Monday, June 17, 2013

లక్ష్యం సరే, మార్గం మాటేమిటి?By కనీజ్ ఫాతిమా


June 18, 2013
ప్రత్యేక తెలంగాణ లక్ష్యసాధన పేరుతో మత మైనారిటీల భద్రతను విస్మరించడం సమంజసమేనా? ఉద్యమానికి నాయకత్వం వహిస్తోన్న పార్టీతో సహా పౌర, మానవ హక్కుల బాధ్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజాసంఘాల కార్యకర్తలు సైతం మతతత్వ రాజకీయాలకు తోడ్పాటు నివ్వడం తగునా?... 2009 నవంబర్ నుంచి సంభవించిన సంఘటనలను గుర్తు చేసుకోండి. వాస్తవాలేమిటో స్పష్టమవుతాయి.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ దూరదృష్టితో, మానవుల మధ్య నెలకొనివున్న సకల అంతరాలకు అతీతంగా, భారత పౌరులందరికీ సమాన హక్కులు కల్పించారు. ఆ ఉన్నతాదర్శాలు బోలు మాటలుగా మిగిలిపోయాయి. ప్రభుత్వాలు వాటిని అమలుపరచడంలో విఫలమవుతున్నాయి. దళితులు, ఆదివాసీలు, మైనారిటీల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని చిన్న రాష్ట్రాల నేర్పాటు చేయాలని అంబేద్కర్ సూచించారు. జాతి శ్రేయస్సు కోసమే ఆ మహానుభావుడు ఈ సూచన చేశారు. అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుందని, పౌరులు తమ హక్కులను సమానస్థాయిలో పొందగలుగుతారని ఆయన భావించారు. స్వార్థ ప్రయోజనాల కోసం లౌకిక/జాతీయ రాజకీయ పక్షాలు చిన్న రాష్ట్రాల నేర్పాటును వ్యతిరేకిస్తాయని, మతతత్వ పార్టీలు సంకుచిత లక్ష్యాలతో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్‌కు మద్దతునిస్తాయని అంబేద్కర్ కలలోనైనా ఊహించివుండరు. ధనాశ, అధికార లాలసతో నేటి రాజకీయవేత్తలు నిబద్ధతతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణకై ప్రస్తుత ఉద్యమం ప్రారంభమైన దరిమిలా ఈ ప్రాంతంలో సంభవిస్తోన్న రాజకీయ పరిణామాలే ఇందుకు నిదర్శనం కాదా?

నిన్న గాక మొన్నటివరకు తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన 'నాగం జనార్థన రెడ్డి' విషయాన్నే చూడండి. ఆయన ఇటీవల 'భారతీయ జనతా పార్టీ'లో చేరారు. ఆయన చర్య సామాన్య ప్రజలను ముఖ్యంగా ముస్లింలు, దళితులను దిగ్భ్రాంతి పరిచింది. ఎందుకంటే, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి ఆయన చిత్తశుద్ధితో కట్టుబడివున్నారని వారు అంతవరకు విశ్వసించడం జరిగింది. అయితే ఆయన తన అగ్ర కుల అభిజాత్యాన్ని చూపించారు. ప్రజల నుంచే గాక, బీజేపీ శ్రేణుల నుంచి కూడా ఆయన త్వరలోనే తీవ్ర పర్యవసానాల నెదుర్కోవలసి వుంటుందనడం సత్యదూరం కాబోదు. బీజేపీలో చేరక ముందు, చేరిన తర్వాత కూడా కేసీఆర్‌ను ఆయన తీవ్ర ంగా విమర్శించారు. ఆ విమర్శలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గతంలో అంటే బీజేపీలో చేరక ముందు కేసీఆర్‌పై నాగం విమర్శలు ఆయన సొంత అభిప్రాయాలు. మరి ఇక ముందూ ఆయన ఆ స్వతంత్ర వైఖరిని కొనసాగిస్తారా? లేక బీజేపీ విధానాలకు కట్టుబడి తనను తాను పరిమితం చేసుకుంటారా? కేసీఆర్‌పై విమర్శలు తన సొంత వైఖరా లేక బీజేపీదా? దయచేసి, ఈ విషయమై వివరణ ఇస్తారా నాగం గారూ? ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ హైజాక్ చేసిన నాటినుంచీ తెలంగాణ రాష్ట్ర సమితిని గానీ, కేసీఆర్‌ను గానీ ఆ పార్టీ ఒక్కసారి కూడా విమర్శించనే లేదు. తదుపరి సార్వత్రక, శాసన సభా ఎన్నికలు (2014) సమీపిస్తుండడంతో స్వార్థ ప్రయోజనాల కోసం ఈ మార్పులన్నీ చోటు చేసుకొంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో అన్ని విధాల లబ్ధి పొందడానికే ఇలా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ రాజకీయ నాయకులకు తెలంగాణ, దాని ప్రజల పట్ల అవాజ్య ప్రేమానురాగాలు ఏమీలేవు.

ప్రస్తుత తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచీ 'ఇదిగో తెలంగాణ వచ్చేసినట్టే'నని కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. ప్రతిసారీ ఆయన తెలంగాణ ప్రజల ఆశలను భగ్నం చేశారు. సకల జనుల సమ్మె విఫలమయ్యింది టీఆర్ఎస్, రాజకీయ జాక్, టీఎన్‌జీవోల కారణంగానే కాదూ? దరిమిలా కేసీఆర్ హఠాత్తుగా ఇలా తెలంగాణను సాధించలేమని, ఎన్నికలలో పోటీచేసి అత్యధిక సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకోగలమని ప్రకటించారు. ప్రజలు తెలివిహీనులా? తెలంగాణను సాధించడం జరిగితే కేసీఆర్ తన పార్టీని ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం చేసి, తానూ, తన కుటుంబం రాజకీయ లబ్ధి పొందుతారని తెలంగాణ ప్రజలకు అర్థమయింది. తెలంగాణ పేరిట సీట్లు సాధించుకొని తద్వారా స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడానికే ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ లక్ష్యంతోనే ఆయన 2014 ఎన్నికలకు సంసిద్ధమవుతున్నారు. కనుకనే ప్రత్యేక తెలంగాణను కేసీఆర్ సాధించలేరని సామాన్య ప్రజలు ఇప్పటికే విశ్వసిస్తున్నారు.

ఇంతవరకు తాము స్వంత బలంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తామని టీఆర్ఎస్ నాయకులు చెబుతూ వచ్చారు. అయితే హఠాత్తుగా తమ వైఖరిని మార్చుకొని బీజేపీతో సహా ఏ పార్టీ పట్ల తమకు ఎటువంటి వ్యతిరేకత లేదనే కొత్త పల్లవి అందుకున్నారు. ఈ కొత్త వైఖరి ద్వారా, కాంగ్రెస్‌తో సర్దుబాటుకు తమ ప్రయత్నాలు ఫలించకపోతే బీజేపీతో జట్టు కట్టడానికి వెనుకాడబోమనే సూచనలు అందిస్తున్నారు! తత్కారణంగానే బీజేపీని, దాని రాజకీయాలను టీఆర్ఎస్ విమర్శించడం లేదు. నాగం జనార్థన రెడ్డి బీజేపీలో చేరినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు నాగం వారిని విమర్శించారే గానీ బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. ఏమి ఈ రాజకీయ కపటం! కాంగ్రెస్, బీజేపీలు ఒకే నాణేనికి బొమ్మ బొరుసు వంటివని ముస్లింలు ఇంతవరకూ భావిస్తూ వచ్చారు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అదే నాణేనికి ఒక ముఖమని స్పష్టమయింది. కాకపోతే ఒకసారి బొమ్మ వైపో ఇంకోసారి బొరుసు వైపో అది కన్పిస్తుంటుంది!
తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని తాము మాత్రమే తెలంగాణను ఇవ్వగలమని, మరే పార్టీకి అది సాధ్యంకాదని బీజేపీ మరీ మరీ చెబుతోంది. రాజకీయాలలో కాకలుతీరిన యోధులు, కొత్తగా ప్రవేశించిన వారు ఎందరో ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు. తద్వారా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆ పార్టీ హైజాక్ చేసిన నాటి నుంచీ ఉద్యమం కూలిపోయిందని, తెలంగాణ అంతటా మతతత్వ దాడులు పెచ్చరిల్లి పోయాయనే వాస్తవాన్ని ప్రజలు విస్మరించలేదు. 2009లో ఉద్యమం పునఃప్రజ్వరిల్లిన అనంతరం భైంసా, కరీంనగర్, సిద్ధిపేట, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నల్లగొండ, కామారెడ్డి, ఆదోని, హైదరాబాద్ నగరంలోనూ తరచు ముస్లింలపై దాడులు జరుగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవినిస్తామని ప్రకటించిన కేసీఆర్ సైతం ముస్లింలపై జరుగుతోన్న ఈ దాడులను ఖండించ లేదు. ఉగ్రవాదం నిరోధక చర్యల పేరిట అమాయక ముస్లిం యువకులను అరెస్ట్ చేయడం జరుగుతోంది. 'ఇది అన్యాయం, ముస్లింల పట్ల వివక్ష చూపడమేనని' ఏ నాయకుడైనా ఎప్పుడైనా ఖండించాడా? సమాధానం స్పష్టమే. నిజామాబాద్ ఉపఎన్నికలో ముస్లిం ఓటర్లు బీజేపీ అభ్యర్థికి మద్దతునిచ్చారు. ఎందుకు? తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి విషయమై యావత్ ముస్లిం ప్రజలకు చిత్తశుద్ధి ఉన్నందువల్లనే కాదూ?
మరి మహబూబ్‌నగర్ ఉప ఎన్నికలో జరిగిందేమిటి? అక్కడ టీఆర్ఎస్, రాజకీయ జాక్, బీజేపీ ఏకమై ముస్లిం అభ్యర్థిని ఓడించారు. అగ్రకులాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించాలని ఈ పార్టీలు సదా కోరుకొంటున్నాయి. కనుకనే సంగారెడ్డిలో ఒక నాయకుని ఆదేశాల మేరకు ప్రత్యర్థి పార్టీ వారు ముస్లింలపై రెండు రోజుల పాటు దాడులు చేశారు. వారి దుకాణాలను దగ్ధం చేశారు; జీవనాధారాలను కూల్చివేశారు. ఈ దాడులను ఆపడానికి టీఆర్ఎస్ నాయకులు ఎవ్వరూ ప్రయత్నించనే లేదు. జరగాల్సిన విధ్వంసం జరిగాక కోదండరామ్ రెడ్డి, రమా మెల్కోటే తదితరులు సంగారెడ్డిని సందర్శించారు.

దాడుల బాధితులతో గాక వాటితో ప్రమేయమున్న వారిని మాత్రమే ఈ ప్రముఖులు కలుసుకున్నారు.
గత రెండు సంవత్సరాలుగా పౌర, మానవహక్కుల కార్యకర్తలు, మేధావులు, రచయితలు, కళాకారులు సైతం తెలంగాణ పేరిట మతతత్వ పార్టీకి మద్దతు నివ్వటాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వివిధ ప్రజాసంఘాల నాయకులు సైతం ఇలా వ్యవహరించడం ఎంతైనా శోచనీయం. వారు తమ లక్ష్యాన్ని మరచిపోయి స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం పునఃప్రారంభమైన తరువాత ముస్లింలపై పెచ్చరిల్లిన దాడులను ఈ ప్రజాసంఘాలేవీ ఖండించలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతికై కలసికట్టుగా పనిచేసేందుకై ఈ బడుగువర్గాల సంఘాలు, వాటి నాయకులు గతంలో మహాజన సంఘర్షణ సమితి అనే పార్టీని సైతం ఏర్పాటు చేశారు. ఆ పార్టీ ఏమైంది? ముస్లింలపై దాడుల పట్ల ఈ బడుగు వర్గాల వారూ ఎందుకు మౌనం వహిస్తున్నారు? బీజేపీతో కలసిపనిచేస్తుండడం వల్లే వారలా వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు. దళిత నాయకులు, మేధావుల కర్తవ్యమేమిటి? తమ అణగారిన జాతి అభ్యున్నతికి అంకితమవ్వడమే. మరి సంకుచిత లక్ష్యాలకు అంకితమైన రాజకీయ పక్షానికి తోడ్పాటునివ్వడమేమిటి? ముస్లిం మేధావులు, రాజకీయ పక్షాలు తమతో కలసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారన్న సత్యాన్ని దళిత వర్గాలు గుర్తించకపోవడం చాలా విచారకరం.

తెలంగాణ ఉద్యమం పేరిట ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారిని బీజేపీ ఆకట్టుకుంటోంది. తన కార్యకర్తల సంఖ్యను పెంచుకొంటోంది. మతతత్వ భావజాలానికి ప్రాధాన్యమిచ్చే రాజకీయవేత్తల రాజకీయాలను వీరు ఎందుకు అర్థం చేసుకోరు? తెలంగాణ పేరిట ప్రజలు వంచనకు గురవుతున్నారు. తెలంగాణ ప్రజల అమాయకత్వం వల్లే ఇది జరుగుతోంది సుమా! తమ ఉద్యమం ప్రపంచంలో ఎక్కడైనా సరే సామాజిక ఉద్యమాలకు ఆదర్శప్రాయమైనదని తెలంగాణ ఉద్యమ కార్యకర్తలు అంటుంటారు. మరి ముస్లింలపై మతోన్మాదుల, దళితులపై అగ్ర కుల పెత్తందారుల దౌర్జన్యాలు, దురాగతాలను వీరు ఎందుకు ఖండించరు? ఆంధ్రులు మతతత్వవాదులని, తెలంగాణ ప్రజలు కాదని తెలంగాణ ఉద్యమనాయకులు, కార్యకర్తలు అంటారు. అయితే మరి గత మూడున్నర సంవత్సరాలుగా తెలంగాణలో చోటుచేసుకొంటోన్న సంఘటనలు చెబుతున్న సత్యమేమిటి? తెలంగాణ ఉద్యమ నాయకులు, కార్యకర్తలే ఆంధ్ర నాయకుల కంటే ఎక్కువ మతతత్వవాదులని, యావత్ తెలంగాణ ప్రజలనందరినీ మతతత్వ వాదులుగా మారుస్తున్నారని చెప్పక తప్పదు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొనివున్న పరిస్థితులకు తెలంగాణ నాయకులే బాధ్యులు. తెలంగాణ ప్రజలు ఈ వాస్తవాలను అర్థం చేసుకోవల్సిన సమయమాసన్నమయింది. 2009 నవంబర్ నుంచి సంభవించిన సంఘటనలను గుర్తు చేసుకోండి. వాస్తవాలేమిటో స్పష్టమవుతాయి. సరైన నిర్ణయానికీ మీరు రాగలరు.
- కనీజ్ ఫాతిమా
సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ

Andhra Jyothi Telugu News Paper Dated : 18/6/2013

No comments:

Post a Comment