Monday, June 17, 2013

తెగిపడిన తలలే.. నూటొక్క గొంతులై..! --- డా.జి.కె.డి.ప్రసాద్-


June 17, 2013
లక్ష్మింపేట దురంతం మీద దళిత అక్షరం పదును దేలింది. కవిత్వం ఉప్పెనలాంటి అభివ్యక్తితో ప్రవహించింది.. దళిత ఉద్యమ గమనానికి కొత్త ప్రశ్నలు సంధిస్తోంది..
దళితుల సామాజిక, ఆర్థిక విముక్తి పోరాటాల్లో మరో నెత్తుటి పుటగా లక్ష్మింపేట నమోదయింది. 12 జూన్ 2012 తెల్లవారే ఇక్కడి దళితుల మీద మారణకాండ జరిగింది.. హత్యకు గురయిన ఐదుగురి మృతుల కనుగుడ్లను హంతకులు చిదిమేయడాన్ని గమనిస్తే ఈ హత్యల వెనుక ఎంతటి విద్వేషం విలయతాండవం చేసిందో కళ్లున్న వారంతా గ్రహించగలరు. 'సర్వేంద్రియానాం నయనమ్ ప్రధానం' ఆర్యోక్తి నరరూప రాక్షసుల ఆధిపత్య క్రీడలో దుర్మార్గానికి ఉపకరించింది. ఈ నేపథ్యంలో మనువాదీ! నీ నికృష్ఠ నినాదం మా బతుకు బండిని ఛిద్రం చేస్తూనే వుందని 'తెగిపడిన చోట తెగబడటమే' నన్నారు దళిత కవులు. మా అక్షరాలు మానస సరోవరంలో హంసలు కాదు- చీకట్లను చీల్చే వెలుగుతారలని గొంతెత్తారు. తూరుపు కాపులు దళితుల్ని వధించడానికి వినియోగించిన 'కొంగుల్లో కారం, కత్తులు, వేటకొడవళ్ళు, బరిశెలు, నాటు బాంబులు, శూలాలు' వీటినే దళిత కవులు ప్రతీకలుగా తీసుకున్నారు.

ఈ అమానుష ఆటవిక దాడిలో 'ఆడవాళ్ళు కళ్ళల్లో కారం కొడుతుంటే.. మగవాళ్ళు కనుగుడ్లు బరిసెలతో పొడుచుకుంటూ.. కత్తులతో భుజాలు తెంచుకుంటూ.. గొడ్డళ్ళతో చేతులు నరుక్కుంటూ.. వెన్నెముకల మీద బండలతో మోదుకుంటూ మూగవాళ్ళను విగత జీవుల్ని చేసిన ఘట్టాన్నే' కవులు నరహంతక భావచిత్రంగా గీశారు. కుల క్రోధం కోరలు చాపి వికటాట్టహాసం చేస్తుంటే హాహాకారాల నడుమ దళిత గుడిసెలు దద్దరిల్లిపోయిన సన్నివేశాన్ని భీతావహ శిల్పంగా చెక్కా రు. గుండెలు అదిరిపోయి పిల్లామేక చెదిరిపోయి; కాకులు కలవరపడి; చూరుల్లో గబ్బిలాలు కీచులాడి; ఎలుకలు, పిల్లులు ఏకమై పరుగులు తీసి; ఈ మృత్యుహేల చుట్టూ రాబందులు రెక్కల చప్పుడు చేసిన సన్నివేశాన్ని కక్ష శిలల మీద ధిక్కారవర్ణ చిత్రం వేశారు. అంతకుమించి ఎలాంటి అలంకార ప్రాసక్రీడలు కావాలి ఈ కవిత్వానికి? దీనిలో శబ్ద సౌందర్యానికి, భావ సౌందర్యానికి బదులు నెత్తురే వస్తువయింది. ఆత్మాభిమానమే అలంకారంగా, శోకమే ఛందస్సుగా, నరమేధమే శిల్పంగా, 'అగ్ర'త్వమే యతిస్థానంగా బూడిదయిన బతుకుల మీద భూమిపుత్రుల ఆర్తనాదమే కవిత్వంగా రూపుదాల్చింది.

'కూలికెళ్ళేటోళ్ళకి, పాలేరోతికి భూమి ఏంతురోయ్' అన్న తూరుపుకాపుల నోటిమాటే దళితుల్ని ఆత్మాభిమాన పోరాటానికి పురిగొల్పింది. దళితులు రెండు, మూడేళ్ళుగా రాజ్యాంగబద్దంగా రాళ్ళను రప్పలను చదును చేసుకుంటూ నాలుగు గింజలు పండించుకుంటున్నారు. కాపు కాసిన శత్రువు దళితుల రక్తం కళ్ళ చూడటానికి కంకణం కట్టుకున్నాడు. ఇక్కడే వాళ్ళను ఒక విద్వేష వచనం ప్రేరేపించింది. 'మాలోల్లు మన పక్కలో భూమితున్నమేంతి రా! మనం కాపులోల్లకి పుత్తలేదేంతి' అంటూ విద్వేషాన్ని ఎల్లగక్కారు. దేశవ్యాప్తంగా జరిగిన దళిత హత్యలన్నీ ఆధిపత్య కులాల క్రౌర్యం నుంచి, అధికార మదం, ఆర్థిక దోపిడీల నుంచి జరిగితే లక్ష్మింపేట దుర్ఘటన ఓ ప్రత్యేకతని చాటుకుంది. మారణహోమం సృష్టించినవాడు గంజి లో ఉప్పేసుకొని తాగేవాడు. బలైనవాడు గింజి తాగేవాడు. ఇక్కడ వర్గ మెక్కడిది.. ఇద్దరూ పేదలే. సరిగ్గా అదే సమయానికి ఇక్కడ తూరుపుకాపుని మనువు ఆవరించి అంటరానివాడి మీద ఆధిపత్య సాంప్రదాయాన్ని గుర్తుచేశాడు. ఈ దేశ చరిత్ర నరనరాల్లో జీర్ణించుకుపోయిన స్మృతిగతుల్ని ఆవిష్కరించాడు. దళిత చైతన్యం ఎప్పుడైనా ఎక్కడైనా నాలుగు మెతుకులు సాధించే దిశగా పయనిస్తున్నప్పుడు అలికిడికి తెలియకుండా ఎలా ఆవహించాలో నేర్పించాడు. లక్ష్మింపేట మీద 'నిఘా' తర్ఫీదు నిచ్చాడు.


భూమి కోసం.. భుక్తి కోసం.. తరతరాల అంటరానితనం విముక్తి కోసం లక్ష్మింపేట దళితులు సమిధలయ్యారు. ఆత్మాభిమానంతో రగిలిపోయిన వీరి రక్తం ఆ మట్టిలోనే ఇంకిపోయింది. ఆ కుటుంబాల కన్నీటిఘోష అక్కడి గాల్లోనే కలిసిపోయింది. దళితుల మాన, ప్రాణాలను కాపాడుకోవడానికి కొన ఊపిరిలో కూడా కొదమసింహమై కోత కొడవలితో యుద్ధం చేసిన మహావీరుడు.. మా మాల కన్నమదాసు 'బురడా సుందరరావు' నేలకొరిగాడు. కనుగుడ్డు వేలాడుతున్నా వెనక్కి తగ్గని 'నివర్తి వెంకటి' నింగి కెగిశాడు. బాంబుల దాడి నుంచి తప్పించుకొని బళ్ళాలకు, బరిశెలకు బలై నలభై కత్తిపోట్లతో సంగమేసు కుప్పకూలాడు. గొడ్డలివేటుకి చిత్తిరి అప్పడు, శూలాలపోట్లకి బొద్దూరి పాపయ్య ప్రాణాలు విడిచారు. మరో ఇరవై ముగ్గురు మూగవాళ్ళు క్షతగాత్రులయ్యారు. ఈ వార్త నలుగురికీ తెలిసేసరికి దుండగులు పలాయనం చిత్తగించారు. ప్రజాసంఘాలు చేరుకొని న్యాయపోరాటాన్ని నిర్మించాయి. దీంతో రాజకీయం రాట్నం తిప్పడం మొదలెట్టింది.

లక్ష్మింపేట దురంతం మీద జరిగిన చర్చోపచర్చలు, వాద వివాదాలు, అనేక అభిప్రాయాలు, పరిష్కారాలు, పరిహారాల నేపథ్యంలో.. దళిత అక్షరం పదును దేలింది. నలు మూలల అక్షర సైనికులు కలాలను చేతబూనారు. కవిత్వం ఉప్పెనలాంటి అభివ్యక్తితో తెగిపడిన తలలే నూటొక్క గొంతులై ప్రవహించాయి. తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ సంకలనం తీసుకురావడానికి పూనుకున్నారు. ఒంగోలు 'సాహితి-అధ్యయన' వేదిక దానిని ప్రచురించింది. 'తెగిపడినచోట తెగబడటమే' సంకలనంలో దళిత ఉద్యమ గమనానికి సంబంధించిన కొత్త ప్రశ్నలు, పాతప్రశ్నలకు సమాధానాలు వున్నాయి. ఈ సంకలనంలో 'ఇప్పుడు నిజంగా పిడికిళ్ళు బిగించకపోతే మణికట్టులు నరికేసే కాలం' నడుస్తుందన్నాడు నూకతోటి రవికుమార్. తాగునీటి చెరువులో పశువుల్ని కడక్కూడదనే ఇంగిత జ్ఞానాన్ని గుర్తు చేసినందుకు కారంచేడు, చివరికి న్యాయబద్ధంగా నాలుగు అడుగుల నేలను సాగు చేసుకుంటుంటే లక్ష్మింపేట రణరంగమయ్యాయి. అందుకే గోపీనాథ్ 'అగ్రవర్ణం రంగు మార్చింది.. రక్తపు మడుగులో అంటరానితనం వెలుగు చూసింది' అన్నారు. బ్రాహ్మణుల కన్నా బ్రాహ్మణవాదం ప్రమాదకరమని, శూద్ర దోపిడీ కులాల బ్రాహ్మణవాదం అంతకన్నా ప్రమాదకరమనే ప్రశ్న తెరమీదికి వచ్చింది.|

'ప్రతి చరణమూ మరణమేనా! ఎవడు కట్టాడ్రా ఈ పాటని?' సతీష్‌చందర్ 'భూగర్భశోకం' నుంచి సమూల సామాజిక పరివర్తనతో వేసిన మరో కొత్తప్రశ్న ఇది. ఇటువంటి పాశవిక ఘటనలు పునరావృతం కాకుండా ఈ కుసంస్కృతిని తగలెట్టమన్నాడు కవి. దళితుల్ని మనుషులుగా జీవించనిచ్చే ఒక్క ఊరు కూడా ఈ దేశంలో లేదని ఎండ్లూరి సుధాకర్ దేశవిభజనకు దారితీసేటంతటి ప్రశ్న సంధించాడు. దళితుల సంఘీభావంతోనే వెనుకబడిన కులాలు ఈ దేశంలో 'మండల్ కమిషన్' ద్వారా రిజర్వేషన్లు సాధించాయి. వెనువెంటనే అండగా నిలిచిన దళితుల మీద ఆధిపత్యాన్ని చెలాయించడానికి హత్యల దుర్నీతిని అలవర్చుకున్నాయి. ఉత్తరాదిలో బ్రాహ్మణులు కాకుండా బ్రాహ్మణవాదులయిన బీసీలు చేస్తున్న హత్యల గణాంకాలే ఇందుకు సాక్ష్యం. ఇప్పు డు ఆ ప్రభావం తమిళనాడుని దాటుకొని ఉత్తరాంధ్ర వరకు పాకింది. ఆనాడు ఏ హిందూవాదమయితే బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించి బీభత్సాన్ని సృష్టించిందో అదే రథమెక్కి గెంతులేస్తున్న వారిని ఏమనాలి? 'ఇది మండల రథమెక్కి పాడుతున్న కమండల గీతం' -మనోఫలకాల మీద మనుధర్మాన్ని ముద్రించుకున్నోళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవలసి వుంటుంది. కత్తి పద్మారావు చారిత్రక కోణాన్ని 'నెత్తుటి ప్రశ్న'గా మాట్లాడారు. 'హతుడు వీరుడే కాదు, చరిత్ర సృష్టికర్త కూడా' అన్నారు. గతకాలంలో జరిగిన అత్యాచారాల చరిత్రను మరొక్కసారి పునరావృతం చేసిన ఈ ఘటనలో మూలాల్ని శోధించమన్నారు. కుల వివక్ష సమాజాన్ని 'పంచనామా' చేసిన పైడి తెరేష్‌బాబు ధిక్కార స్వరాన్ని వినిపించారు.

'ఓయీ ఓరి ఓసీ బీసీ/రక్తము రెండు విధములు../మీకు కావలసినది రక్తము అయినచో/మా స్త్రీల రుతుస్రావరక్తాన్ని మీ ముంగిట దిమ్మరించెదము/సలసల కాగు రక్తము మా సొంతము కదా' అని అస్తిత్వ భావప్రకటన చేశారు. 'అంటు దోషము మానరెలా?' అన్న కుసుమ ధర్మన్న సూటిప్రశ్న నుంచి నేటి వరకు అంటరానివారికి సమాధానమే దొరకలేదు. వెతుక్కోమన్నారు. వెతుక్కుంటూనే వున్నారు. మనిషిగా గుర్తింపు కోసం ఇంతకాలం వివక్షను ఎదుర్కొన్న జాతి ప్రపంచపటంలో ఎక్కడా కనిపించదు కదా! దళితజాతి తప్ప.
రావినూతల ప్రేమకిషోర్ 'లక్ష్మింపేట సాక్షిగా' చెప్పిన మాట సామ్యవాదంలోనూ కొరవడిన సామాజికతను గుర్తుచేస్తుంది. 'ప్రభుత్వం అందరిదీ అంటే/సర్కారు భూమి మాది కూడా..' అని మోసపోయినవాళ్ళం' అన్నారు. 'బీసీ ఐతేంది ఓసీ ఐతేంది.. పారింది మా నెత్తురే' అన్నాడు కృపాకర్ మాదిగ. నేతల ప్రతాప్‌కుమార్ 'మనువంటే ఇపుడు బ్రాహ్మణ అగ్రహారం కాదు/భూస్వాముల శూద్రవతారం-దాని విధి దళిత సంహారం' అన్నాడు. 'ఓసీ బీసీ హిందూ కలయిక/నిరాకరణ నిజం/ఈ దేశం కూడబలుక్కున్న నినాదం'గా వేముల ఎల్లయ్య లోకపంచనామా చేశారు. పిల్లి మల్లిఖార్జున్ 'ఓ నా ప్రియమైన గోడ మీద బీ.సీ.ల్లారా!/మన చెట్టు ముల్లే గదా అని దారిలో ఉంటే చూస్తూ ఊరుకుంటామా/ఏరి పారయ్యమూ!' అని హెచ్చరించారు. శిఖామణి 'ఆత్మగౌరవపు సూరీడు ఎటు తిరిగితే అటు/నా కోటానుకోట్ల దళిత పొద్దు తిరుగుడు ముఖాలు' అంటూ దళితుల దీనగాథలకు అక్షరరూపంలో సిద్ధపడ్డారు.

శిఖాఆకాష్ 'నా అక్షరం నిన్ను నిలువెత్తు ద్రోహిగా నిలబెడుతుంది' అంటున్నారు. డా.విద్యాసాగర్ అంగళకుర్తి 'కులధర్మంగా తినగలిగినంత కాలం/దున్నేందుకు పిడికెడు భూమెందుకు? మనిషిగా పోరాటమెందుకు' బానిసత్వం మీద తిరుగుబాటు తప్పనిసరి అన్నారు. 'ఎన్ని పుస్తెలు తెగితే పత్రికల పతాక శీర్షికల్లో కన్నీళ్లు అక్షరాలయ్యాయో!/ఎన్ని శ్వాసలు ఆగితే ఛానళ్లు శవాలను చూపించి రాత్రిని ఆవులించాయో!' అన్నారు సుందరరావు. ఖాజా 'ఇప్పుడు మనువులు, పుష్యమిత్రులు/ముఖం నుంచి కాదు/పాదాల నుంచి పుట్టుకొస్తున్నారు/పంచమజాతి అన్నలారా కొంచెం జాగ్రత్త' అని సంఘీభావాన్ని ప్రకటించారు. 'వర్ణ ధర్మం అధర్మమన్న కళింగ ప్రదేశాన/భూమి హక్కు దున్నేవాడిదేనన్న రైతాంగ విప్లవాల స్వదేశాన/కుల దురహంకారాన్ని ఇన్నాళ్లుగా దాచి ఇప్పుడు బహిరంగపరిచిందే వర్గం' ఇది ఛాయారాజ్ ప్రశ్న. వడ్డెబోయిన శ్రీనివాస్ 'భూమి నా ఎజెండా/పోరు నా జెండా/వారెవ్వా!/నా డప్పులోంచి తుపాకీ వికసిస్తోంది'అన్నాడు. 'బలిని బలి తీసుకున్న కుయుక్తుల/వామనమూర్తులు ఊరేగే దేశంలో/దళిత పాదాల్ని జయకేతనాలుగా జాంబవ భూమి పై నిలబెట్టడం తప్ప' డేవిడ్ లివింగ్‌స్టన్ నిట్టూర్చారు. వడలి రాధాకృష్ణ లక్ష్మింపేట ఘటనను 'ఆకాశమంత అరాచకం'గా వర్ణించారు.

'నేను మట్టిని కలగంటా ఉట్టి మీద గుప్పెడు బువ్వకోసం' అన్నాడు ఎజ్రాశాస్త్రి. కుంచే నాగసత్యనారాయణ 'మీరు ఆక్రమించిన సమస్తం మాకు కావాలి' అని తిరుగుబాటును ప్రకటించారు. జి.వి.రత్నాకర్ 'పిడికెడు ఉప్పు మహోద్యమ మయింది/దోసెడు నీళ్లు మహ ద్ ఉద్యమయింది/మరి గజం నేల మారణకాండ నెం దుకు రచించింది' -కారణాలను అన్వేషించాలన్నారు.

'లక్ష్మింపేట మానవతీ-ఎంకీ/బొడ్లో చీరలు దోపి/సంకెత్తి జుట్టు ముడేసి/నీ నాయుడు బావతో కలిసి/మా మానాల్లో చల్లడానికీ/గుప్పెట్లో బిగించి నువు తెచ్చావే..కారం/అదేమ్ కారం తల్లీ? దాని పేరేమిటి' అని వినోదిని ప్రశ్నించారు. 'నిద్ర లేదు, నిమ్మళం లేదు దమ్ముందా బిడ్డా!/రా, నా నెత్తుటి యుద్ధభూమిలో తేల్చుకుందాం' అని సూజాత సూరేపల్లి సవాల్ విసిరారు. 'శతపత్ర కుసుమాన్ని నేను/నా తోబుట్టు ముళ్ళు/నా పాలిట తోడేళ్లు' అని నిందించారు జ్వలిత. దానక్క ఉదయభాను 'నాకు చారెడు నేల ఉండటం రాజద్రోహం/ఈ నేలపై జీవించి ఉండడమే ఒక దేశద్రోహం'. ఎస్సీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలని బహుజన రాజ్యాన్ని స్థాపించాలని నినదిస్తున్న అణగారిన కులాలు ఈ అకృత్యానికి పాల్పడటాన్ని ఖండిస్తున్నారు. 'ఒసే రాములమ్మలు/కులం కుంపట్లు ఆర్పడానికి/రాజముద్రలు ధరించే దిశలో/పిడికిళ్లు బిగించడమే న్యాయం' నడకుర్తి స్వరూపారాణి హెచ్చరికలు జారీచేశారు. 'నా చుట్టూ నీరు ఎర్రగా ఉందే/ఏ మాదిగో, ఏ మాలో ఇక్కడ నరకబడ్డారా?../ఇక్కడేదైనా పెద్ద కులాల గొడ్డళ్లు మిడిసిపడ్డాయా/..గొడ్డలికి తెలిసేది గొడ్డలి భాషే' అన్నారు జూపాక సుభద్ర.

నిమ్న కులాలు తమ శ్రమని, భాషని, సంస్కృతిని చూసి గర్వపడటం నేర్చుకుంటున్న దశలోనే అణచివేతకు గురయిన సందర్భాలు ఎన్నో తారసపడతాయి. ఆత్మగౌరవమే దళితులకి ఊపిరి. అందుకే దళితులకి జాషువా గుర్తుకొస్తాడు. 'తల్లి దండ్రి లేని బిడ్డల జూచి కన్నీరు దానంబు చేయు నేత్రములు నావి/జంతుకోటికి గల్గు స్వామిభక్తిని మెచ్చి తృప్తినొందెడు నవ్యదృష్టి నాది/సకల కార్మిక సమాజముల జీవిత కథానకము లాలించు కర్ణములు నావి/కఠిన చిత్తుల దురాగతములు ఖండించి కనికరమొలికించు కులము నాది'. పశువులు గడ్డి తిని పాలిస్తుంటే మనిషి అన్నం తిని విషం కక్కుతున్నాడనే సందేశం జాషువా కవిత్వంలో వుంది. దళిత కలాలు కరుణతో జాషువా బాటలో పయనిస్తున్నాయి. ఈ రాజ్యంగం సమాజాన్ని మారుస్తుందనే ఆశే వారిది. అదే ఇప్పటివరకు దళిత కవుల ఆలోచనకు ఆది, అంతం. కరుణ వదలి కఠినత్వాన్నో, లేకుంటే పాళీల భాష మార్చి ప్రగతిబాటనో.. ఏదో వెతికేవారే కదా!
- డా.జి.కె.డి.ప్రసాద్
gkd1994@yahoo.com

Andhra Jyothi Telugu News Paper Dated : 17/6/2013

No comments:

Post a Comment