Tuesday, May 27, 2014

మళ్ళీ పాత చరిత్రే! - కొంగర మహేష్, రుద్రవరం లింగస్వామి, మనిగిల్ల పురుషోత్తం


Published at: 27-05-2014 00:39 AM
మనమిప్పుడు ఆధునిక ప్రపంచంలో అవసరానికో అబద్ధం... పూటకో మాట నడుస్తోన్న ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. అవసరానికి హామీలెన్నైనా ఇవ్వొచ్చు. అదే అవసరానికి నాలుకను ఎటైనా తిప్పే రాజకీయాల్లో కాలం గడుపుతున్నాం. ఈ రాజకీయ చదరంగంలో విజేతలు పాలకులు. పావులు బలహీనులు. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బడితె ఎవరి చేతిలో ఉంటుందో బర్రె కూడా వాడిదే అనే సామెతను అక్షరాలా మరోసారి నిరూపిస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి పార్లమెంటు తెలంగాణ బిల్లు ఆమోదించబోతుందనేంత వరకు తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి దళితుడే అని ఖరాఖండిగా చెప్పారు. ఈమాట చెబుతూనే కేసీఆర్ మాటంటే మాటే తలతెగినా మాట తప్పేది లేదన్నారు. ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించినా... పార్టీ అంతరంగిక మీటింగుల్లోనూ ఊదరగొట్టారు. దీనికితోడు ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పదవిని కూడా బోనస్‌గా ప్రకటించారు. దీనికి టీఆర్ఎస్ నాయకగణం వంతపాడారు. పదమూడేళ్లుగా పార్టీ పైస్థాయి నుంచి కార్యకర్త అన్న తేడా లేకుండా 'దళిత సీఎం' హామీని పాటైపాడారు. తాను (కేసీఆర్) తెలంగాణ రాష్ట్రంలో కాపలా కుక్క (వాచ్ డాగ్)గా కొనసాగుతూ స్టేట్ అడ్వయిజరీ కౌన్సిల్ చైర్మన్‌గా ఉంటానని చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇవన్నీ జాతీయ, ప్రాంతీయ మీడియాలో పతాకస్థాయిలో ప్రచారం కూడా జరిగాయి.
కేసీఆర్ పలికిన దళిత సీఎం పలుకులు ఇప్పటికీ 'యూట్యూబ్', ఫేస్‌బుక్కుల్లో దర్శనమిస్తూనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటుకు 'సీడబ్ల్యూసీ' జై అన్న తర్వాత ఆగస్టు 4, 2013న జరిగిన 'మీట్ ది ప్రెస్'లో కూడా దళిత సీఎం పదవికి కట్టుబడి ఉన్నానని కేసీఆర్ పునరుద్ఘాటించారు. కానీ ఉభయసభల్లో తెలంగాణ బిల్లుకు మోక్షం లభించిందో లేదో 'దళిత సీఎం' హామీని అమాంతంగా మింగేశారు. దశాబ్దకాలం నుంచి ఉపన్యాసాలు దంచిన అధినాయకత్వం, పార్టీ అనుచరగణం అంతా కేసీఆర్ వంతపాడినట్లుగానే ఒక్కసారిగా గప్‌చుప్ అయిపోయింది. 'ఇచ్చిన మాటకోసం తల నరుక్కుంటా'నన్న కేసీఆర్ ఈ అంశంపై మాట్లాడేందుకు ముఖం చాటేశారు. తనకు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని చెప్పుకునే కేసీఆర్... పార్టీకి ఆయనే హైకమాండ్. దీంతో 'సీఎం హామీ'పై ప్రశ్నించడం కాదు కదా... కేసీఆర్ ఉన్నత పదవిలో కూర్చుంటేనే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి జరుగుతుందంటూ, పోలింగు ముగిసి కేసీఆర్‌ను శాసనసభా నేతగా ఎన్నుకునేంత వరకు టీఆర్ఎస్‌లోని దళిత, బీసీ నాయకులతో ప్రకటనలు గుప్పించే పనిలో బిజీ అయిపోయిన పరిస్థితి.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీల;పై అనేక రకాలుగా వివక్ష చూపారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు మంత్రి పదవులు దక్కించుకున్న టీఆర్ఎస్... బీసీ ఎమ్మెల్యేలుగా పార్టీ నుంచి గెలిచినప్పటికీ బీసీ సంక్షేమ శాఖను బ్రాహ్మణుడైన కెప్టెన్ లక్ష్మీకాంతారావుకు ఇవ్వడం... అప్పటికీ అసెంబ్లీలో సభ్యుడు కూడా కానీ తన అల్లుడు హరీష్‌రావును ఏకంగా మంత్రిని కూడా చేయడం పార్టీలోని అగ్రకుల ధోరణికి అద్దం పడుతోంది. తెలంగాణ జనాభాపరంగా సింహభాగంగా ఉన్న ముస్లింలనూ రాజకీయంగా ఎదగనీయలేదు. పార్టీ పదవుల పంపకాల్లోనూ ఈ వర్గాన్ని పూర్తిగా పక్కనబెట్టేశారు.
పద్నాలుగేళ్లపాటు తన ప్రాబల్యాన్ని అతిజాగ్రత్తగా నిర్మించుకున్నారు కదా! అంతా వీజీగా తెలంగాణపై పెత్తనాన్ని వదులుకుంటారా? సెంటిమెంటు ఫలితాలను తనకనుగుణంగా మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకపోవడం... పలు సర్వేల ద్వారా టీఆర్ఎస్‌కు 'ఫీల్ఢ్' అనుకూలంగా ఉండటం... ఇంతలో ఎన్నికలు, ఫలితాలు రావడం... టీఆర్ఎస్సే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితుల్లో ఉండటంతో కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పీఠం మీద మరింత మోజు పెరిగింది. ఏ వర్గానికి సీఎం పదవి ఇస్తానని హామీ ఇచ్చారో ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల చేతే ప్రతిపాదింపజేసుకొని తన 'ఆకాంక్ష'ను తీర్చుకున్నారు. ఇప్పుడున్న స్థితిలో కేసీఆర్ మాట తప్పారని కనీసం నొసలు కూడా చిట్లించలేని పరిస్థితి ఆ పార్టీ దళిత ప్రజాప్రతినిధులది.
గత పాలకుల కంటే భిన్నంగా తెలంగాణలో పేదలు, అణగారిన వర్గాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతారని, ఆత్మగౌరవం కోసమే ఈ ఉద్యమం అన్న కేసీఆర్... దళితులను అగౌరవపరిచి ఆ వర్గానికి (ఎస్సీ, ఎస్టీ, బీసీలు) తొలి తెలంగాణలోనే రాంగ్ సిగ్నల్స్ పంపారు. ఇంత జరుగుతున్నా 'అవసరాల' కోసం టీఆర్ఎస్‌లో పనిచేసే బహుజనులు సైలెంటైపోయారు... అటు టీఆర్ఎస్ యేతర సమాజం కూడా మిన్నకుండటం ఆశ్చర్యకరం. 2009లో కేసీఆర్ దీక్ష విరమించినప్పుడు గర్జించిన విద్యార్థిలోకం, మేధోప్రపంచం మాట తప్పిన కేసీఆర్‌ను ఇప్పుడు ఎందుకు నిలదీయడం లేదు? పరిపాలన సౌలభ్యం, పీడిత జాతుల రాజ్యాధికారం చిన్న రాష్ట్రాలతోనే సాధ్యమని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం ముందు వరుసలో ఉన్న వారెవ్వరూ మాట్లాడకపోవడంలో ఆంతర్యమేమిటి?
మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో దళితుల్లో అత్యంత వెనుకబడిన కులానికి చెందిన జీతన్ రాం మంఝీని ఆ పదవిలో కూర్చొబెట్టారు. రాజకీయ ఎత్తుగడలో భాగమా? కాదా? అన్న విషయాన్ని పక్కనబెడితే దళితుణ్ణి ఉన్నత పదవిలో కూర్చొబెట్టి గౌరవించారు. ఫలితాల ప్రకటన వరకు దళితులకు సీఎం పదవి ఇస్తామని జేడీ(యూ) ఏనాడూ చెప్పలేదు. తెలంగాణలో మాత్రం కేసీఆర్ తన తల నూరుముక్కలైనా దళితుడే సీఎం అన్నారు. అధికార వాంఛ కోసం తన పార్టీలోని దళితులను కూడా తలదించుకునేలా చేశారు. పైగా వారితోనే కాబోయే సీఎం కేసీఆర్ అంటూ ప్రతిపాదన చేయించుకోవడం కేసీఆర్ మార్కు పాలనకు నిదర్శనం. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేని కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను ఉన్నది ఉన్నట్లుగా అమలు చేస్తానంటూ చెబితే ఎలా నమ్మాలి?
అయితే కొన్ని 'బద్నామ్'ల నుంచి బయటపడేందుకు మాత్రం పార్టీలోని దళితులు, బలహీన వర్గాలు, ముస్లిం, గిరిజనులను బుజ్జగించేందుకు తగిన ఏర్పాట్లు చేయవచ్చు. మరికొన్ని హామీలు నెరవేర్చవచ్చు. కానీ వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ఏమాత్రం పాటుపడరు. అందుకే అగ్రకులానికి అధికార అహంకారాన్ని అలంకారంగా చేసుకొని రాజ్యమేలబోతున్న కేసీఆర్ అండ్ కో పట్ల అణగారిన సమాజమంతా అప్రమత్తంగా ఉండాలి. కలిసికట్టుగా వారి పాలనకు చరమగీతం పాడి సామాజిక తెలంగాణ సాధనకు నడుం బిగించాలి. అప్పుడే నవ తెలంగాణ సాధ్యం. లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి భౌగోళికంగా, ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తెలంగాణలో సామాజిక న్యాయం, రాజ్యాధికారం అణగారిన వర్గాల చేతికి రాదు. పెద్దగా మార్పేమీ ఉండదు.
- కొంగర మహేష్, రుద్రవరం లింగస్వామి, మనిగిల్ల పురుషోత్తం
ఓయూ రీసెర్చ్ స్కాలర్లు

Andhra Jyothi Telugu News Paper Dated: 27/05/2014 

No comments:

Post a Comment