Monday, January 9, 2012

పితృస్వామ్య ఆధిపత్యం!'కుట్రల్ని ఎత్తి చూపడం ద్రోహమా?' పేరుతో (ఆంధ్రజ్యోతి, జనవరి 6) సుదర్శన్ బాలబోయిన, వేణుగోపాల్‌రెడ్డి బండారీలు రాసిన వ్యాసం చదివాక కొన్ని అభిప్రాయాలు చెప్పాలనిపించింది. మొదట ప్రొ.కంచె ఐలయ్య రాసిన వ్యాసానికి స్పందిస్తూ సూరేపల్లి సుజాత కొన్ని విషయాలతో ఏకీభవిస్తూ, మరికొన్ని విషయాలపై అభ్యంతరాన్ని చెబుతూ చర్చించారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమ సందర్భంలో దళిత, బహుజనుల పాత్ర, దృక్పథం గురించి ఈ ఇద్దరి చర్చల్లో ఆస్కారముండడం తెలిసిందే. 

చర్చలోని ప్రత్యేకాంశాల పట్ల సుదర్శన్, వేణుగోపాల్ రెడ్డిలు తమ స్పందనను ఎంతో బాగా చర్చించుకోవచ్చు. కానీ అనిశ్చిత, అసంబద్ధ పద్ధతిలో వీరు చర్చను సాగించారనిపించింది. వీరు పరిశోధక విద్యార్థులయినప్పటికీ 'నీవు మా సార్ను తిడ్తవా? నీకెంత ధైర్యం' అన్న విధంగా మందలించిన తీరు ఒకటైతే, ఆమె తన అభిప్రాయాలను ఎంతో స్పష్టంగా వివరించినప్పటికీ వీరు మాత్రం పూర్తిగా భిన్నమైన రీతిలో వక్రీకరించడం రెండవది. 

సూరేపల్లి సుజాత తన వ్యాసంలో గాని, అంతకుముందు రాసిన వ్యాసాల్లో ఎక్కడా టిఆర్ఎస్‌ను, కెసిఆర్‌లను సమర్థించడం కాని, వెనకేసుకు రావడం గానీ కనబడదు. ఈ విషయం అర్థం కావడానికి ఇప్పటికీ సుజాత బ్లాగ్‌లో వీరిద్దరూగానీ, ఇంకెవరైనాగానీ చదువుకోవచ్చు. (Telanganaonline.org/Surepalliలో లేదా (Sujatha Surepalli Facebook). ఈమెను కెసిఆర్ సపోర్టర్‌గా నిలబెట్టిన ఘనత ఈ ఇద్దరు వ్యాసకర్తలది. 

ఉస్మానియా యూనివర్శిటీ కేవలం ఉద్యమాలకే కాదు, జ్ఞానానికి, మంచి విశ్లేషణలకు కూడా అది పుట్టినిల్లే. ఈ నేపథ్యమంతా తెలంగాణ ఉద్యమంలో భాగం కావడం కూడా ఉద్యమ స్వభావమే. ప్రతి ఒక్కరికి అవకాశాన్ని, విజ్ఞానాన్ని, అనుభవాన్ని, ఆవేదనను సైతం తెలంగాణ ఉద్యమం ఇచ్చిందని ఎవరూ కాదనలేరు. దీనిని మర్చిపోరాదు. సుజాత రాసిన తీరు 'సార్ మీలాంటి వాళ్ళే తెలంగాణ ఉద్యమం గూర్చి, దళిత బహుజనుల గురించి ఈ రకంగా మాట్లాడితే ఇంకెవరు సార్, సరిగ్గా మాట్లాడేది...' అన్న విధంగా వుంది. 

ఇంతకు ముందు ఐలయ్య రాసిన పుస్తకాలు, దళిత బహుజన దృక్పథంతో చేసిన ప్రసంగాల పరిచయ ప్రభావమే ఆమెను ఆ విధంగా రాయించిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అదే ఐలయ్య స్థానంలో వేరే వ్యక్తి ఉండి ఉంటే సుజాత వ్యక్తీకరణ ఇంకో విధంగా ఉండేది. ఐలయ్యనేమో 'నేనెట్ల హిందువునైత..?' అనే వరకు ఆగక, 'నేనెట్ల తెలంగానోన్నైత' అన్న తీరుగా రాస్తుండడం స్కాలర్లకేకాక స్కూలు పిల్లలకు కూడా బాగానే తెలిసింది. ఈ తీరు సుజాతనే కాక తెలంగాణలోని సకల జనులను, ఇక్కడి అన్ని వృత్తికులాల వారినీ, బి.సి. మైనారిటీ కులాలను, తెగలను కూడా కలవరపెట్టింది. ఐలయ్య అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం. 

తన భావవ్యక్తీకరణ తనది. కాని తెలంగాణ ఉద్యమంలో (నాయకత్వంలో కాదు) స్వరాష్ట్రకాంక్షతో ఉన్న దళిత, సబ్బండ కులాలు, ఆదివాసీలు, ముస్లిం, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, కార్మికులు, ప్రత్యేకంగా విద్యార్థుల గురించి ఐలయ్య నిర్థారణలు చేయడం మాత్రం తన వ్యక్తిగత విషయం కానేరదు. అది ఆ ఇద్దరు వ్యాసకర్తల వ్యక్తిగత విషయం అంతకంటే కాదు. 'కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా, తెలంగాణ, సీమాంధ్ర అగ్రకుల నాయకత్వం, తెలంగాణ పేరుతో శూద్ర కులాలను ఉద్వేగంలో ముంచెత్తి దహించి వేస్తుంది' అని ఐలయ్యతో పాటు వీరిద్దరు వ్యాసకర్తలు కూడా చెపుతున్నారు. 

వీరు మాత్రమే కాంగ్రెస్ కుట్రలను కొత్తగా డిస్కవరీ చేసినట్లు దానినే పట్టుకొని విమర్శస్తున్నట్లు పదేపదే చెప్తున్నారు. అయితే దొరలు చేసే ద్రోహాలు, కుట్రలు తెలవందెవరికి..? అవి అందరికీ తెలిసినవే కదా... ఇవేవి చరిత్ర, వర్తమానాలలో కొత్తవికావు. అయినా వీటిని విప్పిచెప్పడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కాని '...శూద్ర కులాలను ఉద్వేగంలో ముంచెత్తి దహించివేస్తుంది...' అని వీరు అనడం చూస్తే.. తెలంగాణ శూద్రులను వీరు ఏమి అర్థం చేసుకున్నారు అనేదే ప్రశ్న. 

స్వరాష్ట్రం కోసం సబ్బండ కులాలు ఉద్యమం చేస్తున్నపుడు తమ మూలాలను, తాము ఆకాంక్షించే కొత్త రాష్ట్రంలో తమ భవిష్యత్తును, దేవులాడుకుంటున్న క్రమంలో పరాయీకరణకు గురౌతున్న తెలంగాణ సహజ వనరులను, మాయమైన తమ మగ్గాలను, పాడుబడిన వాములను, చల్లారిపోయిన కొలిమిలను, ఇక్కడి అగ్రకులాల తోడ్పాటుతో సెజ్‌లలో కార్పొరేట్ల చేతులవడ్డ తమ విలువైన భూములను కోల్పోతున్న నేపథ్యం నుంచి ఇక్కడి జనం ప్రత్యేక తెలంగాణను కోరుకుంటున్నారు. ఈ పోరాటంలో ఆత్మగౌరవాన్ని, హక్కులను బలంగా నిలబెట్టుకోవడానికి మహాత్మాజోతిరావు ఫూలేను, సావిత్రిబాయిఫూలేను, డా.బి.ఆర్.అంబేద్కర్, కాన్షీరామ్‌ల సిద్ధాంతాలను ఆలోచనలను ఉపయోగించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. 

చెప్పేదేమంటే, సీమాంధ్ర, సమైక్యాంధ్ర అగ్రకులాల కుట్రలే కాదు... వాటిని లెక్కపెట్టకుండా తాము చేసిన పోరాటం, ఆత్మగౌరవ పోరాట వ్యక్తీకరణలు తెలంగాణ చరిత్రలోనూ, ఇప్పుడు ఇక్కడనే ఉన్నాయి. వీటన్నిటిని ఎవరు గుర్తించాలి? ఆధిపత్యకులాల వారు ఎందుకు గుర్తిస్తారు? మన బహుజనులే గుర్తుంచుకోవాల్సి ఉన్నది. దీన్ని గుర్తించి అందుకు సిద్ధాంత తాత్విక దిశను సూచించే బదులు, 'శూద్రులు, బహుజనులు మత్తులో ఉన్నారని, ఉద్వేగంలో మునిగినారని, గొడ్లలాగ తలలూపుతున్నార'ని అనడం ఈ బహుజనులను మరోమారు అవమానపర్చడమే అవుతుంది. అలా కాకుండా బహుజన ప్రజల గురించి కొంతైనా బాధ్యతతో మాట్లాడతారని ఆశిస్తారు. 

తెలంగాణ ప్రజలు దశాబ్దాల తరబడి పరాయిపాలనలో టైగర్‌జోన్ పేరుతో, సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ పోలవరం పేరుతో, సెజ్‌లు, థర్మల్ ప్రాజెక్టుల పేర్లతో తమ సర్వస్వం, పరాయీకరణకు గురౌతూ ధ్వంసమౌతుంటే ఎంతో సంక్లిష్టస్థితులలో కూడా శాంతియుతంగా ఉద్యమిస్తుంటే... దీనినే అడ్డంగా వ్యతిరేకించడం ఏమనుకోవాలి? 

తెలుగుదేశం, కాంగ్రెస్‌లకు, చంద్రబాబుకు, టిజి వెంకటేశ్, జెసి. దివాకర్‌రెడ్డిలకూ, వీరి సమైక్యాంధ్ర సర్కార్‌కు, జగన్, కిరణ్, లగడపాటి, కావూరి లాంటి వారికీ అయిలయ్య, వేణుగోపాల్ రెడ్డి బండారి, సుదర్శన్ బాలబోయినలకు నడుమ ఉన్న తేడా ఏముంది? ఇదే పెట్టుబడిదార్లు, రాజకీయ నాయకులు సమైక్యాంధ్ర ఉద్యమం నడిపిస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలను వారు చీ కొట్టినప్పుడు 'తెలంగాణలో గుడ్లగూబలు కూడా గుడ్లు పెట్టవు..' అన్నప్పుడు జవాబుగా ఐలయ్య ఆయన శిష్యులు ఏమైనా వ్యాసాలు రాశారా? 

ఈ ఇద్దరు వ్యాసకర్తలూ, ఐలయ్య కూడా దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిద్దాం. ఎందుకంటే వెనుకబడిన కులం, ప్రాంతీయ అస్తిత్వం నేపథ్యం నుంచి ఐలయ్య వచ్చారు కాబట్టి ఎవరైనా తన సపోర్టును ఆశించడంలో తప్పు లేదు. గీంతదానికే ఒంటికాలు మీద లేవడం అవసరమా? అది పితృస్వామ్య ఆధిపత్య లక్షణం తప్ప మరేం కాదుగదా! 

- గోగు శ్యామల
తెలంగాణ మహిళా రచయితల మేధావుల వేదిక
Andhra Jyothi News Paper Dated 10/01/2012

No comments:

Post a Comment