Monday, July 21, 2014

కుల నిర్మూలనతోనే న్యాయం - ప్రొఫెసర్ కల్పన కన్నబిరాన్


Published at: 13-06-2014 01:26 AM
పందొమ్మిది వందల అరవయ్యో దశాబ్దం రెండవ భాగంలో హైదరాబాదులోని రాజకీయ కల్లోలం ప్రాంతీయ అసమానతల గురించి, అసమాన అభివృద్ధి గురించి మొదలైంది. ఆ సమయంలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అభివృద్ధి అంటే ఆర్థికప్రగతి కాదనే ఆలోచనను తొలిసారిగా హైదరాబాదులోనే ఆరంభించారు. అభివృద్ధిలోని ఈ అసమానత్వాలు, అగాధాల గురించీ, తెలంగాణ ప్రాంతపు మార్జినలైజేషన్ గురించి, దానిని అభివృద్ధి అజెండాకు బైట ఉంచటం గురించి కేంద్రీకరించి పరిశోధన జరిపించాలనేది ఆమె కృషిలో ప్రత్యేకమైన, ప్రధానమైన అంశంగా ఉండేది. ఆమె కృషి, ప్రయత్నాలూ అన్నీ కలసి ఈ సమస్యలను పట్టించుకునే ఒక సంస్థ 'కౌన్సిల్ ఫర్ సోషల్ డెవల ప్‌మెంట్' రూపంలో ఆవిష్కరించబడ్డాయి. ఇవాళ తెలంగాణ ఆవిర్భవించిన తొలి దినాలలో సామాజిక అభివృద్ధి గురించిన ఎజెండాకు ఉండాల్సిన ప్రాధాన్యం గురించి నొక్కి చెప్పదల్చుకున్నాను. ఆ ఎజెండా తెలంగాణ రాష్ట్ర స్వరూప స్వభావాలను నిర్వచించి కీలక అంశంగా ఉండాలి.
తెలంగాణ ప్రభుత్వం మొదటి వారంలోనే పట్టించుకోవాల్సిన అతి ముఖ్యమైన, క్లిష్టమైన, కీలకమైన విషయంగా వ్యవసాయ రుణ మాఫీ ప్రశ్న ముందుకొచ్చింది- దీని గురించి పత్రికలలో వివిధ వాదనలు వినిపించాయి. ఒక వాదన రుణమాఫీ వల్ల ప్రభుత్వానికి అయ్యే ఖర్చు అదనపు భారం అంటే, రెండవ వాదన మరి పేద రైతుల మీద పెరిగే రుణభారం సంగతేమిటన్నది. తెలంగాణకు సంబంధించి ఈ రెండవ వాదనే నిలబడాలనే దానిలో రెండో మాటకు ఆస్కారం లేదు. రైతులను పీల్చి పిప్పి చేస్త్తున్న రుణభారం నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సమయాన్ని నిర్ణయించి, దాని ప్రకారం విముక్తులను చేయటమనేదే ప్రభుత్వ ఖజానా మీద ఉన్న అన్ని సమస్యలలోకి ప్రధానమైనది. అది ఎంత కష్టమైనా, నష్టమైనా ఫరవాలేదు. బీదరికపు హింస మానవ మూల్యాన్ని తగ్గించడం, నిర్మూలించటం కంటే ప్రభుత్వానికి ముఖ్యమైన పనేదీ లేదు.
బీద రైతులు రుణాలలో చిక్కుకుపోయిన తీరు గురించిన చర్చ వచ్చినపుడు ఒక విషయం ప్రధానంగా బైటికి వచ్చింది. రుణ మాఫీ గత ఏడాది తీసుకున్న రుణాలకే పరిమితమనే వార్త విన్న షాక్‌తో ఇద్దరు సన్నకారు రైతులు చనిపోయారు. ఒక రైతు చనిపోవడానికి కారణం కూతురికి వరకట్నం చెల్లించాల్సిన ఒప్పందపు ఒత్తిడి- ఇపుడు దానితోపాటు కుటుంబపు పెద్ద చనిపోతే వరకట్నం ఎలా చెల్లిస్తారనే సమస్య తోడయింది. ఈ సమస్య సామాజిక అంశాన్ని ఆర్థిక విషయంతో కలిపి కేంద్రీకరించి చూసేందుకు వీలు కలిగిస్తుంది. వరకట్నం ఎందుకు? రైతుల చావులు పితృస్వామిక విలువల గుప్పిటిలో, ఆ దుర్మార్గంతో గట్టిగా ముడిపడి ఉన్నాయి. స్త్రీలు బానిసత్వంలోనే మిగిలి ఉంటే అభివృద్ధి ఉంటుందా? ఇలాంటి ఆటంకాలనే వాటి సంబంధిత ప్రకంపనాలనే మనం పాఠశాలల్లో ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో తక్కువమంది బాలికలు ఉండటం, బాలికలకు చిన్న వయసులో వివాహాలు జరగటం, స్త్రీ మరణాలు ముఖ్యంగా ప్రసూతి మరణాలు పెరగటం మొదలైన వాటిలో చూడవచ్చు. బీదరిక భారంతో కుంగిపోయే, వ్యతిరేక సామాజిక ఒత్తిడిలకు లొంగిపోయే స్త్రీల మానసిక, సామాజిక వ్యాధుల గురించిన కనీసపు అవగాహన కూడా మనం సామాజిక అభివృద్ధిని గురించి అర్థం చేసుకునే తీరులో ప్రవేశించలేదు. రాజ్యాంగబద్ధ పాలన అంటున్న రోజుల్లో కూడా స్త్రీల వివేకం జ్ఞానం, ఉత్పాదకత, సమాన పెరుగుదలకు వారు పంచగలిగిన శక్తి సామర్థ్యాలు ఇవేవీ కనీస గుర్తింపునకు కూడా నోచుకోలేదు. స్త్రీల సంక్షేమానికి, ఉత్పాదకతకు జండర్‌పరమైన వివక్ష చెల్లించే మూల్యం ఎంత? కుటుంబ సంక్షేమపు మూల్యం ఎంత?
తెలంగాణలో ఆదివాసీలు జనాభా రీత్యా ప్రముఖంగానే ఉన్నారు. వారిలో భిన్నత్వం ఉంది. ప్రతి తెగకూ వారిపైన నైపుణ్యాలు, బలాలు ఉన్నాయి. అడవుల గురించి, సహజ సంపదల గురించి, ఉమ్మడి వనరుల గురించి, పర్యావరణం గురించీ సంప్రదాయ జ్ఞానం ఉంది. నిరంతరం కొనసాగే అభివృద్ధి గురించిన చర్చలు ప్రధాన భూమికను వ హిస్తున్న సందర్భంలో సామాజిక అభివృద్ధికి, సుస్థిర (సస్టైనబుల్) అభివృద్ధికి మధ్య ఉన్న సంబంధం తక్షణం గుర్తించాలి. అభివృద్ధిని ఆదివాసీల జీవితానుభవానికి సంబంధం లేకుండా నిర్మించటం, ఆదివాసీలను వారి సొంత నివాసాల నుంచి తరలించటం, ఇది తప్ప విద్య, వైద్యం, ప్రజా సంక్షేమం అందుబాటులోకి తెచ్చే విధానాలను గురించి ఆలోచించి వాటిని బలోపేతం చేసి ఆదివాసీలను అందించలేమా? పోలవరం గ్రామాలను బదిలీ చేయటం, ఆదివాసీల సొంత ఆవాస ప్రాంతాలను ముక్కలు చేయటం వంటి విషయాన్ని పునరాలోచించటం సామాజిక అభివృద్ధి దృష్ట్యా అతి ముఖ్యమైనది. అభివృద్ధిని ఒక దాడిలాగా, నిరంతరాయమైన పద్ధతిలో కాకుండా వేరే విధంగా ఆలోచించటం అవసరం. మానవ సామూహిక జీవితం, పర్యావరణం వాటి కొనసాగింపు గురించి ఆలోచించాలి. ఇవి గనుక మనం ధ్వంసం చేసుకుంటే చెల్లించాల్సిన మానవ, సామాజిక మూల్యం, ఆర్థిక పెరుగుదల కంటే అనే రెట్లు అధికమై, ఆర్థిక అభివృద్ధిని అర్థర హితంగా చేస్తుంది.
ఆదివాసీ కమ్యూనిటీలను ఒక ఊహాజనిత 'పవిత్ర' పరిస్థితిలో ఉంచాలనే ఆలోచన కాదు నేను చెప్పేది. వారి చారిత్రక అనుభవాలలో నుంచి సుస్థిరతని అర్థం చేసుకోవాలి. విద్య అనేది సమాజంతో రాజకీయాలతో జోక్యం కలిగి ఉండేందుకు, తె లుసుకునేందుకు ఒక మార్గం అనుకుంటే, ఆ విద్యా సంపదను సంపూర్ణంగా అందుకోకు ండా ఆదివాసీలను ఆటంకపరుస్తున్నవేవో అర్థం చేసుకోవాలి. చాలాకాలం నుంచీ మనం ఆదివాసీలకు విద్య విలువ తెలియదనే వాదన వింటూ వస్తున్నాం. కానీ నల్లమల అడవులలోని చెంచు పిల్లలందరూ బడికి, విద్యకు దగ్గర కావాలంటే తెలంగాణ ప్రభుత్వం ఇంతకు ముందు కంటే భిన్నంగా ఏం చెయ్యాలి? ఏం చెయ్యబోతుంది?

జబ్బులతో, అకాల మరణాలతో అభివృద్ధి సహజీవనం చేస్తుందా? ఒక పద్ధతి, నియమాలు లేకుండా, ప్లానింగ్ లేకుండా హైదరాబాదు నగరాన్ని పెంచుకుంటూ పోయారు. పారిశ్రామికీకరణకు నియమ నిబంధనలేవీ లేకుండా పోయాయి. దానివల్ల భూమి విలువ అనూహ్యంగా పెరిగింది. పబ్లిక్ వర్కులు పతనమయ్యాయి. మురుగు నీరు, పారిశ్రామిక కాలుష్యం ఇవి ప్రజల అనారోగ్యానికి, మరణాలకు ప్రధాన కారణం, నగర ప్రాంతాలలో దీనికి ఎక్కువగా బలయ్యేది పేద ప్రజలు. అసంఘటిత రంగంలో కార్మిక చట్టాలు లేకపోవటం-ముఖ్యంగా ఇళ్ళల్లో పనిచేసేవారికి, వలస కార్మికులకు-అనే సమస్యను అత్యవసరంగా పట్టించుకోవాలి. బానిసత్వంలో వెట్టితో నిర్మించబడే అభివృద్ధి అభివృద్ధి కానేకాదు. అంతర్జాతీయ కార్మిక చట్టాల స్థాయితో తప్పనిసరిగా సరిపోయే, సమానమైన చట్టాలు అమలైనపుడే, కార్మికుల గౌరవం, హోదా పెరిగినపుడే ఆర్థిక సామాజిక ప్రగతి సాధ్యం.
ఐక్యరాజ్య సమితి వికలాంగ వ్యక్తుల హక్కుల ఒప్పందం వికలాంగ హక్కులకు ఒక మంచి నమూనాను మనముందుంచుతుంది. మన కేంద్ర ప్రభుత్వం దాని ప్రాముఖ్యతను పూర్తిగా అవగతం చేసుకునే ప్రారంభ దశలోనే ఉంది. కానీ తెలంగాణ అభివృద్ధిలో వికలాంగులు సంపూర్ణ, సమాన భాగస్వాములుగా గుర్తించేందుకు మనం ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోబోతున్నాం? శ్రమ, ఉపాధి, విద్య - ముఖ్యంగా సంస్కృతి ఈ విషయాలలో ఏం చెయ్యబోతున్నాం? ఏ కొత్త రాష్ట్రమైనా సృజనాత్మక, ఆలోచనాత్మక రీతులలో ముందుకు వెళ్లాలంటే యువతరం మీద ఆధారపడాలి. యువతీ యువకులిద్దరిమీదా! వాళ్ళు 'మోరల్ పోలీసింగ్' భయం నుంచి బైటపడాలి, హింసకు గురికాకూడదు, కారణం లేకుండా అరెస్టులు, జైలుపాలు కాకూడదు. ఇలాంటి వాతావరణంలోనే వారిలో మానవీయ భావనలు, సమాన న్యాయ భావనలు వికసించగలుగుతాయి.
చివరిగా, కొద్ది సమస్యలను మాత్రమే ప్రస్తావించగలిగిన ఈ వ్యాస పరిధిలో, కుల సమస్య గురించి ప్రస్తావించక తప్పదు. ఎందుకంటే అది చాలా ఎక్కువగా, పై సమస్యలన్నిటితో ముడిపడి ఉన్నది. తెలంగాణలో న్యాయం జరగాలంటే కుల నిర్మూలన జరిగి తీరాల్సిందే. సాంఘిక వెలి, ఘోరమైన దాడులు, అత్యాచారాలు, అందరినీ కలుపుకుపోవాల్సిన రాజకీయాలతో సహజీవనం చేయవు. బాధ్యత న్యాయస్థానాల మీద, ప్రభుత్వ అధికారుల మీద, విద్యా సంస్థల మీద, పరిశోధనా సంస్థల మీద ఉంది. ఇవి సరిగా పనిచే సి కుల వివక్షను తుడిచిపెట్టేందుకు స్పష్టమైన ఆలోచనలనూ, వ్యూహాలనూ అందించాలి. తెలంగాణలో సామాజిక అభివృద్ధి అంటే అర్థం ఏమిటో ఆలోచించి దానిని అమలులో పెట్టాల్సిన సమయం ఇది!
- ప్రొఫెసర్ కల్పన కన్నబిరాన్
డైరెక్టర్, కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్

Andhra Jyothi Telugu News Paper Dated: 13/06/2014 

No comments:

Post a Comment