Monday, April 2, 2012

పోరాటమా? కుల దాష్టీకమా? - డా.ఎం.ఎఫ్.గోపీనాథ్,



అవసరం ఉండి అవకాశాలున్న ప్రతి మనిషి అన్యాయం చేయటానికి వెనుకాడడనే సాధారణ సూత్రీకరణకు కొంతమందే మినహాయింపు. రాష్ట్ర ఖనిజ సంపదను కట్నంగా రాసివ్వాలన్నా, వక్ఫ్ భూముల్ని లాక్కొని లంకంత ల్యాంకో టవర్‌లను కట్టాలన్నా పెట్టి పుట్టాల. దానికి మాయ ఉండాల. డబ్బుండాల. దబాయింపు సెక్సనుండాల. (వరస మార్చినందుకు రావిశాస్త్రిగారికి క్షమాపణలు). 

ఫిబ్రవరి 28న 'కార్మిక సంఘాల నాయకత్వంలో సార్వత్రిక సమ్మె' జరిగింది. ఆ సమ్మె ఫలితంగా ఏమోగాని ఓ దళిత కాలేజీ ప్రిన్సిపాల్ 'లైంగిక వేధింపుల' సెక్షన్ కింద బుక్కయ్యాడు. అతను ఆసుపత్రి పాలయ్యాడు. మార్చి23న సస్పెండయ్యాడు. ఆ కథకన్నా ముందు గతంలోని కొన్ని సంఘటనలు. 

1979లో గుంటూరు మెడికల్ కాలేజీలో ఉన్న దళిత మెడికోలకు, ఎస్ఎఫ్ఐలోని అగ్రకుల మెడికోలకు గొడవ జరిగింది. ఆ గొడవలో రాడికల్ విద్యార్థులు (మెడికోలు) ఎవరికి మద్దతు తెలపాలనే సమస్య వచ్చింది. ఆ దళిత విద్యార్థులు ఏ వామపక్ష సంఘాల్లో లేరు. అప్పుడు కొండపల్లి సీతారామయ్యగారు రాడికల్ విద్యార్థి సంఘానికి ఒక సాధారణ సూత్రం చెప్పారు. 'ఎప్పుడూ పైకి కనపడే సంఘటన, సందర్భాలకన్నా, ఆ సంఘటనల వెనక ఉండే సామాజిక కారణాల్లోకి వెళ్తే, దౌర్జన్యం చేసి కూడా కప్పి పుచ్చుకునే అవకాశం అగ్రవర్ణాలకే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దౌర్జన్యాలు చేసే అవకాశం, అవసరం తక్కువ ఉన్న దళితులకే రాడికల్స్ మద్దతుండాలి'. 

ఈ ప్రపంచంలో అత్యాచారం చేసే అవకాశం స్త్రీలకు లేనట్లే, అన్యాయం దౌర్జన్యం చేసే అవకాశం దళితులకు లేదు. ఉదాహరణగా ఒక సారి ప్రభుత్వాధికారుల్లో లంచాల సమ స్య చర్చకొచ్చింది. నా మిత్రుడొకరు ఆర్ అండ్‌బిలో ఇంజనీరు. ఒక 'పని' చేసిపెట్టి నందుకు ఒకే ర్యాంకులో ఉన్న ఇద్దరు ఇంజనీర్లకు ఒక కాంట్రాక్టరు ఒక లక్ష (నా మిత్రుడికి), ఇంకొక ఇంజనీరుకు (అగ్రకుల ఇంజనీర్‌కు) ఐదులక్షలు ఇచ్చాడట. ఇదెక్కడి 'అన్యాయం' అండీ. ఆ ఇంజనీరు కన్నా నేనే ఎక్కువ కష్టపడ్డా ఆ కాంట్రాక్టర్ బిల్లు కొరకు అన్నాడు. నేనన్నాను. సాంఘిక గణితశాస్త్రం ప్రకారం నీకు లెక్క ప్రకారమే ముట్టింది లంచం. ఎందుకంటే 'లంచం' అయినంత మాత్రాన, నీవు పంచముడన్న వాస్తవంమరిస్తే ఎలా అన్నాను. పాపం ఇంకేం మాట్లాడలేదతను. 

1980లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో దళిత-వామపక్ష విద్యార్థుల ఐక్యతతో విద్యార్థి ఉద్యమాలు ఉన్నత దశలో ఉన్నాయి. అప్పటి వరకు రైటి స్ట్‌ల కంట్రోల్లో ఉన్న మెడికల్ కాలేజీ 1978 నుంచి మా చేతిల్లోకి వచ్చింది. మమ్మల్ని తమ శక్తివంచన లేకుండా అణచివేయటానికి కొంతమంది ప్రొఫెసర్లు (పి.ఎస్.రెడ్డి, వాఘ్రే తదితరులు), ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు. అంతేకాదు కొంతమంది నన్ను చంపటానికి సికింద్రాబాద్ గూండాలను పురమాయించారు. వాళ్ల కుట్రలు సాగలేదు. అదే సమయంలో మా విద్యార్థి ఉద్యమాలపట్ల సానుభూతితో మాకు మద్దతుగా ఉన్న దళిత ప్రొఫెసర్లు నిశ్శబ్దంగా మాకు సహాయపడుతున్నారు. 

ఒకరోజు సాయంత్రం కాలేజి హాస్టల్(ప్రిన్సిపాల్ లాడ్జ్)కు తీసుకుని వెళ్లగా, అక్కడ ఒక అగ్రకుల మెడికో నాయకుడు (లిన్‌పియావో సానుభూతిపరుడు), సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసన్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ అయిన ఒక దళితుణ్ణి కొట్టాలని ఎస్సీ, బీసీ విద్యార్థుల్ని తయారుచేసి మీరు కూడా రేపు 10 గంటలకు రావాలన్నాడు నాతో. కారణం ఏమంటే ఈ ప్రొఫెసర్ కొంతమంది దళిత విద్యార్థుల్ని ఫెయిల్ చేశాడట. ఫెయిల్ అయిన ఆ విద్యార్థులు క్రానిక్ రిఫర్డ్స్. ఆవారాగా తిరిగేవాళ్లు. అటువంటప్పుడు విద్యార్థి ఉద్యమాల్ని అణచివేస్తూ, ఉద్యమాల్లో పనిచేసే విద్యార్థుల్ని బెదిరించే ప్రొఫెసర్స్ అయిన పిఎస్ రెడ్డి లాంటి వాళ్లను మొదట టార్గెట్ చేద్దామన్నాను. 

పిఎస్ రెడ్డి లాంటి వాళ్లను కొడితే రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది. 'మొదట తేలికపాటి టార్గెట్‌ను ఎంచుకుంటే స్టూడెంట్స్‌కు కూడా ట్రైనింగ్ అవుతుంది' అన్నాడా విద్యార్థి నాయకుడు. 'సరే అని చెప్పి ఆ రాత్రి ప్రొఫెసర్ జి.ఎ. ఇంటికి కబురుపెట్టాను. మూడు రోజులు లీవ్ పెట్టమని'. నాలుగో రోజు నలుగురు విద్యార్థులతో నిజనిర్ధారణ కమిటీ వేసి ప్రొఫెసర్ జి.ఎ. దగ్గరికెళ్లి విచారించగా ఆయన పరీక్ష చేసిన విద్యార్థులెవరూ ఫెయిల్ కాలేదు. వేరే ప్రొఫెసర్స్ ఫెయిల్ చేశారు. సారీ చెప్పి వచ్చాము. 

2000 సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండలాధికారిగా దళితుడైన ఐ.భూషణం వచ్చారు. ఆయనకు ఆ మండలంలోని ఒక వామపక్ష పార్టీ ఏదో పనిచేబితే చేయలేదు. అందుకుగాను ఆ వామపక్ష పార్టీలోని ఒక దళితుణ్ణి ఆ మండలాధికారి మీదకు ఉసిగొల్పి నిరాహార దీక్ష టెంట్ వేయించారు. 1985లో కారంచేడులో అగ్రకుల భూస్వాములు మాదిగల్ని నరికి చంపారు. అప్పుడు అధికారంలో ఉన్న టిడిపిలో మంత్రి అయిన రాజయ్యను రాయభారం పంపింది ఆ పార్టీ. 1991లో చుండూరులో అగ్రకులాలు మాలల్ని నరికారు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గుడిసెల వెంకటస్వామిని రాయబారం పంపింది. 

రాజయ్య - మాదిగ, వెంకటస్వామి - మాల. కుల సమీకరణ సరిపోయింది. 2009-10లో టిఆర్ఎస్ నాయకుడు ఖమ్మంలో నిరాహార దీక్ష విరమించుకున్నప్పుడు తెలంగాణలోని యూనివర్సిటీ విద్యార్థులు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని బతికించారు. ఆ ఉద్యమాన్ని చీల్చి, నిర్వీర్యం చేయటానికి సమర్థులైన ఇద్దరు దళిత పోలీసు అధికార్లను టిఆర్ఎస్ + కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకుల్ని కులం పేరుతో చేరదీసి, ఆ విద్యార్థి ఉద్యమాన్ని చీల్చింది. 

ఫిబ్రవరి 28న 11 కార్మిక సంఘాల నాయకత్వాన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా, వామపక్షాలు ఆర్గనైజ్డ్‌గా ఉన్న ఖమ్మంలో 'సమ్మె' జయప్రదమైంది. ఇది విద్యార్థుల ఉద్యమాల కొరకు విద్యార్థులు పాల్గొనే సమ్మె కాదు. పైపెచ్చు అది పరీక్షల సమయం. వారం రోజుల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం, కలవారి విద్యార్థులు రోజూ 15-18 గంటలపాటు కష్టపడుతున్న సమయం. ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు కూడా తాము బాధ్యత వహిస్తున్న ఇంటర్ విద్యార్థుల రిజల్ట్స్ మెరుగుపర్చాలనే ఉద్దేశ్యంతో కాలేజీ నడుపుతున్నారు. ఈ ప్రిన్సిపాల్ రాకముందు 2010లో 22 శాతంగా ఉన్న పరీక్షా ఫలితాలు 2011లో 45 శాతానికి పెరిగాయి. 

ఫిబ్రవరి 28న సమ్మె రోజు వామపక్ష పార్టీల విద్యార్థి నాయకులు కాలేజీ విద్యార్థుల్ని బయటకు పంపమనటాన్ని వ్యతిరేకించిన ప్రిన్సిపాల్, స్టాఫ్‌తో గొడవపడి ఫర్నిచర్ ధ్వంసం చేసారు. ప్రిన్సిపాల్ తన బాధ్యతగా పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు విద్యార్థులపై కేసులు బుక్ చేసారు. అందుకు ప్రతిగా అప్పటివరకు ఎజెండాలో లేని 'విద్యార్థినిలను ప్రిన్సిపాల్ లైంగికంగా వేధిస్తున్నట్లు' ప్రిన్సిపాల్‌పై 17 మంది అమ్మాయిల చేత కేసు పెట్టించారు. ఈ కేసు వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయి. కాలేజీలో విద్యార్థినుల హాజరు శాతం తగ్గుతున్నందున కొంతమంది విద్యార్థినులకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హాల్ టిక్కెట్లు ఇవ్వలేదు. 

అందువల్ల కొన్నిచోట్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం కూడా మీడియాలో చూస్తున్నాం. ఫిబ్రవరి 27న ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ప్రిన్సిపాల్‌ను కలిసి హాజరు శాతం తక్కువ ఉన్న విద్యార్థినుల హాల్‌టిక్కెట్స్ అడగటం, ప్రిన్సిపాల్ తన పరిధిలో లేదని చెప్పటం అక్కడ వాగ్వివాదం జరగటం జరిగిపోయాయి. మరుసటి రోజు గొడవ చేద్దామనే ఆ విద్యార్థి నాయకులు కాలేజీకి వచ్చి రెచ్చిపోయి ఫర్నిచర్ ధ్వంసం చేయటం, ప్రిన్సిపాల్ కేసు పెట్టడం అయిన చాలా సేపటికి 'విద్యార్థినులను లైంగికంగా వేధించా'డనే విషయం, 27న లేనిది పోలీసు కేసు అయిన తర్వాత ఎలా వచ్చింది? ఒకవేళ ప్రిన్సిపాల్ బీసీ కులస్తుడైతే లైంగిక వేధింపులతోపాటు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చేత ఎట్రాసిటీ కేసు కూడా పెట్టించేవారు కాదా ఈ నాయకులు? 

ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టాన్ని నిజంగా దుర్వినియోగపరుస్తుంది అవకాశవాద అగ్రవర్ణ రాజకీయ నాయకులే. అందుకు తాజా ఉదాహరణ ఖమ్మం పట్టణంలో అగ్రకులానికి చెందిన ఒక కార్డియాలజిస్ట్, హాస్పిటల్ బిల్డింగ్ యజమానికి మధ్య హాస్పిటల్‌ను ఖాళీ చేయించే విషయంలో జరిగిన గొడవ. ఆ కార్డియాలజిస్ట్ ఖాళీ చేయటానికి కొంత గడువు కావాలని కోర్టుకెళ్లాడు. కోర్టులో కేసు వాపస్ తీసుకోమని బెదిరిస్తూ, ఆ బిల్డింగ్ యజమాని ఒక రాజకీయ నాయకుడి సహాయం కోరాడు. ఆ రాజకీయ నాయకుడు తన దగ్గర పనిచేస్తున్న ఒక ఎస్సీ కుర్రవాడిని ఒక రాత్రి ఆ డాక్టర్ దగ్గరకు పేషెంట్ రూపంలో పంపి, అలజడి చేసి, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టించారు. 

ఈ డాక్టర్ ఐఎంఏలో సభ్యుడు. తన మీద అన్యాయంగా బనాయించిన కేసు విషయం సహాయం కొరకు ఐఎంఏ సహాయం కోరాడు. ఐఎంఏ ఏం చేయగలం? అన్నది. అప్పుడు నేనన్నాను. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టాన్ని ఈ విధంగా దుర్వినియోగం కానివ్వను. నేను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానన్నాను. చివరకు ఆ డాక్టర్, బిల్డింగ్ యజమాని, రాజకీయ నాయకుడు ఒకే అగ్రకులానికి చెందినవారు కాబట్టి రాజీపడ్డారు. 

భారత ప్రభుత్వ నేర నమోదు శాఖ రిపోర్టు ప్రకారం పెరుగుతున్న నేరాల్ని దృష్టిలో పెట్టుకుంటే రాజకీయ ఒత్తిడితోగాని, అధికార బలంతోగాని, కండబలంతోగాని పోలీసు స్టేషన్లో రికార్డుకాని కేసుల సంఖ్య తక్కువేమీ కాదు. ఎట్రాసిటీ కేసుల్లో లైంగిక వేధింపుల కేసుల్లో, అత్యాచారాల కేసుల్లో నేరస్థులు ఎవరు? జవాబు చాలా స్పష్టం. అగ్రవర్ణాల పురుషులు. 1998లో ఖమ్మం జిల్లా, నాయకన్ గూడెం గ్రామ దళిత కాలనీలో ఒక రాత్రి 11 గంటల వరకు మీటింగ్ నడుస్తుంది. అందరూ దళితులే. ఆ మీటింగ్‌లో అంతకు ముందే జరిగిన ఒక అత్యాచారం కేసు విషయంలో చర్చ జరుగుతుండగా, నేనొక ప్రశ్న వేశాను. 

ఆ మీటింగులో ఉన్న దళితులకు, అత్యాచారాలు, దళిత, గిరిజనుల ఆడవాళ్ల మీదే ఎందుకు జరుగుతున్నాయి అన్నాను. 'మేం పేదలం మాకు దిక్కు లేదు' అన్నారు. మరి కమ్యూనిస్టుల ప్రకారం అగ్రవర్ణాల్లో కూడా పేదలున్నారు కదా! అగ్రకులాల స్త్రీల మీద అత్యాచారాలు ఎందుకు జరగటం లేదు? (ఈ మధ్యనే డిజిపిగారన్నట్లు) దళిత స్త్రీలు అగ్రవర్ణాల పురుషుల్ని రెచ్చగొట్టే డ్రస్సులు వేసుకుంటున్నారా? లేక దళితుల స్త్రీలు అగ్రకుల స్త్రీల కన్నా అందంగా ఉంటారా? లేక దళిత మగవాళ్లు నపుంసకులా అన్నాను. చివరగా మీ సమాజాన్ని, మీ ఆడబిడ్డల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే తెగింపు ఒక్కటే మార్గమని సభ ముగించాం. 

పురాణాల్లో పరుశురాముడు తన తల్లి శిరస్సు నరికాడట తండ్రి ఆజ్ఞ ప్రకారం. బిజెపి నుంచి మొదలుకొని విప్లవపార్టీల్లో పనిచేస్తున్న దళిత, బహుజన రాజకీయ కార్యకర్తలకు నా విజ్ఞప్తి ఏమంటే మీ పార్టీల్లోని అగ్రవర్ణాల దాష్టీకాన్ని ప్రదర్శించటానికి మమ్మల్ని దారికి తెచ్చుకోవటానికి ఇప్పుడిప్పుడే చదువుల్లో ఉద్యోగాల్లో నిలదొక్కుకుంటున్న మమ్మల్ని టార్గెట్ చేయకండి. ఆ పనిచేయటానికి ఎలాగు అగ్రకుల ప్రభుత్వ యంత్రాంగమున్నది. మీకు చేతనైతే దళితులకు అండగా ఉండండి. చేతకాకపోతే దళితులకు దూరంగా ఉండండి. 

- డా.ఎం.ఎఫ్.గోపీనాథ్,
మేనేజింగ్ డైరెక్టర్, ఫూలే, అంబేద్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్
Andhra Jyothi News Paper Dated : 3/4/2012 

No comments:

Post a Comment