైకల్యం 40 శాతం ఉంటేనే, వారికి అర్హత సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. 39 శాతం వైకల్యం ఉన్నా అనర్హులుగా తేల్చుతున్నారు.


దీంతో లక్షలాది మంది వికలాంగులు ప్రభుత్వ పథకాలకు రాయితీలకు దూరమవుతున్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి 40 శాతంగా ఉన్న అర్హతను 30 శాతానికి కుదించాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంపై పునరాలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.

అనేక సామాజిక కారణాల కారణంగా రోజురోజుకూ వికలాంగుల జనాభా గణనీయంగా పెరుగుతున్నది. ప్రభుత్వ శాఖలల్లో వీరి నియామకాలు నామమాత్రంగానే ఉంటున్నాయి. వీరికి మల్టీనేషనల్ కంపెనీలల్లో పనిచేసే అర్హతలున్నా ఏ కంపెనీ కూడా వీరికి ఉద్యోగాలు ఇవ్వడం లేవు. అన్నిరకాల ప్రభుత్వ ఉద్యో గాల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటే నిరుద్యోగ సమస్య కొంతమేరకు తగ్గించిన వారవుతారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్ పార్క్‌లో వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది.


ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనటువంటి పథకాలతో వికలాంగుల సంక్షేమాన్ని అమలు చేస్తున్నది. అర్హులైన వికలాంగులందరికి ఆసరా పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నది. నెలకు 1500 రూపాయల ఆసరాను అందిస్తూ వారి వికాసానికి తోడ్పాటునందిస్తున్నది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 4,38,526 మంది వికలాంగులు లబ్ధిపొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యం గా ముందుకు సాగుతున్నది. అదే లక్ష్యంతో వికలాంగుల అభివృద్ధికి కూడా ప్రభుత్వం చేయూతనివ్వాలి.


తెలంగాణ రాష్ట్ర సాధనలో వికలాంగుల పోరాటం అద్వితీయమైనది. అందుకోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో వీరిని భాగస్వాములను చేస్తూనే వీరి అభివృద్ధికి బాటలు వేయాలి. ప్రస్తుతం వికలాంగులకు ఉన్న రిజర్వేషన్‌ను ఎనిమిది శాతానికి పెంచాలి. ఇత ర కార్పొరేషన్స్ మాదిరిగా వికలాంగుల కార్పొరేషన్‌కి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్‌రూం పథకంలో వికలాంగుల కు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. వికలాంగుల వివాహ ప్రోత్సాహాకాన్ని 2 లక్షలకు పెంచాలి. వ్యక్తిగత రుణసౌకర్యం 5 లక్షలు ఇవ్వాలి. ఉన్నత చదువులు చదువుతున్న వికలాంగులకు ఆధునిక సౌకర్యాలు కల్పించాలి. అలాగే వారికి వాహన సౌకర్యం కూడా అందించాలి. మరోవైపు వికలాంగ మహిళలపై అనేక లైంగిక దాడులు జరుగుతున్నాయి.


వీటిని అరికట్టాలంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలాగా ప్రత్యేకమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర వికలాంగుల సంక్షేమ భవనం ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం అన్ని జిల్లాలల్లో వికలాంగుల వసతిగృహాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నా యి. వాటికి ప్రత్యామ్నాయంగా సొంత భవనాలు ఏర్పాటుచేసి విద్యార్థుల కష్టా లు తీర్చాలి. ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్ల కింద ఒక కుటుంబంలో ఎందరు వికలాంగులు ఉన్నా వారందరిని ఆసరా పథకం ద్వారా ఆదుకోవాలె. ప్రభుత్వం నిర్వహించే పరీక్ష రుసుముల్లో వికలాంగలకు మినహాయింపును ఇవ్వాలి. వికలాంగులకు ప్రభుత్వ రవాణా రంగాలన్నింటిలో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలి. అర్హులైన వికలాంగులందరికీ ఆరోగ్య భద్రత కార్డులు జారీ చేయాలి. వికలాంగుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగాలి. సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సమాజంలో పూర్తిస్థాయి భాగస్వామ్యం పెంచేందుకు ఉద్దేశించిన 1995 చట్టాన్ని అమలుచేయాలి. జీఓ నెం.1095 ప్రకారం మిగులు భూముల్లో ఐదెకరాలు వికలాంగులకు కేటాయించాలి. బడ్జెట్ కేటాయింపులో ఎనిమిది శాతం నిధులు ప్రత్యేకంగా కేటాయించాలి. వికలాంగులను అన్ని విధా లా ఆదుకొని వారికి రక్షణ, ఉపాధి కల్పించిన నాడే వికలాంగులు ఆత్మగౌరవం తో తలెత్తుకొని నిలుచుంటారు.

Andhra Jyothi Telugu News Paper Dated : 03/12/2015


వికలాంగుల రాజ్యాంగబద్ధ హక్కులు


( నేడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం)ప్రజలందరికి సమాన అవకాశాలు కల్పించి సమాజ పురోగమనంలో ప్రజలందరి మానసిక, శారీరక సామర్థ్యాలను వినియోగించి అభివృద్ధికి బాటలు వేయాలంటే ప్రజలందరి భాగస్వామ్యమే కీలకం. కానీ ఈ సమాజ అభివృద్ధిలో ప్రజలందరి భాగస్వామ్యం లేకపోవడంవల్లనే సంపూర్ణ అభివృద్ధి జరగడం లేదు. దీనికి ప్రధాన కారణాల్లో వైకల్య సమస్య కూడా ఒకటి అని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. వికలాంగులకు సమాన అవకాశాలు, హక్కులు కల్పించడం ద్వారా వారి మానసిక, శారీరక శక్తి సామర్థ్యాలు సమాజ అభివృద్ధిలో మిళితం చేయాలనే లక్ష్యంతో 1981 సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ఐరాస ప్రక టించింది. అందులో భాగంగానే అనేక దేశాలు వికలాం గులను విలువైన మానవ వనరులుగా గుర్తించి వారికి అనేక చట్టాలు, అంతర్జా తీయ ఒడంబడికలు, హక్కులు కల్పించాయి.

ఫ్రాన్స్, ఇంగ్లండ్, అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్ తదితర దేశాలు వికలాంగుల హక్కులు పక్కాగా అమలుపరిచి వాటి ఫలితాల వల్ల అభివృద్ధి రథంపై దూసుకుపోతున్నాయి. కానీ భారతదేశం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వికలాంగుల ఒడంబడికను ఆమోదించినా, వికలాంగులకు ఎన్నో చట్టాలు చేసినా వాటి అమలు అంతంతమాత్రంగానే ఉండటానికి ప్రధాన కారణం వాటి పట్ల వికలాంగులకు, ప్రభుత్వ యంత్రాంగానికి అవగాహన లోపించడమే ప్రధాన కారణం. కనుకనే డిసెంబరు 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా భారతదేశం రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ద్వారా వికలాంగులకు కల్పించని హక్కులపై ఈ ప్రత్యేక వ్యాసం.

రాజ్యాంగం ద్వారా వికలాంగులకు సంక్రమించిన హక్కులు :
1. 14వ అధికరణ ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే.
2. 15(1) అధికరణం ప్రకారం పౌరులపై జాతి, మతం, లింగం, పుట్టుక ఆధారంగా ఎలాంటి వివక్ష ప్రదర్శించడానికి వీలు లేదు.
3. 16(2) అధికరణం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులపై జాతి, లింగం, పుట్టుక, వారసత్వం, స్థిర నివాస ప్రాతిపదికన వివక్ష ప్రదర్శించరాదు.
4. 21(ఎ) అధికరణ ప్రకారం విద్యా హక్కును 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21(ఎ) ప్రకరణలో చేర్చారు. దీని ప్రకారం 6 - 14 సంవత్సరాల వయస్సుగల వారందరికి ప్రాథమిక ఉచిత నిర్బంధ విద్య అనేది ప్రాథమిక హక్కుగా మారింది. విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1న దేశవ్యాపితంగా అమలులోకి వచ్చింది. దేశంలో వున్న వికలాంగ పిల్లలకు కూడా ప్రాథమిక విద్య అనేది హక్కుగా ఏర్పడింది.

5. 29 (2) అధికరణ ప్రకారం ప్రభుత్వం నిర్వహిస్తున్న లేదా ప్రభుత్వం ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థల్లో ప్రవేశానికి జాతి, మతం, కులం, భాషా ప్రాతిపదికపై వివక్ష చూపరాదు.
6. 41వ అధికరణ ప్రకారం నిరుద్యోగులకు, వృద్ధులకు వికలాంగులకు జీవన భృతి కల్పించాలి.
వీటితో పాటుగా జీవించేహక్కు, భాగస్వామ్య హక్కు, తదితర హక్కులు రాజ్యాంగబద్ధంగా పౌరులందరికి కల్పించిన హక్కులే. కానీ 15(1), 16(2) అధికరణలో వైకల్యం అనే పదం వీటిలో చేర్చకపోవడం మూలంగా ప్రభుత్వం ఎన్ని చట్టాలు, జిఓలు చేసినా వాటి అమలు తీరు అంతంతమాత్రంగానే ఉంటోంది.

పార్లమెంటు చేసిన చట్టాలు
ఐక్యరాజ్య సమితి 1981 సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ప్రకటించిన అనంతరం భారతదేశం వికలాంగుల సమస్యలపై దృష్టి కేంద్రీకరించి అనేక చట్టాలు చేసింది.
ఎ. మెంటల్ హెల్త్ యాక్ట్ : మానసిక వికలాంగుల ఆరోగ్యం వారి జీవన ప్రమా ణాలు మెరుగుపరిచేందుకు, కావాల్సిన చికిత్స అందించేందుకు మరియు వారిని సంరక్షించేందుకు, వారి ఆస్తులను రక్షించేందుకు 1993లో మెంటల్ హెల్త్ యాక్ట్ రూపొందించారు.. దీని ప్రకారం మానసిక వికలాంగులకు రక్షణ, పునరావాస సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు ఆధ్వర్యంలో సంస్థలను ఏర్పరిచే అవకాశం చట్టపరంగా ఏర్పడుతుంది. ఈ చట్టం ఉన్నా అమలు జరగడంలేదు.

జాతీయ ట్రస్టు చట్టం : ఆటిజం, సెరిబ్రల్ పాల్సి, బుది ్ధమాంద్యం, బహుళ అంగ వైకల్యాలతో బాధపడేవారి కోసం రూపొందించినదే ఈ జాతీయ ట్రస్టు చట్టం. ఇది దేశవ్యాప్తంగా 1999లో అమల్లోకి వచ్చింది. మానసిక, అంగ వైక ల్యం కలిగిన వికలాంగులకు జీవితాంతం ఆసరా ఇవ్వడానికి వారి తల్లిదండ్రుల తదనంతరం వికలాంగులను ప్రధాన స్రవంతిలో భాగస్వాముల్ని చేయడమే ఈ చట్టం ముఖ్యోద్దేశం. ఈ బోర్డుకు ఛైర్మన్ కూడా లేకపోవడం వల్ల అమలు పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది.
వికలాంగుల చట్టం 1995 (సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్యం) : ఈ చట్టం వికలాంగులలో కొత్త ఆశలు చిగురింపచేసింది. వైకల్య నిర్వచనం, కేంద్ర రాష్ట్ర సమన్వయ కమిటీల ఏర్పాటు, వైకల్యాల ప్రారంభ దశ, నిరోధక చర్యలు, వికలాంగులకు విద్యా హక్కు, ఉపాధికి సమాన గౌరవం, గుర్తింపు, సంస్థల స్థాపన, వివక్ష నిర్మూలన, సౌకర్యాలు, ఉద్యోగ భద్రత, పరిశోధన, మానవ వనరుల అభివృద్ధి, సాంఘిక చైతన్యం, ఎన్‌జిఓల గుర్తింపు, పని నాణ్యత, వైకల్యంగల వారి కోసం పనిచేసే సంస్థల ఏర్పాటు చేయాలన్న అంశాలు వంటి వాటితో ఉంది. ఈ చట్టం కూడా పూర్తి స్థాయిలో అమలు జరగకపోవడం మూలంగా దేశ అత్యున్నత న్యాయస్థానం పదేపదే స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఐక్యరాజ్యసమితి (యూఎన్‌సిపిఆర్‌డి) వికలాంగుల ఒప్పందం పత్రం:
భారత ప్రభుత్వ కేబినేట్ సిఫారసులతో 2007 అక్టోబరు 1న రాష్ట్రపతి దీనిని ఆమోదించారు. అప్పటి నుండి యుఎన్‌సిపిఆర్‌డి ఒప్పంద పత్రం అమలౌతోంది. వికలాంగులు ప్రధానంగా ఇతరులతో సమానంగా జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కు, స్వేచ్ఛను అనుభవించే హక్కు, ప్రోత్సాహకాన్ని అందిస్తూ, భద్రతను కల్పిస్తూ వికలాంగుల్లో స్వాభిమానాన్ని పెంచడమే ఈ ఒప్పంద ముఖ్యోద్దేశం.
వికలాంగులకు విద్య చేరువ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవశపెట్టిన పథకాలు :
1. సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఎ) :
2000-01 విద్యా సంవత్సరం నుండి సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం కోసం 6 - 14 సంవత్సరాల బాల బాలికలకు ప్రాథమిక విద్యనందించేందుకు ఈ పథకం రూపొందించారు. ఇది వికలాంగులైన పిల్లల విద్యపై దృష్టిసారించింది.

2. ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ డిసేబుల్డ్ ఎట్ సెకండరీ స్టేజ్ :
ఈ పథకం 2009 - 10 విద్యా సంవత్సరంలో ప్రారంభమైంది. 9వ తరగతి నుండి ఇంటర్‌మీడియట్ వరకు సమ్మిళిత విద్యనభ్యసిస్తున్న వికలాంగ విద్యా ర్థులకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
3. యుజిసి, సిబిఎస్ఇ, ఇంటర్‌బోర్డులు, ఎస్ఎస్‌సి బోర్డులు :
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్, సెంట్రల్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, అన్ని ర్రాష్టాల్లోని ఇంటర్‌మీడియట్ బోర్డులు, సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డులు, వికలాంగ విద్యార్థులకు విద్యా సంస్థలు అవరోధ రహితంగా ఉండాలని,దానికి సంబంధించి వివిధ పథకాలతో యూజీసీ దీనిని జారీ చేసింది. పిడబ్ల్యుడి చట్టం అమలులో భాగంగా విశ్వవిద్యాలయాల్లో 3 శాతం విద్య, ఉద్యోగాలు భర్తీ, తదితర అనేక ఉత్తర్వులు యుజిసి జారీ చేసింది. కానీ వికలాంగుల హక్కుల్ని విశ్వవిద్యాలయాల అధికారులు నిర్లక్ష్యం చేయడం మూలంగా యుజిసి అందించిన హక్కులు వికలాంగులు పొందలేకపోతున్నారు.

4. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా : వికలాంగులకు బోధించడానికి గాను, బోధకులను తయారుచేయడానికి కేంద్ర ప్రభుత్వం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే నూతన స్వతంత్ర సంస్థను ఏర్పరచింది. ఈ సంస్థ స్పెషల్ బిఇడి, డైట్, యం.ఇ.డి, యం.ఫిల్, పిహెచ్‌డి కోర్సుల ద్వారా వికలాంగులకు బోధకులను తయారుచేస్తుంది.
5. దీన్‌దయాల్ డిసేబుల్డ్ రిహాబిలిటేషన్ స్కీం (డిడిఆర్ఎస్) : ఈ పథకం ద్వారా వికలాంగుల విద్య కోసం కృషి చేసే పరభుత్వేతర సంస్థలకు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఈ స్కీం ద్వారా 11వ పంచవర్ష ప్రణాళికలో రూ.364.10 కోట్లు 586 ఎన్‌జిఓ సంస్థలకు అందించింది.

6. నేషనల్ హ్యాండికాప్డ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్ఎఫ్‌డిసి)
వైకల్యంతో బాధపడుతున్న వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా వికలాంగులకు స్వయం ఉపాధి, నైపుణ్యం పెంపు, ఉన్నత విద్యనందించడానికి ఎన్‌హెచ్ఎఫ్‌డిసి అనే సంస్థను ఏర్పరచి కృషి చేస్తోంది.
7. రాజీవ్‌గాంధీ నేషనల్ ఫెలోషిప్‌లు : రిసర్చ్ చేసే వికలాంగ స్కాలర్స్ కొరకు ప్రతి విద్యా సంవత్సరం 200 మందికి ఫెలోషిప్‌లు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ ఫెలోషిప్ ద్వారా నెలకు 25 వేల రూపాయలతోపాటుగా హెచ్ఆర్ఎ, స్రైబ్ ఆలవెన్సులు కూడా ఇస్తారు.
8. దేశ వ్యాపితంగా వికలాంగుల కోసం 7 జాతీయ సంస్థలను ఏర్పరచి వాటి ద్వారా వికలాంగుల సమస్యలపై పరిశోధనలు, విద్య, పునరావాసం, రక్షణ, స్వయం ఉపాధి, స్పెషల్ స్కిల్స్ డెవలప్‌మెంట్, వికలాంగులను మానవ వనరులుగా తీర్చిదిద్దడానికి క్రియేటివ్ తదితర అంశాలపై అబివృద్ధి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. కెజి నుండి పిజి వరకు విద్యను అందిస్తున్నారు.

పిడబ్ల్యుడి యాక్ట్ 1995 కల్పించిన 3 శాతం ఉద్యోగాల్లో రిజర్వేషను అమలు చేయడంలో భాగంగా అనేక ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. సుప్రీంకోర్టు కూడా 3 శాతం ఉద్యోగాలు వికలాంగులకు తప్పకుండా కేటాయించాలని చెప్పింది.
ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్, ఒకేషనల్ ్రటైనింగ్ పరిశోధన, వికలాంగ మానవ వనరుల అభివృద్ధి, పునరావాసం తదితర సమస్యలపై అలాగే వికలాంగుల్ని ప్రధాన స్రవంతిలో భాగస్వాములను చేయడం కోసం ఈడిడిఆర్‌సిఎస్, సిఆర్‌సిఎస్‌లు పనిచేస్తాయి. అలాగే ఇందిరాగాంధీ ఆవాస్ యోజన పథకం ద్వారా వికలాంగులకు ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందచేస్తుంది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంత బస్సుల్లో 100%, జిల్లా బస్సుల్లో 50% రాయితీ మరియు దేశవ్యాపితంగా రైల్వే ప్రయాణ ఛార్జీల్లో, విమాన ఛార్జీల్లో 50% రాయితీలు వికలాంగులకు అందుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రూప్1 నుండి అటెండర్ స్థాయి ఉద్యోగాల్లో వికలాగులకు 3 శాతం రిజర్వేషన్ల సౌకర్యం కల్పించారు.. ప్రొఫెషనల్ టాక్స్ మినహాయింపు, జిఓఎంఎస్ 1063 ప్రకారం, అలాగే కేంద్ర ప్రభుత్వ నియామకాలకు అనుగుణంగానే ఉద్యోగులకు అలవెన్సులు, సౌకర్యం, పిఆర్‌సి సౌకర్యం ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ ద్వారా వైకల్యోపకరణాలు, రుణాలు అందిస్తుంది. తెలంగాణాలో వికలాంగుల విద్య కొరకు రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్స్‌ను కొనసాగిస్త్తోంది. 10 వికలాంగుల హాస్టళ్లు రాష్ట్ర రాజధానిలో ఉండటం చెపకోదగ్గ విషయం. ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, అంధ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పోస్టుగ్రాడ్యుయేట్ చదివే శారీరక వికలాంగ విద్యార్థులకు మోటార్ వాహనాలు ఇస్తున్నారు. అంధులకు, బధిరులకు పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా సంస్థలను నిర్వహిస్తూ వికలాంగుల విద్య కోసం పనిచేసే ఎన్‌జిఓలకు నిధులు కేటాయిస్త్తోంది. తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కొరకు కమిషనర్ కార్యాలయం ద్వారా కృషి చేస్తోంది. వికలాంగులకు సాయపడటంలో అవిరళంగా పాటు పడుతోంది .
పి.రాజశేఖర్
 
 
Surya Telugu News Paper Dated: 03/12/2015

Post Comment

Monday, October 5, 2015

విషతుల్య సాహితీ లోకంలో అక్షరాల పచ్చి నిజాలు! By వేముల యల్లయ్య


Updated :04-10-2015 23:40:13
దళిత నవల ప్రయాణానికి ఒక నీతి సూత్రాన్ని తన అద్భుతమైన కథనరీతులతో తెలుగులోకానికి ‘మైల’ నవల ద్వారా వరకుమార్‌ గుండెపంగు అందించాడు. ‘మైల’ నవల చదువుతూ ఉంటే అరాచకులు ఒక వైపు, అంటరానివారు ఒక వైపు కనిపిస్తారు.
 
సాహితీ వినీలాకాశంలో నవల ఎంత పరిపూర్ణత సంతరించుకుంటుందో పాఠకులు కూడా అదే స్థాయిలో దానిని ఆదరిస్తారు, అక్కున చేర్చుకుంటారు. తన ఆలోచనలతో అక్షరాల అల్లిక పొందుపరచిన విధానం రచయిత సృష్టించిన భావజాలాన్ని పాఠకులకు పంపుతుంది. పాఠకుడూ రచయిత తో పాటు పలు దారులలో ప్రయాణిస్తాడు. మౌఖిక కథనం అత్యంత ప్రాచీన కథన రీతి. సంచారుల సాహిత్యంలో భుక్తి కథనం జీవితమై అల్లుకుంటుంది. ధర్మ గ్రంథాలలో వివిధ రకాలైన దృష్టాంతాలు జనానికి ఉన్నతాశయాలను నిరూపణ చేసే కథనంతో ఉంటాయి. ఆ కథనంలో కథ గానమై అల్లుకుంటుంది. కొంత విస్తృతమై నవల రూపం ఎత్తుకుంటుంది. ఆనాటి జీవితాలకు బాగోతులు, వృత్తి గాయకుల నోటి ద్వారా కథ జనాన్ని చేరుతుంది. చేతి వాయిద్యంతో పాటు మెదడు కదిలిన వృత్తాంతాన్ని కథలుగా అల్లుతారు.
 
కథనం బజారుల బతుకు తంతుగా ఉంటుంది. అశ్రుత గాయకులు కుల నాయకత్వ లక్షణాలు అలవడే విధానాన్ని మౌఖికంగా కథను అల్లి చూపిస్తారు. రానురాను అక్షరజ్ఞానులు బుద్ధుని జాతక కథలతో మమేకమవుతారు. విస్తారమైన కథల సృష్టిలో మానవుని మనుగడ సాగే విధానం నైతిక తత్వాలు, తత్వశాస్త్రాలతో చిన్ని చిన్న కథలుగా జనానికి చేరుతుంది. ఇది తత్వానంతర శాస్త్రంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా జ్ఞానం, బుద్ధి, బోధ మనకు బైబిల్‌లో కనిపిస్తాయి. బైబిల్‌ తెలుగు అనువాదం జరిగిన తర్వాత జనం కథన రీతులను, అందులో ఉన్న ప్రబోధాలను చదివిన తరువాతే అప్పుడప్పుడే అక్షర జ్ఞానం నేర్చుకుంటున్న కింది జనం ఆ బైబిల్‌ పాఠకులుగా అలవాటుపడ్డారు. ఆ అలవాటే అంటరాని వాళ్ళ జీవితాలతో ‘ఏసు’ ఒక వెలుగు రేఖై బడుగుల సావడి ముందు అంటరానివాళ్ళను అక్కున చేర్చుకున్న పాస్టర్లు(అయ్యాగార్లు) కొంత మేలు కూడా చేసినారు. ఈ మేలును అగ్రకులస్తులు సహించక వాళ్ళమీద చెడుప్రచారం చేయడం జరిగింది. ఆ చెడుతో పాటు వీళ్ళు కూడా తన విలువైన బోధన సంపత్తిని అగ్రకుల బ్రాహ్మణిజా నికి భయపడి అమ్ముడుపోయి అందలాలకు అలవాటుపడ్డారు.
 
తెలుగు నవలా సాహిత్య జగత్తులోకి 2013 మేలో ‘మైల’ నవలా రచయిత అరుదైన ప్రవేశం జరిగింది. అప్పటికే కథ, నవల ఉత్తరాంధ్ర, రాయలసీమ, కొంత తెలంగాణ మార్క్సిస్టుల కబ్జాలో బందీ అయ్యాయి. సామాన్య జనానికి నవలా ప్రక్రియ అర్థం కాకుండా కుహనా మేధావులు అనేవారు తమ తమ సంఘాలకే పరిమితం చేశారు. ఈ వ్యవస్థ మీద ఆక్రోశంగా ఉన్న దళిత, గిరిజన, ఆదివాసి యువకులకు నవలా సారాంశం చెప్పకుండా అబద్ధపు ప్రసంగాలతో ఈ యువతను సాహితీక్షేత్రం నుంచి తప్పించారు. అయితే దళిత ప్రవాహమనే ఒక మహా ప్రవాహం సాహితీక్షేత్రాన్ని ఖండ ఖండాలుగా కులదొంతరులను విడగొట్టి హక్కుల ఉద్యమాలను తెలుగు ప్రాంతమంతా పరిగెత్తించింది. ఈ పూర్వరంగమంతా సాహితీ విలువలను మహనీయుల మానవత్వాన్ని, చెడును వదిలేసి కొంత మంచిని పిడికిట పట్టుకొని ‘మైల’ శుద్ధాత్మక నవలను తెలుగు సాహితీలోకానికి అందించిన ఘనత ‘వరకుమార్‌ గుండెపంగు’ కు దక్కుతుంది. బైబిల్‌ బోధకునిగా అపారమైన జ్ఞానసంపన్నుడు కూడా అయినందునే ఆయన ఈ ‘మైల’ నవలను సృష్టించగలిగారు. ఈ నవలలో కథానాయకుడు సాహిత్యాన్ని ఒక అల్లికగా మనిషి జీవితాలకు మెలిపెట్టి అర్థం చేయిస్తాడు, అర్థవంతమైన రచనా పటిమతో. కాని మన దేశ సాహిత్యం మహా భారత, ఉపనిషత్తుల రామాయణంలో కానిపోని కథలుంటాయి. అఖండమైన మూల వాసి జీవన విధానానికి వ్యతిరేకంగా ఈ జీవులు సంఘం అనే నీతి గుండంలో సమిథలవుతారు; తమ కళా రూపాలను అగ్ని గుండంలో బుగ్గి పాలు చేసి తాము దగ్ధమై వాళ్ళ ఆదర్శ గ్రంథాలలో కథనరీతులలో ఈ దేశ అసలు మూల వాసులకు నీతి బోధకాలు అందించిన చరిత్ర సాహిత్యంలో మిక్కిలి తక్కువగా ఉంది. ఈనాటికథ అంటే కులం, అవహేళన, అంటరానితనం, ప్రేమ, డిటెక్టివ్‌, అద్భుత ఘటనలు విజ్ఞానమనే సుడిగుండంలో శాస్త్రయుత కథన రీతులు తెలుగునేలలో ఏలుబాటుకి అలవాటు పడ్డాయి.
 
కాని, కుల నిర్మూలన-వర్గనిర్మూలన విషయాలు ఏవైనా మార్పుతో పాటు ఆదర్శాలు అటు వుంచితే అంటరానితనం, కుల నిర్మూలన అనే కథన రీతులుగా, ఇప్పుడు దళిత నవల ప్రయాణానికి ఒక నీతి సూత్రాన్ని తన అద్భుతమైన కథనరీతులతో తెలుగులోకానికి ‘మైల’ నవల ద్వారా వరకుమార్‌ అందించాడు. ‘మైల’ నవల చదువుతూ ఉంటే అరాచకులు ఒక వైపు, అంటరానివారు ఒక వైపు కనిపిస్తారు. ‘మత’ మనే ముసుగు అరాచకుడు ఆయుధంగా ఉపయోగిస్తే, అంటరాని జాతులు బైబిల్‌ జ్ఞానాన్ని ఒంట బట్టించుకున్న విధానాన్ని నవలలో పొందుపరుస్తూ, హక్కుల ఉద్యమ కథానాయకునిగా కుమార్‌ అనే పాత్ర ద్వారా మళ్ళీ ఒక పోరాటాన్ని చేస్తూ కనిపిస్తాడు. నిండు ప్రజల మధ్య నిజాన్ని నిగ్గు తేల్చాలని తను ఆ పాత్రై రచయిత జీవిస్తాడు. కథనమై కలాన్ని ‘కవాతుగా’ సన్నద్ధం చేస్తాడు. భారతీయ నవలల నుండి ఇప్పటి ‘మైల’ తిరుగులేని గ్రంథంగా చెప్పుకోవచ్చు. మనిషి జన్మ ఒక కుదురు నుంచి ఉద్భవిస్తుంది అనిచెబుతూ, ఆ తరువాత ‘ఆది జాంబవ పురాణం’ మూలాలు ఇందులో కథలు కథలుగా వివరిస్తాడు రచయిత. విస్తృతార్థంలో చర్చించిన కథనాయకుడు ఎంత ఆదర్శంగా చెప్తాడో అదే పెరిగి, పెరిగి పెద్దదై నవలగా రూపాంతరం చెందుతుంది.
 
వరకుమార్‌ గుండెపంగు కలం నుంచి జాలువారిన మరొక నవల ‘‘నేను బానిసనా?’. కడు బీదలుగా పోలీసు జీవితాలను అద్భుతంగా మలచి, వారి దుఃఖానికి అద్దం పట్టిన నవల ఇది. నవలంతా తాను పోలీసు పాత్రలో ఇమిడి ఏమీ చేయలేని స్థితిలోని ఖాకీ కర్కశత్వానికీ, తన బట్టలనిండా చెమటోడ్చిన బానిసత్వపు బతుకులకీ, బందూకుల బానిస జీవితానికీ అద్దం పడతాడు. కథానాయకుడు భరత్‌ రూపంలో ‘బందోబస్తు’కు బలపరచని పోలీసు మాన్యువల్‌ను మార్చాలని ప్రతిన బూనిన రచయిత ఇందులో కనిపిస్తాడు. అనేకానేక ప్రదేశాలను, సంఘటనలూ, వాటి చుట్టూ ఉన్న కన్నీళ్ళనూ ఒక్క దగ్గరకు చేర్చి మనకంట కన్నీరు పెట్టిస్తాడు. గ్రామం, వాడ, పట్టణం, మహానగరం... ఏదైనా సరే, రక్షణ అనే ప్రక్రియ ఎక్కడుంటే అక్కడ పోలీసు జీవితాలు ప్రమిదలుగా మారిపోయిన తీరు ఈ నవలనిండా మనకు కనిపిస్తుంది. నిత్యం భుజం మీద తుపాకులు మోస్తూ, నడుములు విరిగిన గూనివాళ్ళుగా, నిజాలు చూస్తున్న గుడ్డివాళ్ళులాగా పోలీసులు తయారుకావడానికి మూలకారణాలు వెతికిపట్టి, పోలీసు బాసులు చేస్తున్న అరాచకాలకు జుట్టు ముడేసి మూరెడు ముగుతాడుతో ముగింపు ఇస్తానంటాడు రచయిత వరకుమార్‌. నిర్దిష్టమైన జ్ఞానం ఈ నవల చదివితే విస్తారమవుతుంది. నిజాన్ని నడిబజారులో నిలదీస్తానని ప్రతినబూని- ‘మైల’ (శుద్ధాత్మక) నవల, ‘నేను బానిసనా..?’ (పోలీసు దుఃఖం) అనే రెండు నవలలు పాఠక లోకానికి అందించిన వరకుమార్‌ గుండెపంగు అభినందనీయుడు. లోపలి గుట్టును బయటకు గుంజి పరులముందు పంచనామ చేయడమే ఈ నవలలు సాధించిన విజయ రహస్యం. 
Andhra Jyothi Telugu News Paper Dated: 05/10/2015
వేముల యల్లయ్య
9440002659

Saturday, May 23, 2015

దళిత బాంధవుడు (భాగ్యరెడ్డివర్మ) By ఆదినారాయణ గిన్నారపు


మేదరి భాగయ్య (భాగ్యరెడ్డివర్మ) 1888 మే 22 న హైదరాబాద్‌లో మేదరి రంగమాంబ, వెంకయ్య దంపతులకు జన్మించారు. సమాజంలో దళితుల బాధలను స్వయాన తానూ అనుభవించాడు. ఈ సమాజంలో తన జాతి వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందాలని దళితులు తమ సమస్యలను పరిష్కరిం చుకోవడానికి, సామాజిక చైతన్యం ఉంటేనే ఆధిపత్యం అణచివేతను ప్రశ్నించవచ్చన్న భాగయ్య ఇందుకు చదువుకోవడమే సరైన మార్గమని దిశానిర్దేశం చేశారు. అందుకోసం హైదరాబాద్‌తో సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో దాదాపు ఇరవై ఆరు పాఠశాలలను నెలకొల్పి దళితజాతి చైతన్యం కోసం వందలాదిమంది దళిత విద్యార్థులకు చదువుకొనే అవకాశం కల్పించారు. నిజాం పాలనలో సాంఘిక దురాచారాలను రూపుమాపే ప్రయత్నం చేశారు. స్త్రీల నిరక్షరాస్యతను, బాల్య వివాహాలను, దేవదాసి వ్యవస్థను నిర్మూలించే పయత్నం చేశారు. ఇందుకు గాను 1906లో హైదరాబాదులోని ఇస్లామియా బజార్ వద్ద జగన్మితమండలిని స్థాపించి బాలబాలికలకు చదువు నేర్పించారు. మద్యపానం, మాంసాలను నిషేధించడం, దేవదాసి వ్యవస్థను నిర్మూలించడం లాంటి సమాజోపయోగకర పనులు ప్రారంభించారు.

1906లో హిందూ సోషల్ లీగ్ అనే సంస్థను ప్రారంభించి అస్పృశ్య వర్గాల బానిసత్వాన్ని, వెట్టిచాకిరి వ్యవస్థను వ్యతిరేకిస్తూ బ్రాహ్మణులు కల్పించిన అసమానతల రహస్యాలను బట్ట బయలు చేశారు. 1910లో ప్రచారిని సభను స్థాపించి దళితు ల కు నీతి నియమాలు బోధిస్తూ హిందూ మతంలోని రహస్యాల గుట్టు విప్పారు. 1914లో హైదరబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో ఆదిహిందు భవన్ స్థాపించారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి దానికి కారణమవుతున్న సవర్ణ వర్గాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఉద్యమం తెలుగు నేలకే పరిమితం కాకూడదని అఖిల భారత ఆది ఆంధ్రుల మహాసభను హైదరాబాదులో నిర్వహించారు. అంటరాని కులాలను ఆది ఆంధ్రులు గా గుర్తించాలని డిమాండ్ చేశారు. అంతిమంగా ఆదిహిందువులుగా పిలవాలని ప్రకటించారు. ఈ ఉద్యమ ఫలితంగా నాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ (తమిళులు) అను పదాలను అస్పృశ్య వర్గాలకు వాడాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కాలంలో భాగ్యరెడ్డివర్మను అనేకమంది అగ్రవర్ణాల వారు వ్యతిరేకించినా ఒక్కడే ధైర్యంగా నిజాం ప్రభువుతో ఉన్న దగ్గరి సంబంధం వల్ల ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. మహారాష్ట్రలో అంబేద్కర్ దళితుల పట్ల పోరాడుతున్న విధానా న్ని అభినందించారు. మహారాష్ట్రలో అంబేద్కర్ ఏర్పాటు చేస్తు న్న కళాశాలకు భాగ్యరెడ్డి వర్మకు నిజాం రాజుతో ఉన్న సాన్నిహిత్యం వల్ల పది లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. దీని ద్వారా ఎంతో మంది విద్యార్థులు గొప్ప విద్యావంతులుగా ఎదిగారు. ఇంకా చాలా మంది విద్యావంతులు కావాలని 1931 లో ఆదిహిందూ భవన్‌కు అనుబంధంగా భాగ్యనగర్ పత్రికను స్థాపించి విలువైన సమాచారాన్ని ప్రజలకు అందించారు. 1937 లో ఈ పత్రికను ఆది హిందూ పత్రికగా పిలిచారు. నిరంతరం దళితుల కోసం పాటుపడిన భాగ్యరెడ్డి వర్మ 1939 ఫిబ్రవరి 18న దివంగతులయ్యారు. 

Namasete Telangana Telugu News Paper Dated:22/02/2015

Friday, May 22, 2015

సామాజిక ధర్మంతోనే సామరస్యం (22-May-2015) By కృపాకర్‌ మాదిగ పొనుగోటి


ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 61 షెడ్యూల్డు కులాల వారి మధ్య సమానత్వం, సామాజిక న్యాయం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2015 మే ఒకటవ తేదీన జీవో నెంబర్‌ 25ను జారీ చేసింది. నిజానికి సామాజిక న్యాయ ఉద్యమాలు ఇటీవల సాధించుకున్న ఒక మంచి ఉత్తర్వు ఇది. ఈ జీవో రావడానికి ఉద్యమించిన మాల కాని ఎస్సీ కులాల సంఘాలు, కార్యకర్తలందరూ ఇందుకు అభినందనీయులు. మాదిగ మహాశక్తి ఉద్యమాలతో ఈ జీవో జారీకి చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సాంఘిక సంక్షేమ శాఖమంత్రి రావెల కిషోర్‌బాబు గారికి ప్రత్యేకించి మాదిగ మహాశక్తి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నది. ఇప్పటి వరకూ ప్రభుత్వ సంక్షేమ, ఆర్థిక విధానాలన్నీ ప్రభావవర్గంగా లేదా శిష్టవర్గంగా లేదా షెడ్యూల్డు కులాల మధ్య అత్యంత ప్రాబల్య కులంగా తయారైన ఒకే ఒక ఎస్సీ అగ్ర (మాల) కులానికి అనుకూలంగా ఉంటూ వచ్చాయి. ఇదే సమయంలో ఎస్సీ కులాల మధ్య సాపేక్షికంగా ఎక్కువ అణిచివేతలకు, వెనకబాటుతనాలకు గురైన మాదిగలు ఇతర ఎస్సీ కులాల అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలు మారాయి. తెలివైన సమూహాలు - అమాయకపు సమూహాల మధ్య, బలమైన సమూహాలు - బలహీనమైన సమూహాల మధ్య బతుకుదెరువు అవకాశాలు ఉంచి, పోటీ పెడితే ఏం జరుగుతుందో, ఇక్కడ షెడ్యూల్డు కులాల మధ్యన కూడా అదే జరిగింది. జరుగుతున్నది.
పంపిణీ న్యాయం - సామాజిక న్యాయం - ఏకరూప అభివృద్ధికి ఆయా కులాల జనాభా నిష్పత్తుల కనుగుణంగా ప్రతి ఎస్సీ కులానికీ అవకాశాలు కల్పించే విధంగా ఈ 25 నంబర్‌ జీవో ఉన్నది. పేదరిక నిర్మూలన పథకాలు, స్వయం ఉపాధి పథకాలు, ఇళ్ళ స్థలాల పంపిణీ, గృహ నిర్మాణం, భూమి కొనుగోలు పథకం ద్వారా సాగుభూములు పంపిణీ, ఎస్సీ ఉప ప్రణాళిక కింద ప్రత్యేకంగా అందే నిధులు, సంక్షేమ, ఆర్థిక పథకాలను సామాజిక న్యాయ పంపిణీ సూత్రాలకు అనుగుణంగా ప్రతి షెడ్యూల్డు కులానికీ అందించడానికి ఉద్దేశించి ఈ జీవో నెంబర్‌ 25ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ కోసం ఈ నెల తొమ్మిది, పది తేదీల్లో బెంగుళూరులో జరిగిన జాతీయ స్థాయి సదస్సు 25వ నంబర్‌ జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది. ఇంతేకాకుండా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను మాదిరిగా తీసుకొని ఆయా రాష్ర్టాల్లోని అన్ని రాష్ర్టాల ప్రభుత్వాల ద్వారా ఇటువంటి జీవోలను జారీ చేయించుకోవాలని వివిధ రాష్ర్టాల నుంచి పాల్గొన్న ఆయా సంఘాల ప్రతినిధులు, నాయకులు, మేధావులు ఈ సదస్సులో తీర్మానించారు.
సరే, ఇది ఎంత మంచి జీవో అయినప్పటికీ, చూసుకొని మురిసిపోవడానికే తప్ప ఇలాంటి జీవోలని ప్రభుత్వ అధికారులు పటిష్ఠవంతంగా, సక్రమంగా అమలు చెయ్యరనే సంగతి మనకు తెలియనిది కాదు. ఇందుకు ప్రబలమైన ఉదాహరణ ప్రస్తుత 25వ నంబర్‌ జీవోకి మూల రూపమైన జీవో నెంబర్‌ 183 అమలు జరపని తీరే. 1997 డిసెంబర్‌ 16న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ 183వ నంబర్‌ జీవోని విడుదల చేసింది. సాంఘిక సంక్షేమ శాఖలో ఇతరత్రా శాఖల్లో ఉన్న కొందరు మాల అధికారులతోపాటు ఆయా ఆధిపత్య కులాల ప్రభుత్వాలన్నీ ఈ 183వ నంబర్‌ జీవో అమలు కానీయకుండా తొక్కిపెట్టిన సంగతి మాదిగలతో పాటు మిగిలిన ఎస్సీ కులాల వారందరికీ బాగా తెలిసిందే. ఈ 183 జీవోని ప్రస్తుత 25వ నంబర్‌ జీవోగా మార్చి, 2011 జనాభా గణాంకాలకనుగుణంగా ఎస్సీ సబ్‌ప్లాన్‌కు కూడా వర్తింపజేస్తూ రాబోయే పదేళ్ళ కాలం పాటు అమలులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యీ తాజా సవరణ ఉత్తర్వునిచ్చింది.
 
ఈ 25వ నంబర్‌ జీవో అమలు జరగటం వలన గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులు, చదువు మధ్యలో ఆగిపోయినవారు, వ్యవసాయ కూలీలు, నిరుపేదలు, యువకులు, మహిళలు అయిన అన్ని షెడ్యూల్డు కులాలలోని మెజారిటీ ప్రజలకు సంక్షేమ పథకాలు పొందటానికి వీలుకలుగుతుంది. ప్రతి జిల్లాలోని ఎస్సీ జనాభాను యూనిట్‌గా తీసుకుని ఆయా ఎస్సీ కులాల వారి నిర్దిష్ట జనాభా నిష్పత్తులకనుగుణంగా అన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రతి ఎస్సీ కులానికీ అందించాలని ఈ జీవో నిర్దేశించడం హర్షణీయం. ఈ జీవో సక్రమంగా నిరంతరాయంగా అమలయితే, షెడ్యూల్డు కులాల మధ్య ప్రస్తుతం పెద్దగా కొనసాగుతున్న అభివృద్ధి వ్యత్యాసాలు తగ్గిపోయి, ఏకరూప అభివృద్ధికి పునాదులు ఏర్పడతాయి. ఈ 25వ నంబర్‌ జీవో అమలు వల్ల ఎవరికీ ఎటువంటి నష్టమూ, అన్యాయమూ జరగదని తెలిసినప్పటికీ, ఇప్పటి వరకూ అదనంగా పొందుతూ వున్న ఆర్థిక, సంక్షేమ లబ్ధిని కోల్పోతామన్న దురుద్దేశంతో కొన్ని మాల సంఘాలు, కొందరు మాల నాయకులు ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్దీకరణ (వర్గీకరణ) మాట ఎత్తితే నాలుకలు తెగ్గోస్తామని గోదావరి మాల నాయకుడొకరు ఇటీవల బహిరంగ హెచ్చరిక చేసేశారు! ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్దీకరణ అనేది కాలం చెల్లిన సమస్య అని తెలంగాణ మాల నాయకుడొకరు ప్రకటించేసారు! సామాజిక న్యాయానికి - పంపిణీ న్యాయానికి - వ్యతిరేకంగా మాల కులంలో చెలరేగుతున్న ఇటువంటి అసాంఘిక శక్తులు, వ్యక్తుల వలన షెడ్యూల్డు కులాల మధ్య దూరం, అపోహలు పెరుగుతున్నాయి. ఎస్సీ కులాల మధ్య సామరస్యం, ఐక్యత దెబ్బతింటున్నది. ఇదే సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకులు, ఉద్యమకారుల పేరిట చెలామణి అవుతున్న నాయకులు, కుల పెద్దలుగా ఉన్న కొందరు ఉన్నతాధికారులు కొనసాగిస్తున్న మౌనాన్ని గనక గమనిస్తే వీరే కొన్ని అసాంఘిక శక్తులకు ఊతం అందిస్తున్నారేమో అనే అనుమానం ఎవరికైనా కలుగక మానదు.
 
భారత జనాభా 2011 గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మాదిగ జనాభా అత్యధికంగా ఉండగా, మిగిలిన జిల్లాల్లో మాల వారి సంఖ్య కొంచెం అధికంగా ఉన్నదని తెలుస్తున్నది. అలాగే రాష్ట్రంలో ముప్పై ఎనిమిదిన్నర లక్షల మంది మాదిగ అనుబంధ కులాల ప్రజలుండగా, నలభై రెండు లక్షల మంది మాల అనుబంధ కులాల ప్రజలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ గణాంకాలు కూడా మాదిగలు, మిగిలిన సాపేక్షిక అణగారిన ఎస్సీ కులాలకు వాస్తవిక సంఖ్యలకు అద్దం పట్టేవిగా లేవేమోనని ఈ వ్యాసకర్త అనుమానం. ఎన్నో ఏళ్ళుగా ఎస్సీ రిజర్వేషన్లలో పంపిణీ న్యాయం, సామాజిక న్యాయం, సరైన ప్రాతినిధ్యం కోసం అన్ని షెడ్యూల్డు కులాల వారు చేసిన ఎన్నో ఉద్యమాల ఫలితంగా వచ్చిన యీ 25వ నంబర్‌ జీవో అమలు వలన తమకు కొంతమేరకు న్యాయం జరుగుతుందని అణగారిన ఎస్సీ కులాలన్నీ ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈ జీవో పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఈ జీవోను రద్దు చెయ్యాలనే అసాంఘిక, అన్యాయ వాదనలకు, వ్యతిరేక చర్యలకు దిగుతున్న కొందరు మాల వారి దుశ్చర్యలను మాల కుల పెద్దలుగా, ప్రముఖ మాల అంబేద్కరిస్టులుగా, బుద్దిస్టులుగా, మావోయిస్టులుగా, కవులు, రచయితలు, పాత్రికేయులు, విద్యావంతులు, ఉన్నతాధికారులుగా వివిధ రంగాల్లోని మాల పెద్దలు ఖండించడం, మిగిలిన ఎస్సీ కులాల వారి ప్రజాస్వామిక ఆకాంక్షలను, డిమాండ్లను బలపరచడం వారి సామాజిక ధర్మం. ఇలా చెయ్యకుండా వారు కూడా మౌనం వహిస్తున్నారూ అనంటే, ఎవరైతే గాంధీగారి కాలంచెల్లిన దళితవ్యతిరేక వాదనలను మాల కులంలో నెత్తికెత్తుకుంటున్నారో వారితో వీరు ఏకీభవిస్తున్నట్టుగా, బలపరుస్తున్నట్లుగానే ప్రస్తుత సామాజిక సంఘర్షణల సమయంలో భావించవలసి ఉంటుంది.
మాల సామాజిక వర్గంలో ఉన్న నిజమైన అంబేద్కరిస్టులు, బుద్దిస్టులు, విప్లవవాదులు, ప్రజాస్వామికవాదులు - వారు ఇప్పుడు తమ నోళ్ళు విప్పాలి. మాదిగలు ఇతర షెడ్యూల్డు కులాల ప్రజలు చేస్తున్న డిమాండ్లలోని హేతుబద్దత, న్యాయబద్దతకు మద్దతునివ్వాలి. మాదిగలు, మిగిలిన ఎస్సీ కులాలవారు చేస్తున్న పోరాటాలు ప్రభుత్వాల పైననే కాని మాల వారిపై కాదన్న సత్యాన్ని మాల పెద్దలు స్వీయ సామాజిక వర్గీయులకు వివరించాలి. సాపేక్షిక, వ్యవస్థీకృత అన్యాయాలకు, వెనకబాటుతనాలకు గురైన మాదిగలు ఇతర ప్రభుత్వాలపై చేస్తున్న ఉద్యమాలను వ్యతిరేకిస్తున్న కొద్ది మంది అసాంఘిక మాల శక్తులను కట్టడి చెయ్యడానికి మాల పెద్దలు పూనుకోవాలి. ఇందుకోసం మాల పెద్దలు ఇకనైనా తమ నోళ్ళు విప్పాలి. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమంచాలి.
 
కృపాకర్‌ మాదిగ పొనుగోటి
మాదిగ మహాశక్తి జాతీయ అధ్యక్షుడు
 Published in Andhra Jyothi Dated: 23/05/2015

Tuesday, May 19, 2015

దేవుడు ప్రజాస్వామ్యవాదా, కాదా? (09-May-2015) By కంచ ఐలయ్య



దేవుడు ప్రజాస్వామ్యవాదా, కాదా అనే ప్రశ్న చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నేను నా పీహెచ్‌డీ పుస్తకానికి God as political philosopher (దేవుడి రాజకీయ తత్వం) అని పేరు పెట్టినప్పుడు చాలా మంది నవ్వుకున్నారు. ముఖ్యంగా భారతదేశంలో హిందూ తత్వంలో జీవించే మేధావులకు, విగ్రహారాధన చేసే వారికి ఇది అంతుపట్టని ప్రశ్న. నిత్యజీవితంలో అప్రజాస్వామ్యంగా బతికే వ్యక్తికి ప్రజాస్వామ్య ప్రక్రియను దేవునితో ముడేసే సరికి భయమేస్తుంది. అటువంటి పేరున్న పుస్తకాన్ని ముట్టుకోవాలంటే కూడా భయమేస్తుంది. కాని ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఈ దేశంలో చాలా ఉంది.
 
ప్రపంచ మానవాళి ముందు మూడు రకాల దేవుళ్ళ ఆలో చన, ఆచరణ సరళులు ఉన్నాయి. (1) అబ్‌స్ర్టాక్ట్‌ (నిరాకార, నిరంతర) దేవుడు. (2) మానవులుగా పుట్టి ముందు ప్రవక్తలుగా మారి క్రమంగా ప్రపంచ దేవులుగా మారిన శక్తులు, వ్యక్తులు. ఈ విధంగా ప్రపంచ ఆధ్యాత్మిక చైతన్యాన్ని మానవ సాంఘీక రాజకీయ విలువల్ని శాసిస్తున్నది గౌతమ బుద్ధుడు, జీసెస్‌ క్రైస్తు. (3) ఊహాజనిత మానవాకార దేవతలు. ఇటువంటి దేవతలు ప్రపంచంలో చాలాచోట్ల ఉన్నప్పటికీ భారతదేశంలో మాత్రమే దేవతలుగా నమ్మేవారు విష్ణువు, ఆయన అవతార సంతతి. రెండవ గ్రూపు శివుడు ఆయన చుట్టూ నిర్మిత దేవతా శక్తులు. ఈ రెండు గుంపు దేవతలను ఇప్పుడు వైష్ణవ దేవతలు, శైవ దేవతలుగా చూస్తున్నాం.
 
ప్రపంచస్థాయిలో వ్యక్తి, కుటుంబ, సామాజిక, రాజ్య ప్రజాస్వామిక విలువలు ఎక్కడ నుంచి వచ్చాయి అనే అంశం మీద ఇంత వరకు సిద్ధాంత చర్చ జరగలేదు. అబ్‌స్ర్టాక్ట్‌ దేవుని వ్యక్తిగత విలువలు, ఆయన (ఇంకా పురుష రూపంలో చలామణి అవుతున్నాడు కనుక) బోధనలు, ఆయన రూపొందించాలనుకునే లేదా రూపొందించిన మానవ విలువలు ముఖ్యమైనవి. ఇవి జనరల్‌గా ప్రపంచ మానవుల చర్చల్లో ఉన్నప్పటికీ బైబిల్‌, ఖురాన్‌ గ్రంథాల్లో ఈ దేవుని చర్చలు సుదీర్ఘంగా కనిపిస్తాయి. ఖురాన్‌ కంటే బైబిల్‌ ముందు రాయబడ్డది కనుక ఓల్డ్‌ టెస్టామెంట్‌ అంతా ఈ దేవుని లక్షణాలు, పనులు ఆచరణ మనకు వివిధ కోణాల్లో కనిపిస్తుంది. ఖురాన్‌ బైబిల్‌ కొనసాగింపు ఒక నిర్దిష్ట కోణం నుంచి కనిపిస్తుంది. ఖురాన్‌ అబ్‌స్ర్టాక్ట్‌ దేవున్ని పదే, పదే నొక్కి వక్కాణించింది.
ఈ దేవుని మొదటి ప్రజాస్వామిక లక్షణం (అదే ఆ పుస్తకాల లక్షణం అవుతుంది) మనుషులందర్నీ ఆయన సమానంగా సృష్టించాడనే సుదీర్ఘ చర్చ. ఈ దేవునిలో కనబడే మరో ఆర్థిక ప్రజాస్వామిక లక్షణం మనుష్యుల్ని అత్యున్నతులుగా సృష్టించి అన్ని జంతువులనూ, క్రిములనూ, సమస్త ప్రకృతిని ఆ మనుషుల అవసరాల కోసం, ఆహారం కోసం (ఆవుతో సహా అన్నిటిని) సృష్టించాడని చెప్పడం. కానీ ఈ రెండు గ్రంథాల్లో దైవ ప్రక్రియకు మానవ గుర్తింపు కలిగించింది ముందు జీసెస్‌ క్రైస్తు ఆ తరువాత ప్రాఫెట్‌ మహహ్మద్‌. చరిత్ర క్రమంలో మహమ్మద్‌ ఒక ప్రాఫెట్‌గా మాత్రమే మిగిలిపోగా జీసెస్‌ ఒక దేవుని స్థాయి పొందారు.
 
ప్రవక్తలు, సంఘ సంస్కర్తలు ప్రపంచస్థాయి దేవుళ్ళుగా మారింది ఇద్దరే ఇద్దరు. గౌతమబుద్ధుడు, జీసెస్‌ క్రైస్తు. బుద్ధుడు ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసిన దేవునిగా చలామణిలో ఉన్నాడు. బుద్ధునికి విహారాల్లో, గుడుల్లో విగ్రహ రూపం ఉన్నప్పటికీ ఆయన టీచింగ్స్‌, జీవించిన విధానం, సంఘ నిర్మాణం తూర్పు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. భారతదేశంలో ఆయన ప్రభావం చాలా ఉంది. ప్రపంచంలో బుద్ధుని కంటే ఎక్కువ స్థాయిలో జీసెస్‌ ప్రభావం ఉంది. ఆయన జీవిత చరిత్ర, టీచింగ్స్‌ నాలుగు గాస్పెల్స్‌ రూపంలో బైబిల్‌లో చేర్చాక ఆయన విగ్రహాంలోగాని, ఆయన్ని ఏ శిలువపై చంపారో ఆ శిలువ విగ్రహంలో గాని చర్చి వెలిసాక ప్రపంచ రూపురేఖలే మారిపోయాయి. బుద్ధుడు, జీసెస్‌ హింసావాద వ్యతిరేకులు. వారి టీచంగ్స్‌ సర్వమానవ సమానత్వాన్ని కోరుకున్నాయి. ఇద్దరి జీవిత ప్రక్రియలో, సంఘ నిర్మాణ, స్ర్తీ పురుష సంబంధాల్లో మార్పు, అంతిమంగా వాళ్ళు కోరుకున్న రాజ్య వ్యవస్థ ప్రజాస్వామ్య విలువల గురించి సుదీర్ఘ చర్చ, ఆచరణకు అనువైన చాలా సూచనలు ఉన్నాయి. వాటి ప్రభావం ప్రపంచ సామాజిక, రాజకీయ వ్యవస్థల మీద చాలా బలంగా ఉంది.
 
బుద్ధుడు తన సంఘ నిర్మాణంలో, తన శిష్యులతో తాను వ్యవహరించిన తీరులో చాలా ప్రజాస్వామిక విలువలున్నాయి. ‘సంఘం శరణం గచ్చామి, దమ్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి’ నినాదమే ఆనాటి కులవ్యవస్థను, వర్గ వ్యవస్థను, స్ర్తీ పురుష అసమానతలను దెబ్బతీసేందుకు తోడ్పడ్డది. జీసెస్‌ తన 12 మంది శిష్యులతో వ్యవహరించిన తీరు చాలా ప్రజాస్వామ్య లక్షణాలను కలిగి ఉంది. అంతకంటే సమరిటన్‌ (అక్కడి దళితులు) స్ర్తీలతో, జంటైల్‌ స్ర్తీ-పురుషులతో, బానిసలతో, వేశ్యా స్ర్తీ విముక్తి కోసం ఆయన పోరాటం బుద్ధుని ప్రజాస్వామ్య విలువల కంటే ఒక అడుగు ముందు ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయనే మతాన్ని, రాజ్యాన్ని వేరు చెయ్యాలని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఆదర్శప్రాయంగా ప్రజల ముందు పెట్టిన ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ గాడ్‌’ క్రిష్టియన్‌ దేశాల్లో ప్రజాస్వామ్య సూత్రాలను ఎవాల్వ్‌ చెయ్యడానికి బాగా తోడ్పడింది.
 
పై వాదనల్లో ఒక అంశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచ అబ్‌స్ర్టాక్ట్‌ గాడ్‌ గాని, బుద్ధుడు, జీసెస్‌లు గాని మానవ సమాజంలో ప్రజాస్వామ్య విలువలు, ఆచరణ, అభివృద్ధికి చాలా తోడ్పడ్డారు. ఇప్పటికే మనుష్యుల్ని రాజ్యం, చట్టాలు, పోలీసు, మిలిటరీ వ్యవస్థల కంటే ఎక్కువగా నియంత్రించే శక్తి దేవుడు. దేవుడు అనే భావం, దాని చుట్టూ భక్తి, ప్రేమ, భయం వ్యవస్థల మీద ప్రభావం పడేసాయి. మానవ గవర్నెన్స్‌లో ఇప్పటికీ దేవుని పాత్ర రాజ్యం పాత్ర కంటే ఎక్కువ.
 
ఈ వెలుగులో చూసినప్పుడు హిందూ వ్యవస్థ నిర్మించి, నమ్మే ఆచరించే వైష్ణవ స్కూల్‌ దేవతలకు గాని, శైవ స్కూల్‌ దేవతలకు గాని ప్రజాస్వామ్య విలువలు, లక్ష్యాలు, ఆచరణ ఉన్నాయా? వైష్ణవాన్ని భారతదేశంలో రాజ్యం, సంస్థలు, పార్టీలు తమ రాజకీయ, ఆధ్యాత్మికంగా ప్రకటించుకుంటున్న ఈ తరుణంలో ఈ స్కూలు దేవతల్లో గాని, వారి చుట్టూ రూపొందించబడ్డ ఆధ్యాత్మిక తాత్వికతలో గాని ప్రజాస్వామిక జీవన విధానాన్ని, రాజ్య వ్యవస్థను కాపాడే లక్షణాలు ఉన్నాయా అన్న అంశాన్ని లోతుగా చర్చించాలి. ఎందుకంటే ఈ దేశాన్ని పరిపాలించే బీజేపీ కాని, కాంగ్రెస్‌లో ఎక్కువ మంది నేతలు గాని, కమ్యూనిస్టు-సోషలిస్టు నేతలు గాని చాలా ప్రాంతీయ పార్టీల నేతలు గాని వైష్ణవ విలువలతో తమ సాంఘీక, రాజకీయ జీవితాన్ని, పార్టీలను నడుపుతున్నారు. కమ్యూనిస్టులు, విప్లవకారులు కూడా ఈ చట్రం బయట లేరు. వారు హేతువాదులమని చెబుతున్నా, వాళ్ళు హిందూ వ్యవస్థ తాత్విక పరిధిలోనే జీవిస్తున్నారు. తమ రాజకీయాలను కూడా ఆ చట్రంలోనే నడుపుతున్నారు.
 
 విష్ణువు, ఆయన అవతార దేవతలు రాముడు, కృష్ణుడు ఊహాజనిత దేవతలు. వారికి బుద్ధుడికి, జీసెస్‌కు ఉన్నట్టు మానవ జీవన చరిత్ర లేదు. కృష్ణుడు రాసినట్టు చెప్పబడుతున్న ఒక్క ‘భగవత్‌ గీత’ తప్ప వాళ్ళ బోధనలు అంటూ ఏమీలేవు. వాళ్ళ చుట్టూ అల్లిన కథలు, వారి బొమ్మలు ఇప్పుడు మన ముందున్నాయి. మొదట వీరి గురించి ఉన్న కథలల్లో మనకు కనిపించేది వారి హింసాయుత హీరోయిజం. దేవుడే హింసను అనుసరించదగ్గ విలువను ఆచరణలో పెడతాడు. అతని గురించిన వర్ణనలో గాని, అతని విగ్రహ రూపంలో గాని ఆయుధాలు (చక్రం, బాణం, త్రిశూ లం) కొట్టొచ్చేవిగా కనిపిస్తున్నప్పుడు మానవ సంబంధాలపై వారి ప్రభావం ఎలా ఉంటుంది అనేది చాలా ముఖ్యం. వీరిలో ప్రజాస్వామిక ప్రక్రియకు వ్యతిరేక అంశం వారికి అంటగట్టబడ్డ కులపునాదిలో వుంది. 
దేవతలకు కులం ఉండడం నమ్మకస్తుల్లో అప్రజాస్వామిక విలువలను కాపాడడానికి బాగా తోడ్పడే అంశం. అయితే శివునికి కుల పునాది ఉన్నట్టు మనకు కనిపించదు. కానీ వైష్ణవ దేవతలందరూ క్షత్రియ కుల పునాదులు, క్షత్రియులకు ఉండాల్సిన ఆయుధ ధారణ, ఈ దేవతలందరికీ ఉంటుంది. వారి భార్యలతో గాని, ఇతర స్ర్తీలతో ఉండే సంబంధాల్లో గాని ప్రజాస్వామిక సంబంధాలు లేకపోవడం అప్రజాస్వామిక వ్యవస్థల నిర్మాణానికి బాగా తోడ్పడ్డాయి. భారతదేశంలో అప్రజాస్వామిక పౌర సమాజం ఉండడానికి వీరి విలువలే కారణం.
శైవ స్కూలు ఇందుకు కాస్త భిన్నమైంది. ఇది ప్రధానంగా శివుని చుట్టూ మాత్రమే తిరుగుతుంది. శివునికి చాలా ట్రైబల్‌ క్యారక్టర్లు ఉన్న విషయం తెలిసిందే. శివుడు కూడా ఊహాజనిత దేవుడే. ఆయన చుట్టూ ఉన్న కథలు తరువాత కాలాల్లో రచయితలు అల్లినవే. శైవ స్కూలు చేతిలో శూలం, మెడలో పాము, చుట్టూ పులి తోలు, జగ్గు మొదలగు వస్తు సముదాయాలతో ఉంటుంది. ఆ రూపం నుంచి శివలింగ పూజ వరకు ఒక నిర్దిష్ట వ్యక్తి, సమాజ, రాజ్య సూత్రాలతో సంబంధం లేకుండా ఆచరణలో ఉన్నట్లు కనబడుతుంది. సామాజిక ప్రజాస్వామిక సూత్రాలేమీ ఈ స్కూలు రూపొందించిన దాఖలాలు లేవు. అందుకే బీజేపీ వంటి పార్టీలు శివున్ని ఎక్కువగా వాడుకోవడం లేదు. దైవిక, సామాజిక ఆహార అలవాట్లలో వైష్ణవ, శైవాలు - ఒక్క మాటలో హిందూ తాత్వికత - అప్రజాస్వామికంగా ఉండి వెజిటేరియనిజం, మీటేరియనిజం, ఫిషేరియనిజాల మధ్య కూడికలు, తీసివేతలతో కలగలిసి ఉంటుంది. ఈ స్కూల్లో కొన్ని కుల వ్యతిరేక తిరుగుబాట్లు కనబడతాయి. అయినా దీనికి భారతదేశం బయట గుర్తింపేమీ లేదు.
 
పైన మనం చర్చించిన మూడు అంటే - నిరాకార దేవుడు, బుద్ధుడు, జీసస్‌, హిందూ ఊహాజనిత ఆకార దేవతల - స్కూళ్ళు రాజకీయ వ్యవస్థల్ని ఎలా ప్రభావితం చేశాయో చూడ్డం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం. నిరాకార దేవుని ప్రభావం ఈనాడు ముస్లిం దేశాల్లో చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రభావం ప్రధానంగా ఖురాన్‌లోని సూత్రీకరణల నుంచి సమాజ ప్రాక్టీసుగా మారింది. వీటితో పాటు ప్రాఫెట్‌ మహమ్మద్‌ టీచింగ్స్‌ (అహదీస్‌) వాటికి జోడయ్యాయి. ఈ దేశాలన్నిటిలో ప్రజాస్వామ్యం బలంగా నిలదొక్కుకోలేకపోతున్నది. నియంతృత్వం ప్రజాస్వామ్యం కలగాపులగంగా అమల్లో ఉంటున్నది. ఈనాడు మనం ప్రజాస్వామ్య దేశాలుగా చూసే క్రైస్తవ దేశాల్లో ఏసుక్రీస్తు ప్రభావంతో పాటు నిరాకార దేవుని ప్రభావం కూడా ఉన్నది. ఈ దేశాల్లో బైబిల్‌ అధ్యయనం ఒక కీలకమైన పాత్ర పోషించింది. బైబిల్‌ అధ్యయనం నుండి ‘పాజిటివిజం’ ఆ క్రమంలో ప్రజాస్వామ్య సూత్రీకరణలు పుట్టుకొచ్చాయి. ఈనాడు క్రైస్తు ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో రాజకీయ, సాంఘీక ప్రజాస్వామ్యం నిలదొక్కుకున్నాయి.
తూర్పు దేశాలైన బుద్ధిస్టు దేశాల్లో సోషలిజం-ప్రజాస్వామ్యం కలగాపులగంగా ఉన్నాయి. ఈ దేశాల్లో ఆర్థిక అభివృద్ధి (చైనా, జపాన్‌, కొరియా, వియత్నాం మొదలగునవి) స్టెడీగా బలంగా జరుగుతున్నది. సమాజ ఆధునికీకరణతో పాటు స్ర్తీ ఆధునికీకరణ చాలా వేగంగా జరుగుతుంది. ఈ అన్ని దేశాల్లో బాల్యవివాహాలు ఆగిపొయ్యాయి, వితంతు వివాహాలు చాలా గౌరవ ప్రదంగా జరుగుతున్నాయి. వీటన్నిటికి కారణం సభ్య సమాజంలో బౌద్ధం ప్రభావం ఎక్కువగా ఉండడం.
 
ఇగ మిగిలినవి భారతదేశం, నేపాల్‌. భారతదేశంలో క్రైస్తవ విలువలు గలిగిన బ్రిటిష్‌ విలువల్లో భాగంగా 1947 నాటి ప్రజాస్వామిక వ్యవస్థ ఒక రూపానికి వచ్చింది. ఇక్కడి వైష్ణవ విలువలు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవాలని చూసినా బ్రిటిష్‌ వారు ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంపై రుద్ది పోయారు. బుద్ధిస్టు అంబేద్కర్‌, హేతువాద నెహ్రూల ప్రయత్నం వల్ల ఒక మంచి రాజ్యాంగం, రాజకీయ ప్రజాస్వామ్య ప్రాక్టీసు ఇక్కడ నిలదొక్కుకున్నాయి. కాని సభ్యసమాజంలో వైష్ణవ, శైవ అసమానత, అంటరాని తనాన్ని కాపాడే విలువలు ఇంకా బలంగా ఉన్నాయి. హిందూ దేవతల్ని, ఈ మత పుస్తకాల్ని, ప్రజల - ముఖ్యంగా బ్రాహ్మణీయుల ప్రాక్టీస్టును - పత్రికల్లో ప్రచారం చేస్తున్న మేధావులు ఈ అంశంపై తేల్చాలి గదా!
 
ఒక వ్యక్తి నమ్మే దేవునికి ప్రజాస్వామిక విలువలు లేకపోతే అతనికి/ఆమెకు ఆ విలువలు ఎక్కడి నుండి వస్తాయి? అసలు తమ దేవతలను కూడా ఇంత హింసాయుతంగా, ఇంత అప్రజాస్వామికంగా, ఇంత స్ర్తీ వ్యతిరేకులుగా ఎందుకు రూపొందించుకున్నారో చెప్పాలి గదా! ఇంత విగ్రహారాధన (పుస్తకారాధన కాదు) మతంలో ఉంటే విగ్రహాల నుంచి ప్రజలు ప్రజాస్వామిక విలువల్ని ఎట్లా నేర్చుకుంటారో చెప్పాలి గదా! మార్పు లేని మతం మంచిదెట్టయితదో చెప్పాలి గదా!
కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త
Article Published in Andhra Jyothi Telugu News Paper Dated :09/05/2015 

Tuesday, February 10, 2015

మీరు పులు కడిగిన ముత్యాలా? By Andhra Jyothi MD Radha Krishna Editorial



ఉప ముఖ్యమంత్రి రాజయ్యను తొలగించడాన్ని, తొలగించిన తీరును సమర్థిస్తున్న వారందరూ గుండె మీద చేయి వేసుకుని తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి లేదని చెప్పగలరా? రాజయ్య మినహా మిగతా మంత్రులు, శాసనసభ్యులు అవినీతికి పాల్పడటం లేదని హామీ ఇవ్వగలరా?... డాక్టర్‌ రాజయ్య విషయంలో వ్యవహరించిన తీరుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన అంతరాత్మకు అయినా సంజాయిషీ ఇచ్చుకోవాలి. దళితులైనంత మాత్రాన అవినీతికి పాల్పడటానికి లైసెన్స్‌ ఇవ్వమని చెప్పడం నా ఉద్దేశం కాదు. జరుగుతున్న దాంట్లో వారి పాపం అతి స్వల్పం మాత్రమే కనుక దొరతనంతో కాకుండా దొడ్డ మనసుతో వ్యవహరించి ఉండాల్సింది అని చెప్పడమే నా అభిమతం. అవినీతి నిర్మూలన జరగాలంటే పై స్థాయి నుంచి ప్రారంభం కావాలి గానీ, అట్టడుగు స్థాయి నుంచి మొదలుపెడితే అది అంతిమంగా సామాజికపరమైన అశాంతికి దారితీసే ప్రమాదం ఉంది!
పిచ్చి ముదిరింది- తలకు రోకలి చుట్టమన్నాడట వెనకటికెవడో! ఆ స్థాయిలో కాకపోయినా ఇప్పుడు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులకు వాస్తు పిచ్చి పట్టుకుంది. వాస్తు నమ్మకాల పేరిట కట్టినవాటిని కూలగొట్టడం, మరమ్మతులు చేయడం చేస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఎంతో ముచ్చటపడి మూడు నాలుగు భవనాలను కూలగొట్టి కట్టించుకున్న సీఎం నివాస భవనం, క్యాంపు కార్యాలయానికి వాస్తు దోషం అన్న ముద్రవేసి పాడుబడుతున్న భవనాల జాబితాలో చేర్చారు. ఈ భవనంలోనే ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌ రెడ్డి మూడేళ్లు ఉన్నారు. ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వాస్తురీత్యా దోహదపడిన ఆ భవనాలు కానీ, సచివాలయాల భవన సముదాయం కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు పనికిరాకుండా పోయాయి. సచివాలయానికి భయంకరమైన వాస్తుదోషం ఉందని ఇప్పుడు ఆయన తేల్చిపారేశారు. ఉభయ రాష్ర్టాలకు చెందిన, ఇప్పుడు జీవిస్తున్న తెలుగు ప్రజలందరికీ ప్రస్తుత సచివాలయం మాత్రమే తెలుసు. ఎందరో ముఖ్యమంత్రులు అక్కడి నుంచే పరిపాలన చేసి తెలుగు నేల దశ, దిశను మార్చే నిర్ణయాలు తీసుకున్నారు. దశ బాగుంటే దిశ బాగుంటుందంటారు. అలాంటిది తమ దశలను మార్చుకోవడానికై, దిశలను మార్చడానికి ప్రస్తుత పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ప్రస్తుత విభజిత రాష్ర్టాలకు ముఖ్యమంత్రులైనవారు గానీ దివ్యమైన ముహూర్తాలు చూసుకునే ప్రమాణ స్వీకారంచేశారు. అయినా ఏ ఒక్కరూ శాశ్వతంగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగలేదు.. కొనసాగబోరు. వెయ్యేళ్లపాటు జీవించడానికి మనం ఈ భూమి మీదకు రాలేదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అప్పుడప్పుడు అంటూ ఉంటారు. ఈ వాస్తవం తెలిసిన కేసీఆర్‌కు వాస్తు ప్రకారమైనా, ముహూర్త బలం ప్రకారమైనా ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరన్న సంగతి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. హైదరాబాద్‌ వారసత్వాన్ని, చారిత్రక కట్టడాలను కాపాడాలనీ, అందుకోసం మెట్రో రైలు అలైన్‌మెంట్‌ను మార్చాలనీ పట్టుబట్టిన కేసీఆర్‌కు ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల దవాఖానా చారిత్రక కట్టడంగా కనిపించకపోవడం విస్మయం కలిగిస్తోంది. అదేమని ప్రశ్నించిన వారిపై వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. ఎర్రగడ్డలో 150 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సచివాలయాన్ని, శాఖాధిపతుల కార్యాలయాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు గానీ, కొత్త సచివాలయ నిర్మాణానికి 500 కోట్ల రూపాయలకు పైగా వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఎర్రమంజిల్‌లో నిర్మిస్తున్న రోడ్లు భవనాల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయానికే 70 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుత సచివాలయంలోని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల కార్యాలయాలలో వాస్తు హంగుల కోసం పదుల కోట్లు ఖర్చు చేశారు. అలాంటిది 150 కోట్ల రూపాయలతో నూతన సచివాలయాన్ని నిర్మిస్తామని చెప్పినంత మాత్రాన నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. వాస్తు నమ్మకం అనేది వ్యక్తుల వ్యక్తిగత విశ్వాసం. అందుకోసం ప్రజాధనాన్ని ఖర్చు చేసే అధికారం ముఖ్యమంత్రులకు, మంత్రులకు ఎవరు ఇచ్చారో తెలియదు! తెలంగాణ రాష్ట్రం ఏర్పడినది ప్రజల జీవితాలు బాగుపరిచేందుకేగానీ సచివాలయం నిర్మించుకోవడానికి కాదు. తాను అధికారంలోకి వస్తే ఇప్పుడున్న సచివాలయాన్ని పడగొట్టి ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిని తరలించి అక్కడ కొత్త సచివాలయాన్ని నిర్మిస్తానని ఎన్నికల సందర్భంలో కేసీఆర్‌ చెప్పి ఉండాల్సింది. రాజుల సొమ్ము రాళ్లపాలు అని గతంలో రాజ్యాలు ఉన్నప్పుడు అనేవారు. ఇప్పుడు తెలంగాణలో ప్రజల సొమ్ము కాంక్రీట్‌ భవనాల పాలు కాబోతున్నది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు టవర్ల పిచ్చి పట్టుకుంది. ఎక్కడబడితే అక్కడ టవర్లు నిర్మించాలని ఆయన తలపోస్తున్నారు. అవి ఎందుకో, ఎవరి కోసమో మాత్రం చెప్పడం లేదు. పింఛన్ల కోసం అలమటిస్తున్న అభాగ్యులను ఆదుకోవడానికి గానీ, అప్పుల బాధతో ఉసురు తీసుకుంటున్న రైతులకు ఆపన్నహస్తం అందించడానికి గానీ కేసీఆర్‌కు మనసు రావడం లేదు. కొత్త సచివాలయాన్ని నిర్మించిన తర్వాత ఇప్పుడున్న భవనాలను వివిధ ప్రాంతాలలో ఉన్న శాఖాధిపతులు, ఇతర అధికారుల కార్యాలయ భవనాలను ఏమి చేస్తారో మాత్రం ఆయన చెప్పరు. అంతేకాదు అర్థరహితమైన, అహేతుకమైన, ఆచరణసాధ్యం కాని ఆయన నిర్ణయాలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిని తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేస్తారు. అయితే తెలంగాణ సమాజం ఇప్పుడిప్పుడే మేల్కొంటోంది. కేసీఆర్‌ చర్యలను నిశితంగా గమనించడం మొదలెట్టింది. త్వరలోనే నోరు విప్పడానికి సిద్ధమవుతోంది. నాలుక మడత వేయడంలో మన రాజకీయ నాయకులు సిద్ధహస్తులు. ఈ విషయంలో కేసీఆర్‌ నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. ‘‘మా పిల్లలకు మాత్రమే మేం ఫీజులు చెల్లిస్తాం గానీ, పొరుగు రాష్ర్టాలవారి పిల్లలకు ఎందుకు చెల్లించాలి? ఆంధ్రావారి పిల్లలకు మేం ఫీజు చెల్లించబోం. అందుకోసం ఫాస్ట్‌ పథకాన్ని తీసుకు వస్తాం’’ అని అధికారం చేపట్టిన కొత్తలో కేసీఆర్‌ అనేక ప్రకటనలు చేశారు. ‘‘ఆహా మా ముఖ్యమంత్రి ఎంత బాగా చెప్పారు’’ అని ఆయన చుట్టూ ఉండే తెలంగాణవాదులు చప్పట్లు కొట్టారు. అయితే అలా చేయడం జరిగేపని కాదనీ, ఆర్టికల్‌ 371-డి అమలులో ఉన్నా లేకపోయినా, 1956కి పూర్వం నుంచి తెలంగాణలో ఉన్నవారి పిల్లలనే స్థానికులుగా నిర్ణయించడం చట్టసమ్మతం కాదని నేను అప్పుడే చెప్పాను. దీనిపై అప్పట్లో నాపై అవాకులు చెవాకులు పేలారు. ఇప్పుడు ఏమి జరిగింది? హైకోర్టులో మొట్టికాయలు తప్పవని గ్రహించిన కేసీఆర్‌ తన ఆలోచనను విరమించుకున్నారు. ఏ నోటితో అప్పుడు ఆ మాట అన్నారో, ఇప్పుడు అదే నోటితో ‘‘ఫాస్ట్‌ లేదు.. గీస్టు లేదు’’ అని తేల్చిపారేశారు. నిజానికి ఫాస్ట్‌ పథకం చెల్లదని కేసీఆర్‌కు కూడా తెలుసు. అయితే తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలిస్తూనే ఉండాలన్న ఉద్దేశంతో చట్టవిరుద్ధమైన వాదనను తెరపైకి తెచ్చారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆయన ఎన్ని పర్యాయాలు నాలుక మడత వేశారో పాత పత్రికలు తిరగేస్తే తెలుస్తుంది. కేసీఆర్‌ మాటలు, చర్యలు కొన్నిసార్లు వినసొంపుగా, అబ్బురపరిచేవిగా ఉంటాయి. ఆయన గురించి చాలావరకు తెలిసిన నాకే కొన్ని సందర్భాలలో ఆయన ప్రకటనలు నిజమే కాబోలని నమ్మే పరిస్థితి ఏర్పడింది. అలాంటిది ఒక ఉద్యమ నాయకుడిగా తప్ప ఇతరత్రా కేసీఆర్‌ గురించి ఏమీ తెలియని తెలంగాణ సమాజం సహజంగానే కేసీఆర్‌ ప్రకటనల పట్ల ఆకర్షితమైంది. అయితే ఇప్పుడిప్పుడే అందరికీ తత్వం బోధపడుతోంది. ప్రస్తుత సచివాలయాన్ని ఖాళీచేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలనుకుంటున్న కేసీఆర్‌, తాను అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలోని ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రినని గ్రహించాలి. ప్రస్తుత సచివాలయంలో వాస్తు బాగోనందున నష్టం తెలంగాణకా? కేసీఆర్‌కా? కొత్త సచివాలయం నిర్మించడం వల్ల తెలంగాణ సమాజం బాగుపడుతుందా? కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడుతుందా? నూతన సచివాలయంలోకి మార్చినంత మాత్రాన తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్‌ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండిపోగలరా? తన నిర్ణయాన్ని అమలుచేసే ముందు కేసీఆర్‌ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. నిజం చెప్పాలంటే తెలంగాణ సమాజంలో వాస్తుకు అంత గుర్తింపు గానీ, ప్రాధాన్యం గానీ లేదు. ప్రస్తుత వాస్తు విశ్వాసం ప్రధానంగా ఆంధ్ర ప్రాంతం నుంచి దిగుమతి అయినది మాత్రమే! అడుగడుగునా ఆంధ్రా వ్యతిరేకతను నూరిపోసే కేసీఆర్‌కు ఆంధ్రావాళ్లు మాత్రమే ఎక్కువగా నమ్మే వాస్తు మీద నమ్మకం ఎందుకు కలిగిందో, ఎప్పుడు కలిగిందో తెలియదు. పనిలో పనిగా శుక్రవారంనాడు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తాను మొక్కిన మొక్కులను ఆయా దేవుళ్లు, దేవతలకు తీర్చబోతున్నట్టు చెప్పారు. వ్యక్తిగతంగా ఆయన మొక్కుకున్న మొక్కులు తీర్చడానికి ప్రజాధనం ఖర్చు చేయడంలోని ఔచిత్యం ఏమిటో ఆయనకే తెలియాలి! బహుశా ఆయన ‘‘నేను ముఖ్యమంత్రి అయితే..’’ అని మొక్కుకుని ఉంటారు. అందుకే ప్రజాధనంతో మొక్కులు తీర్చడానికి తెగబడుతున్నారు.
మరి వారు కనిపించడం లేదా?
రోజుకో అడ్డం పొడుగు ప్రకటనలు చేయడం కేసీఆర్‌కు అలవాటే కనుక ఆ విషయం కాసేపు పక్కన పెట్టి ఉప ముఖ్యమంత్రి రాజయ్యను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసిన వ్యవహారానికి వద్దాం. ప్రస్తుత ప్రభుత్వంలో రాజయ్య ఒక్కరే అవినీతిపరుడన్న ముద్రవేసి ఆయనను పదవి నుంచి తొలగించిన కేసీఆర్‌ను అభినందించాల్సిందే! దళితులకు అధికారం అప్పగిస్తే అవినీతికి పాల్పడతారని తన ఈ చర్య ద్వారా తెలంగాణ సమాజానికి చక్కటి సందేశం పంపిన కేసీఆర్‌కు తెలంగాణలోని దళితులందరూ రుణపడి ఉండాలేమో! అణువణువునా అహంకారాన్ని నింపుకొన్నవారు మాత్రమే ఇలా వ్యవహరించగలరు. ప్రభుత్వాలలో జరిగే అవినీతిలో దళితుల వాటా అతి స్వల్పంగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద డీల్స్‌ చేసుకునేవారు ఎవ్వరూ వారిని సంప్రదించరు. ముఖ్యమంత్రులుగా, వారికి నమ్మకస్తులుగా అగ్ర కులాలకు చెందిన వారే ఉంటారు కనుక వందల కోట్ల అవినీతి వారి సొంతమే అవుతుంది. దళితులకు మిగిలేది తాలు, తప్ప మాత్రమే! అందుకే ఎవరైనా దళిత నాయకుడు అవినీతికి పాల్పడినట్టు బయటకు పొక్కినా మన సమాజం అంత సీరియ్‌సగా తీసుకోదు. ఎందుకంటే వారు చేసిన అవినీతి వల్ల కొంపలు మునిగిపోవు. ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఉద్వాసనకు దారితీసిన వ్యవహారంలో ఎంత మేరకు అవినీతి జరిగిందో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పలేదు. తెలంగాణ రాష్ట్రంలో పెచ్చుమీరిపోతున్న ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియాలలో దళితులు లేరే! సీమాంధ్రతో పోల్చితే తెలంగాణలో దళితులు, ముఖ్యంగా మాదిగల జీవితాలు దుర్భరంగా ఉంటాయి. ఆర్థికంగా, సామాజికంగా వెలివేతకు గురైన జీవితాలు వారివి! అలాంటి మాదిగ వర్గానికి చెందిన రాజయ్యను అత్యంత అమానుషంగా, అవమానకరంగా పదవి నుంచి తొలగించడం కేసీఆర్‌కు మాత్రమే చెల్లింది. అదేమని ప్రశ్నించినవారిపై ‘‘అవినీతిని ఉపేక్షించమంటావా?’’ అంటూ ఆయన వందిమాగధులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఉప ముఖ్యమంత్రి రాజయ్యను తొలగించడాన్ని, తొలగించిన తీరును సమర్థిస్తున్నవారందరూ గుండె మీద చేయి వేసుకుని తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి లేదని చెప్పగలరా? రాజయ్య మినహా మిగతా మంత్రులు, శాసనసభ్యులు అవినీతికి పాల్పడటం లేదని హామీ ఇవ్వగలరా? అంతా నేతిబీరకాయలో నేతి చందంగా ఉంది. ప్రస్తుత రాజకీయంలో అవినీతికి పాల్పడకుండా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగించలేని దుస్థితి. వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్న కేసులలో విచారణ ఎదుర్కొంటున్న జగన్మోహన్‌ రెడ్డికి ప్రతిపక్ష హోదా సమకూర్చిన సమాజం మనది! తాను నిజాయితీపరుడినని నిరూపించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నో మార్గాలున్నాయి. అందుకు రాజయ్య లాంటి బలహీనులు అవసరమా? జిల్లాలలో యథేచ్ఛగా వనరుల దోపిడీకి పాల్పడుతున్న ఇతర మంత్రులు, పార్టీ నాయకులపై కేసీఆర్‌ ఎందుకు చర్య తీసుకోవడం లేదు? నిజామాబాద్‌ జిల్లాలోని మంజీరా నదిలో వందల కోట్ల రూపాయల ఇసుకను అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నవారి సంగతి ఏమిటి? ఈ దందాలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడు, నిజామాబాద్‌ ఎంపీ కవిత హస్తం ఉందని జిల్లా ప్రజలందరూ బహిరంగంగానే చర్చించుకుంటున్నారే! ఈ మాటలు కేసీఆర్‌ చెవికి సోకడం లేదా? కవిత లేదా పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడి హస్తం ఉందనడానికి ప్రత్యక్ష ఆధారాలు లేకపోవచ్చును గానీ జరుగుతున్నదేమిటో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే కదా! అనధికారికంగా జరిపే అక్రమాలకు ఆధారాలు ఉండవు కదా? అవినీతికి పాల్పడితే సొంత కొడుకైనా, కూతురైనా జైలుకు పంపిస్తానని ముఖ్యమంత్రి అయిన కొత్తలో కేసీఆర్‌ చేసిన ప్రకటనలు నమ్మి చప్పట్లు కొట్టినవారిలో నిజామాబాద్‌ జిల్లా ప్రజలు కూడా ఉన్నారు. ఇప్పుడు వారే ముక్కున వేలేసుకుంటున్నారు. దోషులపై చర్య తీసుకోవలసింది పోయి ఇసుక బాగోతాన్ని బయటపెట్టిన ‘ఆంధ్రజ్యోతి’ పత్రికపై శుక్రవారంనాడు జరిగిన కేబినెట్‌ సమావేశంలో కేసీఆర్‌ విరుచుకుపడ్డారట! ఇలాంటి వార్తలు ప్రచురిస్తే కేసులు వేయాలని మంత్రులకు ఉద్బోధించారు కూడా! రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే ‘ఆంధ్రజ్యోతి’పై కేసులు వేయించారు. ఇప్పుడు ఏమైంది? ఆనాడు మేం ప్రచురించిన వార్తలకు సంబంధించిన కేసులలోనే ఆయన కుమారుడైన జగన్మోహన్‌ రెడ్డి దోషిగా కోర్టు ముందు నిలబడ్డారు.
 పది శాతం ఇస్తేనే..
అవినీతిని అరికట్టే విషయంలో ఎవరు చిత్తశుద్ధి ప్రదర్శించినా అభినందించవలసిందే! అయితే ‘‘అవినీతికి పాల్పడే హక్కు మాకు మాత్రమే ఉంది. దళితులకు లేదు’’ అన్న సందేశం ఇవ్వడంతోనే ఈ తంటా అంతా! ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతి విషయంలో తనను తాను నిప్పుతో పోల్చుకుంటూ ఉంటారు. నిజంగా ఆయన నిప్పు కాబోలునని కొంతమంది నమ్ముతున్నారు. సందర్భం వచ్చింది కనుక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న తంతు గురించి చెప్పవలసి వస్తోంది. రాజశేఖర్‌ రెడ్డి పుణ్యమా అని పాలకులకు నీటిపారుదల ప్రాజెక్టులు కామధేనువుగా మారాయి. బతికున్నంత వరకు ఆయన ఎంత దండుకోవాలో అంతా దండుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా తమ వాటా తాము దక్కించుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వంతు వచ్చింది. ఈ సదుపాయం ఏపీలో తక్కువ. ఎందుకంటే అక్కడ నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు పోలవరం మినహా పెద్దగా లేవు. వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా చేతికి మట్టి అంటుకోకుండా కీలక స్థానాలలో ఉన్నవారు తమ వాటా తాము పొందుతున్నారు. మట్టి అంటడం లేదని ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే అవన్నీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు మాత్రమే! ప్రస్తుత ప్రభుత్వం మంజూరు చేసినవి కావు! సరిగ్గా ఇక్కడే మళ్లీ పాత నమూనాను అనుసరిస్తూ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలి అవినీతికి తెర లేపారు. అదెలాగంటే ఆయా ప్రాజెక్టుల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి కదా! ఏ ప్రతిఫలం ఆశించకుండా అంతంత మొత్తాలు చెల్లించడం ఆనవాయితీ కాదు కనుక పది శాతం ఇస్తేగానీ బిల్లులు చెల్లిందేది లేదని షరతు పెట్టారు. అందుకు కాంట్రాక్టర్లు తలాడించక చస్తారా? దీంతో మనవాడు మిస్టర్‌ క్లీన్‌ కాదు, మిస్టర్‌ టెన్‌ పర్సంట్‌ అని కాంట్రాక్టర్లు ముద్దుగా పిల్చుకోవడం మొదలెట్టారు. అయితే ఈ పది శాతాన్ని ఆ తర్వాత ఆరు శాతానికి తగ్గించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 2,500 కోట్ల రూపాయల వరకు బిల్లులు చెల్లించారు. ముఖ్య నేతలు విధించిన షరతు ప్రకారం ఆయా కాంట్రాక్టర్లు ‘రుసుము’ కింద 200 కోట్ల రూపాయల వరకు సమర్పించుకున్నారు. ఈ మొత్తం ఎవరికి చేరుతున్నదో కూడా తెలుసు. ఏలిన వారికి నమ్మకస్తులు ఉండాలి కదా! రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వసూళ్లను కె.వి.పి.రామచంద్రరావు పర్యవేక్షించేవారు. ఇప్పుడు కేసీఆర్‌ జమానాలో అలాంటి నమ్మకస్తుడే ఒకరు దొరికారు. ఆయన ఎవరు? ఏమిటి? అన్నది తర్వాత వెల్లడిస్తాం. అయితే కమిషన్లు చెల్లించేవారు రశీదులు అడగరు. తీసుకున్నవాళ్లు కూడా రశీదులు ఇవ్వరు. అందుకే ‘‘దమ్ముంటే రుజువు చేయండి’’ అని పాలకులు సవాళ్లు విసరగలుగుతున్నారు. వ్యతిరేక వార్తలు ప్రచురించే పత్రికలపై కేసులు వేయవలసిందిగా మంత్రులను కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెట్టిన నాపై కూడా కేసు వేయవచ్చు. ఒక రకంగా అలా కేసు వేయడమే మంచిది. న్యాయస్థానం వారు విచారణకు ఆదేశిస్తే ఈ వ్యవహారాన్ని రుజువు చేసే అవకాశం మాకు దక్కుతుంది. బిల్లులు పొందడానికి తాము ఎంత చెల్లించిందీ చెప్పడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి. తెలంగాణలో అవినీతికి పాల్పడింది డాక్టర్‌ రాజయ్య ఒక్కరేనా? బిల్లులు చెల్లించినందుకు కమీషన్లు తీసుకోవడం అవినీతి కిందకు రాదా? పురిటి నొప్పులతో బాధపడుతున్న భార్యను ప్రసవం కోసం ఆసుపత్రిలో చేర్పించిన ఒక అభాగ్యుడిని మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అడుగడుగునా లంచాల కోసం వేధించడాన్ని తట్టుకోలేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటే ఎవరిపైనా చర్యలు తీసుకోలేదే? ‘ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూసినా అందందే కలడు’ అని సర్వాంతర్యామి గురించి భాగవతంలో ప్రహ్లాదుడంటాడు. అలాగే అవినీతి అనేది మన జీవితాలతో పెనవేసుకుపోయింది. అవినీతి లేనిదే బతకలేని పరిస్థితులు కొని తెచ్చుకున్నాం. గొంగళిలో అన్నం తింటూ వెంట్రుకలు ఏరిన చందంగా పరిస్థితి తయారయ్యింది. ఈ నేపథ్యంలో డాక్టర్‌ రాజయ్య విషయంలో వ్యవహరించిన తీరుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన అంతరాత్మకు అయినా సంజాయిషీ ఇచ్చుకోవాలి. దళితులైనంత మాత్రాన అవినీతికి పాల్పడటానికి లైసెన్స్‌ ఇవ్వమని చెప్పడం నా ఉద్దేశం కాదు. జరుగుతున్న దాంట్లో వారి పాపం అతి స్వల్పం మాత్రమే కనుక దొరతనంతో కాకుండా దొడ్డ మనసుతో వ్యవహరించి ఉండాల్సింది అని చెప్పడమే నా అభిమతం. అవినీతి నిర్మూలన జరగాలంటే పై స్థాయి నుంచి ప్రారంభం కావాలి గానీ, అట్టడుగు స్థాయి నుంచి మొదలుపెడితే అది అంతిమంగా సామాజికపరమైన అశాంతికి దారితీసే ప్రమాదం ఉంది!
Andhra Jyothi Telugu News Paper Dated: 01/02/2015

Friday, January 2, 2015

భవంతులు బతుకుదెరువైతయా? - కంచ ఐలయ్య



తెలంగాణ అభివృద్ధి సోషల్‌ రిఫామ్‌తో ముడివడి ఉంది. సోషల్‌ రిఫామ్‌ ముఖ్యంగా జరుగాల్సింది ఈ ప్రాంతపు అగ్ర కులాల్లో. తెలంగాణ సాయుధపోరాటం, తొలి జై తెలంగాణ ఉద్యమం, సిరిసిల్ల జగిత్యాల పోరాటం, మలి జై తెలంగాణ పోరాటాలు సోషల్‌ రిఫామ్‌ జోలి పోలేదు. కింది కులాల్లో కూడా బాగా మూఢ నమ్మకాలున్న రాష్ట్రమిది. వాటిని రూపుమాపకుండా వారి ఆర్థిక అభివృద్ధి కూడా జరుగదు. 

అప్పుల భయంతో, ఆకలి బాధతో రైతులు చస్తున్న రోజులివి. ఎన్నడెరుగని చలిలో కన్నతల్లులు చంటి పిల్లల్ని కడుపుకు అద్దుకుని కాపాడుకుంటున్న రోజులివి. కరు వు కండ్లలోని నీళ్లను కూడా పిండేసిన రోజులివి. ప్రజల ఆకలి దప్పుల్ని, అసమానతలనూ, అంటరానితనాన్ని రూపుమాపడానికొచ్చిన ప్రవక్త ఏసు. ఈ ఏసు జన్మదిన వేడుకగా కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రి క్రైస్తవ నాయకులకు గొప్ప విందు ఇచ్చాడు. క్రైస్తవ భవనానికి స్థలమిచ్చాడు, రూ. 10 కోట్లు డబ్బు ఇచ్చాడు, ఆర్చిబిషప్‌తో భూమి ప్రార్థన కూడా చేయించాడు.
బహుశా ఏసు పుట్టక ముందనుకుంట.. ఈ ప్రాంతంలో మల్లయ్య అనే గొర్రెల-బర్రెల కాపరి పుట్టాడు. ఆయన పుట్టిన తేది మెట్టిన తేది లెవ్వు. ఆయన కాపులో మంద మంచిగున్నదని, పాలు, పెరుగు, చల్ల సమృద్ధిగా దొరికాయని, మాంసం మస్తుగా తినగలిగేవారని, చలిని చంపే గొంగళ్ళు బోలెడుండేవని, బహుశా మల్లన్న మరణించిన కొంరెళ్ళిలో కురుమ-గొల్లలంతా గుడి కట్టుకున్నారు. ఈ మల్లన్నకు తెలంగాణలో మరో రెండు గుళ్ళు కూడా ఉన్నాయి. అవే ఐలోని మల్లన్న, కట్ట మల్లన్న గుళ్ళు. ఈ గుళ్ళు ఐలోని పేరులోనే నా పేరు కూడా ఉంది. కట్ట మల్లన్న పేరులో మా అవ్వ ‘కంచ కట్టమ్మ’ ఉన్నది. కాలినడకన గుళ్ళన్నీ తిరిగింది. నా ఎంటుకలు ఐలోని లోనే తీసిందట. పట్నాలేసింది, బోనాలు చేసింది. మా అయ్య పేరు కొమురయ్య కొమురెల్లి మల్లన్న నుంచే వచ్చింది. మా తాత పేరు కంచ మల్లయ్య ఈ అందరి దేవ తల పునాది పేరది. ఈ విధంగా దేవుడైన మా ముత్తాత ముత్తాత దగ్గర ఒక దేవుడిగా ఎలిసిన కొమురెళ్ళి మల్లన్న గుడి దగ్గర ముఖ్యమంత్రి దొడ్డి కొంరయ్య భవనం కట్టిస్తానని ప్రకటించాడు.
దొడ్డి కొంరయ్య పేరు కొంరెల్లి మల్లన్న నుంచి వస్తే గొర్ల-మేకల దొడ్డి కాపల కాసినోళ్ళయింనందుకు వాళ్ళ ఇంటిపేరు ‘దొడ్డి’ అని వచ్చి ఉంటుంది. ఈ దొడ్డి కొంరయ్యను సాయుధ పోరాటం ఆరంభ దశలో కడివెండి భూస్వాములు, ఆ ప్రాంతపు పోలీసులు కాల్చిచంపారు. కమ్యూనిస్టులు సైతం మర్చిపోయిన ఈ దొడ్డి కొంరయ్య చ రిత్రను మళ్ళీ, మళ్ళీ తవ్వి తీసింది దళిత బహుజన ఉద్యమం. ఇప్పుడాయన పేరుతో ఒక భవనం వస్తుంది. ఈ ప్రకటనలకంటే ముందే ముఖ్యమంత్రి కొమురం భీం భవనం ప్రకటించాడు. ఇక మిగిలింది చాకలి ఐలమ్మ భవనమొక్కటే. అది కూడా కట్టించాలని దళిత బహుజన ఉద్యమకారులు, చాకలి సమాజం కోరుకుంటుంది.
జీసెస్‌, కొమురంభీం, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మలకు భవనాలు, వాళ్ళ జీవితాలపై అధ్యయనాలు, వాళ్లపై పాటలు ఉండాలని నేనూ కోరుకుంటాను. కష్టజీవులకు తమ బాంధవ్యుల పేర్లతో భవనాలు, సంబరాలు, ఆటలు పాటలు ఉండాలి. ఐనా ఒకవైపు రైతులు అప్పుల బాధలతో, ఆకలి బాధలతో కరువు కోరల్లో ఉండగా ఇన్ని భవనాలు ఈ సంవత్సరమే కట్టడాన్ని మనమే కాదు ఆ మహానుభావులు ముఖ్యంగా జీసెస్‌-ఒక ప్రవక ్తగా, ఒక ప్రపంచ ఆకలి, దోపిడి విముక్తి దాతగా పూర్తిగా వ్యతిరేకిస్తాడు. జీసెస్‌ ప్రపంచానికి మానవత్వాన్ని నేర్పిన ప్రవక్త.
ఈ సంవత్సరం ఈ భవనాలకు భూమి ఇవ్వడం, కట్టిస్తామని హామీ ఇవ్వడంలో తప్పులేదు. కానీ ఈ 25 కోట్లు కరువు కాటకాల్లో, అప్పుల ఆవేదనలో, ఆకలి కోరల్లో ఉన్న తెలంగాణ ప్రజల్ని ఆదుకోవడానికి ఖర్చు చేస్తే వాళ్ళు సంతోషిస్తారు. రోజూ ఆత్మహత్యల వార్తలు బాధాకరంగా లేదా? ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు క్రైస్తవ సమాజానికిచ్చిన హామీ వారిపై ఈ రాష్ట్రంలో దాడులు జరుగవని. చర్చీలను ఎవరూ ఎటాక్‌ చెయ్యలేరని, పాస్టర్లకు, సిస్టర్లకు రక్షణ యిస్తామని అందరి బిషప్‌లు, పాస్టర్ల సమక్షంలో చెప్పడం మెచ్చుకోదగ్గది. ఆ వాగ్దానాలు ఈ రాష్ట్రంలో అమలైతే ఈ క్రి స్మస్‌ వేడుకలు సార్థకమైనట్టే. తెలంగాణలోని క్రైస్తవులకు భవనం కంటే వాళ్ళ మత ప్రచార హక్కు చాలా ముఖ్యమైంది. ఏ క్రైస్తవుడూ రాష్ట్ర ప్రజలు అప్పులో, ఆకలిలో మలమల మాడుతున్నప్పుడు 10 కోట్లతో తమకో భవనం కట్టండని అడుగకూడదు.
రాష్ట్రమంతటా మంచి పంటలు పండి, తిండికి తిప్పలులేని సంవత్సరంలో ప్రభుత్వం దగ్గర పైసలు దండిగా ఉన్నప్పుడు ఇటువంటి భవనాలు కట్టిస్తే మంచిదే. ఒకవేళ ఈ సంవత్సరమే ప్రభుత్వం దగ్గర డబ్బు కోకొల్లలుగా ఉన్నదనుకుంటే- చనిపోయే రైతాంగాన్ని, మాకో రెండువందల పించనైనా ఇయ్యండని రోడ్లమీద నిదురపోతన్న ముసలవ్వల, ముసలయ్యల రోదన వినకుండా డబ్బులేదని బుకాయిస్తూ భవనాల మీద కోట్లు పెడితే అది దేవుడు కూడా క్షమించనటువంటి నేరం. ఎన్ని యాగాలు చేసినా పాలకులు ఇటువంటి పాపం నుంచి బయటపడలేరు. ఏది ఎప్పుడు చెయ్యాలో కాలాన్ని బట్టి ఉంటుంది. మనముందున్న ప్రజల సాధక బాధకాలను బట్టి ఉంటుంది. ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే పల్లికాలేదని మరొకడు ఏడ్వడం మంచిదికాదు. ఈ ప్రాంతపు అతిపెద్ద మెదక్‌ చర్చిని తీవ్రమైన కరువున్న రోజుల్లో విదేశాల నుంచి డబ్బు తెచ్చి కట్టారు. ఆ కట్టడంలో వేలాది మందికి పని కల్పించారు. ఆ రూపంలో కాకుండా మరో రూపంలో ఆ డబ్బు తేగలిగేవారు కాదు. ఆనాడు ఆ పని మేలు చేసింది. ఒక బ్రహ్మాండమైన చర్చినికూడా చరిత్రలో నిలిపింది. దేవుని పేరు తో చేసే పనైనా సొంత లాభాలు లేకుండా చెయ్యాలి కదా?
తెలంగాణ ప్రజలు ఇంకా ఫ్యూడలిజం ప్రభావంలో ఉన్నారు. ‘కుడుమే పండుగనే’ అమాయకత్వం చైతన్యం కాదు. వందల వేల కోట్లు ఖర్చు చేసి రాషా్ట్రన్ని కాపాడవలసిన రోజుల్లో పదుల కోట్లతో కులానికో మతానికో భవనం కడితే ప్రజలు బతకరు. నాకు ఇల్లు లేదు. నాకు వద్దు కూడా కానీ ప్రతి మనిషికీ-సీ్త్రకి, పురుషునికి - ఇల్లు నిర్మించేందుకే నా తండ్రి నన్ను పంపాడు అని చెప్పిన జీసెస్‌ మాట మరచి వేలాది మంది ఇల్లు లేక, తిండిలేక కరువు తమపై కరాల నృత్యం చేస్తున్న రోజుల్లో క్రైస్తవ భవంతికి పది కోట్లు ఇస్తే క్రైస్తవులెట్లా సంబరపడతారు. ఇక్కడే కదా ఒక బ్రాహ్మణీయ హిందువుకు, ఇతరుల కోసం తన శరీరాన్ని తన రక్తాన్నీ ధార పోసిన ఏసును నమ్మే క్రైస్తవునికి ఉండాల్సిన తేడా.
కొమురెల్లి మల్లన్న దగ్గర దొడ్డి కొమురయ్య భవనం కడుతానని ప్రకటించిన ముఖ్యమంత్రి రాషా్ట్రన్ని పరిపాలించే వెలమ భూస్వాముల్లో కొమురెల్లి మల్లన్న పట్ల ఎంత ప్రేమ ఉందో చూడాలి కదా! వారి సంస్కృతిలో మార్చు తెచ్చే సంఘ సంస్కర్త ఆ కులంలో ఎందుకు పుట్టలేదో ఆలోచించాలికదా! నేను ఇంతకు ముందే చెప్పినట్లు మా ఇంట్లో పేర్లన్నీ - మల్లయ్య, కొమురయ్య, కట్టమ్మ, ఐలయ్య - ఈ దేవుడి పేరు నుంచి వచ్చినవే. కానీ వెలమల్లో ఈ పేర్లున్న ఒక్క మగ లేదా ఆడ వ్యక్తి మనకు కనిపించరు. నరసింహరావు, రామారావు, విద్యాసాగర్‌రావు, రాజేశ్వరరావు అనే బ్రహ్మణీయ దేవతల పేర్లతో, అణచివేతే ఆనందంగల సంస్కృతితో జీవించే సంస్కృతి నుంచి వాళ్ళు మారుతున్న దాఖలాలుకూడా లేవు.
నిజానికి రెడ్లల్లో, కాపుల్లో కొంరెల్లి మల్లన్న పేర్లు కనబడతాయి. మల్లారెడ్డి, ఐల్‌ రెడ్డి, కోట్రెడ్డి, మగపేర్లు, మల్లమ్మ, కొంరమ్మ వంటి ఆడపేర్లు కాపు రెడ్లలో చాలామందికి ఉన్నాయి. ‘కడుపులో లేంది కౌగలించుకుంటే రాదు’. దొడ్డి కొంరయ్య భవనం ఒక్క గొల్ల కురుమలకే కాదు తెలంగాణ సాయుధ పోరాటంపై గౌరవం ఉన్న వారందరికీ కావాలి. చాకలి ఐలమ్మ ఒక్క చాకలోళ్ళ హీరోయినే కాదు. తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసే సీ్త్రలకు-పురుషులకు ఆమె ఆదర్శం. కొమురం భీం ఒక్క ఆదివాసుల హీరోనే కాదు. మొత్తం మానవజాతికి ఆయన ఆదర్శం. వీరిని పట్టించుకోకుండా సమైక్య రాష్ట్ర పాలకులు, కమ్యూనిస్టు-సోషలిస్టు నాయకులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద తప్పు చేశారు. రాష్ట్రం విడిపోవడానికి ఇదొక కారణం.
ఈ ముగ్గురి పోరాటయోధుల్లో కొంరెల్లిమల్లన్న, ఐలోని మల్లన్న సంస్కృతి ఉంది. అందుకే ఆ ఆదివాసి నాయకుని పేర్లో ‘కొమురం’ ఉంది. కొత్త రాష్ట్ర పాలకులుగా మారిన వెల మల్ని నేనడిగేదేమంటే తెలంగాణ సంస్కృతికే మూల విరాట్టులైన కొమురెల్లిమల్లన్న, ఐలోని మల్లన్న, కట్ట మల్లన్న, సమ్మక్క, సారక్క, పోచమ్మ కట్టమైసమ్మ, పోతరాజు, బతుకమ్మల ప్రభా వం మీ సంస్కృతిక జీవనంలో కనబడటం లేదు. తెలంగాణ ఉత్పత్తి కులాల్ని వీళ్ళు నిజంగా ప్రేమించాలంటే ఈ కులంలో కూడా సంఘసంస్కరణ ఆలోచన చెయ్యాలి కదా! ఈ కులంలో పుట్టిన ఒక్క సంఘం సంస్కర్త పేరన్నా చెప్పగలరా?
ఆ మధ్య మాజీ విప్లవకవి, జగిత్యాల ఉద్యమంలో అండర్‌గ్రౌండ్‌లో ఉండి రచనలు చేసిన మిత్రుడు, కమ్మల వలెనే వెలమలు క్యాపిటలిస్టులు కావడానికి నేను దోహదపడదల్చుకున్నానన్నాడు. ఐతే వెలమల్లో సంఘ సంస్కరణ విలువలు కనబడవు. చెన్నమనేని రాజేశ్వరరావు తరువాత ముప్పాళ్ళ లక్ష్మణరావు కమ్యూనిస్టులుగా ఎదిగినా వారు సంఘ సంస్కరణ కోసం చేసింది ఏమీ లేదు. విప్లవం రాదనుకున్న రాజేశ్వరరావు పూర్తిగా పాలక సంస్కృతిలోకి జారుకున్నారు. లక్ష్మణరావు ప్రభావం కులంపైగాని, ఆ ప్రాంత ప్రజల సాంస్కృతిక జీవన విధానంపై గాని ఏమీలేదు. దురదృష్టవశాత్తు భారత దేశంలో కమ్యూనిస్టులు సోషల్‌ రిఫామ్‌ను ఎన్నడూ పట్టించుకోలేదు. కనుక ఈ ప్రభుత్వానికి కనీసం కమ్మలకున్న రామస్వామి చౌదరులో, ఎన్‌.జి. రంగాలో లేరు. కనుక వాళ్ళ అధికారాన్ని, రాజకీయ ఆధిక్యతను కాపాడుకోవాలనుకున్నా, కొమురం భీమ్‌, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మలే అండ. ముందు, ముందు వీరి ఆదరణ పెరుగుతుంది కానీ తరుగదు. అందువల్ల వారి పేర్లతో భవనాలు ఇవ్వాళ కాకపోతే రేపైనా వస్తాయి. వాటిని కరువులో ప్రజలకు తిండి పెట్టకుండా కట్టాల్సిన అవసరం లేదు. వారికి భవనాలు కావాలని ప్రజల్లో ఎంతో సెంటిమెంటు ఉన్నప్పటికీ ఇది తరుణం కాదని నా అభిప్రాయం.
తెలంగాణ అభివృద్ధి సోషల్‌ రిఫామ్‌తో ముడివడి ఉంది. సోషల్‌ రిఫామ్‌ ముఖ్యంగా జరుగాల్సింది ఈ ప్రాంతపు అగ్ర కులాల్లో. తెలంగాణ సాయుధపోరాటం, తొలి జై తెలంగాణ ఉద్యమం, సిరిసిల్ల జగిత్యాల పోరాటం, మలి జై తెలంగాణ పోరాటాలు సోషల్‌ రిఫామ్‌ జోలి పోలేదు. కింది కులాల్లో కూడా బాగా మూఢ నమ్మకాలున్న రాష్ట్రమిది. వాటిని రూపుమాపకుండా వారి ఆర్థిక అభివృద్ధి కూడా జరుగదు. ఈ ప్రాంతంలోని రెడ్డి, వెలమ, కాపు కులాల్లో ఫ్యూడల్‌ విలువలు చాలా బలంగా ఉన్నాయి. కింది కులాల్లో ఈ ఫ్యూడల్‌ విలువలకు బానిసత్వంలో బతికే లక్షణం చాలా ఎక్కువ. అన్ని కులాల్లో పురాతన విగ్రహారాధన చాలా బలంగా ఉంది. మతం రంగంలో కూడా పుస్తక పఠన సంస్కృతి ఏ కులంలో అంతగా లేదు. ఇక్కడి బ్రాహ్మలు కూడా ఫ్యూడలిజాన్ని పూజించే పండితులే. ఈ మౌలిక రంగంలో మార్పు రాకుండా తెలంగాణ దక్షిణాది బీహార్‌గా మారే అవకాశముంది.
ఈ స్థితి మార్చడానికి స్మారక భవంతుల కంటే సంఘ సంస్కరణ పోరాటాలు ఎక్కువ జరగాలి. ఐతే ఏ పోరాటాలైౖనా కరువును, ఆకలిని, అప్పుల బాధను అధిగమించాకే అర్థవంతంగా జరుగుతాయి.
 కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త 
Andhra Jyothi Telugu News Paper dated : 2/1/2015