Friday, November 15, 2013

పటేల్ పంథాలో మోదీ! - కనీజ్ ఫాతిమా

అరవైఆరేళ్ల స్వాతంత్య్రమనంతరం కూడా భారతీయ ముస్లింలు, దళితులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఈ లౌకిక, ప్రజాస్వామ్య భారతదేశంలో ముస్లింలు పరోక్ష అస్పృశ్యతను, ప్రత్యక్ష వివక్షను ఎదుర్కొంటున్నారు. దళితులు ఇప్పటికీ అంటరానితనమనే దురాచారానికి బాధితులుగా ఉన్నారు. ఇంకా పలు వివక్షలకు గురవుతున్నారు. చరిత్రను వక్రీకరించి దేశ విభజనకు ముస్లింలు కారకులని నిందించడం ద్వారా చరిత్రను మార్చి వేయలేరు.
హిందుత్వ భావజాలం చరిత్రను వక్రీకరించింది. అగ్రకుల పాలక వర్గాల వారు ఆ అసత్య చరిత్రను వెనుకబడిన వర్గాలు, ముస్లింలను మరింత అణచివేయడానికి ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. వల్లభ్‌భాయ్ పటేల్‌ను నరేంద్ర మోదీ ప్రశంసించడాన్ని ఈ నేపథ్యంలోనే చూడాలి. సర్దార్ పటేల్ కాంగ్రెస్ వాది అయినప్పటికీ గత కొంత కాలంగా హిందుత్వ వాదులు ఆయన్ని తమ లక్ష్యసాధనలో ఒక కొత్త పాచికగా ఉపయోగించుకొంటున్నారు. హైదరాబాద్‌లోను, దేశంలోని ఇతర ప్రాంతాలలోను ముస్లింలపై ప్రభుత్వ సైనిక దళాలు పటేల్ హయాంలో పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడ్డాయి. బాబ్రీ మసీదు కూల్చివేతలో పి.వి.నరసింహారావు పాత్ర ఉంది. చరిత్రను వక్రీకరించడమే కాదు, కాషాయీకరించారు కూడా. ప్రభుత్వ అండదండలతో హిందుత్వ ఆధిపత్యం సైతం పటేల్ హయాంలోనే ప్రారంభమయింది. నరేంద్ర మోదీ పాలనలో అది వేళ్ళూనుకుంది. పరిస్థితి ఎంతగా మారిపోయిందంటే పాఠశాలల్లో స్వాతంత్య్ర దినోత్సవం నాడు బాల బాలికలు జాతీయ గీతాలకు బదులు ముస్లిం వ్యతిరేక గీతాలు ఆలపిస్తున్నారు.
వ్యాపారం కోసం మన దేశానికి వచ్చిన బ్రిటిష్ వారు క్రమంగా రాజకీయ పెత్తందార్లు అయ్యారు. భారతీయ సమాజంలో వివిధ మతాల, కులాల, ఆచారాల వైవిధ్యాన్ని గమనించి విభజించి పాలించు అనే కుటిలనీతితో భారత ఉప ఖండానికి సార్వభౌములయ్యారు. అదే కుటిలనీతితో ఈ ఉపఖండాన్ని భారత్, పాకిస్థాన్‌లుగా చీల్చారు. దేశవిభజన వెనుక హిందూమత అగ్రకులాలవారి కుట్ర ఉన్నది. బ్రిటిష్ వలసపాకులు దాన్ని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారు. మొట్టమొదటి ముస్లిం రాజులైన బహదూర్ షా జాఫర్, అవధ్ సంస్థానాధీశురాలు, టిప్పు సుల్తాన్‌లతోపాటు ఝాన్సీ లక్ష్మీ బాయి, తాంతియాతోపే తదితరులు భారత స్వాతంత్య్ర మహా సంగ్రామాన్ని ప్రారంభించారు. 1857లో ప్రజ్వరిల్లిన ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని బ్రిటిష్ వారు అణచివేశారు. దరిమిలా భారత్‌కు స్వాతంత్య్ర సాధనకై దియోబంద్, ఇతర ప్రదేశాలలోని ముస్లిం మత పెద్దలు భారతీయులలో స్వాతంత్య్ర కాంక్షను సజీవంగా నిలిపారు.
వీరిలో కొందరు స్వయంగా ప్రాణత్యాగం చేశారు. సర్దార్ భగత్ సింగ్, అష్ఫాకుల్లా ఖాన్ లాంటివారు దేశ మాత స్వేచ్ఛకు ఉరికంబమెక్కారు. వారు ఇచ్చిన నినాదమే 'ఇంక్విలాబ్ జిందాబాద్' (ఉత్తేజకరమైన ఈ నినాదానికి చాలా విశాలమైన అర్థమున్నది). భగత్ సింగ్‌కు ఉరిశిక్షను తప్పించడానికి గాంధీ చిత్తశుద్ధితో కృషిచేయలేదు. అధికారంలో పాలుపంచుకోవడానికై గాంధీ, ఆయన సహచరులు పర పాలకులతో చర్చలు జరిపారు. అవి సఫలం కాకపోవడంతో స్వాతంత్య్ర పోరాటం చేశారు. ఈ పోరాటంలో ముస్లింలు ఎవరికీ తీసిపోని బృహత్తర పాత్ర నిర్వహించారు. అయితే ఇప్పుడు ముస్లిం త్యాగధనులను ఎవరూ స్మరించడం లేదు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, రఫీ అహ్మద్ కిద్వాయి ఇప్పుడు ఎంతమందికి గుర్తున్నారు?
వలస పాలకుల 'విభజించి పాలించు' విధానాన్నే భారతీయ నాయకులూ అనుసరించారు. దేశ విభజనకు మౌలికంగా ఒక ప్రణాళికను ప్రతిపాదించింది చక్రవర్తుల రాజగోపాలాచారి. 1943లో ఆయన తన సుప్రసిద్ధ 'సి.ఆర్. పథకం'ను ప్రతిపాదించారు. పాకిస్థాన్ ఏర్పడితే ముస్లింలు ఆ దేశానికి వెళ్ళిపోతారని, అప్పుడు భారత్‌లోని వెనుకబడిన వర్గాల వారు, ఆదివాసీలపై అగ్రకుల పాలక వర్గాలు తమ ఆధిపత్యాన్ని యథాతథంగా కొనసాగించవచ్చనేది కాంగ్రెస్ నాయకుల యోచన. దేశ విభజనపై మౌంట్‌బాటెన్ ప్రతిపాదనను జిన్నా అంగీకరించలేదు. అయితే బలవంతం చేయడంతో ఆయన అంగీకరించక తప్పలేదు. అయినా దేశవిభజనకు జిన్నా కారకుడని ఆయనపై నింద మోపారు. 1932లో వలసపాలకులు కమ్యూనల్ అవార్డు ప్రకటించారు. దాని ప్రకారం ముస్లింలను ముస్లింలే ఎన్నుకొనే హక్కు లభించింది.
గాంధీ, పటేల్‌లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ హక్కును వదులుకోవాలని ముస్లింలను తీవ్ర ఒత్తిడికి గురిచేశారు. అధికార బదిలీ తరువాత దేశపాలనలో హిందువులు, ముస్లింలు, అణగారిన వర్గాలవారికి సమాన హక్కు ఉంటుందని 1945లో లార్డ్ వేవెల్ ప్రకటించారు. పటేల్ ఇందుకు ససేమిరా అన్నారు. హిందూ అగ్రకులాలవారితో సమానంగా ముస్లింలూ అధికారంలో భాగస్వాములు కావడం కాంగ్రెస్ నాయకులకు ఇష్టంలేదు. దేశాన్ని విభజిస్తే అధికారం పూర్తిగా తమ చేతుల్లో ఉంటుందని భావించారు. దేశ విభజనతో రాజ్యాంగ సభలో ముస్లింల రాజకీయ వాణిని విన్పించేవారు ఎవ్వరూ లేకపోయారు. రాజ్యాంగ సభ ఆమోదించిన లక్ష్యాల తీర్మానం మైనారిటీలకు హమీ ఇచ్చిన రాజ్యాంగ హక్కులను వదులుకోవాలని ముస్లింలపై పటేల్ ఒత్తిడిచేశారు. స్వాతంత్య్రానికి ముందు ముస్లిం ప్రజాప్రతినిధులను ముస్లింలే ఎన్నుకునే హక్కు, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సదుపాయాన్ని రద్దు చేస్తూ ఒక తీర్మానాన్ని 1947లో రాజ్యాంగ సభ ఆమోదించింది. దీనిపై నిరసన తెలుపలేని నిస్సహాయస్థితిలో ముస్లింలు అప్పటికే పడిపోయారు.
మత ప్రాతిపదికన దేశ విభజన జరిగింది. ఇందుకు ముస్లింలే కారకులని నిందించారు. ముస్లిం మేధావివర్గాల వారు పాకిస్థాన్‌కు వెళ్ళిపోయారు. పాకిస్థాన్‌కు వెళ్ళకుండా భారత్‌లో ఉండిపోయిన వారు మౌనంగా ఉండిపోయే పరిస్థితులు కల్పించారు. పటేల్ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మౌలానా ఆజాద్ సైతం ఏమీ మాట్లాడలేకపోయారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు పటేల్ ఆదేశాలపై జరిగిన 'పోలీసు చర్య'లో ముస్లింలు పెద్ద ఎత్తున ఊచకోతలకు గురయ్యారు. పటేల్ కాంగ్రెస్‌వాది అయినప్పటికీ మౌలికంగా ముస్లిం వ్యతిరేకి. కనుకనే ఇప్పుడు మోదీ ఆయన్ని ప్రశంసిస్తున్నారు. దేశానికి ప్రథమ ప్రధానమంత్రి పటేల్ అయినట్టయితే చాలామేలు జరిగివుండేదని మోదీ అంటున్నారు. పటేల్ ప్రధాని కాలేదు కనుక తాను ప్రధానిని కావాలని ఆయన కోరుకుంటున్నారు. తద్వారా పటేల్ చేయలేని పనులను తాను చేయగలనని మోదీ భావిస్తున్నారు. పటేల్‌ను ప్రధాన మంత్రిగా నామినేట్ చేయకపోవడానికి కారణం లేకపోలేదు. అప్పట్లో అంతర్జాతీయ వ్యవహారాలపై భారతీయ నాయకులలో నెహ్రూ, జిన్నాకు మాత్రమే సమగ్ర అవగాహన ఉండేది. పటేల్‌ను ఉక్కు మనిషిగా గౌరవిస్తున్నారు.
550 సంస్థానాలను శాంతియుతంగా భారత్‌లో విలీనం చేసిన రాజనీతిజ్ఞుడుగా ప్రశంసిస్తున్నారు. అయితే ఆయన ఆధ్వర్యంలో హైదరాబాద్‌పై జరిగిన 'పోలీసుచర్య'లో ముస్లింలు అసంఖ్యాకంగా ఊచకోతకు గురయ్యారన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. ఆనాటి చేదు స్మృతులు ముస్లింలకు ఇప్పటికీ తీవ్ర మనస్తాపం కలిగిస్తున్నాయి. అప్పట్లో జరిగిన కొన్ని సంఘటనలకు నిజాం నవాబును కారకుడుగా చేసి 'పోలీసుచర్య' దురాగతాలను సమర్థించడం న్యాయబద్ధం కాదు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే 1948లో ఆవిర్భవించిన ఇజ్రాయెల్‌కు తక్షణమే గుర్తింపునివ్వాలని పటేల్ వాదించారు. దీనిని బట్టి ముస్లింల పట్ల ఆయన వైఖరి ఏమిటో విశదమవుతుంది. పెట్టుబడిదారులకు, అమెరికాకు పటేల్ అనుకూలురు. ఆరెస్సెస్ సభ్యుడు కాకపోయినప్పటికీ ఆయన లౌకికవాదీ కాదు, ప్రజాస్వామ్య వాదీకాదు. నెహ్రూ సైతం పటేల్‌ను మతతత్వవాదిగా పేర్కొన్నారు.
మత ప్రాతిపదికన దేశాన్ని విభజించడానికి సహకరించిన వారు లౌకికవాదులు ఎలా అవుతారు? గాంధీ హత్య అనంతరం ఆరెస్సెస్‌ను నిషేధించారు. అయితే గాం«ధీ హత్యకు కారణమన్న ఆరోపణపై గాక ఆరెస్సెస్ నాయకుల ప్రసంగాలు మతతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనే కారణంతో నిషేధించారు! ఆరెస్సెస్ పట్ల పటేల్ మెతకవైఖరి చూపేవారనడానికి ఇది నిదర్శనం. మరి మోదీ ఇప్పుడు పటేల్‌ను ప్రశంసించడంలో ఆశ్చర్యమేముంది? పటేల్ ప్రగాఢ హిందూ మత అభిమాని. మోదీ గట్టి హిందుత్వ వాది. హిందూ జాతీయ వాదాన్ని విశ్వసించే వ్యక్తి మోదీ. గుజరాత్‌లో విజయం అనంతరం యావద్భారతాన్ని హిందుత్వ ప్రయోగశాలగా మార్చడానికి మోదీ ఉవ్విళ్లూరుతున్నారు. మోదీని ప్రశంసిస్తున్న ప్రముఖులు 2002 నాటి గుజరాత్ మతతత్వ అల్లర్లను సమర్థిస్తున్నారు. మానవాళి సంక్షేమం పట్ల శ్రద్ధ చూపేవారెవరూ అభివృద్ధి నెపంతో మోదీని ప్రశంసించరు. ఆయనకు ఎటువంటి మద్దతునివ్వరు. భారత ప్రజలు తనకు మద్దతునివ్వరన్న సత్యం మోదీకి బాగా తెలుసు. కనుకనే ఆయన అన్ని రకాల వింత ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ఒకే రకం వ్యక్తులు. కొన్నిసార్లు ఒకరు ఉగ్రవాదానికి ముస్లింలే కారకులని నిందిస్తారు. మరొకరు ఖండిస్తారు. ఈ ఆరోపణ -ఖండన పునరావృతమవుతుంటాయి.
మోదీ తాను నెలకొల్పబోయే పటేల్ విగ్రహ నిర్మాణానికి దేశమంతటి నుంచీ ఇనుమును స్వీకరిస్తాను కానీ 'నిజాం ఇనుము'ను స్వీకరించనని అన్నారు. పటేల్ హయాంలో హైదరాబాద్ ముస్లింలపై పెద్దఎత్తున హింసాకాండ జరిగింది. అటువంటి హింసాకాండే గుజరాత్‌లో మోదీ పాలన తొలినాళ్ళలో జరిగింది. అందుకే పటేల్‌తో తనను తాను సమానం చేసుకొని, ఆ దివంగత నేతను మోదీ ప్రశంసిస్తున్నారు. భారత్‌ను ప్రజాస్వామిక, లౌకిక రాజ్యంగా పిలుస్తున్నారు. అయితే దేశంలో నిజమైన అర్థంలో ప్రజాస్వామ్యం, లౌకిక వాదం లేదు. తమను తాము లౌకికవాద పార్టీలుగా చెప్పుకుంటున్న రాజకీయ పక్షాలు ప్రజాస్వామిక విలువలు, రాజ్యాంగ హక్కుల అమలుకు ప్రాధాన్యమివ్వాలి.
అరవైఆరేళ్ల స్వాతంత్య్రానంతరం కూడా భారతీయ ముస్లింలు, దళితులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. మన దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం లేదనడానికి ఇంతకంటే నిదర్శనం మరేమి కావాలి? ఈ లౌకిక, ప్రజాస్వామ్య భారతదేశంలో ముస్లింలు పరోక్ష అస్పృశ్యతను, ప్రత్యక్ష వివక్షను ఎదుర్కొంటున్నారు. దళితులు ఇప్పటికీ అంటరానితనమనే దురాచారానికి బాధితులుగా ఉన్నారు. ఇంకా పలు వివక్షలకు గురవుతున్నారు. చరిత్రను వక్రీకరించి దేశ విభజనకు ముస్లింలు కారకులని నిందించడం ద్వారా చరిత్రను మార్చివేయలేరు. చరిత్ర తనకుతాను పునరావృతమవుతుంది. కనుక మన చరిత్రను మనం నిష్పాక్షికంగా అధ్యయనం చేయాలి. ఎటువంటి పక్షపాతం లేకుండా చరిత్రను రాసుకోవాలి. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకు చరిత్రను వక్రీకరించేవారి మాటలను విశ్వసించగూడదు.

- కనీజ్ ఫాతిమా
సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ

Andhra Jyothi Telugu News Paper Dated: 16/11/2013 


No comments:

Post a Comment