Monday, August 12, 2013

తెలంగాణలో పౌరహక్కులు By పొఫెసర్ జి. హరగోపాల్


ఈరోజు (11-8-2013)హైదరాబాద్‌లో రెండు సభలు జరుగుతున్నాయి. యాదృచ్ఛికమే కావ చ్చు. ఒకటి- ఆంధ్రవూపదేశ్ పౌరహక్కుల సంఘం 16 వ మహాసభలు, రెండు- నరేంవూదమోడీ వచ్చే ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభ మహాసభ. మోడీ గతంలో ఏ సభకైనా హైదరాబాద్ వచ్చాడేమో తెలియదు, వచ్చినా దానికి అంత ప్రచారం వచ్చి ఉండకపోవచ్చు. గతంలో తెలంగాణలో బీజేపీ ప్రభావం చాలా తక్కువ. దీనికి భిన్నంగా పౌరహక్కుల సంఘం ఒక చారివూతక పాత్రను నిర్వహించింది. పౌరహక్కుల సంఘం తెలియని, వినని తెలుగువారు ఉండరు. తెలంగాణలో ఉద్యమాన్ని అభిమానించిన వారు కోకొల్లలు. బహుశా ప్రపంచంలోనే ఒక ప్రాంతం నుంచి ఎనిమిది, పదిమంది పౌరహక్కుల కోసం ప్రాణాలిచ్చిన వారుండరు. వీరందరూ మధ్యతరగతి గౌరవించే.. డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, స్వాతంత్య్ర సమరయోధులు. ఇందులో గోపి రాజన్నను మతద్వేషపరులే చంపారు. ఈ రోజు స్పష్టంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాజ్యహింసతోపాటు, మతద్వేషా న్ని మతం పేరుమీద లేదా మతం ముసుగులో జరగబోయే హింసను ఎదుర్కోవలసి ఉంటుంది. పౌరహక్కుల ఉద్యమం మరింత క్లిష్ట సమస్యలను ఎదుర్కోబోతుందని ఇవ్వాళ మోడీ సభ స్పష్టంగానే సంకేతాలు ఇస్తున్నది. 

తెలంగాణ చరిత్రే పోరాటాల చరిత్ర. అది విషాదాల చరిత్ర కూడా. ఈ నేపథ్యంలోనే ఒక ప్రజాస్వామ్య ఆకాంక్ష నుంచి పుట్టిన తెలంగాణ ఉద్యమం నుంచి చాలా ఆశలు, ఆశయాలు ముందుకు వచ్చాయి. తెలంగాణ ఏర్పడితే పౌరహక్కులకు, మానవ హక్కులకు విశాలమైన స్పేస్ వస్తుందని మనమందరం ఆశించాలి. కానీ ‘ఇలా అవుతుందని ఎవరనుకున్నారు’? అన్నట్లుగా, మత ఘర్షణలతో కూడిన తెలంగాణ వస్తే ఎంత ప్రమాదం! కేవలం తెలంగాణ అస్తిత్వానికి ఉద్యమం కుంచించబడటం వల్ల, ‘ఎవ్వరు తెలంగాణ ఇచ్చినా పర్వాలేదు, కానీ తెలంగాణ కావాలి’ అనడంలో ‘మోడీ ఎవరు, ఆయన స్వభావం ఏమిటి, ఆయన వెనుక ఏసామాజిక శక్తులు పనిచేస్తున్నాయి, గుజరాత్‌లో ఆయన ఏ విష ప్రయోగం చేశాడు’ అనేవి ఏవీ ప్రశ్నలు కాకపోవడం ఎంత విషాదం.

‘హక్కుల ఉల్లంఘన రాజ్యం చేస్తే దానికి ఎవరు రక్ష’ అనే మౌలిక భావన నుంచి పౌరహక్కుల ఉద్యమాలు పుట్టాయి. కానీ రాజ్యం పౌర సమాజంలోని అసాంఘిక, దుష్టశక్తులను, మాఫియాను, గూండాలను ప్రయోగించి హింస చేస్తే ప్రజలను ఎలా కాపాడాలో పౌరహక్కుల ఉద్యమాలకు అంత అనుభవం లేదు. పౌరహక్కుల కార్యకర్తలనే టార్గెట్ చేసి రౌడీల ద్వారా, మాఫియా ద్వారా దాడులు చేయిస్తే దాన్ని ఎలా ప్రతిఘటించాలన్నది కూడా ఒక పెద్ద సవాలే. ఇక రెండు మతాల మధ్య, రెండు కులాల మధ్య రాజ్యమే వైషమ్యాలు పెంచి, రాజ్యమే హింసను ప్రేరేపిస్తే ఏం చేయాలి అనేది కూడా ఒక ప్రశ్నే. రాజ్యం సమాజంలో హింసను పెంచి ‘ఇద్దరు’ గ్రూపులో ఒకరి మీద ఒకరు దాడులు చేస్తుంటే, అది రాజ్యహింసలో భాగం కాదని, సమాజంలో జరిగే హింసకు రాజ్యాం ఏం చేయగలదు అనే జవాబు చెప్పే స్థాయికి రాజ్యం దిగజారింది.

తెలంగాణ పౌరహక్కులకు, ప్రజా ఉద్యమాలకు, పోరాటాలకు, త్యాగాలకు ఒక పెద్ద ప్రయోగశాల. అలాగే ప్రపంచబ్యాంకుకు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు, పెట్టుబడికి కూడా ప్రయోగశాలే. సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాను అతిమొండిగా అమలుపరిచింది చంద్రబాబునాయుడు. దీంతో వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయం విధ్వంసమైంది. లక్షలాది ఉద్యోగాలను కుదించారు. పేదలకు ఇచ్చే సబ్సిడీలు తగ్గించారు. ఎన్‌కౌంటర్లు, పౌరహక్కుల నాయకులను హత్య చేయడం ఈ ప్రయోగంలో భాగమే. ఈ అభివృద్ధి నమూనా రెండు దళిత కులాల మధ్య తేడాలు వస్తే సామరస్యంగా పరిష్కరించకుండా విద్వేషాలను రెచ్చగొట్టింది.

పేదలకు వ్యతిరేకమైన ఆర్థిక ప్రయోగం జరుపుతున్నప్పుడు దళితుల్లో పోరాటమవసరమైనప్పుడు ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరు మీద దళితుల భూములు లాక్కుంటున్నప్పుడు, వాళ్లను నిర్వాసితులను చేస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఏకమై పోరాడవలసిన దళితులు రెండు వర్గాలుగా చీలిపోవ డం, పరస్పర అవగాహనకు రాకపోవడం ఒక సమస్య అయితే.., ఇలా విభజించి ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడంతో ఈ నమూనాను 2004లో తెలుగు ప్రజలు తిరస్కరించారు. సామ్రాజ్యశక్తుల అనుకూల విధానాల్లో అందెవేసిన చేయి చిదంబరం, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణని చాలా దుర్మార్గంగా, ప్రజావ్యతిరేకంగా ఒక నిర్ణయం తర్వాత మరొక నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. దీని ప్రభావం వెనుకబడిన ప్రాంతమైన తెలంగాణ మీద చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అందుకే సామ్రాజ్యవాదం మన సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణాన్ని పెంచుతున్నది. పాకిస్తాన్‌తో ఏ కారణం వల్ల అయినా యుద్ధవాతావరణం ఏర్పడితే ఆ పరిస్థితిని సాకుగా తీసుకుని పౌరహక్కులను ‘దేశభక్తి’ పేరు మీద అణచివేసిన అనుభవం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ రెండు దేశాలకు మధ్య ఎంత వైషమ్యం పెరిగితే మత తత్వ రాజకీయాలు అంత ఎత్తున ఎగిసిపడతాయి. ముస్లింల మీద ద్వేషాగ్ని పెంచడానికి అంతకన్నా మించిన బంగారు అవకాశం మత ద్వేషవాదులకు ఏముంటుంది?

తెలంగాణ బీజేపీనాయకత్వం కావాలనే పనిగట్టుకొని నరేంవూదమోడీని తీసుకవస్తున్నది. 2014 ఎన్నికలకు తెలంగాణ నుంచి ప్రచారం ప్రారంభం కావడానికి ఈ ప్రాంతంలో రాడికల్ రాజకీయాలున్నాయి. అలాగే గణనీయమైన సంఖ్యలో ముస్లింలు ఉన్నారు. మత రాజకీయాలకు ఇంతకంటే అనువైన ప్రయోగశాల దేశంలో బహుశా ఎక్కడా లేదు. మావోయిస్టుల మీద ‘భయాన్ని’ ముస్లింలకు వ్యతిరేకంగా, ముస్లింల మీద ద్వేషాన్ని మావోయిస్టులకు వ్యతిరేకంగా తప్పక ఉపయోగిస్తారు. తెలంగాణలో బలహీనపడ్డ భూస్వామ్యం, అగ్రకుల ఆధిపత్యం మత ద్వేష రాజకీయాలతో తన పూర్వ వైభవాన్ని పొందాలని తప్పక ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో పోరాటాల స్ఫూర్తిని పూర్తిగా తుడిచివేయడానికి పెద్ద ఎత్తున ప్రయోగం జరుగుతుంది. పౌరహక్కుల ఉద్యమాలు రాజకీయ పోరాటాలు ఇంత కాలం తమ త్యాగాలతో పోషించిన ప్రజాస్వామ్య విలువలు, చైతన్యం ఒక ప్రతీఘాత విప్లవాన్ని, అంబేద్కర్ సూత్రీకరణలో ‘కౌంటర్ రెవల్యూషన్’ ను చూడబడుతున్నవి అనేది కూడా స్పష్టంగానే కనిపిస్తున్నది.

గుజరాత్ విషవూపయోగం మనకు చాలా పాఠాలు నేర్పాలి. అక్కడ ‘అభివృది’్ధ ఏమిటో ఎవ్వరికి అర్థం కావడం లేదు. ముస్లింలను దారుణంగా చంపారన్నది నిజం. గోద్రాలో హిందువులను చంపారన్నది కూడా నిజం. ఈ రెండు సంఘటనలకు రాజ్యం ఏం బాధ్యత వహించదా? ఒక దాని పేర ఇంకో దారుణం జరిగితే, ‘ఆ దారుణం జరిగింది కనుక ఈ దారుణం జరిగింది’ అని అంటే.. రాజ్యం బాధ్య త ఏమిటి? అని అడగాలి కదా! ఆ అభివృద్ధిలో పేద ప్రజలు, మానవాభివృద్ధి క్రమం, స్త్రీల హక్కులు, పౌరహక్కులు ఉన్నవా? లేవా? పౌరహక్కులు లేని అభివృద్ధి తెలంగాణకు అవసరం లేదు. చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు ఆ అభివృద్ధి నమూనాని నిర్దందంగా తిరస్కరించాలి. తెలంగాణ మైనారిటీలు కూడా చాలా సీరియస్‌గా ఆలోచించవలసిన తరుణం వచ్చింది. ఒక మతద్వేష రాజకీయాలు మరొక మత రాజకీయాల మధ్య ద్వేషా న్ని ప్రేరేపిస్తాయి. ఎంఐఎం లాంటి పార్టీలు తమ మూలాన్ని గౌరవించాలి. తమ మత విశ్వాసాలను కాపాడుకోవడం తప్పు కాదు. 

నిజానికి అది వాళ్ల హక్కు. కానీ దానిలోభాగంగానే తెలంగాణ ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడుకోవాలి. సెక్యులర్ శక్తులతో కలవాలి. ప్రజల మధ్య నిరంతరంగా మత సామరస్యాన్ని పెంచాలి. అదే ముస్లింల పౌరహక్కులను కాపాడుతుంది. ఈ విషయంలో ఏ పొరపాటు జరిగినా దీర్ఘకాలంలో హిందూ ద్వేష రాజకీయాలు దాన్ని పూర్తి గా ఉపయోగించుకుంటాయి.ఎంఐఎం,ఇతర ముస్లిం సంస్థ లు అన్ని మతాల మధ్య స్నేహభావాన్ని, కలిసి పోరాటం చేసే స్పృహని పెంచే క్రమంలో పాత నగరం ‘ఒంటరితనం’ నుంచి బయటికి రావాలి. ముస్లిం పౌరులందరూ ఇది గమనించాలి. తెలంగాణ ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య, పౌర, మానవ, ప్రజాతంత్ర, హక్కుల వికాసానికి వేదిక కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంవూదమోడీ గుజరాత్ కానివ్వద్దు. ఇది తెలంగాణ బీజేపీకి కూడా నా విజ్ఞప్తి. నిజాయితీ గల జాతీయవాదులైతే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి. అంతేకానీ ఏ మతానికి చెందిన వారినైనా ద్వేషించడాన్ని పౌరహక్కుల ఉద్యమాలు అంగీకరించవు.

పొఫెసర్ జి. హరగోపాల్

Namasete Telangana Telugu News Paper Dated : 11/08/2013 

No comments:

Post a Comment