Tuesday, May 1, 2012

వామపక్షాల ముందున్న కొన్ని సవాళ్లు----బృందా కరత్‌



కార్మికోద్యమం కార్మికులందరినీ సమీకరించగలిగినపుడే వర్గ సమైక్య నినాదం ఆశించిన ఫలితాలను సమకూరుస్తుంది. దళితుల అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మించాలి. అనేక వివక్షతలు ఎదుర్కొంటున్న ముస్లింలను కూడా ఉద్యమంలో భాగస్వాములను చేయాలి. మహిళా కార్మికుల స్థితిగతులపై కూడా ప్రధానంగా దృష్టి సారించకపోతే నయా ఉదారవాద విధానాలపై పోరాటాలు ముందుకు సాగవు. దళితులు, ముస్లింలు, మహిళలు, గిరిజనులు కావడం వల్ల ఎదురయ్యే వివక్షతలు, అణచివేతలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు కార్మికోద్యమంలో భాగస్వామ్యం కల్పించాలి.
కోజికోడ్‌లో జరిగిన 20వ సిపిఎం మహాసభ అనేక అంశాలతోపాటు అస్థిత్వ రాజకీయాలు, వామపక్ష ఉద్యమానికి దాని వల్ల ఎదురవుతున్న సవాళ్ల గురించి చర్చించింది. ఈ మహాసభలో ఆమోదించిన రాజకీయ, సైద్ధాంతిక తీర్మానాలు ఈ అంశం గురించి విస్తృతంగా చర్చించాయి. నయా ఉదారవాద విధానాల కింద కార్మికుల అస్థిత్వాన్ని దెబ్బతీసే ప్రక్రియ వామపక్షాల ముందు కొత్త సవాళ్లను ఆవిష్కరిస్తోంది. ముఖ్యంగా కులం, మతం, ప్రాంతం, భాషాపరమైన బహుళ రకాల విభేదాలు ఉన్న మన సమాజంలో ఈ సవాళ్లు మరింత తీవ్రంగా ఉంటాయి. గత రెండు దశాబ్దాల్లో, ఈ విభేదాలు ఒక తరహా రాజకీయాల వల్ల మరింత తీవ్రతరమవుతున్నాయి. కార్మికులను చీల్చేందుకు, రాజకీయ సమీకరణ కోసం ఓటు బ్యాంకులు సృష్టించుకునేందుకు కులం, కమ్యూనిటీని అవి సాధనాలుగా ఉపయోగించుకుంటున్నాయి. నయా ఉదారవాద విధానాలు సృష్టించిన భౌతిక పరిస్ధితుల్లోని మార్పులు ఈ ప్రక్రియకు దోహదం చేస్తున్నాయి. ఆ భౌతిక పరిస్థితుల్లోనే భారత్‌, ప్రపంచవ్యాప్తంగా కార్మికులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ విధానాల వల్ల నిత్యం పెరిగే నిరుద్యోగసైన్యం, లేదా తమ అర్హతల కంటే తక్కువైన ఉద్యోగాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. స్థూలంగా చెప్పాలంటే, కార్మికుల అస్థిత్వాన్ని బలహీనపరిచేందుకు, వారిలో వర్గచైతన్యాన్ని దెబ్బతీసే నిర్దిష్ట లక్ష్యంతో ఒక ప్రక్రియ కొనసాగుతోంది.
కార్మికుల్లో పెరుగుతున్న అభద్రతాభావం
నయా ఉదారవాద వ్యవస్థ కింద, ఉత్పత్తి ప్రక్రియలో, కార్మిక కాంట్రాక్టుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. . ఈ మార్పులు కార్మికుల హక్కులను హరిస్తున్నాయి. ఒకవైపు పెట్టుబడిపై ఆధారపడుతూ ఉన్నత విద్యార్హతలు, నైపుణ్యాలు గల కార్మికులను నామమాత్రపు సంఖ్యలో మాత్రమే నియమించే బాగా అభివృద్ధి చెందిన ఉత్పత్తి యూనిట్లుండగా, మరోవైపు ఉత్పత్తి ప్రక్రియ వికేంద్రీకరణ, విభజన, ఉప విభాగాలుగా విభ జించడం వంటి ప్రక్రియలు లాభదాయకమని బావించే పెట్టుబడిదారులున్నారు. ప్రధాన కంపెనీ తాను నిర్వహించే వివిధ కార్యకలాపాలను అవుట్‌ సోర్సింగ్‌కు అప్పగించడం, అంతిమంగా పూర్తి అయిన పరికరాలను అసెంబుల్‌ చేయడం ద్వారా తమ సంస్థల్లో కార్యకలాపాలను కుదించు కుంటున్నాయి. కార్మికుల నియామకంలో తాజాగా వచ్చిన ప్రధానమైన మార్పు పెద్ద సంఖ్యలో క్యాజువల్‌, కాంట్రాక్టు కార్మికులను నియమించడం, కార్మికులు పనిచేసే పరిస్థితులు కూడా ఘోరంగా ఉంటున్నాయి. ఎటువంటి భద్రతా లేని కార్మికుల సంఖ్య బాగా పెరిగినట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొంది. 2010లో ప్రపంచ కార్మికుల్లో యాభై శాతానికి పైగా కార్మికులు, అంటే 150 కోట్ల మంది తీవ్ర అభద్రతాభావ వాతావరణంలో పనిచేస్తున్నారు.ఇందులో అనేక మంది మహిళలు కూడా ఉన్నారు.
భారతదేశంలో సంఘటిత రంగంలోని కార్మికుల సంఖ్య ఏడు కంటే తక్కువగానే ఉంది. వీరిలో ఎక్కువ భాగం ప్రబుత్వ రంగంలోనే పనిచేస్తున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం విస్తృతంగా అమలులోకి రావడం వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టారు. రిక్రూట్‌మెంట్‌ బాగా తక్కువగా ఉంటోంది. ఉపాధికల్పన అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. మరోవైపు ప్రయివేటు రంగంలో కార్మికుల్లో అభద్రతాభావం బాగా పెరిగిపోతోంది. పరిశ్రమల వార్షిక సర్వే ప్రకారం ఉత్పత్తి రంగంలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య 1999-2000లో 20 శాతం ఉండగా 2008-09 నాటికి 32 శాతానికి పెరిగింది. 2004-05 నుండి 2009-10 మధ్య క్యాజువల్‌ కార్మికుల సంఖ్య 2.1 కోట్లు పెరిగింది. మరోవైపు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే రెగ్యులర్‌ కార్మికుల సంఖ్య 58 లక్షలు మాత్రమే పెరిగింది.
కార్మికుల్లో అనేక మంది అనేక వృత్తులు చేపడుతున్నారు. దాంతో కార్మికులు అస్థిత్వం కోల్పోతున్నారు. ఉత్పత్తి ప్రక్రియలో వికేంద్రీకరణ చోటుచేసుకోవడంతో కాంట్రాక్టర్లు, సూపర్‌వైజర్లు, చిన్న ఏజెంట్లతో కూడిన వ్యవస్థ కార్మికుడు, యజమాని మధ్య ప్రత్యక్ష సంబంధాలను మరుగున పెడుతోంది. దాంతో కార్మికులు, యజమాని మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. చారిత్రికంగా పెద్ద సంఖ్యలో కార్మికులు ఒకే కప్పు కింద పని చేస్తూ, సన్నిహితంగా జీవిస్తుండటం సమిష్టి కార్యకలాపాల నిర్వహణ, సమిష్టి జీవనానికి అవకాశం కల్పించింది. భారతదేశంలో బొంబాయిలో ఢిల్లీలోని జౌళి పరిశ్రమల ప్రాంతాల్లో, బెంగాల్‌లోని జనపనార, ఇంజనీరింగ్‌ ప్యాక్టరీలు, పరిశ్రమలోని కార్మికులు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ ఉమ్మడి సంస్కృతి వర్గం ఆధారంగా కార్మిక సమైక్యత, అస్థిత్వానికి అవకాశం కల్పించింది. అంటే దీనర్థం కులతత్వం అంతరించిందని కాదు. కులపరమైన వివక్షత విభిన్న రూపాల్లో తమ ప్రభావం ప్రదర్శించింది. అయితే పాత తరం ఫ్యాక్టరీలు, మిల్లుల్లో సంఘటితమైన కార్మికవర్గం పారిశ్రామిక ప్రాంతాలకు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివశిస్తూ కార్మికవర్గం సమిష్టితత్వానికి ప్రతీకగా నిలిచారు.వర్గ దోపిడీకి వ్యతిరేకంగా సమైక్యత ప్రాతిపదికగా కార్మికుల అస్థిత్వం రూపొందింది.
బలహీనపడ్డ సమైక్యత
గత రెండు దశాబ్దాలుగా ఉత్పత్తి ప్రక్రియలో అనేక మార్పులు చోటుచేసుకోవడంతో కార్మికుల్లో సమైక్యత దెబ్బతింది. ఉత్పత్తి ప్రక్రియలో కార్మికులు సమిష్టిగా పాల్గొనే వ్యవస్థ గణనీయంగా బలహీనపడింది. పాత కార్మికుల కాలనీలను కూల్చివేశారు. వాటి స్థానంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు దందా ప్రారంభమైంది. సంపన్నుల కోసం ఆకాశహర్మాల నిర్మాణం కొనసాగుతోంది. షాపింగ్‌ మాల్స్‌, షాపింగ్‌ కేంద్రాలు దర్శనమిస్తున్నాయి. పట్టణాల్లో కార్మికుల కాలనీలు అదృశ్యమవుతున్నాయి. కార్మికులు, లేబర్‌ చెల్లాచెదురయ్యారు. దీంతో వారి రాజకీయ సంకల్పబలం బలహీనపడింది. సమ్మెలు చేసే శక్తి సన్నగిల్లింది. ఆర్థిక వ్యవస్థలో, సంస్కృతిలో, సామాజిక జీవనంలో కార్మికుల పాత్ర సన్నగిల్లింది. మరోవైపు అవుట్‌సోర్సింగ్‌ వ్యవస్థ, వికేంద్రీకరణ ప్రక్రియ కారణంగా కార్మికులకు తమ ఇళ్లే తమ విధుల నిర్వహణ కేంద్రాలుగా మారాయి. ఆ విధంగా సంప్రదాయసిద్ధమైన కార్మికవర్గ రాజకీయాలు బలహీనపడ్డాయి. కార్మికుల సమీకరణ వ్యవస్థ దెబ్బతింది. ఈ ప్రక్రియ కార్మిక సంఘ ఉద్యమాన్ని మాత్రమే కాకుండా మన దేశ సామాజిక, రాజకీయ జీవనాలపై కూడా ప్రభావం చూపుతోంది. వామపక్ష ఉద్యమానికి ఇది పెద్ద సవాలుగా పరిణమించింది.
వామపక్షం ఈ పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కొంటుంది? వివిధ రకాల అవుట్‌సోర్సింగ్‌ ప్రక్రియల్లో పాలుపంచుకుంటున్న అసంఘటిత రంగంలోని కార్మిక సైన్యానికి చేరువకావడం, వారిని సంఘటితపరచడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. విస్తరిస్తున్న అస్థిత్వ ఆధారిత ధోరణికి విరుద్ధంగా మొత్తం కార్మికుల సార్వత్రిక డిమండ్లపై ప్రధానంగా దృష్టి సారించే ప్రక్రియ కూడా ప్రధానమే. దోపిడీ వ్యవస్థను దీటుగా ఎదుర్కొనేందుకు కార్మికవర్గంలో సమైక్యతను పరిఢవిల్లజేయాలి. అయితే వర్తమాన పరిస్థితుల్లో ఇదొక్కటే సరిపోతుందా?ఒకే విధమైన పనిచేసే దళిత వర్గానికి చెందిన కార్మికునికి లభిస్తున్న వేతనంలో మూడవ వంతు కూడా దళిత వర్గానికి చెందిన కార్మికునికి లభించడం లేదు. కార్మికునికి లభించే వేతనంలో సగం మాత్రమే ఒక కార్మికురాలికి లభిస్తోంది. ముస్లింలు ఉద్యోగాల్లో, విద్యలో, నైపుణ్యం అందించే శిక్షణలో వివక్షతను ఎదుర్కొంటున్నట్లు సచార్‌ కమిటీ నివేదిక పేర్కొంది. ఫలితంగా, ముస్లింలు తక్కువ జీతం లభించే ఉద్యోగాల్లో మాత్రమే ఉపాధి పొందుతున్నారు
కార్మికోద్యమం కార్మికులందరినీ సమీకరించగలిగినపుడే వర్గ సమైక్య నినాదం ఆశించిన ఫలితాలను సమకూరుస్తుంది. దళితుల అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మించాలి. అనేక వివక్షతలు ఎదుర్కొంటున్న ముస్లింలను కూడా ఉద్యమంలో భాగస్వాములను చేయాలి. మహిళా కార్మికుల స్థితిగతులపై కూడా ప్రధానంగా దృష్టి సారించకపోతే నయా ఉదారవాద విధానాలపై పోరాటాలు ముందుకు సాగవు. దళితులు, ముస్లింలు, మహిళలు, గిరిజనులు కావడం వల్ల ఎదురయ్యే వివక్షతలు, అణచివేతలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు కార్మికోద్యమంలో భాగస్వామ్యం కల్పించాలి. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే అస్థిత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా వామపక్షాల వ్యూహాలు ఫలించవు. తమ సమస్యలకు తగిన ప్రాధాన్యత లభించకపోతే ఈ వర్గాలు వర్గ సమైక్యతా నినాదం వారికి పట్టదు. నయా ఉదారవాద విధానాల కారణంగా చోటుచేసుకుంటున్న వివక్షతను అర్థం చేసుకుని సమగ్ర పద్ధతిలో వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.
ఈ సామాజిక సమస్యలు వర్గ సమస్యలకు అనుబంధంగా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దళితులు, గిరిజనులు చిన్న రైతాంగం, మహిళలు, మైనారిటీలకు చెందినవారుగా ఉంటారు. నయా ఉదారవాద విధానాలు సమాజంపై విస్తృత ప్రభావం చూపుతాయి. ఉత్పత్తి ప్రక్రియ, సామాజిక సంబంధాలను కూడా ప్రభావితం చేస్తాయి. వర్గ దోపిడీకి, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలను సంఘటితం చేయడం వామపక్షాలు అనుసరించాల్సిన వ్యూహాత్మక పంథా. 
Prajashakti News Paper Dated : 01/05/2012
-బృందా కరత్‌

No comments:

Post a Comment