Saturday, February 25, 2012

ఉద్యమకారుల దిక్సూచి

ఇక్కడ అత్తలూరి శేషయ్య గారి ఇల్లు ఎక్కడో చెపుతారా? వెనుక రిక్షాలోనుంచి వచ్చిన ప్రశ్నకు ఇటు తిరిగాడు నడివయస్కుడు. ఎవరో అపరిచితురాలి నోటి వెంట తన పేరు వినపడగానే ఏదో అర్థం అయ్యీ అవనట్టు తలూపాడు. తన యింటి అడ్రసు అడిగిన ఆమె వైపు తేరిపార చూశాడు. ఆమెకు 45 ఏళ్లుంటాయేమో తెల్లగా ఉంది. ఒక పక్క జుట్టు నెరసినట్టుంది. 

ఆమె ఒడిలో ఏదో గుడ్డలో చుట్టివుంది. రిక్షాలో మరో పక్క చిన్న బుట్ట. అందులో ఏవో గుడ్డలు కుక్కివున్నాయి. రిక్షా ముందు తన యింటికి దారి చూపిస్తూ నడిచాడు అత్తలూరి శేషయ్య. తన వెనకే రిక్షాలో అపరిచితురాలు. ఓ పూరి గుడిసె ముందు రిక్షాని ఆపి లోపలికెళ్లాడు. తన భార్య, ఆరుగురు పిల్లలతో ఇంటి బయటకు వచ్చాడు.

అప్పుడు గమనించారు వాళ్లు రిక్షాలో వచ్చిన అపరిచితురాలి చేతిలో నెల కూడా నిండని పసికందుని. నల్లగా నిగనిగలాడుతోందా పసిబిడ్డ. పాప ఒంటినిండా గుడ్డలు కూడా లేవు. చాలీ చాలని పాత గౌను తప్ప. గుడ్డల్లో చుట్టి వుంచిన పసిగుడ్డుని చేతులు ముందుకు సాచి 'ఈ పాపని మీ అబ్బాయి మల్లికార్జునరావు మీకివ్వమని చెప్పాడు' అన్నది. నల్లగా, సన్నగా ఊపిరి ఉందో లేదో అన్నట్టున్న ఆ అమ్మాయిని తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు.

navya.రెండు నిముషాల తరువాత అందరిలో నుంచి ఓ పదమూడేళ్ల పిల్లవాడు రెండడుగులు ముందుకేసి చేతులు సాచడం, ఆ నడివయస్కురాలు ఆ పసిగుడ్డుని ఆ బాలుడి చేతిలో పెట్టి వెనుతిరిగి వెళ్లిపోవడం అంతా ఐదు నిముషాల్లో జరిగిపోయింది.

చేతిలో పాపని లోపలికి తీసుకెళ్తున్న ఆ అబ్బాయి వెనకే నడుస్తూ.. 'కొండపల్లి సీతారామయ్యగారు పంపిస్తానని చెప్పింది డాక్డర్ దేవినేని మల్లికార్జునరావు కొడుకుని కదా?' అనుకుంటూ లోపలికి నడిచారు ఆ పిల్లవాడి తల్లి శిరోమణి, తండ్రి అత్తలూరి.

ఆ రోజు నుంచి ఆ దంపతుల ఎనిమిదో సంతానంగా ఆ పాపకి వాళ్ల హృదయాల్లో చోటునిచ్చాడు. ఆరు నెలల వరకు ఆ పాప ఏ తల్లి కన్నబిడ్డో, తమ దగ్గరికి ఎందుకు పంపించారో వారికి తెలియదు. కానీ నక్సలిజం బాటలో నడిచిన తమ కొడుకుని ఆ పసిబిడ్డలో చూసుకుంటూ ప్రేమగా పెంచుకున్నారు. 

సరిగ్గా ఏడాది తరువాత ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఒక వ్యక్తి వచ్చాడు. ఆ శీతాకాలపు రాత్రి వచ్చిన వ్యక్తితో పాటు ఆ కుటుంబ సభ్యులందరూ పొయ్యి చుట్టూ కూర్చొని వున్నారు. పొయ్యిచుట్టూ చేరి చలికాచుకుంటున్న అక్కడి వారి గుండెలు ఉద్వేగంతో కొట్టుకుంటున్నాయి. ఆ నెగడు వెలుతురులో ఎదురుగా నులకమంచంపై పడుకోబెట్టిన పాప ప్రశాంతంగా నిద్రపోతోంది.

ఈ పాప ఎవరు? ఆ యింటి యిల్లాలు మూడోసారి వేసిన ప్రశ్నకి సమాధానంగా తెల్లటి చిన్న కాగితాన్ని ఆమె చేతిలో పెట్టాడా వ్యక్తి. ఆ కాగితం పూర్తిగా తెరచి చదివిందో లేదో వెంటనే దాన్ని తీసుకొన్ని పొయ్యిలో వేశాడతను. పక్కనుంచి తొంగి చూసిన ఆ తల్లి కొడుకు జవహర్ మనసులో అనుకుంటున్నట్టుగా పైకే చెప్పేశాడు.

అంతే ఆ పేరు వినగానే అక్కడున్న వారి గుండెల్లో రాయి పడింది. అయితే యేడాదిగా తాము పెంచుకుంటున్నది ఓ నక్సలైటు నాయకుడి కూతురినా? అందరి చూపులూ అప్రయత్నంగా నిద్దరోతున్న పసిబిడ్డపై పడ్డాయి. 'ఈ విషయం బయటికి పొక్కితే...' అనే ఆలోచనే వారికి వెన్నులో ఒణుకు పుట్టించింది. అప్పటికే శ్రీకాకుళ గిరిజన సాయుధ రైతాంట పోరాటపు వీరగాథలు రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేశాయి.

అనేకమంది విప్లవకారులను ప్రభుత్వ సాయుధ బలగాలు మట్టుబెట్టాయి. అటువంటి పోరాటానికి నాయకత్వం వహించిన వారిలో ఒక నాయకుడి కూతురిని తాము పెంచుతున్నామన్న విషయం వారిని భయమో, ఆనందమో తెలియని సందిగ్ధంలోకి నెట్టింది. 

అప్పటికే నక్సలైట్లలో కలిసిన తమ కొడుకు జాడ పోలీసులకు తెలియకుండా ఊరూరు తిరుగుతూ తలదాచుకుంటున్నవారికి యిప్పుడు ఈ పాప రాబోయే ఉపద్రవం చెప్పకనే చెప్పినట్టయ్యింది. పేగు బంధం కాకపోయినా పెనవేసుకున్న అనుబంధంతో ఆ పాప సంవత్సరానికే అంతులేని ఆప్యాయతను పొందింది. పాపని విడిచిపెట్టలేని నిస్సహాయ స్థితికి వారిని చేర్చింది.

'పాప మాతోనే ఉంటుంది. మేం గంజి తాగితే అదీ తాగుతుంది. ఈ పేదరికాన్ని, భరించలేక, పోలీసుల వేధింపులకు తాళలేక మేం చచ్చిపోతే తనూ చనిపోతుంది. అంతేకాని ఈ పరిగుడ్డూ ఎవరి బిడ్డ అయినా వెనకడుగు వేసేది లేదు. తనని వదిలి మేం ఉండేదీ లేదు' స్పష్టంగా, దృఢసంకల్పంతో అన్న ఆమె మాటలతో సంతృప్తిగా గుండెనిండా ఊపిరి పీల్చుకున్నాడు ఆ పాపని వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తి.

అతని పేరు చింతాల సింగన్న అలియాస్ నాయుడు ఈ విషాద దృశ్యకావ్యంలో అదృశ్య నాయకుడు ఎవరో కాదు ఇటీవల అస్తమించిన విప్లవ సూర్యుడు, శ్రీకాకుళ పోరాటయోధుడు పైలా వాసుదేవరావు. కనులు కూడా తెరవని ఆ పురిటి గుడ్డుకు తండ్రి పైలా వాసుదేవరావు. 

ఆయన సహచరిణి పైలా చంద్రమ్మ ఒక ఆసుపత్రిలో జన్మనిచ్చిన ఆ పాపనే ఈమె. ఆమె పేరు అరుణ. పిల్లలు ఉద్యమానికి అవరోధంగా భావించిన ఈ దంపతులు తమ బిడ్డను వదులుకోవాలనుకున్నారు.1972 ప్రాంతంలో విప్లవోద్యమంపై అమానుష నిర్బంధం సాగింది.

పిల్లలను పెంచడం అంటే ఇంటికే బందీ కావల్సివస్తుందని భావించిన విప్లవ నాయకులు కొందరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్నారు. అనివార్య పరిస్థితుల్లో పిల్లలను కన్నవాళ్లు తమ పిల్లలను ఎక్కడో పెంచడానికి ఇచ్చేవారు. కొందరు బంధువుల ఇళ్లల్లో పిల్లలను పెంచితే పైలా దంపతులు పరిచయం కూడా లేని ఉద్యమాభిమానులకు పాపను ఇచ్చారు.

పార్టీనాయకులు ఎక్కడ ఇచ్చారో చాలాకాలం వీరికి తెలియదు. ఎవరిబిడ్డనో పెంచిన వారికి తెలియదు. కన్న బిడ్డ సుదూరంలో పెరుగుతున్న సమయంలోనే, ఆ జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతుండగానే ఆయన సహచరిణి చంద్రమ్మ 1975లో అరెస్టయి, 1986 దాకా జైల్లోనే ఉన్నారు. 

అయినా పైలా చెక్కుచెదరలేదు. వాసుదేవరావు ఉత్తరాంధ్రలో సామాజికంగా ఆధిపత్య స్థానంలో ఉన్న కళింగ కులానికి చెందినవాడు. ఉపాధ్యాయుడుగా ఉన్నప్పుడు తనతోపాటు కిందికులాల వారికి ఇంట్లో భోజనం పెడితేనే తాను తింటానని మొండికేసి గెలిచిన చైతన్యశీలి. నేను ఆయనను ఐదు గంటలపాటు చేసిన ఇంటర్వ్యూలో అనేక అంశాలు చోటు చేసుకున్నప్పటికీ , ఆయన జీవిత గమనపు అంతస్సూత్రం ప్రజల పట్ల ఆయనకున్న అభిప్రాయమని నిర్ధారించుకున్నాను. 

కమ్యూనిస్టులకు సిద్ధాంతాలు, రాజకీయాలు చాలా ముఖ్యమే. కానీ అంతకన్నా ముఖ్యం ప్రజలతో మమేకం కావడం, అంటి పెట్టుకొని ఉండడం, కష్టసుఖాల్లో పాలుపంచుకోవడమని ఆయన అభిప్రాయం. ఆ ఇంటర్వ్యూలో ఈ విషయాలే పదేపదే చెప్పారు.

ప్రజలతో ఎవరు నిలబడితే, ప్రజలు వాళ్లను నిలబెడతారని భావించారు. అందుకే ఆయన ప్రజల పట్ల ప్రేమను, గౌరవాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. విప్లవోద్యమం చీలికవల్ల నష్టపోయిందని చెప్పినప్పటికీ , ప్రజల్లోకి వెళ్ళాల్సినంతగా వెళ్ళక పోవడంవల్ల కూడా చాలా నష్టపోయామని ప్రకటించిన నాయకుడు పైలా వాసుదేవరావు. ప్రజా జీవితంలో భాగం కావాలనుకునే కార్యకర్తలకు, నాయకులకు వాళ్ళ రాజకీయాలేమైనప్పటికీ, సిద్ధాంతాలు వేరైనప్పటికీ వాసుదేవరావు ఉద్యమం-జీవితం ఒక దిక్సూచి. 

- మల్లెపల్లి లక్ష్మయ్య 
(నేడు హైదరాబాద్‌లో పైలా వాసుదేవరావు సంస్మరణ సభ)
Andhra Jyothi News Paper Dated : 20/04/2010

No comments:

Post a Comment