Thursday, June 13, 2013

కోనేరు కమిటీ గుర్తుందా?---- పి.యస్. అజయ్ కుమార్


June 13, 2013
రాష్ట్రంలోని పేదలకు భూములను అందుబాటులోకి తెచ్చేందుకు చట్టాలు నియమాలు, పాలనా పద్ధతుల్లో రావలసిన, తేవలసిన మార్పులు సూచించమని 2004లో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. అది మావోయిస్టు పార్టీ వారితో ప్రభుత్వ చర్చలు జరుపుతున్న కాలం. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు భూపోరాటాలు చేస్తున్న సందర్భం. అప్పటి మంత్రివర్గంలోని పురపాలక శాఖ మంత్రి కోనేరు రంగారావు ఈ కమిటీకి అధ్యక్షత వహించడంతో అది 'కోనేరు రంగారావు కమిటీ'గా ప్రాచుర్యం పొం దింది. రెండు సంవత్సరాల తరువాత 2007లో ఈ కమిటీ 104 సిఫార్సులతో ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో 12 అధ్యాయాలున్నాయి. 104 సిఫార్సులలో 41 ఆదివాసీల భూ సమస్యల పరిష్కారానికి ఉద్దేశించినవే. భూములను పేదలకు అందుబాటులోకి తేవాలంటే అధికారులలో పేదల అనుకూల దృక్పథం ఏర్పడాలని కమిటీ భావించి అందుకు ఒక సిఫార్సు చేసింది.

2007 సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్లు 1049, 1176 ద్వారా 90 సిఫార్సులను ఆమోదించినట్లు, 12 సిఫార్సులను తిరస్కరించి మరో రెండు సిఫార్సులపై నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలిపింది. ఈ సిఫార్సుల అమలుతీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒకటి, రెండు కాదు ఏకంగా మూడు కమిటీలను, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని అదనపు కమిషనర్‌గా నియమించారు. 2009 నాటికి ఆమోదించిన 90 సిఫార్సులలో 65 సిఫార్సులపై జిల్లా కార్యాలయాలకు ఆదేశాలు వెళ్ళాయి. రాజధానిలో భూమి శిస్తు కమిషనర్, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి వెళ్ళిన 65 సిఫార్సుల ఉత్తర్వులలో ఎన్ని అమలుకు నోచుకున్నాయి? క్షేత్రస్థాయిలో వాటి ప్రభావం ఏమిటనే ప్రశ్నను ఒక నిమిషం పక్కనపెడితే 2009 నుంచి ఇప్పటి వరకు గడిచిన మూడేళ్లలో ఎలాంటి ప్రగతి లేదు. మిగిలిపోయిన 25 సిఫార్సులకు ఇంకా ఆదేశాలు వెళ్ళవలసి ఉంది. బాధాకరమైన విషయం ఏమిటంటే ఉండిపోయిన 25లో 10 ఆదివాసీల భూమి సమస్యకు, 4 భూవాజ్యాలకు, 3 భూ సంస్కరణల చట్టం అమలుకు సంబంధించినవి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం తెచ్చామని చంకలు గుద్దుకుంటున్న పాలక వర్గం దళిత, ఆదివాసీలకు సంబంధించిన భూ సమస్య పరిష్కారంలో వారి చిత్తశుద్ధి ఏపాటిదో ఇది తెలియజేస్తుంది.

పేదలకు కావలసింది కమిటీలు, సిఫార్సులు, జీవోలు కాదు వారికి కావలసింది భూమి. కోనేరు కమిటీ సిఫార్సులకు ముందు తరువాత రాష్ట్రంలో భూమి సమస్యపై ఎలాంటి మార్పు లేదు. 1973 భూసంస్కరణ చట్టం గూర్చి ఇప్పుడు ఎవరికీ గుర్తులేదు. భూములను వివిధ రూపాలలో బదిలీ చేసేవారు తాము సీలింగు చట్టాన్ని ఉల్లంఘించలేదని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డిక్లరేషన్ ఇవ్వాలి. సంబంధిత భూ సంస్కరణల ట్రిబ్యునల్ నుంచి నో అబ్జక్షన్ ధృవపత్రాన్ని అమ్మకందారు పొందవలసి ఉంటుంది. ఈ రెండు అంశాలను మరోసారి గుర్తుచేస్తూ కోనేరు కమిటీ 4.14, 4.15ను చేసింది. వీటిని ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం 2007 నవంబరు నెలలో రెండు మెమో ఉత్తర్వులను జిల్లా కలెక్టర్లకు, రిజిస్ట్రేషన్ శాఖలకు ఇచ్చింది. కానీ రాష్ట్రంలో ఎక్కడా వీటిని అమలుచేయడం లేదు.

మరో మంచి ఉదాహరణ ఆదివాసీ భూమి సమస్య. భూమి సమస్య పరిష్కారం కాకపోవడమే ఆదివాసీ ప్రాంతాలలో అలజడికి కారణమని అందరూ అంగీకరిస్తారు. ప్రభుత్వాలు, ప్రణాళికా సంఘం వేసిన కమిటీలు సహితం ఇదే మాట చెప్పాయి. అంతెందుకు ఇప్పుడు మనం మాట్లాడుతున్న కోనేరు కమిటీ '48 శాతం భూమి నేడు గిరిజనేతరుల చేతుల్లో ఉంది. ప్రతి సంవత్సరం వం దలాది ఎకరాల భూమి గిరిజనేతరుల చేతుల్లోకి పోతుంది. గట్టిపాలన చర్యలు తీసుకోకపోతే, కొంతకాలానికి గిరిజనుల చేతుల్లో భూమి లేకుండాపోయే ప్రమాదం ఉంది.' దేశంలోని 5వ షెడ్యూ ల్ ప్రాంతాలలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ 1/70 చట్టం ఉన్నప్పటికీ, ఆ చట్టం క్రింద నమోదైన కేసులలో 50 శాత గిరిజనేతరులకే అనుకూలంగా పరిష్కారమైనాయి. గత 43 సంవత్సరాలలో గిరిజనేతరులకు అనుకూలంగా వచ్చిన తీర్పులపై అప్పీళ్లు వేయాలని కోనేరు కమిటీ (9.11) సిఫార్సు చేయడం, 2008 మార్చి నెలలో సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు ఇవ్వటమూ జరిగింది.

కానీ ఎక్కడా ఇవి అమలు కాలేదు. కమిటీ చెప్పినట్లుగా, 2008-2013 మధ్య మరికొంత భూమి ఆదివాసీల చేతుల్లో నుంచి జారిపోయింది. అన్నింటికన్నా హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే ఈ కేసులను పరిష్కరించే ఎల్.టి.ఆర్. కోర్టులలో సిబ్బంది, అధికారులు, మౌలిక వసతులు లేవు. వాటిని పటిష్ఠ పరచడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆదివాసీ ప్రాంతాలలో చొరబడిన గిరిజనేతర వర్గాల ప్రయోజనాలను ముట్టుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు.

రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్
Andhra Jyothi Telugu News Paper Dated : 13/6/2013

No comments:

Post a Comment