Friday, December 21, 2012

సాంస్కృతిక పునరుజ్జీవనం ---- గోగు శ్యామల


‘తెలంగాణ ధూంధాం’ ఇందూరు జిల్లా కామాడ్డిలో 2002 సెప్టెంబర్ 30న చిందుఎల్లమ్మ కాలి గజ్జెల సాక్షిగా పురుడు పోసుకున్నది. అద్బుత కళారూపమైన చిందు పేరెత్తి గొప్ప పని చేసిం డ్రు. తెలంగాణ వృత్తికులాలు, తెగలకు చెందిన అనేక కళారూపాలు కలగలిసిన ధూంధాం విశాలాంధ్ర దళారీ రాజకీయ శక్తులకు ఎలాంటి సందీయకుండా, సీమాంధ్ర టీ వీ చానళ్ల, పత్రికల, రాజకీయ పార్టీల దుష్ప్రచారానికి ధీటుగా, సకలజనుల కళారూపాలతో ప్రకాశిస్తున్న ధూంధాం ఇది.

నిజమే! తెలంగాణ ప్రజలందరికీ ఇది సాంస్కృతిక ఆయుధమే. కానీ ‘కత్తికి రెండువైపుల పదును’ అన్నట్టు మనకంటే ఎక్కువ, మనకంటే ముందు మన కళారూపాలు సాంస్కృతిక ఆయుధంగా మారింది సమైక్యాంవూధులకే. వీర తెలంగాణ పేరుతో విశాలాంవూధ ను, దున్నేవానికే భూమి, విశాలాంవూధలో ప్రజారాజ్యం, భూమి, భుక్తి, విముక్తి, ‘మరో ప్రపంచం మరో ప్రపంచం’ అనే నినాదాలు, పాటలు పాడి, మన కళారూపాలను వాడుకుని లగడపాటీలను, కావూరీలను, రామోజీలను, జగన్, వైఎస్‌లను తెలంగాణ నెత్తిమీద కూసోపెట్టిండ్రు. మన నీళ్లు, నిధులను, సర్వాన్నీ దోచిండ్రు. 

ఇదంతా వృత్తికారుల కళారూపాలను సాంస్కృతిక ఆయుధంగా మన పై ఎక్కుపెట్టి, మనల్ని మతగొల్పి, జడ్తవట్టిచ్చి ఎర్రజెండా పేరుతో బలిచ్చిండ్రు. మన జమిడీకే కథలు, మాదిగ మాష్టి డప్పులు, కంజెర్లు ఇతర వృత్తికులాల కళారూపాలైన బుడిగ, బుర్ర కథలు, వాడుకొని, ఒగ్గు, గొంగడి వేషాలు వేసి, అన్నీ పార్టీలు కలగలిసన విశాలాంధ్ర, ఐఎంఎఫ్ అమెరికన్ డాలర్ ఆంధ్రాను తెచ్చిండ్రు. తెలంగాణ ప్రజలను బిచ్చగాళ్లను చేసిండ్రు. ఇదంతా తెలంగాణ కళారూపాలను ఆయుధంగా మల్చుకోవడం వల్ల మాత్రమే వారికి సాధ్యమైంది. అంటే యాభై ఏండ్లకిందటే వీటిని ఆంధ్రోళ్లు ఆయుధంగా చేసుడు మొదలుపెట్టిండ్రు. యాభై ఏండ్లు గా పాతుకుపోయిన విశాలాంధ్ర లూట్ మార్‌ను ఎండగట్టడంలో గత పదేండ్లుగా ధూంధాం, ధూం తడాఖనే చూపిస్తున్నది. ఇది తెలంగాణ సకల జనుల అనేక కళారూపాల సమ్మేళనం.

ఇందులో తెలంగాణ అస్తి త్వం కోసం, వనరుల, నీళ్ల, నిధుల, విద్య, ఉద్యోగాల, ఆత్మగౌరవం, అన్నింటికి మించి స్వయం పాలిత రాష్ట్రం కోసం రాజీలేని సాంస్కృతిక యుద్ధాన్ని ధూంధాం విజయవంతంగా నడుపుతున్నది. ఇది పార్టీయేతర సాంస్కృతిక యుద్ధం. ఈ ధూంధాం ఈ వర్గం, ఆ వర్గం అనే తేడాలేకుండా, ఎలాంటి విదేశీ పాశ్చాత్య భావజాలం లేకుండా అపూటమైన పునరుజ్జీవన ఉద్యమం. పునరుజ్జీవన ఉద్యమం అంటేనే చాలామంది మేధావులకు బెంగాలో, లేదా యూరప్ రెనైస్సాన్స్ మాత్రమే యాదికొస్తాయి. అక్కడ ఎంతమంది కవులు, గాయకులు, రచయితలు పుట్టిండ్రో తెలువది కానీ బెంగాల్ నిండ తొక్కుడు రిక్షాలు కాకుండా, పిక్కలు గడ్డకట్టంగా దేశంలో ఎక్కడా లేని గుంజుడు రిక్షాలు ఇప్పటికీ కనిపిస్తాయి. 

గత పదేళ్ల సాంస్కృతిక పునరుజ్జీవనంతో తెలంగాణ వేలాదిమంది కవులును, రచయితలను, గాయకులను, కథకులను ప్రపంచం మీదికి తెచ్చింది. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం ఏ ఎజెండా నుంచి వచ్చింది కాదు. ‘మాది మాకు’ అనే నేటివిటీ నుంచే వచ్చింది. ఈ ఒరవడిని ఎవరైనా గుర్తించకుండా ఉంటే అది వారికే నష్టం. ఎందుకంటే దేశంలో ఇలాంటి సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం జరగలేదు. దీని యాభైఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్యలు ఉన్నాయన్నది మరువకూడదు. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పదేళ్లుగా తమ ఆటపాటలతో ధూంధాం జీవం పోస్తున్నది.

సమైక్యాంధ్ర అగ్రకుల మనువాదం, టీవీ, సినిమాల ద్వారా తెలంగాణ మీద విషం గక్కే గోబెల్స్ ప్రచారమై, ఫాసిజమై, దొరతనమై, తెలంగాణ ప్రజానీకంపై, తెలంగాణ సంస్కృతిపై, కళారూపాలపై దాడి చేసిం ది. కమ్యూనిస్టు ముసుగులేసుకొని కళారూపాల్లోకి, వాయిద్యాల్లో జొర్రిం ది. ఆ రూపాలను లోబరుచుకుని తన విశాలాంధ్ర దళారీ దోపిడీ సిద్ధాంతాన్ని అంటువ్యాధిలా అంటించింది. యాభై ఏళ్లుగా వివిధ రకాలుగా బలితీసుకుంది. తెలంగాణ జీవావరణాన్ని, జీవనోపాధులను విధ్వంసానికి గురిచేసింది. ఇలాంటి చోట తేటనీళ్ల చెలిమె వెలసినట్లు ధూంధాం తెలంగాణలో మొల్కల పున్నమైంది. తెలంగాణ వాకిట్లో వేపచెట్లు పచ్చగా విస్తరించి ఉన్నట్టు ధూంధాం అంతటా ఆటపాటలతో, రాష్ట్రం కోసం చైతన్యం పంచుతూ విస్తరించింది. ధూంధాంకు రసమయి బాలకిషన్ రథసారథిగా బాధ్యతనెత్తుకొని ఎంతమంది సాంస్కృతిక ఉద్యమ సారథులను తయారు చేసిండో! తెలంగాణ సకల రూపాలు తల్లిపాల స్వచ్ఛత గలవి. ఈ వృత్తి కళారూపాలతో రాష్ట్రం వచ్చే వరకు, తర్వా త కూడా ధూంధాం, మన సాంస్కృతిక పునరుజ్జీవనం దిశగా నడపాలి.

-గోగు శ్యామ

Namasete Telangana News Paper Dated: 22/12/2012 

No comments:

Post a Comment