Share
Thu, 17 May 2012, IST
గనులు, ఖనిజాల రంగంలో ప్రతిపాదించిన సంస్కరణలు భూమి, దానికి సంబంధించిన వనరుల యజమానుల హక్కులపై దాడి చేయ డానికి ఉద్దేశించినవే తప్ప మరొకటి కాదు. ప్రపంచ వ్యాప్తంగా గిరిజన, దేశీయ కమ్యూనిటీలు తమకు చెందిన భూముల్లో నిక్షిప్తమై ఉన్న ఖనిజ సంపదపై తమ హక్కులను చాటుకుంటున్నాయి. వారు ఆ భూములపై, ఆ భూముల్లో లభించే ఖనిజాలపై సంప్రదాయబద్ధమైన హక్కులు కలిగి ఉన్నారు. అయితే గిరిజనుల న్యాయపరమైన హక్కుల సంగతి అటుంచి ఆ సంపదలో కనీసం కొంత శాతంపై కూడా హక్కులు పొందలేకపోతున్నారు. ప్రస్తుత నయా ఉదారవాద విధానాల నేపథ్యంలో దేశీయ కార్పొరేట్ సంస్థలు, బహుళ జాతి మైనింగ్ కంపెనీలు ఖనిజాలు, జాతీయ వనరులను దోచుకుంటున్నాయి. మరోవైపు దోపిడీకి గురవుతున్న కమ్యూనిటీల నుండి ప్రతిఘటన ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఇది అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఐక్యరాజ్యసమితి ఒప్పందాల్లో ప్రతిబింబిస్తోంది. గిరిజనులు సంప్రదాయబద్ధంగా వ్యక్తిగతంగా కానీ, సమిష్టిగా గానీ అనుభవిస్తున్న లేదా వారి స్వాధీనంలో ఉన్న భూముల యాజమాన్య హక్కులు, నియంత్రణ, నిర్వహణలను ఇవి వివిధ రూపాల్లో గుర్తిస్తున్నాయి. తమ ప్రాంతాలను అభివృద్ధి అవసరాలకు ఉపయోగించుకునే విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో వారికి గల హక్కులను, తమ ప్రాంతాల్లో చేపట్టే ఎటువంటి ప్రాజెక్టులకు స్వేచ్ఛగా ఆమోదం తెలిపేందుకు, లేదా తిరస్కరించేందుకు వారికి గల హక్కులను ఇవి గుర్తించాయి.
తమ హక్కుల పరిరక్షణ కోసం గిరిజనులు చేసే పోరాటాలు లేదా వారు చేసే త్యాగాల ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఆ తీర్మానాలను చట్టబద్ధమైన హక్కులుగా మార్చడం అత్యంత ముఖ్యమైన విషయం. ఇది భారత్‌కు పూర్తిగా వర్తిస్తుంది. యుపిఎ ప్రభుత్వం 2011గనులు, ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు (ఎంఎంఆర్‌డిఎ) ప్రవేశపెట్టింది. ఆ బిల్లు ప్రస్తుతం పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనలో ఉంది.
ప్రయివేటీకరణకు ప్రోత్సాహం
భారతదేశంలో గనుల యాజమాన్యం ప్రభు త్వానికే చెందుతుంది. అయితే ఇనుప ఖనిజం, బాక్సైట్, రాగి, బొగ్గు మొదలైన ప్రధాన ఖనిజాలపై కేంద్ర ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇసుక, ఇటుకరాయి. గ్రానైట్ వంటి చిన్నపాటి ఖనిజాలపై నియంత్రణ కలిగి ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వద్ద గనుల ప్రయివేటీ కరణను ప్రవేశపెట్టాయి. గనులను ప్రయివేటు కంపెనీలకు లీజుకు ఇవ్వడంతోపాటు ఇనుప ఖనిజం, బాక్సైట్, ఉక్కు, అల్యూమినియం వంటి క్యాప్టివ్ గనులను టాటాలు, బిర్లాలు వంటి కార్పొరేట్ సంస్థల చేతికి అప్పగిస్తున్నాయి. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇటీవల ఈ పరిశ్రమ కోసం రూపొందించిన నివేదిక ప్రకారం 23 రాష్ట్రాల్లో 2009 సంవత్సరాంతానికి 4.9 లక్షల హెక్టార్ల భూమిని మైనింగ్ లీజులకు అద్దెకు ఇచ్చారు. ప్రయివేటు కంపెనీలకు 70 శాతం భూములను కట్టబెట్టారు.
గనుల రంగంలో మరింతగా నియంత్రణ ఎత్తివేసి సరళీకరించేందుకు, హోడా కమిటీ సిఫార్సుల ప్రాతిపదికగా ప్రయివేటీకరణను ప్రోత్సహించేందుకు ఎంఎంఆర్‌డిఎ బిల్లు దోహదం చేస్తుంది. హై టెక్నాలజీ భూగర్భ పరిశోధన, ప్రాస్పెక్టింగ్, తవ్వకం విధానాన్ని ఇది ప్రవేశపెడుతుంది. తక్కువ ధరలకు మైనింగ్ పనులను లీజుకు ఇవ్వడాన్ని ప్రోత్సహిస్తుంది. గనుల రంగంలో ఎఫ్‌డిఐలు, విదేశీ కంపెనీలను ప్రోత్సహిస్తుంది. అటువంటి కంపెనీలపట్ల సాను కూలత చూపే కొంతమందికి గనులను లీజుకు ఇవ్వడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంతకుముందు కేటాయించిన విస్తీర్ణం కంటే ఎక్కువ మొత్తంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు వాటిని అనుమ తిస్తుంది. ఇందువల్ల సమానత్వం, పర్యావరణం, వృద్ధిపై ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ అంశాలపై సమగ్ర విశ్లేషణ అవసరం. కాగా ఇక్కడ గిరిజనులకు హక్కులను కల్పించేందుకు ఉద్దేశించినవిగా చెబుతున్న అంశాల గురించి ప్రధానంగా దృష్టి కేంద్రీకరిద్దాం. కోల్ మైనింగ్ కంపెనీలు తమ లాభాల్లో 26 శాతం మొత్తాన్ని నిధులు ఇవ్వాలనే నిబంధన ఒకటి ఉంది. ఇతర ఖనిజాల విషయంలో రాయిల్టీతో సమానంగా చెల్లించాలి. కంపెనీలు తప్పనిసరిగా కొంతమొత్తం చెల్లించాలనే నిబంధన అవసరమే అయినప్పటికీ ఈ నిధులు గని యజమానులు, బ్యూరోక్రసీ ఆధిపత్యం చెలాయించే జిల్లా ఖనిజాల ఫౌండేషన్ నియంత్రణలో ఉంటాయి. ఈ ఫౌండేషన్‌లో స్థానిక కమ్యూనిటీలకు నామమాత్రపు ప్రాతినిధ్యం మాత్రమే ఉంటుంది. అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వం కంపెనీలు చెల్లించే మొత్తాలతో నిధులను నిర్వహించేందుకు ట్రస్టులను ఏర్పాటు చేస్తుంది. స్థానిక భారతీయుల యాజమాన్యంలోని భూముల్లో రిజర్వ్‌లుపై చెల్లించే నిధులకు ప్రభుత్వం ఇటీవల ఇటీవల 41 మంది భారతీయులకు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. నిధులను దుర్వినియోగం చేసినందుకు గాను ఈ నష్టపరిహారం చెల్లించాల్సివచ్చింది. ఇటువంటి కేసు లోనే అమెరికా 3.4 బిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించాల్సి రావచ్చునని భావిస్తున్నారు. ఇటువంటి నిధుల నిర్వహణలో బాధిత వ్యక్తులకు ఎటువంటి నిర్ణాయక పాత్ర లేకపోతే ఎంఎంఆర్‌డిఎ బిల్లులో ప్రతిపాదిత జిల్లా ఖనిజాల ఫౌండేషన్‌లో మాదిరిగా నిధుల దుర్వినియోగం అనివార్యమవుతుంది. పైగా భారతదేశంలో రాయల్టీలు బాగా తక్కువగా ఉంటాయి. ఇటీవలి కాలం వరకు ఇనుప ఖనిజానికి కేంద్ర ప్రభుత్వం ఒడిశా రాష్ట్రానికి నిర్ణయించిన రాయల్లీ టన్నుకు రు26 మాత్రమే. ఇనుప ఖనిజం తవ్వకం ఖర్చు టన్నుకు రు. 250 నుండి రు. 300 కాగా, మార్కెట్‌లో ఉన్న అత్యధిక రేటు టన్నుకు ఏడు వేల రూపాయలు. దీంతో మైనింగ్ కంపెనీలు భారీ మొత్తంలో లాభాలు ఆర్జించాయి. రాయల్టీ రేట్లను ఇటీవలే పెంచినప్పటికీ కంపెనీలు గడిస్తున్న లాభాలతో పోలిస్తే చెల్లిస్తున్న రాయిల్టీలు స్వల్పం గానే ఉన్నాయి.
ప్యాట్రన్-క్లయింట్ సంబంధాలు
ఈ పథకంలో ముఖ్యమైన విషయం ప్యాట్రన్- క్లయింట్ మధ్య సంబంధాలు. గిరిజనులను భూములు, దానిలోని వనరుల యజమానులుగా బిచ్చగాళ్లుగా మారుస్తున్నాయి. ఈ బిల్లులోని నిబంధనలు గిరిజనులకు రాజ్యాంగం, ముఖ్యంగా ఐదవ షెడ్యూల్ కల్పించిన హక్కులపై దాడి చేసే విగా ఉన్నాయి. ఐదవ షెడ్యూల్ ప్రాంతాలను, గిరిజనుల భూమిని గిరిజనేతరులకు బదిలీ చేయ డాన్ని నిషేధిస్తుంది. ఆంధ్రప్రదేశ్ చేసిన 70/1 చట్టం, ఛత్తీస్‌గఢ్ చేసిన చోటానాగపూర్ కౌల్దారీ చట్టం, సంతల్ పరగణాస్ కౌల్దారీ చట్టం తరహాలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. మైనింగ్ కంపెనీలు లీజుకు తీసుకున్న భూములేవీ ఆదివాసీ లకు చెందినవి కావు. ఇందువల్లనే సమతా కేసులో గిరిజనులకు చెందిన భూములను గిరిజనేతరులకు విక్రయించడం, బదిలీ చేయడం, లీజుకు ఇవ్వడం చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. గిరిజనుల సహకార సంఘాలకు చెందిన భూములను మైనింగ్‌కు కేటాయించరాదు. ఈ బిల్లు సమతా కేసును అతిక్రమించేదిగా ఉంది. ప్రధాన ఖనిజాల గనులను లీజ్‌కు తీసుకునే విషయంలో గిరిజన సహకార సంఘాలను అనర్హులుగా ఈ చట్టం ప్రకటించింది. సంబంధిత చట్టాల కింద నమోదైన కంపెనీలకు మాత్రమే లీజుకు తీసుకునే అధికారం కల్పించారు. ఐదవ, ఆరవ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని స్వల్ప ఖనిజాలు, స్వల్ప మొత్తంలో డిపాజిట్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన సహకార సంఘాలను లీజ్ పొందడానికి అర్హతగల
సంస్థలుగా పరిశీలించవచ్చు. (పరిశీలించవచ్చు మాత్రమే, విధిగా పరిశీలించాలని కాదు).
మైనింగ్ కంపెనీల్లో గిరిజనులకు తప్పనిసరిగా కొంత వాటా ఇవ్వాలని 2010 ముసాయిదా బిల్లు నిర్దేశించింది.కంపెనీ గిరిజనులకు ప్రమోటార్ కోటా కింద 26 శాతం వాటాకు సమానంగా షేర్లు ఇవ్వాలని ఈ నిబంధన పేర్కొంది. దక్షిణాఫ్రికా బ్లాక్ ఎకానమీ ఎంపవర్‌మెంట్ యాక్ట్ కూడా మైనింగ్ కంపెనీల్లో చారిత్రాత్మకంగా సామాజికంగా నిరాదరణకు గురవుతున్న వర్గాలకు 26 శాతం షేర్లను ఇవ్వాలని నిర్దేశించింంది. అయితే భారత దేశంలో మైనింగ్ లాబీల ఒత్తిడికి లొంగిన ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న ముసాయిదాలో చేర్చిన నిబంధన స్థానంలో నామమాత్రంగా బాధిత కుటుంబాల్లో ఒక్కొక్క సభ్యునికి ఒక్కొక్క షేర్ చొప్పున కేటాయించే పద్ధతిని ప్రవేశపెట్టింది.
జీవనోపాధి కోల్పోయినవారికి నష్టపరిహారం, పరిహారంగా ఉద్యోగాలు కల్పించడం వంటి అనేక ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఈ బిల్లులో అందుకు సంబంధించిన నిబంధనలు సరిపోయే రీతిలో, అస్పష్టంగా ఉన్నాయి. మైనింగ్ రంగంలో పర్మినెంట్ ఉద్యోగాల్లో కోత విధించి కాంట్రాక్టు, క్యాజుయల్ కార్మికులను నియమించడం పెరిగి పోయిన నేపథ్యంలో భూమి కోల్పోయినవారికి ఉపాధి కల్పిస్తామనే హామీలను విశ్వసించలేము. భూ సేకరణ బిల్లు గిరిజనుల యాజమాన్య హక్కులకు పాతరవేయడంతోపాటు అంతర్జాతీయ, దేశీయ సంస్థలు ఐదవ షెడ్యూల్, గిరిజనులు అధికంగా నివసించే ఖనిజ వనరులతో పరిపుష్టమైన ప్రాంతాల్లో తేలికగా ప్రవేశించి ప్రకృతి వనరులను దోచుకునేందుకు అవకాశం కల్పించే విధంగా ఉంది. గిరిజనుల హక్కుల పరిరక్షణకు సంబంధించి అనేక అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకాలు చేసిన భారతదేశం ఈ ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. బిల్లును ఈ రూపంలో తేవడాన్ని గట్టిగా ప్రతిఘటించాలి. ఐదవ షెడ్యూల్, గిరిజన తండాల్లో భూముల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు గిరిజనులకు భూముల్లో యాజమాన్యాన్ని గుర్తించేందుకు, వారి హక్కులను పరిరక్షించేందుకు పటిష్టమైన చట్టబద్ధమైన యంత్రాంగం కోసం ప్రత్యామ్నాయ నమూనా కోసం ఉద్యమాలు నిర్వహించాలి.
Prajashakti News Paper Dated : 18/05/2012
-బృందా కరత్
No comments:
Post a Comment