తెలుగు సూర్యుడుగా పేరు గడించిన తెల్లదొర సిపి బ్రౌన్ స్మృతి చిహ్నంగా కడపలో నిర్మించిన బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని చూసేందుకు సామాన్య పాఠకులు, పరిశోధకులే కాక సాహిత్యాభిమానులైన ఉన్నతాధికారులు కూడా వస్తుంటారు. వారు బ్రౌన్ పట్ల ఎంతో గౌరవభావం కలిగినవారు. 1993 డిసెంబర్ 21న పుస్తక ప్రేమి అయిన ఒక ఐఎస్ అధికారి, అతనితోపాటు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కెఎస్ఆర్ మూర్తి బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఆ సంస్థ కార్యదర్శిగా వారికి గ్రంథాలయంలోని కొన్ని అరుదైన పుస్తకాలను, ప్రముఖుల రాత ప్రతులను చూపాను. అభినందనలందుకొన్నాను. వారు కొంతకాలం నెల్లూరు జిల్లా కలెక్టరుగా సంచలనాత్మక నిర్ణయాలకు, ప్రజాహిత పనులకు పేరు గాంచిన వారని తెలుసుకొన్నాను. ఆయన చాల నిరాడంబరుడు. ఏది పాలన అంటే, నిరుపేదల ఆలన పాలన అని నిరూపించిన అరుదైన ఐ ఏ ఎస్ అధికారి యస్. ఆర్. శంకరన్.
తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని సరిగళత్తూర్ గ్రామంలో 1934 అకోటబర్ 22న మధ్యతరగతి కుటుంబంలో శంకరన్ జన్మించారు. 1957 ఐఎఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ప్రజల మన్ననలతో పాటు ప్రభుత్వ యంత్రాంగంలోని ప్రధాన అధికారుల, మంత్రుల ఆదరాభిమానాలను అందుకొన్న అరుదైన అధికారి శంకరన్. ప్రజల కలెక్టర్‌గా పేరు గాంచిన ఆయన నెలలో సగం రోజులు ప్రజల్లోకి వెళ్లి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితాలందుతున్నాయో లేదో కనుగొని, వారి తృప్తిని గమనించిన 'సంక్షేమ భాస్కరుడు' శంకరన్. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా, బడుగు వర్గాలవారు గిరిజనులు, దళితులు మున్నగు అడుగు వర్గాల వారు సుఖసంతోషాలతో జీవించాలనీ ఉదాత్త ఆశయం కలవాడు. జోగినీ వ్యవస్థ నిర్మూలన కోసం ప్రత్యేకంగా చట్టం చేయించడం, సూవర్టుపురం మాజీ నేరస్థులకు పునరావాసం కల్పించుటలో శంకరన్ కృషి చిరస్మరణీయం. బ్రాహ్మణుడుగా పుట్టినా, బ్రాహ్మణీకంలోని ఛాందసత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించి మానవులందరూ సమానులేనని, మాటల్లో కాక, చేతల్లో చూపిన కార్యశీలి శంకరన్.
ప్రభుత్వ వాహనాలను, స్వంత పనులకు వినియోగించటం ఏ మాత్రం సహించని నిజాయితీపరుడు. నెల్లూరు కలెక్టర్‌గా వున్నప్పుడు, నెల్లూరు పట్టణంలోని మార్కెట్ వద్ద ప్రభుత్వ వాహనాలుండటం ఆయన గమనించారు. తమ వెంటనున్న బంట్రోతు ద్వారా, ప్రభుత్వ వాహనాల డ్రైవర్లను పిలిపించారు. ఇక్కడ వాహనాలెందుకున్నాయని ప్రశ్నించారు. అధికారుల భార్యలు మార్కెట్‌కు వచ్చారని చెప్పారు. వెంటనే ఆ వాహనాలను కలెక్టర్ ఆఫీసుకు చేర్చమని ఆదేశించారు.కలెక్టర్ బంగళా చాల విశాలంగా వుండేది. మహిళా కళాశాలకు తగిన వసతులు లేవని తెలుసుకొని ఆ బంగళాను ప్రభుత్వ మహిళా కళాశాలకు ఇచ్చివేశారు. తోటి అధికారి ఒకరు 'ఇదేం సార్' అని అడిగినపుడు, 'ఇంత పెద్ద బంగళా ఒక్కరి నివాస స్థానమే కావడం అన్యాయం కదా? అన్న ఉదార చరితుడు శంకరన్.
ఆయన వ్యక్తిగత జీవితం ఆశ్చర్యకరం. అరచేతుల దాకా చొక్కా, మామూలు ప్యాంట్, కాళ్లకు సాదా చెప్పులు. బిళ్ల బంట్రోతు లేకపోతే ఆయనను కలెక్టరుగా తెలుసుకోవటం కష్టం. ప్రజలు ఆయనను, ఐఎఎస్ గాంధి అనేవారు. సిబిఎస్ వెంకటరమణ, ఐఎఎస్ అధికారి. తన వ్యక్తిగత పనుల కారణంగా గుంటూరు వెళ్లి, తెలిసిన వారింట్లో వున్నపుడు, ఒక గ్రామీణ వ్యక్తి శంకరన్ గురించి చెబుతూ ఆయన 'ఒక రుషి' అన్నాడు.అధికారికంగా ఏ హోదాలో ఉన్నా శంకరన్ తనదైన ముద్ర వేసేవారు 1957లో ఐఎఎస్ ఉద్యోగిగా చేరిన నాటి నుంచి 1992లో పదవీ విరమణ చేసేవరకు సామాన్య ప్రజల హక్కులు ఎస్ఎస్‌టి కమీషన్, అటవీ హక్కుల కమీషన్ మొదలగు సంస్థల కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. నిరంతరం బడుగుల సంక్షేమాన్ని గురించి ఆలోచించేవారు.
శంకరన్ త్రిపుర రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వెళ్లారు. విమానం దిగి, ఒక రిక్షా మాట్లాడుకొని సర్క్యూట్ హౌస్ చేరారు. శంకరన్ గారికి స్వాగతం చెప్పడానికి ఎప్పుడో వచ్చిన అధికారులు శంకరన్ గారిని గుర్తించనందుకు తమ పొరపాటును మన్నించమన్నారు.నక్సలైట్లతో ప్రభుత్వం చర్చలు జరుపునట్లు కృషి చేశారు. ఒకమారు నక్సలైట్లచే కిడ్నాప్ కావడం జరిగింది. వారు శంకరన్ సేవలను విని సగౌరవంగా వారి నివాసానికి చేర్చారు.ఆయనకు సొంత ఇల్లు లేదు. అద్దె ఇల్లు కూడా అవసరాలకు తగినంతగా చిన్నది.
నేల మీద చాప పరచుకొని ఆఫీసు ఫైళ్లను చకచకా పరిశీలించేవారు. జీవితాంతం బ్రహ్మచారిగానే వుండేవారు.కవి, రచయిత కోయి కోటేశ్వరరావు శంకరన్ గురించి మాట్లాడుతూ 'జీ.వో.ల్లో నిదురపోతున్న సంక్షేమాన్ని జీవితాల్లోకి బట్వాడా చేసిన అభ్యుదయ పాలనా జ్ఞాని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'పద్మ భూషణ్' ప్రశస్తిని తిరస్కరించిన నిష్కామ జీవి శంకరన్. బడుగు వర్గాల ప్రజల గుండెల లబ్‌డబ్ ధ్వనుల్ని జీవితాంతం పరిశీలించిన వారు శంకరన్' అని కొనియాడారు. శ్రీశైలం దేవస్థానం దర్శనం చేసుకొని వచ్చిన శంకరన్‌ను మిత్రులు దేవుని ఏమని వేడుకొన్నారు అని ప్రశ్నించినపుడు బీద ప్రజలను చల్లగా చూడమని వేడుకొన్నాను అన్నారు.బ్రతికినంత కాలం ప్రజా సంక్షేమానికి అంకితమైన శంకరన్ 2010 అక్టోబర్ 7న కాలగతి చెందారు.
- జానమద్ది హనుమచ్ఛాస్త్రి
(నేడు శంకరన్ జయంతి)
Andhra Jyothi Telugu News Paper Dated: 22/10/2013
No comments:
Post a Comment