కుల నిర్మూలనతోనే న్యాయం' శీర్షికన జూన్ 13న 'ఆంధ్రజ్యోతి'లో ప్రొఫెసర్ కల్పనా కన్నాభిరాన్ రాసిన వ్యాసం యావత్ తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా ఉంది. తెలంగాణ సమాజంలో సాంఘిక, ఆర్థిక, అసమానతలు తొలగాలంటే కుల నిర్మూలన జరిగి తీరాల్సిందేనని ఆమె సూచించారు. దాన్ని స్వాగతించాల్సిందే. అయితే కులాన్ని ఎలా నిర్మూలించవచ్చో కల్పనా ఈ వ్యాసంలో రాసి ఉంటే బాగుండేది. ఈ దేశంలో చార్వాకులు, బుద్ధుడు, కబీర్, మహాత్మా జ్యోతిబా ఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, డా. అంబేద్కర్‌ల వరకు కులనిర్మూలన జరగాలని ఉద్యమించిన వారే. కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడున్న హిందూ అగ్రవర్ణ ఆధిపత్య రాజ్యంలో పాలకులకు కుల నిర్మూలన పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కుల నిర్మూలన ఎలా సాధ్యం? ఒకవైపు కుల నిర్మూలన జరగాలని కోరుకునే అంబేద్కరైట్‌లు సయితం మరోవైపు ఆ కులం ఆధారంగా ఏర్పడిన రిజర్వేషన్లు ఉండాలని కోరుకుంటారు. కుల ఆధారిత రిజర్వేషన్లు కోరుకున్నంత కాలం కుల నిర్మూలన సాధ్యం కాదు.
ఈ దేశంలో ఒక్క బహుజన సమాజ్ పార్టీకి తప్ప మిగతా ఏ రాజకీయ పార్టీకి కుల వివక్ష, కుల నిర్మూలన పట్ల స్పష్టమైన అవగాహన లేదు. కల్పనా కన్నాభిరాన్ మంచి ఉద్దేశ్యంతోనే కుల నిర్మూలన జరగాలని కోరుకోవచ్చు కానీ అది సాధ్యం కాదు. కులాన్ని చెప్పొద్దు, కులాన్ని వాడొద్దు, కులాన్ని ధ్వంసం చేయాలని కోరుకున్న మహనీయుల సూక్తుల్ని భారత ప్రజలెవరూ పాటించడం లేదు. ముఖ్యంగా పరిపాలకులకు కులాన్మి నిర్మూలించడం అసలే ఇష్టం లేదు. కులం ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు కుల నిర్మూలనకు ఇష్టపడరు. కులం ద్వారా బాధలు పడుతున్న వాళ్ళు కుల నిర్మూలన జరగాలని కోరుకుంటారు. కానీ కుల ఆధారిత రిజర్వేషన్లు వదులుకోరు. కాబట్టి కులం ద్వారా బాగుపడుతున్న వాళ్ళు బాధితులు సయితం కులాన్ని వదులుకునే పరిస్థితి లేదు. అలాంటప్పుడు కుల నిర్మూలన ఎలా సాధ్యం? కాబట్టి కుల నిర్మూలన అనే అంశాన్ని పక్కన పెట్టి ఏ కులం అనే ఆయుధంతో, బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు లబ్ధిపొందుతున్నారో అదే ఆయుధంతోనే కులం బాధితులు కూడా లబ్ధి పొందే సూత్రాన్ని బహుజన ఉద్యమ పిత కాన్షీరాం మనకు అందించి ఫలితాలను సాధించిపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన చేసిన ఈ ప్రయోగం సఫలం అయి దేశ వ్యాప్తంగా స్ఫూర్తిని రగిలించింది. తెలంగాణ రాష్ట్రంలో అది ఎందుకు సాధ్యం కాలేదు? అందుకే తెలంగాణ, సీమాంధ్రకు ఒక కాన్షీరాం కావాలి. శ్రీకృష్ణ కమిటీ లెక్కల ప్రకారం 93.8 శాతం జనాభా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత మైనార్టీలదే. తెలంగాణ రాష్ట్ర సాధనలో వీరే కీలక భూమిక పోషించారు.
ఉద్యమాలు చేసింది వీళ్ళే, ఆత్మబలిదానాలు చేసిందీ వీరే, కేసుల పాలు అయింది ఈ వర్గాలే అయినా ఒక్క శాతం జనాభా కూడా లేని వెలమ సామజిక వర్గం అధికారాన్ని సాధించింది. ఇదెలా సాధ్యం అయింది? ప్రొఫెసర్ కల్పనా అమాయకంగానిజాయితీతోనే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక న్యాయం జరగాలంటే కుల నిర్మూలనతోనే సాధ్యం అని రాశారు. కానీ తెలంగాణలోనే కాదు యావత్ భారతదేశంలో నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కులాన్ని నిర్మూలించడం ఎవరి వల్ల కాదు. అందుకే కులం అనే ముల్లును కులంతోనే తొలగించాలి. కులం ఉన్నంత వరకు కులం ద్వారా ప్రయోజనం పొందుతున్న వారిని చూసి కులం ద్వారా బాధితులైన వారు కూడా ఎలా కులాన్ని ఉపయోగించి ప్రయోజనం పొందుతారో ఆలోచించాలి. కృష్ణ మాదిగకు కులాన్ని ఎలా వాడుకోవాలో అర్థం కాకపోవడం వల్లనే ఆయన మాదిగలకు రిజర్వేషన్లు సాధించలేకపోయారు. బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య, బీసీ స్వతంత్ర రాజకీయ వేదికను తయారు చేయడం కంటే రిజర్వేషన్లకే బీసీ ఉద్యమాన్ని పరిమితం చేయడం వలన తమిళనాడులో డీఎంకే సాధించిన విజయాలను ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణయ్య సాధించలేకపోయారు. డా.బి.ఆర్. అంబేద్కర్ కూడా చిన్న రాష్ట్రాల్లో చిన్న కులాలు అధికారాన్ని చేపట్టాలని ఆశించారు. దళిత, బీసీ నాయకుల వైఫల్యం కారణంగా ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ అధికారాన్ని చేపట్టారు. వీరికి ప్రత్యామ్నాయంగా దళిత, బీసీ మైనార్టీలు రాజకీయ పోరాటాన్ని చేసి ఉంటే ఈ వర్గాలు ఇటు తెలంగాణలో అటు సీమాంధ్రలో అధికారాన్ని సాధించేవి.
న్యాయశాస్త్ర అధ్యాపకులు, ఓయూ
Andhra Jyothi Telugu News Paper Dated: 24/06/2014
No comments:
Post a Comment