August 5, 2013
విశ్వశ్రేయః కావ్యం’ అని సంస్కత నానుడి. మధ్యయుగపు సాహిత్యం రాజుల పోషణలో పెరిగి పెద్దదయింది. అయితే ఆ సాహిత్యం రాజులను, వారి నాయికలను కీర్తించడమే పనిగా సాగింది. కాలక్రమంలో అనేక వాద వివాదాల అనంతరం ‘కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం’ అనే నినాదం ఊపందుకుంది. ప్రజల పక్షం వహించేదే నిజమైన సాహిత్యం. మానవ సంబంధాలు, మానవ విలువలు, వారి అంతులేని కోరికల్ని వ్యక్తపరిచే సాహిత్యమే నేటి వరకు సృష్టి అయ్యింది. కానీ, భారతదేశంలో కులం ప్రభావం పడని సిద్ధాంతం కానీ, ఉద్యమం కానీ నేటి వరకు లేదు. ఈ క్రమంలో స్వాతంత్య్రంకన్నా పూర్వమే వెలువడిన అభ్యుదయ సాహిత్యంలో వర్గదృష్టి కోణంతో అభ్యుదయ కవులు సమాజంలోని అసమానతల్ని రూపుమాపి నవసమాజాన్ని నిర్మించే ఒక కల కన్నారు. దళిత, పీడిత, బాధిత ప్రజల పక్షం వహించి దోపిడీ పూరితమైన వ్యవస్థని వ్యతిరేకించే పనిని వీళ్ళు కొనసాగించారు. కానీ ఈ ఉద్యమానికి కొన్ని పరిమితులున్నాయి.
అన్ని సమస్యలకి ఒకే పరిష్కారాన్ని సూచించే క్రమంలో అభ్యుదయ కవిత్వం ప్రయాణించింది. కనుక భారతీయ పెట్టుబడిదారీ వ్యవస్థలో దళితులపై కుల పరంగా జరుగుతున్న అంతులేని అమానవీయ అత్యాచారాలకి, దోపిడీకి గల మూలకారణాల్ని కనుక్కోవడంలో ఈ కవులు విఫలమయ్యారు. నేటికీ రాజ్యాన్ని, దాని వెనుకనున్న కులవ్యవస్థని వ్యతిరేకించే బలమైన గొంతులు వినిపిస్తున్నాయంటే- అవి ఖచ్చితంగా దళిత బహుజనులవే! ఎవరైతే అసమానతల నిచ్చెన మెట్ల కులవ్యవస్థను నిర్మించారో వారే దానిపోషణకి దర్శనాలు, శాస్త్రాలు, పురాణాలు, చరిత్రలలో సృష్టించారు.స్వాతంత్య్రానంతర తెలుగు- హిందీ కవిత్వంలో దళితుల మూలాలు, అస్తిత్వాన్ని వెదుక్కొనే కవిత్వం వెలువడింది. ఈ కవిత్వం సామాజిక జీవితంలోని ఘోరమైన అమానవీయతని అక్షరబద్ధం చేసింది. ఈ కవిత్వం ‘మానవ విముక్తి’ కవిత్వం. ఈ కవిత్వం అకస్మాత్తుగా ఊడిపడింది కాదు.
అవసరంలోంచి, అనుభవంలోంచి వచ్చింది. దీనిలోని ప్రతి అక్షరం దళితుల రక్తం, చెమటతో తడిసి అభివ్యక్తికి ఒక సార్ధకతని, బలాన్ని, వ్యవహారికతని ప్రసాదించింది. భారతీయ సాహిత్యంలో మొదటిసారిగా దళితసాహిత్యానికి స్థానం కల్పించింది మరాఠీ దళిత రచయితలు.
తెలుగు దళిత సాహిత్యంతెలుగులో దళిత కవిత్వానికి ఆద్యుడు జాషువా. ఆయన రాసిన ‘గబ్బిలం’ తొలి తెలుగు దళిత కావ్యం. తరువాత జాలా రంగకవి, కుసుమ ధర్మన్న, బోయి భీమన్న, జ్ఞానానంద కవి దళిత కవిత్వం వ్రాశారు. తెలుగులో దళిత సాహిత్యోద్యమం కొత్త దళిత కవులను, పాఠకులను అందించింది. 1980ల తర్వాత తెలుగు సాహిత్యంలో దళిత స్పహ బలంగా వేళ్ళూనుకొని నేడు తెలుగు సాహిత్యంలో ప్రధాన స్రవంతి అయింది. సంకలనాల కెక్కని వందలాదిమంది దళిత కవులు, దళిత కవిత్వాన్ని ఒక చారిత్రక అవసరంగా రాస్తున్నారు. దళిత కవిత్వంలో విశేషాంశం- చరిత్రను అధ్యయనంచేసి అందులోని లోటును ఎత్తిచూపుతూ కవిత్వం రాయడం. హిందూమతం అతి పవిత్రంగా చూసుకునే మనుధర్మం, వేదాలు- అవి నిర్మించిన వృత్తి కులాల నుండి వర్ణవ్యవస్థ ఆవిర్భావం- వీటన్నింటిలో ఉన్న చారిత్రక కుట్రని దళిత కవి బట్టబయలు చేస్తున్నాడు.
నిశాని, బహువచనం, చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట, గుండెడప్పు, మాదిగ చైతన్యం, జిహాద్, మేమే చిత్తరువు, దండోరా వంటి కవితా సంకలనాలు, బొజ్జాతారకం - నది పుట్టిన గొంతుక; శిఖామణి- కిర్రు చెప్పుల భాష; ఎండ్లూరి సుధాకర్- వర్తమానం, వర్గీకరణీయం; సతీష్‌చందర్- పంచమ వేదం, ఆదిపర్వం; జూలూరి గౌరీశంకర్- పాదముద్ర, పొలికట్టె, మాలకాకి; చిన్ని- వొళ్ళు కడుక్కొందాం రండి; మద్దూరి నగేష్‌బాబు- వెలివాడ, రచ్చబండ; కత్తిపద్మారావు- నల్లకలువ, కట్టెలమోపు, భూమిభాష; సుంకర రమేష్ - తల్లికోడి హెచ్చరిక; ఖాదర్ మొహియుద్దీన్- పట్టుమచ్చ; నాగప్పగారి సుందరరాజు- చంఢాల చాటింపు; పైడి తెరేష్‌బాబు- అల్పపీడనం, హిందూమహాసముద్రం, నేనూ నా వింతలమారి ప్రపంచం; జి.వి. రత్నాకర్- మట్టిపలక, అట్లేటి అల; చల్లపల్లి స్వరూపరాణి- మంకెనపూవు; గూటం స్వామి- ఏకీకరణీయం, నల్లతుమ్మ కవితా సంపుటాలు వచ్చాయి. గుండెడప్పు కనకయ్య- కడుపుమీద కొట్టకుండ్రి, దార్ల వెంకటేశ్వరరావు- దళిత తాత్త్వికుడు; కోయి కోటేశ్వరరావు, వినోదిని, గోగు శ్యామల, జల్లి ఇందిర, జూపాక సుభద్ర, జిలకర శ్రీనివాస్- వంటి అనేకమంది దళిత కవిత్వం వ్రాశారు.
హిందీ దళిత కవిత్వం
హిందీ దళితకవులు- ఓం ప్రకాష్ వాల్మీకి, ఓం ప్రకాష్ మెహరా, వీరాపరమార్, రమణికాగుప్త, హేమంత్ ప్రసాద్ దీక్షిత్ రామ్‌లఖన్ పాల్, డా యన్. సింగ్, దయానంద్ బటోహి, కంవల్ భారతి, జయప్రకాష్ కర్దమ్, సూరజ్‌పాల్, డా ప్రేమ్ శంకర్, సూరజ్‌పాల్ చౌహాన్, ఠాకూర్ వాస్ సిద్ద్, కుసుమ్ మేఘవాల్, భగీరధ మేఘవాల్, ఎన్.ఆర్. సాగర్, సి.వి. భారతి, రామ్‌భరత్ పాసీ, నిశాంత్ శరద్ కోకాస్, రవీంద్రభారతి, మోహన్‌దాస్ నైమిశ్‌రాయ్, లాల్‌చందరాహే- దళిత కవిత్వాన్ని సష్టించారు. ఓంప్రకాష్ వాల్మీకి- నదియోంకా సంతాప్, బస్స్ బహుత్ హో చుకా, జయప్రకాష్- కర్దమ్- మైం గూంగా నహీథా, సుశీలాటాక్ భౌరే- హమారే హిస్సేకా సూరజ్ పేర్కొనదగిన కవితా సంపుటాలు. యుద్ధరత్ ఆమ్ ఆద్మీకా దళిత్ చేతన పేరుతో రమణికాగుప్త ప్రచురించిన కవితా సంకలనం అమూల్యమైనది.అంబేడ్కర్ ‘పులుల్లాగా బ్రతకండి. మేకల్లా బ్రతికారంటే పులులు మిమ్మల్నే తినేస్తాయి’ అని అంటారు.
‘తరతరాలుగా ఎవరైతే అంటరానితనానికి, అవమానాలకి గురై బ్రతుకుతున్నారో వాళ్ళే దళితులు’ అని సిద్ధాంతీకరించారు. దళిత అంటే- అణచివేతకు గురైన, అణగదొక్కిన, చీల్చిన అని అర్థం. దళిత సాహిత్యం ‘దళితుల విముక్తికోసం దళిత రచయితలద్వారా దళితుల గురించి రాసిన సాహిత్యం’ అని ప్రసిద్ధ హిందీ సిద్ధాంతకారుడు గజానన్ చాహ్వాన్ తెలియపరచారు.
దళిత సాహిత్యం శక్తి ‘కళ కాదు సత్యం’, దళిత సాహిత్యం దళితుల కోసమే కాదు సమాజం మొత్తం కోసం. దళిత, దళితేతర విప్లవవాద కవుల లక్ష్యం ఒకటే- దళిత కవులు కులవ్యవస్థని అంతం చేయాలనుకుంటారు, విప్లవవాద కవులు వర్గాన్ని అంతం చేయాలనుకుంటారు.
తెలుగు, హిందీ కవిత్వ ప్రస్థానం
కుల నిర్మూలన, అంటరానితనాన్ని తొలగించడం, పీడితుల్లోని కులభేదాల నివారణ, సామాజిక విప్లవంకోసం పీడిత వర్గాలమధ్య ఉన్న అంతరాల్ని తొలగించడం, దళితులకు నాగరిత, పౌరహక్కులు సాధించడం మొదలైనవి దళిత ఉద్యమ కర్తవ్యాలుగా ఆంధ్రప్రాంతంలో దళిత మహాసభ మొదలైంది. ఇదేవిధంగా భారతదేశంలో జ్యోతిబా ఫూలే, అంబేడ్కర్ జీవనపోరాటాల ఫలితంగా దళిత, బహుజన చైతన్యం ఆవిర్భవించింది. వీరి ఆత్మాభిమాన పోరాటం రాజ్యాధికారం వైపు సాగుతోంది. స్వయంగా తాము అనుభవిస్తున్న బాధల్ని దుఃఖాన్ని అభివ్యక్తీకరించేందుకు ఆరాటప డుతుతోంది. తెలుగు దళిత కవి కలేకూరి ప్రసాద్ ‘పిడికెడు ఆత్మగౌరవం’ కవితలో- ‘తరతరాలుగా/ స్వతంత్ర దేశంలో/ అస్వతంత్రుణ్ణి/ అవమానాలకూ/ అత్యాచారాలకు/ మానభంగాలకూ/ చిత్రహింసలకు గురై/ పిడికెడు ఆత్మగౌరవం కోసం/ తలెత్తిన వాణ్ణి’ (చిక్కనవుతున్న పాట).మార్క్‌స, అంబేడ్కర్ ఆలోచనా విధానంలో తేడాలు మనకి కనిపిస్తాయి.
కులవృత్తులను బట్టే కులాలు వచ్చాయి అని మార్క్సిజం చెప్తుంటే, అసలు కులవ్యవస్థపైనే శ్రమ విభజన జరిగింది అని అంబేడ్కరిజం చెప్తుంది. ప్రముఖ హిందీ దళిత కవి ఓం ప్రకాష్ మెహరా ‘ఆకాశం’ కవితలో- ‘నీ అంత ఎత్తు ఎదుగుతానని అనలేదు/ నువ్వు నాకు కావాలి అని అనలేదు/ ఓమూల తల దాచుకునేందుకు ఇంటికప్పును అడిగాను/ నీ గొప్పదనాన్ని అడగలేదు గుండె ధైర్యాన్ని అడగలేదు/ విశాలమైన నీ వల్లకాటిని అడగలేదు/ నన్ను పాతుకొనేందుకు రెండు గజాల నేలని అడిగాను’. ‘ఓ ఆకశమా! ఓ నేలా! ఓ గాలీ! ఓ పైరూ/ ఓ సీతాకోకచిలుకా/ మిమ్మల్ని నిలేసి అడుగుతున్నాను/ నా అవసరాలకి తగినట్లు నేల/ ఊపిరి నిలుపుకొనే గాలి, తాగేందుకు నీళ్ళు/ కొంచెం రంగు నా బతుకులో ఎందుకు కోరుకోకూడదు’ (యుద్ధ్ రత్ ఆమ్ ఆద్మీకా దళిత్ చేతన).
‘ఇనుప పాళీలు మొలుచుకొస్తున్నాయి’ కవితలో శిఖామణి ఇలా అంటున్నారు-‘ నేర్పని విద్యకు గురుదక్షిణ కోరిన/ మా బొటనవేళ్ళ స్ధానంలో ఇనుప పాళీలు మొలుచుకొస్తున్నాయి/ అవి చరిత్రను తప్పక తిరగ రాస్తాయి’ (పదునెక్కిన పాట). దళిత చైతన్యంలో భాగంగా దళితులు ప్రశ్నించడం మొదలైంది. తెలుగు దళితకవి జి.వి. రత్నాకర్ ‘మాలో పుట్టాల్సిందే’ కవితలో...‘నీవెంత ఉదార సంద్రానివైనా/ నేను చచ్చి బతికే మురికి కాలవనే/ నీ అరికాళ్ళ దుమ్ము ముఖాన/ పూసుకునే మంగలి కత్తిని/ మట్టిని తడిసిన నా చెమటే/ నీవు తాగే కొత్త కుండన ఒడుస్తుంది/ ఈ దేశపు జండాపై నీవు కార్చిన/ చీము నెత్తుటి మరకల్ని తొలగించి/ ఎర్రదానికి నిండు దనాన్నిచ్చే/ నల్లటి చాకలి బండని/ మా కసి, కోత మీ కర్థం/ కావాలంటే మాలో పుట్టాల్సిందే’ (మట్టిపలక). అదేవిధంగా దళిత చైతన్యంలో భాగంగా ‘నా రోడ్డుమీద కవిత’లో గుండె డప్పు కనకయ్య అగ్రవర్ణ హైందవ భావజాలాన్ని నిలేసి ప్రశ్నిస్తూ -‘ చీకటంట భయపడే మీరు/ అస్తమానం అంధకారంలో జీవించే నాపై/ సిద్ధాంతాల వెలుగులు విరజిమ్మాలని చూస్తారు...... అందుకే నేనింక రోడ్డు వెయ్యదల్చుకోలేదు/ రోడ్డుని బ్లాస్ట్ చెయ్యదల్చుకున్నాను’ (గుండెడప్పు) అంటున్నాడు.
హిందీ దళితకవి ఎన్.ఆర్. సాగర్ మనువాద సంస్కతిని తన ‘నీకప్పుడేమనిపిస్తోంది’ కవితలో ఇలా ప్రశ్నిస్తున్నాడు- ‘ఒళ్ళు కాలే ఎండలో/ కుండపోత వానలో/ పిక్కలు వణికే చలిలో/ ఏ ఆధారం లేని అభయం పొందమంటే/ నీ కప్పుడేమనిపిస్తోంది/ నీ కుట్రకు నిలయమైన/ గుళ్ళు గోపురాలను దుమ్ము ధూళిలో నింపేసి/ నీ ధర్మ గ్రంథాలను కాల్చేస్తే/ నీకప్పుడే మనిపిస్తోంది/ ఊరికి వాడకి దూరంగా/ చెత్తకుప్పల దగ్గర స్మశానాల దగ్గరగా/ నిన్ను కట్టేస్తే నీకేమనిపిస్తుంది’ (యుద్ధరత్ ఆమ్‌ఆద్మీ కా దళిత్‌చేతన). పీడిత కులాలని మనుషులుగా గుర్తించ నిరాకరించింది మనువాదం. చివరికి పిడికెడు మెతుకులు నోచుకోడానికి కూడా నిరాకరిస్తుంది కులవ్యవస్థ. సాంఘిక గౌరవాన్ని నిరాకరించడమే కాకుండా, దళితులు సంపాదించుకునే మార్గాలను కూడా త్రొక్కి పెడుతుంది హిందూ వ్యవస్థ.తెలుగు దళిత కవి కోయి కోటేశ్వరరావు తన ‘నర్తనశాల’ కవితలో ఇలా అంటున్నారు- ‘అందుకే ఇక నేను చావదలుచుకోలేదు.../ పెద్దపులులతోనైనా పెనుగులాడి బతుకుతాను .../ కకావికలమైన నా మాంసపు ముద్దల మీద/ మారణాయుధాల్ని పూయించి/ కామ కీచకుల మగతనాన్ని తెగ నరకటానికి/ ఇప్పుడు నేనే నర్తనశాలకు నడిచివెళతాను...’ (సెంట్రల్ యూనివర్శిటీ కవిత).
చల్లపల్లి స్వరూపరాణి ‘మంకెన పువ్వు’ కవితలో ఇలా అంటున్నారు- ‘ఇంట్లో పురుషాహంకారం/ ఒక చెంప చెళ్ళుమనిపిస్తే/ వీధిలో కులాధిపత్యం/ రెండో చెంప పగలగొడ్తుంది’ (గుండెడప్పు). దీనికి పునాదిగా బుద్ధుని ‘అత్తదీపోభవ’ అనే భావన ‘సత్యాన్ని సత్యంగా తెలుసుకో’ అనే సందేశం ఉంది. ఫూలే చెప్పినట్లుగా ‘బూడిదకి మాత్రమే కాలినప్పటి అనుభవం తెలుస్తుంది’ అనే భావన ‘ఎవరైతే అనుభవిస్తారో వారికే పూర్తి సత్యం తెలుస్తుంది’. ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లే సత్యాన్ని చెప్పగలుగుతారు. అంబేడ్కర్ బోధించిన, బోధించు! పోరాడు!! సమీకరించు!!! అనే చైతన్యం దళిత కవిత్వంలో ఉన్నాయి.ఆర్థికేతర, వర్గేతర అంశాల్ని విప్లవ కవిత్వం పట్టించుకోనట్లే కులమతేతర అంశాల్ని దళిత కవులు పట్టించుకోవడం లేదు.
-తిొొ .ు. టభీశైభథట్గ
Surya Telugu News Paper Dated : 05/08/2013
No comments:
Post a Comment